మారిషస్ దేశంలో ద్వితీయ భాషగా తెలుగు – అన్యభాషల ప్రభావం

ముందుమాట

మారిషస్ (Mauritius) ఒక బహుభాషీయ దేశం. దాదాపు 12 లక్షల కన్న ఎక్కువ జనాభావున్న 720 చదరపు మైళ్ళ విస్తీర్ణం గల ఈ చిన్న ద్వీపంలో మారిషియన్ క్రియోల్, ఆంగ్లం, ఫ్రెంచ్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, ఉర్దూ, భోజ్‍పురి, గుజరాతీ, మాండరిన్, అరబ్బీ మొదలైన పన్నెండు భాషలు వాడుకలో ఉండటం మారిషస్ దేశంలోని బహుభాషీయతకు నిదర్శనం[1]. ఈ ద్వీపాన్ని క్రమంగా డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్‌వారు ఆక్రమించి పరిపాలించారు. 1968వ సంవత్సరంలో మారిషస్ దేశానికి స్వాతంత్ర్యం లభించాక, 1992వ సంవత్సరంలో గణతంత్రదేశంగా రూపొందింది. రొడ్రీగస్ (Rodrigues), ఆగలెగా (Agaléga), సెంట్ బ్రాండొ (St. Brandon) వంటి ద్వీపాలతో కూడి రెయిన్‌బో ఐలండ్‌గా పేరుపొందిన మారిషస్ బహు భాషలకు, బహు మతాలకు నిలయమైంది. డచ్ నించి ఫ్రెంచ్ పరిపాలనకు, చివరికి బ్రిటిష్ పరిపాలన కిందకూ రావటం వల్ల 19వ శతాబ్ది మధ్యకాలం నించి 20వ శతాబ్దం ప్రారంభకాలం వరకు ఇక్కడ భాషల మధ్య four-part harmony అనేది ఏర్పడింది[2]. ఇక్కడ వ్యవహారంలోనున్న పన్నెండు భాషలను – ప్రాచీన భాషలు (ancestral languages) ఉదా: భారతీయ, చీనీ; వలసభాషలు (colonial languages) ఉదా: ఆంగ్లం, ఫ్రెంచ్; దైనందిన వ్యవహార భాషలు (vernacular languages) ఉదా: సంకీర్ణ మారిషియన్ భాష అయిన మారిషియన్ క్రియోల్ – మూడు ముఖ్యమైన గుంపులుగా విభజించవచ్చు. నేడు ఈ భాషలు దేశంలోని వివిధ మతాల అస్తిత్వ చిహ్నాలుగా మాత్రమే చూడబడుతున్నాయి[1].

బహుభాషీయ దేశమైన మారిషస్‌లో యూరోపియన్ భాషల అభ్యసనానికి మాత్రమే కాక, భోజ్‌పురి, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, ఉర్దూ వంటి భారతీయ భాషలను అభ్యసించటానికి అవకాశముంది. బహుభాషీయ ప్రాంతంలోనున్న భాషలు ఒక దాన్ని ఒకటి ప్రభావితం చేస్తాయనేది యథార్థం[3]. ఇటీవల కాలంలో కేవలం ప్రాథమిక విద్యా ప్రణాళికలో మారిషియన్ క్రియోల్ ప్రవేశం మీదనే ఎక్కువ పరిశోధనలు చేయబడుతున్నాయి[4]. మారిషస్‍లో తెలుగు భాషా బోధన, తెలుగు భాషా సంస్కృతులు మొదలైన అంశాలపై పరిశోధనలు జరిగినా, ఇక్కడి బహుభాషీయ వాతావరణం తెలుగు భాషా ప్రయోగాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నదనే అంశాన్ని ఎవరూ పరిశీలించలేదు.

ఉపన్యాసకురాలిగా ప్రస్తుతం నేను డిప్లొమా, బి.ఎ., ప్రాథమిక పాఠశాలలలో తెలుగు భాషోపాధ్యాయ శిక్షణ (primary teachers training), పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఇన్ ఎడ్యుకేషన్ (PGCE) మొదలైన కోర్సులు చేస్తున్న విద్యార్థులకు తెలుగు భాషా సాహిత్యాలలోని ప్రాచీన ఆధునిక కవిత్వాలు, వచనం వంటి అంశాలను నేర్పిస్తున్నాను. మాధ్యమిక స్థాయిలో నేను గడిపిన సంవత్సరాల్లో, ద్వితీయ భాషగా తెలుగు భాషనభ్యసించే విద్యార్థులు తెలుగు భాషలో తమ భావాలను మౌఖికంగా గాని, లిఖిత రూపంగా గాని సరిగ్గా వ్యక్తం చేయలేకపోతున్నారని గమనించాను. ప్రాథమిక స్థాయిలో తొలి తరగతినుంచి తెలుగు భాషను అభ్యసించినవారు, విశ్వవిద్యాలయంలో బి.ఎ. స్థాయిలో తెలుగు భాష నేర్చుకొంటున్న విద్యార్థులు కూడా ఈ సమస్యలే ఎదుర్కొంటున్నారని కూడా గమనించాను. మారిషస్ వంటి బహు భాషా సమాజంలోనున్న వివిధ భాషలు తెలుగు భాషను (మౌఖిక, లిఖిత రూపాలలో) ప్రభావితం చేస్తున్నాయి. ఈ ప్రభావం వల్ల విద్యార్థులు ధ్వని (phonetic), శబ్ద (lexical), వ్యాకరణ (grammatical) స్థాయిలలో దోషాలు చేస్తున్నందువల్ల, వాక్యార్థాలు దెబ్బతింటున్నాయి[5]. ఈ విధంగానే ఇక్కడి తెలుగు భాషా వ్యవహర్తల భాషణంలో మాత్రమే కాకుండా, లేఖనంలో కూడా ఇటువంటి తప్పులు సంభవిస్తాయి.

