సాంగత్యం

కాస్త నిశ్శబ్దం తరువాత నెమ్మదిగా అందామె, “వాడంటున్నాడు, కొంచెం కూడా జ్ఞానం లేదట నాకు. మగాళ్ళ పైన, ఆస్తుల పైన, బంగారం పైన వ్యామోహంతో కొట్టుకుపోతున్నానట. అన్నిటికంటే పెద్ద వ్యామోహం ఏంటో తెలుసా చిన్నా, జ్ఞానం. దానికన్నా పెద్ద వ్యామోహాన్ని ప్రపంచం ఎప్పటికీ చూడలేదు. అది కూడా తెలియదు ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్‌కి!” పెద్దగా నవ్వింది కమిలిపోయిన మెడను తడుముకుంటూ. అది నవ్వులా లేదు, అదేంటో అర్థం చేసుకునేంత వయసు కూడా లేదు అప్పటికి, ఇప్పటికీ రాలేదనుకుంటా.

ఇలాంటి అర్థంకాని మాటలెన్నో వాళ్ళ అన్న వచ్చి వెళ్ళిన ప్రతిసారీ వినేవాడిని. నా వరకు అవి ఆమె నాతో జరిపిన అసందర్భ సంభాషణలు. ఆమెలో ఆడంబరాన్నో, డబ్బుల పట్ల ప్రేమనో కాదు కదా, కనీసం చిన్న బంగారు దండో, రెండు బంగారు గాజులో ఆమె వంటిపై నేనెప్పుడూ చూడలేదు. కాని బీరువాలో మాత్రం చాలా బంగారు నగలైతే ఉండేవి. ఎప్పుడైనా వాటిని పడకగదిలో మంచంపైన పరిచి పెట్టి చూపించేది.


తాయారమ్మ మేడ. దాన్లో ఎవరన్నా దిగారంటేనే ఏ బ్యాంక్ మేనేజరో, ఇంజనీరో కొత్తగా ఊర్లోకి వచ్చారని తెలిసిపోయేది. ఆమె ఆ ఇంట్లో దిగే సమయానికి నా వయసు ఏడేళ్ళుంటాయేమో! మా ఇంటికి కొంచెం దూరంగా ఉండే బంగ్లాలాంటి ఇల్లు అది. పెద్ద ఖాళీ స్థలంలో అక్కడక్కడ కొబ్బరి చెట్లు, పూలమొక్కలు. చుట్టూ ప్రహరీ గోడ. ఎక్కువగా బయట గేటు వేసే ఉండేది, మనిషనేవాడు కనిపించేది తక్కువ. ఆ సంవత్సరం ఎండాకాలం సెలవల్లో ఆమె కొడుకు సుధీర్ వచ్చాడు. వాడితో వీధిలో ఆడుకునేటప్పుడు అయిన పరిచయం నన్ను వాళ్ళింట్లోకి తీసుకెళ్ళింది. వాడు నాకంటే ఓ సంవత్సరం చిన్న. అలా మొదటిసారి ఆ ఇంట్లో అడుగుపెట్టాను. కనకాంబరం రంగు అంచున్న తెల్లటి పట్టుచీర కట్టుకొని బావిగట్టుపైన కూర్చొని ఉందామె. అప్పుడే తలస్నానం చేసినట్లుంది. టవల్‌తో పొడవైన జుట్టు తుడుచుకుంటూ నా వైపు నవ్వుతూ చూసింది. ఆ వయసులో ఆమె నాకు ఓ సంభ్రమం. ఆ క్షణంలో ఆమె ఓ దేవతలా కనిపించిందనే మాట నిజం. ఆ తరువాత కూడా ఆమెతో ఉన్న ఏడేళ్ళలో అంతకంటే భిన్నమైన అనుభూతి నాకెప్పుడూ కలగలేదు. ఆ తరువాత తరువాత మా ఇంట్లోకంటే ఎక్కువ సమయం అక్కడే గడిపా. అక్కడే తిండి. అక్కడే నిద్ర. అక్కడే ఆటలు. అక్కడే చదువు. ఓ రకంగా కొన్ని సంవత్సరాల పాటు ఆ ఇల్లే నా జీవితం. మొదటిసారి సోఫా, డైనింగ్ టేబుల్, డబుల్ కాట్, టేప్ రికార్డర్, టి.వి. లాంటివి అక్కడే చూశా.


