రహస్య సమావేశం బహిరంగంగా మొదలైంది. కుట్రకి మూల విరాట్టులైన “పంచపాండవులు” మంచంకోళ్ళలాగా నలుగురూ ఒక విశాలమైన టేబుల్ చుట్టూ కూర్చున్నారు. పట్టుపంచెల్లో మిసమిసలాడుతూ ముసిముసినవ్వుల్తో పరస్పరం పలకరించుకున్నారు.
అదో మహా సంరంభం –
మబ్బులపాలెం మహాజనం ఏటేటా జరుపుకునే తిరనాళ్ళ సంబరాలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. పెద్దపాలెం నుంచి వచ్చిన పెద్దల నుంచి గంగిరెద్దుల మేళగాళ్ళ దాకా హడావుడి చేస్తూ, పడుతూ తిరుగుతున్నారు. చీరల రెపలు, నగల ధగధగలు ఒక వంక, పాత స్నేహితుల పలకరింపులు, కొత్త పరిచితుల కరచాలనాలు మరో పక్క.
ఇంత సంరంభంలోనూ పంచపాండవుల్ని పట్టించుకున్న వారు లేరు. కారణం – వాళ్ళు కూర్చుని ఉన్న పెద్ద గది ముందు ఒక బోర్డు కళ్ళు చెదిరేలా, గుండెలదిరేలా అరుస్తోంది – “సాహితీ చర్చా వేదిక” అని. పొరపాటున ఆ చుట్టుపక్కలకి వచ్చిన వాళ్ళు ఆ బోర్డు చూసిందే ఆలస్యం – పుంజాలు తెంచుకుని పరుగెత్తుతున్నారు. ఏడుస్తున్న పిల్లల్ని వాళ్ళ తండ్రులు ఆ గది వంక చూపించి “ఆపకపోతే ఆ రూమ్‌లో కూర్చోబెడతా” అని బెదిరిస్తున్నారు.
పలకరింపులయ్యాక పంచపాండవులు సమావేశాన్ని ప్రారంభించారు. అందర్లోకి చిన్నవాడు, ఆవేశపరుడు ఐన నకులమూర్తి విఘ్నేశ్వర స్తుతితో మొదలెట్టాడు. ఆ తర్వాత అందరూ కాసేపు ఏసుదాసు వేదపఠనం సీడీ పెట్టుకుని విన్నారు.
అదికాగానే “జై సనాతన సంప్రదాయానికీ” అని నకులమూర్తి ఆవేశంగా అరిస్తే, “జై” అని మిగతావాళ్ళూ కేక వేశారు. “జై తెలుగు సంస్కృతికీ” అని శ్రుతి కలిపాడు భీమసేనరావు. “జై” అని గొంతు కలిపారు మిగిలిన వాళ్ళు. “జై తెలుగు పద్యానికీ” అని ముచ్చటగా మూడో నినాదం పలికాడు ధరమ్‌రెడ్డి. మళ్ళీ అందరూ “జై” అని అరిచారు మూకుమ్మడిగా.
ఆపైన అందరూ వరసగా తమకు తెలిసిన తెలుగు పద్యాలు (బాగా పాతవి, దాదాపు వెయ్యేళ్ళ నాటివి) అభినయసహితంగా పాడారు.
ఇంత జరుగుతున్నా బయటివాళ్ళు ఎవరూ లోపలికి అడుగు పెట్టటానికి సాహసించలేదు. కనీసం తొంగిచూసే ధైర్యం కూడ చిక్కలేదు వాళ్ళకి. ఎలాగూ అదే పంచపాండవులకి కావలసింది!
