వలయం

ఎన్ని వుత్తరాలు రాసినా నువ్వు సమాధానం చెప్పవు. నీకు నిన్ను ఇష్టపడేవాళ్ళంటే లోకువ అనుకుంటాను. నీకు ప్రేమకి అర్థమూ తెలియదు, విలువా తెలీదు. అందుకనే ఈ ఆఖరి లెటర్! మా వాళ్ళు పెళ్ళి నిర్ణయించేశారు! వారం రోజుల్లో నువ్వు ఏదీ చెప్పకపోతే నా పెళ్ళి, వాళ్ళు నిశ్చయించినవాడితో అయిపోతుంది. నాకిష్టమై కాదు, తప్పనిసరి అయి. నాన్న బాధని చూడలేక, అమ్మ ఏడుపులు భరించలేక. అంతే! నీకంటే గొప్పవాడేమీ కాదు. అందగాడు కూడా కాదు. కానీ, మంచివాడు! మాట నిలబెట్టుకునేవాడు. అందుకే! నువ్వు మనసు మార్చుకుంటావని, వస్తావనీ ఆశతో కాదు. చెప్పాలి కదా, అందుకని రాస్తున్నాను.

నీ (కాలేని) మనో.


1974 ఏప్రిల్ 17, 6:00. వైజాగ్ మెడికల్ కాలేజ్ హాస్టల్. రూమ్ నంబరు 126.

వేసంకాలం. సాయంత్రం. గతవారం రోజుల్లో వేయిసార్లు చదివి ఉంటాడు ఆ వుత్తరం. బల్ల మీద గడియారం పక్కనే మనో చిరునవ్వుతో వున్న ఫోటో. క్రింద ‘టు సూర్య… విత్… మనో’ అని అసంపూర్తిగా రాసి సంతకం చేసింది. గుండెల్ని పిండేస్తోంది.

అస్పష్టమైన కలలు. జరిగిన సంఘటనలన్నీ. మనోతో పరిచయం. ఆకర్షణ. ఆమెని చూడగానే గుండె వేగంగా స్పందించడం. ఆ ప్రేమ. ‘నేను నిన్నే చేసుకుంటాను పెళ్ళంటూ చేసుకుంటే’ అని హోరుమని పడిలేచి తీరం చేరే కెరటాల సాక్షిగా వైజాగ్ బీచిలో చెప్పేయడం!

“మాట తప్పావ్!” ఎవర్దో గొంతు అరుస్తోంది.

సూర్య లేచి నిల్చున్నాడు. అతని చుట్టూ ప్రపంచం గిర్రున తిరుగుతోంది. అతను ఆలోచనల వలయంలో గిర్రున తిరుగుతున్నాడు.

ఒక్క రోజే గడువుంది ఇక. నా మనో… మనోజ్ఞ. పరాయిదయిపోతోంది!

“ఒక్క మాట చాలు. మాటైనా మా వాళ్ళకి చెప్పు,” అంది.

చెప్పలేదు. కొంచెం ఆగి చెబుతానన్నాడు. వుత్తరాలు జవాబు రాయకుండా పడేశాడు. అలాగే కాలం హరించుకు పోయింది.

ఫోటోలో మనో నల్లని కళ్ళు నవ్వుతూ మెరుస్తున్నాయి. మెరుస్తూ కవ్విస్తున్నాయి. ఎర్రని పెదాల్లో కెంపుల కాంతులు తళతళలాడుతూ ‘నేను నీ దాన్ని కాను’ అని వెక్కిరిస్తున్నట్లున్నాయి. ఆ అందమైన ముఖంలో ఏదో ఆత్మవిశ్వాసం, తృప్తి. అదే ఆకర్షణ తనకి. కాని ఇన్నాళ్ళు ‘వద్దు వద్దని’ కాలయాపన చేశాడు. ఇంట్లో తండ్రి చండశాసనుడు. మనో కులం తెలిస్తే మండిపడతాడని భయం. ఎప్పుడూ భయమే! పిరికితనానికి ఏదో సాకు. చదువు అవ్వాలి. హౌస్ సర్జన్ పూర్తి కావాలి. పి.జీ. సీట్ రావాలి. పీ.జీ. కోర్స్ చదవాలి. థీసిస్ రాయాలి. ఉద్యోగం రావాలి!

కాని ఇప్పుడు తెలిసిపోయింది. మనో లేనిదే సూర్య లేడు. తన జీవితానికి అర్థం మనోజ్ఞ! తను వెళ్ళిపోతోంది. వెళ్ళిపోకూడదు. నా జీవితంలోంచి!