సాధారణంగా హాల్లో ఉన్న సోఫాలోనే ఎక్కువగా పడుకునేవాడిని. వాళ్ళ అన్న వచ్చినప్పుడు మాత్రం నా మకాం వరండాలో మడత మంచంపైకి మారేది. సంవత్సరానికి మూడునాలుగుసార్లు వచ్చేవాడు. సాయంత్రం వచ్చి ఉదయాన్నే వెళ్ళిపోయేవాడు. ఆ ఏడేళ్ళలో ఆయన టైమ్‌టేబుల్ అంతకుమించి మారలేదు. అన్ని సంవత్సరాలలో ఆయన నాతో ఒక్కమాట మాట్లాడింది లేదు. వెళ్ళేటప్పుడు ఆయన కోసం రిక్షాబండి పిలుచుకొచ్చేవాడిని. అప్పుడు కూడా నా పక్క కనీసం నవ్వుతూ చూసింది లేదు. ఆమె మౌనంగా గేటు దగ్గర నిలబడి ఆ రిక్షా వీధి మలుపు తిరిగే వరకు చూస్తూ ఉండేది.

అతను వెళ్ళిపోయాక విరామాలు విరామాలుగా అసందర్భ సంభాషణలు కొనసాగేవి. “మనిషిని గొప్పవాడిగానో/ నిస్సహాయుడిగానో చూపించడం ఓ చౌకబారు కళ. దాన్ని అపరిమితమైన మేధోతనం అని అందిపుచ్చుకొనే మా అన్నలాంటి మనుషులు ఉదాత్తులుగా ప్రవర్తిస్తూ ఉన్మత్తతతో ఊగుతుంటారు. దాన్ని కూడా నిర్మలత్వంగా భావించమని నాలాంటి దాన్ని బలవంతం చేస్తారు. వంచన మనుషుల సహజగుణం చిన్నా. మనుషుల్నే కాదు, దేన్నీ ఎప్పుడూ ఆరాధించకు. అది నిన్ను గుడ్డివాడిని చేస్తుంది. మా అన్న ఆ విలువలను ఆరాధిస్తూ దాని మూర్ఖత్వంలో కొట్టుకుపోతుంటాడు. అతను నమ్మిన విలువలను అనుసరించలేదనే ఆగ్రహమో, నాలాగా బతకలేకపోతున్నాననే బాధో అతన్ని నిరంతరం వెంటాడుతుంటాయేమో! వాటినుంచి తప్పించుకోవడం కోసమే ఇక్కడికి వస్తాడు. వాటిని నా దగ్గర దింపుకొని వెళతాడు. నేను మంచిదాన్ని కాదు అని ఒప్పుకున్నా వాడి అహం తృప్తిపడదు. దాన్ని వాడే నిరూపించి నాకు చూపించాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో వాడూ గాయపడతాడు. నన్నూ గాయపరుస్తాడు. నా కొడుకుని నా నుంచి రక్షించాలనుకుంటాడేమో వాడి దగ్గరే పెట్టుకొని వాడిలా పెంచాలని తపనపడుతుంటాడు.”

ఇలా మాట్లాడేటప్పుడు ఆమె కిటికీ వైపో, దూరంగా కనిపించే ఏదైన వస్తువులవైపో చూస్తూ మాట్లాడేది. ఆ మాటలు నేను వింటున్నానో లేదో కూడా పట్టించుకొనేది కాదు. తనలోతాను మాట్లాడుకుంటున్నట్లుండేవి అవి. నేను మాత్రం ఆమె వైపే చూస్తూ శ్రద్దగా వినేవాడిని. ఆ సమయంలో ఆమె ముఖంలో ఏదో ప్రత్యేకత కనిపించేది నాకు.


అంకుల్ గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. అతను ఆమెకి సరిపోడు అని చెప్పడానికి అప్పటి నా వయసు కూడా సరిపోతుంది. వారంలో ఐదారు రోజులు కాంపులంటూ తిరిగేవాడు. నేను ఆయనతో మహా అయితే ఓ పదిసార్లు మాట్లాడి ఉంటానేమో. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసిన సందర్భాలు కూడా అంతకంటే ఎక్కువేం ఉండవు. ఆయన ఇంట్లో ఉన్న రోజు మాత్రం ఇల్లు నిశ్శబ్దంగా ఉండేది. ఆయన కోపంగానో సంతోషంగానో ఉండటం కాని, పెద్దగా మాట్లాడటం కాని చూడలేదు. అభావంగా తన పనులు తాను చేసుకునేవాడు. నల్ల ఎజ్‌డి మోటర్ బైక్ కడిగేటప్పుడు నేను ఆయన పక్కనే ఉండి నీళ్ళు అందించేవాడిని. అప్పుడు కూడా ఆయన ఏమీ మాట్లాడేవాడు కాదు. ఆమె ఆయన గురించి చెప్పిన ఒకట్రెండుసార్లు కూడా అతని గురించి మంచిగానే చెప్పిన గుర్తు. ‘అతని దారి అతనిది. నా దారి నాది. నేను సమస్యగా మారిందంతా మా అన్నకే’ అంటూ నవ్వడం గుర్తుంది. ఎప్పుడన్నా వచ్చి రాత్రికి ఉండి ఆమెను విసిగించి, హింసించి పోయే అన్న, వారానికి ఓ రోజుండి పోయే భర్త, సంవత్సరంలో ఓ వారానికి మించి ఉండని కొడుకు – అంతే ఆ ఇంట్లో మనుషుల గురించి. మిగతా సమయంలో ఆ ఇల్లు మా ఇద్దరిది మాత్రమే అనిపించేది నాకు.