భీమసేనరావుది భారీ విగ్రహం కాదు. నిజానికి అర్భకుడని చెప్పటం వాస్తవదూరం కాదు కూడ. అతను గొంతు సవరించుకుని, ఒక కప్పును బాగా పైకెత్తి పట్టుకుని దాన్లోంచి నీళ్ళు గడగడ తాగి, బిగ్గరగా తేన్చాడు. ఒకసారి చుట్టూ చూశాడు. మళ్ళీ గొంతు సవరించుకుని, అలవాటు లేక జారిపోతున్న ఉత్తరీయాన్ని మెడచుట్టూ చుట్టుకుని, “అందరం ఇక్కడ కలుసుకోగలిగినందుకు చాలా సంతోషంగా వుంది. మన కార్యక్రమం ప్రారంభించటానికి అంతా సిద్ధంగా వుంది. ఎవరికీ ఏమీ అనుమానాలు లేవు కదా?” అనడిగాడు. “ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న రోజు ఇన్నాళ్ళకి వచ్చింది. ఎప్పుడెప్పుడు మన పథకం అమలు చేద్దామా అని రాత్రంతా నాకు నిద్ర పట్టనేలేదు. ఇంకా ఆలస్యం ఎందుకు?” అని హడావుడి పడ్డాడు నాలుగో పాండవుడు నాగార్జున.
“పెద్దపాలెం మేధావి వర్గాన్నంతటినీ మన చెప్పుచేతల్లోకి తెచ్చుకుని కీలుబొమ్మల్లాగా ఆడించటం నా జీవితాశయం. అది ఇన్నాళ్ళకి నెరవేరబోతున్నది. ఇందుకు అవసరమైన పరికరాలు సిద్ధం చేసిన భీమసేనరావుకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి.” చిన్నగా చప్పట్లు చరుస్తూ చెప్పాడు ధరమ్‌రెడ్డి. నకులమూర్తీ, నాగార్జునా కూడ చేతులు కలిపారు.
“ఐతే మన ఆశయం ఇంతటితో తీరిపోయిందని మనం ప్రమత్తులం కాకూడదు. ఒక్క మేధావి వర్గం తోనే ఆగకూడదు మన ఆధిపత్యం. పెద్దపాలెం ప్రజలందరి బుర్రల్నీ మనమే కంట్రోల్ చెయ్యాలి. అప్పుడు కాని నాకు శాంతి కలగదు” అన్నాడు నకులమూర్తి ఆవేశంగా వూగిపోతూ. ఔనంటూ అందరూ విపరీతంగా తలలూపారు.
కండువాలు ఝళిపించారు.
గోచీలు సవరించారు.
ఎదురుగ్గా బల్లమీద వున్న పేపర్లు తీసుకుని తెరిచారు.
“ఈ పదిపేజీల లిస్టులో పెద్దపాలెం నుంచి ఆహూతులుగా వచ్చిన వాళ్ళందరి పేర్లు వున్నాయి. ప్రతి పేరు ఎదురుగా వాళ్ళని కంట్రోల్ చెయ్యటం ద్వారా ఎంతమంది పెద్దపాలెం వాస్తవ్యుల మీద మన ప్రభావం చూపించవచ్చు అనే దాన్ని ఎంతో శక్తివంతమైన కంప్యూటర్ ప్రోగ్రాముల సహాయంతో లెక్క కట్టిన అంకెలు ఉన్నాయి. వాళ్ళలో ఎవరెవరు మనం వాళ్ళకోసం బుక్ చేసిన హోటల్ గదుల్లో ఉంటున్నారో, ఎవరు వాళ్ళ చుట్టాల, స్నేహితుల ఇళ్ళలో ఉంటున్నారో కూడ ఆ పక్కనే చూపిస్తుంది. చివరి పేజీలో వీటన్నిటిని క్రోడీకరించి చూపించటం జరిగింది. దాని ప్రకారం ఆహూతుల సంఖ్య ఐదువందల ఎనభై. అందులో ముప్ఫైశాతం మేధావులు, ఇరవైశాతం రాజకీయనాయకులు, యాభైశాతం తెరవేలుపులు. వీరందరిలో తొంభైరెండు శాతం మనం ఇచ్చిన గదుల్లో వుంటున్నారు, నాలుగుశాతం బంధువుల దగ్గర, రెండుశాతం స్నేహితుల దగ్గర వుంటున్నారు. మిగతా రెండుశాతం విషయం ఇంకా తెలియదు. కనుక ఈ రాత్రికి మన పథకం ప్రకారం కనీసం తొంభైరెండు శాతం వాళ్ళ మీద మన ప్రయోగం జరగబోతున్నది” నాగార్జున చాలా స్పష్టంగా, వివరంగా తమ పథకం ప్రభావాన్ని విశదీకరించాడు. అందరూ ఆశ్చర్యచకితులై తలలూపారు.
