రాత్రి భోజనాల దగ్గర ఎప్పటిలానే గొడవ పెట్టుకున్నారు రాగిణి, వరుణ్.
“అమ్మతో చెప్పనా నీ సంగతి?” బెదిరించింది రాగిణి తనకంటే రెండేళ్ళు పెద్దవాడైన అన్నని.
“ఏం చెబుతావ్? చెప్పుకో.” వాడు భుజాలు ఎగరేశాడు.
ఇద్దరూ టీన్స్‌లో ఉన్నారు. పదోక్లాసు పరీక్షలు రాయబోతూ రాగిణి, ఇంటర్ పరీక్షలు రాయబోతూ వరుణ్. ఇద్దరివంకా ఏమిటన్నట్టు చూశాను. ఈమధ్య ఎక్కడ చూసినా టీనేజ్ ప్రేమలు, దాని తాలూకు గొడవలు. తెలిసీతెలియని వయసులో వాళ్ళ ఆలోచనల్లో ఏముంటాయో, ఎప్పుడెలాటి ప్రమాదం తెచ్చుకుంటారో! చదువుల గాడిలోంచి ఎటు దూకుతారో! ఎంతవరకూ అవసరమో తెలియదు కానీ నాలాటి అమ్మలందరం బెంగపడిపోతున్నాం. కాస్త స్వేచ్ఛ ఇచ్చి మంచి చెడుల విచక్షణ తెలియజెప్తే చాలు అని అనుకున్నా, వయసు వాళ్ళని కుదురుగా ఉండనీయదు కదా.
విషయాన్ని సాగదీయకుండా “పరీక్షల టైమ్ ఇది. గుర్తుంచుకోండి” అంటూ హెచ్చరించాను.
మర్నాడు సాయంత్రం పక్కింటి బిందుతో పాటు వాళ్ళబ్బాయి రోషన్ స్కూల్ వార్షికోత్సవానికి వెళ్ళాను. రోషన్ ఒక నాటకంలో అమ్మాయి పాత్ర వేశాడు. ఆహార్యం, వాచ్యం అంతా ఆడపిల్ల అని ఎవరైనా నమ్మాల్సిందే. నటన కూడా అంత చక్కగానే చేశాడు. ఇల్లు చేరేసరికి తొమ్మిదిన్నర. ఆలస్యం అవుతుందని సాయంత్రం పిల్లల్ని పిజ్జా తెప్పించుకోమని చెప్పే వెళ్ళాను.
వరుణ్ సీరియస్‌గా చదువుకుంటున్నాడు. నన్ను చూస్తూనే రాగిణి ఎదురొచ్చింది. బట్టలు మార్చుకుని స్థిమితపడేవరకు నావెనకే తిరుగుతున్న రాగిణి, “అమ్మా, నీకొక విషయం చెప్పాలి” అంది.
“ఏమిటి?”
“అసలు… అన్నయ్యని నా వస్తువుల్ని ముట్టుకోవద్దని చెప్పమ్మా.”
“ఏమైంది, మళ్ళీ కొట్టుకున్నారా ఇద్దరూ? పరీక్షలకి చదువుకొమ్మని సెలవులిచ్చారు. మీరిద్దరూ చేసే పని ఇదా?”
“నన్నెందుకు అంటావు? నేను వాడిజోలికెళ్ళలేదు. వాడే రోజూ ఎందుకో అందుకు నా అలమర తీస్తాడు. నా బట్టలు అన్నీ కిందామీదా చేస్తాడు. నా టాప్స్, డ్రెస్సెస్ ‘ఒకసారి వేసుకు చూస్తానే’ అంటాడు. నాకిష్టం ఉండదు.” అంది అసహనంగా.
“నీ బట్టలు వేసుకోవటమేంటి?”
“చిన్నప్పుడు నేనూ వాడి చొక్కాలు వేసుకునేదాన్ని. వాడూ నా బట్టలు వేసుకుని అచ్చం అమ్మాయిలా డాన్స్ చేసేవాడు. ఇప్పుడు నాకూ వాడిలా జీన్స్ ప్యాంట్, టీ షర్ట్స్ ఉన్నాయి. వాడి బట్టలు నేను అస్సలు ముట్టుకోను. కానీ వాడు మాత్రం ఒక్కసారి నీడ్రెస్ ఇవ్వవే అంటూ వేసుకుంటాడు. నాకు నచ్చదు.”
