27-12-76
ప్రియదర్శిని సుతుడు, మేనకా ప్రియుడు ఆంధ్రదేశంలో పర్యటించాడు.
ఊరేగింపు
వృషభరాజు భక్తులు చేసిన ఊరేగింపు
నగరం నడి వీధిలోకి తొలకరి తరలింపు
వృషభరాజు మ్రోల సాగిలపడు దండాలు
వేకువ కోదండానికి వేసిన అరదండాలు
వృషభరాజు కొమ్ములకు పూశారయ్యా జాజు
పార్కులోని క్లాక్‌టవర్ నవ్విందా రోజు
ఏరువాక సాగిందట కారుమొయిలు కమ్మిందట
పల్లె విడిచి వృషభరాజు నగరంలో నవ్విందట
నగరం నడిబొడ్డులోన కొమ్ము విసిరి కుమ్మిందట
కాలు దువ్వి రంకె వేసి మెలకువనే పొమ్మందట
వృషభరాజు భక్తులు చేసే ఊరేగింపు
అరణ్యాల ఆలోచనలపై సాగే గాలింపు
నగరాన్నే జోకొట్టే నల్లమందు లాలింపు
లాలీ లాలీ లాలీ లాలమ్మా! లాలీ!
నా పాపాయి చుట్టూతా రక్కసుల కేళి
29-1-77
రాత్రి నిద్ర పట్టలేదు. ‘కంసుని కంప్యూటర్’ వ్రాశాను.
కంసునికి
కంప్యూటర్ వుంది
(అలా నవ్వుతారేం)
మేనక
హెలికాప్టర్లో కిందికి దిగింది
కురుక్షేత్రంలో
(ప్లీజ్ నవ్వకండి)
అణుబాంబులు వాడక పోవటం
(అది శ్రీకృష్ణుని ఆదేశం)
కొంతలో కొంత నయం
లేకపోతే
గుడ్డుగుడిచిపోయేది కదా
భరతుని దేశం?
ఏమాట కామాట
మనకెప్పట్నుంచో
తంతి వుంది వితంతి వుంది
వితంతువుంది
గండభేరుండం మన జెట్ విమానం
పుష్పక్ విమానం సార్థక నామం
మరిచిపోయాను
మన్నించగలరు
కంసునికి కంప్యూటరున్నట్లే
మన వేదాల్లో మార్క్సిజం వున్నదిష
నమ్మండీ నమ్మకపోండి
(మీ కర్మ)
స్వదేశీ పానీయంలో
నిషా ఎక్కువయిందని
అనుకుంటే అనుకోండి
నేతులు తాగిన
మన తాతల మూతుల్లో
కావలసినంత
కాక్‌టెయిల్ ఫ్లేవర్!
31-1-77
26-1-77 రాత్రికి ఖమ్మం చేరాను. అక్కడ ఒక కేసు. ప్రతిసారి విడిగా లాకప్ చేశేవారు. ఈసారి పోలీస్‌స్టేషన్‌లో వున్న రెండు లాకప్ గదుల్లో ఒకదానిలో కొత్తగా అరెస్టయిన ‘నక్సలైటు’ వున్నాడు. రెండవగదిలో ‘నేరం చేసి బతికేటోళ్ళు’ వున్నారు. అక్కడ నన్ను నక్సలైటుతో వుంచరాదు. ఖైదీలతోనూ వుంచరాదు అని ఉత్తర్వు. చివరకు ఖైదీలతో ఉంచారు. ఆ నక్సలైటును ఇంటరాగేట్ చేస్తున్నారట. నాలుగురోజులనుండి నక్సలైటుకు ఆహారం లేదు. నా దగ్గరవున్న గోధుమరొట్టెలు రహస్యంగా నక్సలైటుకు చేరవేయించాను. అతని భోగట్టా సేకరించాను. ఉదయం నన్ను చూసి నింపాదిగా ‘నరుడో! భాస్కరుడా!’ అని వినిపించీ వినిపించకుండా పాడాడు. నేనుకూడా ‘నరుడో! భాస్కరుడా!’ నిశ్శబ్దంగా పాడి జవాబిచ్చాను. ధైర్యంగా వుండమని సైగచేశాను పిడికిలి బిగిస్తో. అతని గురించి సమాచారం సేకరించాను. అతనిది ఖమ్మం పట్టణానికి సమీపానగల గ్రామం. పదవ తరగతి చదువుతూ మానివేశాడు. రాళ్ళుకొట్టుకొని బతుకుతున్నాడు. ఈ మధ్య పెళ్ళికూడా జరిగిందట. విప్లవ రాజకీయాలతో ప్రభావితమయ్యాడు. గ్రామంలో భూస్వాములకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ‘నక్సలైట’ని అరెస్టు చేశారు. కూలికి వెళ్ళి తిరిగి వచ్చి భార్యపక్కలో నిద్రపోతున్న ఈ ‘నక్సలైటు’ను రాత్రి ఇంటిమీద దాడిచేసి అరెస్టు చేశారు.
