సుమారు పాతికేళ్ళ కిందట ఇంగ్లీషులో ఒక పద్యం చదివాను. విప్లవ మహాప్రస్థానంలో మధ్యలో ఒకచోట విశ్రాంతికోసం మజిలీ చేసిన విప్లవకారుడు అడవి కాచిన వెన్నెలను సంబోధిస్తూ అంటాడు ‘నిన్ను గురించి నేను కవిత్వం రాయలేను. నాకు చాలా పనులున్నై. కవిత్వం కన్నా నా ప్రజల విముక్తి నాకు ముఖ్యం’ అని. అచ్చంగా ఇట్లాగే కాదు కానీ దాని భావం ఇది. అది వియత్నాం ప్రజల ప్రియతమ నాయకుడు హో-చి-మిన్ పద్యానికి ఇంగ్లీషు అనువాదం. అవి నేను కవిత్వం రాసే రోజులు గనుక దానివల్ల ప్రభావితుణ్ణయి మూగవెన్నెల అనే గేయం ఒకటి రాసి ‘స్వతంత్ర’లో ప్రకటించాను. ఆ హో-చి-మిన్ పద్యం మళ్ళీ ఏ సంపుటంలోనూ కనపడలేదు.
శివసాగర్‌ను గురించి ఆలోచించినప్పుడల్లా నాకు హో-చి-మిన్ గుర్తొస్తాడు. శివసాగర్ రాసిన కొన్ని గేయాలు చదువుతుంటే పాతికేళ్ళ కిందట చదివిన ఆ పద్యం గుర్తొస్తుంది. హో-చి-మిన్, శివసాగర్‌లకు రాజకీయమైన పోలికలు ఎంత బలంగా ఉన్నాయో చెప్పలేను. వియత్నాం ప్రజలు హో-చి-మిన్ నాయకత్వాన సమైక్య స్వతంత్ర ప్రజాతంత్ర వియత్నాంను సాధించుకున్నారు. భారత విప్లవ ఉద్యమం నెలబాలుడే ఇంకా…
విప్లవ కార్యాచరణలో నిర్విరామ కృషిచేసిన కార్యకర్తలు అన్నంతవరకు గుర్తిస్తే వీళ్ళిద్దర్నీ పోల్చటంలో సామంజస్యం అర్థమవుతుంది.
‘PRISON DAIRY’ పేరుతో 1972లో అచ్చయిన హో-చి-మిన్ పద్యాలు చదివితే వీళ్ళిద్దరి మధ్య పోలికలు స్పష్టంగానే కనిపిస్తాయి. ఈ పోలికలు గుర్తించిన వాళ్ళు ఇంకా ఉన్నారనుకుంటాను. ప్రిజన్ డైరీ 34-35 పేజీల మధ్య వున్న జైలు బొమ్మ 1974లో మొదటిసారి ప్రచురించిన ‘ఖైదీ గీతం’ ముఖచిత్రంగా వేసి మళ్ళీ ఈ పుస్తకంలో యథాతథంగా వేశారు. ఇది యాదృచ్ఛికమైన సంఘటన అనుకోను.
వీళ్ళిద్దరూ విప్లవకారులన్నది దాచేస్తే దాగని సత్యం. పోరాటానికి ముందు వీళ్ళు కవులవునోకాదో తెలీదు. కాని పోరాటం నుంచి విడదీయటానికి వీల్లేనిది వీళ్ళ కవిత్వం. విప్లవకారుని అంతరంగం వీళ్ళ కవిత్వంలో కనిపించినంతగా ఇతరుల కవిత్వంలో కనిపించదు.
పదునుదేరిన విప్లవదీక్షా కాఠిన్యం, మనుషుల మనసుల అంతరాంతరాలను స్పర్శించే ఊహల మార్దవం ఒకేచోట కలిసి ఉండడం అరుదైన సన్నివేశం. ఇట్లాంటి కలయికలు చరిత్ర అపురూపంగా ప్రసాదించే వరాలు.
