గల్ఫ్ గీతం: 3. ఆబు దాబి

ఫిబ్రవరి ఏడు. దుబాయ్‌లో మూడవరోజు.

ఆ రోజంతా మూడు ఇళ్ళూ ఆరు పర్యాటక ప్రదేశాలుగా గడిచింది.

శుక్ర, శనివారాలు గల్ఫ్ దేశాల్లో వారాంతపు శెలవు దినాలు. ఆ రెండురోజులూ రాజేషూ భార్గవీ నాకోసం కేటాయించేశారు. శుక్రవారమంతా రాజేష్‌తో కలసి ఆబు దాబి, శనివారం భార్గవీ హన్ష్‌లను కలుపుకొని దుబాయ్‌లో నేను ఇప్పటిదాకా చూడనివి, రాజేష్ ప్రత్యేకంగా తాను దగ్గరుండి చూపించాలనుకొంటున్నవీ చూసిరావడం-అదీ ప్లాను.

“ఆబు దాబికి ప్రవీణగారి సతీష్, నాగభూషణంగారు కూడా వస్తున్నారు. మనం వెళ్ళి సతీష్‌గారిని పికప్ చేసుకొందాం. ముగ్గురం కలసి నాగభూషణంగారింటికి వెళదాం. మన బ్రేక్‌ఫాస్ట్ వాళ్ళింట్లోనే.” చెప్పాడు రాజేష్.

నాగభూషణంగారి గురించి నేను దుబాయ్ చేరడానికి వారం పదిరోజుల ముందునుంచే చెప్పుకొస్తున్నాడు రాజేష్. “ఇక్కడకు మీరు రావడం కోసం నాకన్నా ఆత్రంగా నాగభూషణంగారు ఎదురుచూస్తున్నారు. మీ కుటుంబమంతా బాగా తెలుసట. మీ నాన్నగారితో వ్యక్తిగత పరిచయం ఉందట. మీ దిగవల్లి బాబాయి కొడుకులు, ఈయన సమవయస్కులు. గత పదిహేను ఇరవై ఏళ్ళుగా కన్‌స్ట్రక్షన్ రంగంలో ఉన్నారు. పెద్ద పెద్ద భవనాల నిర్మాణం వెనక ఈయన ప్రమేయం ఉంది.” నాగభూషణంగారిని కలుసుకోవాలని నేనూ కుతూహలపడ్డాను.

ప్రవీణ ఫేస్‌బుక్ స్నేహితురాలు. ఫేస్‌బుక్ పరిచయాలన్నిటిలాగే ఈవిడ పరిచయమూ మహా ఆసక్తికరంగా జరిగింది. ఆరేళ్ళ క్రితం ఏదో సామాజిక విషయం మీద మా కామన్ ఫ్రెండ్ నారాయణస్వామి ఒక పోస్టు పెడితే మేమిద్దరమూ స్పందించాము. ఆమె స్పందన దాదాపు నా స్పందనలానే ఉన్నా ఏదో వివరంలోనో అభిప్రాయంలోనో తేడా కనిపించింది. ఆ తేడా విషయంలో నేను చొరవచేసి కాస్తంత సూటి అయిన ప్రశ్నే లేవనెత్తాను. మా కామన్ ఫ్రెండు ‘ఆవిడతో పెట్టుకోకండి. సీమటపాకాయలాంటి మనిషి. విజయవాడ కమ్యూనిస్టు. జాగ్రత్త!’ అని సరదాగానే కాస్తంత గిల్లాడు. ఆ గిల్లుడు సంగతి ఎలా ఉన్నా ‘విజయవాడ, కమ్యూనిస్టు’ అనగానే తిన్నగా (మర్యాద లేకుండా!) ఇన్‌బాక్స్‌లోకి వెళిపోయి ‘మీదీ మాదీ విజయవాడ. కమ్యూనిస్టు అంటున్నారు. మాకూ ఆ బాపతు ఛాయలుగలవు. మీ లెఫ్ట్ కుటుంబపు వివరాలు ఏమిటీ?’ అంటూ మెసేజ్ పెట్టేశాను. ‘హమ్‍సే దోస్తీ కరోగీ?’ అంటూ ఫ్రెండ్ రిక్వెస్టూ పెట్టాను. ఆవిడ నవ్వేసి ‘ఆ నాసీ అలానే అంటారు. విజయవాడ అన్న మాట నిజం. కమ్యూనిస్టు అన్నమాట ఆయన వేళాకోళం. ఎనీవే గత కొద్ది నెలలుగా మీ తిరుగుళ్ళూ ఆ హడావుడీ గమనిస్తున్నాను. ఓకే, వి ఆర్ ఫ్రెండ్స్!’ అన్నారు. అదిగో అలా జరిగింది మా పరిచయం. మెల్లమెల్లగా ఆ స్నేహం గట్టిపడటం, దుబాయ్ వెళదామని అనుకోగానే ఆమెకు చెప్పడం, మా ఇంట్లో కూడా రెండ్రోజులు ఉండేలా ప్లాను చేసుకోండి అని ఆమె ఆహ్వానించడం, రాగానే ఆమెకు ఫోనుచేసి కాసేపు మాట్లాడటం-అదీ నేపథ్యం. ఆమె షార్జా యూనివర్సిటీలో కంప్యూటర్ అధ్యాపకురాలు. సతీష్ దుబాయ్ ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో కంప్యూటర్ ఇంజినీరు.

