తన రేఖలే సమ్మోహనాస్త్రాలు సుమా!

ఆర్టిస్ట్ మోహన్ గీతల గుర్తులు

జ్ఞాపకాలు కవితల్లాగో తీయని కలల్లాగో దుఃఖాంతపు నిర్వేదంలాగో మరెలాగో వుండటం ఒక ‘సంగతి’. కానీ జ్ఞాపకాలు పరిశోధకులకు పనికివచ్చే పాఠాలుగా వుండటం మాత్రం కవిత్వ ప్రయోజనాన్ని మించిన ఆవశ్యకం. మోహన్ గీసిన రేఖలూ క్రోక్విల్ గీతలూ సౌందర్య సమీక్షకు సిసలైన సుబోధకాలు.

ఒక మోహన్ రేఖల గురించి చర్చించే ముందు మన భారతదేశపు ప్రాచీన, మధ్య యుగాల కళ, ఆ మాటకొస్తే మొత్తం ఆసియా దేశాల చిత్రకళ గురించిన ఒకటిరెండు ప్రాథమికాంశాలను జ్ఞాపకం చేసుకుందాం. బొమ్మలో విస్తరించిన రంగుకీ వాడిన రేఖలకీ గొప్ప ప్రత్యేకత మన దేశపు ప్రాచీన మధ్య యుగాల మహిమ. రంగులు లేకున్నా కేవలం రంగురేఖతోనే పూర్తిస్థాయి పెయింటింగ్ లక్ష్యాన్ని సాధించగల అపూర్వమైన సత్తా మనదేశపు మినియేచర్, పటచిత్రకాలది. అంటే చిత్రంలోని సంపూర్ణతకు కొన్ని కీలకమైన రేఖలు చాలన్నట్టు రేఖాచిత్రాన్ని, డ్రాయింగ్‌ని మించి పూర్తి వర్ణచిత్రం మనముందు పరచినట్టే. అదీ రేఖల పనితీరు! చైనా జపాన్ కొరియా వంటి దేశాల మధ్యయుగాల బొమ్మలు చూశారు గదా? అలాగే మన మొగల్, కాంగ్రా, దక్కనీ, బొమ్మల్నీ చూసేవుంటారు గదా? రంగుల లేపనం ఎంత గొప్పగా వుంటుందో అంత వివరంగా, విస్తారంగా ఆ రేఖలు మేము వున్నాం అని చాటుతున్నట్టుంటాయి. వీటినే ఆధునిక కాలపు ‘స్ట్రోక్’లనే ఇంకు రేఖల్లో చూడండి. ఒకే రంగుతోగాని, అసలు రంగే లేని రేఖతో గానీ ఒక పూర్తి పెయింటింగ్ ఇచ్చే వర్ణదృశ్యశక్తి చూపిస్తాయి ఆ రేఖలు. (అంటే గొప్ప చిత్రకారుల బ్రష్ స్ట్రోకుల విషయంలోనే సుమా!)

హోకుసాయ్ (katsushika Hokusai), ఒక బాపూ, ఒక మోహన్‌ల రేఖలు- సన్నటివైనా లావుపాటి వేగంగల స్ట్రోక్‌లు (పెన్ గానీండి బ్రష్ గానీండి) అయినా సరే – అవి నల్ల సిరా రేఖలయినా సరే, అనేక రంగులతో నీడలతో ఇవ్వగల పనితనాన్ని చూపెట్టగలవు. ఇటువంటి ఆయువుపట్టులాంటి కుంచె పనితనం కొన్ని రేఖల్లో చూపెట్టగల పటుత్వం బాపూ, ఆయన్ని అనుకరించేవారినీ మినహాయిస్తే ఇక భిన్నత్వం చూపింది ఒక్క మోహనే. ఇక్కడ సులువుగా మనం కనిపెట్టగల సంగతేమంటే బాపూ, ఆయనకు ముందు చాలామంది పెద్దలయిన తెలుగు చిత్రకారులు వేసిన బొమ్మల్లో రేఖలన్నీ ఒకనాటి సంప్రదాయ శైలికి పదునుపెట్టినవీ కొంత ఆధునిక శైలి చేర్చినవిగానూ వుంటాయి. సాంకేతికంగా పాళీలు, కుంచె విరుపులు, వాడే విదేశీవాళీ కాగితం ఇందుకు సహకరించి పెడతాయి. ఆ విధంగా సంప్రదాయ శైలి అత్యాధునిక వేగానికి, చురుకుగా తీరుగా కనిపించే కోణాలకు అవన్నీ సలక్షణమైన పెయింటింగ్ వంటి రేఖల చిత్రాలు. సరే, మరి మోహన్ సంగతి ఏమిటి? మలుపు తిప్పిన పరిణామక్రమమా ఆయన శైలి?!