“అంతా సక్రమంగానే జరుగుతున్నది కదా? ఎక్కడైనా ఏవైనా ఆటంకాలు కలిగే సూచనలు కన్పిస్తున్నాయా?” అడిగాడు ధరమ్‌రెడ్డి మీసాన్ని ఆప్యాయంగా తడుముకుంటూ. “అలాటి సూచనలు ఏమీ కనపడ్డం లేదు. మనం బుక్ చేసిన గదులన్నిట్లోను పరికరాలు పనికి సిద్ధంగా వున్నాయి. సరిగ్గా తెల్లవారుజాము రెండు గంటలకు నా దగ్గరున్న కంప్యూటర్ ఆ పరికరాలన్నిటికీ సిగ్నల్స్ పంపుతుంది. అవి వెంటనే ఆ గదుల్లో నిద్రపోతున్న వాళ్ళ మెదళ్ళ ప్రకంపనాల్ని మనకి కావల్సిన విధంగా మలుస్తాయి. అలా జరుగుతున్నట్టు వాళ్ళకి ఏమాత్రం తెలీదు. తెల్లవారేసరికి వాళ్ళు మన కంట్రోల్ లోకి వస్తారు.” వివరించాడు భీమసేనరావు. “మరి ఎవరైనా రెండుగంటల తర్వాతనే వాళ్ళ గదులకి వెళ్తే?” సందేహం వెలిబుచ్చాడు నాగార్జున.
“అలాటి వాళ్ళ కోసం తెల్లవారుజాము ఐదుగంటలకు మళ్ళీ ఒక డోసు ఇస్తాం. అంతకుముందే మారిన మెదళ్ళలో ఏమీ మార్పు ఉండదు గాని మారనివి మాత్రం ఈ రెండో డోసుతో తప్పకుండా మారతాయి.” “అద్భుతం. మీరు అన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించారు” అన్నాడు నకులమూర్తి ఆనందంగా. భీమసేనరావు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.
“మరి హోటల్ గదులు తీసుకోని వాళ్ళ సంగతి?” అనడిగాడు నాగార్జున కంగారుగా – “ముఖ్యమైన మేధావులు చాలామంది వాళ్ళ కూతుళ్ళు, కొడుకుల్తో వుంటున్నారు కదా!” “అదే ఆలోచిస్తున్నాను నేనూ. రేపు ఉదయం అవధాన కార్యక్రమం జరిగే గదిలో ఈ మైండ్‌ట్యూనర్స్‌ని ఉంచితే ఎలావుంటుందా అని ఒక ఆలోచన. దానివల్ల పెద్దపాలెం వాళ్ళతో పాటు మబ్బులపాలెం వాళ్ళని కూడ మనమే కంట్రోల్ చెయ్యొచ్చు”
“ఎవరికైనా తర్వాత్తరవాత ఈ విషయం తెలిస్తే మనం చిక్కుల్లో పడతాం. పెద్దపాలెం వాళ్ళ విషయంలో నాకేమీ సందేహాలు లేవు గాని మనవాళ్ళకి కూడ మైండ్‌ట్యూన్ చెయ్యటం మంచిది కాదు.” కలవరపడ్డాడు ధరమ్‌రెడ్డి.
“మరో ఐడియా ఏమిటంటే, ఇక్కడే ఒక గదిలో మన పరికరాల్ని అమర్చుకుని, మనం జనంలోకి వెళ్ళి తప్పించుకున్న వాళ్ళని వెదికి పట్టుకుని ఎలాగోలా ఆ గదిలోకి తీసుకొస్తే అక్కడ వాళ్ళకి తెలియకుండా మన ప్రయోగం చెయ్యొచ్చు”
“ఇది బాగుంది. ఇలా చేద్దాం. వేరే ఎక్కడో ఎందుకు, ఈ గదిలోనే ఏర్పాటు చేస్తే సరి” అన్నాడు నకులమూర్తి. అందరూ అంగీకరించారు.
