“రావ్, చాయ్ పీయో. రాత్రంతా చదువుతూనే ఉన్నట్టున్నావు. చూస్తుంటే రేపు ఎగ్జామ్ హాల్లో కూడా చదువుతూనే ఉంటావేమో, ఆ అలవాటు కొద్దీ పరీక్ష రాయడం కూడా మర్చిపోతావేమో!”
రైలు కిటికీలోంచి బయటికి చూస్తున్న నాతో అన్నాడు అమర్ సింగ్. అటూ ఇటూ పైనా కిందా బెర్తులకింద నిద్రపోతున్న ఇంకో నలుగురుకూడా మా యూనిట్ వాళ్ళే. అందరి గమ్యం ఒక్కటే. డిప్లొమా ఎంట్రెన్స్ ఎగ్జామ్.
“అయినా, ఈ డిప్లొమాలూ అవీ మాలాంటి బీదవాళ్ళకే గానీ మీలాంటి తెలివైన వాళ్ళకెందుకు? మాలాంటి సీనియర్లకి అడ్డం రావడానికి తప్ప!”
ఇతని మాటలు ఎప్పుడూ ఇంతే. తొమ్మిదేళ్ళ సర్వీసు తర్వాత ఇప్పుడు మొదటిసారి ఈ కోర్స్‌కి అప్లయ్ చేశాడు. అది లేట్ అయినట్లే. తన జూనియర్లతోబాటు కెరీర్ పరుగుపందెంలో పాల్గొనడం వల్ల వచ్చిన ఉక్రోషం అతనితో అలా మాట్లాడిస్తోంది.
“ఏ స్టేషన్ ఇది?” అడిగాను.
“ఇటార్సీ. అరగంటనుంచీ నిలబడి ఉంది. రేపు టెస్ట్‌లో ఏం రాయగలనో ఏమో…” దీనంగా అన్నాడు. “రావ్, మాథ్స్ బాగా ప్రాక్టీస్ చేసే ఉంటావు. మీ మదరాసీలకి లెక్కలు బానే వస్తాయిలే.”
“నాకూ అంతగా రావు సర్” అన్నాను.
దాదాపు ఏడాది క్రితం మా యూనిట్‌కి పోస్టింగ్ మీద వచ్చాడు ఈ అమర్ సింగ్. బారక్‌లో కబుర్లాడేటప్పుడు ఎంతసేపూ ‘ఫలానా యూనిట్లో మెస్ కమాండర్ డ్యూటీ చేశాను, ఫలానా చోట రేషన్ క్లర్క్‌గా పనిచేశాను, ఇంకోచోట గ్యారేజ్ ఎన్‌సివోగా చేశాను’ అనే చెప్తాడు తప్ప, ఏ టెక్నికల్ ఎక్విప్‌మెంట్ మీదా పనిచేసినట్లు చెప్పలేదు. అతని మాటల్లోగానీ చేతల్లోగానీ అందుకు దాఖలాలూ కనిపించలేదు. పోనీ అప్ గ్రేడింగ్ కోర్స్‌లో మార్కులు చూద్దామా అంటే అవీ అంతంతమాత్రమే. కోర్స్‌కి అప్లై చేసిన నలుగురం, ఒకరికొకరం సాయం చేసుకుని ప్రిపేరయ్యాం. మా ప్రిపరేషన్లలో అమర్ సింగ్ ఎప్పుడూ పాల్గొనలేదు.
ఇతను ఈ డిప్లొమా కోర్స్‌కి సెలెక్ట్ అయితే ఆశ్చర్యమే.
ఎగ్జామినేషన్ హాల్ నిశ్శబ్దంగా ఉంది.
ఎక్కడెక్కడి యూనిట్లనుంచో వచ్చిన దాదాపు ఆరువందలమందిమి, ఆ డిప్లొమా కోర్స్ తాలూకు ముప్ఫై సీట్లకోసం పోటీపడుతూ రాస్తున్న ఎంట్రెన్స్ పరీక్ష అది. సీట్ వచ్చిందంటే, పరమపదసోపానపటంలో పెద్ద నిచ్చెనని అతి తొందరగా ఎక్కినట్లు, నాన్ కమీషన్డ్ ర్యాంకుల్లో ఇరవై ఏళ్ళకి పైగా మచ్చలేని సర్వీస్ చేసిన తర్వాత వచ్చే జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ ప్రమోషన్, డిప్లమో కోర్స్ పూర్తయిన ఒకటి రెండేళ్ళకే వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత కనీసం ఇరవై పాతికేళ్ళపాటు సాగే సర్వీస్, రాంక్ (హోదా) పెరిగి మరింత గౌరవప్రదంగా, హెచ్చు అధికారాలతో, అధిక సదుపాయాలతో సాగుతుంది.
