రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు

రచన: విన్నకోట రవిశంకర్
జనవరి 2010

శ్రీశ్రీ కవిత్వాన్ని అనేక కోణాల నుంచి చూడవచ్చు. వాటిలో ఒక ప్రత్యేక కోణంనుంచి విశ్లేషణ చేద్దామని నా ప్రయత్నం. అది ఏ దేశమైనా, ఏ కాలమైనా కవులు తమ స్పందనల్ని తెలిపే సామాన్యమైన కవితావస్తువులు కొన్ని వున్నాయి. వాటిని తీసుకుని, అవి శ్రీశ్రీ కవిత్వంలో ఏవిధంగా వ్యక్తమయిందీ పరిశీలించటానికి ప్రయత్నిస్తాను. ఇది శ్రీశ్రీ కవిత్వసర్వస్వం మీద సమీక్షకాదు; ఆయన కవిత్వ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే చిన్న అద్దం మాత్రమే.

మానిషాద వాక్యంతో వాల్మీకిని కవిగా మార్చినవి, సిద్ధార్థ గౌతముడు బుద్ధునిగా మారటానికి ప్రేరేపించినవి – మృత్యువు, దుఃఖం. ఆదికవినుంచి, ఆధునిక కవిదాకా మృత్యువు అనేకమంది కవిత్వంలో వస్తువుగా రూపొందింది. శ్రీశ్రీ కవిత్వంలో కూడా దీని ప్రస్తావన చూడవచ్చు. నిజానికి, మహాప్రస్థానం ప్రారంభ కవితైన అంకితపద్యం ఒక ఎలిజీనే. సాధారణంగా కవులు మృత్యువును ఒక అమూర్తభావనగానే వాడతారు. ఉదాహరణకు “భయ విభ్రమాల మధ్య విషాద వాక్యం వలె సాగే జీవితంలో మృత్యువు ఒక్కటే నిజం” (అజంతా, స్వప్నలిపి). శ్రీశ్రీ మొదట్లో రాసిన ‘సుప్తాస్తికలు’లో మాత్రం కొంతవరకు ఇటువంటి ధోరణి వుంటుంది.

అవి ధరాగర్భమున మానవాస్తికా ప
రంపరలు సుప్త నిశ్శబ్ద సంపుటములు
అటనొకే దీర్ఘయామిని! ఆ నిశాశ్మ
శాన శయ్యకు ప్రాతః ప్రసక్తిలేదు

ఆయగమ్య తమో రహస్యాంగణాన
తాండవించును మృత్యు శైతల్యమొకటె.

ఇది బహుశా భావకవిత్వంలో భాగమైన romantic sorrowలో భాగంగా చెప్పినది కావచ్చు. దీనికి భిన్నంగా, ఇతర చోట్ల మృత్యువు ఒక సందర్భంలో – అంటే ఒక మిత్రుని మరణంగానో, ఒక ముసలి అవ్వ మరణంగానో, ఒక బాటసారి మరణంగానో, ఒక తోటికవి మరణంగానో ఎదురౌతుంది. మరొక విధంగా చెప్పాలంటే, ఈ పద్యాలు the death గురించిగాక, a death గురించి రాసినవి. వీటన్నిటిలో సామాన్యంగా కనిపించే ఒక అంశం -వీటిలో కవికి ఒకరి మరణం కంటే, ఆ మరణంపై ప్రపంచం కనబరచిన ఉదాసీనత ఎక్కువ బాధకలిగిస్తుంది.

ఆకాశం పడిపోకుండానే ఉంది
అఫీసులకు సెలవులేదు
సారాదుకాణాల వ్యవహారం
సజావుగానే సాగింది
….
ఎవరిపనులలో వాళ్ళు
ఎవరి తొందరలో వాళ్ళు

కొంపెల్ల జనార్థనరావు కోసం రాసిన పైవాక్యాలు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. భిక్షువర్షీయసి కవితలో చివర్న

ఆ అవ్వే మరణిస్తే
ఆ పాపం ఎవ్వరిదని
వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళిపోయింది
ఎముకముక్క కొరుక్కొంటు
ఏమీ అనలేదు కుక్క
ఒక ఈగను పడవేసుకు
తొందరగా తొలగె తొండ

అని చెప్పటంలో కూడా ఒక ఉదాసీనతను వ్యక్తం చెయ్యటమే ప్రధానాంశం. శ్రీశ్రీ మరొక కవిత బాటసారిలో కూడా మృత్యువు ప్రస్తావన ఉంది. ఈ కవిత ముగింపు గురించి ఒక చిన్న పరిశీలన చేస్తాను. కవిత చివరిలో బాటసారి మరణం ఈ విధంగా వర్ణింపబడుతుంది:

గుడ్డి చీకటిలోన గూబలు
ఘూంకరించాయి
వానవెలిసీ మబ్బులో ఒక
మెరుపుమెరిసింది
వేగుజామును తెలియజేస్తూ
కోడికూసింది
విడినమబ్బుల మధ్యనుండీ
వేగుచుక్కా వెక్కిరించింది
బాటసారి కళేబరంతో
శీతవాయువు ఆడుకుంటోంది
పల్లెటూల్లో తల్లికేదో
పాడుకలలో పేగుకదిలింది

ఈ కవిత ముగింపును మరొక ప్రసిద్ధమైన కధాత్మక కవిత గురజాడ ‘పూర్ణమ్మ’ ముగింపు వాక్యాలతో పోల్చిచూస్తే ఆసక్తికరంగా ఉంటుంది.