వరండాలో పడుకొని వినే వాళ్ళిద్దరి సంభాషణల్లో ఆమె అన్న అరుపులు, కేకల్లాంటివి తప్ప ఆమె గొంతు విన్న సందర్భాలు చాలా చాలా తక్కువ. పక్కరోజు మాత్రం ఒక భిన్నమైన ధోరణిలో ఉండేది. అసందర్భ సంభాషణలు కొనసాగేవి.

“చిన్నా! జ్ఞానిగా నటిస్తూ బతకడం కన్నా, జ్ఞానిగా భ్రమపడుతూ బతకడంలో ఉండే హాయి తెలియాలంటే మా అన్నను చూస్తే చాలు. సరళంగా బతకలేవా అంటూ నా చుట్టూ మా అన్న బిగించే ఉచ్చులు నాకు ఊపిరాడనివ్వవు. అవి నన్ను మరింత మొండిగా మారుస్తాయి. అతను వెతుక్కునే గొప్పతనమంతా అతను చూపించే అతి సరళత వల్ల ఆడంబరంగా మిగిలిపోతుంది. బరితెగింపు అంటూ వాడు మాట్లాడే ప్రతిమాట నా పట్ల హింసగా మారుతుంది. నేను దారి తప్పినదాన్ని అనేది తరచూ వాడు నాపై చేసే ఆరోపణ. ఈ మానవసమాజం జంతువు నుంచి పక్కకు జరిగినప్పుడే దారి తప్పింది చిన్నా. ఆ తరువాత తప్పిన ప్రతి దారీ తప్పు నుంచి తప్పు వైపుకి నడిచిందే. అది మా అన్నలాంటివాడికి అర్థం కాదు. వాడికి లొంగి ఉండటం నా బలహీనత. అదే వాడి బలం. నా బలహీనతకు కారణాలు వెతుక్కొని దాన్నుంచి బయటపడటం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు కాని అది నన్ను మరంత బలహీనపరుస్తుందనే భయం నన్ను ఆ పని చేయనివ్వదు.”


పుస్తకాల గురించి చెప్పకుండా ఆమె గురించి చెప్పడమంటే నేల గురించి మాట్లాడకుండా మొక్క గురించి, హృదయం గురించి మాట్లాడకుండా ప్రేమ గురించి మాట్లాడటంలాంటిది. ఆ ఇంట్లో ఒక గది మొత్తం పుస్తకాలతో నిండిపోయుండేది. చేతిలో పుస్తకం లేకుండా ఆమెను చూసిన రోజులు దాదాపు ఉండవేమో! ఆ ప్రభావం వల్లనేమో చందమామ, బాలజ్యోతి లాంటి వాటి నుంచి ఐదో తరగతికి వచ్చేసరికి ఆమె చదువుతున్న తులసిదళాన్ని అందుకున్నాను మొదట్లో షాడో, బులెట్ లాంటి డిటెక్టివ్ పుస్తకాల తరువాత యండమూరి, మల్లాది మొదలుకొని తరువాత కాలంలో చలం, అడవి బాపిరాజు, శ్రీశ్రీ, తిలక్, బుచ్చిబాబు దాకా ఎన్నో పుస్తకాలు చదవగలిగాను. బోలెడు రష్యన్ సాహిత్యం, శరత్, ప్రేమ్‌చంద్ లాంటి వాళ్ళు కూడా అక్కడే పరిచయం. అంతే కాకుండా క్రింది అరలో దాచిపెట్టుంచిన ఓ నాలుగు బూతు పుస్తకాలు కూడా.

