కవచం

‘వీడు పోడు, ఇంకోణ్ని పోనివ్వడు!’ ఎదురుగా నత్తనడక నడుస్తున్న కారు డ్రైవర్‌ని మనసులోనే విసుక్కున్నాడు సుధాకర్.

పోన్లే, పక్కేసుకుని పడుకోడుగా రోడ్డు మీద!

మాస్క్‌లోంచి పైకి తగిలిన ఊపిరి రేబాన్ అద్దాలని మసగ్గా చేసి, కనిపించేదంతా అలికేసింది. ఓసారెప్పుడో శుక్లాలకి ఉచితంగా ఆపరేషన్లు చేసే సంస్థ వాళ్ళు చందా అడుగుతూ, చిన్న ప్లాస్టిక్ షీట్‌ని కూడా పంపి, దాంట్లోంచి చూడడానికి ప్రయత్నించమన్నారు. మొత్తం మసకేసుకుపోయి కనిపించింది. ఇలాగే.

కళ్ళజోడు పైకెత్తేడు. ఇప్పుడు బెటరే. కానీ ఎండని భరించాలి.

వెధవ మాస్కు! కార్లో తనొక్కడే కూర్చున్నా పెట్టుకోవాల్సిందే. యే ఇన్‌ఫెక్షనూ లేకపోయినా సరే. పోనీ ఇంకెవరన్నా పక్కనున్నప్పుడు పెట్టుకోవాలంటే అర్థముంది. అయినా ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరు, ఏ ఇన్‌ఫెక్షనూ లేదని ఖచ్చితంగా తెలిసినప్పటికీ – పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఎటూ తప్పదు – సొంత వాహనంలో వెళ్తున్నప్పుడు కూడా పెట్టుకునే ఉండాల్ట. హుఁ!

అయినా అటూ ఇటూ కాకుండా మధ్యాహ్నం రెండింటికి షూటింగేంటి? స్టూడియో చాలా దూరం. వెళ్ళడానికి రెండు గంటలు పడుతుంది. ఇప్పుడీ నగరంలో ట్రాఫిక్కుకి రోజంతా పీక్‌టైమే. ఒకప్పుడైతే నిర్మొహమాటంగా చెప్పేవాడే రాలేనని. లాక్‌డౌన్ నుంచి బయటపడుతున్న ఈ రోజుల్లో ఆ పరిస్థితేదీ?

పైగా సుందర్… ఒకప్పుడు ‘ఏవన్నా అవకాశాలుంటే చెప్పండి సార్’ అంటూ వెంటబడ్డ సుందరే ఇప్పుడు తనకి అవకాశమిస్తోంది. ఏదో సామెత గుర్తొచ్చింది.

…మాస్కుతో అన్నీ ఇన్నీ ఇబ్బందులా? తనైతే రోజూ మర్చిపోతుంటాడు. చచ్చినట్లు మూడంతస్తులూ ఎక్కి మరీ తెచ్చుకోవాల్సిందే. ఎందుకోగానీ, ఉతికిన మాస్కే ఒక్కోసారి నీచుకంపు కొడుతుంది. పారెయ్యక తప్పదు. పారెయ్యడానికి మనసొప్పదు. ఇహ మాస్క్‌ పెట్టుకున్నప్పుడు తుమ్మో దగ్గో వచ్చిందంటే, కంపే కంపు. ఎలకేదో చచ్చినంత. పైగా అప్పుడప్పుడూ మీసపు వెంట్రుక ఒకటి ముక్కుపుటాల మీద టచ్ అవుతూనే ఉంటుంది. గోక్కోవాలనిపిస్తుంది కానీ మాస్క్‌ని ముట్టుకోకూడదని సూత్రం ఉండనే ఉంది. మీసాలు తీసేద్దామా అంటే, ఆవిడొప్పుకోవద్దూ!

ట్రాఫిక్ కదలదేం? వి.ఐ.పి. మూవ్‌మెంటల్లే ఉంది.

ఇవన్నీ ఒకెత్తు. తెలిసిన మొఖాలు కూడా మాస్క్‌తో మారిపోయి, గుర్తుపట్టడం కష్టమౌతోంది. తెలిసినావిడో ఆయనో ఎదురైతే గుచ్చి గుచ్చి చూస్తున్నట్లే ఉంటుంది గాని, వాళ్ళు నవ్వినా, మనం నవ్వినా తెలిసిచావదు నోటితో పలకరించేదాకా.

ఇంతకీ ఎదటి వాహన చోదక బాధ్యతలు నెరవేర్చుతున్నదెవడు లేక ఎవతి? చోదకుణ్ణి స్త్రీలింగంలో ఏమంటారో? ఓ! అంకుల్‌గారు… మెల్లగా, ప్రపంచంలోని టైమంతా తనకే ఉన్నట్లు రోడ్డుమీద స్పెండ్ చేస్తున్నారు. అబ్బ పోనిద్దూ. ట్రాఫికే అంత మెల్లిగా పాకుతుంటే ఆయన మాత్రమేం చేస్తాడు? ఒరే చైల్డూ, నువ్వు కాసేపు గోల చెయ్యకు. నన్ను డ్రైవ్ చెయ్యనీ! అయామోకే, యూ ఆర్ ఆల్సో ఓకె!

