కాళ్ళనొప్పి

సమయం ఆరుంబావు. చిత్ర ఇంకా రాలేదు. గణేశ్‌ సహనం కోల్పోతున్నాడు. నిల్చుని ఉండటంవల్ల అతనికి కాళ్ళు లాగేస్తున్నాయి. కాసేపెక్కడైనా కూర్చోవాలనిపించింది.

చిత్ర, చిత్ర తమ్ముడు వేరే ఏదైనా థియేటర్‌కు వెళ్ళి తనకోసం వెతకరు కదా? రివోలీ థియేటర్ అని నిన్న తాను స్పష్టంగా చెప్పానా లేదా అని గుర్తు తెచ్చుకున్నాడు. అవును; చెప్పాడు. గుర్తుంది. పైగా చిత్ర చూడాలన్నది కూడా ఈ సినిమానే. ఒక వారం క్రితం వాళ్ళు సినిమాకు వెళ్దాం అని మాట్లాడుకున్నప్పుడు, ప్లాజాలో ఆడుతున్న సినిమా చూద్దామా అని అడిగాడు. ఆఫ్రికా అడవుల్లోని రకరకాల జంతువులు, పక్షులు, వాటి జీవన విధానాల గురించిన డాక్యుమెంటరీ ఆ సినిమా. కానీ చిత్ర ఆ జంతువుల సినిమా వద్దు, రివోలీలో ఆడుతున్న సినిమా చూడాలనుకుంటున్నట్టు చెప్పింది. ఇదీ మంచి సినిమానే. ఫారిన్ సినిమానే. అయితే ఇది మనుషుల గురించిన సినిమా. ఆడ, మగ అనుబంధాల గురించిన సినిమా. పెళ్ళయిన మగాడు పెళ్ళాన్ని కాకుండ మరో అమ్మాయిని ప్రేమించడం వల్ల వచ్చే సమస్యల గురించిన సినిమా.

అలసటతో గణేశ్ అప్రయత్నంగా కళ్ళు బరువుగా మూసి తెరిచాడు. బరువు చూపించే యంత్రం పక్కన ఓ ఎర్ర చీర అమ్మాయి ఇందాకట్నుండి నిల్చుని ఎవరికోసమో ఎదురుచూస్తోంది. అతని చూపు ఆమె వైపుకు మళ్ళింది. అదే సమయంలో ఆమె చూపూ అతనిమీద స్పష్టంగా నిలిచింది. ఒక్క క్షణం, అరక్షణం అన్నట్టు వారి చూపులు అలా ఒకరిమీద ఒకరివి నిలిచాయి. ‘పరిచయం ఎలానూ లేదు కాబట్టి ఈ చూపుల కలయికతో వందలాది తీయని ఊహలను సృష్టించుకోగలం’ అనుకున్నాడతను. తన గురించిన ఆమె ఊహలకు, ఆమె గురించిన తన ఊహలకు హద్దులుండవు. ప్లాట్‌ఫారమ్‌ నుండి థియేటర్ గేటుదాకా సాయంత్రపు ఎండ పరచిన వెలుగుచాప మీద ఆమె నిల్చుని ఉంది. ఎండకు మెరిసే ఆమె చీర, చేతి సంచి, వాచీ, రేగిన ముంగురులు, ఆమె ఏటవాలు నీడ, వాచీ చూసుకోవడంలో ఆమె నాజూకుతనం, అటూ ఇటూ ఆమె చూపులు విసిరే తీరు – ప్రతిదానిలోనూ ఒక ప్రత్యేకమైన అందం ఉందనిపించింది అతనికి. వెలుగును నాజూకుతనాన్ని ఠీవిని కలబోసి చేసిన అపురూపమైన బొమ్మలా ఉంది. ఆమెలో సంపూర్ణత్వం తొణికిసలాడుతోంది. ఈమే? అవును, ఈమే! ఇంతకాలం తాను ఈమెనే వెతుకుతున్నాడు. అయినా ఇక ఇప్పుడు చేసేదేముంది! తనదైనదేదో తనకి కాకుండా పోతున్నా ఏమి చేయలేని నిస్సహాయతలో ఉన్నట్టనిపించింది.

అతనికి అలసటగా, విసుగ్గా ఉంది. ఇప్పుడు ఈమెను చూసి ఏం ప్రయోజనం? రెండేళ్ళ క్రితమో, సంవత్సరం క్రితమో, కనీసం ఒక నెల క్రితమైనా బాగుండేది. అప్పటికి చిత్రతో తన పెళ్ళి ఖాయం అవ్వలేదు. తాను ఏ బంధంలోనూ ముడిపడకుండా స్వేచ్ఛగా ఉన్నాడప్పుడు. ఇక ఆ అవకాశం లేదు. ఇంకో వారం తర్వాత అసలే లేదు. అతనికీ చిత్రకీ వారంరోజుల్లో వివాహం జరగబోతుంది. అన్ని రకాల స్థితులనూ ఒక్కసారిగా అనుభవించడం ఎలా సాధ్యం? పెళ్ళి విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఇంతకాలం వాయిదావేస్తూ వచ్చాడు. ఉన్నట్టుండి నెల రోజుల క్రితం చిత్రని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదొక తొందరపాటు నిర్ణయం కూడా కావచ్చు. లేదా పరిస్థితుల ప్రభావంవల్ల తీసుకున్నదీ కావచ్చు. ఏదైతేనేం? నిర్ణయం తీసుకున్నాక! ఒక కొత్త ప్రారంభానికి నాంది. అస్థిరమైన స్థితినుండి బయటపడటంకోసం బలవంతంగా తనని తాను బంధించుకుంటున్న ఒక స్థిరమైన ఏర్పాటు. అన్ని ఏర్పాట్లలో ఉన్నట్టే ఇందులోనూ సౌకర్యాలూ అసౌకర్యాలూ ఉన్నాయి. తనతో తానే చేసుకోక తప్పని సర్దుబాట్లను, సామరస్యాలను అతను ఇంతకాలం తీవ్రంగా వ్యతిరేకించినవాడే. ఇదిగో ఇప్పుడు తనూ ఇలాంటొక ఏర్పాటులో చిక్కుకుని సర్దుబాట్లకీ, సామరస్యాలకీ లొంగిపోబోతున్నాడు, అందరిలానే, గుంపులో గోవిందా అన్నట్టు.

తానూ అందరిలాగే పదిమందిలో ఒకడేనా? తనకంటూ ప్రత్యేకత ఏమీ లేదా? అంటే అవుననీ అనొచ్చు, కాదనీ అనొచ్చు. జీవితంలో తను ఇప్పటిదాకా చేసుకున్న ఏర్పాట్లలో ఇదీ ఒకటి అనుకుంటే అవును, తనూ పదిమందిలో ఒకడే అవుతాడు. అయితే ఇది మిగతా ఏర్పాట్లలా కాదు. నిజానికి ఇది ఇతర ఏర్పాట్లకంటే ముఖ్యమైనది. అదే దాని ప్రత్యేకత, అదే దాని దౌర్భాగ్యం. ఈ ఏర్పాటు వల్ల వచ్చే పర్యవసానాల తీవ్రత కూడా ఎక్కువే! ఇది తనలాంటివాడికి ఒకేసారి దొరికే అవకాశం. మరోసారి అన్న మాట లేదు. స్కూలు, ఉద్యోగం, భోజన హోటల్, రేడియో, సినిమా- ఇలా రోజువారీ జీవితంలో మనం చేసుకున్న ఏర్పాట్లను మనకు సౌకర్యం కానప్పుడో, ఇష్టం లేనప్పుడో మార్చుకోవచ్చు. పెళ్ళిలో ఆ అవకాశం లేదు. చట్టబద్ధంగా ఉండచ్చు. సామాజికపరంగానూ కూడా ఉండచ్చు. అయితే రక్తంలో కలిసిపోయిన సంప్రదాయపరంగా అయితే లేదు. సంప్రదాయాలు అతిక్రమించకూడనివని కాదు. అతిక్రమించి ఆనందమే పొందాలని ఏముంది. అదే మరింత బాధకు గురిచేయచ్చు కూడా. చిన్నప్పణ్ణుంచీ పెరిగిన సంప్రదాయం, ఇంట్లో వాతావరణం, పద్ధతులను చిన్నప్పణ్ణుంచీ ప్రశ్నిస్తూనే ఉన్నా అవి తనలో ఇమిడిపోయి ఉండచ్చు. పెరిగే వయసులో పిల్లలు అమ్మ పట్ల చూపించే విసుగు, చిరాకు, అలక వంటివి చాలాసార్లు అమ్మ బుజ్జగింపు కోసం చేసేవే. మరింత ప్రేమకోసం ప్రాధేయపడే ప్రవర్తనలో భాగమే. ఆ పసి మనసుల్లో కలిగే అభద్రతాభావాన్ని తొలగించుకునే ప్రయత్నమే. తనకు సంప్రదాయాలపట్ల ఉన్న వ్యతిరేకత ఇలాంటిదే కాదని ఏమిటి నమ్మకం?