మూడునెలలకోసారి ఓ నాలుగైదు రోజులు ఆమె ఎక్కడికో వెళ్ళిపోయేది. ఆ సంగతులేవీ నాకు చెప్పేది కాదు. కనీసం ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా. వచ్చేటప్పుడు మాత్రం కొన్ని కొత్త పుస్తకాలు ఆమెతో వచ్చేవి. దాదాపు ప్రతి పుస్తకాన్ని చదివి ఉంటుందేమో, నేను ఎప్పుడు ఏ పుస్తకం తీసినా దాని గురించి ఏదో ఒకటి చెప్తుండేది. బహుశా నేను పుస్తకాలకు అలవాటుపడటానికి అదొక కారణం.


ఒకసారి వాళ్ళ అన్న రావడమే కోపంగా వచ్చాడు. చాలాసేపు మౌనంగానే ఉన్నాడు. అప్పుడు నేను ఏడో తరగతి అనుకుంటా. ఆ రాత్రి బయట నిద్రపోతున్న నాకు ఆయన అరుపులతో హఠాత్తుగా మెలకువ వచ్చింది. ఎప్పటిలానే పెద్దపెద్ద కేకలు, తిట్లు, విసిరికొడుతున్న వస్తువుల చప్పుళ్ళు. ఉన్నట్లుండి ఆయన స్వరంలో మార్పు. ఏడుపుగొంతులా వినిపించింది. నాకు ఆశ్చర్యమనినిపించి కిటికీ కమ్మీలు పట్టుకొని వాటి పైన ఉండే ఖాళీలోనుంచి చూశాను. ఆమె సోఫాలో కూర్చొని ఆయనవంకే చూస్తుంది. ముఖంలో ఎలాంటి భావాలూ లేవు. ఆయన మాత్రం తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. కాసేపయ్యాక ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని ‘నీ చదువు మానిపించాను, నీకిష్టంలేని పెళ్ళి చేశాను. కొడుకుని దూరం చేశాను. నీ జీవితాన్ని నీకు కాకుండా చేశాను. నన్ను క్షమించు’ లాంటి మాటలేవో చెప్పడం కనిపించింది.

లెక్కలంటే ఆమెకు చాలా ఇష్టం. నేను కష్టంగా చేసే బీజగణితం లాంటిదాన్ని కూడా అర్థమయ్యేలా సులభంగా చెప్పేది. లెక్కలు బాగా నేర్చుకోమనేది. ఈ రోజు నేను ఓ చిన్న గుమస్తా ఉద్యోగంలో స్థిరపడ్డానంటే ఆ రోజు ఆమె నేర్పిన లెక్కల చలువే. మాములుగా లెక్కలు చెప్పేటప్పుడు హుషారుగా ఉండే ఆమె ఆ రోజు అలా లేదు. మధ్యమధ్యలో అసందర్భ సంభాషణలు చేస్తూ, ఎక్కువ సమయం మౌనంగానే ఉంది. వాళ్ళ అన్న ప్రభావం ఆ రోజు ఎక్కువగా ఉందేమో అనిపించింది నాకు.

“మనుషులు చేసే తప్పులన్నీ ప్రకృతివే. వీళ్ళు లోభాన్నో, ద్వేషాన్నో, వారి గొప్పతనాన్నో, నిమ్నత్వాన్నో, జ్ఞానాన్నో, మూర్ఖత్వాన్నో ప్రదర్శించడంతో తృప్తిపడుతుంటారు. ప్రదర్శన మనుషులను పలుచన చేస్తుంది. అది మనకు మనం తెలుసుకుంటే కాని సరి చేసుకోలేం. జీవితంలో విషాదాలు, బాధలు, కష్టాలు వీటిలోని తీవ్రత కంటే ఎక్కువగా మనల్ని కుదిపేసేది మనలో ఉండే ఉద్వేగమే. వాటిని మా అన్న అదుపు చేసుకోలేడు. విలువల పరిమిత పరిధినో, కొన్ని పరిస్థితుల్లో క్షణంలో మారిపోయే వాటి విలువనో అంచనా వేయలేడు. మనుషులు అవసరాన్ని మించిన అవసరం కోసం, సంతృప్తికి మించిన సుఖం కోసం వెంపర్లాడుతుంటారు. వీళ్ళు జంతువులనుంచి ఎదిగినవాళ్ళు కాదు చిన్నా! అక్కడ నుంచి మనిషిగా దిగజారినవాళ్ళు. వీళ్ళు జాలిపడాల్సిన వాళ్ళే తప్ప ద్వేషించాల్సినవాళ్ళు కాదు.”