హో-చి-మిన్ కవిత్వంలో నన్నాకర్షించింది కాల్పనికత. ఈ కాల్పనికతను నిర్వచించటం కష్టం. ఊహల్లో కలలుగనే శక్తినే కాల్పనికతగా భావిస్తాను. ఇది పుష్కలంగా ఉన్నవాడే మంచికవి అవుతాడు. ఆ శక్తి హో-చి-మిన్‌కు ఉంది. శివసాగర్‌కు ఉంది. విప్లవకవికి ఈ శక్తి తప్పనిసరిగా ఉండాలని వీళ్ళిద్దరూ రుజువుచేశారని అనుకుంటాను. విప్లవ కవులు తమ ప్రజల భవిష్యత్తు కలలు కంటారు. అట్లా కలలు కనగల కవులే గొప్ప కవిత్వం రాశారు. ఆ కలలు నిజం చెయ్యటం కోసమే పోరాటాలు. విప్లవాలు. త్యాగాలూ.
జైలుగదిలో మధ్యాహ్నం కునుకు తీస్తూ డ్రాగన్ మీద ఎక్కి స్వర్గానికి ఎగిరిపోయినట్టు కలలు కంటాడు హో-చి-మిన్. తోటి ఖైదీల విషాద గాథలకు స్పందిస్తాడు. కటకటాల్లోంచి వెన్నెల సౌందర్యాన్ని దర్శిస్తాడు. కన్నీళ్ళ సిరాలో ముంచిన కలంతో నిర్బంధం మీద కవిత్వం రాస్తాడు. కటకటాల్లో భర్త! చూట్టానికి వచ్చిన భార్య బయట! వీళ్ళిద్దరికి మధ్య దూరం కొన్ని అంగుళాలే! కాని భూమ్యాకాశాల మధ్య ఉన్నంత దూరం ఉంది. వాళ్ళ కన్నీళ్ళ భాషను విన్నాడు హో-చి-మిన్.
విప్లవకారుడు నిర్బంధాన్ని సహించడు. స్వేచ్ఛ కోరుకుంటాడు. అయితే జైలులో కష్టజీవితాన్ని భరించలేక కాదు. త్యాగాలు చెయ్యటానికి భయపడి కాదు. ఇంకా ఎక్కువ త్యాగాలు చెయ్యటానికి అవకాశం కోసం అతనికి స్వేచ్ఛ కావాలి. అమూల్యమైన కాలం నిర్బంధంలో వ్యర్థంకావటం బాధాకరం. అందుకే హో-చి-మిన్
బానిసతనంకన్నా చావు మేలు
నా దేశంలో ప్రతిచోటా
తిరుగుబాటు జెండాలు ఎగురుతున్నాయి.
ఈ సమయంలో బందీగా ఉండటం
అబ్బా! ఎంత విచారకరం
యుద్ధరంగంలోకి ఉరకటానికి
నాకు కావాలి స్వేచ్ఛ
అని బాధపడతాడు.
ఉద్యమాన్ని నెలబాలుడుగా ఊహించటంలోనే శివసాగర్ కాల్పనిక ధోరణి వ్యక్తమవుతున్నది. అలలపై కలలు కంటాడు. అలల పైనుంచి వచ్చే చిరుగాలి సితారా ధ్వనులకు పరవశిస్తాడు. మిత్రద్రోహంచేత శత్రు చేజిక్కి తన ప్రజలకు చందమామ చేత సందేశం పంపిస్తాడు. ఏమని? ‘జీవితాంతం వరకు ప్రజలకు సేవలు చేయ విఫలమైనందుకు తన్ను క్షమించమ’ని. శత్రు శిబిరమునైన ఉగ్రనరసింహుణ్ణేనని, వైప్లవ్యగీతాన్నేననీ సందేశం పంపుతాడు.
