నా పేరు, నా గుర్తింపు!

పిల్లల సెలవులకి వాళ్ళ అమ్మమ్మ, నానమ్మల ఇళ్ళకి వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఉన్నాం.

రైల్లో ఎదురు సీట్లో పిల్లలు ఇంచుమించుగా మా పిల్లల వయసులోనే ఉన్నారు. వాళ్ళంతా రెండు మూడు కుటుంబాలు బంధువులో, స్నేహితులో కాబోలు. పిల్లలంతా తమ స్కూళ్ళ గురించి, టీచర్ల గురించి, అమ్మా, నాన్నల గురించి అన్నీ కలగాపులగంగా మాట్లాడేసుకుంటున్నారు. అవతల పక్క పెద్దవాళ్ళు కూర్చున్నారు.

వాళ్ళల్లో పదేళ్ళ పాప చెపుతోంది, “మా పాపాకి, నాకు స్విమ్మింగ్ ఇష్టం. ఇంకా నాక్కూడా పాపా లాగే సైన్స్ ఇష్టం…” తండ్రి గురించి చెప్తోంది. తన దృష్టిలో తండ్రి హీరో అన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఆ మాటలు అప్రయత్నంగానే మా చెవుల పడుతున్నాయి.

వింటున్న మా అబ్బాయి నెమ్మదిగా నావైపు జరిగి, “చూడు, వాళ్ళ నాన్నని ఎంత చక్కగా, స్టైల్‌గా పిలుస్తోందో ఆ అమ్మాయి. నువ్వేమో ‘నాన్న’ అనమంటావు. కనీసం ‘డాడీ’ కూడా అననివ్వవు” అన్నాడు చిన్నగొంతుతో. నవ్వి ఊరుకున్నాను.

తన స్నేహితులెవరూ ‘నాన్న’ అని పిలవరని చాలాసార్లు చెప్పాడు. వాడికి ఆ పిలుపులో అందం కనిపించట్లేదని అర్థమైంది. మాట్లాడే మాటల్లో తెలుగుపాలు తగ్గిపోతోందని కనీసం అమ్మ, నాన్న పదాలన్నా పిల్లలకి అలవాటవ్వాలని నా ఆలోచన.

ఈ మధ్య వాడికి, మాకూ జరుగుతున్న గొడవ కూడా ఇలాటి పిలుపుకి సంబంధించినదే. మా ఇంట్లో పిల్లల్ని ముద్దుపేర్లతో పిలుస్తుంటాం. ఇప్పుడిప్పుడు హైస్కూల్‌కి వచ్చిన ఆదర్శ్ అభ్యంతరం పెడుతున్నాడు. వాడివైపు వాడూ రైటే. మావైపు మేమూ రైటే. పిలుపు అనేది చాలా ముఖ్యమన్నది ఒప్పుకుంటాను. చిన్నప్పట్నుంచీ వాడిని ముద్దుగా ‘చిక్కు’ అంటూ పిలిచేవాళ్ళం. అదే ఇప్పటికీ ఇంట్లో కొనసాగుతోంది. వాడి చెల్లికి, వాడికి గొడవ వస్తే ఆ పేరుతో వాడిని అల్లరి పెడుతోందని మరీ అభ్యంతరం చెప్తున్నాడు. ఒకరోజు భోజనం చెయ్యనని నిరాహారదీక్ష చెయ్యబోతే నచ్చజెప్పాను.

“చిక్కూ, నిన్ను ప్రపంచంలో ఇలా పిలిచేది నాన్న, చెల్లి, నేను. నువ్వంటే ఉన్న దగ్గరితనం వల్ల ప్రేమగా అలా వచ్చేస్తుంది. కోపం తెచ్చుకోకురా.”

పధ్నాలుగేళ్ళ వయసు వాడిది. నా మాటలకి సమాధానపడలేదు.

