పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16578

  1. కర్ణభారం – సమూలానువాదం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    08/16/2026 5:48 pm

    ఏదో ఒకసారి మాటల్లో కర్ణుడు అన్నాట్ట కృష్ణుడితో – నేను పుట్టగానే అమ్మ నన్ను వదిలేసింది. గురువు నేనెవరో తెలియగానే శపించాడు, బ్లాహ్, బ్లాహ్ అంటూ సుత్తి, ఆ తర్వాత అనడం దుర్యోధనుడు ఒక్కడే నన్ను చేరదీసాడు అందువల్ల నేను అతనికి ఏదైనా చేస్తాను. దానికి కృష్ణుడు చెప్తాడు సమాధానం – నన్ను కూడా మా అమ్మ వదిలేసింది పుట్టగానే (నేనే వదిలేయమని చెప్పాను), పుట్టినప్పటినుండి ప్రతీరోజూ నన్ను చంపడానికి కంసుడు ప్రయత్నించాడు. వాడి మామ జరాసంధుడు లెక్కలేనన్ని సార్లు (పద్ధెనిమిదా?) నా మీద దండెత్తుకు వస్తే పారిపోయి సముద్రంలో నగరం నిర్మించుకుని దాక్కోవల్సి వచ్చింది. అయినా సరే నేను ధర్మాన్ని విడవలేదు.

    తెలిసేది ఏమిటంటే, డబ్బులు వస్తున్నాయి కదా అనీ, పదవి వస్తోంది కదా అని ధర్మం తప్పితే చివరకి అధోగతే. కొందరిది ఇన్స్టంట్ కర్మ. మరి కొందరికి సమయం పడుతుంది.కానీ కర్మ ఎవరినీ వదలదు. ఆ ముక్క కూడా మహాభారతంలో చెప్పినదే. యథా ధేనుసహస్రేషు వత్సో విందతి మాతరం, తథా పూర్వకృతం కర్మ కర్తారమనుగచ్ఛతి- అనుశాసనిక పర్వం (13.7.22)

    అయితే అధర్మాన్ని సపోర్ట్ చేస్తూ మరో పక్క దానధర్మాలు చేయడం అదో రకం వీక్నెస్ అంటారు – నేను అధర్మం చేయడం లేదు సుమా అని చెప్పుకోవడానికో లేకపోతే నేను మంచివాణ్ణే అని చెప్పుకోవడానికో లేదా మరో కారణం, తన పేరు పైకి రావడానికి. ఆ విషయం ఎవరూ చెప్పలేం ఎందుకనేది. నిజంగా మంచి మనసుతోనే చేసి ఉండొచ్చు – నాకు ఏమీ లేక సూతుడికి కొడుకుగా పెరిగాను కనక లేనివాళ్ళు ఏమి అడిగినా ఇస్తాను అని నియమం పెట్టుకుని ఉండొచ్చు. ఆ ఒక్క మంచి గుణం వల్ల గొప్పవాడు అయిపోరు ఎవరూ. దీన్నే ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు మనకి – జీవితంలో హోలిస్టిక్ వ్యూ ఉండాలి అంటూ.

    అన్నింటికన్నా దరిద్రమైన పనులు ఉన్నాయి కర్ణుడు చేసినవి – పరశురాముడంతటి వాడి దగ్గిర అబద్ధం ఎలా ఆడాడు? ఆయనకి తెలిస్తే ఎలాగా శపిస్తాడని తెలియదా? దుర్యోధనుడు చేసేది అధర్మం అని తెలిసీ ద్రౌపదిని నిండు సభలో వివస్త్రని చేస్తూంటే ఎందుకలా చూస్తూ కూర్చున్నాడు? పైకి చెప్పకపోయినా దుర్యోధనుణ్ణి పక్కకి తీసుకెళ్ళి ‘బాస్ ఇదేం బాగోలేదు, ఇక్కడితో ఆపుదాం,’ అని ఎందుకు అనలేకపోయాడు? నిజమైన స్నేహితుడు హితం పలకాలి కదా? ఎందుకంటే, స్వయంవరంలో ద్రౌపది చెప్పింది ఈ సూతుణ్ణి చేసుకోను అని మొహమ్మీదే, సభాముఖంగా. ఆ ఏడుపు మనసులోంచి పోలేదు ఏనాటికీ. ఈవిడ ఆడది, స్వంత అభిప్రాయాలు ఉండకూడదు, అందువల్ల ‘నేను వీణ్ణి చేసుకోను’ అని అనడానికి పనికిరాదు; ఇదెంత, దీని పొగరు ఎంత, నన్ను చేసుకోను అనడానికి అనుకున్నాడా?