నాకు ఆశ్చర్యం వేసింది. నా ఎదురుగా ఎప్పుడూ చేసినట్టులేదే. ఇదేంటి కొత్తగా!
“సరే, నేను వాడితో మాట్లాడతాలే నీ బట్టలు తియ్యద్దని.”అన్నాను.
“గట్టిగా చెప్పు. నేను చెబితే అస్సలు పట్టించుకోడు.”
పరీక్షలయ్యేవరకు పిల్లలిద్దరినీ చదువు మూడ్‌లో ఉంచాలని అనుకున్నాను. రాగిణి చెప్పిన విషయం నాకు అంత సీరియస్‌గా అనిపించలేదు. చెల్లిని ఏడిపించే వాడి ధోరణి అలవాటే. తర్వాత రెండురోజులు అన్నాచెల్లెళ్ళ అల్లరి కనిపించలేదు ఇంట్లో. ఎవరి చదువుల హడావుడిలో వాళ్ళున్నారు.
పరీక్షలయ్యాయి. ఇల్లంతా ఎలాటి టెన్షన్లూ లేకుండా ప్రశాంతంగా ఉంది. ఫ్రెండ్స్‌తో కలిసి కొత్తగా తెరిచిన మాల్ చూసేందుకోరోజు, సినిమాకోరోజు ఏవేవో ప్లాన్లు వేసుకుని హడావుడి పడుతున్న రాగిణి అనుకోకుండా ఆఫీసుపని మీద వచ్చిన మామయ్యతో అమ్మమ్మ, తాతయ్యల ఊరు ప్రయాణమైంది. వరుణ్ ఎమ్‌సెట్ క్లాసులున్నాయని ఆగిపోయాడు.
రాత్రి భోజనం, వంటింటి పనులు చక్కబెట్టుకుని, చదువుకుంటున్న వరుణ్‌ని పలకరించి, వాడికి హార్లిక్స్ కలిపిచ్చి కాస్సేపు వాడి దగ్గర కూర్చున్నాను. ఇల్లంతా మరీ నిశ్శబ్దంగా తయారైంది. పరీక్షల ఒత్తిడి వాడి ముఖంలో కనిపిస్తోంది. చెల్లెలుంటే ఇద్దరూ కాస్సేపు అల్లరి, దెబ్బలాటలతో రిలాక్స్ అయ్యేవాడేమో. అదే మాట అంటే నవ్వాడు. డౌట్లేమైనా ఉంటే కాలేజీకి రమ్మన్నారని, తన స్నేహితులు చాలామంది రోజూ వెళ్తూనే ఉన్నారని చెప్పాడు. మార్పుగా ఉంటుందని మర్నాడు వాడిని కూడా కాలేజీకి వెళ్ళి స్నేహితులను కలిసిరమ్మని ప్రోత్సహించాను.
ఆదివారం. రమేశ్ తీరిగ్గా కాఫీగ్లాసు పుచ్చుకుని నాతోపాటు వరండాలో ఉన్న పూలకుండీల దగ్గరకొచ్చాడు. కొమ్మల్ని కత్తిరించి, కొత్తమట్టిని ఎరువుతో పాటు కలిపి కుండీల్లో సర్దుతున్నాను. తను కూడా అందుకున్నాడు.
“సునీ, క్రితం సంవత్సరం మా కొలీగ్ శ్యామలరావు వాళ్ళమ్మాయి పెళ్ళికి వెళ్ళాం గుర్తుందా?”
“ఎందుకు గుర్తులేదూ, ఆ అమ్మాయి పాటలు కూడా పాడుతుంది కదూ. చక్కని పిల్ల. పిల్లవాడు ముంబైలో పని చేస్తాడని, ఈ అమ్మాయి ఉద్యోగం చూసుకుని బెంగలూరు నుంచి ముంబైకి మారుతుందనీ…”
“మొన్నొక రోజు ఆ అమ్మాయి వాళ్ళనాన్న కోసం ఆఫీసుకొచ్చిందిలే. అదే అడిగాం మేమంతా. లేదన్నాడాయన పొడిగా. అప్పుడింకేమీ పొడిగించలేదు కానీ తర్వాత చెప్పేడాయన…”
చేతులకంటిన మట్టిని కడుక్కుంటూ వింటున్నాను.
