పాఠకుల అభిప్రాయాలు

హనుమంతరావు results: 290

  1. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj అభిప్రాయం:

    07/10/2010 4:38 pm

    మీ కోరికని తీర్చాలీ అంటే నేను మీ పత్రికలో పాఠకుల లోతులేని అభిప్రాయాలని..వారి వారి సాహిత్య పరిజ్ఞాన లేమినీ ఉదాహరణ పూర్వకంగా పోల్చిచూపించాలి. అది నాకు చికాకైన పని. అటువంటి ఏకవాక్య అభిప్రాయాలు రాసే పాఠకుల అతితెలివి భావాలని పక్కకిపెడితే..మీ పత్రికలో తెలివైన అభిప్రాయాలు, కాస్త చదవాలి అన్న అభిప్రాయాలు రాసే పాఠకులు నేను గమనించినంత వరకూ వీళ్ళు – మీరు అడిగినతర్వాత మీకు తెలుసుకోవాలీ అన్న కోరిక కలిగిన తర్వాత ఎంతోకొంతైనా చెప్పడం నా ధర్మం గనక మాత్రమే చెబుతున్నాను – ఈమాట ప్రధాన సంపాదకులనీ..ఓపికగా పత్రికని నిర్వహిస్తున్న ఇతర సంపాదకవర్గాన్నీ మొదటగా చెప్పాలి. వీరి తర్వాత బెజ్జాల కృష్ణమోహనరావుగారు, సురేష్ కొలిచాల, పరుచూరి శ్రీనివాస్, లైలా ఎర్నేని, చీమలపర్తి బృందావనరావుగారలూ..ఇంకా కొడవళ్ళ హనుమంతరావు..బాబ్జీలు..కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ ,గొర్తి బ్రహ్మానందం, కామేశ్వర రావు గారలూ .వీరి వ్యాసాలూ..కవిత్వంలో వైదేహీ శశిధర్, ఉదయకళ, శ్రీవల్లీ రాధిక, పాలపర్తి ఇంద్రాణీ..వీరి కవితలూ నేను చదివినప్పుడు ఆస్వాదించగలిగాను. అభిప్రాయాలు సైతం నేను ఎక్కువ చదివేది వీరినే!! వీళ్ళుమాత్రమే మీ పత్రిక పాఠకులు కారు కదా?? ఇంక మిగతా అభిప్రాయాలలో నాకు ఏనాడూ ఆసక్తిని కలిగించేవి పెద్దగా కనిపించలేదు. లోతులేని తెలిసీతెలియని భావాలు తప్ప. మీ పత్రికలో మాత్రమే పద్యానికి నిజంగా ప్రాముఖ్యతని ఇస్తున్నారు. కృష్ణదేశికుల వారి పద్యాలని నేను ఇస్టంగా చదువుతాను.