    పాండవుల వనవాస సమయంలో గంధర్వుల చేతిలో చిత్తుగా ఓడిపోయినప్పుడు, ఉత్తర గోగ్రహణంలో ఓడినప్పుడు కూడా తనకి అంత సీన్ లేదనీ, చేతకానివాడినని తెలియలేదా? అంత వీరుడైతే కుంతి దగ్గిరకి డైరక్ట్‌గా వెళ్ళి (సూతుడితో సహా) ఇలా ఎందుకు చేసావని అడగలేదేం? యుద్ధం మొదట్లో అధర్మం మొదలుపెట్టింది కౌరవులే కదా, యుద్ధంలో కూడా కుర్రాడైన అభిమన్యుణ్ణి చంపుతూ? అక్కడ మాత్రం చేతులు కట్టుకుని ఎందుకు కూర్చున్నాడు? ఇదంతా స్వంత చేతులతో చేసుకున్న కర్మ.అయితే భీష్మ, ద్రోణులుకూడా చేతకానివారిలా కూర్చున్నారు కదా అంటే నిజమే; వాళ్ళు కూడా పోయారు ఆ ప్రవాహంలో. అందుకే కృష్ణుడు రాయబారం మొదట్లోనే హెచ్చరించాడు – సారపు ధర్మమున్ అంటూ.

    నిజంగా ఆలోచిస్తే దుర్యోధనుడితో సహా మొత్తం కౌరవసేన వైపు ఉన్న ప్రతీ ఒక్కరికీ, వాళ్ళు రాజ్యాలు ఏలడానికి పనికిరారు అని ముందే తెలుసు. ధర్మంగా రాజ్యం చేయడం చేతకాదు, రాదు, నేర్చుకోరు కూడా. అందువల్ల యుద్ధంలో ఛస్తే వీరస్వర్గం గారంటీ కనక, ధర్మరాజుకి ముందే రాజ్యం ఇచ్చేస్తే తామందరూ ఊరూ పేరూ లేని అనామకుల్లా జీవితాలు గడపాలి కనకా, పాచికలూ, యుద్ధం అంటూ గొడవలు. కర్ణుడు లేకపోతే భారతం లేదు అంటారు. ఉత్తి మాట. దుర్యోధనుడికి కర్ణుడో సాకు. కర్ణుడు కనిపించకపోతే మరొకళ్ళు ఎవర్నో పట్టుకుని బరిలోకి లాగేవాడే. చెరువులో చేపలన్నీ ఒకటే అయినపుడు ఏ చేప అయితే ఏవిటి వలలో పడడానికి? మహాభారతంలో కర్ణుడు వేరు, ఎన్టీవోడి డి.వి.ఎస్. కర్ణ వేరు.

    ప్రస్తుతం మన జీవితాల్లో కూడా జరిగేది కూడా దాదాపుగా ఇదే. జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. అందుకే కాబోలు అంటారు మహాభారతంలో ఉన్నది ప్రపంచంలో ఉంది కానీ అందులో లేనిది మరెక్కడా లేదు అని.

    ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ
    యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్

    ‘అబ్బే, ధర్మం అనేది, అదేం లేదు. మోసాలు చేసే వారు హాయిగా ఉంటారు’ అనే పెద్ద మనుషులు ఉన్నారు కూడా. అది వారి అభిప్రాయం. జీవితంలో మోరల్స్ అనేవి మనం ఎందుకు పెట్టుకున్నాం నేడు కానీ నాడు కానీ అని కాస్త ఆలోచిస్తే ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది. ధర్మం లేదు గాడిదగుడ్డు లేదు అంటారా? కానీయండి.

