ఈ సంచిక కోసం ఎప్పటిలాగా లలిత గీతాలు, సాహిత్య కార్యక్రమాలు, సంభాషణలు కాకుండా విజయవాడ రేడియో స్టేషన్ నుండి భక్తిరంజని కార్యక్రమంలో దశాబ్దాల పాటు వినబడిన కొన్ని కీర్తనలు, స్తోత్రాలు, అష్టకాలు లాంటివి వినిపిద్దామనుకున్నాను. కానీ చాలా భక్తిరంజని కార్యక్రమాలు Youtube లాంటి చోట్ల వినవచ్చు అని అర్థమయ్యింది. అందువల్ల ఈ 8 పాటలు వినిపిస్తున్నాను. ఇవి ఎన్నుకోవడం వెనుక ప్రత్యేక కారణమేమీ లేదు. వీటిలో నాలుగు పాటలు శ్రీరంగం గోపాలరత్నం పాడినవి: ఆడేనమ్మా హరుడు (ఇదే పాట రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారి గొంతుకలో వినవచ్చు), ఎక్కడనుండో ఈ పిలుపు (దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి), వాణీ శర్వాణీ (వక్కలంక లక్ష్మీపతిరావు రచన), నను చూసి నవ్వేరే నా సఖులు వ్రజభామినులు (బాలాంత్రపు రజనీకాంతరావు). మరో నాలుగింటిలో రెండు మల్లిక్, రెండు ఎం. ఎస్. రామారావు పాడినవి. ‘నావికా ఎచటికోయి నీ పయనం’ చాలా మందికి ఘంటసాల గొంతులో తెలిసి వుంటుంది. అన్నమయ్య పాటలకు తొలి బాణీలు కట్టి (1948-1955 ప్రాంతంలో) రేడియో ద్వారాను, కచేరీల లోను ప్రచారంలోకి తీసుకువచ్చిన ప్రముఖుల్లో మల్లిక్ ఒకరు. ఆయన ఎక్కడకు వెళ్ళినా అందరూ, అదివో అల్లదివో (మధ్యమావతి), తందనాన (బౌళి), పాటల్ని అడిగి మరీ పాడించుకునేవారు.
- ఆడేనమ్మా హరుడు – శ్రీరంగం గోపాలరత్నం
- ఎక్కడనుండో ఈ పిలుపు – శ్రీరంగం గోపాలరత్నం
- వాణీ శర్వాణీ – శ్రీరంగం గోపాలరత్నం
- నను చూసి నవ్వేరే నా సఖులు – శ్రీరంగం గోపాలరత్నం
- ప్రతి కోవెలకు పరుగిడకు – మల్లిక్
- అదివో అల్లదివో – మల్లిక్
- నావికా ఎచటికోయి నీ పయనం – ఎం. ఎస్. రామారావు
- శ్రీకృష్ణరాయల సితఖడ్గధారల – ఎం. ఎస్. రామారావు