ఆబు దాబి వెళ్ళిరావడమంటే అంతా కలసి నాలుగువందల కిలోమీటర్లు. రోజంతా పట్టేస్తుంది. తిరిగి తిరిగివచ్చాక మళ్ళా అంతా కలసి ప్రవీణవాళ్ళింట్లో డిన్నరన్నది ఆనాటి చిట్టచివరి కార్యక్రమం.

ఇంకా తెలవారకముందే రాజేష్‌వాళ్ళ షార్జా ఇంటినుంచి బయల్దేరాం. సతీష్-ప్రవీణల ఇల్లు షార్జా-దుబాయ్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. అంతా కలసి పదినిమిషాల దూరం. సతీష్ కోసం ఇంటిదగ్గర ఆగితే అతనికన్నా ముందే ప్రవీణ వచ్చి పలకరించారు. మిత్రసాంగత్య పరవశం మాకు తెలియకుండానే చుట్టుముట్టింది. కరచాలనం-హగ్. ‘రండి, కాఫీ తాగి వెళుదురుగాని.’ ఆమె ప్రతిపాదన. మాకున్న కిక్కిరిసిన కార్యక్రమం దృష్ట్యా అక్కడ ఆ పావుగంట ఆగడం సాధ్యం కాదని రాజేష్ తటపటాయింపు. నేను కాస్త పక్షపాతం చూపించి త్రాసును కాఫీవేపు మొగ్గేలా చేశాను. పావుగంట అరగంట అయింది!

నాగభూషణంగారి ఇల్లు దుబాయ్ నగరం దాటి, శివార్లు కూడా దాటుకొని, సుమారు నలభై కిలోమీటర్లు వెళ్ళాక విశాలమైన ఆవరణలో కట్టుకొన్న ‘అరేబియన్ రాంచెస్’ అన్న ఆధునిక గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. మామూలుగానే దుబాయ్ నుంచి గంట దూరమనుకొంటాను, ఏదో సైకిల్ రాలీ జరుగుతూ ఉండటం వల్ల ముఖ్య రహదారి నుంచి పక్కకు మళ్ళవలసి రావడంతో ప్రయాణ సమయంలో మరో అరగంట చేర్చవలసివచ్చింది. నాగభూషణంగారూ శిల్పగారూ ఆప్యాయంగా మా ముగ్గురినీ ఆహ్వానించారు. చూడగానే కొత్త మనుషులు అనిపించలేదు. క్షణాల్లో మాటల్లో పడ్డాం. వాళ్ళ పిల్లలు సుహాస్, వినీల్‌లకు ఏదో పరీక్షల సమయం అనుకొంటాను-శిల్పగారు మాతోనూ పిల్లలతోనూ ద్విపాత్రాభినయం చెయ్యవలసివచ్చింది. నాగభూషణంగారు వయసులో నాకన్నా బాగా చిన్నే అయినా గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి దాకా అనుభవంలో ఎంతో ఎంతో పెద్దవారాయన.

నలుగురమూ నాగభూషణంగారి ఇల్లు వదలి ఆబు దాబి దారి పట్టేసరికి పది దాటేసింది. “అమరేంద్రగారూ, గమనిస్తున్నారా… దుబాయ్ ఎమిరేట్ నుంచి ఆబు దాబి ఎమిరేట్ లోకి వచ్చేసరికి రోడ్డు రంగూ కండిషనూ మారాయి. ఆబు దాబి ఆర్థికంగా, రాజకీయంగా, భౌగోళికంగా ఏడు ఎమిరేట్లకు నాయకత్వం వహిస్తోన్న మాట నిజమే కానీ ఆధునికత, సాంకేతికత, అంతర్జాతీయత, వాణిజ్యపరమైన ముందడుగులు-వీటిల్లో దుబాయ్‌దే అగ్రస్థానం. అయినా దుబాయ్ అధినేత కూడా ఆబు దాబి నాయకుని పెద్దరికాన్ని గౌరవిస్తాడు. అలాగే దుబాయ్ ఏమన్నా ఒడిదుడుకుల్లో పడ్డప్పుడు ఆబు దాబి అడగకుండానే ఆదుకొంటుంది. ఉదాహరణకు దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా. అది ప్రపంచంలోకెల్లా ఎత్తయిన భవనం. ముందు దాన్ని ‘బుర్జ్ దుబాయ్’ అని పిలిచారు. కానీ దుబాయ్ రాజు తనకు ఆబు దాబి ప్రభువు మీద ఉన్న గౌరవంవల్ల, అవసరమైన సమయాల్లో ఆయన చేసిన సహాయానికి కృతజ్ఞతతోనూ చివరి నిముషంలో ఆ భవనం పేరును ‘బుర్జ్ ఖలీఫా’గా మార్చారు. ఈ సామరస్యం, సమన్వయం మనకు ఈ ఏడు ఎమిరేట్స్‌లోనూ అడుగడుగునా కనిపిస్తుంది. అది వాటి అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది.” అతిముఖ్యమయిన స్థానిక వివరాలు అందించాడు రాజేష్.