  2. దేశభక్తి గేయాలు గురించి పద్మావతి అభిప్రాయం:

    08/16/2026 9:56 am

    మళ్లీ ఎన్నాళ్ళకు విన్నానో ఈ గీతాలు. జన్మ ధన్యం. మీకు ధన్యవాదాలు.🙏

  3. కంప్యూటర్ చిప్ కథ – 14: లీ డి ఫారెస్ట్ కనుగొన్న ఎలక్ట్రానిక్ స్విచ్ – ట్రయోడ్ గురించి గుమ్మడిదల రంగారావు అభిప్రాయం:

    08/16/2026 3:45 am

    1960-70 దశకం లో పుట్టిన, గ్రామీణ నేపథ్యమున్న నాలాంటి వారికి గతించిన కాలం మళ్లీ పురుడు పోసుకున్నట్టు అనిపించింది ఈ వ్యాస పరంపర, ముఖ్యంగా ఈ వ్యాసం చదువుతుంటే. అవి గ్రామాల్లో కరెంటు లేని రోజులు. ఎటు చూసినా చిమ్మ చీకటి. అయినా దైనందిన జీవితం మామూలుగానే సాగేది. ఇప్పుడు కాసేపు పవర్ కట్ భరించలేక ఇన్వర్టర్లు పెట్టుకుంటున్నారు గానీ ఆ రోజుల్లో దగ్గర్లో వున్న బస్తీకి పోతేనే కరెంటు వెలుతురు చూసేది. పల్లెటూరిలో కిరసనాయిల్ దీపాలే చీకటిని పారదోలే సాధనాలు. దీపం వత్తి బాగుచెయ్యటం, దీపానికి రక్షణగా వుండే గ్లాస్ ని శుభ్రం చెయ్యటం, బుడ్డిలో కుబెనతో కిరసనాయిల్ పొయ్యటం చిన్న పిల్లల వంతు. విద్యార్థులు ప్రైవేటుకు వెళ్ళేటప్పుడు వెంట ఒక చిన్న సైజు లాంతరు తీసుకొని వెళ్లేవాళ్లం. పంతులు గారింట్లో పెద్ద సైజు లాంతరు వుండేది. చిన్న లాంతర్లకు గుండ్రటి వత్తి, పెద్ద లాంతర్లకు దళసరి వత్తి వుండేది. లాంతరుకి ఒక నాబ్ వుండేది. అది తిప్పితే మంటను పెద్దది చిన్నది గా చెయ్యవచ్చు. పెళ్లిళ్ల కి పెట్రోమాక్స్ లైట్లు అని వుండేవి. అవి చాలా కాంతివంతంగా వెలిగేవి. వెలిగేది కిరోసిన్ తోనే అయినా గ్యాస్ కొట్టాలి. దానికి ఒక నాబ్ వుండేది. ఆ లైట్లు అద్దెకు ఇచ్చేవారు. పొగాకు బ్యారన్ వున్న వాళ్ళకు మోచేతి సైజు టార్చి లైటు వుండేది. దానికి నాలుగు బ్యాటరీ అవసరం. బ్యారన్ లో కాలుతున్న పొగాకు(virginia tobacco) ఎలా వుంది తెలుసుకోవాలంటే బాగా కాంతినిచ్చే లైటు అవసరం. చిన్న టార్చ్ లైట్ అయినా చాలా తక్కువ మంది దగ్గర వుండేది. ఎవరి పనులు వాళ్ళు చీకటిలోనే చేసేవారు. వంట దగ్గర దీప స్తంభం అనే పరికరం వుండేది ప్రతి ఇంటిలో. దీపస్తంభం మీద దీపం బుడ్డి పెడితే ఆ వెలుతురులో పొయ్యమీద ఉడికే పదార్థం కనిపిస్తుంది. ఏడు గంటలకే భోజనం కానిచ్చి పడుకునే వాళ్లు. కిరోసిన్ కూడా రేషన్ షాపులోనే ఇచ్చేవాళ్లు, ప్రతి ఇంటికి నెలకి ఒక లీటరో అరలీటరో! బయట దొరికేది కాదు. కొంత కాలం తర్వాత కిరోసిన్ అమ్మకం లిబరలైజ్ చేసి డ్రమ్ములతో తిరిగేవాళ్లు గ్రామీణ ప్రాంతాల్లో అమ్మటానికి. గబ్బు సమురు గా పిలిచేవారు కిరోసిన్ ని. ఎటుచూసినా చీకటే కానీ చీకటి అనిపించేది కాదు! కరెంటు వచ్చాకే చీకటి అంటే ఏమిటో తెలిసింది! వినటానికి చిత్రంగా వున్నా ఇది నిజం! 1970ల తొలిరోజుల్లో గ్రామాలకు కరెంటు రావటం మొదలయింది. మొల లోతు గుంటలో కరెంట్ స్తంభాలు పాతడం, తీగలు లాగటం, స్తంభాల నుంచి ఇంటికి వైరు లాగటం, ఇంట్లో గోడకి వైరింగు చేయించుకోవటం, స్విచ్ బోర్డులు బిగించడం అబ్బో అదో పండగ వాతావరణంగా వుండేది కొన్ని నెలల పాటు. మొట్టమొదటిసారి ఊర్లో కరెంటు దీపాలు వెలగడం ఎన్నటికీ మరిచిపోలేని అనుభూతి మా తరానికి. మొదట్లో బల్బులే వుండేవి. లోపల ఫిలమెంటు కనిపించే బల్బులు, తర్వాత పాల రంగు బల్బులు, ఆ తర్వాత ట్యూబ్ లైట్లు వచ్చాయి. అప్పుడు స్విచ్ లు చాలా పెద్దవి గా విండేవి. మధ్యలో ఒక పుల్లలా వుండేది పైకి అంటే ఆన్ కిందకి అంటే ఆఫ్! ఆ తర్వాత కాలంలో ఎన్నో మార్పులు: గోడలోపల వైరింగు, గోడలోపలే స్విచ్ బోర్డ్, స్విచ్ లు కూడా చాలా తేలికైనవి, నాజూకైనవి వచ్చాయి. నేడు కరెంట్ పోతే ఇన్వర్టర్ వెంటనే ఎత్తుకుంటుంది కరెంటు సప్లై. చిమ్మ చీకటిలో పుట్టి పెరిగిన అనుభూతి అరవై-డెబ్భై దశకంతో అంతమైంది. ఇప్పటి తరం కరెంటు లేని రోజులు అంటే నమ్మరు కానీ ఆ రోజులు చూశాము. ఈ వ్యాసం చదువుతుంటే అరవై ఏళ్ళ క్రితం కాలం కళ్లముందు కదిలాడింది. ఒక్కసారిగా అరవై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లి గతించిన వాస్తవానికి జీవం పోసిన హనుమంతరావు గారికి ధన్యవాదములు.