“ఐతే ఆ పని చేసే ముందు బయటి బోర్డుని తీసేద్దాం. అది వుంటే ఎవర్నీ ఈ గదిలోకి తీసుకురాలేము” – ధరమ్‌రెడ్డి అన్నాడు ముందుచూపుతో. నిజమే నన్నారు మిగిలిన వాళ్ళు నవ్వుతూ.
ఇంతలో నాగార్జునకి ఓ ధర్మసందేహం వచ్చింది – “మరి ఆ సిగ్నల్స్ వచ్చినప్పుడు మనం కూడ ఈ గదిలో వుంటే ఎలా? అప్పుడు ఏమౌతుంది?” అనడిగాడు అనుమానంగా.
“ఆ భయం ఏమీ అక్కర్లేదు. మన నలుగురి ప్రొఫైల్స్ ఆల్రెడీ మన కంప్యూటర్‌లో వున్నాయి. కనుక ఆ సిగ్నల్స్ ని మిగిలిన వాళ్ళ మెదళ్ళు మాత్రమే రిసీవ్ చేసుకుంటాయి” అభయమిచ్చాడు భీమసేనరావు.
అలా అన్ని సందేహాలు నివృత్తి అయాక పంచపాండవులు బయటికి నడిచారు. ఇప్పుడు వాళ్ళ పాదాల కింది పాంకోళ్ళు ఏమాత్రం బాధించటం లేదు. సరికదా, దూదిపింజల్లా తేలిగ్గా వున్నాయి. అడుగులు నేలకి ఓ అడుగు ఎత్తున పడుతున్నట్టున్నాయి. పంచెల గోచీలు ఊడటం లేదు సరికదా బిర్రుగా బిగుసుకుని ఉన్నాయి. ఉత్తరీయాలు జారటం లేదు సరికదా రెపరెపలాడుతూ జెండాల్లా ఎగురుతున్నాయి. స్లో మోషన్లో కదుల్తూ బయటకు వచ్చి సినీనృత్య విభావరి కార్యక్రమం చూడ్డానికి బయల్దేరారు ఆ పంచపాండవులు నలుగురూ.
సినీనృత్య విభావరి కార్యక్రమం అప్పుడే మొదలైంది. వేదిక మీద ఓ యాభై మంది గెంతుతున్నారు. ఏదో పాట లాటిది పెద్ద శబ్దంతో వినిపిస్తోంది. ఐతే దాన్లో మాటలున్నట్టు అనిపించలేదు. గాయనీగాయకులు ఏవేవో ధ్వనులు చేస్తున్నారు తప్ప ఏదో భాషలోంచి ఏవో మాటలు పలుకున్నట్టు లేదు. వేదిక మీది వారు నడుములు ఊపుతూ మెడలు చాపుతూ చేతులు విసురుతూ కాళ్ళు విరుచుకుంటూ సామూహిక సమాధిలో వున్నారు. ప్రేక్షకులు వాళ్ళను మించిన ఆవేశంతో శరీరావయవాలన్నీ తలకో దిక్కుకి తోస్తూ జంటలు జంటలుగా గుంపులు గుంపులుగా వీరంగాలు వేస్తున్నారు. పంచపాండవులకు ఒళ్ళు కంపరాలెత్తాయి. మైండ్‌ట్యూనర్స్ ని ముందు ఈ గదిలో పెట్టి ఇక్కడున్న వాళ్ళందరి మీదా మూకుమ్మడి ప్రయోగం ఎందుకు చెయ్యలేదా అన్న బెంగ కలిగింది.
ఎవరో చేతిని మెల్లగా గిల్లుతున్నట్టనిపించి పక్కకి చూశాడు నాగార్జున. ఎవరో కాదు, నకులమూర్తే. గుసగుసగా, “అర్జెంటుగా ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కొంచెం అలా బయటకు వెళ్దామా?” అన్నాడతను.
ఆశ్చర్యంగా చూస్తూ అప్రయత్నంగా “అలాగే” అని అతంతో కదిలాడు నాగార్జున. ఆ పక్కనే ఉన్న ధరమ్‌రెడ్డిని కూడ అలాగే పిలిచాడతను. ముగ్గురూ బయటకు నడిచి ఖాళీగా ఉన్న ఓ గదిలోకి వెళ్ళారు.