ఎన్నో రకాలుగా శివసాగర్ విప్లవ కవులకు మార్గదర్శకుడు. పోరాటబాటలో ప్రయాణం సంగతి సరే సరి. కవితా పద్ధతిలో మార్గదర్శకత సంగతి నేను ప్రధానంగా చెప్పదల్చుకున్నది. విప్లవకవి అయినవాడు అన్ని రకాల స్థాయిల్లో ఉన్న పాఠకులతోనూ కమ్యూనికేట్ చేయగలగాలి. విజ్ఞానవంతులైన చదువుకున్న వాళ్ళతో పాటు చదువురాని సామాన్య శ్రోతలవరకు సందేశం వెళ్ళాలి. ఆ అవసరాన్ని శివసాగర్ గుర్తించాడు. గుర్తించటమే కాదు, అన్ని మార్గాల్లోనూ ఉత్తమ కవిత్వాన్ని అందించాడు. ‘వివిలా శాంటియాగో’ వంటి అత్యాధునిక ధోరణి కవితలు నాగరిక పాఠకులను ఆకట్టుకొంటాయి. చిలీ దేశంలో అలెండీ పతనాన్ని గురించి రాజకీయంగా సైద్ధాంతికంగా పాఠకుడికి ఒక దృక్పథాన్ని ఇస్తుంది ఈ కవితా ఖండిక. చెల్లీ చెంద్రమ్మ, నరుడో భాస్కరుడా, విలుకాడ వంటి పాటలు సామాన్య ప్రజల బాణీల్లో, వాళ్ళ పలుకుబడితో సాగి వాళ్ళకు పరిచయమైన భాషలో సందేశాన్నందిస్తాయి. రెండు ధోరణుల్లోనూ కవితాశక్తి కుంటుపడకపోవటం విశేషం. ఒకే కవి వచన పద్యంలోనూ, జానపద శైలి పాటలోనూ, మాత్రాపద్యంలోనూ, సెటైర్‌లోనూ పరిణతి సాధించి సమాన ప్రతిభతో ఉత్తమ కవిత్వాన్నందించడం అరుదు. ‘కనిష్ఠ కాధిష్ఠిత కాళిదాసా’ అన్నట్టు నాకు రెండో ఉదాహరణ దొరకటంలేదు. బహుశా చెరబండరాజు ఈ మార్గంలో కొంతవరకు ప్రయాణించాడనుకుంటాను. తనకన్నా ముందటి కవుల ధోరణులను, తన సొంతం చేసుకున్నాడు శివసాగర్. ‘ఇందిరిస్టు గారడీ’ వంటి గేయాల్లో శ్రీశ్రీగారి వెక్కిరింత ధోరణి, ‘నేను గిరిజనుడు సారించిన విల్లును, నేను రైతు కసితో విసిరిన గండ్రగొడ్డలిని’ అన్నప్పుడు తిలక్ వచనకవితావేగం కనిపిస్తాయి. వీటిని అనుకరణలని అనటం హ్రస్వదృష్టి అవుతుంది. ఉత్తమ కవి గాలిలో నుంచి ఊడిపడడు. తనకు పూర్వం ఉన్న గొప్ప కవులకు తగిన వారసుడిగా రంగం మీదకి వస్తాడు.
తెలుగు సాహిత్యంలో మొహమాటంలేని కటువైన బలమైన వ్యక్తీకరణను దిగంబర కవులు ప్రవేశపెట్టారు. అయితే ఈ కటుత్వం ‘అతి’ అయితే మొరటు అయి జుగుప్సాకరంగా కావచ్చు. శివసాగర్‌లో అట్లాంటివి చాలా కొద్దిగా చోటు చేసుకున్నాయి. ‘మైక్రోస్కోపిక్’లో అట్లాంటివి ఒకటి రెండు కనిపిస్తాయి.
శివసాగర్ జానపద బాణీల పాటల్లో ఒక విశిష్టత వుంది. ఏకకాలంలో పండిత పామరులను మెప్పించగల శక్తి వీటికి వుంది. జానపద గేయాల్లో కనిపించే భాషా సారళ్యంతోపాటు ఇతర సాహిత్యాల్లో కనిపించే భావ పరిణతి ఉంది. విలుకాడా పాటలో విప్లవవీరుని ప్రకృతి అంతా ఎట్లా కాపాడుకున్నదో వర్ణించిన తీరు జానపదరీతిని మించిన పద్ధతి.