  4. భారతీయ ఖగోళ సంప్రదాయం – ఆర్యభట-I కల్పనాశక్తి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    08/15/2026 12:07 pm

    ఉప్పలూరివారి వ్యాఖ్యలోని పరికరాల ప్రస్తావన చూసి కొంత పరిశోధించగా కొత్తగా తెలుసుకున్న రెండు విషయాలు పంచుకుంటాను — ఒకటి ఆర్యభటుని గురించి, మరొకటి మా ప్రాంతానికి (ప్రకాశం జిల్లా) చెందిన ఒక విశిష్ట పండితుని గురించి.

    ఎరటోస్థెనీస్ (Eratosthenes, 276-194 BC) ఓ కర్ర నీడను, రెండు నగరాల మధ్య దూరాన్ని ఆధారంగా చేసుకుని భూమి చుట్టుకొలతను అంచనా వేశాడు. మనవాళ్లు ఏయే పరికరాలు వాడారో అన్న కుతూహలం కలుగుతుంది. ఆర్యభటీయంలో పరికర నిర్మాణాన్ని చెప్పే శ్లోకాలు రెండే: గోళపాదం 22వ శ్లోకం తేలికైన చెక్కగోళాన్ని తయారుచేసి, పాదరసం, నూనె లేదా నీటితో కాలగమనానికి అనుగుణంగా తిప్పమనీ, 23వ శ్లోకం దానిపై నక్షత్రగోళంలో సగభాగాన్ని చిత్రించమనీ తెలుపుతాయి.

    ఆర్యభటుని మరొక, ఇప్పుడు లభించని రచనగా భావించే గ్రంథం “ఆర్యభటసిద్ధాంతం.” మనకు లభిస్తున్న “ఆర్యభటీయం” ఉదయిక పద్ధతిలో, అంటే దినారంభాన్ని సూర్యోదయం నుంచి లెక్కిస్తే, “ఆర్యభటసిద్ధాంతం” అర్ధరాత్రిక పద్ధతిని అనుసరిస్తుంది. బ్రహ్మగుప్తుడు తదితరుల రచనల్లో “ఆర్యభటసిద్ధాంతం” ప్రస్తావనతోబాటు, ఆ గ్రంథంలోని యంత్రాధ్యాయంలో పరికరాలపై గల 34 శ్లోకాల వివరణలు ఉన్నాయి.

