[ఈ మధ్య యాదృఛ్ఛికంగా వేటూరి ఆనందమూర్తిగారు (టాగోర్ నేషనల్ ఫెలో, TMSSML&RI / Ministry of Culture, New Delhi), జెజ్జాల కృష్ణ మోహనరావుగారు ఈ యక్షగానం గురించి చర్చించుకుంటుంటే చూడటం జరిగింది. దీనికి బాలాంత్రపు రజనీకాంతరావు గారు సంగీతం కట్టి 1999 వేసవిలో విజయవాడ రేడియో కేంద్రం ద్వారా ప్రసారం చేసిన విషయం గుర్తుకు వచ్చింది. (ఆ సమయంలో నేను ఇండియాలో వుండటం, కార్యక్రమం ప్రసారం కాబోతుందని రజనిగారు ముందుగానే చెప్పటం వల్ల రికార్డు చేయగలిగాను.) మరి అరుదైన రచన అన్నారు కాబట్టి నేను రజనిగారు ప్రసారం చేసిన కార్యక్రమం వినిపిస్తాను, దానికి కొంత చారిత్రక నేపథ్యం అందజేయగలరా అని అడిగినవెంటనే అంగీకరించి వివరాలు పంపిన ఆనందమూర్తిగారికి నా కృతజ్ఞతలు. — శ్రీనివాస్.]
భీమసేనవిజయం యక్షగానం: అసమగ్రప్రతి – ఒక పరిశీలనం
ఇటీవల తంజావూరు సరస్వతీ మహలు లైబ్రరీలో, టాగోర్ నేషనల్ రిసెర్చి ఫెలోషిప్ పనిమీద జరుపుతున్న నా పరిశోధనలో నాగరిలిపిలో గల తాళ్ళపాక పెదతిరుమలాచార్యుల నీతిసీస శతకమూ, దానితోపాటు అనుబంధ రచనగా నాగరిలిపి లోనే గల, కర్త పేరు తెలియని, భీమసేనవిజయం అనే మరొక అసమగ్ర యక్షగానమూ నా దృష్టి నాకర్షించాయి. ఆ కాగితపు ప్రతుల్ని పరిశీలించి చూడగా మొదటిదాని వలెనే రెండోదైన యక్షగాన రచన కూడా తాళ్ళపాక (పెద తిరుమలాచార్యుల?) వారి రచనే అయివుండవచ్చనే భావం కలిగింది. తరువాత ఇది ప్రచురించబడిందని తెలిసింది. శ్రీ జె. మోహన రావుగారు అచ్చుప్రతి వివరాలనూ, శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు భీమసేనవిజయం ఆడియో రికార్దింగ్‌నీ పంపగా చూసీ, వినీ పరమానందం చెందాను.
ఇప్పుడు తదుపరి పరిశీలనార్థం వాటి ప్రత్యంతరాల అన్వేషణ కూడా సాగిస్తున్నాను. ఎందుకంటే లభించిన వాటి ప్రతులు అతుకులు గానూ అసమగ్రాలు గానూ ఉన్నట్లు తోచింది. సంగ్రహంగా వివరిస్తాను.
- వీటిలో తాళ్ళపాకవారి నీతిసీస శతకాన్ని ఒక ఉగాదినాడు అభిమానంతో అనేక ప్రతులు నాగరిలిపిలొ రాయించి భద్రపరిచిన మహానుభావుడు నాటి మరాఠా ప్రభువుల మంత్రిసత్తముడైన వరాహప్పయ్య దీక్షితులవారు. ఆ ప్రతులు తంజావూరు వ్రాతప్రతుల్లో వేరే ఉన్నాయి. ఇప్పుడు జంటగా దొరికిన ఈ నాగరిలిపి ప్రతుల్లోని నీతిసీస శతకం యిది తులజా మహారాజుగారి ప్రీత్య్రర్థం రాయించబడినట్టుగా గ్రంథంలో ఉంది. తిరుపతి రేకుల్లో ఉన్నట్లే ఇందులోనూ సమగ్రంగా నూరుపద్యాలూ ఉన్నవి.
