ఆర్. కె. లక్ష్మణ్ కథ – నా స్వస్తివాక్యం

సాహిత్యం – చిత్రకళ అనేవి ఎంత మైనారిటీ విషయాలో అనే సత్యాన్ని తెలుసుకుంటే ఆ పనిలో దశాబ్దాల తరబడి ఊరగాయలా నిలవ ఉండిపోయినవారి పరిస్థితి ఏమవుతుందో ఎవరికి తెలుసు? బహుశా తెలిసి ఉండి కూడా ఊరగాయ కళలు, ఊరగాయ సాహిత్యంలో నాని ఉండటమూ ఆ ఊరగాయ మాదిరి వారికి ఒక సంతృప్తినిస్తుందేమో? ఏమో! నాకు చిన్నతనం నుండీ కళ కన్నా, సాహితీ కథల కన్నా మొదటగా ఊరగాయే తెలుసు. దాని రంగు, రుచి, వాసనే తెలుసు. అందులో ఆవగింజంత కూడా ఆర్కే లక్ష్మణ్ గురించి అసలు తెలీదు. ఎట్లా తెలుస్తుంది? పంతొమ్మిది వందల ఎనభయ్ ప్రాంతాల్లో మా ఊరిలో ఇంటింటికి దినపత్రిక వేయించుకునే అలవాటు పెద్దగా ఎవరికీ లేదు. నేను మాట్లాడేది తెలుగు పత్రికల సంగతి. నూనేపల్లి వంటి మా చిన్న ఊరిలో అసలు ఇంగ్లీష్ పేపర్ ప్రస్తావనే మనం తేకూడదు.

పుట్టుక వెంబడి డిఫాల్ట్‌గా కొంత అలవాటు ఏదో పుట్టుకు పుడతాం మనం. నాగరాజు అనే మా ఫ్రెండు ఉండేవాడు. మేము క్రికెట్ టీమ్ అని ఒకటి ప్రకటించుకుని వికెట్లు పాతి, తొలిసారిగా బంతిని బ్యాటుని తాకి ఆట మొదలెట్టిన రోజే అప్పటివరకు మాతో సమానమనుకున్న నాగరాజు అసామాన్యుడని వాడు గ్రౌండ్‌లో ఏదో ఒక మూల నిలబడి బంతే కానక్కరలేదు ఏదో ఒక రాయిని పట్టి గురి చూసి విసిరినా రాలిపోయే వికెట్ చెప్పింది. పిల్లి మ్యావ్ అనే ఇంకో ప్రెండ్ ఉండేవాడు, వాడు సన్నగా ఈల వేస్తే చాలు, ఎవరి కుక్క అయినా ఎంతటి కుక్క అయినా తోక ఊపుతూ వాడి దగ్గరికి వచ్చి వాడికేసి ఆసక్తిగా చూస్తూ ఫేస్‌ని ప్రెండ్ రిక్వెస్ట్‌లా పెట్టేది. ఇట్లా రకరకాల డిఫాల్టెడ్ ఎక్స్-ఫ్యాక్టర్‌తో మానవులు భూమి మీదికి వస్తారు.

నాకు ఎవరూ చెప్పలా, నేర్పలా, ఇది బొమ్మ అంటారని, దానిని శైలి అంటారని, దీనిని చదువుకుంటూ పోతే మనసు భలే సంతోషదాయకం అవుతుందని. నేను ఇలాగే పుట్టా, బొమ్మని గుర్తించడం నాకు పుట్టుకతో వచ్చింది. పుట్టుకతో వచ్చినదేదీ పెద్ద గొప్పేమీ కాదు. మామూలుగా జనం ఎన్టీరామారావును, నాగేశ్వరరావుని, శ్రీదేవిని చులాగ్గా గురించినట్లుగా నేను బొమ్మలని, అవి వేసేవాళ్ళని గుర్తించేవాడిని, వారి వెంటపడేవాడిని, ఇష్టపడేవాడిని. బాపు, పికాసో, మారియో, బత్తాల్యా, టొప్పి, సుధీర్ ధార్, అజిత్ నైనన్, జయచంద్రన్, అనూప్ రాయ్, కార్లోస్ గొమినేజ్, వెండ్లింగ్… ఈ పేర్ల మనుషులని వెదికి సాధించుకోవడం అనేది స్వయంకృషి. పుట్టి పెరిగిన దగ్గరినుండి బడి నడకలు, కళాశాల పరుగుల వరకు ఒకరితో కానీ నలుగురి మధ్య కానీ చిత్రకళా రీతులు అని ముచ్చట్లు పెట్టుకున్నది లేదు. అసలు ఆ పేర్లు కూడా తెలియదు నా సర్కిల్లో ఎవరికీనూ. అంతెందుకూ చంటబ్బాయి సినిమా 1986లో వచ్చింది. అపుడు నా వయసు పన్నెండు. నా తోటి ప్రెండ్స్ అంతా చిరంజీవి, సుత్తి వేలు, శ్రీలక్ష్మి, అరటి పండు లంబ లంబ అని పగలబడి నవ్వులవుతున్న సమయంలో నేను ఈ చంటబ్బాయి అనే సినిమా టైటిల్స్‌‌కు వేసిన బొమ్మలు ఎంత బావున్నాయి! అవి ఎవరు వేసి ఉంటారు? దేంతో గీసి ఉంటారు? ఆయనను కనిపెట్టడం ఎలా అనే చింతనలోనో లేదా, మల్లాది వ్రాసిన నవలకు ఈ సినిమాకు పేరు తప్పా మరేం పోలిక లేదేం చెప్మా అనే ఆలోచనలో మునిగి ఉన్న సమయాలు నాకు ఇంకా బాగా గుర్తు. ఇది మన పుట్టు ఫ్యాక్టర్ అన్నమాట.

