అఫ్సర్ మనకు కవిగా తెలుసు. అడపా దడపా కథకుడుగా కూడా తెలుసు. కవిగా రక్తస్పర్శ రోజులనుంచీ ఇవాళ్టి కవిత్వం దాకా చూస్తే అతను క్రమంగా, కానీ కచ్చితంగా, తన సాహితీ పనిముట్లను సానపెట్టుకుంటూ వస్తున్నట్టు కనబడుతోంది. అనేక రకాలైన అస్తిత్వాలు ఉన్నా వాటిల్లో వొకటైన ముస్లిమ్ వ్యక్తిగా అతని ఉనికి కూడా మన ముందుకొస్తూనే వుంది. మన దేశంలోనే కాదు ప్రపంచమంతటా ముస్లిమ్‌ల ఉనికి పట్ల మిగతా ప్రపంచం యే విధంగా స్పందిస్తున్నదో మనకు తెలిసిందే. అలాంటి సందర్భాలలో తన ధర్మాగ్రహాన్ని కవితల్లో కూడా చాలా పదునుగా వ్యక్తపరిచాడు. అయితే అది సరిపోలేక, బహుశా అతను కథలను ఆశ్రయించవలసి వచ్చింది. యెందుకంటే కవిత్వమూ, వచనమూ రెండు వేర్వేరు పనులు చేస్తాయి. ఆగ్రహ ప్రకటనకు కవిత బలంగానే వుంటుంది, కాని బహుశా అది ముందు నుంచీ ఆ యెరుక కలిగిన మనిషికే లోతుగా అందుతుంది. కథ అలా కాదు. తటస్థ వైఖరి వున్న, లేదా వ్యతిరేక వైఖరిని కలిగి వున్న వ్యక్తిని కూడా మరో దృక్కోణం నుంచి చూడడానికి బలవంతపెడుతుంది. ఇదంతా అతని కవిత్వమూ కథలూ చదువుకున్నాక నేను భావిస్తున్నది.
ముస్లిమ్ జీవితాన్ని కథల్లో చాలా సమర్థవంతంగా పరచినవారిలో మొట్టమొదటి స్థానంలో మహమ్మద్ ఖదీర్‌బాబు వుంటాడు. ఆయన మొదటి నుంచీ కథాప్రక్రియ మీదే పూర్తి శ్రద్ధ పెట్టడం వలన చాలా తొందరలోనే చేయి తిరిగిన రచయిత అయ్యాడు. వంద వాక్యాలు యెందుకు, అతని కథలే అన్నీ చెబుతాయి: ఖాదర్ లేడు, గెట్ పబ్లిష్‌డ్ వగైరా. అతని తర్వాత ఇప్పుడు అఫ్సర్ గురించి కూడా అలాగే అనుకోవాలి. ఇద్దరి శైలులు వేరు, వైఖరి వేరు, దృష్టిలో సామ్యం తప్ప. ఖదీర్‌ది మరింత పదునైన కథ అయితే, అఫ్సర్ ముఖ్యంగా కవి కాబట్టి ఆ వార తక్కువే. అయితే నాకు కనిపించిన వొక విశేషం చెప్పాలి. ఇద్దరూ ముస్లిమ్ ఉనికి, ముస్లిమ్ బాధను వ్యక్తపరచినప్పటికీ యెడంగానే వుండి చిత్రాన్ని చూపించే ప్రయత్నం చేశారు. అఫ్సర్ శకలాలుగా చిత్రాలు గీస్తే, ఖదీర్ చాలా తీక్షణంగా, పార్ సినేమాలో ఆఖరి సన్నివేశంలా హృదయానికి గుచ్చుకునేలా సాంద్రంగా అల్లుతాడు.