నీ దగ్గరకు రహస్యంగా వస్తున్న నాయకుల పేర్లు చెప్పమని హింస పెడుతున్నారు.
నేను గదిలోంచి చూస్తూ ఉంటే ఉదయం అతని తల్లి, భార్య, పోలీస్‌స్టేషన్ గేటువద్ద నుంచుని ఏడుస్తున్నారు. ఉదయం నాకు వచ్చిన రొట్టెలు కూడా అతనికి పంపాను. నన్ను కోర్టుకు తీసుకొని పోతూవున్నప్పుడు అతనికి రహస్యంగా ధైర్యంగా వుండమని సైగ చేశాను.
నర్రెంగ సెట్టుకింద నరుడో! భాస్కరుడా!
కన్నెర్ర సేస్తివయ్య! నరుడో! భాస్కరుడా!
…
నీవు సూపిన బాట నరుడో! భాస్కరుడా!
మా దొడ్డ బాటయ్యా! నరుడో! భాస్కరుడా!
ఇక 26 రాత్రంతా ‘నేరాలు చేసి బతికేటోళ్ళు’తోనే వున్నాను. మీరెవరు? అని అడిగితే వారిలో ఒక లంబాడి అలాగే తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఆ లాకప్ గదిలో ముగ్గురున్నారు.
గురుమూర్తిని మిగతా యిద్దరూ ‘గురూ’ అని పిలుస్తారు. 40 సంవత్సరాల వయస్సు. ‘నాకు నా అంత కొడుకులు ఇద్దరున్నారు’ అంటాడు. పది సంవత్సరాలు లారీ డ్రైవర్‌గా పనిచేశాడు. ఏజన్సీలో కట్టె లారీలు తోలాడు. గంజాయి అలవాటుంది. హమేషా నిషాలో వుంటాడు. రెండు ఏక్సిడెంట్లు జరిగాయి. లారీ ‘ఎక్కడం’ మానేశాడు. డ్రైవర్ వృత్తి వదులుకున్నాడు. అతను మెకానిక్ కూడా. పార్ట్స్ దొంగిలించడం మొదలుపెట్టాడు. వర్క్‌షాపులో ఉద్యోగం పోయింది. గంజాయి కోసం దొంగతనాలు.
ఇల్లు వదిలిపెట్టాడు. భార్య కొత్తగూడెంలో ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ఆయా. పెద్దకుర్రవాడు వడ్రంగి. పెళ్ళయింది. అందరినీ వదిలిపెట్టాడు గురుమూర్తి. ఉద్యోగం వదిలిపెట్టాడు గురుమూర్తి. గంజాయి కొనే వ్యాపారస్తుడులా గ్రామాల వెంట తిరుగుతాడు. రైతులు రహస్యంగా గంజాయి మొక్కలు పెంచి, గంజాయి అమ్ముతారు. అక్కడ చవగ్గా కొని, వ్యాపారస్తులకు పిరంగా అమ్ముతాడు. అంతకంటె పిరంగా వ్యాపారస్తులు వినియోగదార్లకు అమ్ముతారు. గురుమూర్తికి పెట్టుబడి లేకపోతే రైతుల పొలాల్లో గంజాయి దొంగతనంగా కోసుకొస్తాడు. పోలీసులకు దొరక్కుండా సంవత్సరం నుండి తిరుగుతున్నాడు. గ్రామాల్లో రాత్రుళ్ళు దొంగతనంగా పొలాల్లోని పంపుసెట్టుల్లో ఖరీదైన పార్టులు ఎత్తుకొచ్చి అమ్ముకుంటాడు. గంజాయి కొంటాడు. అమ్ముతాడు. కొంటూ, అమ్ముతూ, తాగుతాడు.
