మూడు దశాబ్దాల క్రితం (1988లో) నేను రాసి, ప్రచురించిన మీరూ జర్నలిస్టు కావచ్చు అప్పట్లో పాఠకుల విశేష ఆదరణను, ప్రశంసలను పొందింది. బహుశా యువతలో జర్నలిజం పట్ల ఆసక్తి, అభిరుచి మారాకు తొడుగుతున్న సమయంలో ఈ పుస్తకం రావడం కూడా అందుకు ఒక కారణం కావచ్చు. ఈ పుస్తకంలో జర్నలిజం మెలకువలను వివరించడంతోపాటు రాంభట్ల కృష్ణమూర్తి, రామోజీరావు, ఎ.బి.కె. ప్రసాద్, కె.ఎన్.వై. పతంజలి, చేకూరి రామారావు, పన్యాల సుబ్రహ్మణ్య భట్టు, కార్టూనిస్టులు తాడి మోహన్, శ్రీధర్ వంటి ప్రముఖుల ఇంటర్‌వ్యూలనూ చేర్చాను. ఈ పుస్తకం చదివి ఆ ప్రేరణతో జర్నలిజం వృత్తిలోకి వచ్చామని చెప్పిన సీనియర్లు ఎందరో. అలా అనేవారితో ‘మీరూ జర్నలిస్టు కాకండి’ అని మరో పుస్తకం రాస్తాను లేండి అని చమత్కరించేవాణ్ణి, ఈ కాలం జర్నలిస్టుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని. ఈ పుస్తకం నా జర్నలిజం జీవితంలో మైలురాయిలా నిలిచింది. ఆ తర్వాత అనేక పుస్తకాల రచనకు శ్రీకారం చుట్టింది. అచ్చయిన కొద్ది కాలానికే ఈ పుస్తకం పునర్ముద్రణకూ వచ్చింది.
ఈ పుస్తకం ఇంతగా పాఠకాదరణ పొందటంలో ఆర్టిస్ట్ మోహన్ కేరికేచర్లు, కవర్ డిజైన్, ఈనాడు శ్రీధర్ కార్టూన్లు కూడా ఎంతో ఉపకరించాయి. ఈ పుస్తకంలో కేరికేచర్లు వేయించుకోవడం కోసమే మోహన్‌ను కలిసి పరిచయం చేసుకున్నాను. అలా మొదలైన మా ఆత్మీయబంధం మారాకులు వేస్తూ కొనసాగింది. ఆ తర్వాత నా పుస్తకాలు చాలావాటికి మోహన్ కవర్ డిజైన్లు, రేఖాచిత్రాలు, కార్టూన్లు గీసి ఇచ్చారు.
అప్పట్లో హిమాయత్‌నగర్ మేడమీద గదిలో మోహన్ ఆఫీసు ఉండేది. కేరికేచర్ల కోసం చాలా రోజులు తిరిగాను. ఇక ఆయనతో ఇంటర్‌వ్యూ సంగతి సరేసరి. మొత్తానికి ఇంటర్‌వ్యూ చేయగలిగాను. ఇంటర్‌వ్యూ రాసి చూపించాను. ఎక్కడా ఏ మార్పులు సూచించలేదు. సంతృప్తిగానే ఉన్నట్లు కనిపించారు. ఇక ఇంటర్‌వ్యూను కంపోజ్ చేయిస్తున్న దశలో, ఒక్కసారి ఆ కాపీ ఇలా ఇవ్వండి, అంటూ అడిగి తీసుకున్నారు. యోగముద్ర దాల్చి ఇంటర్‌వ్యూలో చెప్పిన విషయాలను రివైజ్ చేసి రాసిచ్చారు. (ఆ ఇంటర్‌వ్యూ దిగువున ఇచ్చాను.) ఆమధ్య వరకూ మోహన్ చేతిరాత కాపీని భద్రపరిచాను. ఆ కాపీ ఉండి ఉంటే ఎంత బావుండేది అని ఇప్పుడు అనిపిస్తోంది. మోహన్ మామూలు చేతిరాత ఎలా ఉండేదో చెప్పటానికి అదో మంచి రికార్డ్ అయ్యేది. మోహన్ తన ఇంటర్‌వ్యూ విషయంలో ఇంత శ్రద్ధ తీసుకోవడం వల్లనే దానికో ప్రత్యేక స్థానం దక్కింది. మోహన్ నేపథ్యాన్ని, కృషిని కొంతమేరకైనా అంచనా వేయటానికి దోహదపడగలిగింది.
ఇన్నేళ్ళ మిత్రత్వంలో మోహన్‌తో ఎన్నో జ్ఞాపకాలు, అనుభవాలు. జెన్ కథల కవర్ పేజీ కోసమని వెళితే ఆ కథలు తనకు బాగా నచ్చి లోపల ప్రతి పేజీకి బొమ్మలు వేసిపెడతానని చెప్పి వేసి ఇచ్చారు. ‘మీరు బొమ్మలు వేస్తారు సరే, బొమ్మకు హీనపక్షం 50 రూపాయలు చొప్పున లెక్కగట్టినా మీ బొమ్మలకు 5 వేల రూపాయలైనా ఇవ్వాల్సి ఉంటుంది. అంత డబ్బు నేనిచ్చుకోలేను’ అని నిస్సహాయత వ్యక్తం చేస్తే- ‘మిమ్మల్ని డబ్బులెవరు అడిగారు? నా ఆనందం కోసం నేను వేస్తాను. మీరు ఉపయోగించుకోండి’ అన్నారు. అలా మోహన్ పెద్దమనసుతో, అభిరుచితో వేసి ఇచ్చిన బొమ్మలతో జెన్ కథల పుస్తకం చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత వీటిల్లో కొన్ని డిజైన్లను మరో రంగుల కేలండర్‌లోనూ ఉపయోగించారు.
డబ్బు ధ్యాసే లేదు ఆయనకు. మోహన్ కవర్ డిజైన్ చేసినా, బొమ్మలు గీసినా, మరింకే ఆర్ట్ వర్క్ చేసినా ఎవరినీ ఇంత ఇవ్వాలనిగానీ అంత ఇస్తేగానీ ఆ పని చేయననిగానీ అనేవారు కాదు. ఫలానా పార్టీవారని, వీరని పలురకాల కారణాలు, మొహమాటాలతో చాలామందికి ఉచిత సేవలు చేస్తూనే వచ్చారు.