“ఆ అమ్మాయి పెళ్ళయిన తర్వాత ఒక రెండువారాలు సెలవుపెట్టి ముంబై వెళ్ళొచ్చింది. అటునుంచి డైరెక్టుగా బెంగలూరు వెళ్ళిపోయిందట. ఫోన్లు చెయ్యటం తగ్గించిందని, ఫోన్ చేసినా ముభావంగా ఉంటోందని తల్లి గమనించి సెలవుపెట్టి నాలుగురోజులు వచ్చి, వెళ్ళమందిట. సెలవు లేదంటోందని వీళ్ళిద్దరూ వెళ్ళొచ్చారు. ఏదైనా సమస్యా అంటే, ముందు ఆ అమ్మాయి ఏమీ లేదందిట. బుజ్జగించి అడిగితే అతనికి ఆడపిల్లలంటే ఆసక్తి లేదని చెప్పాడని, తల్లిదండ్రులే బలవంతంగా పెళ్ళిచేశారని చెప్పాడట.”
“అయ్యో! అలా ఎలా చేశారూ? కొడుకు గురించి ఆమాత్రం పట్టించుకోకుండా ఉంటారా?”
“ఏమో సునీ! మనం ఉన్నామంటావా?”
కాస్సేపు ఇద్దరం ఎవరి ఆలోచనల్లో వారుండిపోయాం. తల్లిదండ్రులు పిల్లల చదువులు, కెరియర్లు వరకూ ఎంతైనా శ్రమపడతారు. వ్యక్తిత్వం రూపుదిద్దుకునే వయసులో ఆ పిల్లల్లో మానసికంగా ఎలాటి భావనలు కలుగుతున్నాయో, ఏదైనా సమస్యతో ఇబ్బందిపడుతున్నారేమో అనేవాటిగురించి మాత్రం పట్టించుకోరు. అయినా బిడియపడకుండా, భయపడకుండా పిల్లలు తమ సమస్యను అమ్మ, నాన్నలతో చెప్పుకునే వాతావరణం ఎంతవరకు ఉంది? ఏదైనా సమస్య వస్తే నమ్మకంగా ఎవరితో చెప్పుకుంటారు?
“మా అమ్మాయి, మా అబ్బాయి నాతో అన్నీ షేర్ చేసుకుంటారు అంటూ సెల్ఫీలు తీసుకోవటం వరకో, కలిసి ఐస్‌క్రీమ్ పార్లర్‌కి వెళ్ళటం వరకో మాత్రం చేస్తుంటారు అమ్మా, నాన్నలు.”
రమేశ్ వ్యాఖ్య విని, నాకు నిజంగా ఖంగారుగా అనిపించింది. నా పిల్లలకి మాత్రం నా దగ్గర పూర్తి చనువు ఉందనే అనుకుంటున్నాను. నిజమేనా? మొదటిసారిగా నామీద నాకే సందేహం కలిగింది.
సెలవురోజు కావటంతో చిన్నమ్మ దగ్గరుండి గదులు శుభ్రం చేయిస్తున్నాను. వరుణ్ మంచం కింద పడున్న బట్టలు బయటకులాగి వాషింగ్ మిషన్‌లో వేసిందామె. అందులో రాగిణి బట్టలు కూడా ఉన్నాయి. తను ఊళ్ళో లేనేలేదు. ఇవన్నీ ఎప్పటినుంచి ఇలా పడున్నాయో?!
“కిందపడున్న బట్టలు తియ్యకుండా మంచం కిందకి తోసేసి, రోజూ నువ్వు పైపైన తుడిచి వెళ్ళిపోతున్నావన్నమాట!” అంటూ చిన్నమ్మని కేకలేశాను.
ఎమ్‌సెట్ పరీక్ష అయింది. హాయిగా ఊపిరి పీల్చుకున్నాం ఇంట్లో అందరం. అమ్మ వాడిని కూడా పంపమని ఫోన్ చేసింది. వరుణ్, వెళ్ళాలని లేదమ్మా అనేశాడు. మళ్ళీ ఎప్పుడన్నా వస్తానని అమ్మమ్మకి చెప్పాడు.
సాయంత్రం ఆఫీసునుంచి వచ్చి టీ కలుపుకుంటున్నాను. ఎందుకో వరుణ్ దిగులుగా కనిపించాడు. స్నేహితులతో కాస్సేపు బయటకు వెళ్ళిరారా అంటే వెళ్ళాలని లేదు అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఇదివరకు మరీ ఇంత ఒంటరిగా ఉండేవాడుకాడు.
