తాత ఎత్తుకుని తీసుకుపోతుంటే బజారనే వింతలోకంలో షికారు చేసే పసి వయసులో… మొట్టమొదటిసారిగా సందు చివర, చిరిగిన బట్టలతో ఒకామె కనిపించింది రాముకి. అన్ని చోట్లా డబ్బులిస్తే ఏదో వస్తువు తిరిగి ఇస్తున్నారు. ఇక్కడ తాత ఇచ్చిన డబ్బులకు తిరిగి ఏం ఇవ్వలేదే అని ఆశ్చర్యపోయాడు. తను నడవడం మొదలుపెట్టిన తరువాత, ఆమెకు తన చేతితో పావలా ఇప్పించినప్పుడు ఆ విషయాన్నే తాతను అడిగాడు. దానికి సమాధానంగా తాత చిరునవ్వే వచ్చింది. తాత ఉన్నన్నాళ్ళూ ఎప్పుడటు తీసుకువెళ్ళినా ఒక పావలా ఇప్పించేవాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి…
కల్నల్ ముఖేష్ సోలంకి… ఎన్నో యుద్ధాలలో పాల్గొని అనేకసార్లు దేశ రక్షణలో తన ప్రాణాలను పణంగా పెట్టిన ధీరుడు. అతనంటే అందరికీ గౌరవమే, కొంతమందికి భక్తి, కొంతమందికి భయం! అతని ప్రవర్తన, క్రమశిక్షణ, దేశభక్తి మచ్చలేనివి. ఎందరికో ఆయన ఒక స్ఫూర్తి. పై అధికారులు సైతం అతని మాటకు ఎదురు చెప్పే సాహసం చెయ్యరు. పరిస్థితులను అంచనా వేయడంలో అతని నేర్పు అపారం. యుద్ధ వ్యూహాలలో అతని సామర్ధ్యం అమోఘం. యుద్ధ సమయంలో గుండె నిబ్బరాన్ని కలిగించే అతని మాటలు నిరంతరం సైనికుల చెవులలో ప్రతిధ్వనిస్తుంటాయి. కల్నల్ రిటైర్ అవుతున్న సందర్భంగా వారందరూ కలిసి ఈ రోజు ఆయనకోసం ఒక పార్టీ ఏర్పాటు చేశారు. తాను చెప్పబోయేది ఎవరూ నమ్మలేరని కల్నల్‌కు తెలుసు. అయినా…
ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నాడు ఆనంద్. చాలా చిరాగ్గా ఉంది. ఆఫీసులో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. తనకు పరిచయం ఉన్న ఒక పెద్దమనిషి ఒక కేండిడేటుని చేర్చుకోమని మోమాటపెడుతున్నాడు. అసలు ఏమనుకుంటారు జనాలు? ఇక్కడ ఉద్యోగాలు తేరగా పెట్టుకు కూర్చున్నామా? ఆయన తనకు తెలుసున్నవారే కావచ్చు. అయినా ఉద్యోగం విషయంలో ఇలాంటి వాటిని పట్టించుకోకూడదు. అప్రయత్నంగా ఆనంద్ చేయి జేబులోనుంచి ఒక యాభై నోటు తీసింది. సగం చిరిగి ఉందది. ఎవరు అంటగట్టారో గుర్తులేదు. ఎంత ప్రయత్నించినా మార్చడానికి అవ్వడం లేదు.
అది నిర్మల ఐ బ్యాంక్. డా. సుధీర్ తన చాంబర్లో ఉన్నాడు. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆ కళ్ళల్లో బాధ. నిస్సహాయత. ఇంతలో ఆ గదిలోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు.
“ఒక్క నిమిషం నేను మళ్ళీ ఫోన్ చేస్తాను,” “యస్! ఏం కావాలండీ?”
“నా పేరు ప్రదీప్. కళ్ళు డొనేట్ చేద్దామని వచ్చాను,” చెప్పాడతడు.
