వేడుకుంటిని వేలసారులు

రాగం: కల్యాణి
తాళం: మిశ్రచాపు
గానం, స్వరకల్పన: శ్రీమతి శాంతిశ్రీ
రచన: మల్లాది లక్ష్మణ శాస్త్రి

వేడుకొంటిని వేలసారులు విసిగించితి మాధవా
ఆడుకొమ్మని ఒక్కసారికి అనకపోతిని కేశవా

కావుకావని కేకలేసితి కరుణలేదని కూకలేసితి
బ్రోవుబ్రోవని బేరమాడితి కడుపు నిండిన గొంతుతో

నింద లేసితి చిందులేసితి రంధివీడని బొందితో
నిద్రలేపితి ముడుపుగట్టితి పగలు రేయి రొదలుపెట్టితి

నేను నేనని నన్నునన్నని అహముతో నే బ్రతికితి
ఇంతలిచ్చిన దేవదేవా తృప్తిలేని లోభినై

నిన్ను చూసుకు నువ్వుచేసిన కన్నుపండుగ చూసుకు
పులకరించని పరవశించని జన్మమెందుకు రామయా

కంటిపాపగ నువ్వుఉండగ కొదవలేదయ కృష్ణయా
శ్వాసశ్వాసన కోశమంతట నిండి ఉంటివి కదటయా

ధన్యవాదము తనివితీరగ చెప్పగలిగితె ధన్యము
కోరగలిగిన కోరవలసిన వరములేవియు లేవయా

నన్ను వదలకు కన్నుమెదపకు అనుటమానెద నమ్మరా
నీవు నీవై నేను నేనై వెలుగుతుందము ఈశ్వరా!