ఆగస్ట్ 2017

“నేను ఒంటరిని. మీరు ఒంటరి. మనం పరస్పరం స్పర్శించుకున్న క్షణాల్లో కూడా మనతో మన ఒంటరితనం.” అని ముగిస్తాడు నడచి వెళ్ళిన దారి అనే కథను డా. వి. చంద్రశేఖరరావు. వర్తమాన తెలుగు సాహిత్యంలో అతనిది ఒక విభిన్నమైన పంథా. ఒక ప్రత్యేకమైన కథనం. కథనం గురించి ఏ వొక్కమాట అనబోయినా రూపవాదులని ముద్ర వేస్తున్న ప్రతికూల వాతావరణంలో కూడా ఆయన ప్రపంచ సాహిత్యాన్ని, ప్రత్యేకించి లాటిన్ అమెరికన్ సాహిత్యాన్ని, లోతుగా చదువుకుని తనదంటూ ఒక అద్భుతమైన కథన పద్ధతి సృష్టించుకుని గొప్పగా కథారచన చేశాడు. కాఫ్కా తన రచనల్లో ఎక్కడా ఒక్క మాట కూడా చెప్పకపోయినా ఆ లోకమంతా ఒక చీజీకటి, వ్యాకులతతో ఒక అర్థరహితమైన వాతావారణం పరచుకుని ఉండడం కాఫ్కా పాఠకులందరికీ అనుభవమైన విషయం. తెలుగులో చంద్రశేఖరరావు ఆ పని చేయగలిగాడు. తన రచనల్లో ఎక్కడా ఒక్క మాట కూడా అనకుండా ఒక భయోద్విగ్న విషాద వాతావరణాన్ని పాఠకులకు అనుభవైకవేద్యం చేశాడు. నిజజీవితంలో ఎంతో మృదుస్వభావి అయిన చంద్రశేఖరరావు “నా కథలు, నాలోపలి నిశ్శబ్దాలు, సంచలనాలు, నిలువనీయని ఉద్వేగాలు. నేను నడచి వచ్చిన కాలాన్ని, దాని నడకల్ని, మనుషుల్ని, మనుషుల కలల్ని, గాథల్ని, వాళ్ళ గాయాల్ని రికార్డు చేశాయి.” అని చెప్పుకున్నాడు. తనదంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెలుగు సాహిత్యంలో రికార్డ్ చేసి తాను మాయమైపోయాడు.


ఈ సంచికలో:

  • కథలు: గాయం – కన్నెగంటి చంద్ర; వాళ్ళు… – దాసరి అమరేంద్ర; చావు నవ్వు – ఆర్. శర్మ దంతుర్తి; ముగింపు – విజయాదిత్య; వలయం – మధు చిత్తర్వు; ఒకనాటి యువ కథ: శుభవార్త – మురళీధర్; హైకూ – వి. చంద్రశేఖరరావు.
  • కవితలు: పాట ఒకటి – నిషిగంధ; ఇంగ్లీష్ పేషంట్ – దాము; గోళం – పాలపర్తి ఇంద్రాణి; మా ఇంటికి దారి – తమ్మినేని యదుకులభూషణ్.
  • పద్యసాహిత్యం: నాకు నచ్చిన పద్యం: కావ్యహోమం – భైరవభట్ల కామేశ్వరరావు.
  • వ్యాసాలు, శీర్షికలు: పత్రికారంగాన్ని సుసంపన్నం చేసిన పురాణం – శ్రీరమణ; ఒక ఫినామినన్: డా. వి. చంద్రశేఖరరావు – మధురాంతకం నరేంద్ర; లక్ష్మణుని జాగారము – జెజ్జాల కృష్ణ మోహన రావు; పుస్తక పరిచయం: సుదర్శనం గారికి… – తమ్మినేని యదుకులభూషణ్; రవిశంకర్ కవిత్వంలో నేను–పుస్తక పరిచయం – కె. వి. ఎస్. రామారావు; కళకాలమ్: 3. రేఖ–స్ట్రోకు – తల్లావజ్ఝుల శివాజీ; తెరచాటు-వులు: 7. మరీ లాక్కండి, తెగుద్ది – శ్రీనివాస్ కంచిభొట్ల.
  • శబ్దతరంగాలు: కొన్ని లలితగీతాలు – పరుచూరి శ్రీనివాస్.