ఆబు దాబిలో మా ముఖ్యలక్ష్యం ఆ ఊర్లో ఉన్న గ్రాండ్ మాస్క్ చూడటం. ఆ తర్వాత ఊర్లోని పాలెస్ చూడటం, నగర వీధులతో సాగరతీరాలతో పరిచయం ఏర్పాటు చేసుకోవడం. కానీ నగరం చేరడానికి ముందే రాజేష్ మరో రెండు ప్రదేశాలను మా కార్యక్రమంలో చేర్చాడు: సుదీర్ఘమైన బోర్డ్‌వాక్ ఉన్న ఆబు దాబి మడ అడవులు, యాస్ ద్వీపంలో నెలకొనివున్న ఫెర్రారివారి ప్రపంచమూ. దుబాయ్‌లాంటి ప్రదేశంలో బీచ్‌ ఉండటం ఊహించాను కానీ ‘మడ అడవి’ అన్న మాటే అంతవరకూ నా ఊహకు అందలేదు. పదిరోజుల క్రితమే అక్కడ బోర్డ్‌వాక్ ఓపెన్ చేశారు అని రాజేష్ చెప్పగానే గొప్ప కుతూహలం… అక్కడికి చేరాక ఆ కుతూహలం కాస్తా ముందు ఆశ్చర్యంగానూ, మెలమెల్లగా ఆనందంగానూ పరిణమించింది.


పల్చటి పచ్చదనపు నిశ్చలమైన జలాలు నిండిన విశాలావరణంలో చిక్కని పచ్చదనపు మడచెట్లు. వాటిమీదుగా మూడునాలుగు కిలోమీటర్లు చెక్కతో చేసిన అతి చక్కని బోర్డ్‌వాక్. దారిపొడవునా ఏవేపు వెళితే ఎటు చేరతామో చెప్పే చిన్న చిన్న సైన్‌బోర్డులు. ఈలోగా నాగభూషణంగారు, సతీష్‌లతో పండుతోన్న సంభాషణ… మధ్యలో ఎక్కడో కాలిక్రింద ఉన్న ఆ చెక్క బోర్డులు కూడా తీసేసి, అతి దిట్టమైన వలపరచి, క్రిందనీళ్ళు కనిపించేలా చేసి, దానిమీద నడవడానికీ గెంతడానికీ అనుగుణంగా చేసి కనిపించగా, అక్కడ మా గెంతుల కేరింతలు… సెక్యూరిటీ యువకుడు వచ్చి ఎంతో మర్యాదగా ‘ఇది పిల్లల కోసం చేసిన ఏర్పాటండీ’ అని చెప్పితే నవ్వుకొంటూ మళ్ళీ గట్టెక్కడం…

అక్కడక్కడ పక్షులు, ఫోటోలు… బాగా లోపలికి చేరాక ఓ నాలుగంతస్తుల విశాల భవనం, అబ్జర్వేషన్ టవర్‌గా ఉపకరిస్తూ! అంతకు రెండు నెలల క్రితమే కాకినాడ కోరంగిలో కాలేజీ మిత్రులతో కలసి ఇలాంటి మడవుల్లోనే బోర్డ్‌వాక్ చేస్తూ గడిపిన అపరూపక్షణాల జ్ఞాపకాలు ఉబికిరాగా ఆ పార్కునూ ఈ పార్కునూ బేరీజువేసి చూసి రెండింటికీ ఉదారంగా మార్కులు ఇచ్చేయడం… చక్కని సమయమది. కొత్తవారితో స్నేహం పండించుకోడానికి ఎంతో అనుకూలమైన నెలవు ఆ మడ అడవి.

మడ అడవుల సహజ ప్రపంచంలోంచి ఒక్క ఊపులో ఫెర్రారివారి ‘మేక్ బిలీవ్’ ప్రపంచంలోకి గెంతు వేశాం!

యాస్ ద్వీపం అన్నది ఆబు దాబి శివార్లలో ఉన్న కృత్రిమంగా నెలకొల్పిన పాతిక చదరపు కిలోమీటర్ల సుందర ప్రదేశం. ఈమధ్యనే అల్డర్ ప్రోపర్టీస్ అన్న సంస్థ ఆ ద్వీపాన్ని అభివృద్ధి చేసి అత్యాధునిక అంతర్జాతీయ స్థాయి టూరిస్ట్ గమ్యంగా మార్చివేసే పనిలో పడిందట. 2010లో ఫెర్రారి ప్రపంచం పుట్టుకొచ్చింది. మరో రెండేళ్ళకు ఒక వాటర్ పార్కు. ఈమధ్య వార్నర్ బ్రదర్స్‌ థీమ్ పార్కు. ఇపుడు నిర్మాణంలో ఉన్న సీ వర్‌ల్డ్ అనే మరో మినీ ప్రపంచం. అదంతా మాజిక్ రియాలిటీ నిండిన ఒక ఇంద్రజాలిక ప్రపంచం… మరో ప్రపంచం! నిజానికి నేను అంతవరకూ అలాంటి వాటిగురించి వినివుండటమేగానీ ఎపుడూ చూళ్ళేదు. అంచేత ఆ ఫెరారీ ప్రపంచంలోకి ఆరోగ్యకరమైన ఉత్సాహంతోనే అడుగుపెట్టాను. 