మనిషి ఎంత తార్కికంగా ఆలోచించగల్గినా అతని ప్రవర్తన అతని మనసును బట్టి ఉంటుంది. అందుకే మనోభావాలు హేతుబద్ధమైన ఆలోచనలకంటే బలమైనవి. లోతైనవి. అయితే అవి అంత సులువుగా అర్థం కావటల్లేదతనికి. ఒకేసారి ఏది ఇష్టమో ఏది ద్వేషమో తెలుసుకోలేకపోతున్నాడు. ఇష్టాన్ని ద్వేషంగానూ, ద్వేషాన్ని ఇష్టంగానూ అపార్థం చేసుకుంటున్నానా అని కూడా సందేహపడుతుంటాడు అప్పుడప్పుడూ. తన మనోభావాలతోనే ఇలా సతమతమవుతుంటే ఇక ఇతరుల మనసులో మాటలు ఏం తెలుసుకోగలడు? తనమీద ప్రేమ, ఆప్యాయత, స్నేహం చూపించిన ఎందరో వేరు వేరు సందర్భాలలో తనను మోసంచేశారు. వాళ్ళకోసం తాను వెచ్చించిన సమయం వృధా అయిందని పశ్చాత్తాపపడేలా చేశారు. అలాంటి చేదు అనుభవాలు అతని మనసును విరిచాయి. నిజమైన ప్రేమను, ఆప్యాయతనూ కూడా శంకించేలా చేశాయి. అలా అని ఈ అనుభవాలకు ముందుజీవితం కూడానూ పెద్దగొప్పగా ఏంలేదు. కాలేజిలో అతన్ని చూసినప్పుడల్లా నవ్విన ఒక అమ్మాయికి తనంటే ఇష్టమని తెలిసినా ఆ ఇష్టాన్ని అనుబంధంగా మార్చుకొనే ఆత్మవిశ్వాసం లేకపోయింది. ఆపైన ఒక దినపత్రికలో ఉద్యోగం చేస్తున్నప్పుడు తనకు ఎంతగానో నచ్చిన ఒక అమ్మాయికి తన మనసులో ప్రేమను చెప్పకుండా ఆపింది అతని బిడియం. ఒక సాయంత్రం ఈ బెరుకుని విడిపించేందుకు పూనుకున్నా ఆమె కోరిక ఇతని ప్రేమను అర్థం చేసుకోలేక చప్పగా చల్లారిపోయింది. ఆ సాయంత్రం ఇతని ఆత్మవిశ్వాసం పూర్తిగా అడుగంటింది.

ఇక జీవితంలో ఇంకెవరినీ ప్రేమించలేననుకున్నాడు. శాశ్వతంగా వేరొకరితో బంధం ఏర్పరుచుకోవాలన్న ఊహను కూడా అతనిలో ఎవరూ కలిగించనట్టు అనిపించింది. ఊహలు, ఆశలూ లేని జీవితం అతని సాయంత్రాలనూ రాత్రులనూ ఒంటరిచేసింది. తెచ్చిపెట్టుకున్న వైరాగ్యంతో పగళ్ళంతా తనను తాను పనిలో ఊపిరాడకుండా చేసుకున్నాడు. ఎక్కువకాలం కాకుండానే పనిలో గొప్ప సమర్థుడన్న పేరు తెచ్చుకున్నాడు. వార్తలు దిద్దడం, కంపోజ్ చేయడం, శీర్షికలు పెట్టడంలో దిట్ట అయ్యాడు. బైటప్రపంచాన్ని మర్చిపోయి పనిలోనే మునిగిపోయాడు. ఇది మిగతా సబ్-ఎడిటర్లకు, న్యూస్ రూములో మిగతావారికీ సౌకర్యంగానే ఉంది. ఏ సంస్ఠలో అయినా పని ఎగ్గొడదామనుకునేవారే ఎక్కువ కాబట్టి, అందరికీ అన్ని పనులకూ ఇతనే దొరికాడు. క్రైమ్ స్టోరీనా? గణేశ్. విమాన ప్రమాదమా? గణేశ్. గోధుమల ఉత్పత్తి, ఇనుము ఎగుమతి వంటి గణాంకవివరాలు కావాలా? గణేశ్. కళ్ళలో ఒత్తులేసుకుని మరీ చూడవలసిన వార్తలా? గణేశ్.

గణేశ్, గణేశ్, గణేశ్.

వాళ్ళు చూసే గణేశ్ ఏ లోపాలు కాని, మానవ సహజమైన అపేక్షలూ బలహీనతలూ లేని ఒక యంత్రం. ఆ యంత్రముఖం వెనుక తనను దాచుకోవడం అతనికి ఊరటగా ఉంటుంది. రక్షణగానూ ఉంటుంది. తన చుట్టూ ఉన్న సబ్-ఎడిటర్లు ఆడా మగా కాని, వయసుతో కాని నిమిత్తం లేకుండా కబుర్లు, పుకార్లతో కాలక్షేపం చేస్తుంటారు. గణేశ్ మాత్రం ముప్ఫై యేళ్ళకే యాభై యేళ్ళవాడిలా వాటిల్లో తలదూర్చకుండా, ఆసక్తి ఏమాత్రమూ చూపకుండా కూర్చుంటాడు. వాళ్ళంతా ఇతన్ని ఆటపట్టించారు. ఇతన్ని అంచనా వేసేందుకు ప్రయత్నించారు. సన్యాసి, భీష్ముడు, వేదాంతి, స్త్రీ ద్వేషి. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల వివరాలు ఏవైనా తెలిసిన తను, ఎవరి గురించి వార్త అయినా ఎడిట్ చేయగలిగే తను, ఎంతో బలవంతుడు. కాని తన ఆత్మ ముందు తాను నిర్బలుడు. ఆ సమయాల్లో అతనిలో దాగివున్న న్యూనతలేవో బయటపడబోయేవి. కానీ వాటిని ఎలా వెళ్ళగక్కాలో తెలిసేదికాదు. ఒకప్పుడు తన మనసు పదిమందికీ విప్పినప్పుడు తనను కించపరిచి గాయపరిచారు. ఇప్పుడు తాను అన్నీ దాచుకున్నాడు. అయినా గాయపరుస్తున్నారని కుమిలిపోయేవాడు.

ఆ తర్వాత కొంతకాలానికి, తనను సాయంత్రం డ్యూటీకి మార్చుకున్నాడు. యువకులు, ముఖ్యంగా ఆడవాళ్ళు సాయంకాలం డ్యూటీకి రారు. వైవాహిక జీవితంతో విసిగిన సంసారులు, తనలా మోడుబారిన బ్రహ్మచారులు మాత్రమే ఎక్కవగా సాయంకాలం డ్యూటీకి వస్తారు. వాళ్ళ మధ్య కాస్త ఊరటగా ఉన్నట్టు తోచింది. సంసారులు, ‘పెళ్ళి చేసుకోకయ్యా!’ అని ఉపదేశించేవారు. బ్రహ్మచారులకు స్త్రీ కేవలం ఒక వస్తువు, ఒక మత్తుపదార్థంగా కనిపించేది. ఆడవాళ్ళ మీద, పెళ్ళి మీదా ఈ అవమానాలు వినే గణేశ్‌కు ఒక వికృతమైన సంతోషం, తృప్తి కలుగుతుండేవి. ఆ వాతావరణం అతన్ని కొంతకాలంపాటు అతని ఆత్మన్యూనత నుంచి కాపాడింది. తనమీద తనకున్న సానుభూతిని అతను కొద్దిగా పోగొట్టుకోగలిగాడు కూడా. ఇలానే జీవితాంతం గడిపేయొచ్చు అన్న ధైర్యం, నమ్మకం కూడా అతనికి కలిగాయి.

అర్ధరాత్రి దాటాక డ్యూటీ కాగానే తన గదికి వెళ్ళేవాడు. హోటల్ కేరేజీలో ఉన్న భోజనం తినేవాడు. నిద్రపోయేవాడు. కొన్ని రాత్రుళ్ళు ప్రెస్ క్లబ్‌కో, వేరే ఎక్కడికో వెళ్ళి బాగా తాగి ఏవేవో వాగేవాడు, పెద్దగా ఏవేవో పాడేవాడు. తన మనసు లోలోపల తనకే తెలీకుండా పేరుకున్న సున్నితమైన కోరికలను, ఆశలను మద్యంతో కడిగి బయటకు పంపుతున్నట్టుండేది ఈ తాగుడు తంతు.

