1. చావు విత్తనం
భావోద్వేగాల
కారు మబ్బుల్లోంచి
సుఖదుఃఖాల
జడి వాన
కురుస్తోంది
ఆ వానల్లో
నానుతోన్న
మనో భూమిపై
పెరుగుతోంది
పురాతన పీడ
ఆ పీడలో
మొలకెత్తుతోంది
ఎవరూ గమనించని
చావు విత్తనం.
2. పని కౌగిలి
అప్పుడే పుట్టిన
తాజా రోజును
గుటుక్కున మింగడానికి
నోరు తెరుచుకుని
ఎదురు చూస్తోంది
పని
తన ఊపిరాడని
ఉక్కు కౌగిలిలో
జనం చచ్చిపోకండా
రోజువారీ
రొట్టె ముక్కలు విసురుతుంది
పని,
రోజును
రొట్టె ముక్కలు తిన్న
జనాన్ని
మింగుతుంది.
3. చీకటి మాంసం
వీడు
ద్వంద్వార్థాలు
మాట్లాడి
నీ శరీరంపై
అగ్గి పుల్ల
వెలిగించుకుంటాడు
వీడు
నీ జ్ఞానాన్ని ప్రశ్నించి
నీ ఆత్మ విశ్వాసంపై
చలి కాచుకుంటాడు
ఎవడినీ
నీ ఆత్మపై
ఉమ్మి వేయనీయకు
నెత్తుటి నూనె
రాసుకుని
మిలమిలలాడుతున్న
ద్రౌపది కురులను
స్మరించు
బాలా, చీకటి మాంసాన్ని
తినిపించు
నీ పెంపుడు
వెలుతురు గద్దలకు.