కొత్త కథకులు

తెలుగు కథకులు అనగానే గురజాడ, చెలం గుర్తుకొస్తారు. శ్రీపాద, కొడవటిగంటి, బుచ్చిబాబు, గోపీచంద్, చాసో, రావిశాస్త్రి, కాళీపట్నం, రంగనాయకమ్మ, త్రిపుర, కేతు, మధురాంతకాలు, ఓల్గా, డాక్టర్ వి. చంద్రశేఖరరావు, ఖదీర్‌బాబు–జ్ఞాపకాల వరదలు.

ఈనాటి కథను తలచుకొంటే ఆనాటి ఒరవడి కొనసాగడం లేదేమోనన్న ఆందోళన. బెంగ. ‘భాష మనుగడే అనుమానంలో పడ్డప్పుడు కథలూ కథకులూ ఎలా వస్తారూ?’ అన్న నిస్పృహ.

నిజమేనా? మంచి కథలు రావడంలేదా? కొత్త కథకులు కలం పట్టడంలేదా?

గత ఏడెనిమిదేళ్లుగా, స్థూలంగా 2010 తర్వాత- కాలక్షేపం కోసమో పేరు కోసమో పోటీల కోసమో రాసేవాళ్లని పక్కన పెట్టి- కథలు రాస్తోన్నవాళ్లను చూసినట్టయితే ఆ నిర్వేదమూ నిస్పృహా అనవసరం అన్న భావన కలుగుతుంది. కొత్త కథకులు, యువ కథకులు వస్తున్నారు. మంచి కథలు రాస్తున్నారు అన్న ఆశ కలుగుతుంది.


జీవితమంటే ఆసక్తి, సాహిత్యమంటే గురి, కథ అంటే ప్రేమ ఉన్న కొత్త కథకుల దగ్గరకు వెళితే ముందుగా కనిపించేది విమల. ఆమె స్వతహాగా కవి అయినా, గత ముప్పై ఏళ్లుగా కవిత్వం రాస్తోన్నా- 2011 నుంచీ కథలు రాయడం మొదలెట్టారు.

‘అప్పుడప్పుడు కాసిన్ని కవితలు రాసుకొనే తనకు చాలాకాలంగా ఉగ్గబట్టుకొన్న అక్షరాలు కట్లు తెంచుకొని బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు అనిపించినపుడు; మాట్లాడాల్సిన సంగతులూ, దాటవలసిన అగడ్తలూ ఎన్నో వున్నాయనిపించినపుడు; సంకోచాలు వదిలి చెప్పాలనుకొంటున్నవేమో చెప్పాలనిపించినపుడు’ (తన కథా సంపుటి కొన్ని నక్షత్రాలూ మరికొన్ని కన్నీళ్లుకు విమల ముందుమాట.) విమల కథల లోకంలోకి అడుగుపెట్టారు. ఇప్పటిదాకా 14 కథలు రాశారు. 2016లో తన కథాసంపుటి తీసుకువచ్చారు.

ఆధునిక ఆర్థిక జీవన సరళి జనజీవితాల్లో చొప్పించిన విపరీత ధోరణుల గురించి విప్పి చెప్పే కథలు మనకు గత ఇరవై పాతికేళ్లుగా చాలా వచ్చాయి, వస్తున్నాయి. అందులో చాలా భాగం ఆయా విషయాల గురించి పాఠకుల ఆందోళనను పెంచి అభద్రతా భావం కలిగించేవే గానీ ఆ విపరీత పరిణామాలను ఎదుర్కొని నిలబడే ధీరతను కలిగించేవి కావు.

జీవితాన్ని అనేక కోణాలలోంచి చూసి పరిశీలించిన విమల విభిన్నమైన కథలు రాశారు. వాళ్ళు ముగ్గురేనా (2014) లాంటి కథల్లో తమను తినేయడానికి జీవితం అనే పులి వాడే అన్ని సాధనాలనూ ఒక్క తాపు తన్నే సామర్థ్యాన్ని కూలీ కుటుంబపు యాదమ్మలు సంతరించుకొని, కార్పొరేట్ ప్రభంజనంలో కొట్టుకుపోతున్న చిత్రలకు దిశానిర్దేశం చేసే వైనాన్ని చెపుతారు. సూర్యుడి మొదటి కిరణం (2016) లాంటి కథల్లో జీవితపు ధాటిన పడి ఉక్కిరిబిక్కిరి అయిపోతూ నిస్పృహకు గురి అవుతున్న విరాళిలు తమను తాము తిరిగి వెదికి పట్టుకొనే వైనం చెపుతారు. దౌత్య, దేహభాష, కనకలత, నల్లపిల్ల నవ్వు లాంటి వైవిధ్యమున్న కథలు రాశారు విమల.


