మార్చి 2003

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం !

మీరు చూపుతోన్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు.

రచయిత్రు(త)లు చాలామంది “ఈమాట” పాఠకుల నుంచి వారి రచనల మీద అభిప్రాయాలు, విమర్శలు ఇంకా ఎక్కువగా వస్తే అది అందరికీ ఉపయోగకరంగా వుంటుందని సూచిస్తున్నారు. ఇది సహేతుకమైన విషయమే! ఎన్నో వేలమంది పాఠకులు చదువుతున్నా వారిలో కొద్దిమంది మాత్రమే వారి అభిప్రాయాల్ని పంచుకోవటానికి ముందుకొస్తున్నారు. ఇది ఆంధ్రుల సహజప్రవృత్తే ఐనా అప్పుడప్పుడైనా కొంత అసహజంగా ప్రవర్తించటంలో తప్పు లేదు.

విదేశాంధ్రుల జీవితానుభవాల్ని ఒకరితో ఒకరు పంచుకునే అవకాశం కలిగించటం ఈ పత్రిక ప్రధానోద్దేశ్యం అని పదేపదే వివరించనక్కర లేదు. లక్షల సంఖ్యల్లో అమెరికా, యూరప్‌, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాల్లో వుంటూ కేవలం కొద్దిమందే వారి అనుభవాల్ని పంచుకోవాలనుకోవటం ఆంధ్రులకున్న హ్రస్వదృష్టిని సూచిస్తుంది.

మనకు మన భాష ఏమైపోయినా పట్టింపులేదు. సాహిత్యం మట్టిగొట్టుకుపోయినా చీమకుట్టినట్టు వుండదు. త్వరలో ఈ పరిస్థితి మారకపోతే తెలుగుభాష నశించటానికి అవకాశాలు చాలా ఎక్కువ. “ఇంతకాలం వున్న భాష ఈ తరం వాళ్ళు పట్టించుకోనంత మాత్రాన పోతుందా?” అనో, లేకపోతే “భాషని బతికించటం ప్రభుత్వం పని, నాది కాదు” అనో మనల్ని మనం మభ్యపెట్టుకోవటం తేలిక. ఐతే జీవితంలో చాలా వాటి లాగే మాతృభాష విలువ కూడ అది మృగ్యమై పోయేవరకు లెక్కపెట్టకుండా వుంటే ఇంక అప్పుడు తెలుసుకునీ ఉపయోగం వుండదు.

స్వీడన్‌లో ఉన్న జనాభా చాలా తక్కువైనా వాళ్ళ భాషను వాళ్ళు ఎలా వృద్ధి చేసుకుంటున్నారో సోదాహరణంగా చూపిస్తున్నారు వేమూరి వేంకటేశ్వర రావు గారు, వారి వ్యాసంలో. కనకప్రసాద్‌ కవితలు, మీకు వినోదం కలిగిస్తాయని మేము భావించే కథలు, లోతైన వ్యాసాలతో ఈ సంచికను మీ ముందుంచుతున్నాం.

సంప్రదాయ సాహిత్యాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా మీకు అందుబాటులో వుంచటానికి మనుచరిత్రలోని తొలి రెండు ఆశ్వాసాల్ని ఇస్తున్నాం. అలాగే సుప్రసిద్ధ సంస్కృతకవి మయూరుడి సూర్యశతకం కూడ ఇక్కడ ఇస్తున్నాం.

ఇంటర్నెట్‌ వల్ల కలిగిన ఒక గొప్ప పరిణామం ఒక సారి అక్కడ వుంచిన వాటికి శాశ్వతత్వం కలిగించటం. పుస్తకాలు వస్తాయి, పోతాయి. ఇంటర్నెట్‌ మీద వుంచినవి ఎక్కడో ఒకచోట ఎప్పటికీ నిలిచి వుంటాయి. ఈ సత్యం గుర్తించిన ఎన్నో భాషల వారు ఇంటర్నెట్‌ ను వాళ్ళ భాషల అభివృద్ధికి ఎంతగానో వాడుకుంటున్నారు. మనం కూడ త్వరలోనే మన జడత్వానికి తాత్కాలికంగా నైనా కొంచెం విశ్రాంతి యిచ్చి ఆ దారిలో నడవగలమని ఆశిద్దాం.