ఏకాంతం, శూన్యం

పొద్దున్నే ఎవరో పాడుకుంటూ వెళ్ళిన పాట మనసును కలచివేస్తూంటే తన స్నేహితుడైన మౌద్గల్యయానుడిని కలుసుకుని దాని గురించి మాట్లాడ్డానికి బయల్దేరాడు శారిపుత్రుడు. స్నేహితుడి ఇంట్లో ఏమీ ఉపోద్ఘాతం లేకుండా చెప్పాడు తాను విన్న సంగతి.

“నేను పూర్తిగా వినలేదు కానీ ఈ రెండు పాదాలు ఒక్కసారి నన్ను తట్టిలేపాయి. నీతో చెప్దామని వచ్చాను; విను ఇదిగో.

ఏవం కంఠగతః ప్రాణం విదిత్వా శాసనం మునేః
బలకాలం మలానాం చ న ప్రమాద్యం ముముక్షుభిః

అధ్యాత్మిక రంగం తీర్థక స్వామిలాంటి వాళ్ళ వల్ల గందరగోళంలో ఉందనే సంగతి మనం చూసిందే కదా. అనేకమంది అల్పమేధావులవల్ల అది రోజురోజుకీ దిగజారుతూ కొన ఊపిరితో కొట్టుకుంటూంది. అందువల్ల ముముక్షువులారా ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త పడండి. ఇది వినేసరికి మనసులో అలజడి. కొంతకాలం నుంచీ మనం వెతుకుతున్నా వెంఠనే ఏదో కంగార్లో తొందరపడి ఎవర్నో గురువుని పట్టుకోవడం కంటే సరిగ్గా సమయం వచ్చే వరకూ వేచి చూడ్డం మంచిదేమో?”

“నిజమే ఇప్పటివరకూ మనం ప్రయత్నం చేశాం కానీ ఎవరూ మనకి నచ్చినవాళ్ళు లేరు. ఉరువేల కాశ్యపుడు, వారి అన్నదమ్ములూ కొంతమంది శిష్యుల్ని పోగుచేసి ఏదో చెప్తున్నారుట కానీ మనకి వాళ్ళ పద్ధతులు నచ్చకపోవచ్చు. మనం ఇద్దరం అధ్యాత్మిక రంగంలో ఒకేదారిలో వెళ్దామనే నిశ్చయం చేసుకున్నాం కనక ఓ నియమం పెట్టుకుంటే మంచిదేమో?”

“ఏమిటా నియమం?”

“మన ఇద్దర్లో ఎవరికి మంచి గురువు గురించి తెల్సినా వెంఠనే ఇద్దరం కలిసి వెళ్ళి ఆయనతో మాట్లాడదాం. ఒకసారి మన ఇద్దరకీ నచ్చితేనే సన్యసించవచ్చు. అలా ఒకరికొకరు తోడుగా ఉండొచ్చు.”

“అలాగే చేద్దాం. నా దగ్గిరకి ఎవరొచ్చినా వాళ్ళని అడుగుతూనే ఉంటాను. ఏదైనా తెలిస్తే ముందు చెప్పేది నీకే.”


జనం మాట్లాడేవన్నీ వినకుండా తానేదో తనలోకమేదో అన్నట్టూ హుందాగా నడిచిపోతున్న అశ్వజిత్‌ని చూడగానే శారిపుత్రుడికి ఏదో ఆకర్షణ కనిపించింది. కాస్త దూరం ఆయన వెనకనే నడిచి జనసమ్మర్దం లేనిచోట ఆయనతో మాట కలిపాడు.

“మీ నడవడి, మొహంలో వర్ఛస్సూ చూస్తే మీరు ధన్యాత్ములలాగా కనిపిస్తున్నారు. మీ గురువు ఎవరో తెలుసుకోవచ్చా?”

“మా గురువు గౌతమ బుద్ధుడు.”

“నేను కూడా సన్యసించడానికి ఒక గురువుకోసం వెతుకుతున్నాను. మీ గురువు బోధన ఎటువంటిది, ఆయన ఎటువంటివార్ని తనదగ్గిర చేర్చుకుంటాడనేవి చెప్పగలరా?”