అలానే నాకు ఆర్కే లక్ష్మణ్ పరిచయం కూడానూ. ఇంగ్లీష్ పేపర్ చదివే చదువు, చేతుల్లో అవి తరుచుగా కనపడేంత కల్చర్ మాకు లేకపోయినా, నా చిన్నతనంలో ఎలానో ఆర్కేగారి బొమ్మ ఒకటి నేను చూశాను. ఏదో ఇంగ్లీషు మేటర్ మధ్యలో అచ్చయిన బొమ్మ అది. బ్లాక్ అండ్ వైట్ వాష్. అచ్చమైన మనుష్యులు ఎట్లా ఉంటారో అదే మాదిరి బొమ్మ అది. అచ్చమైన మనుష్యులు అని ఎందుకు అంటున్నానంటే ఆర్కే లక్ష్మణ్ చేసిన లైఫ్ స్టడీ మామూలుది కాదు. జనాభాలో కోటికొక్కడు మాత్రమే ఒక గొప్ప ఆర్టిస్ట్ పుడతాడు అనుకుంటే అటువంటి కోటి ఆర్టిస్టుల్లోనూ లక్ష్మణ్ అంత భీకరంగా లైఫ్‌ని స్టడీ చేసినవాడు లక్ష్మణ్ ఒక్కడే. ఆయన బొమ్మ‌లో కనపడే జీవము, రేఖా వేగము, కంటి ముందు కనపడే దృశ్యాన్ని అలా కుంచె మొనతో పెకిలించుకు వచ్చి కాగితం మీద దింపేయడమూ అంతా ఆయనకే చెల్లింది. కంటి ఎదురు మాతృకలో లేనిదల్లా యాక్షన్. అది లక్ష్మణ్ బొమ్మలో పుష్కలం. మన తెలుగు పత్రికల్లో కనపడే బొమ్మదంతా స్టయిలైజ్డ్ ఫామ్ మాత్రమే. మనకు రియలిస్టిక్ బొమ్మ ఇంకా తెలియదు.

అటువంటి చిన్నతనపు రోజుల్లోనే మరో ముద్ర. మాల్గుడి డేస్ టివి సీరియల్ వచ్చేది. అప్పుడు ఆర్కే నారాయణ్ గురించి తెలీదు. శంకర్ నాగ్ గురించి అసలు తెలీదు. మొదట కంటికి కనపడింది లక్ష్మణ్ బొమ్మలే, పిదప వినపడింది వైద్యనాథన్ సంగీతమే. ఈ రోజుకూ లక్ష్మణ్ బొమ్మ లేకుండా మాల్గుడి డేస్ అంటే, ఉప్పు లేని కూడే. ఆ తరువాత తరువాత వచ్చిన వాగ్లేకీ దునియాకి కూడా మొదటి ఊపిరి లక్ష్మణ్ బొమ్మదే. బొమ్మ కాస్త సాధన చేస్తే వస్తుంది. కానీ బొమ్మలో ఊపిరి రావాలంటే లక్ష్మణ్ చేసిన సాధన వేరు. ఆయన సాధన రెండు రకాలుగా నడిచింది. మొదట, చూసిన ప్రతి దృశ్యంతో మాట కలిపేవాడు – “ఓయ్ చెట్టూ! నువ్వెలా మొదలయ్యావంటే రెండు చేతులు చాపినా పట్టనంత కాండంతో మొదలయ్యి కాస్త దూరం సాగి బారుగా మూడు కొమ్మలు ఒక వైపుకు, నిలువుగా మరో రెండు కొమ్మలు పైకి పాకుతూ…” అలా కంటికి కనపడిన ప్రతి వస్తువు వర్ణన దానికి వివరిస్తూ, తన మెదడుకు తాను చెప్పుకుంటూ దాన్నంతా కాగితం మీద దింపేస్తూ. వాక్కు, మనస్సు, మెదడు, చేయి అంతా ఒకే పని, ఒహటే తపస్సు. అందుకే అది లక్ష్మణ రేఖ అయింది.