‘ప్రపంచం’ అని పేరు పెట్టినందుకు అది ఒక చిన్నపాటి ప్రపంచంలానే కనిపించింది. దూరం నుంచే కనిపిస్తోన్న ‘ఫార్ములా రోసా’ అనే ప్రపంచంలోకెల్లా అత్యంత వేగవంతమైన రోలర్‌కోస్టర్ ఉనికి, లోపలికి వెళ్ళాక అన్నిచోట్లా కనిపించే కళ్ళుచెదిరే ఫెర్రారి బాణీ అరుణవర్ణం, పెద్దపెద్ద షాపులు, రెస్టారెంట్లు, ఫోటో తీసుకోడానికి రారమ్మని ఆహ్వానించే ఫెర్రారి ఐకాన్లు-కాస్తంత బాలుడి అవతారం ఎత్తగలిగితే విసుగులేకుండా ఓ అరగంట, గంట గడపదగ్గ ప్రదేశం. ఆ పక్కనే ఫెర్రారివాళ్ళ గ్రాండ్‌ప్రీ కార్ రేసుల ఆవరణ కూడా ఉందట. రేస్‌కోర్సులు, రోలర్‌కోస్టర్లూ కోట్లకి కోట్లు పెట్టి కట్టారేగానీ వాటిమీద ఆశించినంత రాబడి వస్తోందా అన్నది అనుమానమే. అసలా రోలర్‌కోస్టర్ నడవడమే లేదనుకొంటాను.

ఫెర్రారి అవగానే రాజేష్ ‘అమరేంద్రగారికి కాయిన్ బిల్డింగ్ చూపించాలి’ అని మహా ముచ్చటపడ్డాడు. అందుకోసం ఐదారు కిలోమీటర్లు వెనక్కి కూడా వెళ్ళాల్సివచ్చిందనుకొంటాను. ఆల్ రహా బీచ్ అన్న ప్రదేశంలో అల్డర్ ప్రోపర్టీస్ సంస్థవాళ్ళు పదేళ్ళ క్రితం కట్టుకొన్న ముఖ్యకార్యాలయ భవనమది. నిలబడివున్న నాణెపు ఆకృతిలో ఉండటం ఆ భవనపు ప్రత్యేకత. పాతిక అంతస్తులూ, నూటిరవై మీటర్ల ఎత్తూ సహజంగానే దాన్ని ఓ పర్యాటక ప్రదేశంగా మార్చేశాయి. ఆమధ్య ఏదో తెలుగు సినిమా ఇక్కడ తీశారట. ఇహ తెలుగు యువటూరిస్టులు తప్పనిసరిగా వెళ్ళవలసిన తీర్థయాత్రాస్థలమయిపోయింది ఈ భవనం!


వింతలూ విశేషాలూ ప్రయాణాల మధ్య నాగభూషణంగారితో సంభాషణ ధారాళంగా సాగింది. అవలీలగా ఇద్దరం ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి కబుర్లు చెప్పుకొన్నాం. విద్యార్థి దశలో ఆయన ఎంతో ప్రభావశీలి అయిన విద్యార్థి నాయకుడట. ఒకరకంగా ఎస్.ఎఫ్.ఐ.కి ప్రత్యర్థి సంస్థకు చెందిన మనిషి. స్వస్థలం గుడివాడ ప్రాంతమే అయినా అప్పటి ప్రధాన కార్యరంగం విజయవాడ. క్రియాశీల, చర్యా-ప్రతిచర్యాశీల యువరాజకీయాల్లో బాగా పాల్గొన్నారట. విజయవాడ నగరంలోనే కాకుండా అటు గుడివాడ ఇటు నూజివీడు ప్రాంతాల్లో కూడా-ఆమాటకొస్తే కృష్ణా జిల్లా అంతటా-ఆయన మిత్రవర్గం, అభిమానదళాలు అప్పటికీ ఇప్పటికీ ఉన్నాయట. సహజంగానే మా చర్చ ఆ రోజుల్లో విజయవాడ కార్యరంగంగా చేసుకొని వ్యవహరించిన దాసరి నాగభూషణరావుగారి మీదకు మళ్ళింది. పార్టీలూ రాజకీయాలూ వేరువేరయినా పార్టీ పరిధులు దాటుకొని ఈ యువతరమంతా అభిమానించి గౌరవించిన వ్యక్తి దాసరి అన్న విషయం నాగభూషణంగారి మాటల్లో స్పష్టంగా వ్యక్తమయింది.