    నేను పైన ప్రస్తావన చెప్పిన వీరివికాక నా దృష్టికి వచ్చిన ముఖ్యమైన రచన గానీ ముఖ్యమైన అభిప్రాయంగానీ లేదు అనే చెప్పాలి. వచనకవిత అనే ప్రక్రియని తెలుగుదేశంలోనూ మీదేశంలోనూ చతురతతో నడపగలిగిన వాళ్ళు బహుకొద్దిమంది మాత్రమే అని చెప్పగలను. వచన కవిత్వం రూపాన్ని సులువుగా వాడుకునీ లోతులేని ఊహసాగని అయోమయపు భావాలని రాసి పుస్తకాలుగా అచ్చేసి చాలా మది కవులుగా చలామణీ అయిపోతున్నారు. కవిత్వం బాగుంటే దాన్ని విశ్లేషించి అది ఎందుకు బాగుందో వివరంగా చెప్పవచ్చు. కానీ అకవిత్వాన్ని విశ్లేషించే పని ఎవరు చేసినా అది దండగ వ్యవహారం మాత్రమే!! నాకు తెలుసు నేనీ మాట అన్నప్పుడు తెలుగు దేశంలోనూ ఇంకా మీదేశంలోనూ “కవి” నామధేయులకి ఎందరికో కోపం వస్తుందని. ఇందుకు భయపడే..ఇబ్బందిపడె సమకాలీన వచనకవిత్వం మీద ఎవరూ విమర్శకి పూనుకోవడంలేదు. నా మాట అటుంచండి. సాహిత్యం మీద ఆసక్తి లేదా అభినివేశం ఉన్న ఎవరైనా ఇవాళ కవిత్వం పేర అచ్చవుతూన్న వాటిలో నిజంగా కవిత్వం ఏమేరకి ఉందో చెప్పండి. ఈ అవకాశాన్ని వాడుకుని ఎందరు కవిత్వమే రాయలేని వాళ్ళు కవులుగా చెలామణీ అయిపోతున్నారో చూడండి. తెలుగులో మంచి కవులకన్నా వీళ్ల హడావిడి ఎక్కువ. నిజంగా చూద్దామా అంటే చెప్పుకోదగ్గ ఒక్క కవిత ఉండదు. ఇది పాఠకులకీ తెలుసు..సమీక్షకులకీ తెలుసు..విమర్శకులకీ తెలుసు. వాళ్ళు చెప్పిన చాలా కారణాలకి వాళ్ళు పేర్కొన్న ఎన్నో వచనకవితలు నిజంగామిగలలేకపోయాయని. ఇది ఒక నిశ్శబ్ద అసహనం. నేను దానికి మాటని ఇచ్చాను అంతే!! ఒక కవిత్వాభిమానిగా అకవిత్వాన్ని ఊరికే రెపరెపలాడిస్తూంటే మరి నా వల్ల కాక బయటికి చెప్పిన అభిప్రాయం. ఏది ఎందుకు మంచికవితో నేను చెప్పగలనేమో గానీ మంచి కవిత కాని దాని గురించి మాట్లాడి నా సమయాన్నీ ..మీ సమయాన్నీ నేను వృధా చేయలేను. నాకు నచ్చిన ఆధునిక కవులలో మోహన ప్రసాద్ ..అజంతా..త్రిపుర..పాటల రచయితలలో గద్దర్ వంగపండు[ 20 ఏళ్ళకిందట..ఇప్పుడుకాదు] ఇప్పుడు ..గోరటి వెంకన్న..లాంటి వాళ్లు తప్ప ఇవాళ్టి కాలంలో నాకు నిజంగా చదవ వలసిన వాళ్ళూ ..వినవలసిన వాళ్ళూ ఉన్నారని అనుకోను. మీరు అడిగిన కారణానికి నేను నా భావాలని వివరంగా చెప్పక తప్పింది కాదు మిగతా అనేక వాదాల మీదా ..ఇజాల మీదా రాజకీయంగా నాకు ఆసక్తి ఉందే గానీ వాళ్ళ వాళ్ళ కవితా వ్యక్తీకరణలమీద నాకు ఆసక్తి లేదు. తెలుగులో భాషా పరంగాగానీ..భావపరంగా గానీ డొక్కశుధ్ధి లేని వాళ్ళు సైతం కవిత్వం రాసేస్తున్నారు ఇంతకన్నా దారుణం మరొకటి లేదు..ఇప్పటికైనా సరైన సాహిత్య విమర్శ ఆధునిక కవిత్వమ్ మీద గనక రాగలిగితే [ఎలాంటి మెరమెచ్చులూ లేకుండా.. నిష్పక్షపాతంగా]..మంచి సాహిత్యం మిగులుతుంది. సాహితంగా చెలామణీ అవుతున్న పొల్లు పోతుంది. సాహిత్య పత్రికలు అందుకు దోహదం చేసి ..మంచి రచనలని మరొకసారి అయినా ఈ తరం పాఠకులకి పరిచయం చేయాల్సి ఉంది.. పలుకున్న కవులూ..రచయితలూ మరోసారి పాఠకులకి తెలియడం వలన పాఠకులు ఎక్కువ లాభపడతారు. మరింతగా వాళ్ళ ఆలోచనలని వాళ్ళు పదును పెట్టుకుంటారు. అలాగేమంచి కవిత్వాన్నీ మంచి విమర్శనీ మెచ్చుకోగలవాళ్ళు సైతం మరింతగా పెరుగుతారు. నేను వీలైనంత క్లుప్తంగానూ..అదే సమయంలో స్పస్టంగానూ మాట్లాడాలని ప్రయత్నంచేసాను. ఇప్పటికిది చాలునని అనుకుంటూ..