“నేను సన్యసించి చాలాకాలం అయినా ఆయన గురించి ఇంకా బాగా మననం చేసి తెలుసుకోవాల్సి ఉంది. ఒకప్పటి యువరాజైన గౌతముడు సన్యసించాక తపస్సుతో బుద్ధుడు అయిన ఆయన పరమ గంభీరులు. ఆయన బోధనలు చాలా జాగ్రత్తగా ఒక్కొక్కరికీ సరిపోయే విధంగా ఉండడం గమనించాను. గాయం కాకుండా కిందపడిపోకుండా పులి తన పిల్లలని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తుందో అలాగే ఉంటుంది బుద్ధుడి బోధన. ఆయన బోధనల్లో గుణవిశేషం అందినట్టే అంది అందకుండా పోతున్నట్టు ఉంటుంది. కానీ మీరు అడుగుతున్నారు కనక నాకు అర్థమైనంతలో చెప్తాను వినండి.

హే ధర్మా హేతు ప్రభవా హేతుం తేషాం తథాగతోహ్యవదత్*
తేషాం చ యో నిరోధో ఏవం వాదీ మహాశ్రమణః

ధర్మాలనేవన్నీ ఏ కారణం వల్ల ఉత్పన్నమౌతున్నాయో ఆ కారణాలని, వాటిని నిరోధించే విధానాలనీ చెప్పాడు మహాశ్రమణుడైన తథాగతుడు.

తాను చెప్పినది విని నిశ్చేష్టుడైన శారిపుత్రుణ్ణి అక్కడే వదిలేసి అశ్వజిత్ ముందుకి సాగిపోయాడు.


ముందు పెట్టుకున్న నియమం ప్రకారం, శారిపుత్రుడు తాను అశ్వజిత్ దగ్గిర బుద్ధుడి గురించి విన్న విషయం మౌద్గల్యయానుడితో చెప్పాడు ఆ రోజు. ఇద్దరూ కలిసి చర్చించారు చాలాసేపు బుద్ధుడి విషయం, దుఃఖాలకి కారణం కనుక్కోవడం, ఆ కారణాలకి అంతు చూడడం అనే విషయాలు. తేలినదేమంటే వైద్యుడెవరైనా చేయవల్సిన పని ముందు రోగాన్ని గుర్తించడం. ఆ తర్వాత ఆ రోగం నిర్మూలించే చికిత్స ప్రారంభించడం. ప్రస్తుతం ఉన్న అధ్యాత్మిక గురువుల్లో ఈ పని చేస్తున్నవారెవరూ ఉన్నట్టు లేరు. అశ్వజిత్ వాక్యాల ద్వారా బుద్ధుడి గురించి విన్న విషయం వేరుగా ఉంది. దుఃఖానికి కారణం శోధించడం, ఆ తర్వాత ఆ కారణం నిర్మూలించడంతో చికిత్స పూర్తౌతోంది, మంచి వైద్యుడు రోగికి స్వస్థతని కలిగించే విధంగానే. ఓ సారి బుద్ధుణ్ణి కలిసి మాట్లాడితే తామే తెలుసుకోవచ్చు ఈ విషయం.