రెండు జతల బట్టలు, దువ్వెన, టూత్ బ్రష్, చేతి సంచీలో పెట్టుకుని భుజాన వేసుకున్నాడు.

టేబుల్ మీది అలారం టైము 6:01 చూపిస్తోంది. గోదావరి ఎక్స్‌ప్రెస్ దొరకదు. రైళ్ళేవి ఇక లేవు.

బస్‌లో ఏలూరు వెళ్ళాలి. అక్కడ్నించి, గుడివాడ, ఆ దగ్గర నూజెల్ల అనే కుగ్రామానికి.

పరుగెత్తాడు. రిక్షా, మెల్లగా నీరసంగా. బస్‍స్టాండ్‌లో అప్పుడే కదుల్తున్న ఏలూరు బస్సు. అడ్డంపడి ఆపి ఎక్కాడు. మనో, నా మనో. వచ్చేస్తున్నాను…

గుడివాడ బస్టాండ్‌లో గడియారం 6:00 కొట్టింది. ఆదరాబాదరాగా ముఖం బస్‍స్టాండ్‍లోనే కడుక్కుని పరిగెత్తాడు.

చిన్న వూరు. గూడు రిక్షా. సందులు తిరిగి పెళ్ళిల్లు చేరింది. తాటాకుల పందిరి. కొత్తగా కొట్టిన సున్నం వాసన. పందిట్లో తెల్లటి ఖాళీ కుర్చీలు. ఒకరిద్దరు తప్ప జనం లేరు. మనో కోసం అడిగాడు.

“మీరెవరండీ?”

“పిలవండి. అర్జెంట్, సూర్య వచ్చాడు అని చెబితే వస్తుంది!” (ఎంత నమ్మకం తనకు!)

వచ్చింది. పెళ్ళికూతురు అలంకారంలో. కళ్ళకి కాటుక. పూల జడ. మెడలో మెరిసే నెక్లస్. వేలికి పెళ్ళి ఉంగరం కాబోలు, ఉదయపు సూర్యకాంతి పడి వెలుతురు చిమ్మింది.

“సూర్యా! ఇక్కడికి ఎలా? ఎందుకు వచ్చావ్?”

“మనో! ఏమనుకోవద్దు. నాకర్థం అయిపోయింది. నువ్వు లేనిదే బతకలేను. ప్లీజ్! అందరికీ చెప్పేస్తాను. కేన్సిల్ దిస్ మారేజ్. మనం పెళ్ళి చేసుకుందాం. ఇప్పుడే. ఇక్కడే. ప్లీజ్!”

ఏడుస్తున్నాడు. గొంతు మారిపోయింది. చెంపల మీద కన్నీళ్ళు.

మనో ఎర్రని ముఖం కోపంతో మరింత ఎర్రబడింది. ఒక వేలితో పెళ్ళి ఉంగరం తడుముకుంటోంది.

“ఇదేమిటీ ఇప్పుడు? పిచ్చి పట్టిందా? ఇన్నాళ్ళూ కాదని… అంతా నిశ్చయమై పోయాక. ఇప్పుడు…” కాస్త ఆగి మళ్ళీ అంది.

“శుభలేఖలు పంచారు. మగ పెళ్ళివారు వచ్చేశారు. చుట్టాలంతా వచ్చేశారు. ఇప్పుడెలా. ఇదేమన్నా సినిమా అనుకున్నావా?”

“ప్లీ… జ్…!” అతనికి ప్రపంచం తన చుట్టూ సుడిగుండంలా వలయంగా తిరుగుతున్నట్లు అనిపించింది.

“వెళ్ళిపో సూర్యా! వెళ్ళిపో! నీ సంగతి నాకు బాగా తెలుసు. అన్నీ మర్చిపోతావ్! ఇలా మాట్లాడిన వాళ్ళందరూ మళ్ళీ పెళ్ళయ్యాక బాగానే ఉంటారు. వెళ్ళిపో… ఇంక అల్లరి చేయకు! కొంచెం కూడా ముందు రాకుండా, ఎన్నిసార్లు అడిగినా నో అని, ఇప్పుడా… ఇ… ప్పు…డా! వెళ్ళిపో ఇక్కడ్నించి!”

వెనుతిరిగాడు. సంచీ భుజాన వేసుకున్నాడు. నిజానికి అది కూడా అవసరం లేదు.

ఏడుస్తూనే పరిగెత్తాడు. కన్నీళ్ళు. కన్నీళ్ళు… కన్నీళ్ళు ధారగా. ఈ బాధకి మించి ఇంకా అవమానం. ప్రేమించిన అమ్మాయి పొమ్మనడం, పరాయిదయిపోతుండటం. ఇంకా బాధగా ఉంది. అది తన తప్పే అయినా అదో భయంకరమైన అసహాయత.