ప్రస్తుత నిదర్శనాధ్యయనం (Case Study) మారిషస్ దేశపు బహుభాషీయ వాతావరణంలో తెలుగు భాష ద్వితీయ భాషగాగల వ్యవహర్తలను దృష్టిలో ఉంచుకొని చేయబడింది. తెలుగు భాషా వ్యవహర్తల నించే యథార్థ సమాచారం లభిస్తుందని భావించటంవల్ల, ముఖ్యంగా ప్రాథమిక, మాధ్యమిక, విశ్వవిద్యాలయ స్థాయిల్లో ద్వితీయ భాషగా తెలుగు భాషనభ్యసిస్తున్న విద్యార్థులను వ్యవహర్తలుగా ఎన్నుకోవటం జరిగింది. కాబట్టి ఈ నిదర్శనాధ్యయనం మారిషస్ దేశంలో ఉన్న బహుభాషీయ వాతావరణానికి, ఇక్కడ తెలుగు భాషను ద్వితీయ భాషగా అభ్యసించినవాళ్ళకు మాత్రమే పరిమితమైంది.

మారిషస్ దేశంలో ద్వితీయ భాషగా తెలుగు భాషనభ్యసించే వాళ్ళ భాషణంలోగాని, లేఖనంలోగాని ఇతర భాషల ప్రభావాన్ని విశ్లేషించటమనేది ఈ పరిశోధన ఉద్దేశ్యాలలో ఒకటి. ఇంతేకాకుండా మూల భాష అంతరణాలను (interferences) పరిశీలించాక, తెలుగు భాషాభ్యాసనాన్ని సులభపరచటానికి అనుకూలమైన వ్యూహాలను ప్రస్తావించటం కూడా ఈ పరిశోధనోద్దేశ్యమే. కాబట్టి ద్వితీయ భాషగా తెలుగు భాషనభ్యసించే విద్యార్థుల భాషణ, లేఖనాలను మెరుగుపరచటానికి ఈ పరిశోధన తోడ్పడుతుంది. తెలుగు భాష మీద మారిషియన్ క్రియోల్, ఆంగ్లం, హిందీ, హిందుస్తానీ మొదలైన భాషల ప్రభావాన్ని నిశితంగా విశ్లేషించి, విద్యార్థుల భాషా నైపుణ్యాలను పెంపొందించటానికి, ఇతర భాషల ప్రభావాన్ని తగ్గించటానికి ఈ పరిశోధన ద్వారా ప్రయత్నిస్తాను.

ఇతర భాషల ప్రభావంవల్ల ఏర్పడే దోషాలను గుర్తించి, విశ్లేషించటం తెలుగు భాషను అభ్యసించేవారికిగాని, బోధించేవారికిగాని ఒక విలువైన అభ్యసనోపకరణంగా పనికి వస్తుంది. భాషా అంతరణంవల్ల ఏర్పడే దోషాలేవో అని విద్యార్థులు తెలుసుకుంటే, ఆ జ్ఞానమే అటువంటి దోషాల శిలాజీకరణం (fossilization of errors) ఏర్పడకుండా చేయవచ్చుననీ; తత్ఫలితంగా అభ్యసనంలో విద్యార్థులను స్వతంత్రులు కావించటానికి ఉపాధ్యాయులకు కావలసిన పనిముట్లు అందిస్తుందని సోమర్స్ (Sommers 1982) అనే భాషావేత్త అభిప్రాయం[6]. అందువల్ల మారిషస్ దేశంలో ద్వితీయ భాషగా తెలుగు భాషా బోధన అభ్యసనాలను పెంపొందించటానికి కొత్త కొత్త వాదనలను ప్రస్తావించటం ద్వారా ఈ చర్చ ద్వితీయ భాషాభ్యసన పరిశోధనకు తోడ్పడేలా చేయటానికి సాధ్యమైనంతవరకు కృషి చేస్తాను. ఈ వ్యాసపు ఉద్దేశ్యాలు క్లుప్తంగా:

  1. మారిషస్ దేశంలో ద్వితీయ భాషగా తెలుగు భాషా అభ్యసనంలో విద్యార్థులు ఎదుర్కొనే ఆటంకాలేమిటి?
  2. తెలుగు భాషలో తమ భావాలను మౌఖికంగాగాని, లిఖిత రూపంలోగాని వ్యక్తం చేయటానికి తెలుగు భాషా వ్యవహర్తలు ఇబ్బందులు ఎదుర్కోటానికి కారణాలేవి?
  3. భాషా సంపర్కంవల్ల ఏర్పడే దోషాలేవని తెలుసుకొనటం; తెలుగు భాషా వ్యవహర్తలు చేసే తప్పులను విశ్లేషించి, అవి భాషా అంతరణం (language interference) వల్ల ఏర్పడతాయో లేవో అని పరిశీలించటం.
  4. తెలుగు భాషా ప్రయోగంలో భాషా సంపర్కంవల్ల ఏర్పడే భాషా అంతరణాన్ని నిర్మూలించటానికిగాని, తగ్గించటానికిగాని ఏయే వ్యూహాలను అమలులోకి పెట్టవచ్చునో పరిశీలించటం.

మారిషస్ దేశంలో తెలుగువారి చరిత్ర

మారిషస్ దేశంలో తెలుగువారి గురించి పరిశోధన చేసే ముందు, భారతదేశంనించి ఇక్కడకు వచ్చి స్థిరపడిన వలసదారుల చరిత్రను గురించి తెలుసుకోవటం అవసరం. 2011 జనాభా లెక్కల ప్రకారం (Ministry of finance and economic development) మారిషస్ దేశంలో తెలుగువారి సంఖ్య 27,787 మాత్రమే. 2002 జనాభా లెక్కలను పోల్చి చూస్తే (29,792) తెలుగువారి సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నదని తెలుస్తుంది. తెలుగువారికి తక్కువ మంది పిల్లలు ఉండటం, కొంత మంది తెలుగువారు క్రైస్తవ మతాన్ని అవలంబించటం, జనాభా లెక్కల ప్రక్రియ జరిపే అధికారులు వారి జాతిని (ethnicity) గురించి అడిగితే, వ్యవహర్తలు తెలుగు బదులుగా హిందూ అనటం– దీనికి ముఖ్యమైన కారణాలుగా పేర్కొనవచ్చు.

