కృష్ణగీతాంజలి

ఈ నెలలో వినిపిస్తున్న పాటలన్నీ దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసినవి. 1938లో తెలుగు ప్రసారాలు మొదలయిన నాటినుండి కృష్ణశాస్త్రి రేడియో కోసం చాలా పెద్ద సంఖ్యలో పాటలు, సంగీత రూపకాలు రాశారన్న విషయం అందరికీ తెలిసినదే. వాటిలో సుమారు రెండువందల పాటలు బాలాంత్రపు నళినీకాంతరావు, బొమ్మకంటి శ్రీనివాసాచార్యుల సంపాదకత్వంలో రెండు సంపుటాలుగా–అమృతవీణ, మంగళకాహళి (1982)–వెలువడ్డాయి. ఆ రెండు పుస్తకాలు దగ్గర పెట్టుకుని నా దగ్గరున్న దేవులపల్లి పాటలన్నిటినీ డిజిటైజ్ చేసి ఒకచోటికి చేర్చే పని ఈ మధ్యనే మొదలుపెట్టాను. ఈ పనిలో ఎప్పుడో పన్నాల సుబ్రహ్మణ్యభట్టుగారు విజయవాడ రేడియో స్టేషన్ నుండి కృష్ణశాస్త్రి పాటలతో ప్రసారం చేసిన కృష్ణగీతాంజలి అన్న ప్రత్యేక కార్యక్రమం టేపు ఒకటి బయటపడింది. (ఆ టేపు నాకు భట్టుగారే ఇచ్చారు.) దానిలో ఎప్పటినుండో వెతుకుతున్న ఎన్. సిహెచ్. వి. జగన్నాథాచార్యులు పాడిన ‘ఒక తుమ్మెద మదిలో ఝుమ్మంది’ ఉంది. ఈ నెల వినిపిస్తున్న పాటల్లో అది హైలైట్–ఎందుకంటే అరుదయినది కాబట్టి. ఇదే పాటని రామలక్ష్మి రంగాచారి కూడా పాడారు. అది కూడా ఇక్కడ వినవచ్చు. కృష్ణగీతాంజలి కార్యక్రమం నుంచే మరొక నాలుగు పాటలు: ‘ఎక్కడ నుండో ఈ పిలుపు’ (శ్రీరంగం గోపాలరత్నం); ‘నీ యడుగులే గాక’, ‘ఏలా ఈ మధుమాసము’, ‘వెదకి వేసారిన’, కూడా ఈ సంచికలో వినవచ్చు.

ఓలేటి వెంకటేశ్వర్లు పాడిన ‘కడచేనటే సఖియా’ చాలామందికి తెలిసి ఉండవచ్చు. ఓలేటి పేరు వినగానే వెంటనే స్ఫురించే పాట; 12-13 సంవత్సరాల క్రితం ఈ పాటని ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సమర్పించిన ఒక టి.వి. కార్యక్రమంలో మల్లాది బ్రదర్స్‌లో ఒకరైన రవికుమార్ పాడి బోలెడు ఆసక్తిని రేకెత్తించి కొత్త తరానికి కూడా పరిచయం చేసిన పాట.

‘ఆకులో ఆకునై’, ‘శీతవేళ రానీయకు’, ముందు కవితలుగాను, తరవాత సినిమా పాటలుగాను (మేఘసందేశం, 1982) అందరికి పరిచయం. వాటిని రేడియోలో లలితగీతాలుగా పి. శాంతిశ్రీ, ఆర్. ఛాయాదేవి గొంతుకలలో ఈ సంచికలో వినండి. (సుమారు 85 ఏళ్ళ క్రితం స్థానం నరసింహారావు పాడిన ’ఆకులో ఆకునై’ మార్చ్ 2004 సంచికలో ఉంది.)

  1. ఒక తుమ్మెద మదిలో ఝుమ్మంది. గానం: ఎన్. సిహెచ్. వి. జగన్నాథాచార్యులు.
  2. ఏలా ఈ మధుమాసము.
  3. నీ యడుగులే గాక.
  4. వెదకి వేసారిన.
  5. ఎక్కడనుండో ఈ పిలుపు. గానం: శ్రీరంగం గోపాలరత్నం.
  6. ఒక తుమ్మెద మదిలో ఝుమ్మంది. గానం: రామలక్ష్మి రంగాచారి.
  7. కడచేనటే సఖియా. గానం: ఓలేటి వెంకటేశ్వర్లు.
  8. శీతవేళ రానీయకు. గానం: ఆర్. ఛాయాదేవి.
  9. ఆకులో ఆకునై. గానం: పి. శాంతిశ్రీ.