మోహన్ ఎన్నడూ తన అసంతృప్తినీ అసహనాన్నీ వ్యక్తం చేసేవాడు కాదు. కోపం అనేదే బహుశ తెలీదేమో అనిపిస్తుంది. తనకు మరీ నచ్చకుంటే సున్నితంగా ఆ విషయాన్ని చెప్పేవాడేగానీ ఆవేశకావేషాలకు, కోపతాపాలకు లోనయ్యేవాడు కాదు. బొమ్మలు, కవర్ డిజైన్ల విషయంలో ఎదుటివారి సూచనలు సలహాలు ఇస్తే బావున్నాయనుకుంటే వాటిని స్వీకరించేవాడు. అంతేగానీ తన మాటే నెగ్గాలని కానీ, తనకు ఇతరులు సలహా ఇచ్చేపాటివారా అనే అహంకారం కానీ ఉండేది కాదు. ఒకసారి మోహన్‌ను కలిసినపుడు ఇలా అన్నారు: ‘మీ ఆర్థిక స్థితి నాకు తెలుసు. పుష్కలంగా డబ్బు ఉండి మీరు పుస్తకాలు వేయడం లేదనీ తెలుసు. కానీ కవర్ డిజైన్‌కు వేయి రూపాయలు ఇచ్చి వెళ్తుంటారు. మొన్న ఇద్దరు పెద్దమనుషులు వచ్చారు నా దగ్గరకు. వాళ్ళకు సమాజంలో పెద్ద హోదా, డబ్బు ఉన్నాయి. వారడిగితే రెండు పుస్తకాలకు కవర్లు చేసిచ్చాను. రెంటికీ కలిపి పన్నెండు వందలు చేతిలో పెట్టారు. ఇస్తే వేయి ఇవ్వాలి. లేదంటే రెండువేలు ఇవ్వాలి. ఈ పన్నెండు వందలేమిటో నాకు బోధపడలేదండీ!’ పరోక్షంగానైనా మోహన్ అసంతృప్తిని వ్యక్తం చేసే తీరు ఇది. అంత సున్నితంగా ఉంటారు.
మోహన్ మంచి హాస్యప్రియుడు. తన చుట్టూ చేరే వివిధ వృత్తుల, నేపథ్యాల, మిత్రుల సంభాషణలను బాగా ఎంజాయ్ చేసేవారు. తల ఎత్తకుండా బొమ్మలు వేసుకుంటూనే ముసిముసిగా నవ్వేవారు. ఒక్కోసారి తానే జోక్ కట్‌చేసేవారు. ప్రసిద్ధ జర్నలిస్టు వి. వాసుదేవ దీక్షితులుతో జరిపిన ఇంటర్‌వ్యూ విశేషాలను మోహన్‌తో పంచుకున్నాను. ‘నన్ను కన్నమ్మ గోదారమ్మ. పెంచినమ్మ కృష్ణమ్మ. ఈ రెండు నదులూ నా శరీరంలో రక్తం రూపంలో ప్రవహిస్తున్నాయి- అని దీక్షితులు చెప్పారు మోహన్!’ అన్నాను. దానిపై వెంటనే స్పందిస్తూ- ‘మరి మూసీ మాటేమిటట?’ అంటూ కౌంటర్ వేశారు. తరచి చూస్తే ఆ చమత్కారం వెనక నిగూఢ అర్థాలు దాగి ఉన్నాయి. మోహన్ ఇలా కామెంట్ చేశాడని దీక్షితులుగారితోనే అంటే ఆయనా సంతోషంగా స్వీకరించడం కొసమెరుపు. దటీజ్ మోహన్!
మోహన్ దగ్గర ఓపిగ్గా కూచోవాలేగానీ చర్చకు రాని విషయమంటూ ఉండేది కాదు. శ్రోతను బట్టి వడ్డించే మెనూ మారుతుందంతే. ఒక్కోసారి మూడ్ వస్తే తన అనుభవాల దొంతర్లను పరిచేవారు. సి. రాఘవాచారి, ఎ.బి.కె. ప్రసాద్ వంటివారితో తన అనుభవాలను, వారి కృషిని పంచుకునేవారు. రాఘవాచారిగారి గురించి ‘పాత్రికేయ కృషి’ శీర్షికతో సాక్షి దినపత్రికలో ప్రొఫైల్ రాశాను. రాఘవాచారిగారి గురించి మాటల సందర్భంలో మోహన్ చెప్పిన కబుర్లు ఈ ప్రొఫైల్ రాయటానికి ఎంతో పనికొచ్చాయి. మోహన్ చెప్పిన విశేషాలతోనే ప్రొఫైల్ మొదలుపెట్టాను.
మోహన్ రాముడైతే ఆయన తమ్ముడు ప్రకాశ్ లక్ష్మణుడు. ఈనాడులో ప్రకాశ్ నా బాచ్‌మేట్ కూడా. మోహన్‌కు ఏ వేళకు ఏది కావాలో అన్నీ దగ్గరుండి ప్రకాశ్ కనిపెట్టుకుని చూసుకునేవాడు. ఆ మధ్య ప్రకాశ్ ఫోను చేసి, ‘మోహన్, నేనూ మీ ఇంటికి రవాలనుకుంటున్నాము. ఎడ్రస్ చెప్పండి…’ అని అడిగాడు. ‘మోహన్‌కు శ్రమ ఇవ్వడం దేనికి? నేనే వచ్చి కలుస్తాను. ఏమిటి విశేషం?’ అన్నాను. ‘మోహన్ రచనలు, బొమ్మలు అన్నింటినీ పుస్తకాల రూపంలో తెస్తున్నాం. మీరొకసారి మోహన్‌తో ఆత్మకథ రాయమని చెప్పారు. దాన్ని మీరే మీడియా హౌస్ పబ్లికేషన్స్ తరఫున ప్రచురిస్తానని కూడా అన్నారు. మీరొకసారి మోహన్‌కు గట్టిగా చెప్తే ఆత్మకథ రాస్తాడు.’ అని ప్రకాశ్ అన్నాడు. సరే, నేనే వచ్చి కలుస్తా అన్నాను. నేను ఖాళీ చూసుకుని ఫోను చేస్తాను. ఆరోజు వద్దురు గానీ, అన్నాడు ప్రకాశ్. ఆ రోజు రానే లేదు. మోహన్‌ను కలవనూ లేదు. ఆత్మకథను రాయాల్సిందేనని పట్టుబట్టే అవకాశమూ చిక్కలేదు.