కన్నుల కాంతులు కలువల చేరెను
మేలిమి జేరెను మేనిపసల్
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ

పూర్ణమ్మ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందన్న విషయం పైకి చెప్పకుండా గురజాడ ఒక గోప్యత పాటించారు. బాటసారి కూడా ఎవరికీ తెలియకుండా ఎక్కడో చనిపోతాడు. అతను చనిపోయిన వార్త అతని తల్లిదండ్రులకు చేరుతుందా అన్నది సందేహమే. అందువల్ల, అటువంటి గోప్యతను పాటించే అవకాశం ఇక్కడ ఉన్నా శ్రీశ్రీ దానిని పాటించలేదు. “బాటసారి కళేబరంతో / శీతవాయువు ఆడుకుంటోంది” అన్న వాక్యం ఒక్కటి తొలగిస్తే అటువంటి ప్రభావం వచ్చే అవకాశం ఉందిగాని, ఎందువల్లనో శ్రీశ్రీ దానిని స్పష్టంగా చెప్పటానికే మొగ్గు చూపించారు.

మరణం గురించి మాట్లాడేటప్పుడు మరొక విషయం కూడా చెప్పుకోవాలి. మనిషి ఏనాటికైనా మరణాన్ని జయిస్తాడనే ఆశ, నమ్మకం శ్రీశ్రీకున్నాయి. దేవుడి స్వగతం అనే కవితలో

మరణాన్ని మానవుడు జయిస్తే కాలాన్ని
మానవుడు జయిస్తే తన మనస్సునే మానవుడు
గెలిస్తే
అప్పుడు నేను లేను

అని భగవంతుడు భావిస్తున్నట్టుగా రాసారు. కాని ఈ మరణం లేకపోవటమన్నది నిజంగా వాంఛనీయమో కాదో చెప్పలేం. శ్రీశ్రీ భావనలో మరణాన్ని జయించటమన్నది మనిషి సామర్థ్యం మీద ఆయనకున్న నమ్మకానికి నిదర్శనం. మనిషిపై ఈ నమ్మకం మానవుడా! వంటి ఇతర కవితల్లో కూడా వ్యక్తమౌతుంది. మానవునిపై శ్రీశ్రీకున్న అభిమానాన్ని సూచించటానికి ఒక పాటను కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కధానాయిక పుట్టినరోజు సందర్భంగా పాట పెట్టటం ఒకప్పటి సినిమాల్లో ఆనవాయితీ. అటువంటి ఒక సందర్భానికి శ్రీశ్రీ రాసిన పాటలో ఈ క్రింది వాక్యాలుంటాయి:

వేల వేల వత్సరాల కేళిలో, మానవుడుదయించిన శుభవేళలో
వీచె మలయమారుతాలు, పుడమి పలికె స్వాగతాలు
తారకలే మాలికలై నిలిపె కాంతి తోరణాలు

మామూలు పుట్టినరోజు పాటను మానవజాతి ఆవిర్బావాన్ని కీర్తించే స్థాయికి చేర్చటం బహుశ ఒక్క శ్రీశ్రీకే సాధ్యమనుకుంటాను.

1 2 3అంతా ఒకే పేజీలో

ఈ రచయిత నుంచే...

  • ప్రతీకగా శరీరం
  • అదను
  • సంగమం
  • అమెరికా పర్యాటకుల రెండు పుస్తకాలు – I
  • జ్ఞాపకం

ఇటువంటివే…

  1. కవిత్వంలో శ్రీశ్రీ ప్రస్థానం, పరిణామం
  2. శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన
  3. విమర్శకుడిగా శ్రీశ్రీ
  4. శ్రీశ్రీ ఛందఃశిల్పము
  5. శ్రీశ్రీ తాత్విక చిత్తవృత్తి

జనవరి 2010 సంచికలో ...

  • రెండు శ్రీల విరించి – ఈమాట జనవరి 2010 శ్రీశ్రీ ప్రత్యేక సంచికకు స్వాగతం
  • కలవరపెడుతుంది మనస్సును
  • కలైన గోర్వెచ్చని పాట
  • కృష్ణం వందే జగద్గురుం
  • గాలిపటం
  • గుండుగొమ్ములనుమానం – 1
  • చరమరాత్రి
  • తెలుగు వీర లేవరా
  • నాకు నచ్చిన పద్యం: ధర్మజుని గుణవిశేషం
  • మరో ప్రపంచం పిలిచింది
  • మహా ప్రస్థానం నుంచి మరో ప్రస్థానం వరకు
  • మహాకవి శ్రీశ్రీ
  • రెండు శ్రీల కవి
  • విమర్శకుడిగా శ్రీశ్రీ
  • వెదురు వేది
  • శ్రీ శ్రీ గురించి మూడు మాటలు…
  • శ్రీ శ్రీ కవిత్వంపై … మరో వ్యాసం
  • శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన
  • శ్రీశ్రీ ఉపన్యాసం
  • శ్రీశ్రీ కవితకు బాపూ బొమ్మ
  • శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు
  • శ్రీశ్రీ ఛందఃశిల్పము
  • శ్రీశ్రీ తాత్విక చిత్తవృత్తి
  • శ్రీశ్రీ తో ముఖాముఖీ – 1
  • శ్రీశ్రీ ప్రత్యేక జనరంజని
  • శ్రీశ్రీతో ముఖాముఖీ – 2
  • సామాన్యుని స్వగతం: పాఠం చెప్పటం!
  • హిమబిందు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

శ్రీశ్రీ తో ముఖాముఖీ – 1
చరమరాత్రి

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.