“మిమ్మల్నిలా పిలిచినందుకు సారీ. ఒక విషయం అర్జెంటుగా మాట్లాడుకోవాలి మనం. భీమసేనరావు టెక్నికల్ విషయాలన్నీ చూసుకుంటున్నాడు. అంతా బాగానే వుంది కాని, మనకి కూడ ఆ మైండ్‌ట్యూనింగ్ ఏదో చేసి తనే మనందర్నీ కంట్రోల్ చెయ్యడని ఏమిటీ నమ్మకం? అలా జరక్కుండా మనని మనం కాపాడుకోవటం ఎట్లా?” అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు నకులమూర్తి.
అలా జరగదన్నట్టు తలూపుతూ ఏదో చెప్పబోయాడు ధరమ్‌రెడ్డి. కాని అంతలోనే ఆగాడు. ఆలోచించిన కొద్ది అతనన్నది నిజమే అనిపించింది. ఎలా కాపాడుకోవాలి?
“ఒక పని చేద్దాం. ఇక్కడ ఉన్న రెండు రోజులూ మనం అందరం కలిసే ఉందాం. మనం ఏ గదిలో ఉంటే ఆ గదిలో అతనూ ఉండేట్టు చూద్దాం. ఈ రెండు రోజులూ ఎలాగో గడిపితే మనం ఇక్కడ్నుంచి వెళ్ళిపోతాం” అన్నాడు నాగార్జున సాలోచనగా.
“నిజమే” అన్నాడు ధరమ్‌రెడ్డి కూడ. అలా ఆ ముగ్గురూ ఓ అంగీకారానికి వచ్చాక హాయిగా ఊపిరి పీల్చుకుని మళ్ళీ నాట్యసంరంభం చూడటానికి లోపలికి వెళ్ళారు.
— ———–
వాళ్ళు ముగ్గురూ తనని పిలవకుండా బయటకు వెళ్ళటంతోనే అలా ఎందుకు చేసివుంటారో అర్థమై పోయింది భీమసేనరావు కి.
అతని పెదాల మీద ఓ చిరునవ్వు మెరిసింది.
————-
ఆ రాత్రికి అనుకున్న విధంగానే పెద్దపాలెం పెద్దలున్న హోటల్ గదుల్లో మైండ్‌ట్యూనింగ్ ప్రయోగం జరిగింది.
ఆ గదుల్లో ఉన్న వాళ్ళందరూ పంచపాండవుల వశమై పోయారు. ఇక జీవితమంతా వాళ్ళు తెలుగు పద్యాలు పాడుకుంటూ తెలుగు సంస్కృతి గురించి జపిస్తూ, తెలుగుదనం కారిపోయే దుస్తులు, ఆభరణాలు ధరిస్తూ జీవచ్ఛవాలుగా తిరగబోతున్నారు!
అది తల్చుకుని పంచపాండవులు వికటాట్టహాసాలు చేశారు. పాతపద్యాలు పాడారు. భరతనాట్యాలు చేశారు.
తెల్లవారింది.
హోటల్ గదుల్లోంచి పెద్దపాలెం ఆహూతులు పంచలు, చీరలు కట్టి సమావేశాలకి వస్తుంటే మబ్బులపాడు వాళ్ళలో పాతతరం వాళ్ళు ముచ్చటపడి చూస్తుంటే కొత్తతరం వాళ్ళు విభ్రాంతులై ముక్కున వేలేసుకున్నారు. వేలు దగ్గర లేని వాళ్ళు వందలేసుకున్నారు.
పంచపాండవుల పథకంలో ఒక చిన్న ఘట్టం మాత్రమే మిగిలిపోయిందిప్పుడు. హోటళ్ళలో లేకుండా స్నేహితుల, బంధువుల దగ్గర వున్న వాళ్ళ లిస్టు తీసుకుని వేటకు బయల్దేరారు వాళ్ళు. కొందరికి సన్మానం చేస్తామని ఆశపెట్టారు. మరికొందరికి సిన్మా తారల్ని చూపిస్తామని ఊరించారు.
ఇంకొందరికి వాళ్ళని ఎవరో పిలుస్తున్నారని చెప్పారు. ఎలాగైతేనేం, ఒక్కొకరికి ఒక్కో రకమైన కథ చెప్పి వాళ్ళందర్నీ ఒక గదిలోకి తీసుకొచ్చారు.