తిన్నగా అతి చిన్న వయసు ఉన్న కథకుల దగ్గరకు వస్తే పాతికేళ్లు నిండని సాంత్వన చీమలమర్రి కనిపిస్తారు. ఆమె రాసిన బ్లాక్ ఇంక్ (2016) కథ కనిపిస్తుంది.

అధ్యాపకుల లైంగిక వేధింపులు ఇప్పటి కొత్త విషయం కాదు- భూమి పుట్టకముందునుంచీ ఉన్న సమస్యే! కానీ దాని గురించి మాట్లాడటం, రాయడం ఈ మధ్యనే మొదలయింది.

కిటికీ అవతల నాలుక చాపిన నల్ల తోడేలులా నిశ్శబ్దం అంటూ మొదలయ్యే బ్లాక్ ఇంక్ కథలో, భాషను తళుకు ముక్కల్లా తురిమి గాల్లోకి ఎగరేసే ఓ ఇంగ్లీషు టీచరు గురించి చెపుతూ– ఇవాళ ఏ జ్ఞాపకమూ తాకకపోయినా చేతులనిండా రక్తమంత చిక్కగా నల్ల సిరా అంటూ ఆ టీచరు విషనాగు కాటును గురించి చెప్పి, బయట పక్షుల అరుపులు పిచ్చివాళ్ల అభ్యర్థనలలా ఉన్నాయి’ అంటూ సాగి స్టవ్ నీలి మంటల్లో బ్లాక్ ఇంక్ అక్షరాలు కాలిపోతున్నాయి అన్న స్థైర్యంతో కథ ముగుస్తుంది.

వస్తువు తెలిసినదే అయినా కథనం అపురూపం. కథలోని గాఢత, సాంద్రత, ఆవేదన, రేసీనెస్; ఏ విద్వేష ప్రకటనా లేకుండా, వెగటూ వరపూ కలిగించకుండా విషయాన్ని పరిష్కార దిశకు మళ్లించిన తీరు – సాంత్వన మీద మనం ఆశలు పెట్టుకోవచ్చు. విరివిగా కాకపోయినా అడపాదడపా రాస్తున్నారామె.


మరో యువ కథకులు మానస ఎండ్లూరి. ఇపుడు గ్రామాలకూ అథోవర్గాలకూ మాత్రమే పరిమితమయి పోయిందని అనేకమంది నగరవాసులు భావించే నిమ్నకుల వివక్ష గురించి మానస బొట్టు భోజనాలు (2016) అన్న కథ రాశారు. పట్నాల్లో, నగరాల్లో ఉన్నత విద్యావంతుల్లో దళిత సహోద్యోగుల్ని ఎంతో నైపుణ్యంతో దూరంగా ఉంచేసే ప్రక్రియ ఎలా కొనసాగుతోందో ఒక రింగ్ సైడ్ వ్యూ ఇస్తూ సమర్థవంతంగా చెప్పారామె. గొడ్డ దొంగ, ఊరబావిలాంటి మంచి కథలు రాసిన విద్యాధికులు కొలకలూరి ఇనాక్ సాహితీగళాన్ని మానస అందిపుచ్చుకొన్నారా అనిపిస్తుంది.

నగరాల మధ్య తరగతి జీవితాల గురించి మానస రాస్తోంటే, అట్టడుగు దళిత జీవితాలను ఎమ్‌ఎస్‌కె కృష్ణజ్యోతి అక్షరబద్ధం చేస్తున్నారు. నేను, తోలు మల్లయ్య కొడుకుని (2015) అన్న కథతో పాఠకుల దృష్టిని ఆకర్షించారామె. నిరంతరం శ్రమించినా జీవితపు కనీస సౌకర్యాలు అందని అథోవర్గపు నిమ్న జీవితాల గురించి బలంగా చెప్పారు. అంతకన్నా ముఖ్యంగా, ఉక్కు పోసి గట్టి మందపాటి గోడ కడితే ఎలా బద్దలు కొట్టాలీ? వేడి పెట్టాలి. బాగా ఎక్కువ వేడి పెట్టాలి. ఎంతేడి పెడితే గోడ కరుగుద్దో ఇంత సలిలో! అన్న మౌలికమైన ప్రతిపాదన చేశారు. గమనించవలసిన మరో కొత్త కథకులు కృష్ణజ్యోతి.

