ఇద్దరు పిల్లలు

ఒకడు కొంచెం చామనఛాయ. రెండోవాడు తెల్లగా ఉన్నాడు. పార్కులోని వాకింగ్‌ ట్రాక్‌లో ఫుట్‌బాల్‌ ఆడుతున్నారు. వాడు అటునుంచి ఇటు తన్నడం, వీడు ఇటునుంచి అటు తన్నడం. అన్నాతమ్ముడూ కావొచ్చు. దానికి నాకున్న ఆధారం ఈ తెల్లవాడు ఒక అంగుళం పొడవు తక్కువుండటమే. బహుశా ఎడం తక్కువ అయివుంటుంది. పెద్దవాడు తండ్రి పోలిక, చిన్నవాడు తల్లి పోలిక అయ్యుండాలి. నాకు తెలియని మగవాళ్ళు కొంచెం నల్లగా ఉంటారనీ, ఆడవాళ్ళు తెల్లగా ఉంటారనీ నా ఊహ.

పార్కులో ఐదారుగురు నడుస్తున్నారు; ఒకరిద్దరు కూర్చుని ప్రాణాయామం చేసుకుంటున్నారు. ఒక బెంచీ మీద అన్సారీసాబ్‌ భార్య, కషాయాలు తాగడం గురించి ఒకసారి నాతో మాట్లాడిన ఒక పెద్దావిడ కూర్చుని ముచ్చట పెడుతున్నారు. ఈ పెద్దావిడ జుట్టు పొట్టిగా ఉంటుంది. గుండు చేయించిన తర్వాత ఒక మాదిరిగా పెరిగిన జుట్టు. బహుశా తిరుపతిలో తలనీలాలు ఇచ్చివుండొచ్చని నా ఊహ. ఏదో వంటకం గురించి వారి సంభాషణ సాగుతోంది.

వాళ్ళిద్దరూ అన్నదమ్ములని నాకు నేనే నిశ్చయం చేసుకోవడానికి ముందు నాకు తట్టింది వాళ్ళిద్దరూ ముస్లిమ్ పిల్లలు అని. నలుగురైదుగురు బురఖా స్త్రీలూ, ముస్లిమ్‌లని తెలిసే ఆహార్యంతో మరో ఐదారుగురు మగవాళ్ళూ రోజూ వాక్‌కు వస్తారు. ఎవరి పిల్లలై ఉంటారు?

నా పిల్లలు దసరా సెలవులకు ఊరెళ్ళారు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు స్కూలుకు వెళ్తే తప్ప ఇంట్లో ప్రశాంతత లేదనిపిస్తుంది. కాని వాళ్ళు వారం రోజులుగా ఇంట్లో లేకపోవడంతో ఈ దొరికిన ప్రశాంతతకు అసలు అర్థమే లేదనిపిస్తోంది.

పెద్దోడు ఆ ఎర్రరంగు బాల్‌ను గట్టిగా తన్నాడు, ఈ చిన్నోడు దాన్ని ఆపలేక దాని వెనకాలే పరుగెత్తాడు. ఇద్దరూ నైట్‌ప్యాంట్లు వేసుకున్నారు. ఇద్దరి కాళ్ళకూ బూట్లు ఉన్నాయి. పెద్దోడు నల్లచొక్కా తొడుక్కుంటే, చిన్నోడు టీ షర్ట్‌ వేసుకున్నాడు. చిన్నోడికి మొన్న మొన్నే హెయిర్‌ కట్‌ చేసినట్టుగా కొంత మొండి తల కనబడుతోంది. పెద్దోడి బుగ్గల్లో సొట్టలు పడుతున్నాయి. వాడు పరుగెత్తినప్పుడు వాడి నల్లటి జుట్టు కూడా వాడిలాగే గంతులేస్తోంది.

వాళ్ళ దోవకు అడ్డు వస్తున్నప్పుడు రెండు చేతులు వాళ్ళ భుజాల మీద వేసి సున్నితంగా పక్కకు జరుపుతూ పెద్దవాళ్ళు నడుస్తున్నారు. అట్లా జరపలేని ఒక స్థూలకాయురాలు అటు పచ్చికలో ఆడుకొమ్మన్నట్టుగా చేయి చూపించింది. ‘అక్కడ ఆడొద్దన్నారు’ అని చిన్నోడు జవాబిచ్చాడు. పచ్చికను పాడు చేస్తారని అందులోకి వెళ్ళొద్దని ఉంటాడు వాచ్‌మాన్‌. ‘వీళ్ళు’ తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నారే. ముస్లిం పిల్లలు అయివుండరేమో. రోజూ గుడిమల్కాపూర్‌ ఆటోడ్రైవర్ల ముక్కల తెలుగు వినే నా చెవులకు వీళ్ళు భిన్నమే. ఆ మాటకొస్తే, మా పెద్దోడి రెండో తరగతి క్లాస్‌మేట్‌ రుకయ్యా ముద్దొచ్చే తెలుగు మాట్లాడేది. వాడిని ఆ స్కూలు మానిపించినప్పుడు నేను ఫీలైన అంశాల్లో ఇదీ ఒకటి. కానీ నాకు రుకయ్యాల కంటే ఆటోడ్రైవర్లే ఎక్కువ తగులుతారు.