ఈ పరీక్ష కోసం తక్కువేం ప్రిపేర్ కాలేదు నేను. ఆరునెలల క్రితం, గత ఇరవై ఎంట్రెన్స్ టెస్టుల ప్రశ్నాపత్రాలని సంపాదించాను. వాటిలో రిపీట్ అయిన ప్రశ్నలని తీసివేయగా, రెండు వందల పైచిలుకు ప్రశ్నలున్న క్వశ్చన్ బ్యాంక్ ఒకటి తయారైంది. మా యూనిట్ లైబ్రరీలో దొరికిన పుస్తకాల్లో వెతికి కొన్నిటికి, తెలిసిన టెక్నికల్ ఆఫీసర్లనీ అడిగి కొన్నిటికీ – ఒక్కో ప్రశ్న తాలూకు జవాబు తయారుచేసుకున్నాను. ఒకే ప్రశ్నని ఎలా మార్చి అడిగినా ఆన్సర్ చేయగలిగేలా జవాబుతోబాటు దాని ముందు మూడు లైన్లు, తర్వాత మూడు లైన్ల చొప్పున ఇతర వివరాలు కూడా సేకరించి పెట్టుకున్నాను. ఇలా కష్టపడి ప్రతి ప్రశ్నకీ జవాబులు రాసుకుని, వాటిని పదే పదే నెమరు వేసుకుంటూ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేశాను.
ఇదంతా, రెండు మూడు రోజులకొకసారి పడే నైట్ డ్యూటీలు, వేరే యూనిట్‌కి వెళ్ళి చక్కబెట్టుకు రావలసిన టెంపరరీ డ్యూటీలు, ఇరవై నాలుగ్గంటల పాటు చేయవలసి వచ్చే స్పెషల్ డ్యూటీలు వగైరాల మధ్య జరిగిన ప్రిపరేషనే. కెరీర్లో ఎదుగుతానంటే అడ్డుకుని ఆటంకాలు పెట్టేవాళ్ళు సైన్యంలో ఉండకపోయినా, ఏ కెరీర్ పరీక్షని రాయబోతున్నా సరే, ఏ డ్యూటీనుంచీ మినహాయింపు ప్రసక్తే లేదు.
ఎగ్జామినేషన్ పూర్తయింది. చదివిన వాటిలోంచే ప్రశ్నలు వచ్చాయి కాబట్టి, బానే రాశాననిపించింది.
బ్యారక్స్‌కి వచ్చాం. ఆ సాయంత్రమే తిరిగి యూనిట్‌కి వెళ్ళడానికి రైలెక్కాలి. సామాన్లు సర్దుకుంటున్నాం.
“మా కంపెనీ క్లర్కు పరమ కర్కోటకుడు. ‘రేపు ఎగ్జామ్ ఉంది’ అని తెలిసినా పట్టించుకోకుండా ముందురోజు నైట్ డ్యూటీ వేశాడు” అన్నాడో సిపాయి.
“సరేలే, నాలుగు రోజుల క్రితం మా నాన్నని ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చింది. అసలు చదవడమే కుదరలేదు” వాపోయాడు మరో సిపాయి.
“నేను రాసుకున్న నోట్స్‌ని ‘ఒక్కసారి చూసిస్తా’ అంటూ తీసుకెళ్ళాడు మా యూనిట్లోవాడొకడు. నిన్న రాత్రి రైలెక్కే ముందు తెచ్చి ఇచ్చాడు. ఇక ఎన్ననుకుని ఏం లాభం?”
నా పక్క బెడ్ మీద అమర్ సింగ్ నోరు విప్పాడు. “తుమ్ లోగ్ బేవకూఫ్ హో!”
అందరం అటు చూశాం.
“షార్ట్‌కట్ తెలివితేటల్లేవు మీలో ఎవరికీ. అందుకే అనవసరంగా కష్టపడ్డారు. ఇంతా చేసి మీలో ఎందరు సెలెక్ట్ అవుతారో తెలీదుగాని, అమర్ సింగ్ సెలెక్ట్ కావడం మాత్రం గ్యారంటీ!”
