పల్లెటూర్ to పట్నం: The Seven Seater

సద్దుకో సద్దుకోమ్మని
పద్నాలుగో శాల్తీనీ తోసి
నేలమీన నల్ల మబ్బులు
పుట్టిస్తాదిది డుగుడుగు.

పాట దూసి పైసలు రాల్చే
బోలు బుర్ర తంబూరి
నీలుక్కున్న చెరుగ్గెడలతో
ఎకసెక్కాలాడితే

చుట్ట గుప్పుగుప్పులకి
మెడ దిప్పి ఎరుపుకు దిరిగితే
కిలుం బట్టిన కాసుల పేరు

నగ్మా బొమ్మ పక్కన
టప టప పావురాయి రెక్కాల
కొట్టుకుంటే కారబ్బంతి పూల పైట

బుట్టలో బుగ్గా బుగ్గా రాస్కునే
దోస కాయలకు చెళ్ళంటా గొడితే
బుడి బుడి బూటు కాళ్ళ దరువు

యాలబడ్డ అర సున్నలు
రెప రెప కుర్ర కాలర్లతో
ఓరి మీ యగష్ట్రాలో అనిపోతే
చెంకీ జెండాలు ఎగరేస్తా
యమ్మట లగెత్తే గాలి

హోయిరబ్బా హోయిరబ్బా
నేనే ముటా మేస్తిరినని
ఎగుడు దిగుడు తోవల్లో
పాడితేను పాచి పళ్ళ కాసెట్టు

కొమ్ములూపతా నవ్వి
దుమారం లేపతాడీడు.

ఈడాపాలాపాలన్న
కేకల్ని నమలుకుంటా
ఎత్తెత్తి కుదేస్తాడు
యనకమాల టైర్ల కాడ
కోరల దిష్టి బొమ్మ గాడు.