చిన్నగా పొద్దుటి ఎండ పడుతోంది. పిల్లల జుట్లలోంచి చెమటలు కారడం మొదలైంది. కొందరు వెళ్ళిపోతున్నారు. ఒక టోపీ అతను వెళ్ళిపోయాడు, బయట గేటు దగ్గర పార్క్‌ చేసిన బైకు మీద. వీళ్ళు పరుగెత్తి అది ఎక్కుతారేమో అనుకున్నా. అయితే ఆయన పిల్లలు కాదన్నమాట.

చిన్నోడికి గట్టిగా తన్నరావడం లేదు. బాల్‌ను గాల్లోకి ఎగిరేసి ఎట్లా తన్నాలో చూపిస్తున్నాడు పెద్దోడు. చిన్నోడు కాలు ఎత్తే లోపే బాల్‌ కింద పడిపోతోంది. పెద్దోడు ఉత్సాహపరుస్తున్నాడు: ‘మార్‌’ ‘మార్‌’. ఒక నాలుగైదు ప్రాక్టీసుల తర్వాత చిన్నోడు పైకి ఎగరేసి తన్నగలిగాడు. ఈ మాటలతో రూఢీ అయింది, వీళ్ళు ముస్లిమ్‌ల పిల్లలే. ఆమెకు జవాబిచ్చినప్పుడు అవసరంగా తెలుగు మాట్లాడటం వేరే; కానీ వాళ్ళది వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో అదే కదా వాళ్ళ భాష.

నేను వాకింగ్‌ ఆపేసి, బల్ల మీద కూర్చున్నాను. పిల్లలు తన్నడంలో ఒకసారి బంతి దాదాపుగా నా దగ్గరికి వచ్చి ఆగింది. పెద్దోడు పరుగెత్తుకొచ్చాడు. ‘సారీ అంకుల్‌.’ అంకుల్‌ అన్న పిలుపును కూడా అంత ఆనందిస్తానని నాకు అంతకుముందు తెలీదు. ‘ఆఁ! నో ప్రాబ్లమ్‌.’

తన్నులాట వదిలేసి ఇద్దరూ భుజాల మీద చేతులు వేసుకుని కాసేపు పార్కు చుట్టూ మాట్లాడుకుంటూ తిరిగారు. హిందీ మాటలు వినబడుతున్నాయి.

తన నడక కూడా ముగించుకుని అన్సారీసాబ్‌ వచ్చి నా పక్కనున్న బల్ల మీద కూర్చున్నాడు. ఈయన ఈమధ్యే నాకు పరిచయం. ప్రభుత్వోద్యోగం చేసి రిటైర్‌ అయ్యాడు. భార్యాభర్తలిద్దరూ కలిసి వస్తారు. జపమాల తిప్పుతూ నడుస్తుంటాడు. నాకు ఇంకా కుతూహలం ఆగట్లేదు.

“వో బచ్చే ఆప్‌కా పెహచాన్‌ కా హై క్యా?”

తల తిప్పి పిల్లల వైపు చూస్తూ, “మేరీ బేటీ కీ బేటా హై వో” చెప్పాడాయన. దసరా సెలవులకు కరీంనగర్‌ నుంచి వచ్చాడన్నాడు.

“ఎవరందులో?”

అన్సారీగారు తెలుగులో కూడా బాగా మాట్లాడతారు. “ఆ అదే ఆ బ్లాక్‌ షర్ట్‌ వేసుకున్నాడు గదా.”

అయితే వీళ్ళు అన్నదమ్ములు కాదన్నమాట. “మరి ఇంకొకడు?”

ఆ కషాయాల అమ్మ వైపు చూపిస్తూ, “ఆ మేడమ్‌ ఉంది గదా, వాళ్ళ మనవడు అంట.”

మనుషులు కలిసిపోవడానికి బాగా పరిచయం ఉండాలేమో అనే అమాయకత్వం నాది.

“అట్లనా, మరిద్దరూ అంత పరిచయం ఉన్నట్టు భుజాల మీద చేతులేసుకొని తిరుగుతున్నరూ?”

మాటను సాగదీస్తూ చెప్పారాయన: “ఇక్కణ్నే… ఇప్పుడే… పిల్లల్ది ఎంత సేపు.”

నా పిల్లలు ఏం చేస్తున్నారో ఊళ్ళో. రోజుటి కంటే మరో పది నిమిషాలు ఎక్కువసేపు గడిపి వచ్చాను.