ప్రదీప్ కేసి చూశాడు సుధీర్. ముప్ఫై ఏళ్ళుంటాయేమో. “మంచిది. మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీలాంటి యువకులు ఇటువంటి మంచి పనులమీద సర్తెన అవగాహన కలిగి ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. అప్లికేషన్ ఇస్తాను. మీ వివరాలు రాసి ఇవ్వండి. అయితే ఎప్పటికప్పుడు మీ వివరాలు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక అరవై ఏళ్ళ తరువాత మీరు ఎక్కడ ఎలా ఉంటారో చెప్పలేం కదా…” నవ్వుతూ అన్నాడు సుధీర్.
“కానీ….” ఏదో చెప్పబోయాడు ప్రదీప్.
“డోంట్ వరీ. మీరు ఇక్కడకు మళ్ళీ రానక్కరలేదు. మీకొక వెబ్ అకౌంట్ ఇస్తాము. దానిలో అప్డేట్ చేస్తే చాలు.” అప్లికేషన్ ఇస్తూ చెప్పాడు సుధీర్.
అప్లికేషన్ తీసుకున్న ప్రదీప్ ఒకసారి దాన్ని చూసి తిరిగి ఇచ్చేస్తూ శాంతంగా చెప్పాడు.
“డాక్టర్! నేను ఎప్పుడో పోయిన తరువాత కళ్ళు ఇద్దామని అనుకోవటంలేదు. నే బ్రతికుండగానే, సాధ్యమైతే ఇప్పుడే, ఇక్కడే, నా కళ్ళను దానం చేద్దామనుకుంటున్నాను.”
బస్సు దిగి నడక మొదలెట్టాడు జీవన్. రెండు సందుల అవతలున్న ఇల్లు మనసులో మెదులుతోంది. ఎన్నోసార్లు ఆ ఇంటి గేటు దాకా వెళ్ళి వెనుతిరిగిపోయాడు. ఈసారి ఏం జరుగుతుందో… తనకే తెలియదు. ఆ ఇంటి సందులో తిరగబోతుంటే, ఎదురుగా బైక్ మీద వస్తున్న రాజేంద్ర ఆగి పలకరించాడు.
“ఎలా ఉన్నారు? ఇంటికేనా? ఇంట్లో మైథిలి ఉంది. మాట్లాడుతుండండి. నాకు అర్జంటు పని ఉంది. వెళ్ళాలి. భోజనం టైమ్‌కి వచ్చేస్తా. కలిసి తిందాం. చాలా రోజులైంది మీరు ఇంటికి వచ్చి. బాబు మిమ్మల్ని ఎప్పుడూ అడుగుతుంటాడు.”
రాజేంద్ర లేని సమయంలో నేను వెళ్ళి మైథిలితో మాట్లాడుతూ ఉండాలా? తనని సవాల్ చేస్తున్నట్టుగా ఉంది. నవ్వొచ్చింది జీవన్‌కి. వెళ్ళాలా వద్దా అన్న సందిగ్ధం వీడిపోయింది. రాజేంద్ర వెళ్ళిపోయాడు. జీవన్ ఇంటిగేటు దగ్గరకొచ్చాడు. ఒక్కసారి తనను పరిశీలించుకున్నాడు. ఫరవాలేదు, వేషం అయితే బానే ఉంది. చెప్పులు కనబడకుండా బయట వదిలేస్తే చాలు. ఓసారి చేత్తోనే జుట్టు సర్దుకున్నాడు. ముఖం మీదకి ఉత్సాహాన్ని నింపుకున్నాడు. కానీ తన అంతరంగాన్ని అలవోకగా చూడగలిగే మైథిలి ముందు నిలబడగలడా? ఏదైనా తప్పదు. గేటు తెరచి లోనికి వెళ్ళాడు. ఇంటికీ గేటుకీ మధ్య ఉన్న చిన్న జాగాలో గులాబీ మొక్కల మధ్యనున్న దారిలో ఏ రంగు గులాబీమొక్క ఎక్కడ ఉంటుందో అతనికి గుర్తే! బెల్ కొట్టాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. తలుపు తెరుచుకుంది. ఎదురుగా మైథిలి!
