అలా ఎలా

అలా ఎలా ప్రేమించావు జీవితాన్ని
బాల్యంలో బొమ్మల్నీ
యవ్వనంలో యువతుల్నీ
ప్రౌఢిమలో బంధాల్నీ బాధ్యతల్నీ
పలుకుబడీనీ, అలవాట్లనీ
నచ్చినవో నచ్చబడినవో ప్రోగుచేయటాన్నీ
అప్పుడప్పుడూ తీరికలోనో, పొరబాటుగానో
పిల్లలనీ, ఇంద్రధనుస్సునీ, పూలనీ, రంగులనీ
ఎప్పుడూ భయాన్నీ, భద్రతనీ

అలా ఎలా ప్రేమించేశావు
నువు పుట్టడాన్నీ
నీ ముందు ప్రపంచం పుట్టడాన్నీ
అవి నిద్రలోకి రాలిపోవడాన్నీ
అనుభవాలు గతంలోకి
ఉత్సాహం భవితలోకీ జారిపోవడాన్నీ

ఇన్నివేల శ్వాసల తరువాత
మరిన్ని వేల ఊహల తరువాత
అలిసిపోయి ఎప్పుడైనా కూర్చున్నప్పుడు
నాక్కాస్త చెప్పు
అసలిదంతా ఎలా మొదలైంది
ఎలా ముగియనుంది
ఈ తీరనిదాహంలాంటి ప్రేమలోపల
ఏ రహస్యం నీకోసం ఎదురుచూస్తుంది

బివివి ప్రసాద్

రచయిత బివివి ప్రసాద్ గురించి: హైకూకవిగా, తాత్విక కవిగా సుపరిచితులు. మూడు హైకూ సంపుటాలు: దృశ్యాదృశ్యం, హైకూ, పూలు రాలాయి; నాలుగు వచన కవితా సంపుటాలు: ఆరాధన, నేనే ఈ క్షణం, ఆకాశం, నీలో కొన్నిసార్లు ప్రచురిత రచనలు. హైకూ సాహిత్యానికి గాను మచిలీపట్నం సాహితీసమితి అవార్డు, ఆకాశం సంపుటికి ఇస్మాయిల్ అవార్డుతో సహా మూడు అవార్డులూ వచ్చాయి. సంపుటాలన్నీ బ్లాగులో ఈ-పుస్తకాల రూపంలో చదవవచ్చును. ...