మొన్నీమధ్య వాడి స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు నేను మామూలుగా అలవాటైన ధోరణిలో పిలిచేశాను. వాడు ముందుగా హెచ్చరించినా పొరబాటు జరిగిపోయింది. వాడికి కన్నీళ్ళొక్కటే తక్కువ. స్నేహితుల్ని పంపించి, ఆకలి లేదని పడుకుండిపోయాడు. ఎంత బతిమాలినా ప్రయోజనం లేకపోయింది. అపరాధభావంతో నేనూ భోజనం చెయ్యలేకపోయాను. వాళ్ళ నాన్న కూడా వాడికి సర్దిచెప్పలేకపోయారు. ఆయనా నన్నే విసుక్కున్నారు.

మర్నాడు స్కూల్లో అందరూ అలాగే పిలిచేరని ఇంటికొచ్చి పెద్ద యుద్ధమే చేశాడు. వాడి బాధని అర్థం చేసుకుని ఆ రాత్రి భోజనాల దగ్గర వాళ్ళ నాన్న ‘అందరం ఇకనుంచి ఆదర్శ్‌ని పేరుతోనే పిలవాలని’ ఒక తీర్మానం చేసేశారు. అప్పటికి శాంతించి, “మీరందరూ నేనంటే ఇష్టంతో ‘చిక్కు’ అని పిలుస్తున్నారని తెలుసు. నా పేరంటే నాకిష్టం. అలా పిలిస్తేనే నాకు నచ్చుతుంది. నేను వచ్చే సంవత్సరం పదో క్లాసుకొస్తున్నాను. ఎస్పీయెల్ పోటీలో కూడా ఉన్నాను” అన్నాడు ధీమాగా.

వాడి చెల్లి వెంటనే వెక్కిరింపుగా ఏదో అనబోయి తమాయించుకుంది. ‘నేను పెరుగుతున్నానుగా మమ్మీ’ అనే కాంప్లాన్ ఆడ్ జ్ఞాపకమొచ్చింది. అందరం ముందు కొంచెం తడబడినా వాడిని పేరుతో పిలవటం అలవాటు చేసుకున్నాం.

పేరుకుండే ప్రాముఖ్యం బి. ఎడ్. చదివే రోజుల్లో మా భీమేశ్వర్రావు మాస్టారు చెప్పారు. ఇప్పటికీ మా మిత్రులం అందరం ఉద్యోగ జీవితాల్లో ఆ సూత్రాన్ని విజయవంతంగా ఉపయోగించుకుంటున్నాం కూడా. అంతెందుకు, పసివాళ్ళుగా ఉన్నప్పుడే పిలుపుకి తలలు తిప్పి చూస్తారు పిల్లలు. ఊహ తెలుస్తూనే వాళ్ళ పేరే వాళ్ళ గుర్తింపన్నది అర్థమైపోతుంది కాబోలు! చిన్నవాళ్ళకైనా, పెద్దవాళ్ళకైనా పిలుపులో ఒక గౌరవం స్పష్టమవుతుంది. అది కాపాడటం చుట్టూ ఉన్న వాళ్ళ బాధ్యత. ఎలా కాదంటాను?!

రైలు దిగి రాత్రి ఇల్లు చేరేసరికి మా మేడమీద వాటాలో లైట్లు వెలగటం గమనించాను. ఎవరో కొత్తగా అద్దెకొచ్చినట్టున్నారు. ఇంటి ఆవరణలో కాగితం రాకెట్లు, సగం తిని పడేసిన జామకాయలు కనిపించాయి. ఖాళీ చేసిన అట్టపెట్టెలు, తాళ్ళు మెట్ల మీదే ఉన్నాయి. మర్నాడు వెళ్ళి పరిచయం చేసుకోవాలనుకున్నాను.

పది రోజులుగా వదిలేసిన ఇల్లు సర్దటం విసుగ్గా ఉంది. ఇన్నాళ్ళూ తీరిగ్గా గడిపొచ్చానేమో మరీనూ. పనులు ముగించి, భోజనం చేస్తూనే నిద్ర కమ్ముకొచ్చింది. ఏదో పెద్ద శబ్దం వినిపించి గాఢ నిద్రలోంచి గబుక్కున లేచాను. ఖంగుమంటున్న గొంతు.