కథకుడు ముఖ్యంగా చేయాల్సింది కథ చెప్పడమే. ఆ కథే మిగతా అన్ని కిటికీలు తెరిచి మనకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఇన్ని డిగ్రీలు తిరిగి, ఇంతెత్తు నుంచి, ఈ వెలుగు పడుతున్న చోట చూడమని కథ చెప్పదు, కథకుడు అసలే చెప్పకూడదు. మనకు యెన్నో పుల్లాపుడకలు కనిపిస్తాయి, కాని వొక నేర్పరి పక్షి మాత్రమే వాటిల్లోంచి పనికొచ్చేవి వొక్కొక్కటీ యేరుకొచ్చి గూడు అల్లుతుంది. ఆ నేర్పరితనం కూడా అన్ని పక్షులకూ వొకేలా వుండదు. తీరా గూడు తయారయ్యాక అది వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా కుదిరిందా లేదా తెలుస్తుంది. కథ ఇంచుమించు ఇంతే. అది బాగా కుదిరితే మన గుండెల్లో గూడు కట్టుకుంటుంది, కొత్త చూపునిస్తుంది.
గోరీమా–ఇది వొక కథే కాదు. ఈ పాత్ర చాలాసార్లు మెదులుతుంది వేర్వేరు కథలలో. మన దేశంలో వొక గూడును చెల్లాచెదురు చేయడమనే అకృత్యం, అత్యాచారం కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు అఫ్సర్. వొక సీరియస్ సినేమాలో లాగా వొక్కొక్క దృశ్యాన్నే మన ముందు పెడతాడు. మొట్టమొదటి దృశ్యమే దిరిసెన పూల దృశ్యం. ‘దూరంగా చెట్టునిండా యెర్రెర్రని పూలతో దిరిసెనచెట్టు ఆకుపచ్చని నది మధ్య యెగరేసిన యెర్ర జెండాలా వుంది.‘ ఈ వాక్యం కథ టోన్‌ని స్థిరపరుస్తుంది. కథకుడు చిన్ననాటి వూరును చూడడానికి రైలెక్కి వస్తున్నప్పుడు చూసిన దృశ్యపు వర్ణన. ఆ వూరంటే ప్రత్యేకాభిమానానికి కారణం గోరీమా. వొక నడివయసు మహిళ, కథకుని ఇంటికి వచ్చే పోయే వో చుట్టం. ఓనమాలు కాకుండా ఆలిఫ్, బే-లతో చదువు మొదలుపెట్టిన ఆ కుర్రాడికి అప్పటినించే అవమానాలు, యెగతాళి మాటలూ. ఆ పిల్లవాణ్ణి వొళ్ళో కూచోబెట్టుకుని ఖురాన్ సూరాలు నేర్పింది. మానసికంగా ఊతాన్నిచ్చింది. అలా అతని బాల్యం ఆ ఇంట్లో ఆడుకుంటూ జరిగింది. తర్వాత అదే ఇంటి ముందు రాత్రికి రాత్రి ‘అమ్మవారు’ వెలిసి అది యాత్రాస్థలంలా మారిపోతుంది. ఇదివరకటి మొహర్రమ్ కాలపు మాతం పాటలు పోయి, ఇప్పుడు కొత్త ధ్వనులు ఆక్రమిస్తాయి ఆ స్థలాన్ని. కంతలో తల దూర్చి ఒంటె ఇంటినే ఆక్రమించేసుకున్నట్టు వొక పక్కా పధ్ధతిగా గోరీమా ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టబడుతుంది. నిరాశ్రయురాలైనా, బిచ్చగత్తెగా మారినా ఆమె ‘తన’ నేలను అంటిపెట్టుకునే వుంటుంది. ఈ నేల మీద విభజన రేఖలెక్కడున్నాయి, మనసుల్లో తప్ప!