తన సూట్‌కేస్ లోంచి ఒక కాగితాన్ని తీశాడు. “ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా పట్టాలో తెలుసుకోండోయ్ గాడిదల్లారా” అంటూ బెడ్ మీదెక్కి నిలబడి, అందరికీ కనిపించేలా దాన్ని ముక్కలు ముక్కలుగా చించాడు.
“పేపర్! డిప్లొమా కోర్స్ క్వశ్చన్ పేపర్! కావాలంటే ఏరుకోండి” అంటూ ముక్కలని ఎగరేశాడు.
అమర్ సింగ్ సెలెక్ట్ అయాడు. కానీ మొదటి సెమిస్టర్‌లోనే అతి తక్కువ మార్కులు తెచ్చుకోడంతో, యూనిట్లకి తిరిగి పంపించివేయబడ్డ ముగ్గురిలో ఒకడయ్యాడు ఆ అవమానాన్ని ఎంత పట్టించుకున్నాడో తెలియదు. మేం చేస్తున్న డిప్లొమా కోర్స్ సగానికి పైనే పూర్తయింది. వారానికో రిటెన్, రెండువారాలకో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ చొప్పున సాగుతూ.
ఇంతలో, ఇరవై మూడేళ్ళకి పైగా సర్వీస్ చేసి మరో రెండు నెలల్లో హవల్దార్‌గానే రిటైర్ అవుతాడనుకుంటూ, ప్రమోషన్ ఆశలు వదిలేసుకున్న హవల్దార్ భయ్యావత్‌కి – హఠాత్తుగా జేసీవోగా ప్రమోషన్ ఆర్డర్ వచ్చింది. వచ్చే ఒకటో తేదీనుంచి అతను ‘నాయబ్ సుబేదార్’.
“సర్, ముబారక్ హో!” అంటూ పలకరించాడు నా తోటి ట్రైనీ పీపీ సింగ్.
“షుక్రియా. షుక్రియా.”
“మిఠాయీ ఏది సర్!” నవ్వుతూనే అంటించాడు పీపీ సింగ్. భయ్యావత్ కొత్త రాంక్‌ని ధరించి, సెల్యూట్‌లు స్వీకరించడాన్ని మొదలుపెట్టేదాకా మర్యాదగా పరాచికాలాడొచ్చు మరి!
“వస్తుంది వస్తుంది. దేఖో భాయ్! నేను మీలాగా చదువుకున్నవాణ్ని కాదు. సీనియర్ ఏం చెప్తే అది కిమ్మనకుండా చేసుకుంటూ పోయాను. జేసీవో అవుతున్నానన్న సంతోషం కన్నా, నా పిల్లలని ఇంకొంచెం ఎక్కువ చదివించుకోగలుగుతానన్న ఖుషీ ఉంది చూడు, ఆ సంతోషం ముందు మిగతావన్నీ బలాదూరే!”
రేపు ఇన్‌స్పెక్షన్. నెలకోసారి రొటీన్‌గా జరిగే చిన్నాచితకా ఇన్‌స్పెక్షన్ కాదు. ఏడాదికోసారి జరిగే ‘ఏడమ్ (అడ్మినిస్ట్రేటివ్) ఇన్‌స్పెక్షన్”. మెస్‌లో పాత్రల దగ్గర్నుంచీ ఆఫీస్‌లో ఫైళ్ళ వరకూ అన్నిటికీ తళతళా మెరిసిపోయే దశ పట్టే పెద్ద ఇన్‌స్పెక్షన్ అది.
1850లో బ్రిటిష్‌వాళ్ళు కట్టించిన బారక్. దాదాపు పావు కిలోమీటర్ పొడవున, వరసగా పెద్ద పెద్ద ఆర్చీలున్న వెడల్పాటి వరండాలతో అందంగా ఉండే ఆ భవనం మొదటి అంతస్తు ఎత్తే ఇరవై అడుగులుంటుంది. దానిమీద పద్దెనిమిది అడుగుల ఎత్తయిన మరో అంతస్తు. పైన ఎర్ర రేకుల కప్పు. రెండడుగుల మందాన నల్లటి బండరాళ్ళు పేర్చిన గోడలు.