‘కదిలేరంటే వీపు విమానం మోత మోగిపోతుంది. సర్దలేక విసుగొస్తోంది. మీరు ఇల్లంతా కిందామీదా తొక్కుతుంటే ఊర్కోను’ అంటోందా గొంతు.

నిద్ర వదుల్చుకుని వదిలిపెట్టిన పనులు అందుకున్నాను.

‘నాన్నగారూ, మిమ్మల్ని కదలొద్దని చెప్పాను. ఒక చోట కూర్చోండి నేను చెప్పేవరకు’ ఇందాకటి గొంతే.

పెద్దవాళ్ళు ఉన్నట్టున్నారు. సాయం చేద్దామని ఉన్నా వాళ్ళకి చేసే ఓపికుండదు. కాళ్ళకి చేతులకి అడ్డంగా అనిపిస్తారు. ప్చ్! సాయంకాలం మా ఇంటికి పిలిచి కూర్చోపెట్టుకోవాలనుకున్నాను. ఇంతలో పెద్దగా ‘నాన్నగారూ!’ అన్న కేక వినిపించింది.

పెద్దాయన్ని మరీ అంత ఘట్టిగా కోప్పడుతోంది. ఎంత తండ్రి అయినా పాపం కదూ! కూతురు కేకలకి బిక్కచచ్చిపోయుంటాడు. భార్య లేదేమో ఆయనకి!? కూతురు ఇల్లంటే స్వతంత్రం అని ఇక్కడ ఉంటాడేమో. నా ఊహలు సాగుతున్నాయి. చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఆవిడ విసుక్కోవటం బావులేదు. తండ్రితో అలాగా?! కాస్తైనా గౌరవం లేకుండా. నెమ్మదిగా సర్దుకుంటే ఏమైంది అలా హడలు గొట్టకుండా. ఆవిడ తీరుకి పలకరించాలనిపించకపోయినా, కాస్సేపు ప్రశాంతంగా కూర్చుందుకు ఆయన్ని మా ఇంటికి తీసుకురావాలనే అనుకున్నా.

ప్రయాణ బడలిక తీరి రోజువారీ పనుల్లో పడ్డామని అమ్మకి ఫోన్ చేసి చెప్పాను. మాటల్లో అమ్మ చెప్పింది కాంతత్తకి అసలు బావులేదని, ఇప్పుడో ఇహనో అన్నట్టుందని. కాంతత్త మా చిన్నప్పుడు తరచుగా నానమ్మని చూసేందుకంటూ వస్తుండేది. నానమ్మకి దూరపు చుట్టమే అయినా అమ్మ, నాన్న, నానమ్మ ఆవిడంటే ఆపేక్షగా ఉండేవారు. కాంతత్తని అత్తవారే కాకుండా, పుట్టింట్లోనూ సవతితల్లి ఏడిపించుకు తినేదని చెప్పేవారు. ఆవిడ గొంతెమ్మ కోర్కెలన్నీ అమ్మ శాంతంగా తీర్చేది.

మా నాన్న ఇంట్లో ఉన్నంతసేపూ మేము చేసే అల్లరి చూసి, ఆవిడ ఒకరోజు అడిగేసింది, “ఏరా, ఇదేం పెంపకం? ఎంత ముద్దయితే మాత్రం అలా పిల్లల్ని నెత్తికెక్కించుకుంటారా? కాస్త భయం నేర్పుకోవద్దూ!” అంది. మేమందరం ఆవిడ మాటలకి నిశ్శబ్దమైపోయాం. నాన్న మాత్రం నవ్వేశారు.

“ఈ వయసులో కాకపోతే వాళ్ళని ఎప్పుడు ముద్దు చేస్తాం పిన్నీ. ఇంతలోనే పెద్దవాళ్ళయిపోరూ? అయినా అల్లరి పిల్లలకి సహజమే కాదూ?!” అన్నారు.

