Rhapsody in Woods

Overture

(Or entr’acte after Vaidehi’s Bliss – A Musical)

నే స్థిరమ్ముగా ఉండేనీ జగత్తులో దేవా (స)
నే స్మితాస్యనై నిల్చేనీ శివారులో నాథా (రి)
నే రౌద్రమ్ముతో ఆడేనీ దిశాగ్నిలో రుద్రా (గ)
నే సితాత్మనై వేచేనీ హిమాలలో స్వామీ (మ)
నే సువాక్కునై నింపేనీ విరాళినే శూలీ (ప)
నే సరాగనై పిల్చేనీ నిశీధిలో నీశా (ద)
నే నశాంతితో వేగేనీ సమాధిలో శంభో (ని)
ఓ సదాశివా! సదాసదా కొల్చేమీ స్వరాలమై నిన్నే. (జేసన్ మార్టినావ్)

సప్త అప్సరసలతో సరసమాడి, ఆకాశమార్గంలో పయనించి, సప్తర్షులతో సంభాషించి, సప్తగిరుల పైగా, సప్తసాగరాలు దాటుతూ, సప్తద్వీపాలు గమనించి, వచ్చి కైలాసగిరి సమీపం లోని మానససరోవరం చేరిన, స రి గ మ ప ద ని హంసలు, కలువల మధ్యల విలాసాల ఈదులాడుతూ వారి రాగభరితములైన శరీరములను సప్తతాళములలో, పంచస్ధాయిలలో శోభిల్ల చేసుకుంటున్నవి.

సారమ్ములు మాదు వాద సంవాదములు, మా శ
రీరమ్ములు తరచు చేయు గగనసంచారములు, సిం
గారమ్ములు వరుస వరుస బంగరుగరులు, బహు సుకు
మారమ్ములు మా అటునిటు నడకలు, అరయ న
పారమ్ములు మాదు ఆనందములు, దివిజ మం
దారమ్ములు, మధువు, లాహారములు, సురగంగ
నీరమ్ములు హాయగు జారులాటలు; భావించ!
సంసారమ్ములు మావి, సదా శివుని మానసమందే!

-అంటూ తమను గురించి తాము తలపోసి, శివ ప్రసక్తి రాగానే, జగత్ప్రసిద్ధ శివగాథ స్మరణలోకి మళ్ళుతాయి.

సురలసురులు చిలుకునట్టి
పయోధిలో పుట్టి, పైపైకి లేచి
దిక్కులు దహించు ధగద్ధగ జ్వాలా
హాలాహలమును, జంబూఫలము లీల
గొంతులో హేలగా అదమగా;
ఆ అబ్బురము కన్న వేల్పులు ముదముగా
‘అద్భుత చరిత్ర! అత్యున్నతగాత్ర! గరళగళా,
హరా, భయహరా, శుభకరా, భళా!’
అని జేజేలు పలుకగా; వీరశృంగార రుద్రుని
చూసి పొంగిన సర్వమంగళ స్తనముల
పైనూగు మంగళసూత్రాలు
జ్వాజ్వలమానమై జ్వలియించు వేళా

ఉంటిమా స్వామీ! మేముంటిమా?
ఆ మహత్తర తరుణాన మేముంటిమా?
నీ సుతులు వినాయకుడు షణ్ముఖుడు
నీ ప్రమధులు, నీ నంది వాహనము
కంటిరా స్వామి! నీ సాహసమును
వారపుడు పొడగంటిరా!

మాకు నీ స్తుతి ప్రియమగు నెపుడు, కాని
ఈశ్వరా, భువి కిపుడు పోవాలి మేము;
గౌరితో నీవు గోప్యముగ మునుపు గిరి
పైన చెప్పిన ఒక కావ్య కథను, రుచిర
ప్రేమకథ, రామచరితము నిపుడు అడివి
లో స్వయముగ చూడాలిగా సామి మేము!

(అని పలికి, ఏడు హంసలు, వేగంగా మానస సరోవరం నుంచి ఎగిరిపోగా; తెర తీయబడుతుంది.)