“ఒక్కసారి ముఖాముఖీ కలిశాను. గ్రామాల్లోని వర్గాల పోరాటాల్లో మీ బాబాయిగారబ్బాయితో సహా చాలామంది అరెస్టయ్యారు. అందులో మాకు బాగా దగ్గరవాళ్ళూ ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీ యంత్రాంగం తమ తమ విలువలూ నియమాల ప్రకారం ఆ కేసును కోర్టుల్లో నడిపారు. మేము మా మా పద్ధతుల్లో ముందుకు సాగాం. ఏదో కీలక ఘట్టంలో నేను నియమాల మెడలు వంచి ఓ ఫలితం సాధించాను. ఆ విషయం దాసరిగారి దగ్గరకు వెళ్ళింది. నన్ను పిలిపించారు. వెళ్ళి కలిశాను. ‘నువు చేసిన పనిలో నీ చిత్తశుద్ధి మీద నాకు అనుమానంలేదు. అందరి ప్రయోజనాలనూ దృష్టిలో పెట్టుకొనే చేశావని తెలుసు. కానీ దూకుడు కొంచం తగ్గించు’ అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. అది నన్ను బాగా కదిలించింది.” చెప్పుకొచ్చారు నాగభూషణం. దాసరిగారి కొడుకుగా నామీద అవ్యాజమైన అభిమానం కురిపించారాయన.

“నిజానికి మిమ్మల్ని మా ఇంట్లో ఉంచుకోవలసింది. అందుకు పరిస్థితులు అనుకూలంగా లేవు. కాస్తంత ఆ విషయంలో విచారంగా ఉంది. ఏది ఏమైనా ఇలా మిమ్మల్ని కలుసుకోవడం, రోజంతా గడపగలగడం నాకు గొప్ప సంతోషంగా ఉంది. అది నా అదృష్టం” అంటూ బాగా అభిమానంగా అన్నారాయన. అది చూసి రాజేష్ “ఇది కొంతవరకూ నేను ఊహించినదే కానీ ఆయన అంతగా కదిలిపోతారని, ఇంతింత సమయం మీతో గడుపుతారనీ ఎప్పుడూ అనుకోలేదు. బాగా బిజీ మనిషి. ఇపుడంటే నిర్మాణరంగంలో ఉధృతి తగ్గింది గానీ ఇదివరలో వీరికి బుర్జ్ ఖలీఫా లాంటి కట్టడాల్లోనూ భాగస్వామ్యముంది. అసలు మాకు ఆయన్ని కలసి ఓ గంట గడపడమే గగనం. ఈరోజు మీ పుణ్యమా అని నాకూ ఆయన సాంగత్యం దొరుకుతోంది.” రాజేష్ సంబరపడ్డాడు.

ఇంకా ఆబు దాబి నగరం పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందీ అనగా రహదారి పక్కన ఏదో అతినూతన గేటెడ్ కమ్యూనిటీ కనిపిస్తే నాగభూషణంగారు “పదండి, ఒక అడుగు అటువేద్దాం. దీని నిర్మాణంలో నేనూ బాగా పాల్గొన్నాను. సముద్రపు పాయని ఆనుకొని కట్టాం ఈ గృహసముదాయాన్ని. అన్నీ విశాలమైన ఇండిపెండెంట్ ఇళ్ళు” అంటూ అటు దారితీశారు. నిజమే, ఎవరైనా అసూయపడేంత అందమైన ప్రదేశమది! సముద్రపు పాయకు ఇటుపక్కన ఈ ఇళ్ళు ఉంటే అటుపక్కన అంతా -మడ అడవులు కాబోలు- పచ్చదనం. ఆ జలనిధిలో హాలీవుడ్ సినిమాల్లో చూసేలాంటి, ఈ కమ్యూనిటికే చెందిన పడవలు. ఒడ్డున కాలిబాటలు. అదో అనుభవం!

నగరం చేరేసరికి మధ్యాహ్నం రెండు. వీళ్ళందరికీ బాగా తెలిసిన ఓ సౌతిండియన్ రెస్టారెంట్‌లో భోజనం. తీరిగ్గా కబుర్లు నంజుకుంటూ అదో గంట. ఆ రెస్టారెంటు ఉన్నది నగరపు ముఖ్యవీధిలో. ఒక అడుగు అటువేసి వీధిని పలకరిద్దామని వెళ్ళాను గానీ చిటపటలాడుతోన్న ఎండ మళ్ళా నన్ను నీడపట్టుకు నెట్టేసింది.

భోజనం కానిచ్చాక కార్నిష్ బీచ్ మీదుగా ఆబు దాబి రాజుగారి ఎమిరేట్స్ పాలెస్ చూద్దామని బయల్దేరాం. కారణాలు గ్రహించలేకపోయాను కానీ రోడ్లమీదా, పాలెస్ పరిసరాల్లోనూ ఆంక్షలు కనిపించాయి. బీచ్ దగ్గర ఆగలేకపోయాం. పాలెస్ గేట్లవరకే వెళ్ళి తిరిగిరావలసివచ్చింది. కానీ ప్రతి అవరోధమూ ఒక అవకాశానికి దారిచూపించగలదు అన్న ఆశావాద ప్రతిపాదనకు ఆరోజు మరోసారి చక్కని నిరూపణ లభించింది.