బ్రిటిషుల పాలనకాలంలోని 1820 నుండి 1830 సంవత్సరాల మధ్యకాలంలోనే భారత దేశంనించి ప్రవాసులు మారిషస్ దేశానికి రావటం మొదలుపెట్టారు. 1834 నించి 1910వ సంవత్సరం వరకు ప్రవాస భారతీయులు బెంగాల్, మద్రాసు, బొంబాయి రాజ్యాలనించి వచ్చారు. 1842వ సంవత్సరంనించి ముఖ్యంగా కొలొంబొ, కొచిన్, పాండిచ్చేరి, మద్రాసు, కలకత్తా మొదలైన ప్రాంతాల రైతులు మారిషస్‌కు వలస వచ్చారు. ఏజంట్ల ద్వారా దక్షిణ భారతదేశంనించి తమిళవారు, తెలుగువారు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఆంధ్ర, హైదరాబాదు ప్రాంతాలనించి వచ్చిన తెలుగువారు (5.6%) ముఖ్యంగా రాజమండ్రి, విశాఖపట్నం, గంజాం, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాలనుండి, మరికొంతమంది శ్రీకాకుళం, మచిలీపట్నం, మొదలైన ప్రాంతాల నించి వచ్చారని మహాత్మా గాంధీ సంస్థ (MGI) లోని ఇమిగ్రేషన్ ఆధారాలను (Indian Immigration Archives) బట్టి తెలుస్తుంది[7]. చాలా మంది కాకినాడ, కోరంగీ ఓడరేవులనించి రావటంవల్ల ఇక్కడి తెలుగువాళ్ళను ‘కోరంగీలు’ అని; వారి భాషను ‘కోరంగీ భాష’ అని; వారి పండగలను ‘కోరంగీ పండగలు’ అనీ వ్యవహరించేవారు. కాని కొన్ని తరాల తర్వాత కోరంగీ అనే పదం అవమానార్థకంగా వాడబడింది. ఇక్కడకు వచ్చిన తెలుగువారు ‘కోరింగలు, జెంటూలు, తెలింగలు, కలింగలు’ మొదలైన పేర్లతో నమోదు చేయబడ్డారు[8].

అయితే 1834 నించి 1870 మధ్యకాలంలో భారత దేశంలోని ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమస్యలవల్ల చాలా మంది తెలుగువారు తమ మాతృభూమిని వదిలి కూలీలుగా ఇక్కడ వచ్చారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. భారతదేశంనించి వచ్చిన తెలుగువారు తమ భాషా సంస్కృతులను, ఆచార వ్యవహారాలను భద్రపరచటానికి అన్ని విధాలా ప్రయత్నించేవారు. ఆ కాలంలో వారు ఎన్నో కష్టాలు అనుభవించినా, చిన్న చిన్న గుడిసెలలో ఉండి, తమ గ్రామ దేవతలను, ఇలవేల్పులను ఆరాధిస్తూ, తమ మతాన్ని అనుసరించారు. మారిషస్ దేశంలోని తెలుగువారి చరిత్రను పరిశీలిస్తే మొదటి తరంవారు దినమంతా చెరకు పొలాల్లో పని చేశాక, ఇసుక మీద రాస్తూ తమ పిల్లలకు తెలుగు అక్షరాలు నేర్పించేవాళ్ళని తెలుస్తుంది. ఆ కాలంనించే తెలుగువారు తమ భాషను కాపాడటానికి, పెంపొందించటానికి అన్ని విధాలా ప్రయత్నం చేసేవాళ్ళని కూడా తెలుస్తుంది. అయితే ఈ రైతులకు వ్యాకరణం తెలియకపోయినా, తమ పిల్లలకు పాటలు, నాటకాల ద్వారా తెలుగు నేర్పించేవారు. భాష పట్ల మమకారంతో భజనలు, రామదాసు కీర్తనలు, నాటకాలు, శ్లోకాలు, నృసింహ శతకం మొదలైనవాటి ద్వారా తెలుగు భాషాసంస్కృతులను భావితరాలకు అందించారు[8]. ఆ నాటికి తెలుగు గ్రంథాలు లేకపోవటంవల్ల, తెలుగు భాషా ప్రచారం చేయటానికి కొంత మంది పండితులు రామాయణ, భారత, భాగవతాది కథలను మాత్రమే కాకుండా, సొంతంగా కథలు, భక్తి పాటలు సృష్టించి బోధించేవారు[9]. ఈ విధంగా ఆ కాలంనించి ఇప్పటివరకు ఇక్కడి తెలుగువారు తమ భాషా సంస్కృతులను, ఆచార వ్యవహారాలను భద్రపరచటానికి అన్ని విధాలా కృషి చేస్తున్నారు.

అప్పటినించి ఇప్పటి వరకు మారిషస్ దేశంలో తెలుగు భాషా స్థితిగతులు మెరుగైనా, ఈ ఆధునిక కాలంలో కొత్త సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పవలసి వుంది. ప్రస్తుత కాలానికి చెందిన తెలుగువాళ్ళకు తెలుగు భాష మాతృభాష కాకపోయినా, వారిలో చాలా మంది దీన్ని ద్వితీయ భాషగా నేర్చుకొనటం జరుగుతున్నది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశించేసరికి ఆంగ్లం, ఫ్రెంచి వంటి భాషలతో పాటు, తాము ఇష్టపడిన భారతీయ భాషల్లో ఒక దాన్ని, లేక మాండరిన్, అరబ్బీ, మారిషియన్ క్రియోల్ మొదలైన భాషల్లో ఏదైన ఒక దాన్ని ద్వితీయ భాషగా అభ్యసించే హక్కు మారిషస్ రాజ్యాంగం విద్యార్థులందరికి కల్పించింది. మారిషస్ దేశపు జనాభాను బట్టి, ఇతర జాతులతో పోల్చి చూస్తే, తెలుగువారి సంఖ్య తక్కువ. తత్ఫలితంగా భాషాపరంగా కూడా తెలుగువారు అల్ప సంఖ్యాకులే.

మారిషస్‌లో ద్వితీయభాషగా తెలుగు

ప్రపంచంలో ప్రసిద్ధికెక్కిన భాష పాలకుల భాషగా ఉన్నప్పుడు, సామాన్య ప్రజల భాష వికాసం చెందటానికి ప్రోత్సాహం చాలా తక్కువగా లభిస్తుంది. అటువంటప్పుడు ప్రజల భాషా వికాసానికి, అభివృద్ధికీ అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మారిషస్‍లో ఒక కాలంలో భారతీయ భాషలకు కూడా ఇదే గతి ఉండేది. ఆ నాటికి భారతీయ భాషలకు రాజకీయ ప్రోత్సాహమూ పాలకుల ఆదరణా ఉండేది కాదు. కాని ఈ విషయాన్ని గుర్తించిన భారతీయ భాషా వ్యవహర్తలు తమ భాషకు అలాంటి దుర్గతి రాకూడదని తమ భాషా సంస్కృతులను కాపాడుకోటానికి శాయశక్తులా పాటుబడటం మొదలుపెట్టారు.