మనసుని ఇలా మోసంచేసి బతికేయగలిగాడు కాని, శరీరాన్ని మోసంచెయ్యడం వీలయ్యేది కాదు. దాని కోరిక తట్టుకోవడానికి వీలుండదు. ఈ కోరిక తీర్చుకునేందుకు అలవాటుగా వెళ్ళేవారితో అది తీరే చోట్లకు ఒకటి రెండు సార్లు వెళ్ళొచ్చాడు. అయితే ఆ అనుభవాలు అతనికి సంతృప్తినివ్వలేదు. చిరాకు, కోపాలే మిగిలాయి, తన మీద, తనని తీసుకెళ్ళినవారి మీద, ఆక్కడుండే ఆడవారి మీద. తానొక యంత్రం కాదన్నదే అతని కోపానికి కారణం అయుండాలి. స్త్రీని ఒక పనిముట్టులా తన అవసరానికి వాడుకుని తర్వాత ఆమెతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుపోయే యంత్రాన్ని కాదు అన్న భావన అతన్ని కుంగతీసేది.

యంత్రం కాకుంటే మరేంటి అతను? అతను కోరుకునేదేంటి? అతనికి ఏదీ అర్థంకాలేదు. అర్థంచేసుకోవాలనీ అనిపించింది, అర్థంకాకుండా ఉంటేనే మంచిదనీ తోచింది. కొత్తగా ఏదైనా ప్రయత్నించాలి అనుకున్నాడు కాని తెగించలేకపోయాడు. మునుపటి అనుభవాల నేపథ్యంలో ఇలాంటి కొత్త ప్రయత్నాలు చేయాలంటే బెరుకు ఏర్పడింది. ‘నేను మీ దారికి రావట్లేదు. దయచేసి మీరూ నా దారిలో అడ్డు రాకండి’ అని మనసులోనే మిగిలినవారితో, ముఖ్యంగా స్త్రీలతో ఒప్పందం కుదుర్చుకుని తన మానాన తనుంటూ తన పనులు తాను చేసుకుంటూ ఉన్నాడు.

అలాంటి దశలో తొలిసారిగా చిత్రని కలిశాడు. ఒకసారి నాటకోత్సవాలలో భాగంగా హైదరాబాదునుండి వచ్చిన ఒక డ్రామా ట్రూపువాళ్ళు కొన్ని తెలుగు నాటకాలు ప్రదర్శించారు. సాయంత్రం షిఫ్ట్ కాబట్టి ఒక్కరోజు మాత్రమే వెళ్ళగలిగాడు. అది కూడా ఒక స్నేహితుడు బలవంతంగా తీసుకెళ్ళకపోయుంటే వెళ్ళేవాడుకాదు, చిత్రనూ చూసేవాడుకాదు. ఆమెతో పరిచయం చేసుకునే ప్రయత్నం చేసుండేవాడుకాదు. ఆమె విశ్వాసానికి పాత్రుడయ్యేవాడూకాదు. ఎంతగా అంటే చిత్ర తన భవిష్యత్తును అతనితో పెనవేసేంతగా ఆమె విశ్వాసానికి పాత్రుడయ్యాడు.

కాళ్ళనొప్పి స్పృహలోకి వచ్చిన గణేశ్ మళ్ళీ నిట్టూర్చాడు. ఆ ఎర్ర చీర అమ్మాయి ముఖంలో ఉన్నట్టుండి చిరునవ్వు వెలిగింది. తనను చూసే నవ్విందేమో అన్న ఆలోచన వచ్చి ఓ క్షణం హృదయం వేగంగా కొట్టుకుంది. ఆమె గణేశ్ వెనుక ఉన్న ఇంకెవరినో చూసి నవ్వుతోంది. గణేశ్ తిరిగి చూశాడు. ఆటో దిగుతున్న ఒక యువకుడు కనపడ్డాడు. ఆటో డ్రైవర్‌కు రెండు రూపాయి నోట్లిచ్చాడు. డ్రైవర్ చిల్లర లేదని చెప్పుండాలి. ఆ యువకుడు ఎర్ర చీర అమ్మాయికేసి సైగచేసి చెప్పాడు. ఆమె యువకుడి దగ్గరకు వెళ్ళి చిల్లర ఎంత కావాలి అని అడిగి, తన హేండ్‌బ్యాగ్‌లో నుండి చిల్లర తీసి ఆటో డ్రైవర్‌కు ఇచ్చింది. అప్పుడా యువకుడు ఆ అమ్మాయి నడుముచుట్టూ చేయివేసి మెల్లగా నడుస్తూ గణేశ్‌ని దాటుకుని థియేటర్‌లోపలికి వెళ్ళాడు. గణేశ్‌కు ఆ దృశ్యం కాస్త అసహనాన్నీ అసూయనీ కలిగించింది.

ఆ రోజూ అంతే. గణేశ్, అతని స్నేహితుడు నాటక ప్రదర్శన వేళకంటే చాలా ముందుగానే వేదిక దగ్గరకు చేరుకున్నారు. బయట నిల్చుని అటుగా వెళ్ళే ఆడవారికేసి చూస్తూ సిగరెట్లు తాగుతున్నారు. అప్పుడు రాంబాబుగారు కుటుంబసమేతంగా టాక్సీలో వచ్చి దిగారు. టాక్సీ అతను ఆయన చాచిన పదిరూపాయల నోటు చూసి చిల్లర లేదన్నట్టు చేతులు తిప్పాడు. అప్పడు రాంబాబుగారి చూపు వేదిక వాకిట నిల్చున్నవారిలో తెలిసినవారెవరైనా ఉన్నారా అని వెతికింది. ఆయన కంటపడిన మొట్టమొదటి వ్యక్తి గణేశ్.

ఆయిన గణేశ్ దగ్గరకొచ్చి ‘హలో’ అని కరచాలనం చేశాడు. ఒకసారి గణేశ్ పనిచేసే దినపత్రిక కార్యాలయానికి వచ్చాడాయన. అలా మొదలైంది పరిచయం. ఆ తర్వాత ఎక్కడ కలిసినా ఒకటి రెండు మాటలతో పలకరింపులు.

పరిస్థితి వివరించి ఎనిమిది అణాలు తీసుకున్నాడు.

‘తర్వాత ఇస్తాను’ అన్నాడు.

‘ఫరవాలేదు, సార్!’

ఆయన టాక్సీవైపుకు తిరిగి వెళ్తుంటే గణేశ్ చూపు ఆయన్ని వెంబడించింది. అదే సమయానికి టాక్సీ పక్కనుండి ఒక చూపు గణేశ్ వైపుకు తేలుతూ వచ్చింది; అది చిత్రది.

ఇంటర్వెల్ టైములో గణేశ్ కాఫీ స్టాల్‌లో తన స్నేహితునితో నిల్చుని ఉండగా చిత్ర, ఆమె తమ్ముడు అక్కడికి వచ్చారు. ఆమె తమ్ముడు గణేశ్ దగ్గరకు వచ్చి ఎనిమిదణాలు చాచాడు. గణేశ్ ‘ఓ, ఇట్సాల్‌రైట్’ అని తీసుకోలేదు. ‘అలా కాదు ప్లీజ్, యూ మస్ట్ హేవ్ ఇట్!’ అని చిత్ర బలవంతపెట్టి ఎనిమిదణాలు తీసుకునేలా చేసింది.

ఆమె గణేశ్‌తో తొలిసారి మాట కలిపింది అప్పుడే!

ఆమె గొంతులో, నడవడికలో ఉన్న స్థిరత్వం, పట్టుదల గణేశ్‌ని క్షణంలో ఆకర్షించి ఉండాలి. ఆ పదిహేడేళ్ళ అమ్మాయిలో ఏ సంకోచమూ బెరుకూ లేని కుదురైన పద్ధతి గణేశ్‌కు ఏదో ఊరటనిచ్చి ఉండాలి. వారం రోజులు ఆమె జ్ఞాపకాలతోనే గడిపాడు. ఆదివారం వచ్చింది. వాళ్ళ పత్రిక ఆదివారం అనుబంధంలో నాటక ప్రదర్శన ఫెస్ట్ గూర్చి రాంబాబుగారు ఒక వ్యాసం రాశాడు. అతను ఆ రోజు సాయంత్రం ఆయన్ను వెదుక్కుంటూ వెళ్ళాడు. ఆ వ్యాసం తన మనసులో రేకెత్తించిన అందమైన భావాలను ఆయనతో పంచుకోవాలన్న ఆరాటంతో వచ్చినవాడిలా మసలుకున్నాడు.