అదొక కోర్టు హాలు. వాదప్రతివాదాలతో వేడెక్కి ఉంది. ఎప్పటికప్పుడు విషయాలు మీడియాకి వెళ్ళిపోతున్నాయి. రాష్ట్రమంతా ఈ వేడి వ్యాపిస్తోంది. ఒక ప్రముఖ వ్యాపారస్తుని కొడుకు, అతని ముగ్గురు స్నేహితులు చంపబడ్డారు. సాక్ష్యాధారాలను ఆగమేఘాలమీద సిద్ధంచేసి కోర్టు ముందు దోషిని ప్రవేశపెట్టారు. వ్యాపారస్తుడు ప్రముఖ న్యాయవాదిని నియమించాడు. దోషికి ఎలాగైనా ఉరిశిక్ష పడాలి. అదీ అతని లక్ష్యం. దోషి, డాక్టర్ కల్హారిణి! ఆమె న్యాయవాదిని కోరలేదు. తను వాదించుకోలేదు. అసలు హత్య జరిగిన రాత్రి నుండీ ఇప్పటివరకూ ఆమె నోరు విప్పలేదు. ఆ అవసరం లేదు! ఇప్పటికే ఎంతోమంది ఆమె తరఫున మాట్లాడేస్తున్నారు. మహిళాసంఘాల వాళ్ళు ధర్నాలు కూడా చేశారు. టీవీలోనూ పత్రికలలోనూ ఏం జరిగి ఉంటుంది అన్న దాని మీద చర్చలు విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. కోర్టువారు ఆమెకు ఒక లాయర్‌ను నియమించారు. అతడు అజిత్. ఇంత హైప్రొఫైల్ కేసు ఇప్పటివరకూ అతడు వాదించలేదు. అజిత్‌కు ఇది ఒక సవాల్. కేసు మొదలైనప్పుడు ఇంత ప్రచారం జరుగుతుందని లాయర్లు ఎవరూ ఊహించలేదు. సమాజంలో మీడియా పాత్రని వాళ్ళెవ్వరూ సరిగా జీర్ణించుకోలేదు. అందుకే ఈ కేసులో నియమించబడడానికి ప్రత్యేక కృషి చెయ్యలేదు. అజిత్ చేశాడు. కారణం, కల్హారిణి మౌనం. కల్హారిణి మౌనం అతనిలో ఆసక్తిని రేకెత్తించింది. ఇతర కారణాల గురించి చాలామంది చర్చించారు. ఆ వ్యాపారవేత్త కేసు గెలవడానికి ఇదంతా జరిగిందని అన్నవారు ఉన్నారు. ఇతనికి కేసు ఓడిపోవడానికి కానుక అందింది అన్నవారూ ఉన్నారు. అయితే అజిత్ వాదన మొదలైన కొద్ది గంటలలోనే ఈ అనుమానాలకు తెరపడింది.
“సరితా! వినయ్ గుర్తున్నాడా? అదే విశ్వనాథ్ జ్యుయలరీస్ ఓనర్.”
“నా స్కూల్ మేట్ నాకు గుర్తు లేకపోడమేంటి, నువ్వు మరీనూ. వాళ్ళ నాన్నగారు విశ్వనాథంగారు పోయారు కాబట్టి మన పెళ్ళికి రాలేదు.”
“అవునవును! అతను ప్రస్తుతం… నా పేషంట్.”
“వాట్?! వినయ్!? ఏమిటి ప్రాబ్లమ్?”
“మామూలుగా ఒక రోగి వ్యక్తిగత విషయాలు డాక్టర్‌గా చెప్పకూడదు. కానీ తప్పటంలేదు. ప్రస్తుతం అతను డిప్రెషన్లో ఉన్నాడు. అయినవాళ్ళందరూ దూరమయ్యారు. తండ్రి పోయాడు. ఒంటరిగా తన భవనంలో తానే బందీగా కుమిలిపోతున్నాడు. మానసిక రుగ్మత ఒక స్థాయికి వచ్చిన తరువాత అదుపు తప్పుతుంది. మరణానికి దారితీస్తుంది. ఎంతమంది డాక్టర్లూ ఎన్ని మందులూ ఉన్నా నిస్సహాయంగా చూస్తూ ఉండడమే తప్ప ఏమీ చెయ్యలేని స్థితి…”
సరిత కన్నులలో సన్నగా తడి.