టీ కప్ తీసుకొని ముందుగదిలోకి వచ్చి కూర్చున్నాను. వాడూ వచ్చి నాపక్కనే కూర్చున్నాడు. ఏదో ఆలోచన నడుస్తోందని వాణ్ణి చూస్తే అర్థమైంది.
“వరుణ్, నీ ఎక్జామ్స్ అయిపోయాయి కదరా. సినిమాకి వెళ్దామా?” అన్నాను.
“అమ్మా…” అన్నాడు. దీనంగా ఉన్న వాడి ముఖం ఎదురుగా. మనసులో ఏదో గుచ్చుకున్నట్టయింది.
“ఏరా నాన్నా, ఏంట్రా, ఏమైనా అయిందా?”
“అమ్మా…” ఏదో చెప్పాలనుకుంటూనే తటపటాయిస్తున్నాడు.
“చెప్పరా, ఏమైంది? పరీక్ష బాగా రాయలేదా? వదిలెయ్, దానిగురించి దిగులు పడకు.” అన్నాను వాడి తల నిమురుతూ.
ఒక్కసారిగా నా ఒడిలో ముఖం పెట్టుకుని ఏడ్చేశాడు. క్షణం అయోమయం అయిపోయాను. నిన్నకాక మొన్నే కదూ పిల్లల పెంపకాలు గురించి తలుచుకున్నది! నీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పు. నేను, నాన్న ఉన్నామని పదేపదే చెప్పాక అప్పుడు నోరు విప్పాడు.
కొన్నాళ్ళుగా తనకి ఆడపిల్లలా ఉండాలని, అలాగే బట్టలు వేసుకోవాలని, జడ వేసుకోవాలని అనిపిస్తోందని, అందుకే చెల్లి బట్టలు వేసుకుంటున్నానని, దీనిగురించి చెల్లితో రోజూ గొడవ జరుగుతోందని, ‘అమ్మా, నాన్నలతో చెబుతాను, నీకు ఏదో అయింద’ని చెల్లి అంటుంటే, వద్దువద్దని బతిమాలుతున్నానని చెప్పాడు. అలా చెయ్యకూడదనుకున్నా తనవల్ల కావటంలేదని, తన స్నేహితులతో కూడా మాట్లాడాలని ఉండట్లేదని, వాళ్ళని చూస్తే ఏదో బిడియంగా అనిపిస్తోందని… స్కూలు రోజుల్లో చెల్లితో పాటు అమ్మాయిలా తయారైనా, అమ్మాయిలతో స్నేహం చేసినా అందరూ సరదాగా తీసుకునేవారని, ఇప్పుడు ఆ ఆలోచనలు ఎక్కువై తనని వేధిస్తున్నాయని… వాడి మనసులో బాధ అంతా నాకు చెప్పేశాడు.
వింటుంటే నాకు తల తిరుగుతున్నట్టయింది. రాగిణి చెప్పిన మాటల్ని నేనెంత తేలిగ్గా తీసుకున్నాను! మంచం కిందనుంచి బయటపడ్డ రాగిణి బట్టలు కళ్ళముందుకొచ్చాయి. ఏం జరుగుతోంది? అమ్మ అన్ని సమస్యల్నీ చిటికెలో తీరుస్తుందన్న నమ్మకం! ఆశగా నావైపు చూస్తున్నాడు. ఒక్క ఐదు నిముషాలు. అంతలోనే సర్దుకున్నాను.
నేను నోరు విప్పేలోపే “అమ్మా, నాన్నకి చెప్పకమ్మా, ప్లీజ్” అన్నాడు. వాడికి కావలసింది ఒక భరోసా.
“వరుణ్, నీకు ఏం కాలేదు. ముందు నువ్వు దిగులుపడటం, తప్పు చేస్తున్నానేమో అన్న ఆలోచనలు వదిలెయ్. నీ సమస్య అమ్మ తీర్చగలదని చెప్పావు. అవునా? నాన్నతో చెప్పనులే.” వాడికి హామీ ఇచ్చాను. నాకు తెలుసు, ఇది నావరకే దాచుకునే రహస్యం కాదు.
లలిత మనసులో మెదిలింది. ఆఫీసుకి సెలవు పెట్టాను. రమేశ్‌తో చూచాయగా చెప్పాను. వరుణ్‌తో రాజమండ్రి ప్రయాణమయ్యాను.