అనగనగా ఒక రోజుల్లో నేను పాతిక లోపు వయసులో ఉన్నప్పుడు, మహానుభావుడు ఆర్కే లక్ష్మణ్‌ మీద ఒక డాక్యుమెంటరీ ప్రెస్ క్లబ్‌లో ప్రదర్శించారు. చిట్టి తెరపై గట్టి మనిషి మాటాడుతున్నాడు. ఎవరో కాకుల గురించి అడిగారు. మందపాటి కళ్ళజోడు ఫ్రేమ్‌ లోనుండి లక్ష్మణ్ అడిగిన వారి వైపు ఒక చూపు చూశాడు అచ్చు కాకిలా! మెడ అటూ ఇటూ తిప్పాడు అచ్చు కాకిలా, భుజాలు విదిలించుకున్నాడు అచ్చు కాకిలా. పరకాయ ప్రవేశం అంటారు, ఆర్టిస్ట్ అచ్చమైన ఆర్టిస్ట్‌కు ఉండవలసినది అది. మతి పోతోంది నాకు. ఇదా బొమ్మగాడి లక్షణం అంటే? అందుకా అతను లక్ష్మణ్ అయ్యాడు. మనుషుల హావభావాలు చెబుతున్నాడు, బాడీ లాంగ్వేజ్ గురించి వివరిస్తున్నాడు. గొంతెత్తి ఎలా మాట్లాడాలి? గుడ్లప్పగించి ఎలా చూడాలి? గుసగుసలు ఎలా పలకాలి? వీటినన్నిటిని ఎలా పసిగట్టాలి? కట్టుకుని మూటగట్టుకున్న దానిని ఎలా బుర్రలో దాచుకోవాలి? దాచుకున్నదానిని బొమ్మలో ఎలా ఉపయోగించాలి?

అంతే! నాకు శ్రీ లక్ష్మణ్‌గారి బొమ్మగారు తెలుసు, ఆయన గురించి ఏమీ తెలీదు. ఒకటీ రెండు సార్లూ ఆయన ఎదురుపడ్డా పలకరించడానికి, పరిచయం అవడానికి ప్రయత్నం చేసింది ఏమీ లేదు. అదంతా వేరే అనవసర కథ. కాలం నడుస్తూ గడుస్తూ జనవరి 26- 2015వ సంవత్సరం వచ్చింది. ఆ రోజు తన తొంబై నాలుగేళ్ళ వయసులో లక్ష్మణ్ కన్నుమూశారు. తరువాత ఆయన గురించి, ఆయన జీవితం గురించి రకరకాల కథనాలు, జ్ఞాపకాలు, దిన పత్రికల్లో, బ్లాగుల్లో వరుసగా వస్తూనే ఉన్నాయి. నేను చదువుతూనే వస్తున్నా. వాటిలో ఒకటి నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. 1975లో ఇందిరా గాంధీ దేశంలో ఆత్యయిక పరిస్థితిని (ఎమర్జెన్సీ) విధించిన రోజుల్లో లక్ష్మణ్ ఎదుర్కున్న ఇబ్బందులు, అవమానాలు, అవి భరించలేక, బాధపళ్ళేక ఇక కార్టూనింగ్ నుండి విరమిద్దామనుకున్న నిర్ణయం, తరువాత దేశం కాని దేశం వెళ్ళిపోవడం, అక్కడ జరిగిన ఒక సంఘటన వల్ల తిరిగి కార్టూన్లు మొదలుపెట్టడం అదంతా భలే ఉంటుంది.