“లేదు హరీష్! అలా అనకు. వినయ్… పాపం! చాలా మంచివాడు. నాకు మంచి స్నేహితుడు. అసలు ఏం చెయ్యలేమా?”
“అతనికి జీవితం పట్ల, భవిష్యత్తు పట్ల ఒక ఉత్సాహం రావాలి. ఆ చిన్న వెలుగు అతనిలో కదిలితే…. మనిషిని నడిపేది అతని అహంకారమే. అది ఆవిరైతే, అతను ఎక్కువ కాలం బ్రతకడు. ఆ ‘నేను’ అన్న స్పృహ అతనిలో కలిగించాలి.”
“ఎలా?”
“నువ్వు వినయ్‌ని… ”
హరీష్ ఏం చెప్పబోతున్నాడో అర్థమై, హఠాత్తుగా పిడుగుపడినట్లయ్యింది సరితకు.
“ఏం మాట్లాడుతున్నావ్ హరీష్? మతుండే మాట్లాడుతున్నావా? పిచ్చి పట్టిందా నీకు… నేను… మనం…”
“కంట్రోల్ చేసుకో సరితా! నేను చెప్పేది విను…”
“నో! ఇంకేం చెప్పకు… నేనేం వినదల్చుకోలేదు!”
సూరీడికి పదహారేళ్ళు. ప్రపంచాన్ని తెలుసుకోవడమే కాక తర్కంతో తలకెక్కించుకునే తొలి రోజులు. అందులో ఒక రోజు తాత దగ్గరకు చేరాడు. ఆ తాత ఎప్పటివాడో ఎక్కడివాడో తెలియదు. అక్కడ ఉన్నాడు. అంతే. అతనికి తెలియనివి లేవని అంతా అంటారు. సూరీడికి అది నమ్మిక. తాత లోయలోకి చూస్తున్నాడు. కనుచూపు మేరంతా పచ్చగా ఉంది. తాత దగ్గరనుండి వినీవినిపించకుండా నిట్టూర్పు! ‘ఏమైంది?’ అడిగాడు సూరీడు. `ఈ పచ్చదనం బాగుందికదూ?’ అడిగాడు తాత. లోయవైపు చూశాడు. బాగున్నట్టనిపించి `ఊ!’ కొట్టాడు సూరీడు. ‘నీకిది చాలా ఇష్టం కదూ!’ అది ప్రశ్నో కాదో తెలియదు. కానీ అది సూరీడు మనసులో అంతవరకూ లేని ప్రశ్నను రేపింది. తనకిది ఇష్టమా? సూరీడు మనసులో ప్రశ్న ఉదయించింది. అవును, అది నిజం. ఇది తనకి చాలా ఇష్టమైనది! సమాధానం కూడా అప్పుడే ఉదయించింది! ప్రశ్నే సమాధానానికి ఆధారం. ప్రశ్నతోనే సత్యం ఆవిష్కరింపబడుతుంది. మళ్ళీ ‘ఊ’ కొట్టాడు సూరీడు. తాత మాట్లాడలేదు. సూరీడికి కొంచం అర్థమయ్యింది. ఈ లోయలో పచ్చదనానికి ఏదో అయిపోతుంది. తనకిష్టమైన లోయ… బాధతో అతని మనసు మూలిగింది.
టేబుల్ మీద పరుచుకున్న కాగితాల వంక చూశాను చూశాడు భగవంతం. ఎప్పుడో ఏ క్షణానో ఎలాగో ఏవో ఆలోచనలు, ఊహలు… కథలుగా మలచే ప్రయత్నంలో మొదలుపెట్టిన వాక్యాలు. అలా, అంత దాకా వచ్చి ఆగిపోయాయి. ఇప్పుడు చూస్తుంటే అవి నిజంగా తానే అనుకున్నాడా, రాశాడా అన్నట్టుగా ఉంది.