రైలు పట్టాలు. దూరంగా ఇంజన్ కనిపిస్తోంది.

ఈ జీవితం వ్యర్థం. వేగంగా పరిగెత్తాడు. పట్టాల మధ్యగా.

ఇంజన్ మరింత దగ్గరగా వచ్చి ఒక్కసారి చెవులు పేలిపోయేటట్లు కూత పెట్టింది.

ఎవరో ముసలతను, తెల్లటి గడ్డం మీసాలు, గుండ్రటి అద్దాల కళ్ళజోడు. పొడుగ్గా ఠీవిగా ఉన్నాడు. బాగా పరిచయమైన ముఖంలా అనిపిస్తోంది. తనని పక్కకి లాగాడు – చేయి పట్టుకుని.

ముడతలు పడిన ఆ ముఖంలో పెదాలు వణుకుతూ ఏవో చెబుతున్నాయి.

“ఒక్క రెండు గంటలు… ముందు వస్తే… వస్తే…” అస్పష్టంగా.

చీకటి.


1974 ఏప్రిల్ 17, 5:00. మెడికల్ కాలేజ్ హాస్టల్. రూమ్ నంబరు 126.

చెమటలు పట్టి మెలకువ వచ్చింది. వేసంకాలం మధ్యాహ్నం నిద్ర! మెలకువ రాగానే బల్ల మీద నవ్వుతున్న మనో ఫోటో. ఆ పక్కనే కవర్లో వుత్తరం. వేలసార్లు చదివింది. మళ్ళీ చదివాడు.

అవును. రెండు గంటలు ముందుగా వెళ్ళాలి. ఇందాకటిలా బస్‌లో వెళ్ళడానికి కుదరదు. ఆ కలలో ముసలాయన ఎవరో. కొంచెం ముందుగా వెళితే… నిజంగా…

రెండు జతల బట్టలు, దువ్వెన, టూత్ బ్రష్, చేతి సంచీలో పెట్టుకుని భుజాన వేసుకున్నాడు.

టేబుల్ మీది అలారం టైము 5:01 అని చూపిస్తోంది. బయటకి పరిగెత్తాడు.

టాక్సీ! టాక్సీ! రేపు బ్యాంక్‌లో డబ్బు తీసి ఇవ్వచ్చు. ఇస్తాను. నూజెల్ల గ్రామం, గుడివాడ దగ్గర. చాలా అర్జెంట్. తెల్లవారి నాలుగ్గంటల కల్లా వెళ్ళాలి.

ప్రయాణం. గతుకు రోడ్ల మీద. ఎక్కడా టీకి కూడా ఆగలేదు. కారు ఎంత స్పీడుగా తోలమన్నా వూరు చేరేసరికి తెల్లవారి ఆరున్నర అయ్యింది.

“ఆ సందులోకే తిప్పు!” అరిచాడు. పెళ్ళిల్లు. ముందు పందిరి. మనో కోసం అడిగాడు.

“మీరెవరండీ?”

“పిలవండి. అర్జెంట్, సూర్య వచ్చాడు అని చెబితే వస్తుంది!”

ప్రశ్న అడిగిన ఆయన ముఖంలో గుర్తింపు.

మసక చీకట్లు. లోపల మంత్రాలు వినిపిస్తున్నాయి.

వొళ్ళంతా నగలతో పెద్ద కుంకుమ బొట్టుతో తలలో పూల జడతో బయటకు పరుగెత్తుకు వచ్చింది.

మనో! మనో!

“సూర్యా! ఇక్కడికి ఎలా? ఎందుకు వచ్చావ్?”

“మనో! ఏమనుకోవద్దు. నాకర్థం అయిపోయింది. నువ్వు లేనిదే బతకలేను. ప్లీజ్! అందరికీ చెప్పేస్తాను. కేన్సిల్ దిస్ మారేజ్. మనం పెళ్ళి చేసుకుందాం. ఇప్పుడే. ఇక్కడే. ప్లీజ్!”

ఏడుస్తున్నాడు. గొంతు మారిపోయింది. చెంపల మీద కన్నీళ్ళు.

“సార్! టాక్సీ డబ్బులు!” అరుస్తున్నాడు డ్రైవరు.

మనో ముఖం కోపంతో ఎర్రబడింది.