అది చిత్రకూటం. కోసలరాజు ఆజ్ఞ చొప్పున అయోధ్య విడిచిన రాకుమారుడు రామునికి, రాకుమారి సీతకు, గంగానది దాటటం, ప్రయాగ చూడటం, భరద్వాజముని ఆదేశం అనుసారం చిత్రకూట పర్వతానికి వెళ్ళటం, అంతా మాయలాగా, కలలాగా ఉన్నది. ఆ పర్వతాలు మొదటి సారిగా చూస్తున్న రాముడు అత్యంతానందంతో అన్నాడు:

పంచభూతములు
అశ్రాంతము తొలిచిమలిచే ఈ
పాషాణాల శిల్పం, అసంకల్పిత సృష్టి.
మన అయోధ్య పట్టణపు ఆలయ,
గోపురాలు ఈ సృష్టిని సంభూషించే ప్రతిసృష్టి;
నిన్ను చూసి చేతనాల బొమ్మ!
అని కొండరాళ్ళు
భ్రమిస్తున్నవి సీతా! నీ అడుగు జాగ్రత్త!

రాగి, వెండి, బంగారు లోహాలతో మెరిసిపోతున్నవి ఆ కొండలు. కొండల నిండా చెట్లు, చెట్ల నిండా తిత్తిభ పక్షులు, క్రౌంచములు, కోకిలలు. ఘీంకరిస్తూ తిరిగే ఏనుగుల మందలు. క్రేంకారాలు చేస్తూ నటించే అందాల నెమళ్ళు. అక్కడి నదీ నీలవేణులు, తమ ప్రియునికై ఇలా ఆలాపిస్తున్నారు.

నే, చంచలా కుంతలనై
చంపక వృక్షాల వంపు దారిలో
మేఘాల వేగాల నీకేసి సాగివచ్చేటి వేళా
కేతకీ చాయల నా కోకలు
పతాకాలై గాలిలో ఎగిరేటి వేళా,
దేవరా! సాగరా! మహార్భటుల పన్నగవరా!
కామోదినై నీకు వినిపించనా! వంపుల
సాగారు నాగినిగ నీ కానాడు
కనిపించనా!

సంచరిస్తూ రాముడు, సీత -సాల, తాళ, తమాల, ఖర్జూర, పనస, అనాస, తినిస, పున్నాగులను; మర్రి, సల్లుకి, మామిడి, అశోక, తిలక, కేతక, చంపక, శ్యందన, గంధ, నిప, పర్ణశ, లకుచ, ధవ, అశ్వ కర్ణ, ఖదిర, శమి, కింశుక, పాటల వృక్షాలను చూస్తున్నప్పుడు, వాటినుండి యక్ష, నాగ, సిద్ధ, కిన్నర, కింపురుష గానాలు వినిపించేవి.

కనువిందులై కుప్పించి ఎగసి, ఒడలెంతొ పెంచి,
కుప్పలై లాక్షాపుష్ప గుచ్ఛములు
తొడుగులై, గొడుగులై, వింజామరములై లాగరి
గంధర్వగాయక సమూహమ్ములై, లా ఇలాహ ఇల్లల్లాహ్
అంటూ భూమ్యాకాశాలు కలిపి, తంబుర చెక్క భజనలు చేస్తు
గజ్జెలందియల చిందులేస్తున్నాయిగా రాగ ఆ
భోగి రామ ప్రభో! రాగ కళ్యాణి రామ ప్రభో!

ఆ ప్రాంతాల సరసుల తియ్యని నీరు తాగినప్పుడు, చెరుకు రసాలు కాని, విద్యాధరులు సేవించే మదిరని కానీ ఆ నీటిలో కలిపారా ఏమి! అని వారనుకునేవారు. అక్కడి చెట్ల పళ్ళు దులుపుకుని, గడ్డి ధాన్యాలు నలుపుకొని, తినేవారు. దర్భ దుబ్బులు పరిచి, మీద లేత ఆకులో, పువ్వులో దట్టంగా జల్లుకుని, నిద్రించేవారు. ఏడంతస్థుల మేడలోని పడక వైభోగం రాముడికిప్పుడు లేదే అని, ఒకరోజు సీత తనలో తాను ఆర్ద్రత చెందింది.