    సెలవు,
    భవదీయ..
    రమ.

  2. ఓహో యాత్రికుడా.. గురించి Rohiniprasad అభిప్రాయం:

    03/12/2010 8:09 am

    రాజేశ్వరరావు, హనుమంతరావుల గురించిన కొండలరావుగారి వ్యాసం ఆసక్తికరంగా ఉంది.

  3. శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    02/08/2010 1:49 pm

    హనుమంతరావు గారు,

    నాకు చెప్పడానికి చేతగాని విషయాన్ని మహా బాగా చెప్పేరు. ఖచ్చిత తత్వం చేరిన తర్వాత కవిత్వం లుప్తమైపొయ్యేపనైతే, మన ప్రాచీన సాహిత్యంలో అసలు కవిత్వవే లేదనుకోవాలేవో. నేనేవీ ప్రాచీన సాహిత్యాన్ని ఔపోసన పట్టలేదు కానీ ఆ ఖచ్చిత తత్వం తర్వాత కవిత్వం లేదంటే, పాపం నైషధ కర్తలనించి, లేదు, లేదని మహా ఖచ్చితవైన అభిప్రాయాలు కల ఇస్మాయిల్ గారిదాకా అందరూ కవులు కాకుండా పోతారేవో. అదేందో అంటారు చూడండి, కొని తెచ్చుకోవటవని అలాగుంది రవి శంకర్ గారి వాదం. ఖచ్చిత తత్వం వుంటే కవులుగారని వారు చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. పాపం కవి ఏ అభిప్రాయాలు లేకుండా, ఏ నమ్మకాలూ లేకుండా, ఏమాత్రం ఏ మానవ లక్షణాలు లేకుండా, ఏ చెట్టుగానో, ఏ పువ్వు గానో, లేకపోతే, పచ్చ, పచ్చగా ఎండలో మిల, మిల మెరుస్తూ ఎండుతున్న ఏ పిడగ్గానో అయ్యుండాలేవో.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

    [ఈ అభిప్రాయం ఎడిట్ చేయబడింది – సం.]

  4. శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    01/29/2010 2:33 am

    రెండు మూడు తెలిసీ తెలియని విషయాల గురించి నాలుగు మాటలు.

    శ్రీశ్రీ మీద థీసిస్ చేసింది మిరియాల లక్ష్మీపతి గారన్నారు; రామకృష్ణ గారని గుర్తు.

    “నిరాశ అన్నది తాత్కాలికమైన మానసిక పరిస్థితేగాని, కవులతోబాటు ప్రతిఒక్కరు దీనికి లోనుకావటం సహజమే. మహాప్రస్థానం తరువాతి శ్రీశ్రీ పద్యాల్లో ఎక్కడా ఇటువంటి ఉదాహరణలు కనిపించవు. ఎప్పుడైనా నిరాశ వ్యక్తిగతమే.”