తెలుగు పాఠకుల్లో చాలామంది శివసాగర్ పాటల విశిష్టతను గుర్తించారు. విరసానికి ఒక డైరెక్షన్ ఇచ్చిన పాటగా ‘నరుడో భాస్కరుడా!’ అనే పాటకు గుర్తింపు ఉంది. ఈ పాటను శ్రీశ్రీ కూడా చాలా మెచ్చుకున్నాడు. అట్లాగే ‘రుతు సంగీతం’, ‘విలుకాడ’, ‘ఏటికి ఎదురీదిన వాళ్ళమురా!’, ‘గంగ దాటెళ్ళకే చెల్లెమ్మా’ అనే పాటలు కవి స్వయంగా కాని, ఇతరులు పాడటం ద్వారాగాని చాలా ప్రజాదరణ పొందినై. వాటి కవితాశక్తికి ప్రచారం సహకరించింది. అయితే అంతగా ఎక్కువమంది గుర్తించనిది శివసాగర్ వచన కవితాబలం. ఇంతకు పూర్వం వచన కవిత్వం అంత్యప్రాసల వల్ల, వాక్యంలో పదక్రమ వ్యత్యయం వల్ల, చమత్కార సంబోధనల వల్ల, అవహేళన వాక్యాల వల్ల బతికింది. లేక బతకాలని చూసింది. శివసాగర్ పూర్వం కవులంతా అట్లా రాశారని కాదు. అధిక ప్రచారంలో ఉన్న వచన కవిత్వం అట్లా ఉండేది. నిజానికి శివసాగర్ కవిత్వంలో కూడా అట్లాంటి ఖండికలు కొన్ని లేకపోలేదు. ‘రెడ్ సిగ్నల్’, ‘లెనిన్’ లాంటి వాటిల్లో ఈ ధోరణి తొంగిచూస్తుంది. చెప్పే విషయంలో బలం వల్లా, చెప్పే పద్దతిలో నిజాయితీ వల్లా, శక్తివంతమైన వ్యక్తీకరణ వల్లా సూటిగా చెప్పి కవిత్వంగా ఒప్పించటం శివసాగర్ వచన కవిత్వంలో సాధించిన గొప్పతనంగా భావిస్తున్నాను. నినాదస్థాయికి ఎదిగిన గొప్ప వాక్యాలు శివసాగర్ కవిత్వంలో చాల ఉన్నై (గొప్ప కవిత్వమే నినాద స్థాయికి చేరగలుగుతుంది).
ప్రజలను సాయుధం చేస్తున్న రివల్యూషనరీ నేడు కవి, సూర్యోదయం కుట్ర కాదు, సూర్యుడు కుట్రదారుడు కాదు, శ్రీకాకుళ సూర్యోదయం కుట్రకాదు, గెరిల్లా సూర్యుడు కుట్రదారుడు కాదు–వంటి వాక్యాలిట్లాంటివి. కవి శక్తిమంతుడైతే సూటిగా రాసిన వాక్యాలు కవిత్వమవుతాయనటానికి ‘వివి లా శాంటియాగో’ ఒక స్పష్టమైన ఉదాహరణ (‘వెన్నెలా, పూలూ, మంచు, మలయమారుతం, కొండలూ, సెలయేళ్ళూ-ఇట్లా ప్రకృతి సౌందర్యాన్ని గానం చెయ్యటం మన పూర్వపు వాళ్ళకిష్టం. మనకాలంలో కవిత్వం ఉక్కు పద్యాల్లా ఉండాలి. కవులు శత్రువుమీద దెబ్బతీసే దళాలుగా ఏర్పడాలి.’ అంటాడు హో-చి-మిన్.)
శివసాగర్ కవితలో కనిపించే ఇంకో లక్షణం సింబాలిజం. కొన్ని కొన్ని సంకేతాల ద్వారా వస్తువును ధ్వనింపచెయ్యటమే ఈ సింబాలిజం. ‘విలుకాడ’ పాటలో విలుకాడు విప్లవీరుడికి సంకేతం, ‘రుతు సంగీతం’ అనే గేయం మొత్తం సంకేతాలమయం. ‘రుతుగీత’ అనేది ఈనాటి విప్లవ వాతావరణానికి గుర్తు. ఓల్గా సోవియట్ యూనియన్‌కు, యాంగ్సీనది చైనాకు, గంగ భారతదేశానికి సంకేతాలు. సోషలిజం సాధనలో రష్యన్ మార్గం గడ్డకట్టుకుపోయిందనీ, చైనా మార్గం చైతన్యవంతంగా ఉందనీ, భారత విప్లవానికి అదే ఆదర్శమనీ రుతు సంగీతంలో శివసాగర్ సంకేతాలతో చెప్పారు. శివసాగర్ వాడిన సంకేతాలు కొత్తవే అయినా వాటిని అర్థంచేసుకోవటానికి తల బద్దలు కొట్టుకో అక్కర్లేదు.
