నడచివెళ్ళే ఉదయాలు పడమటి వాకిట్లో మంచం వాల్చుకునేవరకూ
కలత నిదుర అంచున పొడిబారిన కళ్ళు వెలుతురును పలవరించేవరకూ
నిలువనీయని గుండెచప్పుళ్ళు ప్రశ్నలై నన్ను నిలేస్తున్నాయి!
ఎప్పుడొచ్చి చేరిందో మనుషుల మధ్య ఈ అక్కరలేనితనం
వెనుక మిగిలిన పాదముద్ర కూడా తనకు నేనేమీ కానంటోంది!
నడకలే నేర్వని బాల్యం తన లోకంలో తానుంటే
యౌవనమంతా ఒంటరి విజయాల వెంట పరుగెడుతోంది!
గెలుచుకున్న కీర్తి పతకాలు అభినందనల కొక్కేనికి వేళ్ళాడుతుంటే,
హత్తుకునే మనిషి కోసం వెతుకులాట గమనిస్తున్నావా నేస్తం?
నా మటుకు నాకు దాపరికమెరుగని కూనిరాగమేదో
మళ్ళీ మనల్ని చుట్టుకుంటున్నట్టే ఉంది!
ఒక అవాస్తవపు ఇరుకుతనమేదో మాయమవుతున్నట్టే ఉంది!
గంభీరముద్రతో కదులుతున్న ఒంటరితనాలు
చిక్కగా కమ్ముకుంటున్న మబ్బుల గుంపులై,
చివరికి ఎప్పుడో, ఎక్కడో నిష్పూచీగా కురిసేందుకు
సమాయత్తమవుతున్నట్టే ఉన్నాయి!
అవి జీవధారలై ప్రవహించే వేళ
ఆ కొండ మలుపులో కాపు కాద్దాం!
ప్రశ్నలు మిగలని సమాధానాల్ని
దోసిళ్ళతో పోగుచేద్దాం!
నెమరేసుకుంటున్న నిస్సారపు క్షణాల్ని
గాలివాటుగా ఎగరేసి
కలిసి నడుద్దాం…
రా!