ప్రయాణపు బడలిక తీరాక లలితతో పాటు సాయంత్రం తను పనిచేసే హాస్పిటల్‌కి బయలుదేరాను. లలిత కొడుకు రాహుల్‌ని, వరుణ్‌ని సినిమా హాలు దగ్గర వదిలిపెట్టాం. హాస్పిటల్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న మనుషులను చూస్తే నోట మాట రాలేదు. ఇంతమంది మానసికంగా సమస్యలతో బాధపడుతున్నారా! అక్కడున్నవాళ్ళల్లో చాలామంది ఆర్థికంగా కిందిస్థాయిలో ఉన్నవాళ్ళన్నది గమనిస్తే ఇంకా ఆశ్చర్యం కలిగింది. సమస్యకి ఆర్థిక పరిస్థితితో సంబంధంలేదు. కానీ రోజువారీ పనులు పక్కనపెట్టి, శారీరకంగా పడే బాధలాగే మానసికంగా తాము పడే బాధకి నిపుణులైన ఒక డాక్టర్ సలహా తీసుకోవాలన్న వాళ్ళ స్పృహ నాకు గొప్పగా అనిపించింది. మానసిక సమస్య జీవితాల్ని అతలాకుతలం చేస్తుందన్నది ఎంత నిజమో నాకు అర్థమైంది. లలిత డ్యూటీ చేసుకుంటున్న సమయంలో ముందు హాల్‌లో వచ్చినవాళ్ళని గమనిస్తూ కూర్చున్నాను. తమకు తాముగా కొందరు వెళ్ళబోసుకుంటున్న మాటలు వింటున్నాను. చుట్టూ ఒక కొత్త ప్రపంచం.
ఆరాత్రి లలిత, నేను భోజనాలు ముగించి డాబాపైకి వెళ్ళాం.
“ఇప్పుడు చెప్పు, ఏమిటిలా సర్‌ప్రైజ్ ఇచ్చావ్?” అంది ముఖంలోకి చూస్తూ. వరుణ్ పడుతున్న బాధ చెప్పాను. శ్రధ్ధగా వింది.
“సరే, రేపు వాడిని తీసుకుని హాస్పిటల్‌కి వెళ్దాం. ముందు వాడిని వినాలి నేను. ఆతర్వాత అవసరమైతే హార్మోన్ పరీక్షలకి పంపుదాం. వాడి మనసు, ఆలోచనలు ముఖ్యం. తనకేదో పెద్ద సమస్య ఉందని దిగులుపడకుండా వాడిని సిద్ధంచెయ్యి.”
పొద్దున్న వరుణ్‌తో మాట్లాడాను. హాస్పిటల్‌కి బయలుదేరుతుంటే వాడి ముఖంలో ఏదైనా ఇబ్బంది ఉందేమో అని చూశాను. ప్రశాంతంగా ఉన్నాడు. తన వేదనకి సమాధానం దొరుకుతుందన్న ధైర్యం వాడిలో కనిపించింది. శారీరకమైన పరీక్షలో వాడు నార్మల్‌గా ఉన్నాడన్నది స్పష్టమైంది. లలిత చాకచక్యంగా వాడిని ప్రశ్నలు వేసి వాడి మనసులో ఏముందో పట్టుకున్నానని, వరుణ్‌కి తన ఆలోచనలు నచ్చట్లేదని, కానీ వాటిని తప్పించుకోలేక నలిగిపోతున్నాడని, ఇలాటి సమస్యకి కౌన్సిలింగ్‌తో పరిష్కారం దొరుకుతుందని లలిత నాకు చెప్పింది.