గోరీమా కథ కొంత గోరీమాది, కొంత కథకుని కుటుంబానిది కూడా. మిగతా వర్గాలలో జరుగుతున్నట్టే ఇక్కడా కథకుని తండ్రి పొలాన్ని అతని బాబాయి జీర్ణం చేసుకుంటాడు. ఆ వాతావరణాన్ని చాలా నేర్పుగా వర్ణిస్తాడు కథకుడు. ఆపైన కథకుడి స్పందననూ మనం గమనించాలి. తనింట ఆర్థిక సమస్యలు, బాబాయి ఇంట వున్న పరిస్థితులూ రెండూ చూస్తాడు. యేమీ పాలుపోదు. నమాజు చదువుతాడు. వొకలాంటి నిశ్చలతలో యేమీ వద్దులే, నేను యెలాగో ఇంట్లో నచ్చచెబుతాను, నెట్టుకొస్తాను అనుకున్న మనిషి, ఉస్మాన్ ‘నీ తండ్రి ఆఖరి జ్ఙాపకాన్ని వదులుకుంటావా!’ అంటే మనసు మార్చుకుంటాడు. ఇక్కడొక కవితా వాక్యం వాడాడు అఫ్సర్. ‘వొళ్ళంతా పిడికిలిలా బిగుసుకుంది.‘ ఈ వాక్యం నాకు నచ్చినా, చాలా అవసరమైన సందర్భాల్లో ఈ తీక్షణత వెతుక్కున్నా కనబడలేదు. గోరీమా కథలో చివరి కవితాత్మక వాక్యాలు గోరీమా వ్యక్తిత్వానికి గౌరవ ప్రకటన. కానీ కథకుడు పిరికిగా యుద్ధక్షేత్రం నుంచి పారిపోతున్నట్టు చెప్పడం బహుశా ఆగ్రహావేశాలు, నిస్సహాయతల యేకకాల ప్రకటన కావచ్చు.
ముస్లిమ్‌ల జీవితాల్లో కనబడే వొక దృశ్యం జెండా చెట్టు, మంత్రం ఊదే సాయేబు, నెమలీకలతో తల మీద నిమిరే దృశ్యం. సూఫీల అధ్యయనం కోసం విస్తృతంగా ప్రయాణం చేసిన అఫ్సర్ దీని మీద కూడా కథను, తన దృక్కోణాన్ని మెత్తగా, కాని స్పష్టంగానే చెబుతాడు. కాస్త కుతూహలం, బాల్య చాపల్యం, తెలిసీతెలియని తనం, మిస్టరీ, వీటి చుట్టూ పరచుకున్న జీవితాలు, చివర్న యెదిగిన వయసులో ముస్తఫా మరణానంతరం కలిగిన యెరుక. మంచి సినేమా చూస్తున్నట్టే వుంటుంది కథ చదివినప్పుడు. జిడ్డు కృష్ణమూర్తి వాక్యం ‘ట్రూత్ ఈజ్ ఎ పాత్‌లెస్ ల్యాండ్’ వంటివాటిని గుర్తుకు తెచ్చే వాక్యాలున్నాయి ఇందులో. ‘ఆధ్యాత్మికత అనేది మైదానం లాంటిది. దిగంతం కనిపించాలి. పైన ఆకాశమూ, కింద నేలా కనిపించాలి. అంతే కానీ, అది ఇరుకు గది కాకూడదు.‘ స్వచ్చమైన చూపునిచ్చే అపురూపమైన వాక్యాలు. కథకుడికి ఆ చూపునిచ్చింది మాత్రం మునీర్. కూలిపోయిన ఆ గది గోడలు చూస్తూ అంటాడతను, ‘ఆ గది యెప్పటికీ నాకు ఒక చీకటి గుహ. దేవుడు ఉన్నాడని నేను గట్టిగా నమ్ముతాను. కానీ ఈ చీకటి గదుల్లోనో, విచిత్ర శక్తుల్లోనో, గుహల్లోనో ఉన్నాడని మాత్రం యెవరు చెప్పినా నేను నమ్మను. దాన్ని కూల్చినప్పుడు నాకు ఆ చీకటి నుంచి విముక్తి దొరికింది.‘ ఆ విముక్తి మార్గం పాఠకుడికీ అందుతుంది.