‘ఎలా రాద్దామనుకున్నానో, ఆ పాత్రల జీవితాలను ఏం చేద్దామనుకున్నానో… లీలగా తెలిసీ తెలియకుండా ఉంది. ఒకొక్క పాత్ర ఒక్కో రకం… ఒక్కో ముగింపు వైపుకు పయనం. అప్పుడున్న ఉద్వేగం, ఉత్సాహం ఇప్పుడు లేవు.
తెలుస్తోంది… ఆనంద్ చింకినోటుని ఎలా వదిలించుకుంటాడు… ప్రదీప్ కళ్ళు ఏమవుతాయి… అజిత్ అసలు రహస్యం… ముఖేష్ సోలంకీ వ్యక్తిత్వం… రాము మరచిపోయిన పాఠం… మైథిలి జీవన్‌కు ఏమౌతుంది… అందరివీ… అన్నీ… ఆ మలుపులు… ఆ ఉత్కంఠ… ఆ ముగింపు… అంతా నాకు తెలుసు. కానీ ఎందుకో ఇవన్నీ ఇప్పుడు చాలా దూరంగా అనిపిస్తున్నాయ్. ఎప్పుడో చిన్నప్పటి స్మృతులుగా… టీవీల్లో, పేపర్లలో, నెట్లో వచ్చి పోయే వార్తల్లా… వీళ్ళ జీవితాలగురించి నాకెందుకింత ఆసక్తి?’
చిన్నగా నవ్వుకున్నాడు భగవంతం.
‘వీళ్ళు కేవలం పాత్రలు. వాళ్ళకేం జీవితం? నే రాసినంత వరకే వాళ్ళ అస్తిత్వం. అంతే! ప్రతి కథ అయిపోతుంది. ప్రతి పాత్రా అక్కడితో ఆగిపోతుంది. ఎలా ముగిస్తే ఏం? చదివిన వాళ్ళకి ఏం వస్తుంది? చింకినోటు మార్చగలిగితే ఆనంద్కి ఏం వస్తుంది? ఒక క్షణం తృప్తి? ఆనందం? ఎవరికి? ఆనంద్కా? నాకా? చదివినవాడికా?
అనుభూతి, అనుభవం – పాత్రకి ఏది కలిగిందని రాసినా, ఆ కథ ముగిసేదే కదా. పాఠకుడైనా అంతే. ఆ మాత్రం దానికి ఎందుకనీ ఇంతలా నానా హైరానా పడిపోవడం. ఎందుకిన్ని మలుపులు. మరుక్షణం ఉంటుందో లేదో తెలియని బ్రతుక్కి సందేశాలు, ధర్మాలు, మంచి, చెడు, నీతి… అవినీతి… గొప్ప… చెత్త… తొక్క… తోలు… వీటిని కొనసాగించాలా? అన్నిటినీ కట్టగట్టి ఒకేసారి…’
మెల్లగా ఒక ఆలోచన రూపు దిద్దుకుంటోంది. అసంపూర్ణంగా ఉన్న కథల కాగితాలన్నిటినీ క్రమాన్ని పట్టించుకోకుండా ఒకదాని క్రింద ఒకటి దొంతిగా పెట్టాడు. ఇప్పుడు అవన్నీ ఒక కథలో భాగం. వాటిని కలిపే ఒక్క కథ… ఒకే ఒక్క కథ… ముగింపు కథ… పెన్ను తీసి కాగితంపై రాయడం మొదలుపెట్టాడు.
“ఏమేవ్ ! చిన్నవాడు లేచాడా?” మార్నింగ్ వాక్ నుండి వస్తూ అడిగాడు పరంధామయ్య.
“ఏమో! వెళ్ళి చూడండి. లేవకపోతే లేపండి!” వంటింట్లోంచి సమాధానం.