    శరచ్చంద్రిక రాసింది మహాప్రస్థానం తర్వాతేననుకుంటాను. దాంట్లో నిరాశ తోనే మొదలెడతాడు కాని ఆశాభావంతో ముగిస్తాడు. ఇక్కడే కాక కొన్ని ఇతర పద్యాలలో కూడా ఈ నిరాశా నిస్పహలకి కారణం తన వ్యక్తిగత జీవితం కాదు, సామాన్యుని వాస్తవ జీవితం.

    “నువ్వో … కావాలంటే ముందుగా కమ్యూనిస్టువి కావాలి,” అన్నదానిని చవకబారు కవిత్వమంటే ఒప్పుకోవచ్చు కాని, “నిజానికి ఏ సందేహానికైనా నిశ్చయమైన, ఖచ్చితమైన సమాధానం లభించిందని సంతృప్తిపడితే రచన ఆగిపోవటమే జరుగుతుంది,” అన్నదానికి ఇంకాస్త ఆధారాలు కావాలి. “కలడు కలండెడు వాడు కలడొ లేడో” అన్న కవి “ఇందుగలడందు లేడను సందేహము వలదు” లాంటిది రాస్తే అది కవిత్వం కాకుండా పోతుందా?

    శ్రీశ్రీ జీవితాంతమూ కవిగా అన్వేషణ తోనే గడిపానని చెప్పుకున్నాడు. ఏదో ఒక సిద్ధాంతాన్ని నమ్మినంతనే, ఇక తన జీవితంలో వేరే అన్వేషణే లేదనడం సరికాదు.

    ఇస్మాయిల్ గారు కూడా, మహాప్రస్థానంలోని గీతాలన్నీ శ్రీశ్రీ మార్క్సిజం గురించి తెలుసుకోక మునుపు రాసినవే నన్నారు. కాపిటల్ చదవలేదేమో కాని, 1930 ప్రాంతాల్లో ఆంధ్రా యూనివర్సిటీ లైబ్రరీలో చదవదగ్గ పుస్తకాలన్నీ చదివానని చెప్పుకున్న కవికి మార్క్సిజం గురించి తెలియదంటే నమ్మడమెలా? కాస్తోకూస్తో తెలియకుండానే “దేశచరిత్రలు” రాసి ఉంటాడా?

    మహాప్రస్థానం తర్వాత శ్రీశ్రీ రాసినవన్నీ మరీ దసరా పద్యాల స్థాయిలో ఉన్నాయనుకోను. వాటిల్లో చెప్పుకోదగ్గవీ, మహాప్రస్థానం గీతాలతో పోల్చదగ్గవీ, వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చునంటే ఒప్పుకంటాను. మరి డెబ్భై ఏళ్ళకి పైగా బ్రతికి, చివరిదాకా ఏదో ఒకటి రాస్తూ ఉన్నశ్రీశ్రీ కవిత్వంలో చెప్పుకోదగ్గది దాదాపు అంతా మూడు పదులు నిండక ముందే రాయడానికి కారణం, ఆ తర్వాత ఆయన మార్క్సిజం తీర్థం పుచ్చుకోవడమేనని రవిశంకర్ గారు స్పష్టంగా చెప్పకపోయినా సూచనప్రాయంగా అన్నారు.

    సృజనా శక్తి వయసుతో, అనుభవంతో, జ్ఞాన సముపార్జనతో పెరుగుతుందా? ఇది సాహిత్యంలోనేనా, అన్ని రంగాల్లోనూ సహజమా? అన్న సందేహముంది నాకు. హార్డీ తన “సంజాయిషీ” లో [1] రామానుజన్ ముప్ఫై రెండేళ్ళకే చనిపోవడాన గణితానికి వచ్చిన నష్టమేమీ లెదన్నాడు! ఆ వయసు తర్వాత ఏ గణితవేత్తయినా పెద్దగా సాధించేదేమీ లేదని హార్డీకి గట్టి నమ్మకం.