వివిధ రకాల సమూహాలు కలిసివుంటున్న ఈ దేశంలో మరకల్లాగా కొన్ని జరిగిపోతూ వుంటాయి. అవి మతం పేరుమీద మనుషుల మధ్య సరిహద్దులు గీస్తాయి. స్నేహాలను చెరిపివేయాలని చూస్తాయి. ఆ దుర్మార్గాన్ని నిస్సహాయత్వంతో భరిస్తున్న వొక వర్గం మూలుగు కూడా అందరికీ వినబడదు. హైదరాబాదులో మత కల్లోలాలు జరిగినపుడు ముస్లిమ్ ఇళ్ళల్లోంచి యువత మాయమై కటకటాల వెనుకకు యెలా పోతారు అన్నది యెవరికీ పట్టని విషయం. యేమాత్రం ఆశ్చర్యం కలిగించని ఇలాంటి అరాచకాలకు కొంతమంది స్నేహపూరితంగా స్పందించినా సంఖ్యాబలం తగ్గిన అలాంటి సమూహాన్ని నిస్సహాయత్వం నిర్వీర్యపరుస్తుంది. హిందువులూ, ముస్లింలూ కలిసివున్న వాళ్ళ మధ్య నుంచి వొక్కసారిగా సాహిల్ మాయమవుతాడు. అతని భార్య, స్నేహితులూ బెంగటిల్లిపోతారు. పోలీసుల వైఖరి పుండు మీద కారం జల్లుతుంది. వీళ్ళ మధ్య వో పసి హృదయం యేమీ అర్థంకాక తల్లడిల్లుతుంది. ‘సాహిల్ మామ వస్తాడా?‘ రేపటి తరం భయం. తండ్రి నమ్మకంగా చెబుతాడు, తప్పకుండా వస్తాడమ్మా అని.
ఇలా ఈ సున్నితమైన అంశాన్ని పసి కన్నులతో చూడటం, వొక రకమైన అమాయకత్వంతో చూడటం, నిష్కల్మషంగా చూడటం ఇంకో కథలో కూడా చూస్తాము. అది ‘చమ్కీ పూల గుర్రం.’ వో ముస్లిం పాప, వో హిందూ పాపల మధ్య వున్న స్నేహం సమాజంలో వస్తున్న రాజకీయ, మతపరమైన మార్పుల కారణంగా వో అడ్డుగోడ లేపుతుంది. పెద్దవాళ్ళకి వాళ్ళ కారణాలుంటాయి. పిల్లల మనస్సులకు అవేవీ అందవు. వాళ్ళ ప్రేమలకు ఆ కారణాలు సైతానుల్లాంటివే. పిల్లలు రేపటి తరాలు అనుకుంటే, ఇప్పటి తరం చూస్తున్న విధ్వంసాల నీడలు వాళ్ళ కలల్లో కూడా పడకూడదని మనమూ ప్రార్థిస్తాం. వాళ్ళకు నేర్పేది మాని, వాళ్ళ నించి నేర్చుకుంటాం.