ఫ్రెంచ్ పరిపాలనా కాలంలో మారిషస్‍లో వేరే రంగాలతో పాటు విద్యా రంగంలో కూడా ఫ్రెంచ్ భాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఆ నాటికి దేశ పాఠశాలల్లో బోధన ఫ్రెంచ్ భాష చుట్టూ కేంద్రీకరింపబడి ఉండేది. కాని క్రమక్రమంగా అనేక దేశాలనించి వలసదారుల రాకతో మారిషస్ బహుభాషల సమాజంగా మారిపోయింది. అయినా విద్యా విధానంలో చాలా కాలం వరకు ఫ్రెంచ్ భాషే ఆధిక్యత వహించింది. ఫ్రెంచ్ పరిపాలన తర్వాత బ్రిటిష్ పరిపాలనలో ఫ్రెంచ్ భాషతో పాటు క్రమంగా ఆంగ్ల భాష కూడా పాఠ్యప్రణాళికల్లో చోటు చేసుకుంది. కాబట్టి ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో మారిషస్ దేశంలో ద్విభాషాభ్యసనం కొనసాగేదని తెలుస్తుంది. కాలం గడుస్తున్నకొద్దీ ఇక్కడ వ్యవహారంలోనున్న క్రియోల్, భోజ్‍పురి భాషల ప్రభావం తెలుగు వలసదారుల తర్వాతి తరాల మీద పడటం మొదలైంది. క్రమంగా తెలుగు భాష వలసదారుల మాతృభాషా స్థానాన్ని కోల్పోయి, వారి వంశీయులకు ద్వితీయ భాష అయింది. ఎన్నో ప్రయత్నాల ఫలితంగా, చివరికి ప్రాథమిక స్థాయిలో ప్రభుత్వ బడులలో తెలుగు భాషా బోధన 1958వ సంవత్సరంలో మొదలయింది[10]. ఇటువంటి పరిస్థితుల్లో మారిషస్ దేశంలోని తెలుగువారి భాషా సంస్కృతులు ఎన్నో మార్పులకు గురి అయ్యాయి. వీళ్ళ దైనందిన జీవితం మీద కూడా వేరే భాషా సంస్కృతుల ప్రభావం కనిపిస్తుంది.

ఏదైనా ఒక భాషను బోధించేటప్పటికీ, సాధింపవలసిన కొన్ని లక్ష్యాలుంటాయి. మారిషస్ దేశంలో ద్వితీయ భాషగా తెలుగు భాషా బోధనోద్దేశ్యాలు:

  1. విద్యార్థులకు తెలుగులో రాయటం, చదవటం, ధారాళంగా మాట్లాడటం నేర్పటం
  2. అనుకూలమైన సందర్భాల్లో తెలుగులో వ్యవహరించటానికి తగిన నైపుణ్యాన్ని పెంపొందించటం
  3. ఎటువంటి ప్రయాస లేకుండా విద్యార్థులు రెండో భాషలో భావ వినిమయం చేయగలగటం
  4. మాతృభాషలోని భావాలను రెండో భాషలోనికి, రెండో భాషలోని భావాలను తమ మాతృభాషలోనికి పరివర్తన చేయగలగటం
  5. భాషతో పాటు ఆ భాష సాహిత్యాన్ని పరిచయం చేయటం; విషయ జ్ఞానంతో పాటు ఆనందానుభూతిని పొందగలగటం
  6. భాషా సంస్కృతిని, భాషీయుల సంస్కృతిని తెలుసుకొనటం

మొదలైనవి ముఖ్యమైనవి. భాషాధ్యయనం అంటే వ్యాకరణం మాత్రమే నేర్చుకోవటం కాదు. దీనికి తోడు వినటం, చదవటం, మాట్లాడటం, రాయటం అనే నాలుగు నైపుణ్యాలను కూడా గుర్తించగలగాలి. వీటివల్ల భాషా ప్రయోగం చేయడానికి అలవాటుపడి భాషను నేర్చుకోవడం సులభమవుతుంది.

మారిషస్ వంటి బహుభాషీయ దేశంలో భాషా సంపర్కంవల్ల ఇక్కడి తెలుగు భాషలో అనేక మార్పులు వస్తున్నాయి. భాష పరిణామ శీలత అనే లక్షణం కలిగి ఉండడం వల్ల భాషలో మార్పులు రావటం సహజం. కాని, వివిధ భాషల సంపర్కంవల్ల మారిషస్ దేశంలో తెలుగు భాషా వ్యవహర్తల భాషణంలో, లేఖనంలో ఎన్నో దోషాలు ఏర్పడుతున్నాయి. సాధారణంగా ఒకభాషలో శిక్షణ పొందేవాళ్ళకు ఆ భాషాప్రయోగం ఎటువంటి సమయ సందర్భాలలో చేయాలో తెలిసి ఉంటుంది కానీ ఆ భాషా ప్రయోగం ఏ విధంగా చేయాలో స్పష్టంగా తెలియదు. భిన్న భిన్న పరిస్థితులకు చెందిన రకరకాల భాషా ప్రయోగాల్లో తేడా ఉన్నట్లే ఒక భాషకు, మరొక భాషకు కూడా భేదాలుంటాయి. ఒకే భాషకు చెందిన వేర్వేరు ప్రయోగాలకు గల తేడాలకంటే వేర్వేరు భాషల మధ్య ఉన్న తేడాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ధ్వన్యాత్మక, పదాంశ, వాక్యాంశ స్థాయిలన్నింటిలో సామాన్యంగా ఉంటాయి. భాషా సంపర్కంవల్ల ఎటువంటి దోషాలు ఏర్పడతాయో తెలుసుకోటానికి, ద్వితీయ భాషా బోధన లేక పరభాషా బోధన సందర్భంలో లక్ష్యభాషకు (Target language) నేర్చుకొనేవారి మూలభాషయైన (Source language) మాతృభాషకు వున్న తేడాలను అన్ని స్థాయిలలో సూక్ష్మంగా పరిశీలించి, వక్తల భాషణ లేఖనాల్లో పద ప్రయోగాలనూ వాక్యాలనూ పరిశీలించటం అవసరమవుతుంది.