    ప్రకాశం జిల్లా ఉలిచి గ్రామంలో పుట్టిన శ్రీరాముల రాజేశ్వర శర్మగారు భారతీయ ఖగోళ పరికరాల చరిత్రపై విశేష పరిశోధన చేశారు. అనేక దేశాలలోని మ్యూజియంలు, వ్యక్తిగత సేకరణలను పరిశీలించి, “A Descriptive Catalogue of Indian Astronomical Instruments,” రూపొందించారు. అది అందరికీ అందుబాటులో ఉంది. దాని పీఠిక నుంచి:

    తనుర్ నేత్రైర్ న్యూనా, నృపతిరహితా రాజనగరీ;
    సరస్యో నిష్పద్మా, యువతిరపి కాంతేన రహితా;
    నిశా నిఃశీతాంశుః, సరిదపి యథా చక్రరహితా;
    తథా జ్యోతిర్విద్యా భవతి విఫలా యంత్రరహితా.

    (కళ్ళులేని శరీరం, రాజులేని రాజధాని, పద్మాలు లేని సరస్సు, ప్రియుడు లేని యువతి, చంద్రుడు లేని రాత్రి, చక్రవాకపక్షులు లేని నది ఎలా వెలితిగా ఉంటాయో, యంత్రాలు లేని ఖగోళవిద్య కూడా అలాగే నిష్ఫలమవుతుంది.)
    — రామచంద్ర వాజపేయిన్, 1428, యంత్రప్రకాశ

    శర్మగారిని నా దృష్టికి తెచ్చినందుకు పరుచూరి శ్రీనివాస్‌కి అనేక కృతజ్ఞతలతో,
    కొడవళ్ళ హనుమంతరావు

  5. ఆగస్టు 2026 గురించి మంథా వీరభద్రం అభిప్రాయం:

    08/14/2026 6:01 pm

    వెనుకటికి హుసేసుచెఱువు కట్ట మీద ఉండే తెలుగు వెలుగుల విగ్రహాలున్న తావుకు “తెలుగు వెలుగుల మూర్తి నిక్షిప్త కళా ప్రాంగణం” అని ఉండేదట కదా!

    మూర్తులు నిక్షిప్తం చేయవు కదా, అది “… నిక్షిప్త మూర్తి కళా ప్రాంగణం” అని ఉండాలని రవ్వా శ్రీహరి గారు వ్రాసారు.

  6. కర్ణభారం – సమూలానువాదం గురించి తః తః అభిప్రాయం:

    08/13/2026 6:26 am

    కొడవళ్ళవారికి : మీనుంచి నేర్చుకోవలసినది ఎంతో ఉంది.

    శ్రీ శ్రీనివాస్ వురుపుటూరి:. నేను ఐతిహాసికంగా చూశాను. (కొంత దగ్గరగా కొంత -కొంత దూరంగా). Chat ను అడిగాను Iago ను మంచివానిగా చూపిస్తూ వచ్చిన — షేక్స్పియర్ నాటక విమర్శలు గా కాక – కల్పనాత్మక రచనలేవైనా ఉన్నయా? అని

    ChaT Gpt సమాధానం:
    Iago imaginatively rehabilitated
    I, Iago
    Author: Nicole Galland
    First published: 2012
    Publisher: William Morrow, an imprint of HarperCollins Publishers, New York
    Genre: Historical/literary novel
    Original work: 370 pages in the first edition.

    I, Iago bibliographic record

    This is, in my view, the clearest answer for Iago.

    Galland does not merely write an essay saying, “Iago has been misunderstood.” She invents an imaginative biography and gives him a childhood, friendships, ambitions, injuries and experiences that gradually produce the man encountered in Othello. The publisher itself describes it as a retelling in which Iago’s “true” motivations are imaginatively revealed.