అద్దాలపెట్టెలో శాశ్వత నిద్రలో ఉన్న మోహన్‌ను హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో చూడాల్సి వచ్చింది. పొత్తూరి వెంకటేశ్వరరావు, వి. వాసుదేవ దీక్షితులు, కల్లూరి భాస్కరంతో కలిసి వెళ్ళి మోహన్‌కు నివాళులు అర్పించి వచ్చాను. మోహన్‌లాంటి కళాకారులు బహుశా ముందుతరాల్లో దొరకరేమో! కళాకారులే కాదు, మోహన్‌లాంటి మనుషులు కూడా.
జీవితంలో మోహన్ గుండెకు చాలా గాయాలయ్యాయి. ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. గరళ కంఠుడిలా వాటినన్నిటినీ దిగమింగుకుని విరాగిలా నింపాదిగా, నిండుగా బతికాడు. తన వ్యక్తిగత బాధలెలా ఉన్నా తన దగ్గరకు వచ్చేవారందరినీ మిత్రవాత్సల్యంతో సమానంగా చూస్తూ ఆపేక్షలు, ఆప్యాయతలు పంచారు. వాటిలో గాఢమైన ఆలోచనలు, రేఖలు. వాటి దారిలో ముందుకు నడచినవారెందరో.
మోహన్‌లాంటి వ్యక్తితో పరిచయం మరపురాని మధురానుభూతి. అది ఎప్పటికీ తరగని కిక్కు.
చక్రధర్
29/09/2017
తెలుగు కూపంలో ఇమడలేని మోహనుడు
కొందరికి కొన్ని అపురూప అవకాశాలు చిన్ననాటే అంది వస్తాయి. పథ నిర్దేశం చేస్తాయి. నీ గమ్యం ఇదీ అని చూపి సాగమంటాయి. అటువంటివారికి ఇటా అటా అనే మీమాంస, తడబాట్లు ఉండవు. ఈ అరుదైన ఆవకాశాన్ని చిన్ననాటే అందిపుచ్చుకున్నవాడు మోహన్. కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టి పెరగడం, ఒక ఆలోచనల పునాదిపై వ్యక్తిత్వాన్ని మలచుకోవడమే. సిద్ధాంతం ఏదైనా ఒక సిద్ధాంతం ఆసరాగా జీవితాన్ని, ప్రపంచాన్ని పరికించే విషయంలో వ్యక్తమయ్యే ప్రత్యేకత వేరు. ఆ ప్రత్యేకత మోహన్‌కు వెన్నతో పెట్టిన విద్య.
అతను ప్రస్తుతం సాధన చేస్తున్న రంగంలోనే కాదు. ప్రపంచ పరిణామాలన్నిటిపైనా స్పష్టమైన అవగాహన, ఆలోచన ఉన్నవాడు. ఏ భేషజాలు లేనివాడు. స్వీయ లోపాలు సైతం వెల్లడించటానికి సంశయించనివాడు. మోహన్ 1951లో ఏలూరులో జన్మించాడు. తండ్రి కమ్యూనిస్ట్ నాయకుడు. ఆయన పేరు తాడి అప్పలస్వామి. కమ్యూనిస్ట్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు మోహన్ ఇంటికొచ్చేవారు. చర్చలు జరిపేవారు. ఉపన్యాసాలు చేసేవారు. మోహన్ లేతబుర్రకి అవి అర్థం అయ్యీ అవనట్లుండేవి. ఆ వాసన మాత్రం గుబాళించేది. అయిదేళ్ళ ప్రాయానికే జైలు అనుభవాలు వినే అవకాశం మోహన్‌కి కల్గింది.
అయిదో ఏటే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు మోహన్. సుత్తి కొడవలి ముగ్గుల్ని మోహన్ చేత పెట్టించి ప్రతిగా చాక్లెట్లు ఇచ్చేవారు. ఇలా మోహన్‌లో కళాకారుడు ఊపిరి పోసుకున్నాడు. అతని జీవిత ప్రధాన వ్యాసంగానికి, వ్యావృత్తికి అలా అయిదో ఏటే బీజం పడ్డది. ఆ రోజుల్లో ఏలూరు రాజకీయంగా చైతన్యం కల్గిన ప్రాంతం. వలస వచ్చిన అల్యూమినియం, బీడీ కార్మికులు ఒక పక్క, మహామహులైన సాహితీమూర్తులు మరో పక్క. చలం, కొనకళ్ళ, బుచ్చిబాబు వగైరా సాహితీమూర్తులు, జగ్గయ్య, కన్నాంబ వంటి కళాకారులు ఏలూరుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. వీరితో ప్రత్యక్ష పరిచయం అయ్యే వయసు మోహన్‌కు లేదు. అయినా కళాసీమ ప్రభావం మోహన్ వ్యక్తిత్వంపై బలీయంగానే పడ్డది. తండ్రి పలురకాల మాగజైన్లను, పుస్తకాలను తెప్పించేవాడు. ఆయనే మోహన్‌కు మార్క్సిజంలో తొలి పాఠాలు నేర్పాడు. భారత భాగవతాలను సైతం తండ్రి కూర్చోబెట్టి చెప్పేవాడు. చలం వంటి రచయితల రచనలను చదవడానికి మోహన్‌కు అక్క ఆలంబన అయింది.
ఇంటికి వచ్చే పలురకాల మాగజైన్స్ చూడటం వాటిలోని బొమ్మల్ని మనసులో ముద్రించుకోవడం, తండ్రితో కలిసి జిల్లా గ్రంథాలయ సంస్థకు వెళ్ళి పుస్తకాలు చదవడం, అంతర్జాతీయ వార్తలపై ప్రత్యేక ఆసక్తి అనురక్తి పెంచుకోవడం, జ్యోతి మంత్లీ, ఆంధ్రప్రభ వారపత్రికల్లో బాపు బొమ్మల్ని పత్యేక శ్రద్ధతో వీక్షించడం, ఇలా కళాకారుడిగా మోహన్ వ్యక్తిత్వం రూపురేఖలు దిద్దుకున్నాయి.
కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయాక తండ్రి మార్క్సిస్ట్ పార్టీ వైపు మొగ్గు చూపగా మోహన్ సి.పి.ఐ.కే అంకితమయ్యారు. పార్టీ పరంగా తండ్రీబిడ్డల మధ్య వైరుధ్యాలు, వైమనస్యాలు చోటుచేసుకున్నాయి. ఏడాదిపాటు తండ్రీబిడ్డలు మాటలకు దూరంగా ఉన్నారు. 1981లో పశ్చిమ బెంగాల్లో నిర్వహించే ప్రదర్శనలో పాల్గొనేందుకు మోహన్ కలకత్తా వెళ్ళారు. అక్కడ అరెస్ట్ అయి ఆ తర్వాత విడుదలయ్యారు. విడుదలై కూడా కలకత్తాలోనే గడిపారు. హైస్కూలు దశలోనే కొన్ని పుస్తకాలకు టైటిల్స్ వేసిన ఘనత మోహన్‌ది. వెల్చేరు నారాయణరావు గ్రాఫిక్ ఆర్ట్‌ను మోహన్‌కు పరిచయం చేశారు. శంకర్స్ వీక్లీ కార్టూన్లపై ఆసక్తిని పెంచింది. పార్టీ పరమైన శిక్షణ కోసం మోహన్ ఢిల్లీ వెళ్ళారు. దేవీ చట్టోపాధ్యాయ, మొహిత్ సేన్, నిఖిల్ చక్రవర్తి, డాంగే, సర్దేశాయి వంటి ఉద్దండులు వివిధ శాస్త్రాల్లో మోహన్‌కు గట్టి పునాదులు వేశారు. ఢిల్లీలో ఉన్నపుడు కొత్త తరహా పుస్తకాలెన్నో ఆయన దృష్టికి వచ్చాయి. ఢిల్లీ తన జీవితంలో మంచి మార్పునకు దోహదపడిందంటారు మోహన్.
1970లో విశాలాంధ్ర దినపత్రికలో సబ్ఎడిటర్‌గా చేరి 79 వరకు ఆ పనిలోనే కొనసాగారు మోహన్. ఆ ఉద్యోగం మానేసి మూడేళ్ళు ఖాళీగా ఉన్నారు. 1982లో ఆంధ్రప్రభ డైలీలో కాంట్రాక్టు పద్ధతిపై కార్టూన్లు వేయనారంభించారు. ఉదయం ప్రవేశంతో అందులో చేరాడాయన.
మోహన్‌ని అర్థం చేసుకోవడానికి, ఆయన వ్వకిత్వాన్ని ఆకళింపు చేసుకోడానికి సంక్షిప్తంగా ప్రస్తావించిన ఆయన జీవనగమనం చాలావరకు దోహదపడుతుంది.
మోహన్ ఎక్కడుంటే అక్కడ సందడి. ఎప్పడూ ముగ్గురు నల్గురు స్నేహితులు చుట్టివుంటారు. మీతో ఇంటర్వ్యూ కావాలంటూ మోహన్ దగ్గరకు వెళ్ళినపుడు ప్రశ్నలేమిటో చెప్పండన్నారు. అవి విన్నారు. ‘ఓ పనిచేయండి, ఆ ప్రశ్నల కాగితం ఇచ్చి వెళ్ళండి. జవాబులు రాసిచ్చేస్తాను.’ అన్నారాయన.
మీరు సమాధానాలు రాసిస్తే లైవ్‌లీనెస్ ఉండదన్నాను. రాసిచ్చాక మీరు మళ్ళీ అడగచ్చు అన్నారు. పశ్నలు ఇచ్చా, ఆయన సమాధానాలు రాసివ్వలేదు. ఇలా కాదని చెప్పి ఉదయం పత్రిక ఆఫీసులోనే కొంత ఇంటర్‌వ్యూ సాగించాను. మోహన్ కోసం ఎవరో రావడంతో దానికి బ్రేకు పడ్డది. మళ్ళీ ఒక రోజు మోహన్ ఇంటికి వెళ్ళి ఇంటర్‌వ్యూ పూర్తి చేద్దామన్నాను.
‘ఓ రెండు గంటలు మిమ్మల్ని కిడ్నాప్ చేస్తాను!’ అని చెప్పి ఆయనను మా ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టాను. మా ఇంటికొచ్చి కూర్చున్న మోహన్ టైము చూసుకోకుండానే మూడు నాలుగు గంటలు గడిపారు. అడిగిన పశ్నలన్నింటికి వివరంగా సమాధానమిచ్చారు. ఇక మోహన్ ఇంటర్వ్యూ చదవండి.
కార్టూనిస్ట్‌కి రాజకీయ నిబద్ధత అవసరమా? అదెంతవరకూ ఉపయోగపడుతుంది?
రాజకీయాల మీద కామెంట్ చెయ్యాలంటే ముందు అవేంటో తెలిసుండాలని చెప్పక్కర్లేదు గదా. రాజకీయాలంటే వర్గసంబంధాలేనంటారు. కార్టూన్ అనేది ఎవర్నో ఒకర్ని జిందాబాద్ అనో డౌన్ డౌన్ అనో అనాలి. అపుడు ఎవర్ని అనాలి? ఎందుకనాలి? అనేది తెలిసి ఉంటే చెప్పే విషయం స్పష్టంగా ఉంటుంది. కనక స్పష్టమైన ప్రపంచ దృక్పథం – అంటే కమిట్‌మెంట్ అనేది కూడా ఉండి తీరుతుంది. నిష్పాక్షికులు, నిబద్ధతలేని స్వేచ్ఛా కళాకారుడంటూ ఎవడూ ఉండడు. తెలిసో తెలీకో అందరూ ఆటో ఇటో కమిట్‌మెంట్ ఉన్నవాళ్ళే.
పత్రిక పాలసీకి, కార్టూనిస్ట్ నిబద్ధతకూ మధ్య ఘర్షణ తలెత్తితే?
జీతం పుచ్చుకునే కిరాయివాడిగా కార్టూనిస్టు ఉన్నంత కాలం ఈ గొడవ వుంటూనే ఉంటుంది. రాజుగారి కొలువులోని ఒకనాటి శిల్పులు, యూరప్ చర్చిల్లో ఐకన్స్, ఫ్రెస్కోలు చేసిన చిత్రకారులందరిపైనా మతపరమైన ఆంక్షలో, ప్రభుత్వం హుకుమో ఉంటూనే ఉంది. స్వేచ్ఛ మనకెవడూ తెచ్చివ్వడు. పోరాడి గెలుచుకోవాలి. ఒకరోజు స్పార్టకస్ లాగా ఓడిపోతాం. మరో రోజు చే గువేరా లాగా గెలుస్తాం. డైలీ పేపర్లో ఈ రక్తపాతం దినదిన గండం. ఇందులో నూరేళ్ళాయుష్షుతో ఉండటం కూడా కార్టూన్‌తో ప్రమేయం లేని అరవై అయిదో కళ. రినైసాన్స్ కాలం నుండి ఇప్పటివరకూ ఆర్టిస్టులంతా ఈ చివరి కళని మాస్టర్ చేయడానికి కుస్తీ పడుతూనే ఉన్నారు. దీనికి మించి మరో గండం ఉంది. అది పాఠకుల స్థాయి. టీ కొట్లో కూచుని ఎన్టీఆర్, చిరంజీవి, రాజీవ్, శ్రీదేవి అందరి అదృష్టాన్ని బేరీజు వేసేవాళ్ళుంటారు. బెర్లిన్‌లో మిసిలీల గురించీ, బొలీవియాలో కొత్త కూ గురించీ మాట్లాడేవాళ్ళు ఉంటారు. వాంటెడ్ కాలమ్ నుండి స్పోర్ట్స్ పేజీ వరకూ రకరకాల జనం. వీళ్ళంతా అన్ని వార్తలూ వ్యాసాలూ చదవకపోయినా కార్టూన్ దగ్గర ఓ క్షణం ఆగుతారు.