నిదురించు దాశరథి!
నా ఒడిలోనె నేడు.
కనులు తెరిచేవా, కనుల కలువల జంట
కనులు మూసేవా కలలలో నీకు
తుంగభద్రా తటీ నెమలి నాట్యాలంట.
నన్ను తెలియక మునుపు, ఎన్నెన్ని
నవ్వులో, నీవెన్ని భోగాలో;
నీ చిననాటి నావలు, నీ మాలిమి గుఱ్ఱాలు
నిదురలో నడుపుకో!
ఏ కాకి పొడిచినగాని నొప్పి తెలియగనీను
నిదుర చెరుపు నీకు కానీనులే,
రొమ్ముల మధ్య నీకు రాగమే తోచేను
మెలకువన, కలలోన,
నీకు నాకూ మధ్య రాగమే ఉండనీ;
తీయగా నిదురించు నీవు దాశరథి.


దండకారణ్యం ప్రవేశించిన తరువాత రాముడు, సీత, అక్కడి మొరటు సౌందర్యానికి బెదిరిపోతూ; జడుస్తూనే నడుస్తూ, నడుస్తూనే దర్శిస్తూ; విచిత్రపు పక్షుల, జంతువుల, జలచరాల నిరంతర వాద సంవాదాల సంకీర్ణపు ఆకస్మిక శ్రవణదర్శనాలకు, ఆవేశం, ఆవేగం చెందుతూ; నొచ్చక నొప్పించక తొలగిపోతూ; అడవి ఎంతో దట్టంగా బిగిసిపోయి, ఆకాశమే కనపడక, కాసింత వెలుగు కోసం, చంద్రుని వెన్నెల కోసం ఆరాటపడుతూ పాడుకున్న పాట:

రేరాజా!
సుధాపూర్ణ మనోజ్ఞా
నిశారమణీ మనసిజ!
మేఘమాలల నూగేటి
అగణితమగుమిణుకు తారకల నాయకమణి
చంద్రా!
జాహ్నవీ తరంగిణీ రాయంచ!
ఎటుపోతివిరా, కనరావు కదా
హృది నీది శశీ!

చెట్లు పలచబడి, తెరపిచ్చిన ప్రదేశాలలో, విశాలాకాశం దర్శనమై, సంధ్యాకాంత వారితో స్వయంగా మాటాడి, కాసేపు ఆటాడినట్లనిపించింది.

మాయా సంధ్యను, నేనొక
మహా సౌందర్యవతిని.
పసుపు ఎరుపుల కలబోత కాంతుల,
కుబుసాల మిసమిసల ఉడుపులు నావి
బంగారు పాశాల బంధించినా గాని
ఊగాడు నిడుపుల కేశాలు నావి
త్వరిత త్వరితములౌ ఊర్పులు నావి
చకిత చకితములౌ చూడ్కులు నావి..

సంధ్యాదేవి సౌందర్యానికి వారు ముగ్ధులయ్యారు. రాముడు ఆమెపై ఒక గీతం రచించుకుని, తరవాత కొన్నిసార్లు ఆమెను సన్నుతించేవాడు.

రాగ రాగిణివి నీవు
రమణీయ స్వర తరంగిణివి నీవు.
సంజ కెంజాయల మిసమిసల రాజ్ఞి!
సురభామిని!
గగనిలో, మగని జరజర సవ్వడి దవ్వుల వినిన
నాగిని వలె నువ్వూగి పోదువు.
విభుని గాఢపు కౌగిట,
సువ్వున కోకలూడిన కామిని వలె తూగిపోదువు.
జన మోహినివి నీవు.
జగమావరించి, అందరిని వరించి
నీ మత్తుల రంగుల మమ్మలరించి
మాయమవుదువో దివిలోన, నీవు రమణీ,
సుమధుర వాణీ, రస రాజ్య విహారిణీ,
సంధ్యా రాగరాగిణీ!

వాల్మీకి, శరభంగుడు, సుతీక్ష్ణుడు, అగస్త్యుడు మొదలగు మునులను, వారి ఆశ్రమాలను చూశారు. కొందరు మునుల వద్దకు, వారితో తత్వచర్చలకై, దేవతలు వచ్చిపోతుండటం వారు చూశారు. ఆశ్రమాలలోని పుష్పఫలభరితములైన మొక్కలు, మునులకు చేరికైన ఉడుతలు, కుందేళ్ళు, జింకలు; మునుల మంత్రోచ్చాటనలను అనుకరించి పాడే పెంపుడు కీరములు వారినెంతో ఆకర్షించాయి. ఐనా, ఆకస్మికంగా అరణ్యపు చిలకల గుంపులు అవతరించినపుడు, వారికదే దైవతాగణశ్రవ్యదర్శనం.