    S. చంద్రశేఖర్ కి సృజన తీరు మీద కుతూహలం కలిగి ఓ మంచి ఉపన్యాసం [2] ఇచ్చాడు. షేక్స్పియర్, బీథోవన్ ల సృజనా కౌశల్యం పెరుగుతూ జీవిత చరమదశ దాకా పరిపక్వత చేరిందంటాడు. వాళ్ళతో పోలిస్తే, సృజనా పరంగా మహోన్నతమైన గురుత్వాకర్షణ సూత్రాల ని న్యూటన్ కనుగొన్నది పాతికేళ్ళ వయసు లోపలే!

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “A Mathematician’s Apology,” by G. H. Hardy. Cambridge University Press, 1967. గణితమంటే ఇష్టమున్నా లేకపోయనా, కవత్వమంటే ఆసక్తిగల వాళ్ళు చదవాల్సిన పుస్తకం.

    [2] Shakespeare, Newton, and Beethoven, or Patterns of Creativity. Nora and Edward Ryerson lecture delivered at the University of Chicago, Center for Public Policy on 22 April 1975. Published in “Truth and Beauty: Aesthetics and Motivations in Science,” by S. ChandraSekhar. The University of Chicago Press, 1987.

  5. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    09/23/2009 2:52 am

    ముందు రమ గారు, రవికిరణ్ గారు, పురాణాల, కవిత్వాల ప్రస్తావనపై లేవనెత్తిన అభ్యంతరాల గురించి ఓ రెండు మాటలు. విశ్వం గురించి మానవుడు అనాదిగా ఆలోచిస్తూ ఉండాలి. ఆ భావనలు కొన్ని పురాణ గాథల్లో, మత గ్రంథాల్లో ఏదో ఒక రూపంలో ఉంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వాటి పరిణామం గురించి రాసేటప్పుడు ఆ కథలని ప్రస్తావించడంలో తప్పు లేదు. వాస్తవానికి ఇది పాపులర్ సైన్సులో వాడుక కూడాను. కాల స్వరూపం గురించి రాస్తూ Hawking ఏమంటాడో చూడండి [1]:

    “In Newtonian theory, where time existed independently of anything else, one could ask: What did God do before He created the universe? As Saint Augustine said, one should not joke about this, as did a man who said, “He was preparing Hell for those who pry too deep.” It is a serious question that people have pondered down the ages. According to Saint Augustine, before God made heaven and earth, He did not make anything at all. In fact, this is very close to modern ideas.”

    అంత మాత్రాన Saint Augustine సైంటిస్టయిపోడనుకోండి. కాని చరిత్రా, చమత్కారమూ కలిస్తే సైన్సు మీద ఇంకాస్త ఆసక్తి పెరుగుతుంది.

    అదే పుస్తకంలో, విశ్వానికి అనేక చరిత్రలు, ఒక దానిలో మరొకటి ఇమిడి ఉన్నాయనే సిద్ధాంతాన్ని వివరించడానికి, Hamlet మాటలు వాడుకున్నాడు: “I could be bounded in a nutshell and count myself a king of infinite space.” ఆ అధ్యాయాన్ని ముగిస్తూ, “In this chapter we have seen how the behavior of the vast universe can be understood in terms of its history in imaginary time, which is a tiny, slightly flattened sphere. It’s like Hamlet’s nutshell, yet this nut encodes everything that happens in real time. So Hamlet was quite right. We could be bounded in a nutshell and still count ourselves kings of infinite space.”

    Shakespeare కి modern physics తెలుసని కాదు; భావాల్లో కొంత సారూప్యం ఉంది; మనసుకి హత్తుకునేట్లు కవులకి మించి మరెవరూ చెప్పలేరు కనుక వాళ్ళ భాష వాడుకోవడం మంచిదే. ఏమాటకామాటే చెప్పాలి, వేమూరి గారిచ్చిన మన పురాణాలలోని వివరాలు Hawking సోదాహరణాల్లా హత్తుకునేటట్లు లేవు.