ఆ క్షణంలోనే వాళ్ళందరికీ తెలిసిన వార్త మీద, వాళ్ళందరికీ అర్థమయ్యే సింబల్స్‌తో టకామని ఏదో ఒకటి చెప్పేయాలి. సంపాదకీయాల్లోలా ఉపన్యాసం మొదలెడితే వినరు. ఆ క్షణంలోనే పాఠకుడు ఎంతో కొంత సరదాగా నవ్వుకోవాలి. అది లేకపోతే నా మొహంచూసి ‘ఎక్కిలాయిలే’ అని నవ్వుతారు. (బోల్లుసార్లు అలా జరుగుతూంటుంది. అయినా సరే సిగ్గులేకుండా మళ్ళీ కార్టూన్లు వేయడమే ఉత్తమం. అందువల్ల పత్రికాధిపతి మనకు డబ్బులిస్తాడు. ఎంచక్కా ఖర్చు పెట్టుకోవచ్చు) అసలు సంగతి- అప్పడప్పడూ, అనేకసార్లూ చౌకబారు, నేలబారు కార్టూన్లు వేస్తాం, అలాంటివి చూసి నవ్వే వాళ్ళుండక పోతారా అని ఆశ. అప్పుడప్పుడూ తలా తోకా అర్థంకాని ‘కంగాళీ అవకతవక’ కార్టూన్ గీస్తా. మొదటి దానికి కమర్షియల్ ఫిలిం అనీ, రెండో దానికి ఆర్ట్ ఫిలిం అనీ పేరు పెట్టుకుని మురిసిపోతుంటా. చాలాసార్లు పాత ఐడియాకే మసిపూసి తిరగేసి వేస్తాం. అలాంటి అక్రమాన్ని కూడా అద్బుతం అని పొగిడే అమాయకులు తగిలినపుడు ఎంతో ఆనందం వల్ల బాధ వేస్తుంది. ఒక్కోసారి నా చాతకానితనం నాకే బాగా తెలిసిపోయినపుడు ‘పాఠకులు సన్నాసులు’ అని రహస్యంగా నాలో నేనే తిట్టుకుని హేపీగా ఫీలవుతా. చాలా కాలం ఈ పూలూ రాళ్ళూ అందుకున్నాక కొంత ముదిరి, ఐహికమైన రియాక్షన్‌లకు అతీతంగా ఆనందోబ్రహ్మ అనే ముదురు స్టేట్‌లోకి వెళ్తాం. అప్పడు తిట్లూ పొగడ్తలన్నిటినీ మార్లిన్ బ్రాండోలాగా ఉడెన్ ఫేస్‌తో వినే దళసరి చర్మపు చెవులు మొలుస్తాయి.
నిబద్ధత వల్ల నిష్పాక్షికత లోపించే ప్రమాదం ఉందా?
బొత్తిగా లేదు. కమిట్‌మెంట్ డిక్షనరీలో పాక్షికత అంటే నిష్పాక్షికత అని అర్థం. నిబద్ధత అంటే ఒక పార్టీ తాత్కాలిక ఎత్తుగడలకూ కొంతమంది నాయకుల ప్రవర్తనకూ పరిమితం కానిది. చుట్టూ ఉన్న సొసైటీ, మనుషులూ నడిచే పద్ధతి గురించి ఒక అవగాహన ఉండడమే. అలా ఉంటే ఈ పాక్షికత గొప్ప ఆబ్జెక్టివిటీతో మెరుస్తుంది.
బాపూని కార్టూనిస్ట్‌గా గుర్తిస్తారా?
బాపూ సూపర్ కార్టూనిస్ట్. మన తెలుగుదేశం ఈ మూడు దశాబ్దాల్లో ప్రొడ్యూస్ చేసిన అరుదైన ఆర్టిస్టు. (ఆయన పొలిటికల్ కార్టూనిస్టు కానందుకు ఏ బెంగా లేదు.) మన తెలుగుతనాన్నీ జీవితాన్నీ ప్రవంచానికి చూపడానికి సాధికారమైన డాక్యుమెంట్లు బాపూ ఇలస్ట్రేషన్లు. మన జానపద కళలు అన్ని రంగాల్లో దిక్కుమాలిన చావు చస్తుంటే ఆయన బొమ్మల్లో వాటిని సజీవంగా ఇంకా ఉంచాడు. పశ్చిమ యూరప్ కళనీ ఓరియంటల్ ఆర్ట్‌నీ ఆయన ఆర్థం చేసుకున్నంతగా ఎవరూ చేసుకోలేదు. ఈరోజు నా కార్టూన్లు అడపాదడపా బావున్నాయంటే అర్థం నేను బాపూ బకాయిదారుణ్ణనే. అరవయ్యో దశకంలో బాపూ దండయాత్రలకి పత్రికలన్నీ పేజీలు పరిచాయి. ఆ తర్వాత మా తరం లోంచి మరో పదిమంది బాపూలు పుట్టాల్సింది. ఇరవయ్యేళ్ళు గడచినా ఎందుకో అలా జరగలేదు. 70, 80వ దశకాల్లో కొన్ని బాపూ జిరాక్స్ సెంటర్స్ వెలిసి, తర్వాత తుఫాన్‌లలో వెలసిపోయాయి. ఈనాటి కొత్త కార్టూనిస్టులకు చాలామందికి కొంటె బొమ్మల బాపూ పుస్తకం తప్ప ఆయన ఇలస్ట్రేషన్లు, కవర్ డిజైన్లు తెలీవు. కార్టూన్ వెయ్యడమెలా అని తంటాలు పడేవాళ్ళంతా అమెరికన్ మాడ్ మాగజైన్లు ముందేసుకుని జుట్టు పీక్కుంటున్నారు. తెలుగుతనం (లేదా మన నేషనల్ ఆర్ట్) తెగనరకబడే కాలం తోసుకొచ్చేస్తోంది. పత్రికల ఆవసరాలు మరీ కృత్రిమంగా, చౌకబారుగా మారుతున్నాయి. ఆర్టిస్టులు వాటి తోక పట్టుకుని మునగడానికి పోతున్నారు. ఇది డేంజర్. ఇది ట్రాజడీ. ఇది మన పేదరికం. కనీసం నలుగురు బాపూలని అర్జెంటుగా పుట్టించాలని ఆ దేవుడికి మొక్కుతున్నా. విని ఛస్తాడా?