ప్రొఫెసర్, ఆ రోజు నేను నిజానికి చిత్రకోసమే వచ్చానన్నది మీరు పసిగట్టే ఉంటారేమో! ఆ తర్వత మీ ఆవిడకీ తెలిసిపోయింది. బాబుకూ తెలిసిపోయింది. అంతెందుకు, మీ ఇంటి కుక్కకి కూడా తెలిసిపోయింది. నేను మేధావిలా మీతో మాట్లాడేటప్పుడు, మీ కుక్క ఒక మూల కూర్చుని నాకేసి చూస్తూ నాలుక వేలాడిస్తూ పళ్ళు ఇకిలించి, వెక్కిరింపుగా తల మెల్లగా ఊపుతూ ఉంటుంది – ఇవన్నీ పనికిరాని మాటలు, నాకు తెలీదా నువ్విక్కడికి ఎందుకొస్తున్నావో – అన్న ధోరణిలో. చాలా సందర్భాలలో ఆ కుక్కతో నన్ను పోల్చుకుని చూస్తే జాలి కలిగేది. నవ్వూ వచ్చేది. కుక్కలకి ఇలాంటి అనవసరమైన నటనలు లేవు. మాటలు ఉండవు. ఒ అమ్మాయి మీద ఆశ కలిగితే వాళ్ళ నాన్నని ఆకట్టుకునే ప్రయత్నాలు చెయ్యక్కర్లేదు. అమ్మాయి జీవితాంతం నాతో ప్రేమగా ఉంటుందా, నా పోకడలతో సర్దుకుపోతుందా, సంప్రదాయాల్లో మునిగిపోయే అప్పలమ్మలా కాకుండా, వాటిని కాలికిందేసి తొక్కేసే విప్లవవనితలా కాకుండా, రెంటినీ సమన్వయం చేసుకుపోయే అమ్మాయిలా ఉంటుందా అని చింతించదు. జీవకోటిలో ఎన్నో ప్రాణులకన్నా ఎక్కువ ఆయుష్షు ఉన్నా, దానిలో అధిక భాగాన్ని ఇలాంటి అనవసరమైన నటనల్లో, మాటల్లో, జ్ఞాపకాల్లోనేగా మనుషులం ఖర్చుపెట్టేది! మీరొకమారు అన్నట్టు, జాగ్రత్తగా గమనిస్తే మనిషి తన జీవితమ్మొత్తంమీద చేసే పనికొచ్చే పనులు లెక్కపెట్టినా, అవి ఇతర జీవులు తమ తక్కువ ఆయుష్షులో చేసే పనికొచ్చే పనుల కన్నా తక్కువే ఉంటాయి.

అవును. ఆ కుక్కని చూస్తే అతనికి ఈర్ష్యగానే ఉండింది. దాన్ని చూడగానే ఒళ్ళు మండిన రోజులూ ఉన్నాయి. దాన్ని కృతజ్ఞతతో చూసిన సందర్భాలూ ఉన్నాయి. తొలిసారి రాంబాబుగారిని చూడటానికి వెళ్ళినపుడు ఆయన ఇంట్లో లేడు. ఆయిన భార్య, కూతురు చిత్ర ఉన్నారు. ‘కూర్చోండి, వచ్చేస్తారు’ అంటూ ఆహ్వానించారు. అతను తలుపు తట్టినప్పుడు మొరగడం మొదలుపెట్టిన కుక్క, అతను లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాక అతని చేతులు, కాళ్ళు అన్నీ వాసన చూసింది. ‘ఉష్! టామీ, ఉరుకో’ అని చిత్ర, వాళ్ళమ్మ ఆ కుక్క అతనిని ఇబ్బంది పెట్టకుండా ఆపాలని ప్రయత్నించారు. ‘పరవాలేదు’ అని తన చిరాకుని, అసహ్యాన్నీ అణచుకుని టామీ ముఖాన్ని, మెడని వెచ్చగా తడిమాడు. అది ఇంకా వాటంగా తన ఒంటిని చూపించుకుంటూ నిల్చుంది. అతను తడుముతూనే ఉన్నాడు. తనను తాను కుక్కలను ప్రేమించే యువకుడిగా చూపించుకుంటూ వాళ్ళ దృష్టిలో మంచివాడిగా మారిపోయాడు. మాటలు కూడా దీన్ని సాధ్యంచేసి ఉండేవికావు. కుక్కని ముద్దుగా నిమిరిన ఒకే ఒక్క చర్యతో మొహమాటాల్లేని ఒక అన్యోన్యమైన వాతావరణాన్ని సృస్టించుకున్నాడు.

వాళ్ళతో సంభాషణ మొదలెట్టడానికి సాయపడింది టామీయే.

“మా ఇంటిలో కూడా ఇలాంటిదే ఓ కుక్క ఉండేది” అని మొదలుపెట్టాడు.

“ఇప్పుడు లేదా?” చిత్ర ఉత్సాహంగా అడిగింది.

“ఒక రోజు ఉన్నట్టుండి ఎటో వెళ్ళిపోయింది!”

“అయ్యో! ఎందుకలా వెళ్ళిపోయింది?”

నిజానికది వారి కుక్క కాదని వివరించాడు. వాళ్ళ నాన్న స్నేహితుడి కుక్క అది. ఆయనకు ఢిల్లీనుండి బదిలీ అయ్యి వెళ్ళిపోతూ ఆ కుక్కను వీళ్ళింట్లో వదిలివెళ్ళారు. మొదట్లో బాగానే ఉండేది. కొన్నాళ్ళ తర్వాత అప్పుడప్పుడూ మూడు రోజులూ, నాలుగు రోజులూ ఢిల్లీలో ఎక్కెడెక్కడో తిరిగి వచ్చేది. ఎక్కడికి వెళ్తోందో తెలీదు. చివరికి ఒకరోజు తిరిగి రానేలేదు.

“పాపం, తన పాత యజమానిని తలచుకుని బెంగపెట్టేసుకుని ఉంటుంది.” అంది చిత్ర వాళ్ళ అమ్మ.

“మీ ఇంట్లో ఎవరైనా దాన్ని నిర్లక్ష్యం చేశారేమో… అంటే మీరు కాదు, ఇంకెవరైనా!” అంది చిత్ర. తన ఇంట్లోవాళ్ళ స్వభావం గూర్చి తెలుసుకోవాలనుకునే ఎత్తుగడగా గుర్తించాడు.

“అలాంటిదేంలేదు. అందరం బాగా చూసుకునేవాళ్ళం, గారాబం చేసేవాళ్ళం. ఒకవేళ మా ప్రేమను తట్టుకోలేక వెళ్ళిపోయిందేమో. మా చెల్లి దాని మెడచుట్టూ చేతులేసి వాటేసుకుని ముద్దుచేస్తూ ఉండేది. మా అమ్మ పూజలయ్యాక దానికి ప్రసాదాలు, బొట్లు కూడా పెట్టేది.”

చిత్ర నవ్వింది. ఆమెను నవ్వించినందుకు గర్వపడ్డాడు. అతను ఇష్టపడేది తనను కాదని ఉన్నట్టుండి గ్రహించినట్టు టామీ అతనికి దూరంగా లేచివెళ్ళి నేల మీద పడుకుంది.

“టామీని మరొకరి ఇంట వదిలిపెట్టాల్సి వస్తే అదేం చేస్తుందా అని ఊహిస్తున్నాను” అంది చిత్రవాళ్ళ అమ్మ.

“ఎక్కడా వదలం దాన్ని. మనం ఎక్కడికి వెళ్ళినా అది మనతోనే వస్తుంది. కదా టామీ?” అంటూ చిత్ర టామీ పక్కనే నేలమీద కూర్చొని ముద్దుచేసింది.

“ఇంగ్లీష్‌వాళ్ళు ఊరు వదిలి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళ కుక్కని కాల్చి చంపేస్తారట. అలా ఎలా చెయ్యగలుగుతారో!” అంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడింది చిత్రవాళ్ళ అమ్మ.