    ఇక అసలు విషయానికొస్తే, సైన్సు విషయాలని ఆసక్తికరంగా చక్కటి తెలుగులో రాసేవారిలో చెప్పుకోదగ్గవారు వేమూరి. ఈ వ్యాస విషయం సైన్సు చదివిన వాళ్ళకి కూడా అంత సులభంగా కొరుకుడు పడేది కాదు. అంత క్లిష్టమైన దానిని వివరించడం మెచ్చుకోదగ్గ ప్రయత్నం. దానిపై ఇంకాస్త విపులంగా తీరిక దొరికినపుడు రాస్తాను.

    కొడవళ్ల హనుమంతరావు

    [1] “The Universe in a Nutshell,” by Stephen Hawking. Bantam Books, 2001.

  6. గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి jayaprabha అభిప్రాయం:

    09/21/2009 3:31 pm

    కొడవళ్ళ హనుమంతరావు గారూ!! మీరు చెప్పేదాకా నేను అన్ని ఆశ్చర్యార్ధకాలని గమనించననే లేదు సుమా!! ఆ పుస్తకం అచ్చువేస్తున్నప్పుడు నా మీదున్న పనిభారం..ఒక ముఖ్యకారణం. తొందర..తొందరగా..హడావుడిగా పుస్తకమ్ తేవడం ఇంకో కారణం..నా శైలిలోని నేను కూడా గుర్తించని ఒక అలవాటు మరోకారణం….ఇలా అనేకం ఆ అచ్చువెన్క ఉన్నాయి మరి.ఆ పుస్తకమ్ ఎప్పుడైనా పునర్ముద్రించే వాళ్ళుంటే.. మీలాంటి వారెవరైనా తప్పులు దిద్దగల్గితే నామీద ఉన్న భారం తగ్గుతుంది. మీకు కల్గిన అసహనం సమంజసమైనదే! [చూసేరా మళ్ళీ ఆశ్చర్యార్ధకం:). ఇటుపైన నేనంటూ ఏమైనా రాస్తే [ఇది ప్రస్తుతానికి సందేహం నాకు]..మాత్రం మీకు కల్గిన “అసహనాల” వంటివి కల్గకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నం తప్పకుండా చేస్తాను. ప్రయత్నం అని ఎందుకంటున్నానంటే..మీలాంటి వాళ్ళు పుస్తకం చదివే అనుభవమ్ వైపునుంచే చూసే వీలుంది. తెలుగున పుస్తక ప్రచురణ [editor లు..ప్రూఫ్ రీడర్లూ లాంటి వాళ్ళ పనికూడా ఇక్కడ పుస్తకమ్ రాసిన వాళ్ళే చేయాలి గనక] చాలా కష్టతరమైన వ్యవహారం. అందునా ఒక అభిరుచితో పుస్తకం తేవాలని గనక ఆలోచిస్తే అది ఇంకా కష్టం. ఇక్కడ ప్రూఫ్ రీడర్స్ ఉండరు. నా అచ్చుపుస్తకాలే మీలో అస హనాన్ని కల్గించాయీ అంటే మరి మిగతా పుస్తకాల సంగతిని నేను ఊహించలేను. ఇన్ని భారాలని వహిస్తూ పుస్తక ప్రచురణ చేసిన రచయితల పరిస్థితిని గురించి కూడా మీ వంటి విజ్ఞులు ఆలోచించగలిగి వుంటే నేను నిజంగా ఊపిరి పీల్చుకోగలిగి ఉండేదాన్ని. మరి ఎందుకనో మీ ఊహ అటుగా మళ్ళినట్టు లేదు. తెలుగున ఒక పుస్తకం రాయడం కోసం శ్రమ పడాలో..దాన్ని అచ్చు తప్పులు లేకుండా శ్రధ్ధగా తేడానికి శ్రమపడాలో..అలా తెచ్చిన పుస్తకాల్ని అమ్ముకుందికి శ్రమ పడాలో..నాకు ఇప్పటికీ బోధ పడలేదు. అలాగని నేను ఆ ఆశ్చర్యార్ధకాల్ని ఏ కోశానా ఒప్పుకోవటంలేదు. మీ అసహనాన్ని మీరు వ్యక్తపరచగలిగేరు. మరి నా అశక్తతనీ..నాకు కలిగిన “అసహనాల్నీ”..నేను ఎలానూ వ్యక్తం చేయలేనే!
    నేను చేయగలిగిన పని ఒక్కటే! రచన చేయకుండా ఉండటం!!

