ఓ సాయంత్రం

ఒక మేఘం
నీళ్ళ కోసం తిరుగుతూ ఉంది
తెల్లగా స్పంజ్ ముక్కలా
కోనేటి మీద వాలుతూ

మబ్బు ఒకటి
నీళ్ళతో బరువెక్కి నడుస్తోంది
తలకెత్తుకున్న బిందెతో అమ్మలా

మబ్బుల గుంపులు
దగ్గర దగ్గరగా
దుమ్ములేపుతూ
ఇంటి బాట పట్టిన
గేదెల మందలా

త్రుళ్ళి పడుతున్న
సాయం కాంతలా
మెరుపు

చప్పుడు చేస్తూ
మట్టతో పాటు
పడిన కొబ్బరికాయలా
ఉరుమొకటి

ఇంక జల్లుపడుతుందని
ఎక్కడ్నించో ఎగిరి వచ్చింది
తూనీగ

గాలి చడి చేయకుండానే
కంటి అద్దం మీద చినుకు