అసలు ఎందుకొచ్చిందీ దారిద్ర్యం?
చెప్తున్నా గదా, డజనుమంది బాపూలు పుట్టి ఉండాల్సింది. బాపూ అని పేరు చెప్తే, పాపం పాతకాలం వాడు పాత తరహా బొమ్మలు, ఈ నాటి వెరైటీ అప్పుడెక్కడా, అని ముసలాణ్ణి చూసి జాలిపడే పరిస్థితి ఉండాల్సింది. అలా లేకపోగా మాలాంటి కుక్క పిందెల వారసులం పుట్టాం. ఇప్పడున్న కార్టూనిస్టులు చాలమంది ఇలస్ట్రేషన్లలో, జానపద శైలిలో పోస్టర్ తరహా ఐడియా ప్రెజెంట్ చేయడంలో బొత్తిగా ప్రవేశం లేని వాళ్ళు, ఆర్టు ఆల్బములూ కళావిమర్శ గ్రంథాలూ ఎక్కువగా దొరకని వాళ్ళు. గీత గీయటంలో, ఐడియా మెరుపులో ఏమాత్రం మిషనరీ జీల్ గానీ క్రుసేడింగ్ స్పిరిట్ గానీ లేనివాళ్ళు. వీళ్ళంతా నిరుపేదలు, గర్భదరిద్రులు. మా బొమ్మలన్నీ ఒక దగ్గర పెట్టి ఈ పేదరికాన్ని ఫొటో తీసి చూపిస్తా.
మీకు బద్దకం జాస్తి అనే విమర్శ ఉంది?
బద్దకం నిజమే. పనిచేస్తా. అదీ నిజమే. ఏం చేయాలి, దేనికి ప్రయూరిటీ ఇవ్వాలి, అనేదే డైలమా. ‘ఫలానా రోజున ఫలానా కార్టూన్ వేశావు గాబట్టి ఈరోజు కూడా అది చెయ్’ అని ప్రెషర్ వస్తుంది. ఆ రోజు అలా కార్టూన్ గీయటం సరదా వల్ల చేసి ఉంటాను. ఇవాళ మరోటి ఎందుకు? ‘అసలు రోజూ కార్టూన్ గీయటం నాకు పడదు’ అని చెప్పాలనుకుంటా, కానీ చెప్పను. ‘నేనెప్పడూ అంతే. కార్టూన్లు వేసి పేల్చేస్తుంటా’ అని కోతలు కోసి మళ్ళీ మళ్ళీ అవే, అలాంటివే వేసి కార్టూనిస్టుగా చెలామణీ ఆవుతుంటా (ఇందువల్ల డబ్బులొస్తాయి తెల్సా?) కానీ ఇలా వేషాలు వేసినందువల్ల అలసట వస్తుంది. విసుగూ డిజప్పాయింట్‌మెంట్ వరసగా నడిచొస్తాయి. మళ్ళీ మళ్ళీ ఈ చిల్లర పనే చేయాలా? అనిపించినపుడు చేయం. దాని పేరు బద్దకం, తీరా బొమ్మ వేశాక ప్రశంస వస్తుంది. అందంగా నవ్వుతాం. ఎందుకొచ్చిన గొడవ అనుకుంటాం. దాని పేరు పరాజయం.
మీ కార్టూన్లలో ద్యోతకమయ్యే ఆలోచనా గాఢతకి కారణాలు?
జ: బాబోయ్ థాట్ డెప్త్ అంటే నాకేం సంబంధం లేనిది. చిన్నపుడు అకారణంగా బొమ్మలేశాను. ఇపుడు జీతం రాళ్ళు పారేస్తున్నారు గనక వేస్తున్నాను. చిల్లర డబ్బులు తడుముకునే నేల క్లాసు పాపరుగాణ్ణి గనక పెద్ద పెద్ద వాళ్ళంటే కడుపమంటా, వాళ్ళ వైభవం చూసి కళ్ళలో నిప్పులు పోసుకోటం లాంటివి సహజంగా నాకుంటాయి. బొమ్మలే వేయగలను గనకా మరో పని చాతకాదు గనకా ఆ బొమ్మల్లో చిన్న చిన్న సరదాలు తీర్చుకుంటా. బొమ్మ గీస్తున్నపుడు ఆ సరదా బుర్ర నిండా ఆవరించుకుంటుంది. అపుడు డబ్బులూ ఈతిబాధలూ గుర్తురావు. అదో గణాచారి పూనకం స్టేట్. ఆ రకంగా ఎవర్నన్నా వ్వెవ్వెవ్వె అని వెక్కిరించి నా సరదా తీర్చుకున్నందువల్ల మీకు సరదా కలిగితే నాకెంతో సరదా.
మీరు గీసిన కార్టూన్లలో మీకు బాగా నచ్చిన కార్టూన్?
అలా అమాంతంగా చెప్పలేను. వివాదాస్పదమైనవి చాలా ఉన్నాయి. అందువల్ల మంచి కార్టూన్ కంటే అవి గుర్తుంటాయి.