    జయప్రభ.

  7. గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    09/20/2009 2:43 am

    [ఈ పొరపాటుని సరిదిద్దాము. –సంపాదకులు]

    రాగాల గురించి నాకేమీ తెలియదు. పాటలు వింటానికి చాలా బావున్నాయి. జాషువా పద్యాలు అమోఘం. పరిచయం చేసినందుకు లక్ష్మన్న గారికి కృతజ్ఞతలు. “శిశువు” లోని పద్యాలని ప్రస్తావిస్తూ, ముఖ్యంగా కొన్ని సీస పద్యాలు శ్రీనాథుడి పద్యాలకి సమవుజ్జీలని జయప్రభ కొనియాడారు [1].

    పై పద్యాల్లో ఒకటి రెండు పొరబాట్లు దొర్లినట్లుంది. విశాలాంధ్ర ప్రచురణ ప్రకారం, “రసవార్ధి తరియించ వచ్చిన పరదేశి,” కి బదులు “ప్రసవాబ్ధి తరియించి వచ్చిన పరదేశి,” అని ఉండాలి. రెండోదే సబబనిపిస్తోంది.

    “ఏండ్లు గడచిన ముందు ముందేమొకాని, ఇప్పటికి మాత్ర మేపాప మెరుగడితడు!” అన్న జాషువానే మరికొన్నేళ్ళకి, “పసితనము” ను [2] తలపోస్తూ,

    “మాది గొప్ప జన్మ నావంశమే దొడ్డ
    వంశమన్న అహము బలిసె నిపుడు
    యెంత చదువుకొన్న నీ భేద భావం
    వదల దేమి చేయ వలయు నేను.

    అపుడెరుగని అపరాధము
    లిపుడెన్నో చేయుచుంటి యిహ పరముల యం
    దపరాధినైతి, కపటపు
    జపములు దేవాలయములు శరణములయ్యెన్.

    పూచిన వనముల జూచిన
    పూచెన్నా మనసు బాల్యమున, నా కిపుడా
    పూచిన వనముల కాలన్
    రాచెడు నీర్ష్యానలంబు రగలు నదేమో.”

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] జాషువా ని మెచ్చుకుంటూనే లోపాలు చూపెట్టిన “పద్యానికి…అభ్యుదయానికి పర్యాయం జాషువా,” అన్న మంచి వ్యాసం. (ఫుల్ స్టాప్ పెట్టాల్సిన చోట ఆశ్చర్యార్థకం పెట్టడం మాత్రం చదివేవాళ్ళలో అసహనాన్ని కలిగిస్తుంది.) “మార్గము – మార్గణము (సాహిత్య వ్యాసాలు),” 2003.

    [2] “జాషువా రచనలు – నాల్గవ సంపుటం. ఖండ కావ్యాలు, ఏడు భాగాలు”, విశాలాంధ్ర, 2008.