- ఇక రెండోది యక్షగాన రచన భీమసేన విజయం. విరాటపర్వంలోని కీచకవధ ఇతివృత్తంగా గలది. తాళ్ళపాకవారు యక్షగానాన్ని రాసి ఉంటారనే సూచనలు, పరోక్ష ఆధారాలూ కొన్ని ఉన్నా, తిరుపతిలో అందుకు తగినట్టి దాఖలాలు రేకుల్లో కాన రాకున్నా, పైపెచ్చు ఈ యక్షగానం అక్కయ కవి కృతంగా లభించిన గ్రంథస్థాధారాన్ని బట్టి తెలియవస్తున్నా, యక్షగాన చరిత్రకారులూ A విధంగానే తీర్మానించి ఉన్నా కూడా, ఇది తాళ్ళపాకవారి రచనాప్రభావం గల రచనయేమో అని ఇంకా క్షుణ్ణంగా పరిశీలించ వలసిన పాఠ్యంగా అనిపించింది. ఇంతకుముందు గుత్తెనదీవి రామాయణం విషయంలోనూ ఇట్లాగే జరిగింది (చూ. విస్సా అప్పారావుగారి శతజయంతి సంచిక ‘అర్చన’లోని నావ్యాసం). అన్వేషిస్తున్నాను. ఈ క్రింది అంశాలన్నీ పరిశీలనార్హములు:
- ‘శ్రీదేవి యురమున’ అనే శతకపద్యారంభంతోనే మొదలుకావడం (చూ. చి.తి. రచనలు).
- వెంకటేశ్వరస్వామివారికి అంకితం కావడం.
- రచన విడిగా ‘వెంకటరాయ’ముద్రతో ఉండడం (’వెంకటరాయ’ ముద్రతో ఇందులో చేరిన పాటలు అక్కయ్య వగునా? లేక తాళ్ళపాకవారిలోని ఐదవ పదకర్తవా? అని భావించడం).
- ‘పరకాంతకై సింహబలు డట్లు మృతుడయ్యె’(17) అనే పె. తి. శతక పద్యార్థాన్నే ఇతివృత్తంగా గ్రహించడం.
- తాళ్ళపాకవారి భావాలూ, పదబంధాలూ, రచనాశైలీ పున:పునరావృతాలు కావడం.
- ఈ తాళబద్ధాలైన ప్రశస్త సంగీత రచనలోని వైవిధ్యము, శయ్యాసౌభాగ్యము, ద్విపదగతి, చందోలంకారప్రౌఢి, ప్రాసలు, అనుప్రాసలు, శబ్దాలంకారాలు, దేశి పలుకుబడి, అన్నీ తాళ్ళపాకవారి రచనలను తలపించేవిగా ఉండడం (అలాగే తిక్కన, సంకుసాల మొ. ఇతర కవులవీ).
- ముఖ్యమైనవి: వెన్నెలబొమ్మా- (విచ్చేయవమ్మావెన్నెలబొమ్మా); హరి పట్టపురాణిని గొలుతున్; ఎట్టు మోచెనో యీనడుము (ఒత్తుకొనివచ్చు..); కలికిజక్కవజంట గలికి చనుకట్టు; పొలతుక దేహసౌరభము (గంధ మేలే నీ చక్కనిమేనికి); కన్నడ చేసిన; మోరతోపు; అందని మ్రాని పండ్లకు; మౌనికైన విరాళి పుట్టెద (కవికర్ణ); నోచిన నోము; మాయల చుప్పనాతి; బెబ్బులియున్న పొదజొచ్చు కొదమలేడి చందమున; ఆడబోయినతీర్థ మెదురైనట్లు; పాతరకత్తియ బాగున; నాదు రమణుండు నాటకుడు; తాళుకొనరాదా; ఎండకన్నునీడకన్ను; కక్కూర్తి; సవరని నుదురు; అనవలసంటిగాక; మొగి బమ్మరించున్; చేతులు పిసుకుకొంచు; బొమ్మంచు పచ్చడము; విదురుచే విందుగొన్నట్టి (విదురునివిందా గోవిందా); కనుమర్లుగొని, మొదలైనవి.
- అసలు భీమసేన విజయానికి ప్రతు లెన్ని లభించినవి? కర్తపేరు అక్కయగా ఎన్నింట కలదు? పేరులేని వెన్నికలవు? రాజమండ్రిలోని అసమగ్ర ప్రతి ఎవరిది? అందులో ఎట్లున్నది?. (ఇట్లా పేర్లు తారుమారులైనవి ఇతరములూ ఉన్నవి. గుత్తెనదీవి రామాయణానికి రాఘవదాసుపేరు వచ్చిచేరినట్లు!) (అక్కయ్యను గురించి డా. జితేన్ద్రబాబుగారు పంపే సమాచారము కూడా రాగనే సమన్వయించి పరిశీలించవలసి ఉంది).
- ఇంకా ఇది కాలం తేలని యక్షగానంగానే ఉందా?
- అప్పటి తంజావూరు యక్షగానాలలో అరువుబరువులు కలవీ, కలగాపులగమైనవీ, తాళ్ళపాకవారి ప్రస్తావనలు గలవీ మరికొన్ని ఉన్నవి (చంద్రశేఖరవిలాసం, పాండవ అజ్ఞాతవాసం, పారిజాతాపహరణం, భారతం విరాటపర్వకథ, లక్ష్మీకల్యాణం వగైరాలు).
- వీటితో పాటు మార్చి,10,12 తేదీలలో ఫేస్‌బుక్‌లో పేర్కొన్న అంశాలు కొన్ని.