భగవానుడు రాజగృహం వస్తున్నాడనే వార్త శారిపుత్రుడు మొదటసారి విన్నది బింబిసారుడు బుద్ధుడిని ఆహ్వానించి వేణువనాన్ని దానం చేసినప్పటి సమయంలో. వెంఠనే తాను విన్న వార్త మౌద్గల్యయానుడికి చేరవేశాడు. బింబిసారుడి మనుషులు బుద్ధుణ్ణి ఒక్కణ్ణీ రాజగృహానికి పిలిస్తే కాశ్యపసోదరులకి కోపం వస్తుందేమో అనుకుంటూ వెళ్ళారు కాశ్యపసోదరుల అనుమతి కోసం. అప్పుడు వాళ్ళు చెప్పినది విని బింబిసారుడి మనుషులు నోళ్ళు వెళ్ళబెట్టారు. ఇంతకీ వాళ్ళు బుద్ధుడి గురించి చెప్పినది ఇది: ‘మేము ఒకప్పుడు అధ్యాత్మిక గురువులమని అనుకున్నాము కానీ బుద్ధుడు ఒక మహోజ్వలమైన అగ్నిహోత్రమైతే మేము అక్కడ తిరిగే మిణుగురు పురుగులవంటివారమని అర్థమైంది.’ బుద్ధుడు ఇంకా రాజగృహం రాకుండానే తెల్సిన మరో ఆశ్చర్యమైన విషయం – కాశ్యపసోదరులందరూ, వారి వేలమంది శిష్యులతో సహా ఇప్పుడు బుద్ధుడి అనయూయులు కావడం.

తనని కలవడానికి శారిపుత్రుడు, మౌద్గల్యయానుడు వస్తూంటే దూరం నుంచి చూడగానే బుద్ధుడి మొహంలో చిరునవ్వు, ఒక రకమైన సంతోషం – తాను చెప్పేది విన్నాక అక్కడికక్కడే సన్యసించేవారి సంగతి తాను ఎరిగిందే – వాళ్ళది ప్రథమోత్సాహం. అది మెల్లిగా నీరసించి పాతవాసనలతో మామూలుగా కావొచ్చు. ఈ సన్యసించిన వారిలో మళ్ళీ కొంతమంది ‘కంగారు పడ్డామేమో, పెళ్ళాం పిల్లల్ని వదులుకోకుండా ఉండాల్సిందేమో?’ అనుకునేవారు. కొంతమంది కష్టపడి అర్హులౌతారేమో, మరికొందరు నిజంగా ప్రయత్నం చేసినా విజయం సాధించలేకపోవచ్చు. ఇప్పుడొచ్చే ఈ ఇద్దరూ వేరని తెలుస్తూనే ఉంది. వీళ్ళకి తాను చెప్పేది అర్థమై అర్హులైతే తాను చెప్పదల్చుకున్నది మరింతమందికి మేలు చేయగలదు. దగ్గిరకి వచ్చిన ఇద్దర్నీ ప్రశ్నించాడు.

“ఏమి ఇలా వచ్చారు?”

“కొంతకాలం నుంచీ మేం స్నేహితులం; ఇద్దరం సాధన చేస్తూ ఓ గురువు దొరికితే సన్యసించాలని అనుకుంటున్నాం. మీ బోధనలు విన్నాక కాశ్యపసోదరులు తమ తమ శిష్యులతో సహా మిమ్మల్ని అనుసరించడానికి మీ మార్గంలోకి మారారని విని మిమ్మల్ని చూడవచ్చాం.”

“నా దగ్గిరకి వచ్చేవారిలో క్షత్రియులు, క్షురకులు, వైశ్యులు, బ్రాహ్మణులు అలా అనేకమంది కులాలవారు ఉంటారు. ఓ సారి సన్యసించగానే కులం అనేది తుడిచిపెట్టుకుపోవాలి మనసులోంచి. విహారంలో కానీ బయట కానీ అందరం కలిసే ఉండేది. ఎవరి పక్కన ఎవరు పడుకుంటారో, ఎవరు ఎవర్ని ముట్టుకుంటారో అనేవి మనసులోకి రాకూడదు. మడీ ఆచారం అనేవి లేవు. నా దగ్గిర ఉన్న మంత్రం ఒకటే – ధర్మం ఒకటే తెలుసుకోతగ్గది. దానికోసం అహంకారం విడిచిపెట్టాలి. మానవజీవితం కన్నా పైమెట్టులో ధర్మం, అధ్యాత్మిక సూత్రాలు అనేవి మాత్రమే మనం చేరుకోవాల్సిన గమ్యం. వీటికి మనసా వాచా కర్మణా కట్టుబడి ఉండగలరా?”

“తప్పకుండా ఉండగలం. సన్యాస జీవితం అంటే తెల్సినవారమే.”