  8. పునరపి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    06/14/2009 9:14 pm

    ఈ సందర్భంలో చలం “మైదానం” కన్నా “స్త్రీ” సముచితం – మన చెంపలు ఛెళ్ళుమనిపిస్తాడు! వంటా, తుడవడాలతో సతమతమయే ఆడవాళ్ళకి విలువ లేదు, వాళ్ళు చదువుకొని స్వతంత్ర ఆర్జన చెయ్యడమే మార్గం అన్నాడు. అని కూడా దాదాపు వందేళ్ళయింది. ఇప్పుడు భార్యలు ఉద్యోగం చేస్తూ, మూడు పూటలా వంట కూడా చేస్తున్నారు – అదీ అమెరికాలో – అంటే వాళ్ళ భర్తలు చాలా సిగ్గుపడాలి. చదువుకున్న అమ్మాయిలు కిమ్మనకుండా వాళ్ళమ్మలు చెప్పిన సూక్తులు విని సర్దుకుపోవడం శోచనీయం.

    బళ్ళో పాఠాలు చెప్పి సర్టిఫికెట్లివచ్చు. అది ముందు తరాల వాళ్ళకి. ఈ తరం మగాళ్ళు మారాలి. అంతకన్నా ముఖ్యంగా ఆడవాళ్ళు కాస్త స్వతంత్రం చూపెట్టాలి. “మా అమ్మ ఏనాడైనా చట్నీ చేయకుండా దోశ చేసిందేమో అడుగు,” అన్న రాఘవకి, “మీ అమ్మ నాలాగా బయట ఉద్యోగం చేసిందోమో అడుగు,” అని లత ఎదురుచెప్పగలగాలి.

    కొడవళ్ళ హనుమంతరావు

  9. పునరపి గురించి Akella Suryanarayana Murthy అభిప్రాయం:

    06/14/2009 4:42 am

    సమస్యను గుర్తించేరు బాగుంది, పరిష్కారం? హనుమంతరావు గారు other side of the story బాగా చూపించేరు. ఇలాంటి సమాధానాలు వేరే ఇళ్లల్లో వస్తాయని తెలిసి వినోదంగా అనిపించింది

  10. స్త్రీ పర్వంలో గాంధారి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    06/06/2009 10:11 pm

    “తిక్కన పదసంపద”

    “ఈ వెండ్రుకలు పట్టి యీడ్చిన యాచేయి దొలుతగాఁ బోరిలో దుస్ససేను
    తనువింత లింతలు దునియలై చెదరి రూపఱియున్నఁ గని యుడుకాఱుఁగాక!
    యలుపాలఁ బొనుపడునట్టి చిచ్చే యిది;”

    అని చదివితే, అబ్బ! ద్రౌపది కసి ఏం కసి, అనిపించింది. చిన్న చిన్న తెలుగు మాటలతో తిక్కన లెక్కలేనన్ని కొత్త కొత్త సమాసాలూ నుడికారాలూ మన భాషకి చేర్చాడట . ‘నెత్తురు మడువు’, ”కయ్యపునేల’, ‘మెత్తనిపులి’, ‘పెట్టనికోట’, ‘గుండెకాయ’, ‘చెలియలికట్ట’, ‘చిందరవందర’, ‘తేనె పూసిన కత్తి”, ఇలా అనంతం – అని భద్రిరాజు గారి వ్యాసంలో [1] చదివాను. తిక్కన కవితా శిల్పంలో సొగసులు చూడాలంటే, దగ్గరికిపోయి నిలకడతో చూడాలన్నారు. దానికి నాకింకాస్త తీరిక దొరకాలి.

    ముఖ్యమైన తెలుగు పుస్తకాలకి వ్యాఖ్యానాల అవసరం ఉంది కాని దాని గురించి కేవలం చదువుకున్న వాళ్ళు ఆలోచించి చేసేదేముంది? వాటిమీద పండితులు పని చెయ్యాలి. అందుకు తెలుగు విశ్వవిద్యాలయం లాంటి సంస్థలు సాయం చెయ్యాలి. “దక్షులెవ్వారు లుపేక్ష సేసిరది వారల చేటగు…”

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] భద్రిరాజు కృష్ణమూర్తి “భాష, సమాజం, సంస్కృతి”, పుస్తకంలో “తిక్కన పదసంపద” అన్న వ్యాసం.