సహేలీ అన్న కథలో మాత్రం అఫ్సర్ కాస్త భిన్నమైన ఇతివృత్తం తీసుకున్నాడు. కావటానికి అది ముస్లిం నేపథ్యమైనా చర్చకు వచ్చిన విషయం ఇద్దరు స్త్రీల మధ్య వున్న లైంగిక ప్రేమ. ముస్లిం అమ్మాయి షబ్నమ్, హిందూ అమ్మాయి బేబీ మధ్య స్నేహం. కలిసి చదువుతూ వుంటారు. షబ్నమ్ అక్క వివాహం అయ్యి, పెటాకులు కూడా అయ్యి పుట్టింట వుంది. భర్త మొరటు ఎంసీపి. ప్రేమగా తాకాల్సిన అతని చేతులు కొరడాలా తాకుతాయి. మాటలూ అంతే. ఆ పెళ్ళి వైఫల్యం నీడలు షబ్నమ్ మనసులో కూడా పరచుకుంటాయి. షబ్నమ్‌ను ప్రేమిస్తున్న అబ్బాయి పట్ల ఆకర్షణ వుండదు. అనుకోకుండా బేబీ స్పర్శలో ఆమెకు ఆకర్షణ కలుగుతుంది. ఇద్దరూ ఆ ఘడియలు ఆస్వాదిస్తారు. సజాతి ప్రేమల పట్ల సానుకూల దృక్పథం కలిగించినా ఈ కథ కొన్ని ప్రశ్నలను ప్రశ్నలుగానే మిగులుస్తుంది. అటువంటి వైఖరి వొక వివాహ వైఫల్యం చూసిన భయం నుంచి పుట్టదు. ప్రేరేపించబడదు. అది సహజాతంగానే బయటపడుతుంది. పాఠకుడు తట్టుకోలేని నిజాయితీతో వసుధేంద్ర వ్రాసిన ‘మోహనస్వామి’ ఇందుకు సాక్ష్యం. ఇక ఇదివరలో వచ్చిన ఫైర్ చిత్రంలో కూడా ఇద్దరు స్త్రీలు తమ భర్తల దగ్గర అనురాగం పొందలేక దగ్గరై కొత్త అనుభూతులను ఆవిష్కరిస్తారు. అప్పుడూ ఇదే అనుమానం. మొన్నీమధ్య వచ్చిన మార్గరిటా విత్ ఎ స్ట్రా సినేమాలో కాస్త నిజాయితీగా చిత్రీకరణ చూస్తాము. ఇది సంధికాలం కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు ఇంకా ఆహ్వానించాల్సిందే. అయితే ఈ కథలో వొక ఆశావహ కోణం వుంది. అదేమిటంటే అలాంటి భర్తను పొందిన అక్క ఆశలు వదులుకోదు. మరో కొత్త కెరటం కోసం వేచి వుంటానంటుంది.
అడవి–అఫ్సర్ వ్రాసిన తొలి కథ. వొక కథగా శిల్పమూ, వస్తువూ అత్యంత నైపుణ్యంతో అల్లిన కథ ఇది. నాకు అన్నిటికంటే యెక్కువగా నచ్చిన కథ కూడా. రంగడు కుటుంబం పని వెతుక్కుంటూ తిరుగుతుంటారు. పనులు దొరక్క మనుషులు వలస వెళ్తున్నారు. తండ్రికి పని దొరక్క ఫ్రస్ట్రేట్ అవుతాడు. తల్లి, చెల్లెలు. మొలతాళ్ళ కర్ర పుచ్చుకుని వీధులెంట తిరగాలి. జనం గీసిగీసి బేరం ఆడుతారు. వచ్చే సంపాదనా అంతంత మాత్రం. తండ్రి కసురుకుంటాడు, సరిగా పని చేయక యెక్కడో కూచుని కునుకు తీసున్నాడని. ఆ మాట మనసును గాయపరుస్తుంది. ఇల్లు వదిలి పారిపోతాడు. చెత్త యేరుకునే పిల్లలతో కలిసి పనిచేస్తాడు. కానీ అక్కడ వచ్చే నాలుగు రాళ్ళూ యే మూలకీ రావు. నీరసం. బాధ. ఇల్లు జ్ఞాపకానికి వస్తుంది. వోపిక తెచ్చుకుని వెళ్తాడు. ‘నల్లబడ్డ పొయ్యిరాళ్ళు గాలికి పోగా పోగా మిగిలిన బూడిద, వొంటరిగా నిల్చుండిపోయిన మొండిమానూ‘ దర్శనమిస్తాయి.