ఒక్కొక్కరి ద్వితీయ భాష లేక పరభాషా జ్ఞానం ఎంత వరకు ఉన్నదని ఆలోచిస్తే, వారు ద్వితీయ భాష లేక పరభాషా ప్రయోగాల్లో చేసే తప్పులూ, పొరపాట్లు ఆధారం చేసుకుని వారికి గల భాషా జ్ఞానాన్ని గురించి అంచనా వేయవలసి ఉంటుంది[11]. ఈ పొరపాట్లు, తప్పులు ఆధారంగా చేసుకుని ఇలాంటి అంచనా వేస్తూ ఉంటాము గానీ వారు చేసే భాషా ప్రయోగం కొన్ని సమయ సందర్భాలకు మాత్రమే కట్టుబడి ఉందని గ్రహించాలి. ఏ భాష విషయంలోనైనా సరే మనకు కనీసపు సామర్థ్యం (Minimum proficiency) ఉంది అంటే సామాన్య జీవితంలో దైనికావసరాల కోసం వేర్వేరు పరిస్థితుల్లో ఆ భాషా ప్రయోగం తగిన విధంగా చేయగలం అని అర్థం. అందువల్ల భాషా జ్ఞానాన్ని గురించి గానీ, సామర్థ్యం గురించి గానీ అంచనా వేసేటప్పుడు తప్పొప్పులను మాత్రమే కాకుండా వేర్వేరు పరిస్థితులకు చెందిన శైలీ విధానాలను కూడా గుర్తించుకోవాలి. ఇంతేకాకుండా భాషా ప్రయోగాల్ని ధారాళంగా చేయగలరో లేదో కూడా ఆలోచించవలసి ఉంటుంది. ఈ విషయంలో ఉచ్చారణ, పదజాల ప్రయోగం, వాక్య ప్రయోగం మొదలైన వాటిని కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ తప్పొప్పుల పరిశీలన, మూల పాఠ్యసామగ్రే కాకుండా నివారింపు పాఠ్యసామగ్రిని (Remedial instructional material), పరిపూర్ణ పాఠ్యసామగ్రిని, పాఠ్యావళి మొదలైనవాటిని తయారు చేసుకునేందుకు సహాయపడుతుంది.

భాషా ప్రయోగంలో జరిగే తప్పొప్పులను ఆధారంగా చేసుకొని భాషాజ్ఞానాన్ని గురించి సరిగ్గా అంచనా వెయ్యలేకపోయినా ఏ రకమైన భాషా ప్రయోగం చేస్తారు అనే విషయం గ్రహించవచ్చు. భాషను నేర్చుకోవడంలో జరిగే తప్పొప్పులను వైజ్ఞానికంగా పరిశీలించి తెలియజేస్తే విద్యార్థులు భాషను నేర్చుకోవడంలో ఎదుర్కొనవలసిన సమస్యలు బాగా అర్థంచేసుకొని వాటికి సమాధానాలు తెలుసుకోవడం సాధ్యమౌతుంది. – (నరసింహారావు, 2015: పుట. 53)[11].

మాతృ భాష, బోధన భాష ఒకే భాషా సమూహానికి చెందవచ్చు, లేక వేర్వేరు భాషా కుటుంబాలకు చెందవచ్చు. ఒకే భాషా కుటుంబానికి చెంది ఉంటే మాతృ భాషకూ, బోధన భాషకూ సాధారణంగా ఎక్కువ సామ్యం ఉంటుంది. ఈ భాషలు వేర్వేరు భాషా కుటుంబాలకు చెంది ఉంటే సామ్యాలకంటే భేదాలు ఎక్కువగా ఉంటాయి. రెండు భాషలకూ గల ఈ భేదాలను ఆధారంగా చేసుకుని భాషా శిక్షణ పొందటంలో విద్యార్థులకు కలిగే సమస్యలు, నేర్చుకోవటంలో ఉండే కష్టాలు తెలుస్తాయి. రెండు భాషల్లోనూ గల తేడాలన్నీ విద్యార్థులకు సమస్యలౌతాయని చెప్పటం కష్టం; కానీ మాతృ భాషకూ బోధన భాషకూ గల సామ్య భేదాలపై భాషా శిక్షణకు కావలసిన కాలపరిమితులు ఆధారపడి ఉంటాయి[11].

పరిశోధన విధానం

ప్రస్తుత పరిశోధన భాషా రంగానికి సంబంధించినది కాబట్టి గుణాత్మక పరిశోధన అందుకు అనుకూలంగా ఉంటుంది. ఆంగ్ల భాషలో దీనికి Interpretivism, Qualitative అనే పదాలు సమానార్థకాలు[12].

Interpretivism is the necessary research philosophy as it emphasizes the relationship between socially engendered concept formation and language. – (O’Brien 1998)[12].

అంటే వాస్తవం (reality) సామాజికంగా సృష్టింపబడుతుందని; దీని మీద చరిత్ర, సంస్కృతి ప్రభావం చూపుతాయని తెలుస్తోంది. ఇంతేకాకుండా ఆయన అభిప్రాయాన్ని బట్టి, ఎక్కువగా ప్రయోగింపబడే ఆచరణాత్మక పరిశోధన (Action Research), case studies వంటి పరిశోధన పద్ధతులు గుణాత్మక పరిశోధన కింద చేరుతాయి.

పరిశోధనలో- ఎలా?, ఎందుకు? వంటి ప్రశ్నలకు సమాధానాలివ్వటానికి; పరిశోధనలో పాల్గొంటున్న వ్యవహర్తల ప్రవర్తనలను పరిశోధకుడు నియంత్రించలేనప్పుడు; పరిశీలింపబడుతున్న దృగ్విషయానికి పరిస్థితులు చాలా అవసరమైనవని భావిస్తే; ఆ దృగ్విషయానికీ సందర్భానికీ మధ్య ఉన్న పరిమితులు స్పష్టంగా లేకుంటే – నిదర్శనాధ్యయనాన్ని (case study) పరిశోధన పద్ధతిగా ఎన్నుకోవాలని యిన్ (Yin, 2009) అభిప్రాయం[13]. ఇటువంటి పరిశోధన పద్ధతి యథార్థ జీవిత సందర్భంలో ఒక సమకాలీన అంశాన్ని పరిశీలించటానికి అవకాశమిస్తుంది (ముఖ్యంగా ఆ అంశానికీ, సందర్భానికీ మధ్య పరిమితులు స్పష్టంగా లేనప్పుడు).

