అభిప్రాయాలు అనుమానాలు

ఒక వ్వతిరేక దృక్పథం

[ఈ రచన తొలిసారిగా తెలుగుభాషాపత్రిక ఏప్రిలు 1970 సంచికలో ప్రచురితమైనది. అమెరికాలో మొట్టమొదటి తెలుగు పత్రిక అయిన తెలుగుభాషాపత్రిక అన్నది చేతివ్రాతతో వచ్చిన పత్రిక. సైక్లోస్టైల్ కాపీ చేసి, అందరికీ పోస్టులో పంపించేవారు. అలనాటి వ్యాసాలలో ఒకటైన ఈ వ్యాసాన్ని ఈమాటలో పునర్ముద్రించమని పంపిన వేలూరి గారికి, వాటిని టైపుచేసి సహాయపడిన గొర్తి బ్రహ్మానందం, పరుచూరి శ్రీనివాసులకు మా కృతజ్ఞతలు. ఆ చేతిరాత కాపీలను కూడా జతచేస్తున్నాము. — సం.]


చేతిరాతతో 1970లో ప్రచురించబడిన అమెరికా తొలి తెలుగు పత్రిక తెలుగుభాషాపత్రికలో ఈ వ్యాసం మొదటి పేజి

“The woof and warp of all thought and all research is symbols, and the life of thought and science is the life inherent in symbols; to it is wrong to say that a good language is important to good thought, merely: for it is the essence of it.” — Charles S. Peirce.

ఎప్పుడో ఎక్కడో శ్రీశ్రీ అన్నాడు: ఆశయం వుండటం మంచిదే కానీ, అన్ని ఆశయాలూ మంచివి కావూ అని.

“ప్రాంతీయ భాషలనుద్ధరించి, సజీవ భాషలుగా మార్చుట” అనే ఆశయం నూటికి నూరు పాళ్ళు మంచి ఆశయమే. ఒక భాషని ఒక తెగ ప్రజలు మాట్లాడుతూన్నంత కాలం ఆ భాష సజీవ భాషే. ఈ దృక్పథంలో చూస్తే, మన ప్రాంతీయ భాషలన్నీ సజీవ భాషలే.


చేతిరాతతో 1970లో తెలుగుభాషాపత్రికలో ప్రచురించబడిన ఈ వ్యాసం రెండవ పేజి

ఇకపోతే “భాషని ఉద్ధరించటం” అన్న ఆశయాన్ని గురించి రెండు ముక్కలు. ప్రాంతీయ భాషల్లో ఆధునిక విజ్ఞానం పూజ్యం అన్న విషయం సర్వజన విదితం. ప్రాపంచిక సర్వవిజ్ఞానం మన ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేయిస్తే, మన విజ్ఞాన సాహిత్యం ఘనపరిమాణం టన్నుల కొద్దీ పెరిగి మనుషులుండటానికే చోటు వుండకపోవచ్చు. ఇంత హంగామా అయిన తర్వాత భాషలు ఉద్ధరించబడ్డాయి అంటే నీళ్ళు నమలాల్సి రావచ్చు.

మంచి ఆశయాలు రెండు రకాలు:
ఆచరణ సాధ్యాలు కొన్ని, కమ్యూనిస్టు ‘యుటోపియా’ లాటివి మరికొన్ని. మన మంచి ఆశయం ఆచరణ సాధ్యమా, కాదా అన్న ప్రశ్నకి సమాధానం చెప్పుకొనే ముందు, మరొక్క చిన్న ప్రశ్న. అసలు అన్ని భాషలూ, అన్ని విషయాలూ వివరంగా విశదీకరించటానికి పనికివస్తాయా? (ఈ రచయితకి ఏ భాష అన్నా వ్యతిరేకత లేదు. మాతృభాష మీద అందరికీ వున్నంత ప్రేమా వుంది.) ప్రపంచ భాషల్లో ఏ భాషా logically perfect కాదు. ఏ భాషలో నయినా సరే, ఒక మాటకి ఒక గుర్తు (symbol) వుంటే ఆ భాషలో వ్రాసేవాడికీ, ఆ రాసింది చదివేవాడికీ ఒకే అర్థాన్ని స్ఫురింప చేయటం సాధ్యమయిన పని. లుడ్విగ్ విట్గెన్‌స్టైన్ని (Ludwig Wittgenstein) జీవితాంతం బాధించిన ప్రశ్న!

అంటే, ఒక మాటని, ఒక ప్రత్యేకమైన గుర్తుగా ఆ భాష మాట్లాడే ప్రజలందరూ వాడటం అవసరం అన్నమాట. ఇది కాలానికి సంబంధించిన విషయం. ఒక క్రొత్త విషయం క్రొత్త ‘సింబల్స్’లో చెప్పాల్సి వచ్చిందనుకోండి; ఆ సింబల్స్’ వాడుకలోకి రావటానికి కొంతకాలం పడుతుందన్న మాట. అంటే, భాష, విజ్ఞాన పురోగమనంతో పాటు, దినదినాభివృద్ధి పొందుతుందనీ, ఒకేసారి ఉద్ధరించబడదనీ సారాంశం. ఇంగ్లీషు, తదితర యూరోపియన్ భాషలూ, ఈ రకంగా పురోగమించి, ఎంతో అదృష్టానికి నోచుకున్నాయి.