తాను మాత్రమే రాయగల విలక్షణమైన కథలు రాస్తోన్న మరో మనిషి మన్నెం సింధు మాధురి. 2009లో కథలు రాయడం మొదలెట్టారు. ఇప్పటిదాకా నలభై కథలు రాశారు. విస్తృతమైన జీవిత అనుభవాలు, నిశితమైన పరిశీలన, సహజ హృదయ స్పందన, సంకోచాలు లేని వ్యక్తీకరణ, భాష మీద పట్టు, మట్టి వాసన- వెరసి సింధు మాధురి.

శ్రీలంక విషాదాల గురించి– ఆ విషాదపు విభిన్న కోణాలను చూపెడుతూ యాళపాళెం గోస (2013) అన్న విలువైన కథ రాశారు. సహజంగా విచ్చుకొనే-వయసు నిమిత్తం లేని- ప్రేమ గురించి హంపీ నేపథ్యంగా 2016లో డేవిడ్ అన్న కథ రాశారు. భేషజాలూ సంకోచాలూ లేని వ్యక్తీకరణ ఆమె ప్రత్యేకత.


కథలు రాయడం మొదలెట్టి చాలాకాలం అయినా ఈమధ్య బాగా గుర్తుంచుకోదగ్గ కథలు రాసిన ఇద్దరి గురించి చెప్పాలి: సాయి బ్రహ్మానందం గొర్తి, ఉణుదుర్తి సుధాకర్.

బతుకు ఆశలతో అక్రమంగా అమెరికా చేరిన మెక్సికన్ల వ్యథాభరిత జీవితాల ఆర్ద్ర చిత్రణ బ్రహ్మానందం రాసిన సరిహద్దు (2011). అమెరికాలోని తెలుగు టీనేజర్ల జీవిత సంక్లిష్టతలను నిశితమైన చూపుతో ఒడిసి పట్టుకొన్న కథ ఐ హేట్ మై లైఫ్ (2014). అంతకన్నా ముందుగా 2009లో ఆయన రాసిన ‘అతడు’ అన్న కథ వచ్చింది. కొన్నేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఇహ ఆ కాపురం పొసగదని గ్రహించి ఎవరికీ చెప్పకుండా అమెరికా నుంచి ఇండియా వెళిపోతోన్న ఓ యువతితో మా ఆయన మంచాడే. కానీ మగాడు! అనిపిస్తారు. ఒకే ఒక్క వాక్యంలో కథాసారమంతా చెప్పడమే కాకుండా అనేక శతాబ్దాలుగా స్త్రీపురుష సంబంధాలలో పేరుకుపోయిన సమతౌల్య లేమిని ధ్వనించిన ప్రతిభ ఆయనది.

‘గతానికి వర్తమానంతోనూ భవిష్యత్తుతోనూ ఉండే సజీవ సంబంధాన్ని గుర్తించాలన్న ఆలోచనతో’ కథలు రాస్తోన్న ఉణుదుర్తి సుధాకర్ 2015లో మూడు కోణాలు అన్న కథ రాశారు. నూటయాభై ఏళ్ల క్రితం గోదావరి అడవుల్లో సర్వే పనులు జరుగుతున్నపుడు ప్రమాదవశాత్తు ఒక అతి సున్నితమైన పరికరం దెబ్బతిని పనులు నిలిచిపోగా ఒక నిరక్షర గిరిజన నిపుణుడు సమర్థవంతంగా దాన్ని మరమ్మత్తు చేసిన వైనాన్ని ఉణుదుర్తి ఈ కథలో ఆసక్తికరంగా, ఆలోచనలు రేకెత్తించేలా చెప్పారు. ఇదే స్థాయి కథలు 2016లోనూ 2017లోనూ రాసి కథా పాఠకులు ఆయన రచనల కోసం ఎదురుచూసేలా చేస్తున్నారు.