నిదర్శనాధ్యయనం (case study) వంటి పరిశోధన పద్ధతులకు కావలసిన విషయ సామగ్రి, ముఖాముఖి (interview), ప్రత్యక్ష పరిశీలన (direct observation), వైయక్తిక పరిశీలన (participant observation), వివిధ దస్తావేజుల విశ్లేషణ (document analysis) మొదలైన ఆకరాలనించి సేకరించవచ్చునన్న యిన్ (Yin 1994) ప్రతిపాదన ఆధారంగా ఈ నిదర్శనాధ్యయనంలో ప్రాథమిక, మాధ్యమిక, విశ్వవిద్యాలయ స్థాయిల్లో తెలుగు భాషనభ్యసిస్తున్న విద్యార్థులను వ్యవహర్తలుగా ఎన్నుకోవటం జరిగింది. బడి ఆవరణలో ముఖాముఖి జరపటానికి అనుమతి సులభంగా లభించదు కాబట్టి దేశంలో నలుమూలల్లోనున్న సాయంత్రపు బడులలో తెలుగు భాషనభ్యసిస్తున్న విద్యార్థులను ఎన్నుకోవటం జరిగింది. వాళ్ళ ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల సమ్మతి లభించిన తర్వాత వాళ్ళతో ముఖాముఖి జరపటానికి పూనుకొన్నాను.

ఏదైన ఒక భాష మీద వేరే భాషల ప్రభావం గురించి యథార్థాన్ని తెలుసుకోవాలంటే భాషా నైపుణ్యాలైన భాషణ లేఖనాలను పరిశీలించవలసిన అవసరముంటుందని భావించటంవల్ల మారిషస్ దేశంలో తెలుగు భాష మీద ఇక్కడ వ్యవహారంలోనున్న ఇతర భాషల ప్రభావాన్ని పరిశీలించటానికి డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ (PGCE – Telugu) స్థాయిలతో పాటు ప్రాథమిక మాధ్యమిక స్థాయిల్లో తెలుగు భాషనభ్యసించే విద్యార్థుల లేఖనాలలో వాడబడిన భాషను, సంభవించే తప్పులను పరిశీలించటం జరిగింది.

పోస్ట్ గ్రాడ్యుయేట్ (PGCE) స్థాయి విద్యార్థుల లేఖనాల పరిశీలన

ఈ కోర్సులో చేరిన విద్యార్థులందరూ మాధ్యమిక స్థాయిలోని తెలుగు భాషోపాధ్యాయులే. అందరూ తెలుగు భాషలో డిగ్రీ పట్టం సంపాదించినవారు. వాళ్ళ లేఖనాలలో ఈ కింది వివరాలు కనిపించాయి.

నేను కథ చేసేటప్పుడు ఒక పూర్వజ్ఞాన పరిశీలన చేస్తాను (నేను కథ చెప్పేటప్పుడు పూర్వజ్ఞాన పరిశీలనతో మొదలుపెడతాను); ఉపాధ్యాయుడు పూర్వకథ చేస్తాడు (చెప్తాడు)– వంటి వాక్యాలు తెలుగు భాషపై క్రియోల్ భాషా ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి. పై వాక్యాల్లో కథ చేసేటప్పుడు; పూర్వకథ చేస్తాడు క్రియోల్ భాషలోని fer enn zistwar (to do a story < ఆంగ్లం) అనే పదబంధాలను శబ్దక్రమానువాదంగా (Literal translation) భావించవచ్చు.

శబ్దక్రమానువాదమంటే శబ్ద, నిర్మాణాదుల్ని మూలభాషనుంచి లక్ష్యభాషలోకి క్రమంగా అనువదించటం. మూలభాషలోని పదానికి పదాన్ని లేదా వాక్యానికి వాక్యాన్ని లక్ష్యభాషలోకి ఉపసర్జనం చేయడమని అర్థం. జాతీయాలు, సామెతలు, నానుడులు మొదలైన వాటికి పదానికి పదానువాదం చేస్తే, వాటికున్న మనోహర భావాలు లక్ష్యభాషలో వక్రతని పొందవచ్చు. (అక్కరెడ్డి, తదితరులు, 1989)[14].

కాబట్టి, పద్యంలో ఉన్న ప్రతి పదాన్ని చదవడానికి అవసరం లేదు; సరియైన ఉచ్చారణ, రాగం పొందటానికి సులభం కాదు– వంటి వాక్యాలు ఆంగ్లంలోని, There is no need to read each and every word in the poem; It is not easy to get the correct pronunciation and tune (క్రియోల్ భాషలోని pa neseser lir sak enn mo dan poem-la; pa fasi poul gagn prononsiasion ek ton korek-la) అనే వాక్యాలకు శబ్దక్రమానువాదాలే అని చెప్పవచ్చు.

ఇంతేకాకుండా, to take part/ to participate అనే ఆంగ్ల పదాన్ని/ పదబంధాల్ని తెలుగులోనికి అనువదించాలంటే, కొంత మంది విద్యార్థులు ‘పాల్గొను’ అనే క్రియకు బదులుగా ‘భాగం తీసుకొను’గా అనువదిస్తారు. ‘భాగం తీసుకొను’ అనే పదాలను పరిశీలిస్తే, ఇవి take part అనే ఆంగ్ల పదాలకు గాని; ఫ్రెంచ్ భాషా పదాలైన prendre partకు గాని; pran par అనే క్రియోల్ భాషా పదాలకు శబ్దక్రమానువాదం మాత్రమేకాక, వీటిపై హిందీ భాషా ప్రభావం (భాగ్ లేనా) కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. అంటే హిందీలో ‘భాగ్ లేనా’ అనే పదాలను తెలుగులో రాశారని తెలుస్తుంది.