అప్పుడప్పుడు టేబుల్ పైన కూర్చొని డైరీల్లో ఏదో రాస్తూ ఉండేది. ఏం రాస్తుందో ఎప్పుడూ చెప్పలేదు. నన్ను వాటిని చూడనిచ్చేది కాదు. వాటిని లాక్కోని చదవడం కోసం నేను చేసిన ప్రయత్నాలు కొన్నిసార్లు స్కూల్లో పిల్లల్లా ఇల్లంతా పరిగెత్తుతూ కొట్టుకొని నెట్టుకొనే స్థాయి వరకు జరిగేవి. అదొక ఆటలా ఉండేది. చివరకు ఆమె గెలిచేది. “నేను రాసినవన్నీ ఎప్పటికైనా నీకే ఇస్తాలే చిన్నా” అంటూ నవ్వేది.

ఆమెను ఏమని పిలవాలో నాకెప్పుడూ తోచేది కాదు. పేరు పెట్టి పిలిచినా, ఆంటీ అన్నా, అమ్మాయ్ అన్నా ఆమె ముఖంలోని నవ్వులో పెద్ద తేడా ఉండేదేమీ కాదు. ఆటలంటే ఆమెకి చాలా ఆసక్తి ఉండేది. ఇంట్లో రకరకాల బోర్డ్ గేమ్స్, ఆటవస్తువులు ఉండేవి. చెస్, క్యారమ్స్, చైనీస్ చెక్కర్స్, బాడ్మింటన్ ఇలాంటి ఆటలన్నీ ఆమె నేర్పినవే. బ్లాక్ అండ్ వైట్ టి.వి.లో వచ్ఛే క్రికెట్ గేములు మాత్రం వదలకుండా చూసేది, ఐదురోజులాడే టెస్టు మ్యాచులతో సహా. అంతేకాదు, ఓ పేపర్ పైన వివరాలన్నీ స్కోర్‍బోర్డులా రాసిపెట్టుకొనేది.


పడకగదిలో ఆమె మంచంపైన నిద్రపోవడం మామూలు అలవాటే నాకు. నా వయసు పదమూడు నిండి పధ్నాలుగులోకి మారిన కొత్తల్లోననుకొంటా, ఆ రోజు శరీరంలో చెలరేగుతున్న అర్థంకాని ఉద్రేకమేదో అనేక తటపటాయింపుల అనంతరం చేతిని బలిపశువుగా మార్చుకొంది. నా పక్కనే పడుకొని నిద్రపోతున్న ఆమె వంటిపైన నా చేయి. అది ఎప్పటిలా లేదు, ఆ స్పర్శలోని తేడా నాకంటే ఎక్కువగా ఆమె శరీరమే పసికట్టిందేమో! నా వంటిలో జరిగే ప్రతి మార్పూ నాకంటే ఎక్కువగా ఆమెకే అర్థమైందేమో! ఓ నిమిషం తరువాత నెమ్మదిగా నా వైపు తిరిగి నన్ను దగ్గరకు హత్తుకొని వీపుపైన జోకొట్టింది. ముడుచుకుని పడుకున్న కుక్కపిల్లలా నేను అలా ఎంతసేపుండిపోయానో తెలియదు కాని, ఆమె బుగ్గలపైనుంచి జారిన కన్నీరు నన్ను ఇప్పటికీ తడుపుతూనే ఉంది.

తొమ్మిదో తరగతి ఎండాకాలం సెలవల్లో నేను మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఆ ఇల్లు ఖాళీగా కనపడింది. వాళ్ళు ఎక్కడో వేరే రాష్ట్రానికి బదిలీపై వెళ్ళిపోయారని చెప్పారు. ఎప్పుడన్నా ఆ ఇంటి చుట్టూ కాసేపు తిరగడం తప్ప, దానిలోకి మళ్ళీ అడుగు పెట్టలేదు. ఇప్పటివరకు ఆమె నా జ్ఞాపకాల్లో తప్ప మళ్ళీ కనబడలేదు.


దాదాపు నలభై ఏళ్ళ తరువాత సుధీర్ నన్ను వెతుక్కుంటూ వచ్చి పరిచయం చేసుకున్నాడు. నేను వాడిని, వాడు నన్ను గుర్తుపెట్టుకున్నామా అనేది సందేహమే. కొన్ని పొడిపొడి మాటల తరువాత బాగ్ లోంచి ఓ లావుపాటి కవర్ తీసి నా చేతుల్లో పెట్టాడు. “అన్నా! అమ్మ వీటిని మీకు ఇమ్మని చెప్పింది. అమ్మ చనిపోతూ చివరగా చెప్పిన మాట అది. నీ అడ్రెస్ సంపాదించడం కొంచెం కష్టమైంది” అని చెప్పి వెళ్ళిపోయాడు వాడు.

వణుకుతున్న చేతుల్తో కవర్ తెరిచాను, ఆమె డైరీలు.