గ్రౌండ్ ఫ్లోర్‌కి మొదటి అంతస్తుకీ మధ్య, బారక్ పొడవునా, ఆరంగుళాల వెడల్పు అలవ.
రోడ్డు వైపు వున్న బారక్ గోడ మీద ఎలాగో మొలిచి ఎదిగిందో రావి మొక్క. దాని వేళ్ళు ఆ నల్లరాతి గోడల మీద బలంగా పాకాయి. దూరంనుంచి కూడా కనిపించేంతగా కొమ్మలూ ఎదిగాయి. ఈ ఇన్‌స్పెక్షన్ వల్ల, ఆ మొక్కని తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ బాధ్యత నేరుగా భయ్యావత్ భుజాలమీద పడింది. ఆరోజు నాతోబాటు మరో ముగ్గురిని అక్కడికి తీసుకెళ్ళి, ఆ మొక్కని చూపించి చెప్పేడు భయ్యావత్.
“ఇస్ కో కాట్‌నే కేలియే ఔజార్ కమ్, ఔర్ హిమ్మత్ జ్యాదా చాహియే!” అన్నారెవరో.
నిజమే! నేలకి నలభై అడుగుల ఎత్తున మొలిచిందా మొక్క. కత్తి కన్నా గుండె ధైర్యమే కావాలి.
మొక్క ఆ గోడకి ఉన్న కిటికీ కింద ఉంది. వాటి మధ్య దాదాపు నాలుగడుగుల ఎడం. ఒక చేత్తో కిటికీని పట్టుకొని వేళ్ళాడుతూ, మరో చేత్తో ఆ మొక్కని నరకాలి. అలవ మీదనుంచి నడిచొచ్చి ఆ కిటికీని చేరడం కుదరదు కాబట్టి, కప్పు మీదినుంచి దిగడం తప్ప మరో దారి లేదు.
ప్లాన్ వేశారు.
పీటీ సెల్ నుంచి ‘క్లయింబింగ్ రోప్’ని తెప్పించారు. పీటీ గ్రౌండ్లో ఇరవై అడుగుల పొడవున వేళ్ళాడదీసిన ఆ లావాటి మోకుని కిందనుంచి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ‘ఒడిసి’ పట్టుకుని పైదాకా ఎక్కడం – దిగడం పీటీలో ఎటూ నేర్చుకున్నవాళ్ళమే. ఇప్పుడదే మోకుని ఈ బిల్డింగ్ కప్పుమీద ఒక రాడ్‌కి కట్టి, కప్పు అంచు మీదుగా, మొక్క పైనున్న కిటికీ మీదుగా జారవేశారు. దాన్ని పట్టుకొని వేళ్ళాడుతూ మొక్కని నరకాలి.
ప్లాన్ వరకు సరే. అమలు చేసేదెవరు?
“కిస్ మే హిమ్మత్ హై?” అన్నాడు భయ్యావత్ మా గుంపుని ఉద్దేశించి. ఎవరం మాట్లాళ్ళేదు.
యుద్ధంలో పాల్గొనడం వేరు, ఇలా చూర్లమీంచి వేళ్ళాడ్డం వేరు! వేళ్ళాడుతూ మొక్కలు నరకడం మరీ వేరు. ఈ యుద్ధంలో పట్టు జారడమంటే…
“కిసీ మే భీ హిమ్మత్ నహీ హై?” భయ్యావత్ రెట్టించాడు. “ఏం ఫౌజీలు మీరు? తిండికి తిమ్మరాజులు. అంతేనా?” వెక్కిరింపుగా అన్నాడు.
మా నిశ్శబ్దమే జవాబైంది.
“ఏంటి ఆలస్యం? వస్తున్నారా లేకపోతే…” ఈసారి జేసీవోలా తీక్షణంగా పలికాడు.
“సర్! హమ్ కర్తా హుఁ!” నా పక్కన నిలబడ్డ పీపీ ముందుకొచ్చాడు. అందరం అతడికేసి చూశాం – కొంత విస్మయంగా.
“శబాష్! చలో జవాన్! మీ యూపీ పేరు నిలబెట్టు!” అంటూ పీపీకి వీరతిలకం దిద్దాడు భయ్యావత్.