డిగ్రీ, డిప్లొమా స్థాయిల విద్యార్థుల లేఖనాల పరిశీలన

డిప్లొమా, డిగ్రీ మొదలైన కోర్సులు చేస్తున్న విద్యార్థుల లేఖనాల్లో సంభవించిన దోషాలను పరిశీలించాక మారిషస్ దేశంలో ద్వితీయ భాషగానున్న తెలుగు భాష మీద క్రియోల్, హిందీ, ఆంగ్లం మొదలైన భాషల ప్రభావం తీవ్రంగా ఉందని రుజువైంది. ఈ ప్రభావం వాళ్ళ పద ప్రయోగంలో, వాక్యనిర్మాణంలో, విభక్తి ప్రత్యయాల ప్రయోగంలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఎవరు ఆ రురువుని వెతుకుని రాజు అతనికి ఒక గ్రామం దానంగా ఇచ్చాడు; ప్రతి శనివారంనించి ఆదివారం రాత్రి వరకు వాళ్ళు ఆలస్యంగా విందు చేస్తారు; అతను అతి జాగ్రత్తతో నిలుస్తున్నాడు; లోకంలో ఎవడు దొంగ, ఎవడు దొర, ఎవడు నీతిపరుడు, ఎవడు అవినీతిపరుడు, ఎవడు సన్మార్గుడు, ఎవడు దుర్మార్గుడు, ఆ మాట చెప్పటం చాలా కష్టం; ఆ కారణం చాలా మంది పనికోసం ఆలస్యంగానే అవుతారు; దీని తోపాటు వాళ్ళు తన మధ్యలోనే జగడం చేస్తారు; లక్ష్మణుడు తమ కత్తి తీసుకుని తానూ చంపబోయసాగాడు; అది ఒక ఆనవాలు రాముడు చెప్పమన్నాడు; మూల రామాయణంలో ఊర్మిళా దేవి గురించి లేదు. కాని జానపదుల గేయాలలో ఉంది; జంతువుల బలి చేయటం; ఆమె సొంతంగా గుర్తించలేదు (ఆమె తనను తాను గుర్తించలేకపోయిందని అర్థం) మొదలైన వాక్యాలను పరిశీలిస్తే, వాక్య నిర్మాణంలో క్రియోల్ భాషా ప్రభావం ప్రస్ఫుటమవుతుంది. పై వాక్యాలను రాస్తున్నప్పుడు విద్యార్థులు క్రియోల్ భాషలో ఆలోచించి, చాలా సార్లు యథాతథంగా పదానువాదం (lexical translation) లేక వ్యాకరణానువాదం (grammatical translation) చేశారని గమనించాను.

పదానువాద పద్ధతిలో మూలభాషలోని పదానికి లక్ష్యభాషలో సమానార్థకాలు తయారు చేయబడతాయి. పదానువాదం చేస్తే అర్థం సరిగా బోధపడదు. వ్యాకరణానువాద పద్ధతిలో మూలభాషలోని వ్యాకరణాన్ననుసరించి అనువదించటం లేదా లక్ష్య భాషా వ్యాకరణాన్ని దృష్టిలో ఉంచుకొని అనువదించటం అని అర్థం[14]. విద్యార్థులు రాసిన వాక్యాలను పరిశీలిస్తే, వారు ఎక్కువగా మూలభాషలోని వ్యాకరణాన్ని అనుసరించి చెప్పదలచుకొన్న భావాలను లక్ష్యభాషలోకి అనువదించారని తెలిసింది. ఇక్కడ మూలభాష క్రియోల్. వారికి మాతృభాష క్రియోల్ కాబట్టి వారు ఆ భాషలోనే ఆలోచిస్తారు. పరభాషల్లో వ్యవహరిస్తున్నప్పుడు కూడా వ్యక్తి తనలోని భావాలను స్వభాషలోకి అనువదించుకొని వాటికి అనుగుణంగా భావ వ్యక్తీకరణకు మాతృభాషలోనే ఆకృతి కల్పించుకొని పరభాషలో వ్యక్తీకరించటానికి ప్రయత్నిస్తాడని భాషా శాస్త్రజ్ఞులు అభిప్రాయపడతారు. దీన్నిబట్టి భావ గ్రహణం, భావ వ్యక్తీకరణం మాతృభాషలోనే సులువుగా జరుగుతాయని చెప్పవచ్చు[15].

తొలి వాక్యార్థం – ఆ రురువుని వెతికినవాడికి రాజు దానంగా ఒక గ్రామం ఇస్తాడని ప్రకటించాడు. కాని ఈ భావాన్ని తెలుగు భాషలోనికి వ్యక్తం చేసినప్పుడు వారు క్రియోల్ భాషా వాక్య నిర్మాణాన్ని పాటించారు. ఇంతే కాకుండా, రాముడు కోపంతో పడకగది వెళ్ళి అప్పుడు సీతమ్మ తన కాళ్ళు మొక్కి అప్పుడు శ్రీ రాముడు గట్టిగా నవ్వాడు (Ram avek koler inn al dan lasam, lerla Sita inn tonb lor so lipie lerla Ram inn riy for. Ram in anger went in the room, then Sita fell at his feet and then Ram laughed loudly); అందుకే అన్నీ గ్రామాలలో ఎక్కడైనా జానపదులు ఉంటే, అక్కడ కోలాటాలు కనిపించవచ్చు (akoz sa dan tou bann vilaz kot ena bann tribi, labas nou kapav trouv kolatam. That’s why in all villages where there are tribal people, we can find kolatam); మరునాడు అతను ఉద్యోగం వెళ్ళాలి (landemin li bizin al travay. The following day he has to go work); ప్రతి రోజు ప్రతి సమయం ఆమె ఇంటిపని చేస్తూనే ఉంటుంది (toulezour tou letan li res fer louvraz lakaz mem. Everyday at all times she keeps on doing only housework.); బలి చేసేవాళ్ళు (zot ti pe fer sakrifis. They used to sacrifice); పుట్టుక సమయంలో చేసిన రీతులు, వంటి వాక్యాలు కూడా క్రియోల్ భాషా ప్రభావంవల్ల కృత్రిమంగా కనిపిస్తాయి.