    నమస్కారాలతో -తఃతః

  7. భారతీయ ఖగోళ సంప్రదాయం – ఆర్యభట-I కల్పనాశక్తి గురించి ఉప్పలూరి ఆత్రేయ శర్మ అభిప్రాయం:

    08/13/2026 1:34 am

    చంద్ర, సూర్య, గ్రహణ, విషయాలనెన్నిటినో మన భారతీయ శాస్త్రజ్ఞులు ఆ కాలంలోనే, ఈ నాటి యాంత్రిక పరికరాలు లేని ఆ నాటి కాలంలోనే…నిశితంగా పరిశీలించి, పరిశోధన చేసిన విషయాలెన్నిటికో ఈనాటి శాస్త్రీయ సమర్థన కలిగిన అంశాలను వెలిదీసి కూలంకషంగా విశదీకరించిన మనలోని “సూర్య” అంశ అయిన నౌడూరి సూర్యనారాయణ మూర్తికి హార్దిక అభినందనలు, వినమ్ర కృతజ్ఞతలు. గతానికి, వర్తమానానికి వారధిగా మరుగున పడి ఉన్న ఇటువంటి మన భారతీయ పరిశోధనాంశాలను బయటకు తీసుకు వచ్చే కృషి నిరంతరం కొనసాగుతూనే ఉండాలి.

  8. కర్ణభారం – సమూలానువాదం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    08/12/2026 9:12 pm

    తాడిగడప గారూ,

    మీరు ఉదహరించిన పద్యం నాలో కుతూహలం రేకెత్తించింది.

    నర్తనశాల సినిమాలోని పద్యాలు విని ఆనందించి, కొన్నేళ్ల క్రితం తిక్కన విరాటపర్వం చదివి, “ప్రేలితి వెన్నొ మార్లు…” అన్న పద్యం తిక్కనది కాదనీ, సముద్రాలదనీ తెలుసుకున్నాను. సినిమాలో అది ఉత్తర గోగ్రహణంలో కర్ణార్జునుల యుద్ధసందర్భంలో వస్తుంది. తిక్కన భారతంలో ఆ సందర్భంలో అర్జునుడు కర్ణుడితో,

    “సభలఁ బలుకు దీవు సరిలేరు నా కని; యిదె రణంబు వచ్చె…” అంటూ
    “మాటలు పెక్కాడితివి పోటుమగలు వినఁగ నింకఁ బోవుట దగదె…” అని ఎత్తిపొడుస్తాడు.
    — విరాటపర్వము, పంచమాశ్వాసము, 88–89.

    మీరు “ఘోషయాత్రలో” అన్నారేమిటా అని అరణ్యపర్వంలో ఘోషయాత్ర ఘట్టాన్ని చదివాను.

    పాండవుల అజ్ఞాతవాసానికి ముందు, గోవుల మందలను పరిరక్షించే నెపంతో కౌరవులు ద్వైతవనానికి వెళ్ళి, గంధర్వుల చేతిలో పరాభవం పాలవుతారు. కర్ణుడు యుద్ధభూమి నుంచి తొలగిపోతాడు; దుర్యోధనుడు బందీ అవుతాడు; చివరకు పాండవులే అతణ్ణి విడిపిస్తారు.

    ఆ అవమానంతో దుర్యోధనుడు హస్తినాపురానికి తిరిగి వెళ్ళడానికి సిగ్గుపడి ప్రాయోపవేశానికి సిద్ధపడతాడు. అప్పుడు పాతాళంలోని దైత్యులు భీష్మద్రోణాదులు పాండవపక్షాన్ని నాశనం చేస్తారనీ, కర్ణునిలో నరకాసురాంశం ప్రవేశించి కృష్ణార్జునులతో యుద్ధం చేస్తాడనీ చెప్పి అతనికి విజయంపై ఆశ కలిగిస్తారు.

    ఆ తరువాత కర్ణుడు కూడా దుర్యోధనుడికి నేరుగా ఒక ప్రతిజ్ఞ చేస్తాడు:

    “మది నర్జునుఁ జూచి భయం
    బొదవినయది నీకు; వాని నుగ్రరణమునం
    బదునాలవయేఁడు జయించెద;
    నాయుధ మంటి ప్రతిన సేసితి నధిపా!”

    — అరణ్యపర్వము, షష్ఠాశ్వాసము, 55.

    తిక్కన భావాన్ని తీసుకొని, కర్ణుడి పూర్వప్రతిజ్ఞకు కూడా ప్రతిధ్వని కలిగించడం సముద్రాల ప్రతిభకు మంచి ఉదాహరణ. తన ఆయుధాన్ని తాకి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి, అర్జునుణ్ణి జయించగలననే బలమైన నమ్మకం కర్ణుడికి ఉంది.