మంచి కథలకు మూలాధారం వాస్తవికత. కథలు ఊహల్లోంచి కాకుండా జీవితంలోంచి పుట్టాలి అని సాహిత్యాన్ని సీరియస్‌గా తీసుకొనే వాళ్ల గట్టి నమ్మకం. కానీ పరిపూర్ణ కల్పనలోంచి కూడా మంచి కథలు రావచ్చు అని నమ్మి, వాదించి, ఆ పని చేసి చూపించిన రచయిత అనిల్ ఎస్ రాయల్. ఆయన రాసిన నాగరికథ (2009) ఓ సంచలనం.

సింధు నాగరికత అంతమవడానికి కొత్త కారణం కల్పించి, పాత కారణాలతో దానిని మేళవించి, కాల నాళికలనూ కాల యంత్రాలనూ కథలోనికి జొప్పించి ఆసక్తికరమైన, గుర్తుంచుకోదగ్గ కథను పండించారు అనిల్. అలాగే రీబూట్ (2013) అన్న పరిపూర్ణమైన సైన్స్ ఫిక్షన్ కథలో మనిషి కన్నా రొబొ యంత్రం మరింత ఉదాత్తంగా, విజ్ఞతతో ప్రవర్తించడం చూపించారు. సైన్స్ ఫిక్షన్‌ను యాంత్రిక అద్భుతాలకు బానిసను చెయ్యకుండా అందులో మానవ స్పందనలనూ వేదనలనూ మేళవించి మంచి కథలు కల్పిస్తున్నారాయన.

కథల గురించీ జీవితం గురించీ ఇంకా ఇంకా నేర్చుకోవాలి అన్న ఆరోగ్యకరమైన తపన ఉన్న కొత్త కథకులు శివ సోమయాజుల (యాజి). ప్రవల్లిక నిర్ణయం (2014) అన్న విరివిగా చర్చించబడిన కథలో శివ ఒక ప్రాథమిక జీవన క్లిష్టత గురించి ప్రాక్టికల్‌గా ఆలోచించి చర్చించారు. ఈ కథ పాతికేళ్లనాటి డాక్టర్ వి. చంద్రశేఖరరావు రాసిన జీవనికి మరోవిధమైన కొనసాగింపు. అంతకు ముందటి ఏడు, 2013లో పగడ మల్లెలు అన్న కథను మహా భారత కాలపు నేపథ్యంలో రాసి, కథా సుగంధ పరిమళాలు వెదజల్లి, అందరి దృష్టినీ ఆకర్షించారు యాజి.

‘భీష్మా… నాతో పోరాడు'(2014) అన్న మహాభారత నేపథ్యపు కథ రాసిన రాధిక విషయాన్ని అంబ దృక్కోణం లోంచి ధిక్కారస్వరంతో ఆక్రోశంతో ప్రతిభావంతంగా చెప్పారు. సాహిత్యమూ జీవితమూ అంటే ఆసక్తీ అనురక్తీ ఉన్న అనుభవజ్ఞులైన రాధికలు కథారంగంలోకి రావడం మంచి పరిణామం.

తెలుగు కథకుల్లో చలం, త్రిపుర, చండీదాస్, లతలది అనితరసాధ్యమైన బాణీ. వాళ్లందరి లక్షణాలూ అందిపుచ్చుకున్నారా అనిపించే మోహిత 2015లో ‘తొమ్మిదో నెంబరు చంద్రుడు’ అన్న కథ రాశారు. ‘కలలా కరిగిన జ్ఞాపకాల గురించీ, కథలా కరిగిన జీవితం గురించీ’ స్నేహం-సాహచర్యం-ప్రేమ-నిరాశ-కరగిపోయిన జీవితం-దాని పునర్నిర్మాణం అన్న విషయాల చుట్టూ తిరుగుతుందీ కథ. బాధ్యతతో, ఆరోగ్యకరమైన ఆలోచనలతో, వయసుకు మించిన పరిణతితో, అబ్బురపరచే అభివ్యక్తితో కథ చెప్పారు మోహిత. ఈ కథ చదివాక మోహిత ఇప్పటి యువత ఆలోచనలకు అతిచక్కని ప్రతినిధి అనిపిస్తారు.