“నేను మీకు ధర్మం తెలుసుకోవడానికి దారి అయితే చూపించగలను కానీ ఆ ధర్మాన్ని తీసుకొచ్చి అరచేతిలో పెట్టలేను. సాధన చేసి అర్హులవడం – ఉద్ధరేదాత్మనాత్మానం – అనేది మీ చేతిలో పని. దానికి మీరు సిద్ధమేనా?”

“సిద్ధమే!” స్నేహితులిద్దరూ చెప్పారు ఏక కంఠంతో.

సాధారణంగా తన దగ్గిరకి వచ్చి అడిగినవారికి, ఉపాలి అనే క్షురకుడికీ కూడా ఇటువంటి ప్రశ్నలేమీ లేకుండానే సన్యాసం ఇచ్చిన భగవానుడు శారిపుత్ర, మౌద్గల్యయానులను ఇలా ప్రశ్నలు వేయడం అక్కడే ఉన్న ఆనందుడికి ఆశ్చర్యం అనిపించింది.

“సరే అయితే. ఈ అరటిపళ్ళు చెరి ఒకటి తీసుకోండి. వాటిని పట్టుకెళ్ళి శూన్యంలో కాని, రహస్యంగా కాని, ఏకాంతంలో కానీ తిని రేపు మరోసారి కనిపించండి. మీ సన్యాసం గురించి మాట్లాడదాం.”

వెళ్ళిపోతున్న ఆ ఇద్దర్ని చూస్తూ ఆనందుడు అడిగాడు భగవానుణ్ణి, “సన్యాసం తీసుకోవడానికి వచ్చేవారిని ఎప్పుడూ ఏమీ ప్రశ్నలు అడగని మీరు ఈ రోజు ఇలా అనడం వింతగా ఉందే, ఏమిటో ఈ అరటిపళ్ళ సంగతి? వీళ్ళిద్దరికీ మీరు పెట్టే పరీక్షా?”

“వీళ్ళిద్దరూ చాలా నిజాయితీగా మాట్లాడ్డం చూస్తే చిన్న పరీక్ష పెట్టి చూద్దాం అనిపించింది. రేపు తెలుస్తాయి మిగతా విషయాలు,” చిరునవ్వుతో చెప్పాడు తథాగతుడు.


మర్నాడు శారిపుత్ర మౌద్గల్యయానులు వచ్చాక అడిగాడు భగవానుడు తానిచ్చిన అరటిపళ్ళ సంగతి. మొదటగా నోరు విప్పినది శారిపుత్రుడే. తనచేతిలో ఉన్న అరటిపండు చూపిస్తూ చెప్పాడు.

“మీరు చెప్పినట్టూ రహస్యంగా కానీ ఏకాంతంగా ఉండే చోట అరటిపండు తినడం అసాధ్యమైంది. ఈ లోకంలో రహస్యంగా ఉన్న ప్రదేశం, ఏకాంతంగా చేసే కర్మ అంటూ ఏదీ లేదు. దేవతలు, ఋషులు, మునీంద్రులు మొదలైనవారి దివ్యచక్షువులకి కనపడకుండా ఉండేది ఏమీ లేదని నాకు తోచింది. ఏదో విధంగా నేను చేసేది ఎవరికీ కనిపించకపోయినా, మీరు చెప్పే అణువణువునూ శాసించే ధర్మసూత్రాలకి గోచరం కానిదేదీ ఉండబోదు కదా. ఇంక రహస్యంగా తినడం అసంభవం అనిపించింది. ఇదిగో ఈ పండు ఇంకా నా దగ్గిరే ఉంది.”