పుస్తకాల్లో రాసినట్టు, నాయకులు చెప్పినట్టు మూసలో పోసినట్లు విప్లవాలు సాగవు. ఆటుపోట్లూ, గెలుపు ఓటములూ ఉంటాయి. అంతేకాక ఉద్యమ కార్యకర్తల్లో కార్యాచరణ పట్ల విభేదాలు, అవి ముదిరితే వైరుధ్యాలూ ఏర్పడొచ్చు. అవేవీ లేవనుకోవటం కళ్ళు మూసుకొని పాలు తాగటం. విప్లవకారుడు కవి కూడా అయితే వీటికి స్పందించకుండా ఉండలేడు. తన మనసులోని భావాల పొరలను విప్పకుండా ఉండలేడు. ఇట్లాంటి ఘట్టం ‘ఏటికి ఎదురీదు వాళ్ళమురా!’ అనే పాటలో సింబాలిక్‌గా ఉంది. విప్లవోద్యమాన్ని పడవ ప్రయాణంగా పోల్చి అందులో తాత్కాలికంగా కలిగిన నష్టాల్ని ‘మొనగాడు తమ్ముణ్ణి మొసలి మింగేసింది. ఎదిగిన అమ్మణ్ణి ఏరు కాటేసింది’ అని సూచించి తన సీనియర్ కామ్రేడ్‌కి, ‘నీతి తప్పని వాళ్ళమురా నీతోనే వుంటామురా’ అని చిక్కుల్లో పడ్డ ఉద్యమంలో సహచరుడికి హామీ యిచ్చే ఇట్లాంటి పాట తెలుగు సాహిత్యంలో నాకింకొకటి కనపళ్ళేదు. నేనెరిగినంతవరకు ఇతర సాహిత్యాల్లోనూ నా దృష్టికి రాలేదు. ఉద్యమంలో అంతర్భాగమైన కవి మాత్రమే రాయగలిగిందీ పాట.
శివసాగర్ అనువాదాలు కొన్ని ఈ సంపుటంలో ఉన్నాయి. అందులో నాకు బాగా నచ్చింది ‘అమరులు’ అను పేరుతో మావో కవితకు చేసిన అనువాదం. దీని ఇంగ్లీషు మూలం నేను చూళ్ళేదు. చైనీస్ పురాగాథల ప్రస్తావన వుంది కాబట్టి ఇది అనువాదమని తెలుస్తుంది. లేకపోతే ‘నా మల్లియ రాలెను! నీ మొగిలి కూడా రాలెను. నా మల్లియ, నీ మొగలి ఆకాశం చేరెను!’ అనే పాదాలు చూస్తే దీన్ని అనువాదం అనుకోవటం కష్టం. దీని సందర్భం తెలిస్తే ఈ పాట విశేషం ఇంకా అర్థమవుతుంది. చైనా విప్లవ పోరాటంలో భర్తను పోగొట్టుకున్న మహిళను ఓదారుస్తూ విప్లవ నాయకుడు రాసిన ఉత్తరం ఈ పాట. అప్పుడే మావో తన భార్యను కూడా పోగొట్టుకున్నాడట. తన కన్నీళ్ళతో ఆమె కన్నీళ్ళను తుడవటానికి ప్రయత్నించాడు ఆ మహానాయకుడు. విరామమెరుగని విప్లవ కార్యాచరణలో… భర్తను పోగొట్టుకున్న ఒక భార్యను ఓదార్చటానికి మావోకు వ్యవధి దొరకటం ఒక్కటే విశేషం కాదు. ఆమె కష్టానికి ఎంతగా చలించాడో ఆ స్పందనంతా తెలుగు గీతంలో కనిపిస్తుంది. చైనా సంస్కృతిలో భాగమైన ఊహాకల్పిత గాథలు ఈ పాటలో మావో భావ తీవ్రతకు ఒదిగిపోయినయ్. అవి తెలుగు సంస్కృతికి ఏమంత భిన్నంగా కనిపించటం లేదు, పేర్లు తప్ప.
