ఎవరో ఒకరు ఎవరో ఒకర్ని పెళ్ళి చేసుకుని పిల్లల్ను బండిలో ఒకళ్ళని బండి పక్కన ఒకళ్ళని పెట్టుకుని బండి తోసుకుంటూ 2% ఆర్గానిక్ పాలు, బ్రెడ్డు, సిరియల్, చిప్స్ పాకెట్లు, పెరుగు డబ్బాలు, అరటి పళ్ళు, క్యాబేజి– వలువలు వలువలు వలువల పతివ్రతో? చలిలో వినియోగదారుల కోసం ఎదురు చూస్తోన్న సుందరీమణులు– టొమాటోస్, లేడీస్ ఫింగర్స్, కాకర్స్?
బండి నింపుకుంటూ ఓహ్, సారీ! మై బండి డాష్‌డ్ యువర్ బండి. ఇట్స్ ఓకే. మీ దేశీ. యూ దేశీ. దేశీ దేశీ డాష్‌డ్. నథింగ్ విల్ హాపెన్. యూ నో? ఫర్వాలేదండీ. భలే వారే.
ఈ తెల్ల తెల్లని నల్ల నల్లని మొహాల వంక బెరుగ్గా చూసుకుంటూ నడుచుకొస్తోన్న ఆంటీ బాత్రూమ్ వెతుక్కొంటోంటే అది అక్కడున్నది ఆంటీ అని తెలుగులో చూపిస్తే అక్కడెక్కడో తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అని ఆవిడ పూర్వీకులు నా పూర్వీకులు అక్కడే అక్కడక్కడే పక్కపక్కనే ఎక్కడో ఇళ్ళు కట్టుకుని అదే కిష్ణా గోదావరీ పెన్నా నీళ్ళు తాగి ఆ భూముల్లో పండిన వరన్నం తిన్నారని అంచేత ఆవిడకీ నాకూ ఏదో తెలుగు బంధం ఉన్నాదని నావంక ఎంతో చాలా ఇదిగా చూసుకుంటూ స్త్రీల శౌచాలయము వైపుకు అడుగులు వేసుకుపోతోంటే అదో మాదిరి ఇంటి బెంగను నామీదికి తోస్తూ లోలోపల ఏదో ఇది.
దేశీలు చింకీలు పెంకీలు పింకీలు వాళ్ళూ వీళ్ళూ అలా అలా ఓర చూపులు చూసుకుంటూ తోసుకుంటూ బండిని భారంగా బరువుగా దిగాలు దిగాలు డస్సిపోయిన తట్టుడి తెరవబడును కళ్ళతో- భారత దేశము నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు except one? వన్నేనా? హిహ్హిహ్హి. One కాదు పోనీ N.
ఆవులు పందులు కోళ్ళు చేపలు తోలు వలిచి సన్నసన్నసన్నగా కొట్టి చక్కా పాకింగ్ చేసి కోడిగుడ్లోపక్క పక్కపక్కన్నే చక్కచక్కచక్కగా పేర్చి, యూ వాంట్ ఆర్గానిక్? హెల్దీ? నాజుకు సుందరి సుతారంగా చలి పెట్టిలోంచి నాలుగు మాంసం పేకెట్లు బండిలో వేసుకుని ఉత్తిన్నే Excuse me అనుకుంటూ పోతా ఉంటే, మేం బ్రామ్మలమండీ మాంసం తినం. సీత మాంసం తిన్నాది తెలుసా? సీత తింటే తిన్నాది కానీండీ నేను మాత్రం తిన్నండీ. ఎగ్గు నాన్ వెజ్జి కాదమ్మా. తినొచ్చు. గుడ్డంటే కోడి పొట్టలోనుంచి వస్తాది కాదండీ? కూరగాయలూ సరుకులూ కొనే దగ్గరలాదగ్గరదగ్గర జరిగి ముద్దుల్? శివ శివా! ఏమి తెలిసి నను మోహిస్తివి. దేహమేలాంటిదని నీవాలోచిస్తివి. అచ్చమైన తోలు తిత్తి. అందునా గుమ్మాలు తొమ్మిది. హేయమైన ఘటము కాయము. ఆయువైనా క్షణము మాయము. నిజమర్మమెరుగక నీలవేణి పొందు కోరితివి. నీలవేణి? నీల్? డయానా? డానీ?