భగవానుడు తనకేసి చూడడం గమనించి మౌద్గల్యయానుడు చెప్పాడు తన వంతు సమాధానం, “నాకు తట్టినది కూడా ఇదే విషయం. రహస్యంగా తినడం సంగతి అలా ఉంచితే ఈ పండు శూన్యమైన చోట తినమని అన్నారు. శూన్యమైన ప్రదేశం నాకు కనిపించలేదు. శూన్యము అంటే ఎవరూ లేనిచోట అని అర్థం చెప్పుకుంటే ఎవరూ లేకపోయినా ఆ ప్రదేశంలో నేను ఉన్నాను కదా అది అశూన్యం కావడానికి? నేను చేసే పని ఇతరులెవరూ గమనించకపోయినా నేను చేసే చర్యలు నాకు తెలిసే ఉంటాయి కదా. అందువల్ల నేను కూడా మీరు చెప్పినట్టూ ఈ పండు తినలేకపోయాను.”

భగవానుడు చిరునవ్వు నవ్వాడు ఇద్దరూ చెప్పినది విని. ఆ రోజే శారిపుత్ర మౌద్గల్యయానులకు సన్యాసం ఇవ్వబడింది. కేశఖండనం, కాషాయ వస్ర్తధారణ అయ్యాక బుద్ధుడు ఆనందుడితో చెప్పాడు, “రాబోయే రోజులలో వీళ్ళిద్దరూ నా ముఖ్యశిష్యులై ధర్మం గురించి మరింత ప్రచారం చేయబోతున్నారు.”

“భిక్షుసంఘం అనాథ కాకుండా కాపాడేది వీళ్ళేనా?”

“లేదు, లేదు. అందరికీ అనుసరణీయమైనది, భిక్షుసంఘం అనాథ కాకుండా కాపాడేది ఏనాటికీ మారని ధర్మం ఒకటే, క్షణికంగా ఈ రోజు ఉండి రేపు పోయే మనమెవ్వరం కాదు.” భగవానుడు స్థిరంగా చెప్పాడు సమాధానం.


[*ఈ శ్లోకం బౌద్ధ సాహిత్యంలో అన్నింటికన్నా ప్రసిద్ధమైనది. ధర్మం అనేదానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఇందులో వాడిన అర్థం ప్రకారం – మనలో జరిగే ఇంద్రియాల వల్ల కానీ మనసు వల్ల కానీ కలిగే ప్రాపంచిక అనుభవం లేదా అలజడులు. ఈ అనుభవాలన్నీ చివరకి కలిగించేది దుఃఖమే. కానీ భగవానుడు కనుక్కుని ఉద్బోధించిన ధర్మం అనేది వేరు. అది ఒక పదార్థం కాదని, కొన్ని ఏనాటికీ మారని, ఏ తర్కానికీ అందని, ప్రతీ అణువునూ శాసించే అధ్యాత్మిక సూత్రాలనీ అంటారు. బుద్ధుడు కనుక్కున్నదే బ్రహ్మమని రమణులు, రామకృష్ణుల వంటి మిగతావారు చెప్పడం వారి వారి బోధనలలో గమనించవచ్చు. దీన్ని బట్టే మనకి తెలుస్తున్నది ‘ఏకం సత్ విప్రా బహుధావదంతి’ అనే శ్రుతి వాక్యం; భాగవతంలో శుకమహర్షి చెప్పే ‘హరి మయము విశ్వమంతయు…’ శివానందుల మాటల్లో అయితే – ఏది తెల్సుకుంటే ఇంకేమీ తెలుసుకోనక్కర్లేదో అదే బ్రహ్మం. ఆ ధర్మం తెలుసుకున్నాక ఏమౌతుందో అనేదానికి రామకృష్ణుల వివరణ ఏమిటంటే – బ్రహ్మం తెలుసుకోవడమంటే ఉప్పుబొమ్మ సముద్రం లోతు కొలవడానికి చేసే ప్రయత్నం వంటిది. ఒకసారి లోపలకి వెళ్ళగానే అందులో లీనమవడమే కానీ ఏమీ చెప్పలేం. ఇదే స్వంతంగా తెలుసుకోవడం అంటే – లేదా గీతాచార్యుడి ప్రకారం – ఉద్ధరే దాత్మనాత్మానాం. ఈ శ్లోకంలో మహాశ్రమణుడంటే – మహాయోగి/యతి/బౌద్ధ భిక్షువు.]