పీపీ సింగ్ కప్పు మీదికెక్కి, ఒడుపుగా మోకు పట్టుకొని నేర్చుకున్న పద్ధతిలో దిగుతూ, కిటికీ మీద కాళ్ళు ఆనించి ఆగాడు. మొక్క చేతికందే దూరంలోకి వచ్చేక, ఎడం చేత్తో మోకుని పట్టుకునే, నిక్కర్ వెనక దోపుకున్న మేదర కత్తిని కుడి చేత్తో తీసి, మొక్క వేళ్ళమీద మీద వేట్లు వేయసాగాడు. మనిషి కొంచెం బొద్దు కావడంతో, వేటు పడినప్పుడల్లా ఆ ఫోర్స్‌కి అతని శరీరమూ కుదుపుకి గురవుతోంది.
నిముషాలు గడుస్తున్నాయి. మొక్క గోడనుంచి మొరాయిస్తూ వేరుపడుతోంది.
భయ్యావత్ సంగతేమోకాని, చూస్తున్న మాకు చిరుచెమటలు పడుతున్నాయి. ఆ పని మేం చెయ్యనందుకు ఒక రకంగా అవమానంగానూ ఉంది. ఈ పీపీ రేపట్నుంచీ పోజు కొట్టచ్చు. అసలే కొంత పొగరున్న యూపీ ‘జాట్’.
ఉన్నట్టుండి మోకు ‘చిరచిర’మంది. మరుక్షణం పుటుక్కున తెగింది.
ఊపిర్లు బిగబట్టాయి. మేమూ, మాతోబాటు భయ్యావత్ కూడా ఫ్రీజ్! మొహంలో భయం – పడిపోతున్న ట్రైనీ గురించికన్నా, తన మీద పడబోతున్న ఎంక్వయరీ గురించి, చేతికందిన ప్రమోషన్ చేజారుతున్న ఆశాభంగాన్ని గురించి.
ముప్ఫయ్ అడుగుల ఎత్తునుంచి పీపీ సింగ్ పిండి బస్తాలా పడిపోతున్నాడు, చేతులు గాల్లో నిరర్ధకంగా ఆడిస్తూ.
బారక్ బిల్డింగ్ చుట్టూతా, బారెడు వెడల్పు చప్టా. దానిమీద పడితే ఎముకలు ఎండుకొమ్మల్లా విరుగుతాయి.
కొద్దిగా అటు పక్కన – బిల్డింగ్ గోడని ఆనుకుని ఆరడుగుల వెడల్పు రాతి మెట్లు. వాటిమీద పడితే పుర్రె పగిలి మెదడు వొలికి, అతని కథ జారిపోతుంది.
మా నోళ్ళలో తడారింది. భయ్యావత్ షాక్‌లో వణుకుతున్నాడు…
భయ్యావత్ ప్రమోషన్ ధరించాడు. మొట్టమొదటి లడ్డూ స్వయానా ఎవరికిచ్చాడో చెప్పక్కర్లేదు.
…ముప్ఫయ్ అడుగుల ఎత్తునుంచి పీపీ సింగ్ పిండి బస్తాలా పడిపోతున్నాడు. క్షణంలో అతని ఎడమ పిరుదు అలవని పైనుంచి వేగంగా గుద్దుకుని, అతని శరీరాన్ని గోడనుండి అడుగు-అడుగున్నర ఎడానికి గాల్లోనే జరిపింది. గిర్రున తిరుగుతూ పది మీటర్ల ఎత్తునుంచి, ఆరేడడుగుల ఎత్తున బురదలో వొత్తుగా పెరిగిన గడ్డిలో, వీపుమీద ధబ్బుని లాండయ్యాడు.
అందరం అటు పరిగెత్తాం.
అలవ తగిలిన చోట మాత్రం కొంచెం గీచుకుపోయిన గాయాలతో వారంరోజులు మిలిటరీ ఆస్పత్రిలో గడిపి. పీపీ సింగ్ హాపీగా తిరిగి రావడం అందరికీ తొందరగానే తెలిసిపోయింది.
పీటీ సెల్ ఇన్‌చార్జి చాలా కాజువల్‌గా – కొత్త, గట్టి రోప్ కాకుండా లోపలెక్కడో పడున్న, చీకిపోతున్న పాత రోప్‌ని ఇచ్చిన సంగతి మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియలేదు.
[*జాకో రాఖే సాఁయిఁయాఁ, మార్ సకే నా కోయ్: దేవుడు కాపాడే వాణ్ని ఎవ్వరూ చంపలేరు – కబీర్ దోహా.]