ఒక మోహన్ ఇంక్ స్ట్రోక్‌లు, పెన్ గీతలు, క్రోక్విల్ రేఖలు బాపూవంటి పెద్దలకు కొనసాగింపు కావు. వీటి వెనుక చైనా జపాన్ చిత్రకారుల, కామిక్ ఇలస్ట్రేటర్ల ప్రభావం కొంత లేకపోలేదు- ముఖ్యంగా ‘స్పేస్’కి బొమ్మలో ప్రాధాన్యత ఇవ్వటం. అది కార్టూన్ స్టోరీ బోర్డ్ కావచ్చు, కవితలకు చిట్టిపొట్టి బొమ్మలు కావచ్చు, కవర్‌పేజీ డిజైన్ కావచ్చు… వాటిలో మోహన్ కుదిర్చే కాంపోజిషన్, స్పేస్ వదిలే తీరే వేరు. ఆపై సోవియట్ యూనియన్‌గా ఒకనాడు కలిసివున్న దేశాలన్నిటి ఇలస్ట్రేషన్, ఇతరత్రా చిత్రాల్లోనూ వుండే క్లుప్తత, పొదుపు, కోణాలుగా, పలకలు పలకలుగా అమరే మొత్తం స్వరూపం సులువుగా రాబట్టారు మోహన్ తన ఇలస్ట్రేషన్‌లలో. నిజానికి లాత్రెక్ (Henri Lautrec), క్లింట్ (Gustav Klimt), ఎమిల్‌ నాల్డ్ (Emil Nolde) వంటి ఎందరో యూరప్ చిత్రకారులు ప్రభావితం అయింది రష్యా, చైనా, జపాన్ దేశాల చిత్ర కళాఖండాలతోనే. కూర్పు, కుదింపు, సరళత్వం యూరప్‌లో ఆధునిక ఇలస్ట్రేటర్లు దాదాపు అందరూ ఇదే తీరులోకి వచ్చాకా కేరికేచర్, కార్టూన్‌లు వేసే చిత్రకారులూ ఇదే శైలి ప్రభావంలో పడ్డారు. వీటిలో ముఖ్యమైన రష్యన్, సోవియట్ చిత్రకారుల పద్ధతి, పోలిష్ పోస్టర్ల పద్ధతి, ఈ దేశాల జానపద కథల ఇలస్ట్రేటర్ల శైలిని మోహన్ గుడ్డిగా అనుకరించలేదు, అనుసరించలేదు. కేవలం స్ఫూర్తి పొందిన, ప్రభావంలో పడిన ఆసక్తివల్ల తన రేఖల్లో, బొమ్మల్లోని క్లుప్తతలో, స్ట్రోక్‌లలో గొప్ప తేడా చూపెట్టగలిగారు. బాపు, చంద్ర, బాలి, గోపీ వంటి చిత్రకారుల ఇలస్ట్రేషన్లు, కార్టూన్లు, డిజైన్లూ మోహన్ బొమ్మల పక్కన పెట్టి చూడండి… చరిత్ర, ప్రభావం, స్వశక్తిలో వైవిధ్యం, భిన్నత్వం ఇట్టే తెలియకపోదు.

ఒక ఇక్కడ మరో ముఖ్యమైన తేడా మోహన్ బొమ్మలో ప్రత్యక్షం అయ్యేది- ఆధునిక రష్యన్ శిల్పం, సోవియట్ చిత్రకారుల ఇలస్ట్రేషన్లలో గల బరువు, బలం, కదలిక, టూకీగా చైతన్యం. అలాగే ఒక ప్రాథమిక నిర్మాణం వంటి, కట్టడం వంటివి వ్యక్తం చేయగలగటం. కదిలే చెట్ల ఆకులు, ఆడిపాడే కార్మిక, కర్షక స్త్రీ పురుషులు, పిల్లలు, వృద్ధులు, స్త్రీలలో పొడవాటి మెడ, కనుబొమ్మలు, డబుల్ స్ట్రోకులు, డ్రై బ్రష్ స్ట్రోకులు అలాంటి కదలిక చూపెట్టడంలో ఎంత భిన్నత్వం సాధించాయో చూడండి మరి. రేఖలే ప్రధానం, స్పేస్ వాడుక కీలకం అనే ఆసియా చిత్రకారుల సంప్రదాయం, ఆపై సోవియట్ చిత్రకారుల పనితనం, ఆధునికత వెరసి సరికొత్త భాష్యం పలికాయి మోహన్ రేఖలు. ఇవి కూర్చిన కార్టూన్‌లు, ఇలస్ట్రేషన్‌లు, లోగోలు ఒకే శైలిలో కుదుపు చూపెడతాయి. మోహన్ బొమ్మలకి రంగులు ప్రాథమిక అవసరం కాదు, కాలేదు. భిన్నత్వం రేఖల్లోనే పలుకుతుంది. అదీ మోహన్ ప్రత్యేకత. ఇలా ఇంకా సాగాల్సిన పని వదిలి వడివడిగా వెళ్ళిపోయారు మోహన్‌!


తల్లావజ్ఝుల శివాజీ

రచయిత తల్లావజ్ఝుల శివాజీ గురించి: జననం విద్యాభ్యాసం ఒంగోలులో. కళాసాహిత్య విషయాలలో పితామహులు తల్లావజ్ఝుల శివశంకర శాస్త్రిగారి ప్రభావం బాల్యం నుంచీ. బొమ్మలు గీయడం చిన్నప్పటినుంచే స్వయంకృషితో నేర్చుకున్నారు. పాత్రికేయుడిగా ఉద్యోగవిరమణ అనంతరం ఆదివాసీల సంక్షేమం కోసం పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని అడవులలో తిరిగి వారి జీవితాన్ని దగ్గరనుండి పరిశీలించారు. ఆ ప్రకృతి, ఆ జీవనవిధానపు స్వచ్ఛత, సరళత, నిరాడంబరతలు భారతీయ సంస్కృతి, ఇతిహాసాలలో వేళ్ళూనుకున్న వీరి చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. చక్కటి రచయిత, కళావిమర్శకుడు అయిన శివాజీ ఎన్నో చిత్రప్రదర్శనలు చేశారు. ...