“ఓ పనిచేద్దాం. ఈ పక్కనే ఓ ఎపార్ట్‌మెంట్ టవర్లో మా ఫ్రెండువాళ్ళ ఇల్లుంది. మురళీ అనీ మన గుడ్లవల్లేరు మనిషి. వాళ్ళావిడ సుమ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పదండి వాళ్ళింటికి వెళదాం. వాళ్ళ ఫ్లాటు బాగా పై అంతస్తులో ఉంది. ఈ పాలెస్సేగాకుండా పరిసరాల్లోని ద్వీపాలు, రహదార్లూ ఇతర భవనాలూ మనం ఒక చూపు చూడొచ్చు” అన్నారు నాగభూషణం. చకచకా నెంబరు కలిపి ‘మేం నలుగురం ఇలా వస్తున్నాం!’ అని మురళిగారికి ప్రకటించేశారు.

మురళీవాళ్ళున్నది అత్యాధునికమైన, అతి ఖరీదైన ప్రాంతం. మనం బొంబాయి మలబార్ హిల్స్‌లోనూ కొలాబాలోనూ చదరపుగజం కోటిరూపాయలు చేసే ఫ్లాట్లున్నాయని చెప్పుకొంటాం గదా, అదిగో ఆ బాపతు ప్రదేశమది. మురళి వాళ్ళింటికి చేరడానికి మూడు నాలుగు అంచెల సెక్యూరిటీ వలయాలు ఛేదించవలసివచ్చింది. లిఫ్టు ఎక్కడానికి, మా ఫ్లోరు చేరడానికీ పెద్ద పెద్ద హోటళ్ళ పద్ధతిలో ఒక స్మార్టు కార్డు. అసలు వైకుంఠంలో కూడా ఏడేడు ద్వారాలూ ద్వారపాలకులను ఉపసంహరించి స్మార్ట్‌కార్డ్ ప్రవేశపెడితే ఎలా ఉంటుందీ అనిపించింది. ఈసారి నారదుడెపుడైనా కనిపిస్తే అడగాలి…

మురళి-సుమ-సాయి, చిన్న కుటుంబం; అతి పెద్ద ఫ్లాటులో. యవ్వనపు ఛాయలు వదలని మధ్యవయసు మనిషి మురళి. అక్కడి ఆయిల్ కంపెనీలోననుకొంటాను, ఉద్యోగం. కబుర్లలో పడిపోవడానికి క్షణం కూడా పట్టలేదు. నాకే కాదు, రాజేష్‌కూ సతీష్‌కూ కూడా మురళిగారిని కలవడం అదే మొదటిసారి అనుకొంటాను.

అందరం హాలులోని కిటికీ దగ్గరకు చేరాం. దిగువన ఉన్న రాజసౌధం, దానివెనుక ఉన్న సముద్రం, బీచ్-ఓ విహంగ వీక్షణం. కాస్తంత పక్కకూ ముందూ వెనకలకూ దృష్టి మళ్ళిస్తే అల్ లులు ద్వీపం, జాయద్ సీ పోర్టు, ఆపైన కనిపించీ కనిపించని స్థానిక లూవ్ర్‌ ఆర్ట్ మ్యూజియమ్. ఈలోగా కాఫీలూ టీలూ అతిథి మర్యాదలూ… కొనసాగిన కబుర్లు.

మురళి వాళ్ళింట్లోంచి బయటకు వచ్చాక అసలు నేనెక్కడున్నాను, ఎక్కడికి వెళుతున్నాను అన్న ఉపనిషత్సంశయం కలిగింది. గూగుల్‌ను అడిగాను. ‘ఆబు దాబి నగరపు ముఖ్యభాగాన్ని భౌగోళికంగా బొంబాయి నగరం‌తోను, న్యూయార్క్‌లోని మన్‌హాటన్‌తోనూ పోల్చవచ్చు. ఈ మూడూ సాంకేతిక దృష్టితో చూస్తే ద్వీపాలే. మూడూ ఆయా ప్రాంతాలకు ఆయువుపట్లే. సుమారు పదిహేను కిలోమీటర్లు పొడవునా రెండుమూడు కిలోమీటర్లు వెడల్పుతోనూ వాయవ్యమూ ఆగ్నేయమూ దిశలో విస్తరించి ఉన్న ఈ ద్వీపంలో వాయవ్యపు కొసన రాజుగారి సౌధం ఉంటే ఆగ్నేయపు కొసన గ్రాండ్ మాస్క్ ఉంది. నడుమన నగరం. బిజినెస్ డిస్ట్రిక్ట్. దూతావాసాలు ఉన్న డిస్ట్రిక్టు మధ్యలో ఉన్నది.’ గూగుల్ నా మహత్సంశయానికి తెరవేసింది.