“వెళ్ళిపో సూర్యా! వెళ్ళిపో! నీ సంగతి నాకు బాగా తెలుసు. అన్నీ మర్చిపోతావ్! ఇలా మాట్లాడిన వాళ్ళందరూ మళ్ళీ పెళ్ళయ్యాక బాగానే ఉంటారు. వెళ్ళిపో… ఇంక అల్లరి చేయకు! కొంచెం కూడా ముందు రాకుండా, ఎన్నిసార్లు అడిగినా నో అని, ఇప్పుడా… ఇ… ప్పు…డా! వెళ్ళిపో ఇక్కడ్నించి!”

ఇంతలోనే ఎవరో తలమీద వెనుకనుంచి బలంగా కొట్టారు.

“ఇడియట్. పెళ్ళి పాడు చేయడానికి వచ్చావా?” తల మీద దెబ్బ. పోతున్న స్పృహ.

ఎవరో ముసలతను, తెల్లటి గడ్డం మీసాలు, గుండ్రటి అద్దాల కళ్ళజోడు. పొడుగ్గా ఠీవిగా ఉన్నాడు. బాగా పరిచయమైన ముఖంలా అనిపిస్తోంది.

ముడతలు పడిన ఆ ముఖంలో పెదాలు వణుకుతూ ఏవో చెబుతున్నాయి.

“ఇంకొక్క గంట ముందు… పద! నేర్చుకో!”

చీకటి.


1974 ఏప్రిల్ 17, 4:00. వైజాగ్ మెడికల్ కాలేజ్ హాస్టల్. రూమ్ నంబరు 126.

హఠాత్తుగా వచ్చిన మెలకువ. తలనొప్పి. వళ్ళంతా చెమటలు. వేసంకాలం మధ్యాహ్నం నిద్ర.

మెలకువ రాగానే బల్ల మీద నవ్వుతున్న మనో ఫోటో. ఆ పక్కనే కవర్లో వుత్తరం. వేలసార్లు చదివింది. మళ్ళీ చదివాడు. ఆలస్యం చేస్తే మనో పరాయిదయిపోతుంది!

రెండు జతల బట్టలు, దువ్వెన, టూత్ బ్రష్, చేతి సంచీలో పెట్టుకుని భుజాన వేసుకున్నాడు.

టేబుల్ మీది అలారం టైము 4:01 అని చూపిస్తోంది. బయటకి పరిగెత్తాడు. ఆ కలలో ముసలాయన ఎవరో. కొంచెం ముందుగా వెళితే… నిజంగా…

టాక్సీ! టాక్సీ! రైల్వే స్టేషన్‌కి. ఫ్లాట్‌ఫారం మీద గోదావరి ఎక్స్‌ప్రెస్ సిద్ధంగా ఉంది. అర్ధరాత్రి దాటాక విజయవాడకి కచ్చితంగా చేరిపోతుంది.

విజయవాడ నుంచి మళ్ళీ టాక్సీ. “బాబ్బాబు! త్వరగా పోనీ!”

సందులో పెళ్ళివారిల్లు. ఇంకా పోని చీకట్లు. ట్యూబ్‌లైట్లు వెలుగుతున్నాయి. బయట కొందరు బాజాభజంత్రీల వాళ్ళు వారి వాద్యాలు పట్టుకుని నిల్చుని ఉన్నారు. ఈసారి నేర్చుకున్నాడు.

“మగపెళ్ళివారి విడిది ఎక్కడండీ?”

“అదుగో ఆ పక్క వీధిలో బాబూ! కురిచేటి వారి సత్రం. అక్కడికి వెళ్ళండి!”

విడిది సత్రం. కొందరు బయట వేపపుల్లలతో పళ్ళు తోముకుంటున్నారు.

“పెళ్ళికొడుకెక్కడ! పిలవండి. అర్జెంట్.”

తల మీద బాసికం, పంచెకట్టు, రేగిన జుట్టు, పెళ్ళిబొట్టుతో ధోవతీ లాల్చీలో పెళ్ళికొడుకు బయటకు వచ్చాడు.

“ఎవరు నువ్వు? ఏం కావాలి?”

“మనో! నా మనో లేనిదే నేను బతకలేను. మీరు ఏమనుకోవద్దు. ప్లీజ్! కేన్సిల్ దిస్ మారేజ్. ప్లీజ్!” సూర్య గబగబా అతనితో మాట్లాడసాగాడు, వేడుకుంటూ, చేతులు జోడిస్తూ, ఏడుస్తూ…


2016 ఏప్రిల్ 17. 7:30, సికింద్రాబాద్ – మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్, ఫస్ట్‌క్లాస్ ఏ.సీ. కూపే-1

రైలు గుడివాడ దాటింది. కిటికిలోంచి చూస్తే పచ్చటి పొలాల మీద సూర్యుడి వెలుగు.