ఇన్ని కథల మధ్య ‘వచ్చే పోయే వానల్లో…’ మాత్రం యెక్కువ కవితాత్మకంగా వుంటుంది. వొక జంట. అతను ముస్లిమ్. చిన్న వూరు విడిచిపెట్టి తల్లితో హైదరాబాదుకొస్తాడు. అభద్రతాభావం మాత్రం అతన్ని వెన్నంటే వుంటుంది. తల్లి తన బాధను కూడా దాచుకుని కొడుకును చూసుకుంటుంది. కాని ఆ అభద్రత అనుభవించిన వారికే తప్ప ఇతరులకు అర్థం కాదు. పాడుబడిన ఖిల్లా, దాని చిత్రం ప్రతీకలుగా. వొక సహచరితో స్నేహం మాత్రం వచ్చే పోయే వానల్లాగా. వాళ్ళ పెళ్ళి అయినా కూడా నిలవదు. ఆమె వేరొకరిని చేసుకుంటుంది. అయినా ఇతన్ని అప్పుడప్పుడు కలవడానికి వస్తూ వుంటుంది. ఆ కలిసిన క్షణాలే బతికిన క్షణాలు. ఇది ఆ జంట మధ్య వున్న సంబంధం గురించిన కథా? లేక ఈ దేశంలో వొక ప్రత్యేక వర్గంలో పుట్టిన వ్యక్తి అభద్రత గురించి సూచనాత్మకంగా అల్లిన కథా? యే రకంగా చూసినా కొంత వెలితి కనబడుతుంది. ‘అయిదారేళ్ళ ప్రేమా, రెండేళ్ళ వివాహబంధం, ఆ తరువాతి సెపరేషన్, ఆ రెండేళ్ళలో ఎన్ని సందిగ్ధాలు… ఏ తొందరపాటులోనో ఆమెకి నెల తప్పుతుందని’ ఇంకో అదనపు సంశయం. విడిపోవడానికి అదొక్కటే కారణం కాదని ఇద్దరికీ తెలుసు. ముందే చేసుకున్న వొప్పందం ప్రకారం ఇద్దరూ మళ్ళీ పెళ్ళిళ్ళూ పెటాకులూ పిల్లలూ ఈ విషయాలేమీ మాట్లాడుకోకూడదు, తమ ఇద్దరి జీవితాలూ అలా తెగిపోయిన బంధంగానే వుండక్కర్లేదు అనుకున్నాక, ఇక ఆ మామూలు విషయాలు వెలివేసినట్టే!… ఆమె మళ్ళీ ఇంకొకరిని ఇష్టపడి చేసుకున్న రెండో పెళ్ళి తర్వాత కూడా తన స్నేహాన్ని వదులుకోలేదు. కాని మరోచోట దీనికి భిన్నంగా ఇంకో మాట: ‘తను ఏదైనా అడుగుతాడేమో అన్న ఎదురుచూపు ఆమెకీ లేదు. ఆమెకి మళ్ళా పెళ్ళయిందో పిల్లలున్నారో, అసలు యేం చేస్తుందో యేం చేయదో తను యెప్పుడూ అడగలేదు.‘
‘తెలంగీ పత్తా’ కాస్త డైలమాల గురించి మాట్లాడుతుంది. ముస్లిమ్‌లు యే రాష్ట్రంలో వుంటే అక్కడి వాతావరణంలో, సంస్కృతిలో ఇమిడిపోతారు. కాస్త తమ ఆచారాలు, కాస్తంత లోకల్ పధ్ధతులూ కలగలిసిపోతాయి. తెలుగు రాష్త్రాలలో ముస్లిమ్ వ్యక్తి గనక యెక్కువగా తెలుగు ఉనికినే ప్రదర్శిస్తే అతను తెలంగీ పత్తాగా వెక్కిరించబడతాడు. సామాజిక పరిస్థితులు ముస్లిం జనాభాని కోట లోపలకు నెట్టివేసినప్పుడు ఈ తెలంగీ పత్తాకు కూడా ఆహ్వానం అందుతుంది, తమతో కలిసిపొమ్మని. ఇలాంటి బలవంతపు విభజన ఇష్టం వుందదు తనకి. ఆ కోట గోడలు అభేద్యాలుగా తోస్తాయి. కోట బయటి నుంచి కోట లోపలికి. ఆ తర్వాత్తర్వాత కథ ‘పాకిస్తాన్ నీ పిలకా పీకేస్తాన్!’ అని పసివాడు కలలో కలవరించడంతో ముగుస్తుంది. గుండెలను పిండేసే విషాదం.
