“ఈమాట” ఐదో జన్మదిన సంచిక!

ఇది “ఈమాట” ఐదో జన్మదిన సంచిక!

అంటే, “ఈమాట” ఇంకా బాల్యావస్థలోనే వుంది. ఎంతో ఎదగాల్సి వుంది. ఎన్నో సాధించాల్సి వుంది.భవిష్యత్తంతా ముందుంది. దాన్ని ఉజ్వ్జలంగా ఉండేట్టు చూసే బాధ్యత మనందరిదీ.

ఈ ఐదేళ్ళ కాలంలోను “ఈమాట” ప్రచురణలో నా సహసంపాదకులుగా చేయూత ఇచ్చిన వారు విష్ణుభొట్ల లక్ష్మన్న, కొంపెల్ల భాస్కర్‌, కొలిచాల సురేశ్‌, ద్వానా శాస్త్రి గార్లు. వారందరి కృషికి నా కృతజ్ఞతలు.

ఈ సంచిక నుంచి మరో ముగ్గురు సంపాదకులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తున్నారు. వీరు ఆరి సీతారామయ్య, డొక్కా శ్రీనివాస ఫణికుమార్‌, శొంఠి రమణ గార్లు. ఒక్కొకరు ఒక్కొక రంగంలో నిష్ణాతులు. ముఖ్యంగా తెలుగు సాహిత్యం మీద, సంస్కృతి మీద, భాష మీద మిక్కిలి మక్కువ వున్న వారు. వీరి ఉత్తేజకరమైన నిర్వహణలో “ఈమాట” కొత్తపుంతలు తొక్కి, కొత్తవిషయాలు నేర్చుకొని, ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తుందని మనం ఆశించవచ్చు.

ఈ జన్మదిన ప్రత్యేక సంచిక కోసం ఆదరంగా ముందుకు వచ్చి చక్కటి రచనల్ని అందించిన అందరికీ నా  కృతజ్ఞతలు. ముఖ్యంగా కనకప్రసాద్‌, కన్నెగంటి చంద్ర, వేలూరి వేంకటేశ్వరరావు గార్లను ఈ సందర్భంలో ప్రత్యేకించి పేర్కొనాలి. ఈ సంచికలో ఒక విశేషం ఏమంటే దాదాపు కవితలన్నిట్నీ ఆయా కవులు తమ సొంతగొంతుల్తో చదివి వినిపిస్తున్నారు! అంతే కాకుండా కొందరు తమ కవితాసంకలనాల నుంచి కొన్ని కవితల్ని ఎన్నిక చేసి చదివి వినిపిస్తున్నారు కూడ.

ఇక, అడిగీ అడగక ముందే ఎంతో ఉత్సాహంతో ఆకాశవాణి ఎప్పుడో ప్రసారం చేసిన అరుదైన కార్యక్రమం రమణాశ్రమం నుండి ప్రఖ్యాత రచయిత చలం గారితో “రజని” గారి ముఖాముఖి శబ్దరూపంలో మనందరికీ అందిస్తున్న పరుచూరి శ్రీనివాస్‌ గారికి కృతజ్ఞలని చెప్పి ఊరుకోవటం కేవలం భాష చాలకనే. ఈ కార్యక్రమంలో ముందుగా చలం గురించి విశ్వనాథ వంటి ప్రముఖుల అభిప్రాయాలు కూడ పొందుపరిచారు. అలా ఎందరో మహానుభావుల భావాల్ని వారి గళంలోనే వినగలుగుతున్నాం. దీన్ని డిజిటైజ్‌ చేసి, పరిశుభ్ర పరిచి, కావలసిన రూపంలో అందించిన మాచవరం మాధవ్‌ గారి కృషికి కృతజ్ఞతలు.

శ్రీనివాస్‌ గారే మరొక అపురూపమైన ఆకాశవాణి ప్రసారాన్ని కూడ పంపించారు. ఆకాశవాణి స్వర్ణోత్సవాల సందర్భంగా ఉషశ్రీ ఉపోద్ఘాతంతో ఎందరో సాహితీప్రముఖుల గళాల్లో వారి కవిత్వాన్ని (కొండొకచో ఏవో విషయాల మీద వారి అభిప్రాయాల్ని) వినే అవకాశం దీని ద్వారా కలుగుతోంది. వేలూరి శివరామశాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు, విశ్వనాథ సత్యనారాయణ, ఇంకా ఎందరో విఖ్యాతుల్ని విని ఆనందించండి.

అద్దేపల్లి రామమోహనరావు గారు జాషువా గారి గబ్బిలం కావ్యాన్ని వ్యాఖ్యానిస్తూ వీనులవిందుగా చదివి వినిపిస్తున్నారు. దీన్ని “ఈమాట” కు అందించిన శొంఠి రమణ గారికి, ఇంత చక్కటి శ్రవ్యరూపాన్ని మనకిచ్చిన అద్దేపల్లి వారికి కూడ కృతజ్ఞతలు.

ప్రచురణల భవిష్యద్వ్దారాలు ఇంటర్‌నెట్‌ గుండానే తెరుచుకుంటాయనే విశ్వాసం ఈ పత్రిక జననానికి బీజం. ఇకనుంచి శ్రవ్యరూపాల్లో కూడ వీలైనన్ని అంశాల్ని అందిస్తూ ఆ దిశగా మరో ముందడుగు వెయ్యటానికి ప్రయత్నిస్తున్నాం. ఇందుకు రచయిత్రు(త) లందరి సహకారం కావాలి.