నీలవేణి మధురవాణి మనోరంజని జన రంజని? లోకం రంగుల సంత. అందాలకు వెల ఎంత?
ఆ అచ్చొత్తిన ఓరచూపులా
అవా మరుని తూపులు?
విద్యుత్కాంతులు
చల్లనిరేయి అశాంతులు
ఎరువిచ్చిన శృంగారం
నీ తళతళ మెరిసిన గాజులు
నీ గిల్టు చంద్రహారం?
అణా పూలు, కాణీ తాంబూలం
నలిగిన చీరలు, చీకటి ముసుగులు
ఇదా నీకు జీవితమిచ్చిన బహుమానం?
ఈ సౌందర్య ప్రపంచపుదానం?
నీ బ్రతుకు టద్దమందున
సిగ్గులేక ప్రతిబింబించిన
మానవ జీవితాల బీభత్సం…
అప్పుడెప్పుడో ఆదరాబాదరా హైదరాబాదులో పక్కనున్న పంజాబీ మిత్రుడు కచోరీ నములుతూ అదిగో అదిగో ప్రాస్టిట్యూట్ అని కేక వేస్తే, తళుకు తళుకు చెమ్కీ లంగా ఓణి కట్టుకుని గాడీగా లిప్‌స్టిక్ పూసుకుని ఎత్తు మడమల చెప్పులతో ఆమె ఆటో దిగుతో ఎక్కడికో ఎవరి కోసమో? మా అచేతనపు మనసుల బురద తోడ చేసిన బొమ్మా!
కొనండి. కొనండి. బొమ్మలు. కిచెన్ వేర్. సైకిళ్ళు. దుప్పట్లు. రగ్గులు. బొగ్గులు. డీల్స్! డీల్స్! భలే మంచి చౌక బేరము. ఆలసించిన ఆశాభంగము. మోడల్స్ ఓసారి ఉంచినవి ఇంకోసారి ఉంచరండీ ఇక్కడ. తర్వాత కొనుక్కుందాం అంటే మళ్ళా దొరకవండీ. మాయావిడ ఇదే పని మీదుంటాది. ఎక్కడెక్కడ ఏం డీల్స్ ఉన్నాయా అని. షీ ఈస్ వెరీ ఇంటెల్లిజెంట్ యూ నో?
అందరూ నింపుకోండి. బళ్ళు. పచారీ సామాన్లు కావొద్దూ? ఇండియా, జాపాను, రష్యా, ప్రష్యా, యూరేషియా, అయిరోపా, పోలండు? అందరికీ కావొద్దుటండీ సరుకులు? వెజిటబుల్స్? సోప్స్? చికెన్? సిరియల్? బ్రెడ్ అండ్ బట్టర్? వొద్దూ? వొద్దూ ఆహారము?
మరి అందం? లిప్‌స్టిక్స్, జెల్స్, పౌడర్స్, జెల్లీస్, ఫేస్ వాష్, అండర్ ఆర్మ్స్, అప్పర్ లిప్స్, టోటల్ బోడీ. మరి నిద్రకు? పరుపులు, దిండ్లు, మెమొరీ ఫోమ్.
ఆహారము, నిద్ర, మైథునము. కావాలమ్మా అందరికీ. బుజ్జి తల్లీ బండిలో కూచో నీకో ప్లాస్టీక్ బొమ్మ. అది కళ్ళు మూస్తాది. తెరుస్తాది. నీకెలా కావాలంటే అలా.
గిట గిట నగు నెన్నడుములు పుట పుట నగు గన్నుగవలు పున్నమి నెలతో జిట పొట లాడెడు మొగములన్నీ ఒకదాని వెనకాతల ఒకటి.
డబ్బులు తీయండి. అదేనమ్మా, క్రెడిట్ కార్డు.
Processing…
Please do not remove your card.