గంజాయి తాగుతూనే చనిపోతాడు. గురుమూర్తి మాటకారి. స్టేషన్‌లో గంజాయి లేదు. ‘నిద్ర పట్టడం లేదం’టాడు. తెల్లవారులు నాతో మాట్లాడుతూనే వున్నాడు. నక్సలైట్లు తెలుసన్నాడు. ఈసారి బయటకుపోతే నక్సలైట్లలో చేరిపోతానన్నాడు. కాసేపు ఇలా మాట్లాడి, తరువాత వేదాంతంలో పడిపోయాడు. “జీవితం మాయ. జీవితం తుచ్ఛమైనది. ఈ పాడు పొట్టకోసం దిగులు పడరాదు. పోయేనాడు సంపదలు వెంటరావు” అని కాసేపు గంజాయి ఉపన్యాసం చేశాడు.
తరువాత “నేను జీవితంలో అనుభవించని సుఖం లేదు” అంటూ కాసేపు మాట్లాడాడు.
“భార్యాబిడ్డలు చూట్టానికి వచ్చారా” అన్నాను.
“చనిపోయేనాడు భార్యాబిడ్డలు వెంటరారు, అవునా? అలాగే మనం పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్ళిననాడు కూడా భార్యాపిల్లలు మన వెంటరారు” అన్నాడు వేదాంతిలాగ చేతులు తిప్పుకుంటూ.
“తెలిసినవానికి తెలగపిండి, తెలియనివానికి గానుగపిండి” అన్నాడు.
“చెడిపోయిన చేనుకు మూడే అంచలు” అన్నాడు… ఇంకా ఏమిటేమిటో అన్నాడు. “నాకూ ఎవరూ అవసరంలేదు” అన్నాడు. “ఆకాశంలో ఎగిరే పిట్టకు …లు పీకేవాడు లేడ”న్నాడు.
“గంజాయి అమ్ముతాను. అమ్మకముందు కొంటాను. కొనకుండా గంజాయి తాగుతాను. పదిమంది ఆత్మకు ‘శాంతి’ కలిగిస్తాను. నన్ను నిర్బంధంలో వుంచారు. నేను చేసేది పాపం కాదు. కావలసిన ఆత్మలకు గంజాయి పంచడం పుణ్యం.
నాకు చాలామంది పెద్దవాళ్ళు తెలుసు. నన్ను ఈ సర్కిల్ ఏమీ చేయలేడు. నన్ను వొదిలిపెట్టినా మళ్ళీ గంజాయి కొనేదే, అమ్మేదే, తాగేదే. నేను ఆయిల్ ఇంజన్ పార్టులు దొంగిలించి అమ్ముతున్నానంటున్నారు. నిజం కాదు” అన్నాడు.
నిశ్శబ్దంగా వింటో కూర్చున్న లంబాడీ గణ్య “పాముకాళ్ళు పాముకే తెలుసు” అన్నాడు. గురువుగారు కోపంలో దుర్వాస మహర్షి అయిపోయారు.
ఉదయం 9 గంటలకు సినిమాహాల్ మేనేజర్ పోలీస్‌స్టేషనుకు వచ్చి ‘గురుమూర్తిని విడుదల చేయ’మని సర్కిల్‌కు చెబుతున్నాడు.
గురుమూర్తి సర్కిల్ మోటర్ సైకిల్ శుభ్రంచేశాడు. పోలీస్ జీప్ క్లీన్ చేశాడు. పోలీసుల దగ్గర రెండు కప్పుల టీ ఉచితంగా తాగాడు. రెండు బీడీలు తెచ్చి ఇద్దరు ఖైదీలకూ తలొకటి ఇచ్చాడు. ఉదయం మేమందరం లాకప్‌లోనే వున్నాం. గురుమూర్తి బయట స్వేచ్ఛగా తిరుగుతూ ఈలపాట పాడుతున్నాడు. నన్ను కోర్టుకు తీసుకొని వెళుతూ వుంటే, “మళ్ళీ మనం కలుసుకుందాం” అన్నాడు. “నా బతుకు పాడయిపోయింద”న్నాడు.
“తురకల చేను గురకలు మేసే, ఉన్నది కాస్త కందూరు చేసె” అన్నాడు తన జీవితం వివరిస్తూ. ఆ వివరణ ఏమిటో నాకర్థం కాలేదు.
ఇలా గడచిపోయింది ఖమ్మంలో.