————-
పదిహేనేళ్ళ కృష్ణ ఐపాడ్‌లో మ్యూజిక్ వింటూ ఒక వంక ప్లేస్టేషన్ గేమ్ ఆడుతూ మరో వంక కంప్యూటర్ మీద ప్రోగ్రామింగ్ చేస్తూ మధ్య మధ్యలో స్టార్‌బక్స్ కాఫీ సిప్ చేస్తున్నాడు. చుట్టూ మరెవరూ లేరు. కాన్ఫరెన్స్ హాల్ కంట్రోల్‌రూమ్ అది.
ఇంతలో హడావుడిగా అక్కడికి వచ్చాడు భీమసేనరావు.
“దిస్ ఈజ్ వెరీ ఎక్సైటింగ్ డేడ్! ఆర్ ఉయ్ రెడీ టు రాక్?” అన్నాడు కృష్ణ తండ్రి భీమసేనరావుతో.
“సెల్‌ఫోన్ దగ్గరే వుంచుకో. ఇంకో పదినిమిషాల్లో కాల్ చేసి ఏం చేస్తున్నావు అని అడుగుతాను. అది నీకు సిగ్నలన్న మాట. గుర్తుంది కదా?” అనడిగాడతను.
“యెస్. ఐ రిమెంబర్ పర్ఫెక్ట్‌లీ” అన్నాడు కృష్ణ.
“జాగ్రత్త. ఇది లైఫ్ అండ్ డెత్ సిచుయేషన్. డోంట్ మెస్ ఇట్ అప్” ఆప్యాయంగా అతని జుట్టు నిమురుతూ అన్నాడు.
“ఐ నో దట్ డేడ్. యు టోల్డ్ మి ఎ హండ్రెడ్ టైంస్ ఆల్రెడీ” అన్నాడు కృష్ణ.
“అన్నిటికన్నా ముఖ్యమైన విషయం – నా ప్రొఫైల్‌ని ఎక్సెప్షన్ కింద ఉంచావు కదా? ఏదీ నాకు చూపించు చూస్తాను” అని భీమసేనరావు అడిగితే ఔనంటూ చూపించాడు కృష్ణ. తృప్తిగా చూసి గబగబా అక్కడ్నుంచి కదిలాడు భీమసేనరావు మిగిలిన వాళ్ళను కలుసుకోవటానికి.
అందరూ ఓ గదిలోకి చేరారని నిర్ధారణ చేసుకున్నాక కృష్ణకి ఫోన్ చేశాడతను. “కృష్ణా! ఏం చేస్తున్నావు?” అనడిగాడు.
“గాట్ ఇట్ డేడ్!” అని ఫోన్ పెట్టేశాడు కృష్ణ.
అతని పెదాల మీద ఓ చిరునవ్వు విరిసింది.
————-
మర్నాడు ఇంట్లో తన కంప్యూటర్ ముందు కూర్చుని వున్నాడు కృష్ణ. ఎదురుగా ఐదువందల ఎనభై నాలుగు పేర్లు కనిపిస్తున్నాయి. వాటిలో భీమసేనరావు పేరు మీద నొక్కాడు. ఏదో కమేండ్ ఎంటర్ చేశాడు.
అప్పుడే బయటకు వెళడానికి బయల్దేరుతున్న భీమసేనరావు ఒక్క క్షణం మెదడంతా శూన్యమై పోయినట్టు ఆగిపోయి నిలబడ్డాడు. వెనక్కి తిరిగి “కృష్ణా, నేను బయటకు వెళ్తున్నా. నీకేమైనా కావాలా?” అనడిగాడు.
“ఎక్స్‌బాక్స్ తెచ్చిపెడతానని ప్రామిస్ చేశావు. అప్పుడే మర్చిపోయావా?” పైనుంచి కేకేశాడు కృష్ణ. “ఔను కదూ, నిజమే. తీసుకొస్తాలే!” అని గరాజ్‌లోకి నడిచాడు భీమసేనరావు.
తర్వాత ఏ పేరు మీద నొక్కాలా అని “ఈనీ మీనీ మైనీ మో” ఆడుతున్నాడు కృష్ణ.