ద్వీపపు వాయవ్యపు కొసన ఉన్న మా వాహనం మెల్లగా ఆగ్నేయపు కొసన ఉన్న గ్రాండ్ మాస్క్ వేపు సాగింది. నాగభూషణంగారు అక్కడక్కడా దారిమళ్ళించి ఊళ్ళోని ప్రముఖ భవనాలూ స్థలాలూ చూపించి, వాటిగురించి వివరించి చెప్పారు. అరబ్‌ దేశాలలో యు.ఎ.ఇ.కీ ఆబు దాబికీ ఉన్న స్థాయి గురించి, గౌరవమర్యాదల గురించీ వివరించారు. ఆ వివరాలు విన్న తర్వాత అప్పటి సంప్రదాయాలను ఇప్పటి అవసరాలకు అనుగుణంగా తగుపాళ్ళలో సరళీకృతం చేసి, మతపు ప్రభావాన్ని సమాజం మీద ఆరోగ్యకరమైన స్థాయిలోనే ఉంచి, అన్ని వర్గాల ప్రజానీకానికీ సంతోషమూ సంతృప్తీ కలిగేలా వ్యవస్థను తీర్చిదిద్దడానికి ఎంత విజ్ఞత, ముందుచూపు, దూరదృష్టీ ఉండాలో కదా అనిపించింది.


మనకు మసీదు అనగానే ఢిల్లీలోని జుమ్మా మసీదు గుర్తుకొస్తుంది.

మూడువందల ఏభై ఏళ్ళ క్రితం కట్టిన ఆ మసీదు, మన దేశంలోకెల్లా పెద్దదంటారు. పాతికవేలమంది ఒకేసారి అక్కడ ప్రార్థన చెయ్యవచ్చంటారు. అక్కడ ఉన్న మినరెట్స్ నలభై మీటర్లు ఎత్తుకలవి అంటారు. నిజమే. నేను అనేకసార్లు చూశాను. చూసిన ప్రతిసారీ విభ్రమకు గురయ్యాను. మన జుమ్మా మసీదుకు రెట్టింపు పరిమాణమున్న ఒక అత్యాధునికమైన మసీదును చూస్తే ఎలా ఉంటుందీ? చెప్పడం కష్టం. ఆ అనుభూతి వర్ణనకు అతీతం.

అదే జరిగింది ఆనాటి సాయంత్రం.

నేను గల్ఫ్ ప్రయాణం పెట్టుకొన్నప్పట్నించీ అక్కడి విషయాలు తెలిసిన మిత్రులు ‘తప్పకుండా ఆబు దాబి వెళ్ళి పెద్ద మసీదు చూసిరండి. దూరం కదా అని నిర్లక్ష్యం చెయ్యకండి’ అని చెప్తూనే ఉన్నారు. రాజేష్ కూడా వెళ్ళీవెళ్ళగానే గ్రాండ్ మాస్క్ చూడడానికి ఆబు దాబి వెళదాం అనేశాడు. ఇలాంటి సూచనలూ ప్రేరణలూ లేకపోతే నేను దీన్ని విస్మరించేవాడినే! ‘ఏముందీ, మన జుమ్మా మసీదు చూశాం కదా, చాల్లే’ అని ఉపేక్షించేవాడినే. అలా జరిగి ఉంటే చాలా కోల్పోయి ఉండేవాడినని అక్కడికి చేరిన మరుక్షణం అర్థమయింది.

పదీ పదిహేనేళ్ళ క్రితం ఉనికిలోకి వచ్చిన మసీదు ఇది. 2004లో మరణించిన అప్పటి ఆబు దాబి అధినేత షేక్ జాయెద్ కలల భౌతికరూపమది. అతని భౌతికకాయాన్ని తన ప్రాంగణంలోనే నిక్షిప్తం చేసుకొన్న బృహత్ ప్రార్థనాస్థలమది.

వెళ్ళగానే మమ్మల్ని పలకరించింది అక్కడ పోగుపడిన అసంఖ్యాక జనసందోహం. గబగబా మసీదు చేరుకోవాలన్న మా ఆత్రుతను నిలవరించింది అక్కడున్న మూడునాలుగు అంచెల రక్షణ వ్యవస్థ. స్కానింగ్, ఫోటో తీసి ఐడెంటిటీ స్లిప్ ఇవ్వడం, రెండుమూడు చోట్ల నిలువరించి నిలువెల్లా తడిమి చూడటం, అంతా కలసి అరగంట పట్టేసింది. ప్రస్తుతమున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో ఏ దేశానికైనా ఏ ప్రముఖ కట్టడానికైనా తప్పని కార్యక్రమమిది.