“మధ్యలో నాకెందుకా గొడవ. అనవసరమైన విషయాల్లో జోక్యం మంచిదికాదు.” గొణుక్కుంటూ సోఫాలో కూలబడ్డాడు.
ఎదురుగా పేపరు సిద్ధంగా ఉంది. ‘లక్ష కంపెనీలు రద్దు’ హెడ్‌లైను చూశాడు. ఇప్పుడే స్నేహితులతో జి.ఎస్.టి. గురించి చాలా లోతైన చర్చలు చేసి వస్తున్నాడు. ఇప్పుడు ఇది దొరికింది. రేపు చర్చించడానికి దీనిగురించి తెలుసుకోవాలి. పేపర్లో హెడ్‌లైన్లే కానీ పూర్తిగా వార్తలు చదివే అలవాటు పోయింది పరంధామయ్యకి. ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ వాడడం మొదలుపెట్టాడో, పత్రికలలో వార్తలు అసంపూర్ణంగా, పాత వాటిల్లా అనిపించడం మొదలయింది. అందుకే పైపైన తిరగేస్తాడు. ఆసక్తికరమైన విషయం అయితే నెట్‌లోనో, టీవీలోనో గంటలతరబడి జరిగే చర్చలు, కథనాలు, అభిప్రాయాలు వాదనలు కుదిరినంతవరకూ ఎక్కించేసుకుని మేధావిగా ఊహించేసుకుని మర్నాడు మార్నింగ్ వాక్‌లో స్నేహితుల దగ్గర కక్కేస్తాడు. ఆ స్నేహితులలో కొందరు కూడా ఇదే రకం. కొందరు విని ఊరుకునే రకం. పేపర్ తిరగేస్తున్నాడు. ఒక్కసారిగా గుండెలో రక్త ప్రసరణ ఆగినట్లయ్యింది. చేత్తో గుండె పట్టుకుని కూలిపోయాడు. చేతిలో పేపర్ జారిపోతూ ఆగింది. వ్రేళ్ళ సందులలో హెడ్‌లైను ‘విజయవాడ విశాఖ రోడ్డులో ఘోర ప్రమాదం…’
పెన్ను ఆగింది.
“ఏ ఏ పాత్రలు? ఊఁ… అందరినీ ఒకేసారి ఈ ప్రమాదంలో చంపేస్తే పోలా! దారుణం కదా! అయినా… అసహజం కాదు. కథ ఇక్కడితో ఆపేయవచ్చు. ఏ సంబంధం లేని పాత్రలు… ఏవో దారులలో… ఏవో గమ్యాలకు చేరాల్సిన పాత్రలు, కథలు… ఒక్కసారిగా ముగిసిపోతాయి. బస్సులో లేదా రైలు పెట్టెలో ఎంతమందో. ఎవరికెవరు తెలుసు? ఒకో మనిషిది ఒక్కో కథ ఉండకుండా ఉంటుందా. అంతమంది ఒకే పెట్టెలో ఎలా రాగలిగారు? నిర్ణయించేదేవిటి? రిజర్వేషన్ టిక్కెట్టా? బుకింగ్ చేసుకున్న సమయమా? వారివారి పరిస్థితులా? ఆ పరిస్థితుల వెనుక అంతుచిక్కని ప్రణాళికా? లేదా యాదృచ్ఛికమా?
కానీ ఇలా అర్ధాంతరంగా ఆ కథలు ఆపేస్తే…? జీవితమైనా అంతేకదా! కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలియకుండానే పాపం ఎంతమంది చచ్చిపోయారో! వాళ్ళు కోల్పోయినదేమిటి? తెలుసుకున్నవాళ్ళకు వచ్చి చచ్చిందేమిటి?