“చాలా దారుణమైన ఆచారం!” అంటూ వంత పలికాడు. తనలాగే సెంటిమెంటల్ టైప్ అని గుర్తించినట్టు చిత్రవాళ్ళ అమ్మ అతన్ని చూసి సంతృప్తి చెందింది. చిత్ర ఇంగ్లీష్‌వారి ఆ ఆచారాన్ని సమర్థిస్తూ మాట్లాడింది! అతన్ని సందిగ్ధంలో పెట్టి అతను వెంటనే ఆమె మాటలను సమర్థిస్తాడా లేదా అని పరీక్షిస్తున్నట్టు. అయితే అతను తాను ముందు చెప్పిన మాటమీదే ఉండి తానేమీ అంత స్థ్రిరాభిప్రాయం లేనివాడు కాదని నిరూపించి ఆమె మనసులో మరింత గౌరవం ఏర్పడేలా చేసుకున్నాడు.

ఇప్పుడాలోచిస్తే అవన్నీ సరికావనిపించింది. ఆ మొదటి రోజు తాను నడుచుకున్న తీరు సరికాదని, వాళ్ళకోసం తన సహజత్వాన్ని విడిచి మరో వేషం వేసుండకూడదని అనిపించింది. అయితే ఏది వేషం? ఏది కాదు? ఏది సహజత్వం కానిది? సందర్భానికి తగిన ఆవేశాలు, వాటి ప్రభావంతో ఏ సమయానికి ఏది సరో దానికి తగినట్టు తయారయ్యి వ్యక్తమవుతాం. ఆ ఆవేశాలు నిజమైనప్పుడు ఈ వ్యక్తమయ్యే భావావేశాలూ నిజమైనవే! ఒక్కో దశలో ఒక్కోటి నిజమైనవిగా అనిపిస్తాయి. ముఖ్యమైనవిగా అనిపిస్తాయి. మనల్ని అవే నడిపిస్తాయి. అలా నడిపించే ప్రతి నిజమూ చివరికి అబద్ధమని తెలుసుకుని నిరాశపడతాం. అప్పుడు మరో నిజంలో, ఆ క్షణం అలా తోచేవాటిలో చక్కగా ఇమిడిపోతాం. మానవుల మనుగడకీ, ప్రయత్నాలకీ మౌలికమైనవి ఇలాంటి భ్రమలే కదా? అబద్ధాలే కదా?

గణేశ్ ఒకమారు బలంగా తల ఊపాడు, తన ఆలోచనల ముట్టడినుండి తనని కాపాడుకోవడం కోసం. ఈ ఆలోచనలు రోజురోజుకీ పదునెక్కుతున్నాయి! తననీ తన జీవితానికి సంబంధించినవారినీ చీల్చి చీల్చి పరిశీలన చేస్తున్నట్టు ఉన్నాయి. తన ఆలోచనలు ఇలా పదునెక్కిన ప్రయాణంలో ప్రొఫెసర్‌గారి పాత్ర చాలా పెద్దదే.

కానీ ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టకుండానే ఉండి ఉండచ్చు అని ఇప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది.

టైము ఆరున్నర. చిత్ర ఇంకా రాలేదు. అతనికి అసహనం, కోపం కట్టలు తెంచుకుంటోంది. థియేటర్ వాకిట నిలుచునివున్న వాచ్‌మన్ తనని వింతగా చూస్తున్నాడని అనిపించింది. అప్పడప్పుడు, ‘స్పేర్ టిక్కెట్ ఉందా?’ అని కొందరు వచ్చి అడిగి చిరాకు కలిగించారు. వాటినుండి కాసేపు తప్పించుకుందాం అన్నట్టు, అక్కడ కూర్చుని ఉన్న ఒక షూ పాలిష్ పిల్లాడి దగ్గరకు వెళ్ళి షూ పాలీష్ చేయమన్నాడు.

“టిక్కెట్టు దొరకలేదా సాబ్?” అని అడిగాడు. వాడే కొనసాగింపుగా “చాలా మంచి సినిమా సాబ్!”

“నువ్వు చూసేశావా?!”

“మూడుసార్లు సాబ్.”

“అంత బాగుందా?”

“నాకు ఆ హీరోయిన్ చాలా నచ్చింది సాబ్.”

ఆ హాలీవుడ్ నటి ద్వారా పిల్లాడు పొందే పారవశ్యం గూర్చి, సంతృప్తి గూర్చీ గణేశ్‌కి ఆ పిల్లాడి మీద అసూయ కలిగింది. నిర్మలమైన ఈ పారవశ్యం, సంతృప్తీ ఇక తనకి ఎప్పుడూ కలక్కపోవచ్చు.

అదే నటి ద్వారా అతనికి కలిగిన మత్తులు ఇక లేవు. ఒకప్పుడు ఆమె అతనికి ఏ స్త్రీత్వానికీ, జీవన విధానానికీ ప్రతినిధిగా వెలిగిందో అలాంటి స్త్రీల జీవన విధానంపట్ల, మనోస్వేచ్ఛ ఉన్న స్త్రీపురుషులు, స్వతంత్రమైన ప్రేమ, స్వతంత్ర జీవితం వంటి వాటిపట్లా అతనికి ఎంతో ఆకర్షణ ఉండేది. చిన్నతనంలో సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు అటువంటివి తన జీవితంలోనూ సాధ్యమే అనిపించేది. ఆ ఊహలు అతన్ని తన తల్లితండ్రులు, తోబుట్టువులకంటే తాను భిన్నమైనవాడన్నట్టుగా భావింపచేసి వారిమీద రోజురోజుకీ ద్వేషభావాన్ని పెంపొందించాయి. వారి జీవితం పట్ల వారికున్న సంతృప్తీ, తెచ్చిపెట్టుకున్న అబద్ధపు ఊతకర్రలాంటి ఆదర్శాలూ ఎంత కృత్రిమంగా ఉన్నాయోనని అసహనం కలిగేది. ఎందుకిలాంటి బూటకపు బంధుత్వాలు అని గట్టిగా అరవాలనిపించేది. ఆ వ్యవస్థను కూల్చి నేలమట్టం చేసి వాళ్ళ కళ్ళు తెరవాలనిపించేది. అతన్ని తమలాంటి సగటు మనిషే, సామాన్యుడే అనుకున్న ప్రతి ఒక్కరినీ మార్చడం ఎందుకు సాధ్యం కాలేదు? ఎక్కడ, ఎప్పుడు, ఎవరివల్ల అతని ప్రయత్నాలు భంగమైనాయి? తనలోని ఒక భాగమే ఎప్పుడూ తనకి ఎదురుతిరిగేదా? కూర్చుని పాలిష్ వేస్తున్న ఈ పిల్లవాడిని చూస్తుంటే, ఇప్పటిదాక తాను చేసిన ప్రయాణాలు, తిరిగిన దారులు, గెలుపులు, ఓటములు అన్నీ ప్రాముఖ్యం లేనివిగా తోచాయి. పిల్లాడా, నువ్వు నాకంటే ఎంత నిర్మలుడివి! ఈ క్షణాన నిన్ను షూ పాలిష్ వేసేవాడిగాను, నన్ను ఆ షూ వేసుకున్నవాడిగానూ మాత్రమే చూడడానికి మనసు ఒప్పుకోటల్లేదు. కాని, విధి? సామాజిక వ్యత్యాసం? ఏదేమైనప్పటికీ, ఈ వ్యవస్థ నాకు సౌకర్యంగా ఉంది. దీనికి నేను ఎదురుతిరిగి ఉద్యమం చెయ్యలేను. సమాజంలో మరికొన్ని ఏర్పాట్లకు నేనెలాగైతే ఎదురుతిరగలేదో ఇదీ అలానే.

‘ఠక్!’ పిల్లాడు బల్ల మీద తట్టాడు, కాలు మార్చుకోమని సూచిస్తూ. గణేశ్ తన రెండోకాలు ఎత్తి బల్లమీద పెట్టాడు.