చల్లని తెల్లని కట్టడమది. పాలరాయి విరివిగా వాడిన సంగతి ప్రాంగణంలోకి వెళ్ళగానే బోధపడింది. అసంఖ్యాకంగా ఉన్న గుమ్మటాలు, నాలుగు పక్కలా కనిపించే మీనార్లు, ఎంతో ఎత్తుగా ఉన్న ప్రవేశ ద్వారం-సముద్రం ముందు నిలబడితే ఎలా వినమ్రభావన కలుగుతుందో అదిగో సరిగ్గా అలాంటి భావనే కలిగింది. లోపలికి వెళ్ళాం. వంద వంద మీటర్లు ఎత్తు ఉన్న మీనార్లు, దాదాపు అంత ఎత్తూ ఉన్న ముఖ్య గుమ్మటాలూ, నలభై వేలమంది ఒకేసారి ప్రార్థనలు చేసుకోగల అతి విశాలమైన మసీదు ప్రాంగణం-ఇవి ఎలాగూ ఆకర్షిస్తాయి. సగటు మనిషిలో ఇవన్నీ కట్టడానికి ఎన్నివేల కోట్లు ఖర్చయిందో, ఎన్నివేలమంది ఎన్నెన్ని సంవత్సరాలు శ్రమించారో అన్న ప్రాపంచిక గణాంకవివరాల స్ఫురణా ఆలోచనా కలుగుతుంది. కానీ అక్కడి సౌందర్యం? శీతాకాలపు ఆరుబయట సన్నపాటి పొగమంచు వీచికలా అక్కడంతా పరచుకొని ఉన్న కళాత్మకత? ఇవి కొద్దిమందినైనా కట్టిపడేస్తాయి.

విశాలమైన సుందరమైన మండువాలు, పాలరాతి నేలమీదనూ స్థంభాల మీదనూ రంగురంగుల విలువైన రాళ్ళను పొదిగి సృష్టించిన లతలూ ఆకృతులూ, మోతాదు మించింది అనిపించని రీతిలో వాడిన బంగారు రంగు పైపూతలూ, ఎటుచూసినా సౌష్ఠవం ఉట్టిపడే కట్టడాల రూపకల్పన, లోపలి పాలరాతి గోడల మీద పైకప్పుదాకా తాపడం చేసిన అతి చక్కని ఆకృతులు, హాలులో పరచిన అయిదువేల చదరపు మీటర్ల తివాచీ, పైకప్పులకు అమర్చిన బృహదాకారపు షాండలియర్లు-అది ఒక విభిన్న ప్రపంచం. అన్నన్ని విలువైన వస్తువులూ అలంకరణలను సమకూర్చినా రంగుల మోతాదుపరంగా గానీ ఆడంబరాల ప్రదర్శనాపరంగా గానీ ‘శ్రుతిమించింది’ అన్న భావన మనలో కలగకుండా చెయ్యడం ఎంతో కష్టమైన పని. ఆ పనిని ఎంతో సులభంగా సాధించారు ఆ మసీదు నిర్మాణ శిల్పులు.

చూస్తూ చూస్తూ ఉండగానే అక్కడి ఆర్చీలలోంచి-గుమ్మటాలూ మీనార్లు తోడుగా-ఆకాశంలో ఉదయించిన త్రయోదశి చంద్రుడు కనిపించి చిరునవ్వులు చిందించాడు. ఆ మనోహర దృశ్యాన్ని ఎంతో ఆబగా కెమెరాలో బంధించాను. మసీదు ప్రాంగణాలు దాటుకొని బయటి కారిడార్లలోకి వెళితే ఎడమవేపున మసీదును ఆనుకొనే అస్తమయానికి ఉపక్రమిస్తోన్న సూర్యుడు కనిపించి ‘ఉదయించే చంద్రునిదేనా సౌందర్యం? నా అస్తమయపు వెలుగులూ చూడు చూడు’ అని కవ్వించాడు.

ఆనాటి మా ఆనందహేల గ్రాండ్ మాస్క్ ప్రాంగణం చూడటం దగ్గరే ముగియలేదు.

అంతా మళ్ళీ డిన్నరుకు ప్రవీణ వాళ్ళింట్లో కలుసుకొన్నాం.

దారిలో నాగభూషణంగారి శిల్ప మాతో చేరారు. షార్జా నుంచి భార్గవి, హన్ష్ కూడా వచ్చి కలిశారు. మూడు కుటుంబాలు, చిన్నా పెద్దా కలసి తొమ్మిదిమంది. పదోవాడిని నేను! రోజంతా ఎండనబడి తిరిగి నడచిన అలసట ఆ మిత్రసమాగమ పుణ్యమా అని చేత్తో తీసేసినట్టు మటుమాయమైపోయింది. భోజనాలు ముగిసేసరికి బాగా పొద్దుపోయినా మళ్ళా నాగభూషణంగారూ శిల్పగారూ మరో గంటా గంటన్నర ప్రయాణం చేసి ఇంటికి చేరవలసి ఉండినా, ఎవరిలోనూ ఆ ఆందోళన గానీ కలవరపాటు గానీ కనిపించలేదు.

‘భలే గడిచిందిగదూ ఈరోజూ’ అనుకొంటూ నేనూ రాజేషూ భార్గవీ ఇంటికి చేరుకొన్నాం. పడుకొనేసరికి తేదీ మారనే మారింది.

(సశేషం)