వాక్య నిర్మాణంలో మాత్రమే కాకుండా పదాల వాడుకలో కూడా క్రియోల్ భాషా ప్రభావం కనిపిస్తుంది – కొన్ని చోట్లలో ముంతా అనే పదం బదులుగా మొంతా అనే పదం వాడటం జరిగింది. మారిషస్ దేశంలో చాలా మందికి మొంతా అని వ్యవహరించే అలవాటు ఉంది. క్రియోల్ భాషా ప్రభావంతో పాటు విద్యార్థుల లేఖనాలలో హిందీ భాష పదాలెన్నో కనిపించాయి. వీటిలో ‘జగడం చేయు, ఝారు (ఝాడు), ఘట్నాలు’ మొదలైనవి హిందీ భాషా పదాలైన jhagaḍā karnā, jhāṛu, ghaṭna అనే పదాలకు అనువాదాలుగా కనిపిస్తాయి. తెలుగు పదమైన ‘చీపురు’ వాడకుండా జారు/ఝారు/ఝాడు అనే పదాన్ని వాడటం, ‘ఘటన’ వాడే బదులుగా ఘట్నా వాడటం అనేవి హిందీ భాషా ప్రభావం వల్లనే జరుగుతుంది. స్త్రీలు వంటగదిలో ఉపయోగించే పాత్రలు కూడ వాళ్ళకు ఎక్కువ ప్రీయ ఉంది, అనే వాక్యంలో కూడా హిందీ భాషా పదమైన ప్రీయ్ పద ప్రయోగం కనిపిస్తుంది. తెలుగు భాషలో ఒక పదాన్ని ఎలా అనాలో తెలియకపోతే, హిందీలో ఏమంటారో అని ఆలోచించి, దాన్ని ‘తెనుగించటం’ జరుగుతుందని ముఖాముఖిలో పాల్గొన్న కొంత మంది అన్నారు. కొన్ని సార్లు హిందీ భాషా పదాలకు -ము (అం) జోడించి, తెలుగు పదాలు సృష్టిస్తామని కూడా తెలియజేశారు.

రెండో భాషనించి ఒక రూపాన్ని లేదా ఒక పదానికున్న అర్థాన్ని – అంటే ఒక ఎరువుమాట (loanword) తీసుకొని, అంటే ఒక పదాన్ని ఆదానంగా స్వీకరిస్తున్నప్పుడు, ఆ పదానికున్న అర్థం విస్తరమవుతుంది. హాగెన్ (Einar Haugen, 1956) వీటిని creations అంటారు. ఇతర భాషల ప్రభావం వల్ల ఎదుర్కొనే సమస్యల్లో ఇది ఒకటి. అంటే విద్యార్థులకు ఒక పదానికి అర్థం తెలియకపోతే, (వారికి ఆ పదం వేరే భాషలో తెలిస్తే) ఆ పదం నించి కొత్త కొత్త పదాలు సృష్టిస్తారు.

అదే విధంగా, ప్రసార సాధనాలైన టి.వి, రేడియోలలో హిందీ, హిందూస్తానీ భాషల్లో ఎక్కువ కార్యక్రమాలు, సినిమాలు చూడటంవల్లగాని, పాటలు వినటంవల్లగాని వారికి హిందీ బాగా వస్తుందనీ, దాన్ని అర్థం చేసుకోగలరనీ తెలుస్తుంది.

విద్యార్థుల లేఖనాన్ని ఎక్కువగా ప్రభావితం చేసిన భాషల్లో ఆంగ్లం కూడా ఒకటి. దయ చేసి ఈ సమస్యలకోసం కావలసిన ఉపాయం లోతుగా చూడండి. ముందుగా మీకు ధన్యవాదాలు; ఇదే ఎందుకంటే…; జానపదులు ఎక్కువ పని చేసిన కారణంగా వాళ్ళ తీరు సమయంలో నాటకాలు, వీధి నాటకాలు, శిల్పాలు ఇవన్నీ చేశారు; రాత్రి వేలు కుట్టకూడదు— అనే వాక్యాల మీద ఆంగ్ల భాషా ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. వీటిలో కొన్నింటిని పదానువాదం గాని, వ్యాకరణానువాదం గాని చేయటం జరిగింది. ఉదాహరణకు, ఇదే ఎందుకంటే…– This is because…; జానపదులు ఎక్కువ పని చేసిన కారణంగా వాళ్ళ తీరు సమయంలో నాటకాలు, వీధి నాటకాలు, శిల్పాలు ఇవన్నీ చేశారు (వీధి నాటకాలు వేశారు: శిల్పాలు చేశారు) – Because the folk people work a lot, during their free time they did dramas, street plays and sculptures (akoz bann dimounn dan tribi travay boukou, pandan zot letan lib zot ti pe fer drama, street play ek skilptir); పసుపు నీళ్ళతో సాన్నాం ఇచ్చి కుంకుమ ఇస్తారు (ఫ్రెంచి/ ఆంగ్ల భాషా ప్రభావం – donner un bain/ to give a bath to; రాత్రి వేలు కుట్టకూడదు (కత్తిరించకూడదు) – We should not cut nails at night; తన ఖాళీ సమయాన్ని ఎలా ఉపయోగిస్తారో – How to use one’s free time, అనే వాక్యాలకి పదానువాదాలని చెప్పవచ్చు. వీటితో పాటు ఆంగ్ల భాషకు భిన్నంగా, తెలుగు భాషలో క్రియరహిత వాక్యాలు కూడా ఉంటాయని మరచిపోయి, ఆమె అసూయ భావంలేని సానుభూతితో స్త్రీ ఉంది (ఆ స్త్రీకి అసూయ లేదు; అందరిపట్లా సానుభూతి ఉంది.) ఉయ్యాల పాటలు జీవనంలో సమాజంలో ఉన్న ఘట్టాలను గురించి ఉంది; వాళ్ళు జానపద వైద్యంతో ఎక్కువ నమ్మకం ఉంది – అనే వాక్యాల్లో ‘ఉండు’ అనే క్రియను వాడటం జరిగింది.

‘ఉండు’ ధాతు నిష్పన్న క్రియారూపాల లోపం వల్ల కూడా కొన్ని క్రియారహిత వాక్యాలేర్పడతాయి. ఉదా: ఆయనకు ముగ్గురు పిల్లలు. ఆమెకు సిగ్గు ఎక్కువ. ఆ బావి చాలా లోతు. – (చేకూరి రామారావు, 2016: పుట. 116)[16]