కిలకిలకిలకిలకికిలకిలకికిలకిలకికిలకిలకికిలకిలకికిల
రవాల, పచ్చని రంగుల, వెర్రెత్తిన వేగిర విన్యాసాల చిలకల,
ఈ మర్రి నుండి, ఆ రావికి, ఈ కొబ్బరి నుండి ఆ తాటికీ
గుంపులు గుంపులుగా ఎగురుతూ’
కొబ్బరాకులను గోళ్ళతో పట్టి, తలకిందులుగా
ఉయ్యాల లూగుతూ రంగుల తోకలు విప్పుతూ ముడుస్తూ
అందాల రెక్కలు అల్లారుస్తూ, ఈలలు వేస్తూ గిరికీలు కొడుతూ
సాయంత్రపు గాలి, ఆకాశపు అందం
మస్తుగా తాగి అదుపుమదుపు లేకుండా ఎగిరే చిలకల
కిలకికిలకకాకికీకుకూకెకేకైకొకోకౌకృక్రూక్లుక్లూకికిలకికిలకిలకిల.

రుషులను చూడటానికి వారి ఆశ్రమాలకు దేవతలు వచ్చినట్లే, ఆ అరణ్యంలో సీతారాములను చూడటానికి, జగత్తులోని పూర్వపరాలలోని ప్రేమికుల జంటలు – జూలియట్ రోమియో; ముంతాజ్ షాజహాన్; పార్వతి శివుడు; లైలా మజ్నూ; వీనస్ అడోనిస్; క్లియొపాట్రా ఏంటొనీ; భాగ్యమతి కులీకుతుబ్ షా; ఎంకి నాయుడుబావ; ఎలిజబెత్ ఫిలిప్; జేన్ టార్జాన్; హెలెన్ పారిస్; అనార్కలి సలీమ్, మరియా వాన్ట్రాప్ -ఎందరెందరో ఆ చుట్టు పట్ల చరించారేమో మరి! సంహిత నుండి విచిత్రంగా ఉల్లాసపు గానాలు, నృత్యాల ధ్వనులు వినిపించేవి.

చాందినీ రాత్రులు
ఇసుక తిన్నెల శయనాలు
శీతల మధువుల సేవనాలు, రఫీ
శృంగార సురగీత ఏకాంత శ్రవణాలు
అమీర్ ఆలీ గంభీరగాత్ర రవణాలు
రాతిరి పొడవు సుఖముగ సురతాలు-
మాకుండగ, సురలోకానికి మేము
మరలుట దండగ!

బాఖస్ మెచ్చు ద్రాక్షాసవమ్ము! అడోనిస్ ఈర్ష్య గొను
మెత్తని తల్పమ్ము; వనమున కిసలయమ్ములు మెసవి
మెచ్చి, హెచ్చుగ పిక్కటిల్లు పికముల కలకలమ్ము;
వల్లమాలిన ఈ అందాల వనసౌధము, ఉమ్రావ్ జాన్ అదా
గజల్, గజ్జెల, ఘల్ మేల్, మాదక-తా-వరమ్ము ! నీ పై ఆన!
ఇలపై ఉండనీ! ఉండనీ! మమ్మీ మధుచ్చాయల, ఇలా, అల్లాహ్!

గోదారి గంగలో కొంగు కొంగూగట్టి
కరువుతీరా బుటక లేదామా
సరిగెంగ తాణాలు సేదామా
రామన్న రాముడో యందామా
రామకతలే పోయి యిందామా
(సుబ్బారావు)

జరీ చోళీ చమ్కీ ఘాఘరాలూ,
జల్తారు జగ్ఙగ్ దుపట్టాలు
నాజుక్ నగిషీల కంకణాలూ
ఘల్ ఘల్ పాయల్ పాంజేబులు
తళుక్ చడావులు దాల్చి భాగమతిని నేనుంటి
కుతుబ్ కౌగిలిని కరుగుట
అతని తియ్యని పార్సీ కవిత
ఖులీ ఖులియత్ వినుట,
జరుగునో జరగదో!
ఏమగునో, ఏమగునో, నా భాగ్యమెట్లున్నదో.


