మాయావి

అవును
నువు వెన్నెలల నెత్తుకుపోయే
మాంత్రికునిలా మాటలకోసం
వలవేసి ఎదురుచూస్తావు

అవికూడా దారి తప్పి
తిరుగుతూ
తమవైన వాసనలతో
నీ కంటనే పడతాయనుకుంటా

అనుకున్నట్లే అవి
అమాయకంగానే
నీ ఊహల ఉచ్చుల్లోకి
జారి ఆ గదిలో
సర్దుకు కూచుంటాయి

వాటికెపుడు పోస్తావో
ఆ మార్మిక జీవాన్ని
ఎవరి గుండెలోనో
కంటితడిలోనో
పొర్లాడి వచ్చిన పుప్పొడిని
ఆ గదినిండా కుమ్మరిస్తాయి
వెంటనే దాన్నొక తేనెపట్టులా మార్చి
నువ్వు తాళం పెట్టేస్తావు

ఒక మనిషి వాసనల కవితే కదా
నీకూ కావలసింది
నీ మనసు ఇంకొక గది నింపేందుకు
ఒక కొత్త వలను తయారు చేస్తుంటుంది.


విజయ్ కోగంటి

రచయిత విజయ్ కోగంటి గురించి: విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ...