జయహో జీవనమా!

వేణు మాహాలి ఒకసారి చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు.

ఈ చెత్త పొదల వైపు ఎవరు మాత్రం వస్తారూ!

యుగాలనాటి పాత మఱ్ఱిచెట్టు ఒకటి అలాగే నిలబడి ఉంది. దానికి దగ్గర్లోనే ఒక పెద్ద తుమ్మచెట్టు ఉంది. దగ్గర్లో మరి కొన్ని చెట్లున్నాయి. వాటికింద ఒక పాత కుక్కిమంచం, విరిగిన మట్టి పాత్రలు, జంతువుల ఎముకలు, కుక్కల విసర్జనాలు ఉన్నాయి.

ఉలిక్కిపడ్డాడు వేణు.

అంటే, మనుషులు వెళ్ళలేని చోట్లకు కూడా కుక్కలు సులువుగా వెళ్ళిపోతాయి. మనసులోనే నవ్వుకున్నాడు. ‘ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చురుకైనది కుక్కేనని నాకు తెలుసు. చురుకే కాదు ధైర్యం కూడా ఎక్కువే. అంతరిక్షంలోకి వెళ్ళడానికి మనిషికి ధైర్యం చాలకే కదా మొదట కుక్కను పంపించారు!’

వేణుకి నవ్వాగలేదు… “జయహో జయహో ప్రపంచాధినేతకు! కుక్క రాజుగారికి జయహో!” నవ్వుతూనే గట్టిగా అన్నాడు.

ఉత్సాహం ఎక్కువైంది. ప్రసన్నంగా కూనిరాగాలు తీశాడు. “జయహో… కుక్కల వంశానికి జయహో!”

వేణు చుట్టూ ఓసారి చూసి, కుక్కలా మొఱగసాగాడు. “భౌభౌ ఆవ్” అని. తర్వాత గొంతు సరిచేసుకొని ఒక దీర్ఘమైన నిట్టూర్పు వదిలి ఇంకా పెద్ద గొంతుతో మొఱగసాగాడు.

“భౌ భౌ భౌ…”

చాలాసార్లు మొఱిగాక తనకు తానే నచ్చజెప్పుకున్నాడు. ‘అవుతానవుతాన్రా! రేయ్, ప్రయత్నం చేస్తే మనిషి భగవంతుడవుతాడు. నేను కుక్కను కాలేనా ఏంటి? నేనవుతా. కచ్చితంగా అవ్వగలను. ఇలాంటి చావుతో నా ఉనికి మాసిపోనివ్వను. తరాలకు తరాలు ఉనికి నిలుపుకోవాలనుకుంటున్నాను. నన్నెవరూ ఆపలేరు’. మళ్ళీ మొఱిగాడు.

‘భౌ భౌ భౌ…’

ఈ అరుపులింకా పూర్తవకుండానే పొదల వెనుక ఏదో చప్పుడయింది.

వేణు జాగ్రత్తపడ్డాడు. తన సాధన గురించిగానీ ఎవరికైనా తెలిసిపోయిందా? లేకపోతే ఆ పొదల్లో ఎవరుంటారు?

మళ్ళీ అదే శబ్దం. వేణు కొంచెం వంగి అటువైపు చూశాడు. అరే ఇదేంటి? నిజంగానే అక్కడో కుక్క ఉంది.

ఆశ్చర్యంగా వేణు కొన్ని క్షణాలు ఆ కుక్కనే చూస్తుండి పోయాడు. కుక్కతో కళ్ళు కలిసినపుడు ఆ కుక్క ఏదో అడిగినట్టు కనిపించింది. ‘నీకేమైంది? ఇందాక ఎందుకు కుక్కలా మొఱిగావు? బుఱ్ఱ చెడిందా? లేక రేబీస్‌గానీ వచ్చిందా?’ అంటున్నట్టు అనిపించింది.

కుక్క చూపుల్నిబట్టి అదేమంటుందో అర్థమౌతున్నట్టే ఉంది. ‘నీ చూపుల్లో భావమేంటో తెలుసుకోగలను. అందుకే కదా కుక్కనవుదామనుకుంటున్నాను. ఏంటి భయపడుతున్నావా? నాలాంటి ఒక డబ్బున్నోడు, బుద్ధిమంతుడూ అయిన మనిషిని, నీలా జంతువునైపోతే, లేక ఆ జాతిలో చేరిపోతే నీకు ప్రమాదమనుకుంటున్నావా? ఆ ఆ అనుకుంటే అనుకో అలాగే. నాకైతే ఇక మరోదారి లేదు. ఏమైనా సరే, నేను కుక్కను కావాల్సిందే,’ అని లోలోపలే అనుకున్నాడు.

కళ్ళతోనే మాట్లాడేసి తోక ఊపుకుంటూ కుక్క వెళ్ళిపోతుంటే, ‘చెయ్యూపుతూ వెళ్ళిపోయే మా ప్రతిమే గుర్తొస్తోంది’ అనుకున్నాడు.

ప్రతిమ గుర్తుకు రాగానే వేణు కాస్సేపు అన్యమనస్కుడైనాడు. ‘కుక్క తోక ఊపడాన్ని ప్రతిమ చెయ్యూపడంతో పోల్చానేం… ఎందుకలా అనిపించింది తనకు? అలాగే ఆ ఆకులు కదలడాన్ని ఆ లావాటి ఒడియా అక్క పొడుగాటి జుట్టు కదలడంతో పోలుస్తానా? అలా మాత్రం తోచదే తనకు… కానీ ఎందుకలా?’ అని తనను తానే ప్రశ్నించుకున్నాడు.

ప్రతిమ కూడా తనలాగే కుక్కలా మారబోతోందా ఏమి?

వేణు మనసులో అనుమానం ఎక్కువైంది. ఊపిరి వేగం పెరిగింది. తానే పనైనా ఎంత జాగ్రత్తగా చేసినా ఎవరో ఒకరు తనను తప్పకుండా చూస్తున్నారు. మళ్ళీ చుట్టూ చూశాడు. గట్టిగట్టిగా అరుస్తూ “చూడనీ చూసేవాళ్ళెవరైనా చూడనీ. నేను చచ్చాక కూడా నా వంశం నిలబడాలి. ఈ మాట ఎవరికైనా అర్థమైనా కాకపోయినా సరే, నేనేం పట్టించుకోను,” అన్నాడు. మళ్ళీ గట్టిగా మొఱగడం మొదలుపెట్టాడు.

‘భౌ భౌ భౌ…’

తర్వాత ఆ పెద్ద మఱ్ఱిచెట్టు, తుమ్మచెట్లవంక చూస్తూ “ఏయ్, మీరంతా ఏమనుకుంటున్నారు? నేను పిచ్చోణ్ణనా? ఏంటి నన్నేదో పిచ్చికుక్క కరిచిందేమో, అందుకే మొఱుగుతున్నాననుకుంటున్నారా? హహ్హహ్హహ్హా! నేనేమీ బేవకూఫ్‌ని కాదు. నేననుకుంటే మీలాగా చెట్టునో, పువ్వునో లేక పక్షినో కూడా కాగలను. నేను నెమలిని కూడా కావాలనుకున్నాను. కానీ ఛీ! కుక్కనైతే ఉండే స్వేచ్ఛ, మజా ఇంక దేంట్లో ఉందీ?” అన్నాడు.

ఆ పెద్ద మఱ్ఱిచెట్టునుంచి ఒకటి రెండు ఆకులు రాలడం తప్ప అతని మాటలకు ఏ ప్రతిస్పందనా లేదు.

ఇప్పుడు ఒపెరా కావలివానిలా భీతి, నిర్భీతి కలిసిన నవ్వు నవ్వుతూ “స్వర్గీయ దీనబంధు మాహాలి కుమారుడిని… వేణుధర్ మాహాలి అనే నేను, జగత్‌సింగ్‌పూర్ జిల్లా వేణుపుర్ వాస్తవ్యుడిని, విద్యార్హత బి ఎ డిస్టింక్షన్, వృత్తి కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్, అవివాహితుడిని. నేను ఎందుకు కుక్కను కావాలనుకుంటున్నానో ఎవరైనా చెప్పగలరా? ఆలోచించండి. ఆలోచించండి. ఆలోచించి చెప్పండి. ఆ ఆ భౌ భౌ భౌ!”


వేణు ఉండే ఊర్లో రోజూ కొత్త కొత్త వార్తలు వినవస్తుంటాయి. అయితే వాటిలో విషయాలేమీ ఉండవు. లేదా మురుక్కాలవలా కుళ్ళిన వాసన వేసేవిలాంటివి ఉంటాయి. అలా ఒక రోజు ఒక వార్త రోజంతా ఊరంతా ఉపద్రవం సృష్టించింది. ఊర్లోనే కాదు, టీవీలో కూడా మాటిమాటికీ భూమి ధ్వంసమై పోతుందనే ప్రకటనలు వచ్చాయి. ఆ ప్రభావంతో సముద్రం ఎడారైపోతుంది, ఎడారి సముద్రమైపోతుంది. ఆ తర్వాత భూమిపైన ఏ ప్రాణీ జీవించి ఉంటుందనే గ్యారంటీ లేదు.

వేణు మాహాలి టీవి ముందు కూర్చొని నవ్వసాగాడు. అరె, ఈ ఛానల్ వాళ్ళకి ఈ మాత్రం ఆలోచన లేదా! భూమే ధ్వంసమైనాక ప్రజలెలా బతుకుతారు? వీళ్ళ ఛానల్ కూడా అందులోనే ధ్వంసమై పోతుంది. సిగ్గూశరం లేనోళ్ళు… మధ్యన మళ్ళీ ‘యాభై దేశాలనుంచి దాదాపు పదిహేడు వేలమంది శాస్త్రజ్ఞులు ప్రాణాలు పణంగా పెట్టి భూమిని ఈ ఆపదనుంచి రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని ప్రకటిస్తున్నారు. బహుశా ఈ గండం నుంచి గట్టెక్కవచ్చు’ అని వార్త వినగానే వేణు ఊపిరాడలేదు. నిజంగా గండం తప్పుతుందా?

కాలనీలో దాదాపు వంద కుటుంబాలుంటాయి. అన్ని ఇండ్లలో టీవి సౌండ్ బయటి రోడ్లకు వినిపిస్తోంది. కాలనీ చౌక్‌లో ఒక శివుని గుడి ఉంది. ఇప్పుడక్కడ రేయింబవళ్ళు జనాలు బారులు తీరుతున్నారు. గుడిలో గంట, మృదంగంతోపాటు శివభజన జయధ్వానాలు కూడా వినబడుతున్నాయి.

వేణు నవ్వుకున్నాడు. ‘భూమే ధ్వంసం అయిపోతే హరి, హరామీ ఇద్దరూ పోవాల్సిందే. జగన్నాథుడు, ఏసు ఉండడు. కాబట్టి ఇలా ఏడుపు పెడబొబ్బలతో ఏమీ జరిగేది లేదు.’ వేణు ఇలా ఆలోచిస్తూ కాళ్ళు చేతులు మడిచి కుర్చీలో కూర్చున్నాడు. వేయించిన శనగలు ఒక్కొక్కటీ తీసుకుని నోట్లో వేసుకోసాగాడు. చిన్నప్పుడు చేపలు పట్టడానికి వెదురుపుల్లను నీళ్ళలో వేసి, అదెప్పుడు కదులుతుందా అని ఎదురుచూసినట్లుగా చూస్తూ ఉండిపోయాడు. తర్వాత మళ్ళీ అతనికి ప్రతిమ గుర్తొచ్చింది.

ప్రతిమ ఇప్పుడేం చేస్తోందో!

వయొలెట్ కలర్ సల్వార్ వేసుకుందో లేక స్కై కలర్ చీరలో ఉందో!

ముఖంలో భయం ఉందో లేక అదే తీరుగా నిర్భయంగా టీవీ చూస్తోందో! ఒకవేళ ఇప్పుడు ప్రతిమ తన దగ్గరుండుంటే, ఇంత తొందర్లో మృత్యువు ఉందంటే భయపడి ఉండేదా? లేదు ముమ్మాటికీ లేదు.

వేణుకు ప్రతిమతో మాట్లాడాలనిపించింది. ఫోన్ చేశాడు.

“హెలో, ప్రతిమా! ఏం చేస్తున్నావు?”

“మీరు?”

“నేనా? బిందాస్‌గా ఉన్నాను.”

“ఏంటీ? భూమి ధ్వంసమై పోతుందని విన్నాక కూడానా? నేను చాలా భయపడిపోయాను”.

“హ హ్హ హ్హ”.

“దేవుడా, నాకైతే హార్ట్ ఎటాక్ వస్తుంది”.

“అయితే ఇంకేం? ఇక భూమి ఉన్నా పోయినా నీకేం బాధ?”

“ఇలాంటి పరిస్థితిలో తమాషానా?”

“చూడు, ఒకసారిలాగే పెద్ద గొడవైంది. స్కైలాబ్ పడిపోతుందని. జనం ఇల్లు వాకిలి వదిలి పారిపోయారు. కానీ ఏం జరిగింది? అంతా టాయ్ఁ టాయ్ఁ తుస్స్!”

“ఓ మాహాలి బాబూ! ఏంటి? ఇప్పుడూ అంతేనంటారా?”

“అంతే ఉండొచ్చు.”

“దేవుడా!” అని ఫోన్ కట్ చేసింది. వేణు మళ్ళీ ఏవో విషయాలన్నీ ఆలోచించసాగాడు.

ప్రతిమ ఫోన్ పెట్టేసిందో లేక నెట్‌వర్క్ ప్రాబ్లమో! నిజంగానే తనకు హార్ట్ ఎటాక్‌గానీ వచ్చిందా? మళ్ళీ తనలో తనే మాట్లాడుకున్నాడు. ‘మళ్ళీ ఫోన్ చేయనా? ఒకవేళ తను చనిపోయి ఉంటే? చచ్చిపోనీ. లేకుంటే మాత్రం తానేమన్నా బతికే ఉండేదా? తను బాధపడి, నన్నూ బాధపెట్టేది. ఇప్పుడు అందరూ చావబోతున్నారు. తన చావు ముందు వస్తే కనీసం మేమున్నాం కన్నీళ్ళు కార్చడానికి. కానీ మేమంతా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మాకోసం ఎవరుంటారు?’

ఇవన్నీ ఆలోచిస్తూ వేణు ఎంత ఏడ్చేశాడంటే, పృథ్వి ధ్వంసం కావడం గురించి టీవీలో వచ్చే న్యూస్‌ను సరిగ్గా విననేలేదు.

ప్రతిమతో సంబంధం కలవడానికి ఇంకా ఆర్నెల్లు టైముంది. కాబట్టి ఆమె గురించి అంత ఏడవడం సరికాదని తనకు తాను నచ్చజెప్పుకున్నాడు.

వేణు సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న వాటర్ ప్యూరిఫైయర్ కంపెనీలో ప్రతిమ ఆరునెలల కిందట డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగంలో చేరింది. ప్రతిమ అంటే ప్రతిమ మహాపాత్ర. ఆమె వచ్చాక ఆఫీసులో ఉల్లాసం ఉత్సాహం వచ్చాయి. మేనేజర్ గుప్తాసాబ్ యాభై ఏళ్ళవాడు అయినా రోజూ కొత్త బట్టల్లో వస్తాడు. సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చందన్ విశ్వాల్ ముఖ్యంగా ప్రతిమను ఇంప్రెస్ చేయడానికి అప్పు చేసి మరీ ఒక పాత మారుతి జెన్ కొన్నాడు. అంతే కాదు, నేను ప్రతిమ మహాపాత్రను పడేశానని చెప్పుకుంటాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పెళ్ళి చేసుకుంటామంటాడు.

ప్రతిమ సుందరి. మధురభాషిణి కానీ దుఃఖితురాలు. బాలేశ్వర్‌లోని ఏదో పల్లెలో వాళ్ళిల్లు. ఆమె స్కూల్‌లో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఇంట్లో వితంతువు తల్లి, తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. వాళ్ళ మామ ఏదో కంపెనీలో పని చేస్తాడు. ఆయన సహాయంతో ప్రతిమ చదువుకుంది. ఎంతో ప్రయత్నించి వాళ్ళ మామ ఈ కంపెనీలో ఉద్యోగం వేయించాడు.

వేణు మళ్ళీ తన మనసులో ‘ఛ పనికిరాని సంగతులు, ఇవన్నీ నేనెందుకు ఆలోచిస్తున్నాను’ అనుకున్నాడు.

ఉన్నట్టుండి కాలనీలో ఏదో గొడవ వినబడింది. జనాలు అరుస్తున్నారు. “హర హర జయహో జయహో!”

వచ్చేసింది. బహుశా ఆ అగ్నిపిండం భూమి మీదికొచ్చింది. వేణు కూడా అరిచాడు. తర్వాత చూశాడు. మొబైల్ మోగుతోంది. ప్రతిమ. అంటే ప్రతిమ బ్రతికే ఉంది. భూమి ధ్వంసం అయ్యేముందు ప్రతిమ ఏమైనా చెప్పాలనుకుంటుందా?

వేణు ఫోన్ తీశాడు – “హలో”

‘థాంక్ గాడ్,” ప్రతిమ గొంతులో నిశ్చింత.

“ఎందుకు?” వేణు ఆశ్చర్యంగా అడిగాడు.

“మీరు నిద్రపోలేదు కదా, అరే! టీవీ చూడండి టీవీ,” అని చెప్పేసి ప్రతిమ ఫోన్ పెట్టేసింది.

వేణు టీవి వైపు చూశాడు. అరే ఇదేంటి? టీవిలో ‘ప్రమాదం తప్పింది’ అని ప్రకటన వస్తోంది! వైజ్ఞానికులు నిర్విచ్ఛిన్నంగా చేసిన ప్రయత్నాలవల్ల అంతరిక్షంనుంచి పడనున్న అగ్నిపిండాన్ని గ్యాస్‌గా మార్చి వాయుమండలంలో కలిపి వేయగలిగారు. కానీ ఈ విషవాయువులవల్ల మనుషులు సంతానోత్పత్తి సామర్థ్యాలను శాశ్వతంగా కోల్పోవచ్చని వైజ్ఞానికులు అనుమానిస్తున్నారు.

వేణు ఉలిక్కిపడ్డాడు. ‘ఇదేంటి? పురుషులు జీవించి ఉంటారు కానీ వీర్యహీనులై పోతారు. ఇదెలాంటి దౌర్భాగ్యం! ఈ విషయం గురించి ప్రజల ప్రతిస్పందన చూపిస్తున్నారు. ఒక వృద్ధుడు, “దేవుడు మనలను కాపాడాడు. మేము పిల్లలను, మనవళ్ళను చూసేశాము. మాకు ఏమైతే ఏమిటి?” అంటున్నాడు.

ఒక నడివయసు వ్యక్తి, “మంచిదే. రోజు రోజుకూ జనాభా పెరుగుతూనే ఉండడం చూస్తే కొన్నేళ్ళలోనే భూమ్మీద మనుషులు ఉండడానికి చోటు కూడా మిగిలేది కాదు. మంచిదైంది. అంతా తలరాత,” అన్నాడు.

ఒక యువకుడు, “కనీసం ఒక సంవత్సరమైనా సమయం ఇస్తే బాగుండేది. నాకో కొడుకు పుట్టేవాడు. పోన్లే, అంతా తలరాత,” అనుకున్నాడు.

వేణుకు ఊపిరాడలేదు. చేతులు కాళ్ళకు చెమటలు పడుతున్నాయి. బయటనుంచి ‘హరహరా’ అంటూ కేకలు వినిపిస్తున్నాయి. అయినా వేణుకు తాను ఒంటరినని బాగా దిగులుగా అనిపించింది. లేచి నిలబడ్డాడు. టీవి వైపు చూశాడు. అదే అదే మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నారు. పిల్లాడిలా గట్టిగా ఏడవాలనిపించింది. ఎందుకంటే తన వంశానికి తానే ఆఖరి చిహ్నాన్నని అతడికి నిశ్చయమైపోయింది. అది కూడా ఇక్కడే అంతమై పోతుంది.

తన ఉనికికి గుర్తింపు ఇచ్చేవాళ్ళెవరూ ఉండరు. వేణు మాహాలి అని ఒకడుండేవాడు అని కనీసం అనుకునేవాళ్ళు కూడా ఎవరూ ఉండరు. తాను గతం అయిపోతాడు. తండ్రినుంచి లభించే భూమి, ఆస్తికి యజమాని కావడానికి ఎవరూ ఉండరిక.

ఆలోచించేకొద్దీ గుబులు పెరిగిపోతోంది. ఊపిరి వేగంగా తీసుకుంటున్నాడు. అలసటగా అనిపిస్తోంది.

ఉన్నట్టుండి అతడు గట్టిగా నవ్వసాగాడు. గట్టిగా “బతికిపోయాను. నేను బతికిపోయాను. మా నాన్నగారి స్మృతి, గుర్తింపు బతికిపోయింది. నా వంశస్థులు వచ్చే దారి ఇప్పుడు దొరికేసింది” అంటూ అరవసాగాడు.

శాస్త్రవేత్తలు మనుషులకు సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందన్నారుగానీ పశువులు, పక్షులు, చెట్టూ చేమలు, పురుగులు, కీటకాల గురించి ఆ మాట చెప్పలేదు!

“నేను బతికిపోయాను. పశువుగానో పక్షిగానో చెట్టుగానో చేమగానో నేను మాత్రం బతికిపోయాను. నా వంశాన్ని వృద్ధి చేయకుండా నన్నెవరూ అడ్డుకోలేరు. ఎవరూ అడ్డుకోలేరు. ఎలా ఏ రూపంలో అయినా సరే బతకాలంతే”.

అందుకే వేణు మాహాలి కుక్క కావాలనుకున్నాడు. కుక్కకు ఉండే స్వతంత్రమైన భోజనము, స్వతంత్రంగా కూడడమూ, స్వతంత్రమైన జీవనమూ చూసి ఎంత ఉత్సాహం వచ్చిందంటే అతడు నెమలిగానీ జింకగానీ కావాలని అనుకోనేలేదు. కొన్నాళ్ళు కుక్క కావడానికి ప్రయత్నించి ఆ తర్వాత ఇక తన సాఫల్యాన్ని తాను పరీక్ష చేసుకోవాలనుకున్నాడు.

మొదట అతడు ఒక కొత్త చాయ్ కొట్టు దగ్గరికెళ్ళి నిలబడ్డాడు. తర్వాత కుక్కలా ఆశగా చూడడం మొదలుపెట్టాడు. కొట్టతను, “చాయ్ తాగుతారాండీ” అని అడిగాడు.

“భౌ భౌ…” వేణు రెండుసార్లు మొఱిగి ఊరుకున్నాడు.

కొట్టతను ఏమనుకున్నాడో తెలియదు. గొణిగినట్టుగా “కుక్కవా?” అని అడిగాడు.

ఆ గొణుగుడు కూడా వేణుకు వినిపించింది. ఎంతో ఆనందంగా ఇంకో రెండుసార్లు మొఱిగి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

వేణులో మార్పును కాలనీ జనాలంతా చూశారు. కానీ అతడిని ఎవరూ ఏమీ అడగలేదు. నడుముకు పట్టీ తగిలించుకొని, కుక్కలా నాలుగు కాళ్ళమీద నడుస్తుంటే అతడిని చూసీ ఆశ్చర్యపోవడం సహజంగానే జరుగుతుండేది. కానీ అతడి ఈ వ్యవహారం గురించి ఎవరూ ఏమీ అడగట్లేదు.

ఆఫీసులో ఎవరి టేబుల్ నుంచైనా ఫైల్ తీసుకొని చేతుల్లో ఇరికించుకొని రావడం, వాటిని ఎక్కడైనా దాచేయడం వీటన్నింటిలో వేణుకు భలే మజాగా ఉండింది.

ఒక రోజు అతడు ఒక శోకార్తుడైన బీదవాని నోటినుంచి రొట్టె లాక్కున్నాడు. ఆ రాత్రి అతనికి నిశ్చింతగా అనిపించింది. ‘సక్సెస్ అయ్యాను’ అనుకున్నాడు. కుక్కలాగా ప్రతిమతో రోడ్డు మీద గంటలకొద్దీ కూడాలని కోరిక కలిగింది. దీనివల్ల తానింకా సక్సెస్ అవుతున్నానని అనుకున్నాడు. అతడిప్పుడు మాట్లాడడం తగ్గించి, మొఱగడం ఎక్కువ చేశాడు. ఎందుకంటే కుక్క కావాలనుకున్నాడు కదా!

ఒకరోజు ప్రతిమ ఏకాంతంలో అతన్ని అడిగేసింది. “ఏయ్! అడిగానని ఏమనుకోవద్దు. ఈమధ్య మీరెందుకిలా బిహేవ్ చేస్తున్నారు?”

“ఎలా?” రెండుసార్లు మొఱిగి మరీ అడిగాడు.

“అచ్చం కుక్కలాగా మొఱగడం, కుక్కలా చూడడం, కుక్కలా…”

వేణుకు హుషారెక్కువైంది. “ఆ చెప్పు చెప్పు, ఇంకా కుక్కలా ఏమేం చేస్తానో చెప్పు!”

ప్రతిమ సిగ్గుపడుతూ, ‘ఛీ, ఎందుకిలా చేస్తున్నారు మీరు?’అంది.

ప్రతిమ సిగ్గుపడడం చూసిన వేణు భలే ముచ్చటపడ్డాడు. కుక్కగా మారిపోవడంలో తననిక ఎవరూ ఆపలేరు అనుకున్నాడు.

ఇప్పుడిక లెక్కలేనన్ని కలలు కనసాగాడు. బతికేందుకు లక్షల కలలు… వేషం వేసే కలలు… ఇక మనిషినుంచి కుక్కగా మారడమే అతని ఏకైక లక్ష్యమైంది.

ఒక్కోసారి మెడలో కుక్క బెల్ట్ వేసుకుంటాడు, ఒక్కోసారి ఇతరుల నోట్లోనుంచి రొట్టె లాక్కుంటాడు. ఒక్కోసారి తమ ఏరియాకొచ్చిన వాళ్ళమీద మొఱిగి వాళ్ళను తరుముతాడు. వీటిలో అపారమైన ఆనందం పొందుతుంటాడు.

ఇప్పుడిక వేణు మాహాలి కుక్కగా మారిపోయాడు. “జయహో! కుక్కలకు జయహో!” మొఱుగుతూ ప్రకటనలు చేసేవాడు.


కాలం గడిచేకొద్దీ వేణు కల కూడా పెద్దదైంది.

విషవాయువులు భూమిమీద వ్యాపించాక ఎవరికీ సంతానం కలగదనే మాటతో ఇప్పుడతనికి బాధ లేదు. ఇప్పుడతను మనిషి కాడు కాబట్టి ప్రాప్తం గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఇప్పుడతడు ఒక హింసాత్మక జంతువు. కుక్క. ఇంకెందుకు ఏడుస్తాడు?

ఉన్నట్టుండి వేణు కల భగ్నమైంది.

పూర్తిగా కుక్క అయిన సంతోషంలో ఉప్పొంగిపోయిన సందర్భంలోనే అతడికొక విషయం తెలిసింది. తానొక్కడే కాదు. చాలామంది చతురులైన వాళ్ళంతా తనలాగే జీవించడంలో తలమునకలై ఉన్నారు.

ఎటు చూసిన కుక్కగా మారేవాళ్ళే కనిపిస్తున్నారు. తను సాధించే లోపలే ఎంతోమంది మనుషులు కుక్కలైపోయారు. కుక్కల్లాగా అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు. ఇతరుల డబ్బును లాక్కుంటున్నారు.

వేణు తనను తానే తిట్టుకున్నాడు. ‘అయ్యో! వీళ్ళంతా నాకన్నా చతురులైపోయారే! నాకన్నా ఒక అడుగు ముందుకే వెళ్ళిపోయారే!’ అనుకోగా వేణు పశ్చాత్తాపంతో కుప్పకూలాడు. అప్పుడతని అంతరంగంలో ఒక కొత్త ఆలోచన అంకురించింది.

‘సరేలే, అయిందేదో అయింది. ఎలా బతకాలనుంటే అలా గడుస్తుంది. మనిషిగా ఉన్నప్పుడు బాగానే ఉండింది. ఇప్పుడు కుక్క బతుకు. ఇదీ బాగానే ఉంది. అందరూ చచ్చేరోజు వచ్చేదాకే మనిషిగానే ఉండరు. కొందరు చచ్చేలోగా దేవతలైపోతారు. ఇంకొందరు పురుగులై చస్తారు. నేనూ అలాగే కుక్కగా చస్తాను. దాంట్లో ఏముంది? మంచిదేగా. నేనొకవేళ నిజంగానే కుక్కనై ఉంటే నాకూ ఒక తోడు కావాలి. లేకపోతే ప్రపంచవృద్ధి ఎలా జరిగేది?’

ప్రతిమ కూడా ఆడకుక్కై పోతే… వేణుకీ ఆలోచన నచ్చింది.

ఉల్లాసంగా అనిపించింది. తనకు సంతానోత్పత్తి సామర్థ్యం పోలేదని ఆలోచించుకుని మనసుకు ఆహ్లాదంగా తోచింది. తోడు వెతుక్కునే అతని కలకు మళ్ళీ రెక్కలొచ్చాయి.