ఆనంద్కీ అజిత్‌కీ ఏం సంబంధం? ఎవరి కథ వాళ్ళదే. రాసేది ఒకడే కావచ్చు, ఒకే పెన్ను, ఒకే ఇంకు. అయితే మాత్రం? కథను రాసిన ఇంకుకీ కథకీ ఏమిటి సంబంధం? అయినా ప్రతి దానిలో ఓ కారణం ఉంటుందని నమ్మేసి, దానికోసం వెతుకులాడే మనుషులు, ఒక ప్రముఖ కథారచయిత ఏం రాసినా అందులో ఏదో ఉందని అనుకోలేరా. అలా అనుకున్నప్పుడు అందులో ఏదో ఒకటి దొరక్కపోతుందా! ఇబ్బందిలేదు… చంపేయొచ్చు.”
మెల్లగా పెన్ను తిరిగి కదిలింది.
“ఏమేవ్ ! చిన్నవాడు లేచాడా?” మార్నింగ్ వాక్ నుండి వస్తూ అడిగాడు పరంధామయ్య.
“ఏమో! వెళ్ళి చూడండి. లేవకపోతే లేపండి!” వంటింట్లోంచి సమాధానం.
“మధ్యలో నాకెందుకా గొడవ. అనవసరమైన విషయాల్లో జోక్యం మంచిదికాదు.” గొణుక్కుంటూ సోఫాలో కూలబడ్డాడు.
ఎదురుగా పేపరు సిద్ధంగా ఉంది. ‘లక్ష కంపెనీలు రద్దు’ హెడ్‌లైను చూశాడు. ఇప్పుడే స్నేహితులతో జి.ఎస్.టి. గురించి చాలా లోతైన చర్చలు చేసి వస్తున్నాడు. ఇప్పుడు ఇది దొరికింది. రేపు చర్చించడానికి దీనిగురించి తెలుసుకోవాలి. పేపర్లో హెడ్‌లైన్లే కానీ పూర్తిగా వార్తలు చదివే అలవాటు పోయింది పరంధామయ్యకి. ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ వాడడం మొదలుపెట్టాడో, పత్రికలలో వార్తలు అసంపూర్ణంగా, పాత వాటిల్లా అనిపించడం మొదలయింది. అందుకే పైపైన తిరగేస్తాడు. ఆసక్తికరమైన విషయం అయితే నెట్‌లోనో, టీవీలోనో గంటలతరబడి జరిగే చర్చలు, కథనాలు, అభిప్రాయాలు వాదనలు కుదిరినంతవరకూ ఎక్కించేసుకుని మేధావిగా ఊహించేసుకుని మర్నాడు మార్నింగ్ వాక్‌లో స్నేహితుల దగ్గర కక్కేస్తాడు. ఆ స్నేహితులలో కొందరు కూడా ఇదే రకం. కొందరు విని ఊరుకునే రకం. పేపర్ తిరగేస్తున్నాడు. ఒక్కసారిగా గుండెలో రక్త ప్రసరణ ఆగినట్లయ్యింది. చేత్తో గుండె పట్టుకుని కూలిపోయాడు. చేతిలో పేపర్ జారిపోతూ ఆగింది. వ్రేళ్ళ సందులలో హెడ్‌లైను ‘విజయవాడ విశాఖ రోడ్డులో ఘోర ప్రమాదం… ప్రముఖ కథారచయిత భగవంతం దుర్మరణం.’
వారం రోజులు ఐ.సి.యులో మూడు లక్షల బిల్లుతో పరంధామయ్య మెల్లిగా కోలుకున్నాడు.
“రాయిలాంటి మనిషివి నీకు హార్టెటాకేంటోయ్!” పలకరింపుకి వచ్చాడు సూర్యం.
“అదే కదా… ఏంటో ఆ పేపర్లో ఎవరో కథారచయిత పోయాడంటే ఒక్కసారి ఎందుకో గుండె గిజగిజలాడింది. ఇప్పుడేం అనిపించటం లేదు కానీ అప్పుడేదో వాడు నాకు బాగా దగ్గర వాడైనట్లు… ఏదో… చాలా బలంగా అనిపించింది.”
“సర్లే పోతే పోయాడు. నువ్వు బతికావ్. అదే పదివేలు. అసలు సంగతి విన్నావా, రెండువేల నోటు రద్దు చేసేస్తున్నారు!”