మా ఊళ్ళో ఉన్న తన స్నేహితురాలికి కేసు రిఫర్ చేస్తూ మమ్మల్ని రైలెక్కించేందుకు స్టేషన్‌కి వచ్చింది. ప్లాట్‌ఫామ్ మీద నిలబడి, రైలు కోసం చూస్తున్నాం. దూరంగా నిలబడ్డ రాహుల్, వరుణ్ ఏవో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. వాడి నవ్వు ముఖం చూసి నా మనసుకి కొంత ఊరట కలిగింది. లలిత చెబుతోంది:
“సునీ, వరుణ్ నీకు చెప్పటం, నువ్వు వెంటనే నా దగ్గరకి రావటం సరైన పని. ఇది కౌన్సిలింగ్‌తో సరిచేసుకోదగ్గ సమస్యే. నువ్వు వాడిని సీరియస్‌గా తీసుకోకుండా, ‘వెధవ్వేషాలు మానేసి చదువుకొమ్మని’ కోప్పడేసి ఉంటే పరిస్థితి మరొకవిధంగా ఉండేది భవిష్యత్‌లో. వరుణ్ స్పష్టంగా చెప్పాడు, తనని ఇబ్బందిపెట్టే ఆలోచనలు తనకి నచ్చట్లేదని, తను నార్మల్‌గా అబ్బాయిగానే ఉండాలనుకుంటున్నానని, తన స్నేహితులని మిస్ అవుతున్నానని చెప్పాడు.
నీకు ఒక విషయం చెబుతాను, వారంక్రితం ఒక అబ్బాయి వచ్చాడు తనకి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారని, తనకి అమ్మాయిని పెళ్ళిచేసుకునే ఆలోచన లేదని, ఇంట్లోవాళ్ళకి పెళ్ళి వద్దని చెబుతున్నా వినటంలేదని చెప్పాడు. అతని తల్లిదండ్రులని పిలిచి మాట్లాడాను. వాళ్ళకి తమ పిల్లవాడు పెళ్ళి వద్దంటున్న కారణాన్ని చెప్పాను. వాళ్ళు అర్థంచేసుకోలేదు. అతన్ని సమర్థించే అవకాశం లేదు. వాళ్ళు చూసిన అమ్మాయినిచ్చి చేస్తే వాడే దారిలో పడతాడంటారు. ఇంతకీ అతను మాత్రం అబ్బాయితోనే సహజీవనాన్ని కోరుకుంటున్నానని గట్టిగా చెప్పాడు. పెళ్ళి తప్పించమని మాత్రం నన్ను కోరాడు. కొన్నేళ్ళాగితే తల్లిదండ్రులు నెమ్మదిగా పెళ్ళి ప్రస్తావన వదిలిపెడతారని ధీమాగా చెప్పాడు.”
“అతని ధోరణి వేరేగా ఉంది, సమస్యలు తప్పవేమో కదా.”
“సునీ, ఇది అసహజమేం కాదు. సమాజంలో ఎప్పుడూ ఉన్నదే. చుట్టూ ఉన్నవాళ్ళెలా తీసుకుంటారో అని సందేహంతోను, తాము అసహజమైనదేదో కోరుకుంటున్నామేమో అన్న అపరాధభావంతోనూ బయటకి చెప్పుకోలేక, కుటుంబసభ్యుల తోడ్పాటులేక విపరీతమైన మనోవ్యథకి గురవుతున్నారు. కానీ ఆరోజులకి కాలం చెల్లింది. బలహీనత అనిగాని, అసహజంగా ప్రవర్తిస్తున్నారనిగానీ కాక అలాటి ఆలోచనలని సమాజం అంగీకరించే కాలం వచ్చింది, అందుకే ఇప్పుడిప్పుడు దీన్ని బాహాటంగానే చెప్పుకోగలుగుతున్నారు. కానీ ఇంకా మనలోనే మార్పు రావాలి. మనకి తెలియనంతమాత్రాన అలాటిదేదీ లేదని అనుకోక, ఆ వ్యక్తుల ప్రత్యేకతను అర్థం చేసుకుని మనతో కలుపుకోవాల్సిన సమయం వచ్చింది.”
లలిత మాటలు పూర్తవుతూనే రైలొచ్చింది. ప్రయాణమంతా లలిత మాటల్నే తలుచుకుంటున్నాను.
చుట్టూ అంతా మామూలుగానే ఉన్నట్టు కనిపిస్తుంటుంది. తరచి చూస్తే ఎన్ని సమస్యలు! శ్యామలరావుగారి అల్లుడు బహుశా ఇలాగే తల్లిదండ్రులకి చెప్పుకోగలిగి ఉండుంటే… ఒక అమ్మాయి ఆశలకి, భవిష్యత్తుకి భంగం కలిగేదికాదు. వరుణ్ తన దగ్గర చెప్పుకోలేకపోయి ఉంటే…?! ఓహ్! పక్కన కూర్చున్న వరుణ్‌ని చూశాను. వాడు నిశ్చింతగా చదువుతున్న పుస్తకంలో నిమగ్నమైపోయున్నాడు.