తెలుగు సాహితీరంగంలో ఇపుడు టెక్నాలజీ, ఇంటర్నెట్టూ ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. అచ్చులో వచ్చినంత విరివిగా కాకపోయినా ఎన్నెన్నో కథల ప్రచురణకు సైబర్ స్పేస్ వాహిక అవుతోంది. ఈ నేపథ్యంలో అనంత్ చింతలపల్లి అన్న రచయిత 2016లో రాసిన సాయేనా అన్న కథలో డిజిటల్ మీడియంను ఒక భాగం చేసేశారు. వీడియో క్లిప్పింగులు, స్క్రీన్ షాట్లు, ట్వీట్లు కథలో పొందుపరచి ఒక కొత్త బాట పరిచారు. అలా అని దాన్నో తమాషా ప్రయోగంలా కాకుండా కథా వస్తువులోనూ కథనంలోనూ గాఢత నింపడం వల్ల ఇది ఒక ఆలోచించవలసిన ప్రయత్నంగా పరిణమించింది.

వర్తమాన సంఘటనలకు స్పందించి వాటిల్ని సాహిత్యంలో భాగం చెయ్యడం వాల్మీకి కాలంనుంచీ జరుగుతోంది. నిజానికి ఆ పని తెలుగులో జరగవలసినంతగా జరగడంలేదనే చెప్పాలి. తెలుగు సమాజాన్ని ఒక కుదుపు కుదిపిన రోహిత్ వేముల సంఘటనను రికార్డు చేస్తూ సీనియర్ రచయిత అట్టాడ అప్పల్నాయుడు ఎన్నెలో యెన్నెలా కథ రాశారు. అదే విషయం గురించి యువ రచయిత వెంకట్‌సిద్ధారెడ్డి రిసరెక్షన్ (2016) రాశారు. దళిత సమస్య నేపథ్యాన్నీ మూలాలనూ గుణగుణాలనూ అర్థం చేసుకోవడంలోనూ, దాన్ని విశ్లేషించడంలోనూ ఈ కథ పూర్తి విజయం సాధించకపోయినా ఆ సంఘటనను అరుదైన నైపుణ్యంతో కాప్చర్ చేసి, సరికొత్త పద్ధతిలో కథను చెప్పడం రిసరెక్షన్ ప్రత్యేకత. వెంకట్‌ సిద్ధారెడ్డి క్రమం తప్పకుండా కథలు రాయడం సంతోషం కలిగించే విషయం.