ఆర్కే లక్ష్మణ్ జీవితం గురించి ఆలోచించడానికి నన్ను ప్రేరేపించిన తొలి రచన అది. అది చదివాకా లక్ష్మణ్‌గారి గురించి ఇంకా తెలుసుకుందామనే ఉంది కానీ ఆయన జీవితం మీద ఏదైనా వ్రాద్దామని ఉద్దేశం లేదు. అలా చూస్తూ ఉండగానే 2021వ సంవత్సరం వచ్చింది. ఆ సంవత్సరం అక్టోబర్ 21 నాటికి ఆర్కేగారి శత జయంతి. అది వినగానే నాకు ఎందుకో మనసుకు నొప్పిగా తొచింది. ఎట్లాంటి కార్టూనిస్ట్ ఈయన, ఎంత గొప్ప చిత్రకారుడు. పుట్టి వందేళ్ళయినా ఇంకా ఈయన మన తెలుగుకు అంటరానివాడుగా ఉన్నాడే. ఈయన గురించి ఏమీ తెలియకుండా ఉందే. నేనేమీ పొలిటికల్ కార్టూనిస్ట్‌ని కాదు. లక్ష్మణ్‌గారి శిష్యుడిని కాను. కాస్తో కూస్తో బొమ్మల పట్ల ఉన్న ఆసక్తి వలన, ప్రేమ వలన ఆయన చేసిన పని పట్ల అంతులేని భక్తి ఉన్నది, ఆ కుంచె చెక్కిన బొమ్మల పట్ల కళ్ళు ఇంతింత పెద్దవిగా చేసుకుని చూసుకునే దిగ్భ్రమ ఉన్నది. అట్టి మహనీయుల జీవితం పట్ల వారు వేసిన దారి పట్ల, వారు నడిపిన పని పట్ల ఒక బాధ్యతను అనుకునే గుణం ఉన్నది. ఆ బాధ్యతని హృదయానికి హత్తుకుని లక్ష్మణ్ శత జయంతి సంవత్సరం సందర్భంగా ఆయన కథ వ్రాద్దామని అనుకున్నాను. అందుకు నాకు తోడ్పడినవి ముఖ్యంగా – ఆయన ఆత్మ కథ The Tunnel of Time, ఇంకా ఆయన మీద వచ్చిన వ్యాసాలు, యూట్యూబ్ ఇంటర్‌వ్యూలూ ఇంకా నా బోలెడు ఆసక్తి. లక్ష్మణ్ గురించి ఫలానా విషయం ఒకటి కావాలి అనుకుంటే వీలయినంత, దొరికినంత అన్వేషణ నెట్ ద్వారా సాగిస్తూనే వస్తూ ఉండేవాడిని.

ఏదీ ముందుగా వ్రాసి పెట్టుకున్నది కాదు. ఏ నెల కానెల అప్పటికప్పుడు వ్రాస్తూ వచ్చిందే. ఈమాట నవంబర్ 2021 సంచికలో ఈ ధారావాహిక మొదలయ్యింది. నవంబరు 2022కి అంతా అయిపోదా అనే ధీమా ఉండింది. ఇప్పుడు మార్చి 2023. వ్రాస్తూ పోతే ఇంకా 16 నెలలు వచ్చేట్టు ఉంది. ఇంతవరకు లక్ష్మణ్ బాల్యం, తన బొమ్మల తపన, కార్టూనిస్ట్‌గా బ్రతకడానికి చేసిన గట్టి కృషి, ఆ పై కల ఫలించి టైమ్స్ ఆఫ్ ఇండియాలో కుదురుకోవడం, ముంబాయిలో స్థిర నివాసం – వరకు వచ్చింది.

ఒకరకంగా చెప్పాలంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో కార్టూన్లు వేయడం మొదలుపెట్టిన దగ్గరి నుండి లక్ష్మణ్ పేరు, తన జీవితం అందరికీ తెలిసినదే. అంతకు ముందు జీవితం గురించి ఎవరూ ఎరగనిది, కనీసం నాకు మాత్రం తెలియనిది. తన మొదటి రాజకీయ కార్టూన్ మన తెలుగువాడయిన ప్రకాశం పంతులుగారి స్వరాజ్య పత్రికలో రావడం, కార్టూనిస్ట్ అవడానికి ముందు ఒక సినిమాకు పనిచేయడం, అంతకు మునుపు బ్రిటిష్ ప్రభుత్వానికి పోస్ట్‌కార్డ్ బొమ్మలు వేసి డబ్బులు సంపాదించుకోవడం, కొరవంజి పత్రికలో అచ్చయిన బొమ్మలూ కార్టూన్ల సంగతులు… ఇలా ఎన్నెన్నో ఆసక్తిదాయకమైన కబుర్లు అన్నీ నడిచాయి, గడిచాయి. ఇకముందు లక్ష్మణ్ జీవితం ఎలా గడిచింది అనే మిగతా రచన కలిసిన ఆర్కే లక్ష్మణ్ కథ జులైలో పుస్తకంగా రాబోతుంది. ఈ పదహారు నెలలుగా ఇక్కడ ఈమాటలో వ్రాసినదంతా, అచ్చయినదాన్ని అంతా రాబోయే పుస్తకం కోసం కొత్తగా కనీసం నాలుగుసార్లు తిరగ వ్రాశాను. భాషను వీలయినంత పొదుపుగా సూటిగా చెప్పే ప్రయత్నం చేశాను. అదంతా ఇంగ్లీష్ మాటల నుండి దింపిన తెలుగు అనువాదం కాదు. నేను రాసింది, పలవరించింది అల్లా హృదయ భాష మాత్రమే. కాస్తో కూస్తో చిత్రకారుడిని అవడం మాత్రమే ఈ రచనకు మిగిలిన నా అర్హత. స్వస్తి.

అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...