ప్రొఫెసర్, ఆ రోజు మీ ఇంట్లో కుక్కను గూర్చిన చర్చ తర్వాత మేము డ్రామాల గురించి చర్చించసాగాం. నాకు ఆ నాటకాలు నచ్చాయా అనడిగింది చిత్ర. నేను డ్రామా ఫెస్ట్‌కి ఒక్కరోజే వచ్చాను. ఆ రోజు కూడా నేనంత శ్రద్ధ పెట్టలేదని అన్నాను. స్టుపిడ్ మెలోడ్రామా అంది చిత్ర. ఆమె అలాంటి పదాలు వాడటం ఈ మధ్యకాలంలోనే మొదలుపెట్టుండాలి. చిన్న పిల్లలు కొత్తగా వచ్చిన బొమ్మని తమ పాత బొమ్మలకంటే ఎక్కువ అపురూపంగా చూసుకుంటూ ఆనందంతో మురిసిపోతున్నట్టు ఆమె కూడా అలా కొత్తగా నేర్చుకున్న ఇంగ్లీష్ పదాలను వాడేప్పుడు మురిసిపోతున్నట్టుగా ఉంది. నాకు అప్పటికే పదాలతో వెగటు, విరక్తి. పదాలతో ఈదులాడటమే కదా నా ఉద్యోగం! చిత్రవాళ్ళ అమ్మకు చిత్రకు తెలిసినన్ని పదాలు తెలీదు. అయితే మా ఇద్దరికంటే ఆమెను ఆ నాటకాలు ఎక్కువగా ప్రభావితం చేశాయన్నది ఆమె భావోద్వేగంతో వ్యక్తపరచగలిగింది. ఆ డ్రామాల్లో కొన్నిట్ని చూసేప్పుడు వాళ్ళమ్మ కన్నీటి పర్యంతం అయేదని వేళాకోళం చేసింది చిత్ర. అయితే నాకు ఆమె ఏడుపు హర్షించతగినదిగాను, గౌరవించదగినదిగానూ అనిపించింది. మా అమ్మ కూడా ఇంతే, సినిమాకో, డ్రామాకో వెళ్ళినప్పుడు అందులోని పాత్రలు పడుతున్న కష్టాలకు నొచ్చుకుని ఏడ్చేస్తుంది అన్నాను. తానలా కాదంటూ చిత్ర తన గొప్పతనాన్ని చాటుకుంది. అది గొప్ప లక్షణమా కాదా అన్నది నాకు ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది.

అప్పుడే మీరు వచ్చారు. మీరూ సంభాషణని కొనసాగించారు. మీరు లేని సమయాన నేను రావటం, మీ భార్య, కూతుళ్ళతో మాట్లాడుతూండటం- ఆ వాతావరణాన్ని మీరు హర్షించలేదన్న విషయాన్ని మీ అసహనంలో చూచాయగా గ్రహించాను. ‘వాళ్ళను అమాయకులని చేసి నువ్వు గొప్పలు పోయావేమోగానీ నన్ను అమాయకుణ్ణి చెయ్యలేవు’ అన్నట్టు నేను చెప్పిన ప్రతి అభిప్రాయాన్ని కావాలనే వ్యతిరేకించి మాట్లాడారు మీరు. నా వాదనలోని లొసుగులు పసిగట్టి నా నోరు మూయించే ప్రయత్నాలు చేశారు. ఆ మొదటి రోజే కాదు, ఆ తర్వాత కొన్నిసార్లు కూడా మీరు ఎంతో జాగ్రత్తతో నన్ను అంతదూరంలోనే ఉంచారు. నేను మిమ్ముల్ని తప్పుపట్టడంలేదు. నేను మీ దగ్గరకు పదేపదే రావటం కేవలం జిజ్ఞాసతోనో కాదో పరీక్షించాలనుకున్నది సబబే. ఆ తర్వాత నాకూ ఆ సందేహం కలిగింది – నాది నిజంగానే జ్ఞానం గురించిన ఆకలేనా?

ఆ రోజు నేను ఆ నాటకాలను ఆదరించి మాట్లాడాను. వాటిని కేవలం హేతుబద్ధంగాను, జ్జానప్రధానంగాను మాత్రం చూడటం సరికాదన్నాను. వాటివల్ల భావోద్వేగమైన జనం పొందే సాంత్వన, సంతృప్తిని వివరించి ఆ సంతుష్టిని నేను గౌరవిస్తున్నాను, అవి మేధాశక్తిని మెరుగుపెడుతున్నాయా లేదా అని కాదు, అన్నాను.

“ఆ సంతుష్టి కేవలం క్షణికమైన మాయేగా?” అని మీరడిగారు.

“ఉండచ్చు. బ్రతుకుని ముందుకు సాగించేది ఆ మాయే!” అన్నాను.

“నేను అంటున్నది తుచ్ఛమైన మాయల గురించి” అన్నారు. శ్లేషార్థాలు స్ఫురించేలా మాట్లాడారో ఏమో.

“ఏది తుచ్ఛం, ఏది కాదు? వీటికి ఒక్కొక్కరి నిర్ధారణా వేర్వేరుగా ఉంటాయి కదా?” అన్నాను.

“మనతో మనం సంప్రదించుకోడానికి పనికిరానివన్నీ తుచ్ఛమైన మాయలే” అన్నారు. “అంటే స్వీయాన్ని తెలుసుకోడానికి అడ్డంకులుగా ఉన్నవి!”

“ఈ అడ్డంకులు అందరికీ స్ఫురించాలి కదా?”

“ఖచ్చితంగా స్ఫురిస్తుంది. మన అందరిలోనూ ఒక సూక్ష్మమైన గీటురాయి ఉంటుంది. రుచులను తెలుసుకోడానికి నాలుక ఉన్నట్టు, భావేద్వేగాలకూ ఒక నాలుక ఉంది. ఆ నాలుకని శుభ్రంగా ఉంచుకోవాలి. దాని అభిప్రాయాలను అర్థంచేసుకుని వాటిని గౌరవించడం తెలిసుండాలి. పౌష్టికం కానివి కొన్ని వ్యసనాలుగా మారిపోతున్నాయి. కాఫీ, టీ, సిగరెట్ లాంటివి; పరవాలేదు. వీటినే ఆహారాలుగా తీసుకోలేము. పౌష్టికతనే కొలమానంగా తీసుకున్నా చప్పగా అయిపోతుంది. రుచి కోసమూ తినక తప్పదు. మొత్తానికి తినేవాటిని వర్గీకరించడం తెలుసుకోవాలి. అందుకు సాధన, అనుభవం రెండూ కావాలి. చిన్నపిల్లలకు శిక్షణ ఇచ్చినట్టు ఇవ్వాలి. అయితే మనకు ఈ శిక్షణలు లేవు. ఇంటిలోను, బళ్ళోనూ…” మీరు చెప్పుకుంటూ వెళ్ళారు. నేను వింటూ ఉన్నాను.

ఆ తర్వాత ప్రతిసారీ నేను తప్పిన శ్రుతితోనే మీ వద్దకు వచ్చాను. ప్రతిసారీ మీరు ఎంతో ఓర్పుతో నేర్పుతో ఆ శ్రుతిని సరిచేశారు. లయబద్ధంగా మార్చారు. మన సంభాషణను ఎంతో పైస్థాయికి తీసుకెళ్ళారు. మనం వేటిగురించి మాట్లాడుకున్నాము అని ఆలోచిస్తే, దేని గురించి మాట్లాడలేదు? అనిపిస్తుంది. నాటకాల గురించి, నాయకుల గురించి, దేశం, సంసారం, ఇల్లు, పెళ్ళి వంటివాటి గురించి, ఏర్పాట్ల గురించి…

విఫలమైన నా బాంధవ్యాలు, నా స్నేహాల గురించి నేను కొత్త కోణంలో పరిశీలించి చూసుకోసాగాను. ఎదుటివారి కోణంనుండి ఏకాంతాన్ని భంగం చెయ్యని తోడు; నేను వాడుకోబడకుండా నాకు ఉపయోగపడే ఏర్పాటు – దీన్నే కదా నేను అన్వేషించుకుంటూ ఇక్కడికి వచ్చింది. మొరటు గుఱ్ఱంలా దారీ తెన్నూ లేక పరుగెడుతున్న నన్ను మీరు సరైన దశలో లొంగతీసుకుని లాడం కొట్టి, కళ్ళెం వేసినట్టు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది. ఒక్కోప్పుడు, ఇదేం పిచ్చి పోలిక? గుఱ్ఱం, లొంగదీసుకోవడం, కళ్ళెం అనిపిస్తుంది. బహుశా నా పరుగులో నాకు అలసట, మీ రాక ఒకే సమయంలో జరిగాయేమో!

అది కూడా అయుండచ్చు.

మనుషుల మీద నమ్మకం కోల్పోయి ఉన్న నాకు మళ్ళీ వాళ్ళ మీద నమ్మకం కలగజేశారు. ఎవరికీ ఎవరిమీదా అక్కరలేదు అని విరక్తి చెందివున్న నాకు, అక్కరవున్నవాళ్ళు లేకపోలేదని ఆశ్వాసపరిచారు. పదేళ్ళ క్రితం మిమ్మల్ని కలుసుకుని ఉంటే నా జీవితపు గమనమే మారిపోయుండేదనుకుంటాను నేను.