సూర్య టైం చూసుకున్నాడు.

“రెండు గంటలు లేటు. పద! దిగుదాం త్వరగా. ఇక్కడ రెండు నిముషాల కంటే ఆగదు.”

రైలు ఇంతలో నూజెల్ల బోర్డు దాటింది.

అరవై ఏళ్ళు పైబడ్డాయి. తెల్లటి గడ్డం మీసాలు, ముఖం మీద ముడుతలు, గుండ్రటి అద్దాల కళ్ళజోడు. వయసు, విజ్ఞానం, కీర్తితో వచ్చిన ఠీవి.

నీలి రంగు పట్టుచీరలో. నెరిసీ నెరవని జుట్టుతో, చెవులకి డైమండ్ రింగ్స్, ముక్కుకి వజ్రాల పుడక, మెడలో ముత్యాల హారం. వయసుతోపాటూ ఇనుమడించిన అందం, తోడుగా హుందాతనం – తోడూ నీడై నిలిచిన భార్యను సూర్య మురిపెంగా చూసుకున్నాడు ఒక్క క్షణం. మనో లేని జీవితం ఊహించడమే కష్టం.

గబగబా బ్యాగులు సర్దుకుని బోగీ తలుపు దగ్గర నిలబడ్డారు.

ఏదో ఫ్లాష్ అతని మెదడులో.

ఒక అబ్బాయి భుజం మీది సంచీ విసిరేసి, వేగంగా పెరిగెత్తి వచ్చి పట్టాల మీదకి దూకబోతున్నాడు.

“అయ్యో! దూకకు, దూకకు. బండి ఆగనీ!” మనో అరుపులు.

ఆయన ఆ అబ్బాయి చేయి పట్టుకుని లాగబోయేలోగా తల మీద దెబ్బ తగిలింది.

అంతా చీకటి.

“ఒక్క రెండు గంటలు… ముందు వస్తే… వస్తే…” అస్పష్టంగా.

ట్రెయిన్ మెల్లగా ఆగింది. ఆ ఇద్దరూ తప్ప ఇంకెవరూ దిగలేదు ఆ చిన్న స్టేషన్‍లో. నిర్మానుష్యంగా వున్న ప్లాట్‌ఫారంపై నడుస్తుంటే మనో అంది.

“సూర్యా, ఈ స్టేషన్‌లోకి రాగానే నువ్వెప్పుడూ ఇంతే! ఏదో లోకంలోకి వెళ్ళిపోతావ్.”

మనో మాటలకి తెలివి వచ్చింది. అమెరికా నుంచి ప్రతి రెండేళ్ళకయినా ఇక్కడికి రావాలి. ఆ వూరు. ఆ చిన్న సందు. పెంకుటిల్లు. పాడు పడిన ప్రహరీగోడ కానుకున్న పచ్చ గన్నేరు పూల చెట్టు వంగిపోయింది. సూర్య పెళ్ళికొడుక్కి చెబుతున్నాడు.

“క్షమించండి సార్! నేనామెను ప్రేమించాను. ఆమె కూడా నన్నే ప్రేమిస్తోంది. మీరు ఈ పెళ్ళి చేసుకోకూడదు. ప్లీజ్ సార్. క్షమించండి! మీ కాళ్ళు పట్టుకుంటాను. మనో.. మనో అంటే నా జీవితానికి అర్థం. నా మనోని నాకిచ్చేయండి!”

ఇంట్లోకి వెళ్తూ మనోజ్ఞ అంది “మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయావ్!”

“కాదు మనో! ఆ ఉదయం నేను చూసిన ముసలాయన మళ్ళీ కనిపించాడు.”

“ఇక్కడికొచ్చిన ప్రతీసారీ ఇలాగే అంటావు. ఆ తర్వాత ఆయనెలా ఉంటాడో మరిచిపోయానంటావు!”

లోపల్నించి మనో తమ్ముడు, మరదలు, వాళ్ళ పిల్లలు అందరు కేరింతలు కొడుతూ బయటకి వచ్చారు. పెద్దవాళ్ళందరూ పోయారు. తీపి గురుతులయి చిన్నవాళ్ళు మిగిలారు.

చేతి గడియారం తడుముకుంటూ అనుకున్నాడు సూర్య. ‘ఎవరాయన!’

ముఖం కడుక్కోవడానికి అద్దంలో చూసుకుంటే మెరుపు మెరిసినట్లు… ఆ ముసలతని ముఖం!