“అంతా బానే ఉంది. ప్రేమ మనసులో పెట్టుకో. వాళ్ళు అల్లరిపిల్లలుగా అందరి దృష్టిలోనూ పడతారు. నీ దన్ను చూసుకుని చదువు కూడా నిర్లక్ష్యం చేస్తారేమో చూసుకో. ‘నాన్నగారు’ అని పిలిస్తే వాళ్ళ అల్లరికి ఒక హద్దు తెలుస్తుంది. తండ్రంటే గౌరవం ఉంటుంది. అలా అలవాటు చెయ్యి” అంటూ మమ్మల్ని అలాగే పిలవమని పట్టుబట్టింది. మా అలవాటు మార్పించి మరీ వెళ్ళింది.

చెల్లి, తమ్ముడు, నేను ఆ పిలుపు అలవాటు చేసుకుందుకు చాలా కష్టపడ్డాం. మొత్తానికి ఆవిడంటే భయంతో ‘నాన్నగారు’ పిలుపు అలవాటు చేసుకున్నాం. అందుకే ఆవిడ వస్తోందంటే మాకంతగా నచ్చేది కాదు. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది.

ఆవిడ మా మీద అలా బలవంతంగా పెత్తనం చేసి మా నాన్నని దూరం చేసేస్తోందనిపించేది. కానీ అదేం జరగలేదు. ఆయనతో అదే చనువు, అదే ప్రేమ కొనసాగింది.

మెట్లెక్కుతుంటే మరోసారి ‘నాన్నగారి’కి అక్షంతలు పడుతున్నాయి. ఈసారి లేస్తే కాళ్ళు విరగ్గొడతానంటోంది. పైగా నోరెత్తద్దంటోంది. మళ్ళీ మళ్ళీ పెద్దాయన అంతలేసి మాటలు అనిపించుకోవటం బావులేదు. తలుపు కొట్టనా వద్దా అనుకునేంతలో ఆవిడే ఏదో పని మీద తలుపు తీసింది. ఉలిక్కిపడి, అంతలోనే నవ్వు ముఖంతో “కింద పోర్షన్ లో ఉంటున్నది మీరేనా, రండి.” అంది మర్యాదగా.

సర్దుకోవటం పూర్తి కాకపోవటంతో హాలంతా సామానుతో చిందరవందరగా ఉంది. లోపల గదిలోంచి పది, పదకొండేళ్ళ అమ్మాయి తొంగి చూసింది. ఆ అమ్మాయిని తోసుకుంటూ ఆరేడేళ్ళ పిల్లాడు రివ్వున బయటికొచ్చాడు.

తల్లి వాకిలి వైపు తిరిగి ఎవరితోనో మాట్లాడుతోందని గమనించి, అక్కడ పరిచి ఉన్న సామాన్లలోంచి వాడి ఆట సామానేదో వెదకటం మొదలెట్టాడు. చప్పుడుకి వెనక్కి తిరిగిన ఆవిడ ఒక్క కేక పెట్టింది, ‘నాన్నగారూ, కదలొద్దన్నానా’ అంటూ.

నేను తుళ్ళిపడ్డాను. ఆవిడ అంతలోనే సర్దుకుని “వీడిపేరు మా మామగారి పేరులెండి. అందుకే పేరు పెట్టి పిలవం” అంది మామగారి మీద మర్యాద ఉట్టిపడేలా. తెల్లబోయాను.

మామగారి మీద గౌరవంతో పేరు పెట్టుకోవటం వరకు బావుంది. ఆ పిలుపులో కనిపిస్తున్న నిర్లక్ష్యం మాత్రం చిత్రంగా తోచింది. పెద్దల పేరు పిల్లలకు పెట్టకుండా ఉంటేనే నయమేమో! పెద్దల్ని గౌరవించాలని పిల్లలకి నేర్పుతాం. అలాటప్పుడు ఇలాటి సన్నివేశాలు వాళ్ళకెలాటి అవగాహన కలిగిస్తాయో?! పిలుపుల్లో ఇన్ని రకాల సమస్యలున్నాయని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.

ఆదర్శ్ చెప్పినట్టు ఎంత సున్నితమైన విషయం ఈ పిలుపన్నది!