మిగిలిన బతుకంతా కుక్కలా బతికే ముందు, గతాన్ని గుర్తు చేసుకోవాలని అతనికి అనిపించింది.

పల్లెనుంచి ఒక సైకిల్, కొన్ని సామాన్లు తీసుకొని అతడు మొదట పట్నం వచ్చినప్పుడు, అతనికి చాలా తక్కువ కలలుండేవి, వాటి అవసరం కూడా మరీ అంత ముఖ్యమేమీ కాదు. తన స్కూలు, కాలేజ్ రోజులు ఎలా ఉండేవి, తన స్నేహితులు ఎంత మంచివాళ్ళు అన్నీ గుర్తొచ్చాయి. తన పల్లె, ఆ వంకరటింకర మట్టి రోడ్లు, మొగలిరేకులు, మల్లెపూల సుగంధాలను మోస్తూ తూరుపుగాలి వీస్తుంటే… అంతేనా, స్నేహితులతో కలిసి వానలో ముద్దగా తడిసి ముడుచుకుపోతూ ఇంటికి వెళ్ళడం, అమ్మతో తిట్లు తినడం గుర్తొచ్చింది! ఆహా! ఏమి రోజులవి.. ఎప్పుడు జారిపోయాయో పిడికిట్లోంచి! తెలీనే లేదు. అప్పుడు కలలు కూడా కొన్నే. దురాశ కూడా తక్కువే. అప్పుడీ ప్రపంచమంతా ఎంత అందంగా ఉండేదో! రాన్రానూ దురాశ పెరిగింది. కలలు పెచ్చు మీరాయి. వాటి వెనుకే తనూ పరుగులు తీస్తున్నాడు. కలలను సాకారం చేసుకొనే ఆత్రంలో తాను మనిషిగా ఉండకుండా కుక్కగా మారిపోయాడు. వెనకెక్కడో ఎప్పుడో వదిలేసి వచ్చిన రోజులన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి.

చాలా దిగులుగా అనిపించింది. ఆ రోజులు గుర్తొచ్చి మనసంతా వికలమై పోయింది. కానీ వాటిలో ఒక్కటీ తనతో మిగల్లేదు. తనతో ఉండాలని వాటికీ లేదేమో.

అతడు లేచి నిలబడే ప్రయత్నం చేశాడు. కానీ వీలు కావట్లేదు.

ఎందుకంటే ఇప్పుడతడు నిజంగా కుక్కై పోయాడు. ఇతరుల ఎంగిలి తినడం తన హక్కని నమ్ముతున్నాడు. ఒక సాధారణ విషయంకోసం అయిన వాళ్ళతో, ఇరుగు పొరుగుతో పోట్లాడుతున్నాడు. ఎప్పుడూ తన తిండి కోసం, తన రక్షణకోసం, భద్రంగా ఉండడంకోసం, బతుకీడ్చడంకోసం అస్తమానం పరుగులు తీస్తూనే ఉంటాడు. ఆ రంధిలో పడి తను ఎప్పుడు పూర్తిగా కుక్కలా మారిపోయాడో తెలీనే లేదు.

చుట్టుపక్కలంతా చూస్తూ గట్టిగా అరవడం మొదలెట్టాడు. “ఎవరైనా ఉన్నారా? ఎవరో ఒకరొచ్చి నాకు సహాయం చేయండి. నేను నిలబడడానికి సహాయం చేయండి. నన్ను లేపండి. నాకు చేతగావట్లేదు. నన్ను రక్షించండి. నన్ను విముక్తుడిని చేయండి. నాకు కుక్కగా బతకాలని లేదు. ఎవరో ఒకరైనా రండి. నేను మళ్ళీ మనిషిగా మారడానికి సాయం చేయండి. నా గతాన్ని నాకు తిరిగివ్వండి….కనీసం కొంచెం సహాయమైనా చేయండి. నాకు కుక్కగా ఉండాలని లేదు. మనిషై ఉండి, మనిషిగానే చనిపోవాలని నా కోరిక”.

మళ్ళీ అరవడం మొదలెట్టాడు. కానీ, తన గొంతు విని తానే ఉలిక్కిపడవలసి వచ్చింది.