(యుద్ధమూ ప్రేమ మతిమరపు వొంటరితనపు గత భారమూ)
యిసుక. తడి రక్తపు యెడారి యిసుక. నక్షత్ర ఖచిత ఆకాశపు రాత్రి మీద పగబట్టిన చీకటి వంటి యిసుక తుఫాను. యిసుకలో కూరుకుపోయిన వాహనం లోపల ఆమె కురుల్ని లెక్కిస్తున్న అతని వేలి కొసలు. తెగి పడిన అవయవాల ఆరుబయలు. వొక ముద్దిచ్చి నిద్రపుచ్చమని నర్సును వేడుకొంటున్న క్షతగాత్ర సైనికులు. శాపగ్రస్త జ్ఞాపక శక్తి. తీవ్రమైన మృత్యు వాంఛ వంటి వ్యామోహం. ఆకాశాన్ని కప్పుకొన్న సిరియా యెడారిలా ఆమె. నీటి చెలమ కోసం ప్రాకుతున్న అతని శ్వాస. వొకే వొక జ్ఞాపకాన్ని మోస్తున్న యింద్రియాలు. వాయిదా పడిన మృత్యువుతో రహస్య సంభాషణ. ప్రకృతి కంపించే మోహంతో పెనవేసుకొంటున్న మహా సర్పాల వలె వారిద్దరి నగ్న దేహాలు. మందు పాతరల నుంచి దారుల్ని విముక్తం చేస్తున్న సిక్కు యువకుడి తొలి యవ్వన పరిమళం. హంగేరియన్ జానపద యువతి గాత్రంలోంచి వారి మైథున శరీరాల్లోకి ప్రవహిస్తున్న ఆదిమ కాంక్ష. సమూహంలోని యేకాంతాన్ని కౌగలించుకొన్నాక అతన్ని వీడని ఆమె దేహపు రుచి. పియానో సంగీతంలోంచి మందుపాతరను వెలికి తీసిన సిక్కు యువకుడి కురులకు తైలాన్ని బహూకరించిన ప్రేయసి. కల్పిత వ్యామోహం వంటి కాపురాన్ని ధిక్కరించి అతనిలోకి యిసుక తుఫానై కమ్ముకొన్న ఆమె. గాయాలై కురుస్తున్న బుల్లెట్లు. నిషేధిత వాంఛాపూరిత తీరం వెంబడి పరుగులు తీస్తున్న ఆమె హృదయం. సిలువకు వ్రేలాడదీసిన ప్రతి రాత్రీ నూతన వేకువై పుష్పించే అస్తిత్వ దుఃఖం. మజిలీల్ని వెంట మోసుకొని పయనిస్తున్న యుద్ధ ఖైదీలు. ఆరిపోయిన గుహ లోపలి దీపం. ప్రాణాన్ని వెలుతురు చేసుకొని రాసిన ప్రేమ లేఖ. చనిపోయి చాలా కాలమైనా వూపిరి మిగిలిన శరీరం. జ్ఞాపకాన్ని మృత్యువులా వెంట తీసుకెళ్ళిన ఆమె. యెడారిలో కాళ్ళు తెగిన వొంటెలా ప్రాకుతున్న అతడు.
కూలిన యుద్ధ విమానాల్లా థియేటర్లో మనం.