ఈ సంపుటిలో కవితా ఖండికలన్నిటికి వ్యాఖ్యానం అవసరమనుకోను. అయితే కొన్నిటికి సందర్భం, మరికొన్నిటికి వివరణల లాంటి నోట్సు ఉంటే ఈ పుస్తకం పాఠకులకు చాలా ప్రయోజనకారిగా ఉండేది. ఆధునిక కవిత్వావగాహనకు సందర్భ వివరణలు ఎంతో అవసరం. (ఈ ఎడిషన్లో వివరణలు చేర్చడం జరిగింది- శివసాగర్)
ఒరిజినాలిటీ ఉన్న కవి భాషని యథాతథంగా వాడుకోడు. తాను చెప్పదల్చుకొన్న భావానికనుగుణంగా మలచుకొంటాడు. దాన్ని సాహిత్య విమర్శకులు డిక్షన్ అన్నారు. పాత మాటల్ని కొత్త అర్థాల్లో వాడుకోవటం, ఉన్న మాటల్ని కొత్త కూర్పుతో వాడుకోవటం ఈ డిక్షన్ లక్షణం. ఉదాహరణకి ‘మహా ప్రస్థానం’ అంటే స్వర్గానికి చేసే మహా ప్రయాణం. శ్రీశ్రీ దానర్థం మార్చేశాడు. అట్లాగే పరమేష్ఠి జూకాలు, లోహశ్యేనం, శ్రమైక జీవన సౌందర్యం మొదలైన పదాల కూర్పు శ్రీశ్రీకి ముందు లేదు. శివసాగర్ కూడా అట్లా తన డిక్షన్‌ను తయారు చేసుకొన్నాడు. అలహాబాదు మహారాణి, అలహాబాదు షోకుపిల్లి, సత్యం చావదు, అలలుకనే కలలు, చిరుగాలి సితారా సంగీతం, ఉద్యమం నెలబాలుడు, లోకసభ తోలుబొమ్మలాట, బంజరు పేంజేరు పోరాటం, మాదాకబళం మహాసంగ్రామాలు, రక్కసి సర్పం (డ్రాగన్), బిగియించిన పిడికిట్లో సూర్యుడు ఉదయించెను, శ్రీకాకుళ సూర్యోదయం వంటి పదాల కూర్పు, అర్థాల సమ్మేళనం శివసాగర్ తొలిసారిగా చేసినవి. ఆయన కవిత్వాన్ని గుర్తించడానికి ఒక్కొక్కప్పుడు కొండగుర్తులుగా కూడా ఉపయోగపడతై.
సుమారు 1970 ప్రాంతం నుండి తెలుగు సాహిత్యంలో విప్లవ కవితా యుగంగా వర్ణిస్తారు. ఈ పది పన్నెండేళ్ళ కాలంలో విప్లవ కవిత్వం ఒక ప్రధాన ధోరణిగా తెలుగు సాహిత్య రంగాన్ని ఆక్రమించిందని దాని అర్థం. (ఇది సంఘంలో సభ్యత్వానికి సంబంధించింది కాదని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను.) విప్లవ చైతన్యంలో నుంచి మాత్రమే కాక పోరాటంలో భాగంగా వచ్చిన కవి శివసాగర్. విప్లవ సాహిత్యంలో కాదు, మొత్తం తెలుగు సాహిత్యంలో కూడా శ్రీశ్రీ తరువాత గుర్తించదగిన బహుముఖ ప్రతిభావంతుడు శివసాగర్.
ఇక చిరుగాలి సితారా సంగీతం వినండి. పరవశించి నిద్రించటానిక్కాదు. ప్రజల గుండెల కొండల్లో మాటు కాసి ట్రిగ్గర్ నొక్కటానికి.
(శివసాగర్ కవిత్వం 1931-2012 పుస్తకం ముందుమాట. అనుమతితో పునర్ముద్రణ.)