అడవులను తెలుసుకుని సప్రశ్రయముగా మసలటంతో, కాలక్రమాన రామునికి వృక్షసమూహం, జంతుజాలం, పక్షిగణాలు అన్నీ స్నేహితులయ్యాయి. కోతులు వారికి, ముందూవెనకలుగా చెట్లలో ఎగురుతూ, ఎన్నో సందేశాలు పంపేవి. ఏనుగుల మందలు అతడి చుట్టూ తిరిగేవి, పులులు, చిరుతలు, అతనిని ఒరుసుకుని పరుండేవి. ఒక పులిని ఓ రాత్రి నిమ్మళంగా నిమురుతూ రాముడిలా అడిగాడు.

పులీ, పులీ, బెబ్బులీ! చీకటిరాత్రుల అడవుల
మెరిసే మెసిలే భగభగ అగ్నిజ్వాలా!
ఏ అభయ హస్తం, ఏ అనిమేష నేత్రం
చేసిందమ్మా నీ భయానక సమసౌష్టవం? నీ కంటిమంటని కాల్చింది
పాతాళంలోనా, లేక వ్రేల్చింది
సుదూరపు ఆకాశంలోనా? ఎంత ధైర్యంతో ఆ చెయ్యి నీ అగ్నిని మలిపేనో?
ఎంత బలుపు రెక్కలతో ఎగురుతూ అతడు నిను పోత పోసెనో?
(బ్లేక్)

చెంచులతో, కోయలతో, భిల్లులతో -వారి మాదిరిగా అలంకరించుకుని సీత, రాముడు నృత్యాలు చేస్తున్నప్పుడు, చుట్టుపక్కలలో ఎగురుతూ, ఎలుగులు, ఖడ్గమృగాలు, పందులు, దున్నలు, వారి సంగీత నృత్యాలు ఆనందించేవి. అడవి జీవితం క్రమాన వారికి భయరహితంగా, సుఖప్రదంగా మారిపోయింది. అడవిలో ఉన్నా, అయోధ్య రామునికి ఉదయపు మేలుకొలుపులు, రాత్రి జోలలు అలవాటన్న విషయం సంహిత మంత్రవీణ మరువదు.

పక్షులార! పలకండీ కలకల
పువ్వులార! పుయ్యండీ జలజల
ప్రాక్కున అర్కుడు ప్రాణదాతయై
ప్రసరించెను
సుబ్బులక్ష్మి సుప్రభాత గీతికలు
గాలుల తేలెను
చిట్టిబాబు వీణియలవిగో వినరే!
దిక్కుల మ్రోగెను దివ్యముగా!

జోలపాట పాడేవా, యొహానస్ బ్రామ్స్!
సర్వలోకానికి లాలిపాట పాడేవా!
గగ।పా గగ।పా గప।స· ని ద।ద ప· రిగ।
మ రి రిగ।మా రి।నిద ప ని।సా· స।
సా· దమ।పా స।మ ప ద।పా సస।
సా· దమ।పా స।మపమ గ రి।సా,।
రుచిరవములతో, వరవీణా మృదుపాణీ
ఎత్తుగడ రవంత స్ఫురణముతో, సొగసు
జోల కూర్చావా యొహానస్! శాబాస్!

ఈ రాజారాముడిని కలుసుకోటానికి, అతని కథలో భాగమవటానికి, అడవులలో ఎక్కడెక్కడో నివసిస్తున్న ఎందరికి, ఎన్నిరకాల జీవులకు తహతహలో! అట్టి వారిని గురించి సంహిత మంత్రవీణ ముందుగానే సూచించేది.

వడిగ రావో అయ్యా!
పరమ దయాళువు అల్లవో
అట! వాసిగ అయోధ్య నుందువో
తరలి రావో అయ్యా!
నట్టడవిలో శబరినై పరంగేనే
ఒణ్ణాలు శయ్యలు తరుంగేనే
సామీ! మనసా దరిసించే వేళయ్యేనే
కళ్ళై కరిగేనే, చరణం కడిగేనే
వల్లె? వరదా! శబరి
తాపము, పాపము తీర్చవే
వడిగ రా రామయ్యా!

వెడద భుజములవాడ! వెలుగుల మోము వాడ!
ఎక్కడుంటివి యోధ! నీకై ఎదురుచూచె నిట కిష్కింధ.
అద్దమని, చంద్రుడని; యాగమని, రుషి యని; రాయి యని
రమణియని; ధనుస్సని, ధరణిజ యని; మత్సరమని,
మంధర యని; ఆజ్ఞయని, అడవియని; నావయని, గుహుడని
ఆ కథ ఈ కథ నెపమిడి అన్నివేళల, మే మెన్నగాను
తలచేది నిన్నె గాదటయా, రావయా రామ! కిష్కింధకు.


