అద్దం ముందు కూర్చుని
అలవాటుగా నా తలారబోసుకుంటా.
అబద్ధం ఎదుట నిలబడి
పొరపాటుగా ఒక కలారబోసుకుంటా.
నీరెండ తాకిడికి
నిమిషాల్లోనే తలారిపోతుంది.
తలారుతున్న క్షణాల్లోనే
తలలో తలపుల మొలకలు మొలుచుకొస్తాయి.
చీకటి రాత్రి చిక్కబడక ముందే
గ్రహపాటుగా నా గుండెనెండబెట్టుకుంటా.
చుక్కపొడుపు పొడిచేలోపే
ఏమరుపాటుగా నా ఆశలార్చుకుంటా.
కన్నీళ్ళ వెచ్చదనానికి
అబద్ధం కరిగిపోతుందనుకుంటా.
అదేం ఖర్మమో! అది మరింతగా గడ్డకడుతుంది.
కలారేసుకున్న పొరపాటు
గుండెలో మరింత పచ్చిగా సలపరిస్తుంది.