ఎదురుచూపు

నాలుక చివరి మాటలు
మనసులోని తలపులు
సమాంతర రేఖలని తెలియక
అవి కలిసే క్షణం కోసం
ఎదురుచూస్తూనే ఉంటావు

ఎగరేసిన గాలిపటం
ఏ కొమ్మల్లోనో చిక్కుకుందని తెలిసినా
తిరిగి నిన్ను చేరుతుందని
దారాన్ని లాగుతూనే ఉంటావు

ఆత్మలను కలిపే
అనాది తంతువేదో
తెగిపోయిందని తెలిసినా
మాటలతో అతుకు పెడుతూనే ఉంటావు

హోరుగాలికి దీపం
అల్లల్లాడుతున్నా
నిలకడగా నిలపగలనని
అరిచేతుల్ని అడ్డుపెడుతూనే ఉంటావు

గొంతు ముడిని విప్పినా
మనసు ముడిని విప్పలేనివారి కోసం
మమతల జడిని కురిపించినా
నదిగా ప్రవహించలేని వారి కోసం
నిరంతరం పరితపిస్తూనే ఉంటావు

సెగలు గుండెను తాకుతున్నా
పొగలు పైబడి కమ్మేస్తున్నా
తగలబడుతున్నది నీ నమ్మకమేనని
ఎన్నటికీ అంగీకరించవు
అస్థికల రూపంలోనైనా
అది నిలిచే ఉంటుందని
ఆశగా ఎదురుచూస్తునే ఉంటావు.