    మీరు చెప్పినట్లు, దుర్యోధనుడి పాండవద్వేషాన్ని రెచ్చగొట్టడంలో కర్ణుడి పాత్రకు ఘోషయాత్రలోనే స్పష్టమైన ఉదాహరణ కనిపిస్తుంది:

    “ధన ధాన్య పుత్త్ర బాంధవ
    జనలాభంబులును దలఁప సరిగావు సుఖం
    బునఁ దాను దనరి శత్రులు
    ఘనతర దుఃఖముల నుండఁ గని యలరుటకున్‌.”

    — అరణ్యపర్వము, పంచమాశ్వాసము, 348.

    కర్ణుడి వ్యక్తిత్వంలో మరో కోణం కీర్తి, గౌరవాల పట్ల అతనికున్న పట్టుదల. ఇక్కడ కీర్తి అంటే పేరు ప్రతిష్ఠల కోసం ప్రాకులాడటం కాదు; అపకీర్తితో జీవించడం కంటే మరణమే మేలన్న వీరధర్మ భావన. ఇంద్రుడు కవచకుండలాలు అడగబోతున్నాడని సూర్యుడు స్వయంగా హెచ్చరించి, వాటిని ఇవ్వవద్దని చెప్పినా కర్ణుడు వినడు:

    “కీర్తి విడువఁజాలఁ; గీర్తితో మెలఁగంగఁ
    జావు వచ్చెనేనిఁ జత్తుఁ; గాని
    జగములోన నెల్ల ‘సడికంటెఁ జావు మే’
    లనఁగఁ బరఁగు మాట యనఘ! వినవె?”

    — అరణ్యపర్వము, సప్తమాశ్వాసము, 293.

    కర్ణుడికి దుర్యోధనుడిపట్ల commitment లేదని అనలేము. అది అతని వ్యక్తిత్వంలో ముఖ్యమైన అంశమే. కృష్ణుడు కర్ణుడికి అతని జన్మరహస్యం చెప్పి, పాండవుల అగ్రజుడిగా వచ్చి రాజ్యాన్ని స్వీకరించమన్నప్పుడు కర్ణుడు అంటాడు:

    సూతసుతుండు వీఁ డనక సూనుల తమ్ములకంటె నాకు సం
    ప్రీతియొనర్చి తేజమును బెంపును నాఁటికినాఁటి కగ్గలం
    బై తనరార నన్నుఁ దనయంతటి మానిసిఁ జేసియుండ నే
    నేతగవూఁది యా కురుకులేశ్వరుఁ బాయుదు? ముట్టవచ్చినన్‌.

    నను నయ్యర్జునునకు నెదురని పెద్దయు నమ్మియుండు నక్కట! దుర్యో
    ధనుఁ; డా నమ్మిగ వమ్ముగఁ జనునే పాండవులఁ గలయఁ జన నా కనఘా!
    — ఉద్యోగపర్వము, చతుర్థాశ్వాసము, 39–40.

    కానీ అతని ప్రవర్తన అంతటినీ దుర్యోధనుడిపట్ల ఉన్న ఆ ఒక్క నిబద్ధతతోనే వివరించలేము. అర్జునుడితో వైరం, పాండవుల పట్ల ద్వేషం, తన శౌర్యాన్ని నిరూపించుకోవాలనే పట్టుదల, కీర్తి–గౌరవాలపట్ల అతనికున్న మక్కువ — ఇవన్నీ ఆ నిబద్ధతతో కలిసే అతణ్ణి నడిపించాయి.

    ఆ సంక్లిష్టతే కర్ణుడిని మహాభారతంలోని ఆసక్తికరమైన పాత్రల్లో ఒకణ్ణి చేసిందేమో.