ఆంధ్రప్రభలో పనిచేసేటపుడు ఎడిటర్ ఎ.బి.కె. పీకల మీదకొచ్చే కార్టూన్లు బోల్డు వేశాను. ఆయన నన్ను ఉదారంగా వదిలేసేవాడు. చాలాసార్లు నన్ను ఉద్యోగం నుండి పీకెయ్యాలని పైనుండి తాఖీదులొస్తే నెత్తీనోరూ బాదుకుని ఫోన్లు చేసి నన్ను రక్షించాడు కూడా. భద్రాచలంలో ఒకమ్మాయిని కానిస్టేబుల్ రేప్ చేస్తే, రామలక్ష్మణుల ప్రక్కనున్న సీతమ్మవారికి కానిస్టేబుల్ కన్నుకొట్టే కార్టూన్ వేశా. మర్నాడు గొడవ. హిందూ సెంటిమెంట్ హర్టు అవుతుందని, దేవుళ్ళని అవమానించానని. ఎ.బి.కె. అందరికీ సర్దిచెప్పుకోవాల్సి వచ్చింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎడ్వర్‌టైజ్‌మెంట్‌ని పారడీ చేస్తూ ‘గుడ్డుకోసమా మీ బెంగ? గుల్ల చేస్తాడులే మా దొంగ!’ అని కార్టూన్ గీసినపుడు వయొలెంట్ రియాక్షన్. అది కోర్టు కేసు కూడా అవబోయి ఆగిందట. బ్రెజ్నెవ్ చనిపోయినపుడు కొంపలు మునిగిపోయినట్లు శాంతి పావురం బావురుమంటూ ఏడుస్తున్న కార్టూన్ వేస్తే న్యూస్ ఎడిటర్ పార్థసారథిగారు ఇన్‌స్పైర్ అయి క్రింద కవిత్వం వెలగబెట్టారు. పైన ‘కామ్రేడ్ బ్రెజ్నెవ్ కన్నుమూత’ అని తాటికాయలంత ఆక్షరాలతో బానర్ పెట్టారు. ఈ పాపం అంతా ఆరోజు మద్రాసులో ఉన్న ఎ.బి.కె.గారి పీకకి చుట్టుకుంది. దేవీప్రియ రన్నింగ్ కామెంట్రీ ఉన్నంతకాలం చిల్లరమల్లర కోతివేషాలతో కాలం గడిచింది. ప్రభ నుండి ఉదయంలోకెళ్ళేముందు ఆఖరి కామెంటరీకి మటుకు చార్లీ చాప్లిన్ సినిమాల్లో చివరి సీనులాంటి బొమ్మ గీశా. అది అచ్చయిపోయింది. మర్నాడు అమాయకంగా ఆఫీసుకొస్తే ఎడిటర్ పొత్తూరి వెంకటేశ్వరరావుగారు కొట్టబోయినంత పనిచేశారు. అది గుర్తొచ్చినప్పడల్లా పశ్చాత్తాపం ముంచుకొస్తుంది.
ఉదయంలో ఒకసారి నాదెండ్ల భాస్కరరావుని మూర్ఛరోగిగా వేసి మెడలో రాగిబిళ్ళ మీద అడ్డమైన వాక్యాలూ రాశాను. మర్నాడు ఓ అరడజను భారీ విగ్రహాలు (మాంఛి ఊపులో) ఎ.బి.కె. ఛాంబర్లోకి దూసుకొచ్చారు. కాస్త అటూ ఇటైతే కొట్టడం గూడా జరిగుండేది. యాభై ఆరోసారి ఏ.బి.కె.గారికి గండం తెచ్చాను. అప్పటికే నాదెండ్ల మీద మరింత డేమేజింగ్‌గా వేసిన ఇంకో కార్టూన్‌ని హడావుడిగా పేజీలనుండి పీకేశాం. ఒకసారి అసెంబ్లీ మొదలయే ముందు కర్జెన్ రైజర్ లాంటి రన్నింగ్ కామెంటరీ దేవీప్రియ రాశాడు. దానికి పది నిముషాల్లో టకటకా బొమ్మ గీసి దర్జాగా ఇంటికిపోయా. మర్నాడు ఆఫీసుకొస్తే అసెంబ్లీలో గొడవ, హక్కుల తీర్మానం గురించి చెప్పారు. ఎడిటర్ ఆమోదం లేకుండా కార్టూన్ ఎందుకు పంపావని ఎ.బి.కె. మెమో. (ఇలాంటి మెమోలు ఉదయంలో కనీసం పాతిక వచ్చాయి. కార్టూన్ గీసినందుకు సంజాయిషీ నోటీసులు ఇన్ని అందుకున్న ఏకైక వీరుణ్ణి నేనే!) మళ్ళీ నన్ను డిఫెండ్ చేస్తూ ఎ.బి.కె. పెద్ద ఎడిటోరియల్ రాశాడు. విచారణ తదితరాలన్నీ జరిగాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి.
ఒక అంశం మీద కార్టూన్ వేయాలని కూర్చుంటారా? లేక మెరుపులా ఆలోచన వస్తే కార్టూన్ రూపమిస్తారా?
రెండు రకాలూ ఉంటాయి. మీరు ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నపుడు ఉండుండి ఒక జోక్ ఢాంమ్మని పేల్చేస్తారు. అందరూ పగలబడి నవ్వేస్తారు. ఒక్కోసారి అవతలి మాటకి జవాబు చెప్పలేక తడుముకుని తంటాలు పడతారు. ఇదీ అంతే. విజువల్ లాంగ్వేజ్‌లోకి అనువాదం చేయటంలో కార్టూనిస్టుకున్న అదనపు పని, ఎడ్వాంటేజి కూడా.
కార్టూనిస్టుల మధ్య పోటీ ఉంటుందా?
పోటీ ఖాయంగా ఉంటుంది. కానీ ఎందుకో ఇపుడు లేదు. దాదాపు అందరం చచ్చు కాట్రూన్లే వేస్తున్నాం గనుక ఫర్వాలేదులే, చల్తాహై అని అందరికీ ధీమా వచ్చేస్తోంది. కనక పోటీ బాదరబందీ లేదు.
కార్టూనిస్ట్‌గా మీ సాధన ఎలాంటిది?
సాధన అంటూ పత్యేకంగా ఏం లేదు. గీయగా గీయగా ఒక బెటర్ ప్రజంటేషన్‌కి సెటిల్ అయిపోతాం. వేయగా వేయగా వికారపు కేరికేచర్‌క్కూడా జనం సెటిల్ అవుతారు.
రాజకీయాలు, తెలుగు సాహిత్యం గురించి చెప్పండి?