అయితే పదేళ్ళ క్రితం చిత్రకు పదేళ్ళు కూడా నిండి ఉండేవి కాదు. జీవితం ఎంతటి విచిత్రమైన సంఘటనలను సృష్టిస్తుందో! ఒకదాన్ని వెతుక్కుంటూ వెళ్ళేప్పుడు మరోటి దొరికేలా చేస్తుంది. మొదట చిత్రకి ఆకర్షించబడి మీ దగ్గరకు వచ్చాను. తర్వాత మీకోసమూ వచ్చాను.

ఒక దశ తర్వాత మీకోసం మాత్రమే వచ్చి ఉంటానా? అదే నా ఇప్పటి సందేహం!

చిత్ర కారణంగా కొన్ని సందర్భాల్లో మనకు చర్చకు వీలు కలగకుండా పోయేది. మన సంభాషణ కొనసాగించే ప్రయత్నాలు విఫలమై, గాఢమైన మౌనంలో చిక్కుకుని ఏం చేయాలో తెలీక వెంటనే సెలవు తీసుకోవలసి వచ్చేది. నా రాకకుగల ఉద్దేశ్యం గురించి మీకు అనుమానం కలిగేది. నాకూ నా ఉద్దేశ్యం మీద ఆ సందేహం ఉండేది. నేను వచ్చి కూర్చోగానే ‘చిత్రా, వక్కపొడి తీసుకురా! చిత్రా, ఈ రోజు పేపర్ ఎక్కడ?’ అంటూ ఏదో ఒక కారణంతో మీరు చిత్రను పిలిచేవారు. ఆమెను పలకరించడానికి నాకు సందర్భం కలగజేసేవారు. కొన్ని సందర్భాల్లో మమ్ముల్నిద్దర్నీ ఏకాంతంగా వదిలి కూడా మీరు వెళ్ళిపోయేవారు.

ఎందుకిన్ని అగచాట్లు పడుతున్నావు? చిత్రకోసమే నువ్వు వస్తున్నట్టయితే ఆ విషయాన్ని ఆమెతోనో నాతోనో చెప్పేయొచ్చుగా అని నన్ను మీరు నిలదీస్తున్నట్టు ఉండేది ఆ చర్య. మన మధ్య అంతరం కలుగజేస్తోందన్న కారణంచేత దానిని తొందరగా పరిష్కరించే ప్రయత్నం చేశానేమో. నా వాదాన్ని నేను మాటల్లో పెట్టి ఉండచ్చేమో. మీ అనుమానాన్ని అది కలిగిన మూడేళ్ళ తర్వాత రుజువు చేశానేమో. అందుకే నా తల్లితండ్రులను మీరు కలిసేందుకు ఏర్పాటు చేశానేమో. అన్నీ ఎంత తొందరగా జరిగిపోయాయి!

వచ్చే వారం మా పెళ్ళి.

అయితే?

నాకు ఊతకర్రగా ఉండినది చిత్రలోని సందిగ్ధత లేని స్థిరత్వం, నిష్కల్మషం. అయితే మేము అడుగిడబోయే పెళ్ళి అన్న ఏర్పాటులోని శాశ్వతత్వం గురించిన భయం కారణంగా ఆమె స్థిరత్వం కదిలిపోతుండటం చూస్తున్నాను. ఆమె అలవరుచుకున్న స్థిరత్వం అనుభవంతో వచ్చింది కాదు, తెచ్చి పెట్టుకున్నది అన్న జ్ఞానోదయం నాకు ఇప్పుడు కలుగుతోంది. నా కుటుంబ సభ్యుల గురించి సూటి ప్రశ్నలు ఇదివరకు అడిగింది. మా అమ్మ గురించి, చెల్లెలి గురించి… ఇప్పుడు వాళ్ళని కలిశాకా అడుగుతోంది. ఇప్పటి ఆమె ప్రశ్నలలో ఒక రకమైన భయం, విచారం ఉన్నాయి. ఈ భయం నాకు బాధని కలిగిస్తోంది. స్వేచ్ఛాకాశంలో ఎగురుతూన్న కోకిలను గూటిలో బంధించచూసే వేటగాడిలా నాకు నేను అనిపిస్తున్నాను. ఈ భయం, ఈ అపరాధ భావన – వీటితోనా మేము మా జీవనయానాన్ని మొదలుపెట్టబోతున్నాం?!

పైగా వాళ్ళ గురించి నేను కొన్ని మాటలతో ఏమి చెప్పి తనకి వివరించగలను? మీ గురించో చిత్ర గురించో మా ఇంటివారితోనో మరొకరితోనో ఏం చెప్పగలను? నాలుగేళ్ళ క్రితం అన్నయ్యతో ఉండిపోదామని చెన్నైకి వెళ్ళిపోయేవరకు మేమందరం ఇక్కడే, ఢిల్లీలో, కలిసే ఉన్నాం. ఒకే ఇంట్లో ఉన్నామన్నదేగానీ నాకు వాళ్ళ గురించి ఎక్కువగా తెలీదు. పైగా ఇది ఉద్దేశానికి సంబంధించిన విషయం కదా? ప్రొఫెసర్, నిజానికి నా గురించే నేను ఏమీ తెలుసుకోలేకపోతున్నాను. ఇక ఇతరుల గురించి ఎవరికి ఏం చెప్పను?

చిత్రకే ఈ ఏర్పాటు గురించి, ఇందులో ఆమె పోషించాల్సిన పాత్ర (భార్య, కోడలు) గురించి ఇంత భయం ఉంటే, వదినకు ఇంకా ఎంత భయంగా ఉండి ఉండేదో! పెద్ద కోడలిగా ఆమె అత్తమామలతో జీవితాంతం జీవించాల్సిన మనిషి! పాపం ఆమె! ఆమెకు ప్రశ్నలు అడిగే అవకాశమే దొరకలేదు. ఏవో జాతకాలు కలిశాయని, మా అన్నయ్య, అమ్మ, నాన్న, చెల్లి నలుగురూ ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి టిఫిన్లు స్వీట్లు తిని ఆమె నడక, అలంకారం అవి టెస్ట్ చేసి వచ్చారు. పదే నిముషాలు! మంచి పద్ధతిగల ఆమ్మాయి అంది అమ్మ. వాళ్ళ నాన్నకు కొంచం చెవుడేమో అని నాకు అనుమానంగా ఉంది అన్నాడు నాన్న. అదేమీ పారంపర్యంగా కొనసాగుతూ వచ్చే లోపం కాదు అని సర్ది చెప్తూ, బాగా కలివిడి టైప్‌లా అనిపిస్తుంది అంది చెల్లి. నాకు ఆమె స్మైల్ నచ్చింది అన్నాడు అన్నయ్య. వదినా! వదినా! ఇంత కృత్రిమమైన వాతావరణంలో కూడా నవ్వగలిగావా నువ్వు! ఎంతో ప్రతిభావంతమైన నటీమణులు కూడా తమ జీవితకాలంలో ఎప్పటికీ పోషించడానికి భయబడే ఒక కష్టమైన పాత్రను ఆ పది నిముషాల్లో పోషించి ఉంటావేమో అని తర్వాత అనిపించింది నాకు. నేను నీ స్థానంలో ఉన్నట్టయితే మీరూ వద్దు మీ పెళ్ళీ వద్దు అని అందరూ షాక్ అయ్యేలా అరిచి వింతగా ఏదో తిక్కపని చేసి ఉండేవాడ్ని అని ఒకసారి అన్నాను. దానికి ఆమె నవ్వి “నువ్వు అమ్మాయివి కాదుగా!” అన్నది.