    ‘ఘోష’ అంటే ‘ఆవులమంద’ అని తెలుసుకునే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలతో,
    కొడవళ్ళ హనుమంతరావు

  9. కర్ణభారం – సమూలానువాదం గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    08/12/2026 12:45 pm

    “Only for his commitment to duryOdhana”

    ఈ విషయం కూడా సందేహాస్పదమైనదే నండీ. కర్ణుడి కథను పరిశీలిస్తే అర్జునునితో మొదటినుండీ (ఇద్దరూ ద్రోణశిష్యులే!) తానేర్పరచుకున్న వైరాన్ని కొనసాగించేందుకు దుర్యోధనుడి ప్రాపకాన్ని ఉపయోగించుకున్నాడే కాని నిజాయితీగా ఉన్నాడని చెప్పటం అస్సలు కుదరదు. కర్ణుడి తల భారతం అని ఒక నానుడి ఉంది. నిత్యం అర్జునుని ముండు తేలిపోతూనే, యుద్ధరంగం నుండి అలవాటుగా పారిపోతూనే సాకులు చెపుతూ దుర్యోధనుడిని మాయలో ముంచి నమ్మించి యుధ్ధానికి పురికొల్పటం మినహా ఆకర్ణుడి గొప్పదనం మరేమీ లేదంటే అతిశయోక్తి కాదు.

    ఘోషయాత్రలో కర్ణుడితో అర్జునుడు అన్నమాట చూడండి.

    ప్రేలితి వెన్నొ మార్లు కురువీరుల ముందట నేనొకండనే
    చాలుదు నద్జునుం గెలువ సంగరమందని నేదు నీదు వి
    ద్యాలవదుర్విదగ్ధత బయల్పడు కాలము దాపురించె నిన్
    కాలుని ప్రోలి కంపెదను కర్ణ రణాంగణ మందు నిల్వుమా

    గప్పాలు కొట్టటం యుద్ధనుండి తప్పుకోవటం నీస్వభావం అని కర్ణుణ్ణి అర్జునుడు ఎత్తిపొడిచాడు. ఈవిధంగా ఉంటూనే, దుర్యోధనుడికి ప్రీతి కలిగించటానికి దురుక్తులు పలుకటం – ఇదే కర్ణ్ణుని స్వభావం. తాను చాలనని అనుభవపూర్వకంగా సూటిగా తెలిసిన వాడే కర్ణుడు. ఆవిషయాన్ని స్వయంగా తనను నమ్మునున్న దుర్యోధనుడికి నిజం విశదపరచి ఉంటే యుధ్ధం జరుగకపోయేదేమో కదా!

  10. కర్ణభారం – సమూలానువాదం గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    08/12/2026 9:06 am

    తఃతః గారికి

    కర్ణభారం వంటి రచనలను సాహిత్యదృష్టితో కాక ధార్మికదృష్టితో చూసేవారు తప్పుపట్టే అవకాశం తప్పక ఉంటుందనే అనుకుంటాను.

    భాసుడిపై సాహిత్య అకాడెమీ వారి మోనోగ్రాఫులో “కర్ణభార కథావస్తువు మహాభారతం నుండి గ్రహింపబడినది. అత్య ల్పమైన భేదాలతో పాత్రచిత్రణ కూడా భారతానుసారంగానే జరిగినది. మహాభారతం ప్రకారం ఈ సంఘటన యుద్ధానికి చాలా ముందుగానే జరిగింది. అయితే, భాసుడు కాలమూ, స్థానమూ కూడా మార్చాడు. కర్ణుడు తనకున్న ఏకైక ఆత్మరక్షణ సాధనాన్ని, దాని అవసరం ఎంతో ఎక్కువగా ఉన్న సమయంలో, అది లేని లోటు ఎక్కువగా కనబడే రణభూమిలో, దానం చేసి వేయడం ఆతని దానవీరత్వానికి వైశిష్ట్యాన్ని సమకూరుస్తుంది.” అని అంటూ మెచ్చుకోలుగానే చెబుతారు. కథ కాస్తా ప్రీచీగా ఉన్నదని, బహుశా ఇది భాసుడి తొలి రచనల్లో ఒకటై ఉంటుందని మాత్రం విమర్శించారు: “ఈ రూపకంలో స్పష్టంగా కనబడే నీతిబోధన దృష్టీ, కవి చాతుర్యాన్ని సూచించే నూతన కల్పనలేవీ దీనిలో లేకపోవడమూ, వీటిని పట్టి, భాసుడు నాతిపరిణత వయస్కుడుగా ఉన్నప్పుడు ఈ రచన చేసి నాడని తెలుస్తూన్నది.” (మూలం:వి.వేంకటాచలం; అనువాదం: పుల్లెల శ్రీరామచంద్రుడు)

    శ్రీనివాస్ వురుపుటూరి