మాస్క్‌ని కిందకి జరిపేడు. ముక్కు ఫ్రీ అయింది.

ట్రాఫిక్ కదిలి స్పీడందుకుంది.

“చెప్పండి సార్. యేంటి విశేషాలు?” పాతికేళ్ళ కుర్రాడిలా కనిపిస్తున్న గెటప్‌లో వచ్చి, కూర్చుంటూ అడిగాడు సుందర్.

“ఏముందోయ్? ఏదో అడపాదడపా కాల్షీట్లు. జరిగిపోతోంది. అరె, మాస్క్ తియ్యకుండానే మేకప్ వేయించుకున్నావా ఏంటి?” లేని జోవియల్‌నెస్‌ని వీలైనంతగా గొంతులో అనుకరిస్తూ అడిగాడు.

“అలవాటైపోయింది సార్. జాగ్రత్తగా పెట్టుకున్నాను.” నవ్వుతూనే జవాబిచ్చాడు సుందర్. “మాస్క్ మీద కూడా మేకప్ వేసేంత వీరుడైతే, మనకి మేకప్ చెయ్యాల్సిన ఖర్మెందుకు పడుతుందండి వాడికి!”

రెండు క్షణాలాగి “ఊఁ, యేంటి సంగతులు? మళ్ళీ ఏమన్నా కబుర్లు తెలుస్తున్నాయా వీనస్ స్టూడియోవి?” కావాలనే కదలేశాడు.

“లేదు సార్. ఆ పేమెంటు ఇప్పుడప్పుడే వచ్చేట్టు లేదు.”

“ఊ…” అన్నాడు తనకది లెక్కలేనట్లు. తప్పదు.

“పిల్లలు బాగున్నారా? ఏం చేస్తున్నారు? అన్నట్టు మీ అమ్మాయి ట్రైనింగ్ ఇంకా ఎన్నాళ్ళుంది?” ఇంటర్మీడియట్ పూర్తవుతూనే ఆర్మీకి సెలెక్ట్ అయిన సుందర్ కూతురిని గురించి అడిగాడు. మామూలుగానే ధ్వనించడానికి ప్రయత్నిస్తూ. ఏదో గుచ్చుకుంటోందేంటి?

“ఎక్కడ సార్. సరిగ్గా వెళ్ళి చేరాల్సిన టైముకి దానికేదో మెడికల్ ప్రాబ్లమొచ్చింది. చేరలేకపోయింది.”

“ఓ!” అమ్మయ్య!

రైటర్ కూడా వచ్చాడక్కడికి. షాట్‌కింకా టైముంది. పిచ్చాపాటీ మొదలైంది.

“ఏం సార్, బాగున్నారా?” అన్నాడు రైటర్ పలకరిస్తూ. వెడల్పుగా చిరునవ్వుని ప్రదర్శిస్తూ “ఆఁ. బానే ఉన్నామండీ. మీరెలా ఉన్నారు?” అన్నాడు పక్కనున్న అద్దంలో తన గెటప్‌ని చూసుకుంటూ. మరీ ముసలివాడిగా కనిపించేట్లు వేశాడు మేకప్. అయినా ఇప్పుడు కొత్తగా వచ్చే యవ్వనమేముందిలే. ఎనభైలో రావాల్సిన వైరాగ్యమంతా నలభైలోనే వచ్చేస్తోంది తనకి.

“ఇరవయ్యేళ్ళైంది సార్ ఈ ఫీల్డులో. చాలా కొద్దిమందికే వోల్డు గెటప్పు సరిగ్గా అతికిద్ది. గవర్రాజుగారు చూడండి. తిప్పి కొడితే నలభై లేవు. మీకులాగే. ‘సుందరాంగి’లో అరవై యేళ్ళ ముసిలోడైపోయాడు. సూపరు. ఆయన్నా ఆ గెటప్‌లో చూస్తే, నాకు మా తాతే గుర్తొచ్చాడు. అంత సూపర్ అనిపించాడు!”

ఇంతకీ ఏమిటి?

“సుదర్శన్‌గారూ అంతే. ఓహోహో! ఆయన్ని విశ్వామిత్రుడి గెటప్‌లో చూసి, దణ్నం పెట్టనోళ్ళు లేరండి. ఒక్కోళ్ళకి ఒక్కోసారి అలా సెట్టయిపోద్ది.”

నవ్వాల్సొచ్చింది.

“వెంకట్‌గారు కూడా అంతేనండి.” పక్కనుంచి అందించాడు సుందర్.

వేడిగా అనిపిస్తోందేంటి? ఫ్యాన్ తిరుగుతోందా అసలు?

“అవునవును. మొన్న వెంకట్‌గారు ముసలిగొంతుతో డైలాగ్ చెప్తుంటే మీరు చూడాల్సిందే. అసలలా వాయిస్‌ని మాడ్యులేట్ చెయ్‌టం అందరివల్లా అయ్యేదిగాదు. నాకు చాలా చాలా నచ్చింది. నేనెప్పుడూ ఆయన్నే పెట్టుకోమంటాను.”

మాస్క్‌ని మేకప్ రూంలోనే వదిలినందుకు తిట్టుకుంటూ, మళ్ళీ చిరునవ్వు అతికించుకున్నాడు. వచ్చింది నటించడానికేగా!