పంచవటిలో ఉంటుండగా, రుతువుల మార్పులను బట్టి సీత, రాముడు –రేగులు, నేరేడులు, జామ, మామిడి, సీతాఫలాలు, రామాఫలాలు, సీమచింతలు, కొబ్బరులు, తాటిపండ్లు, సేకరించి తినేవారు. చిలగడదుంపలు, కంద, చేమ, ముల్లంగులు, తేగలు తవ్వుకుని చితుకుల మంటలపై కాల్చుకుని తినేవారు. అక్కడ ఎన్ని హంసలు, కరందవ, చారవాక పక్షులు. లేళ్ళ మందలు! మందాకిని నది ఒడ్డుల ఏళ్ళ విజ్ఞానం కల తాబేళ్ళు, మొసళ్ళు! మందాకినిలో పాదాలు గిలిగింతలు పెట్టే ఎన్నెన్ని రంగుల చేపలు. ఎన్నెన్ని నీలి, ఎర్ర కలువలు! సీతారాముల పంచవటీ నివాస సుమాళమిది:

వాన వచ్చెను చినుకు చినుకుగ
వెచ్చని ఆవిరిలు లేచె నొక్కసారిగ
కమ్మని మట్టి వాసనలు
గాలిలో చుట్టి చుట్టి తిరిగేను.
వాన వచ్చెను జల్లు జల్లుగ
ఊగెను చెట్లు, ఉమ్మెతలు జలజల
పూలు రాల్చినవి.
వాన వచ్చెను ధార ధారగ
పాయలై జారి పోయెను
పరచిన కొండరాళ్ళ మీదుగా.
మందాకినిలో నేను కలువనై
వానలోనే జలకమాడితినిగా.

రావో! రాగమయీ!
రాగదే -దీపక రాగ రాగిణీ!
ఎదరంత నే చూచునందాక ప్రేయసీ
ఆది అంతము లేని ఈ అందాల వారాశి,
రావో పూరాసి! నన్ను దయచూడవో!
ఉప్పొంగు ఈ అలలు, అలలపై మిలమిలలు
మిలమిలల వెంట ఈ నురుసుల మిసమిసలు
చప్పున రావో చూడగ, చెప్పలేని ఈ కాంతులు.

ఆ ఎండ చూశావా! ఆ బంగారు ఎండ అలా కురుస్తూ
అది మన పొద మీద ఎందుకు మెరుస్తుందో!
అబ్బా! కష్టమయ్యా రామా! ఈ ఎండ నీడల గంతులను
ఆ ఆకు మీదా ఈ పూల రేకు మీదా దూకుతూ
తీగ తీగ చుట్టూ జాళువా జలతారు అల్లుతూ
ఆటలాడే ఆ కిరణాల గిలిగింతలను పట్టటం.

ఈ దొంతరలు, ఈ పూల మీద పూలు, మధ్యలో ఒత్తొత్తుగా మొగ్గల గుత్తులు
చూస్తుండగానే ఈ ముద్దు మొగ్గలు ఠప్ ఠప్ మని, చిట్టి ఎర్రజేగురుపువ్వులైతే
నా ఉద్రేకాలు చిట్లిపోతున్నాయి రామా!
నన్ను సంబాళించాలయా!
ఈ పూల జొంపము,
ఈ ఆకుల చురకత్తులు నన్నిప్పుడు గాయపరుస్తున్నాయి.
రావో! రక్షించవో!

ప్రతి పువ్వుకూ పల్చని ఐదు రేకులు.
ఆ కింది ఐదో రేకు, ఆ రంగ రంగేళీ పెద్ద రేకు,
అహా, ఆ మెత్తని పానుపు మీదికి వచ్చి వాలే రసికులు
ఆ బంగరు పూతల సొరంగాలు చూశావా? సీతా! ఒహో
వాటిలోనుండి కైవారాలు చేస్తూ, రంగులు చిమ్ముతూ
స్వయంగా ఒక్కొక్క సరసుడికీ స్వాగతం చెపుతూ
ఆ వందల వందల పూల మందిరాల,
అంత:పురాలలోకి వారిని వెంటబెట్టుకుని తీసుకు వెళ్ళే సౌరభాలు!