రాజకీయాలు, తెలుగు సాహిత్యం గురించి మీరడిగిన దానికి పెద్ద పెద్ద లెక్చర్లు దంచచ్చు. ‘మరీ బడాయి పోదురూ’ అని మీరే అంటారు. నన్ను ప్రభావితం చేసిన రచనల గురించి అడిగారు. రచనల కంటే ఒక కాలం గురించి చెప్తా. అది నా కంటే, నా కార్టూన్ల కంటే గొప్పది. కొంచెం చాదస్తంగా చెప్తా, భరించండి. అది అరవయ్యో దశకం. నేను టీనేజర్ని, పిల్ల విద్యార్థి నాయకుణ్ణి ప్లస్ కార్యకర్తని. అప్పడందరూ వియత్నాం గురించి మాట్లాడేవారు. రాజ్‌కపూర్ పాటలు, వడ్డాది పాపయ్య, బాపూ బొమ్మలు రాజ్యం చేసేవి. శ్రీశ్రీ మహాప్రస్థానం చిన్న బైబిల్. కమ్యూనిస్టులు చీలిపోయి ‘భారత విప్లవ పంథా ఎటు?’ అంటూ రోజుకో కరపత్రం వేసేవాళ్ళు. జ్యోతి వీక్లీ, మంత్లీ కథల్ని బొమ్మల్ని మోసుకొచ్చేవి. లుముంబా, చే గువేరా, మార్టిన్ లూథర్ కింగ్‌ల హత్యలు, ఇండో-చైనా తుపాకి కాల్పులు ఇంటి పక్కన జరుగుతున్నట్టే వినిపించేవి. 1968లో వియత్నాంలో టెట్ అఫెన్సివ్ (కొత్త సంవత్సరం దాడి) మొదలయింది. రోజూ కూలిపోయే అమెరికా విమానాల్ని లెక్కపెట్టేవాళ్ళం. చిన్న మురికి పేటల్లో యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు, ఎవ్వరికీ అర్థంగాని సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదాలూ ఇచ్చేవాళ్ళం. యూరప్‌లో కుర్రకారంతా ఎర్రజెండాలు పట్టుకున్నారు. పారిస్‌లో విప్లవం బద్దలయింది. అమెరికాకి అగ్గి అంటుకుంది. మనదేశంలో కాంగ్రెస్ ఒకేసారి ఏడెనిమిది రాష్ట్రాల్లో ఓడిపోయింది. నేను కృష్ణశాస్త్రి కవితలకీ బొలీవియన్ జంగిల్ వార్‌కీ టెట్ అఫెన్సివ్‌కీ బాపూ చిత్తప్రసాద్ బొమ్మలకీ పుట్టిన బిడ్డని. బయాఫ్రాలో చనిపోయిన బిడ్డల ఏడుపు నుంచీ మా పేటలో జూట్ కార్మికుల మురికి బ్రతుకులనుంచీ జామిని రాయ్, లాత్రెక్, ఇల్యా రెపిన్ పెయింటింగ్‌ల నుండీ పుట్టాను. అరవయ్యో దశకం తెచ్చిన నెత్తురూ కన్నీళ్ళూ విప్లవ కేకలు నావెంటే ఉంటాయి.
మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది?
నా డైలీ రొటీన్ అల్లకల్లోలం. ఏ గాలి వీస్తే అటు పోవటం, సాయంత్రానికి ఆఫీసుకి చేరి రన్నింగ్ కామెంటరీ తీసుకోడం. కాకుల్లాగా గోల చేసే రిపోర్టర్ల బ్యూరో మధ్యలో కూచుని గీయటం. ఈ మధ్యలోనే మా ఎంప్లాయిస్ రోజువారీ ఉద్యోగ బాధల్తో వస్తారు. (నేను ఉదయం ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్‌ని కూడా. ఉన్న బాధలు చాలక అదనంగా ఇదో యాతన) అప్పడప్పడు యూనియన్ వాళ్ళందరం కలిసి పర్సనల్ డిపార్టుమెంటు మీదికో, దాసరి నారాయణరావు మీదికో యుద్ధానికి వెళతాం. చాలాసార్లు చైర్మన్‌గారికి (ఉదయంలో వాళ్ళంతా చైర్మన్ అనీ సినిమా వాళ్ళంతా డైరెక్టరు గారనీ ఆయన్ని పిలుస్తుంటారు. డబుల్ రోల్!) కోపం వస్తుంది. ఇవన్నీ గొంతెమ్మ కోరికలంటారు. కాదంటాం, ఔనంటారు. ఒక్కోసారి తెగుతుంది. మరోసారి ముడిపడుతుంది. కొన్ని విజయాలతో ఉత్సాహంగా వస్తాం. కొన్ని స్వర్గాలతో వెర్రి మొహాలు వేసుకుని తిరిగొస్తాం. జయాపజయములు దైవాధీనములు. గెలిచినా ఓడినా ఆరోజు కార్టూన్ ఎగ్గొట్టటం మాత్రం నా అధీనంలోనే జరుగుతోంది. ఇలాంటివీ ఇంకా ఇతర వ్యాపకాలతో ఎక్కువగా కార్టూన్ వేయడం మానేస్తుంటాను. కార్టూన్‌కి ఎగనామం పెట్టేబదులు ఉద్యోగానికి యూనియన్‌కి ఎగనామం పెట్టి ఒక హాలులో కూచుని కృష్ణా రామా అనుకుంటూ బొమ్మలు గీద్దామని ఉంది. కొంతకాలానికి అలాగే చేస్తా.
భవిష్యత్ కార్యకమం, లక్ష్యాలు?
భవిష్యత్ కార్యక్రమం అంటూ ఖచ్చితంగా ఏం లేదు. బొమ్మలు గీయడమే. అవి కార్టూన్లు కానక్కరలేదు. పోస్టర్లు, ఈజిల్ పెయింటింగ్స్ ఏదన్నా కావచ్చు. పదేళ్ళ క్రితం అనామకంగా మరణించిన గొప్ప ఆర్టిస్టు చిత్తప్రసాద్ పేరిట చిన్న సంఘం పెడుతున్నా. చిత్రాల్లో యూరప్ వినాశకర ప్రభావాన్ని తట్టుకోడానికీ భారతీయతనీ మన తెలుగుతనాన్నీ చూపించడానికీ పదిమంది కలిసి పనిచేస్తే అదే పది వేలు అనుకుంటున్నాం. ఇది అతివాద భావాలున్న ఆర్టిస్టుల కేంద్రం కావాలని ఆశ. చిత్తప్రసాద్ చిత్రాలు చాలా సేకరించాం. వాటిని ఆల్బమ్‌గా కూడా వెలుగులోకి తీసుకొచ్చాం. తెలంగాణా సాయుధ పోరాట చరిత్ర చిత్రాలు పుస్తకంగా వేసే పథకం ఉంది. ఇంతకాలం నేను వేసిన బొమ్మల్లో ఏవీ పుస్తకంగా రాకుండా ఉంటానికి అన్ని జాగ్రతలూ చేసుకున్నా. ఇంతకంటే సంఘానికి నేను ఒరగబెట్టేదేముంది?