ఇప్పుడే అతనికి చిత్ర సమస్య అర్థం అవుతోంది. చిత్రలో జరుగుతున్న మార్పులు చూస్తుంటే అతని కుటుంబానికోసం ఆమె పోషించవలసిన పలు పాత్రల గురించిన విచారం ఆమెలో మొదలైంది అని తెలుస్తోంది. ఆమె ఏవేవి చెయ్యాల్సి ఉంటుందోనని భయపడుతోంది. ఆమె ఊహలు, మాయాచిత్రాలు ఒక్కోటి స్పష్టమవ్వసాగాయి. జీవితమన్నది ఒక సాయంత్రపు సంభాషణ మాత్రమేకాదు; సినిమాకు, డ్రామాకు వెళ్ళడం కాదు; విహారయాత్రకు వెళ్ళడం, హోటల్‌లో కాఫీ తాగడం కాదు! రోజూ పొద్దున లేవడం, పళ్ళు తోముకోవడం, స్నానం చెయ్యడం, బట్టలేసుకోవడం, బస్సు ఎక్కడం, ఆఫీసుకు వెళ్ళడం, సాయంత్రం మళ్ళీ బస్సు ఎక్కడం, ఇంటికి రావడం – ఇవీ ఉంటాయి. జీవితం అనేది కాఫీ కాయడం, కూరలు తరగడం, వంట చెయ్యడం, పిండి రుబ్బడం, బట్టలు ఉతకడం, ఊడవటం, తుడవటం, గిన్నెలు తోమడం, కొట్టుకు వెళ్ళడం, రేషన్ కొనుక్కోవడం, జ్వరంతో డాక్టర్ దగ్గరకు వెళ్ళడం, పిల్లల్ని కనడం, వాళ్ళను డాక్టర్ దగ్గరకు తీసుకుపోవడం, ఎక్కడెక్కడో నిలబడి, ఎక్కెడెక్కడో నడిచి, ఎక్కడెక్కడో కూర్చుని, అలిసిపోయి రాత్రి పడకలో హమ్మయ్యా అని కాళ్ళు చాపుకుని పడుకోవడం, మరుసటి రోజు పొద్దుటిదాక నిద్రపోవడం, ఇదీ జీవితం! విసుగు, అలసటలతో నిండినది. ఆకలికోసం తినాల్సి ఉంది. తినడానికోసం వంట చెయ్యాల్సి ఉంది. వంట సామాన్లు కొనడానికి డబ్బు కావాలి. డబ్బు సంపాయించటానికి ఉద్యోగం చెయ్యాలి. ఆకలికోసం పెళ్ళి కూడా చేసుకోవాలి. ఇది ఇంకో రకం ఆకలి. ఉద్యోగానికి వెళ్ళడానికి కూడా మొదట్లో అతనికి నచ్చలేదు. తప్పలేదు కదా? అదేగా అందరూ చేస్తున్నారు!

అందరూ ఉద్యోగానికి వెళ్తారు. అందరూ పెళ్ళి చేసుకుంటారు. అతనూ అందర్లాగే. చిత్ర ఉద్యోగం చెయ్యాలని ఆశపడుతోంది. అతని అభిప్రాయం ఏంటని అడిగింది. అతనిదేముంది? ఆమె కూడా ఉద్యోగానికి వెళ్ళనీ. బస్సు క్యూలలో నిలబడనీ, స్త్రీ స్వేచ్ఛ అంటూ పదినుండి ఐదువరకు ఏదో ఒక ఆఫీసులో కూర్చుని లేదా నిల్చుని రానీ. స్వేచ్ఛా చింతకాయా! స్వేచ్ఛ అంటూ ఈ ప్రపంచంలో ఏమీ లేదు. మీ అమ్మ చేసిన తప్పు నువ్వు చెయ్యకుండా తప్పించుకుందాం అనుకుంటున్నావు. నా తండ్రి చేసిన తప్పు నుండి నేను తప్పించుకోవాలనుకుంటున్నాను. ఇది ఒకదానినుండి మరోదాంట్లో చిక్కుకోవడమే. తప్పించుకోవడం అంటూ ఏమీ లేదు. దేన్నుండో తప్పించుకోవాలనుకుని, పరుగుతీసి, తీసి చివరికి మిగిలేది కాళ్ళనొప్పే!

టక్! పాలిష్ అయిపోయింది.

ఆ పిల్లాడికి మరో పది పైసలు ఎక్కువ ఇచ్చి అతను థియేటర్ వాకిలి దగ్గరకు వెళ్ళాడు. చిత్ర ఇంకా రాలేదు. కాళ్ళు ఇప్పుడు మరీ లాగేస్తున్నాయి. ఇక నిల్చోడం వీలు కాదనిపించింది. అక్కడే థియేటర్ వాకిట మెట్లమీద ఒక వారగా కూర్చున్నాడు. కాళ్ళు చాపుకున్నాడు. హమ్మయ్యా. థియేటర్లో ఇలా రిలాక్స్ అవ్వలేము. ఇక ఈమె లేట్ గానే రానీ. ఈ సినిమా చూడాలని అంత ఆసక్తేమీ లేదు. జంతువుల గురించిన మరో సినిమాకు తీసుకెళ్తానన్నప్పుడు, తననతడు ఒక చిన్నపిల్లలా ట్రీట్ చేస్తున్నాడని ఆమె అనుకుంటోంది.

నువ్వు ఉద్యోగానికి వెళ్ళడం ఎందుకు అని అతను అంటే, అతను చాలా ఛాందసుడు అని ఆమె అనుకోగలదు. అతన్ని ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేయించినందుకుగాను అడిగితే, చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నాడు అనుకోవచ్చు. ఆమె అలవాట్లు, అభిప్రాయాలు, అభిరుచులు ఎన్నిటితోనో అతను ఏకీభవించలేకున్నా అతను వాటిని అంగీకరించాల్సి ఉంది, సర్దుకుపోవాల్సి ఉంది.

తనకు నచ్చని ఒక సినిమా చూడటంకోసం తనకంటే పదేళ్ళ చిన్నదైన ఆమెకోసం అర్ధగంటకు పైగా వేచి ఉండటాన్ని తలచుకుంటే నవ్వూ పశ్చాత్తాపమూ కలిగాయి. ఇలా వెయిట్ చేయిస్తున్న కారణానికే ఇదివర్లో ఒక అమ్మాయిని తిరస్కరించాడు. అంతకు ముందు మరొక అమ్మాయి, జ్ఞానంకంటే మాటకారితనంతోను, గర్వంతోనూ వ్యవహరిస్తున్నట్టు అనిపించడతో మనసు విరిగిపోయి ఆమెకు దూరమయ్యాడు. కలుసుకోడానికి వెళ్ళిన ప్రతిసారీ తనని వెయిట్ చేయించనందుకుగానూ ఇంకో అమ్మాయిని కలుసుకోవడం మానుకున్నాడు.

ఇప్పుడు, చిత్ర నిగర్వా? జ్ఞానం ఉన్న అమ్మాయా? కానే కాదు. అయినప్పటికీ వీటన్నిట్నీ ఓర్చుకోడానికి తనని తాను తయారు చేసుకుంటున్నాడు. ఈ సర్దుబాటుకి, రాజీకి ఎప్పడో వచ్చి ఉంటే బాగుండేదనిపించింది. ఐదేళ్ళ క్రితం. మూడేళ్ళ క్రితం… ఇప్పుడు ఎందుకు రాజీ పడాలి? రాజీ పడకుండా ఉండటం వీలు కాదా?

అతనికి అక్కణ్ణుండి పరుగెట్టాలనిపించింది. ప్రొఫెసర్‌తో, తన తల్లితండ్రులతో చెప్పి ఈ పెళ్ళి ఆపించేయాలి అనిపించింది. ప్రొఫెసర్, ఐయామ్ సారీ. నేను వ్యవస్థకి వ్యతిరేకిని. మరెందుకు మీతో ఏకీభవిస్తున్నట్టు, ఒప్పుకుంటున్నట్టు నటించాను అని అడుగుతారా? నాకు తెలీడంలేదు. ప్రొఫెసర్, నిజంగానే తెలీడం లేదు. ఒకవేళ…

సరే, మీరు నాతో ఈ వ్యవస్థలను సమర్థిస్తూ మాట్లాడింది ఎందుకు? వాటిలో మీకు నమ్మకం ఉంది కాబట్టా? లేక…

నన్ను ఇందులో ఇరికించేయాలనా? మీరు నన్ను మోసం చేశారు. లేదు లేదు, నేనేగా నన్ను మోసం చేసుకున్నాను…

ఈ కాళ్ళు ఈ రోజు ఎందుకు ఇలా లాగేస్తున్నాయి? ఇన్ని ఏళ్ళుగా తాను నడిచిన నడకలన్నిటి అలసటా ఈ రోజు వచ్చి చేరిందా ఈ కాళ్ళకు అనిపించింది. తీసిన పరుగులన్నిటికీ కలిపి ఒక్కసారిగా నొప్పెడుతున్నట్టుగా ఉంది. అమ్మాయిల వెంట నడిచిన నడక, తీసిన పరుగు, వాళ్ళను విడిచి దూరంగా వెళ్ళడానికి తీసిన పరుగులు! ఇక ఎవరి వెనకా పరుగు తియ్యలేను అనిపించింది. ఇక ఎవరిని విడిచి కూడా పరుగుతియ్యలేనని అనిపిస్తుంది.

చిత్ర, ఆమె తమ్ముడు వస్తూండటం కనిపించింది.

తనకిప్పుడు కలిగింది సంతోషమా దుఃఖమా అని అతను తేల్చుకోలేకపోయాడు.