‘దేఢీ’ ఓ హెన్రి కథ లాంటి కథ. రఫీక్ వో భర్త, వో తండ్రి. భార్య రజియా, పిల్లలు; ఈదలేని సంసారం. పని చేయలేక వుద్యోగం వూడి ఉన్మాదంలో మరో ఉన్మాది మాసిన బట్టల ఉస్మాన్‌ను తలచుకుంటాడు. పనుల్లేవు. ఇంట్లో గింజల్లేవు. ఆకలి తీరేదెలా? మిత్రుడు రాందాస్ వో చెప్పుల కొట్టు బయట చెప్పులు కుడుతుంటాడు. అతని దగ్గరికెళ్ళి కూర్చుంటాడు. వో స్త్రీ తన చెప్పును రిపేర్ చేయించుకోవడానికొస్తుంది. ఆ పని రఫీక్ చేసిపెడతాడు, వద్దని వారించినా. ఆ పైసలు రాందాస్ అతనికే ఇస్తాడు. ఆ నాలుగు డబ్బులతో గింజలు తీసుకుని ఇంటికెళ్ళేసరికి రజియా వంటచేసి పిల్లలకు పెడుతోంది. ఇప్పుడిది ఇవ్వాలా వద్దా, యెక్కడివి అని అడిగితే యేం చెప్పాలి? రజియా భర్తకు వడ్డిస్తుంది. యెక్కడివి ఇవన్నీ అని అడిగితే అంట్లకు కుదిరా అంటుంది. అల్లరిచేస్తున్న పిల్లల్ని ‘దేఢీపన్’ అని గదమాయించే గోరీమా మాటలు గుర్తుకొస్తాయి. దేఢ్లు అంటే మాదిగలు. యెక్కువ చెప్పకుండానే ఈ కథ చాలా చెబుతుంది.
‘చోటీ దునియా’లో ఇవే కథలు ఖండాంతరాలలో. మై నేమ్ ఈస్ ఖాన్ లాంటి చిత్రాలు యెందుకొస్తున్నాయో, అందుకే ఈ కథా వచ్చింది. భూమి గుండ్రంగా వుంది. వివక్ష అక్కడా వుంది. యెక్కడైనా దీనికి పోరాటం మినహా వేరే మార్గం లేదు.
మనకు 1947 నుంచీ నిన్నమొన్నటి గోద్రా, ట్విన్ టవర్లవరకూ ఎన్నో సంఘటనలు తెలుసు కాబట్టి ఇవి చదివితే వొక రకమైన యెరుక కలుగుతుంది. మలిన నేత్రాలు సజలమై తేటపడతాయి. ఈ పని ఈ వొక్క పుస్తకంతో కాదు. ఇలాంటి పుస్తకాలు, కథలు ఆ అవసరం తీరే రోజు వరకూ రావాల్సిందే. భిన్న భిన్న వ్యక్తుల దృక్కోణాలతో, జీవిత చిత్రాలతో.
అఫ్సర్ దీని తర్వాత మరో కథల సంకలనం తేవాలి. అది అతని బాధ్యత కూడా.