కల్పన, కొత్తగూడెం పోరగాడికి ప్రేమలేఖ, మహిత లాంటి కథలు రాసిన సామాన్య తెలుగు కథకు కనబడే ఒక ఆశాకిరణం. ఇప్పటి సామాజిక ధోరణులను మూస రీతిలో నిరసించకుండా, అరుదైన సమదృష్టితో చూసి, వివరిస్తూ లెస్బియన్ల గురించి కప్లెట్ అన్న కథ రాసిన కల్పన రెంటాల మరో ఆశాకిరణం. గ్రామాల్లో విచ్చలవిడిగా తిరిగే ఆబోతును నిర్భంధాల సమాజానికి ప్రతీకగా తీసుకొని, ఆ ఆబోతును లొంగదీసుకోడాన్ని చిత్రిస్తూ చావు దేవర రాసిన రమాసుందరి; సమాజపు గతిని పరిశీలిస్తూ సామాన్య విలువలకు బెదరకుండా తన ఆలోచనలను నిస్సంకోచంగా చెపుతూ, ‘ఒక ఆమె-ఒక అతడు’ లాంటి కథలు రాసిన అపర్ణ తోట; వెంపర వంటి కథ రాసిన రాధిక; నేరుగా గుండెలను తాకే వాంగ్మూలం లాంటి కథలు రాసిన స్వాతికుమారి బండ్లమూడి; లివింగ్ టుగెదర్ అన్న విషయం మీద క్వీన్ అన్న కథ రాసిన నాదెళ్ల అనూరాధ; కార్పొరేట్ విద్యా అవ్యవస్థ గురించి బిస్కెట్ అన్న కథ రాసిన ఆ రంగానికే చెందిన నాగపద్మజ; పశ్చిమాన పెరుగుతోన్న తెలుగు పిల్లలకు శరీరం గురించి కలిగే ఆలోచనల గురించి ‘తూర్పు వాకిట పశ్చిమం’ రాసిన హిమబిందు; మాల్గుడిని గుర్తుకుతెచ్చే బౌండరీ దాటిన బాలు రాసిన మధు పెమ్మరాజు; రైల్వేల నేపథ్యంలో గోదావరి మళ్లీ లేటు రాసి ఘండికోట బ్రహ్మాజీరావును మళ్లీ గుర్తుకు తెచ్చిన దంతుర్తి శర్మ; ఒక మామూలు విషయాన్ని విలక్షణంగా చెపుతూ ఒరాంగుటాన్ రాసిన మెహెర్; వర్ణ మత వ్యవస్థను వ్యంగ్యీకరిస్తూ రంగు రెక్కల పిశాచం రాసిన చందు తులసి; అవుటాఫ్ కవరేజ్ ఏరియా అన్న కథా సంకలనం తీసుకువచ్చిన పసునూరి రవీందర్; తెలుగు సాహిత్యంలో సరికొత్త చైతన్యం, పింగళి చైతన్య (మనసులో వెన్నెల కథా సంపుటి, 2015); అతి నూతన కథాకథన సంవిధానంతో ముందుకు వస్తోన్న పూడూరి రాజిరెడ్డి (చింతకింద మల్లయ్య ముచ్చట – ఇతర కథలు, 2017); కథాజగత్తు మీద తనదైన ముద్రవేస్తోన్న మహి బెజవాడ; సాహిత్యాన్ని సీరియస్‌గా తీసుకొంటూ కథలు రాస్తోన్న సాయిపద్మ; తెలుగు పాఠకులకు అంతగా పరిచయం లేని విమానయాన రంగాన్ని నేపథ్యంగా తీసుకొని కథలు రాస్తోన్న కృష్ణవేణి చారి; చున్నీ లాంటి కథతో నిన్నంటే నిన్న కథారంగ ప్రవేశం చేసిన కరుణాకర్! లోటేం లేదు. కనీసం ఏభై మంది కొత్త కథకులు మనకు కనిపిస్తారు. వస్తువులో నేపథ్యాలలో కథనంలో వ్యక్తీకరణలో భాషలో శైలిలో శిల్పంలో సరికొత్త ప్రయోగాలు చేస్తూ వైవిధ్యం ప్రదర్శిస్తూ మనకు సంతోషమూ ఆశ్చర్యమూ కలిగిస్తున్నారు.


ఈ సందర్భంగా ఒక అసంతృప్తి గురించి చెప్పుకోవాలి.

కొత్త కథకులు, ముఖ్యంగా యువ కథకులు, అధ్యయనం మీద దృష్టి పెట్టవలసినంతగా పెట్టడంలేదు. సామాజిక గతిని శాస్త్రీయంగా అర్థంచేసుకునే ప్రయత్నం చేయడంలేదు. కథారచనలోని ప్రాథమిక సూత్రాలను తెలుసుకోవడంలేదు. ఛందస్సు సర్ప పరిష్వంగంలోంచి బయటపడాలంటే ఛందస్సు క్షుణ్ణంగా తెలియాలి. సమాజాన్ని తెలుసుకోవడానికి సహృదయతా తెలివితేటలూ మాత్రమే చాలవు. ఒక మంచి కథ రాయడం వెనుక వందలాది కథల అధ్యయనం ఉంటుంది అన్నది కొత్త విషయం కాదు.

ముగించే ముందు నాదో మాట – ఈ వ్యాసం సమగ్రం అన్న భ్రమ నాకు లేదు. కొత్త కథకులను ఒక పద్ధతిలో పరిశీలించినపుడు నాకు కలిగిన మహా సంతోషాన్ని పంచుకోవాలన్న కోరికే ఈ వ్యాసానికి మూలం. ఎన్నో విషయాలు చెప్పలేకపోయాను. మరికొంతమంది ముఖ్యమైన కొత్త కథకులను నా పరిజ్ఞాన లేమి వల్ల స్పృశించలేకపోయానని నా ఆరోజ్ఞానం చెపుతోంది. అయినా రాయాలిగదా – రాశాను!

(సెప్టెంబరు 24, 2017న వంగూరి ఫౌండేషన్ సాహితీ సదస్సులో చేసిన సంక్షిప్త ప్రసంగం ఆధారంగా…)