రాముడు ఎప్పటికప్పుడు, విల్లు వలె ఉండి తీగలమర్చినవి; వరుసగా పేర్చిన వెదురులున్నవి; ఎండిన గింజలు నింపి గుమ్మడిబుర్రల, సొర కాయల వాద్యాలు; వెదురుబొంగులూ, రాళ్ళూ అల్లిబిల్లిగా తీగలతో కలిపిన, గాలికి కదిలి మ్రోగే వాద్యాలు, తమ కుటీర ప్రాంగణాలలో అమర్చేవాడు. అవి అడవిజంతువులకూ, జలచరాలకూ, అడవి మనుషులకూ కూడా విస్మయానందాలు కలిగించేవి. ఎవరికి తోచినప్పుడు వారు, ఆ బహిరంగపు సంగీత శాలలకు ఏ అభ్యంతరాలు లేకుండా వచ్చిపోయేవారు. అడవి చల్లగా సంగీతరామరాజ్యం అయింది.

సంబరాలు, సంబరాలు!
అంబరమే వంగి మమ్ము
చుంబించెనదె చాలు!
కలదొక దేవ రహస్యమని
చెవినూదె నదె పదివేలు!
సొగసైన ఈ ఆంగణమున సంగీత
ఝరులు ప్రవహించునంట!
వ్యధల కిట ఇంత వ్యవధి లేదంట
ఆనందాలకు అవధి లేదంట.
సంబరాలు, సంబరాలు.

ఇలా వారంతా ఆనందంగా ఉండగా, పంచవటిలో ఈ సంగీత ప్రాంగణంలో, ఒకరోజు రాముడిని చూసి, వెనువెంటనే మోహించి, వివాహము, పొందుకోరిన ఒక అందాల సుందరి, పాడుతూ అతని ముందు నర్తించింది.

ఎగసి మురిసే మనసు
ఎగిరెడి కపోతముర
సొగసు విరిసే వయసు
అగరు ఎరుపేలే!
ఎగిరి మెరిసే కురులు
ఎగయు మొయిలే యగును
పగిది పసిమే గదర
మగువ ముఖబింబం!
మగువల కపోలములు
చిగురు చిగురాకులుర
పొగులు మదనాతురలు
మొగిలి పొదలేరా!
పొగరు ఎలనాగ జిగి
జిగి బిగిల కౌగిలిలొ
తగిలి తనువే రగిలి
మగుడి వలచేవో!
నగవు పరిహాసములు
బిగువు చెలగాటములు
తగవు కొరకే కదర
రగులకుము రామా!
తగని బులపాటములు
తెగని తగలాటములు
మగడి కొరకే ఎపుడు
వగల రఘురామా!

రాముడు ఆమె నృత్యాన్ని, అందాన్ని ప్రశంసించి, సీతను ఆమెకు చూపించి, “ఈమె నా సర్వస్వం. ఈమె ఉండగా నేను నిన్ను మనువాడలేను, క్షమించు” అని, ఆమెతో గౌరవంతో చెప్పి పంపివేస్తాడు. ఆ ఉదంతం అంతా చూసిన, ఆ చుట్టుపక్కల అరణ్యజీవులు -ఆ స్త్రీని మాయా రూపిణి రాక్షసి శూర్పణఖగా, రావణుడి చెల్లెలిగా గుర్తించి, రాముడికి పెద్ద ప్రమాదం తప్పినందుకు బహురీతులుగా సంతోషించారు.


ఇక కథ స్థిరమగులే, జగతిలో నిజముగా!
రఘువరునిచరితమునే పదముగా పలుకగా
మధురసభరితములై వినుదురే జనులదే;
అవని లో అడవి లో, గిరుల లో తరుల లో
కుహు కుహు కుహు గళిత గళరవములలో
తపములో జపములో మునిజనగణమనముల
వినబడే ప్రణవమై, ధరణిజ ప్రణయమే పఠనమై
ఇక కథ స్థిరమగులే! జగతిలో నిజముగా. (బీథొవెన్)

(తీపికథ, రామకథ, ప్రేమకథ, కావ్యకథ -అంటూ పాడుతూ సప్తహంసలు, మానస సరోవరం కేసి ఎగిరిపోతుండగా-)

[Curtain]


Composition: Lyla Yerneni
Opera, Ballet Tutors: The Russian Greats, T.K. Desikachary
Forest Scenery: Poet Valmiki