గత నూరు సంవత్సరాలుగా, మన ప్రాంతీయ భాషలు “ప్రేయసి మెల్లకన్ను మీద” బస్తాల కొద్దీ కవిత్వాన్ని ఉత్పత్తి చేశాయి తప్ప, ఆధునిక నాగరికత, విజ్ఞానాన్ని వివరించి చర్చించే విధంగా అభివృద్ధి చెందలేదు. ఇది శోచనీయం. అయినా నిజం. (కారణం ఏమయినప్పటికీ, మన ప్రస్తుత విషయానికి అనవసరం.) మనకి వున్న మాటలు బహుకొద్ది. ఆధునిక జీవితానికి అవసరమైన క్రొత్త ‘సింబల్స్’ మన భాషల్లోకి రాలేదు.

ఆ వున్న కొద్ది మాటలూ చూపినా ఈ నూరు సంవత్సరాల వైజ్ఞానిక పురోగమనాన్ని విశదీకరించలేవు. అంటే, ఇప్పటి విజ్ఞానాన్నంతనీ మన భాషల్లోకి “తెనిగించటానికి” మాటలు కావాలి. ఆ మాటలు అందరూ “ఊ” అనేవిగా వుండాలి గానీ “ధూమ శకటగమనాగమన నిర్దేశ తామ్ర పట్టిక” లాంటివి కాకూడదు. ఇది ఎంతవరకూ ఆచరణ సాధ్యమో ఆలోచించండి? ఎంత శ్రమో, ఎంత కాలయాపన పనో ఊహించండి? ఇలా అనగానే ఒక ప్రియమిత్రుడు ఒక ఉచిత సలహా పారేశాడు. సాంకేతిక పదజాలం తెనిగించటం కన్నా, ఆ “ఇంగ్లీషు, జర్మను, గ్రీకు, లాటిన్” మాటల్లాగే వుంచి విషయం మాత్రం ప్రాంతీయ భాషలో చెప్పటం మంచిదని.

అంటే మనం చేయబోయే పని కేవలం సింటాక్స్‌లో సర్కస్ అన్నమాట. ‘రైలు, సిగ్నలు, ఫ్లాట్‌ఫార్మ్, టైము లాంటి మాటలు, వాడుకలోకి వచ్చి భాషలో కలిసి పోవటానికి ఎంత కాలం పట్టిందో గుర్తుకు తెచ్చుకోవటం ఆరోగ్యకరమయిన పని.

ఎప్పుడో, ఎక్కడో, ఎవడో తెల్లదొర “ఈ ప్రాంతీయ భాష చాలా అందమయిందిస్మీ!” అన్న మాటలు పట్టికొని వూగులాడటం మా ‘తాతల నేతుల’ సామెత లాంటిది. బర్ద్వాన్‌లో బెంగాలీ, పూరీలో ఒరియా, మధురలో అరవం అంత అందంగానూ వుంటాయి. ఒక భాష యొక్క అందం, మాధుర్యం, ఆ భాష యొక్క సౌలభ్యానికి చిహ్నం కాదు కదా! (చీరెలన్నీ అందంగా వుండవూ? ఆ చీరెల్లో మా ఆవిడ ఎల్లా వుంటుందీ అన్నది అసలు ప్రశ్న).

ఇక ప్రత్యేకంగా తెలుగు గురించి: మనకి అక్షరాలు, గుణింతాలూ, వత్తులూ వగైరా అన్నీ కలిపి కోకొల్లలు — జనాభాలా. అందుచేత ఏ విషయం చెప్పాలన్నా తెలుగువాడు కొంచెం అధికంగా వాగాలి.

మనకి ఇప్పుడున్న అనువాదాలూ, వాటి బరువూ చూడండి. నూరు పేజీల ఇంగ్లీషు పుస్తకం, మూడింతలవుతుంది — తెలుగులోకొచ్చే సరికి.

ఒక్కొక్కసారి ఇంగ్లీషు మూలం దగ్గర లేందే, తెలుగు అనువాదం కొరుకుడు పడటం కష్టం కూడానూ. వ్యాకరణం గురించి చెప్పకుండా వదిలేయటమే మంచిది.

ఈ వ్యాసం మొత్తం మీద ఒక్క వాక్యం వ్యాకరణయుక్తంగా ‘రైటు’ అని అంటే, పరవస్తు చిన్నయసూరి ‘ససేమిరా’ — వొప్పుకోడు. వ్యాకరణాన్నీ, ఛందస్సునీ, నడుం విరగ్గొడదామని నడుంకట్టిన ఆధునికుల రచనల కన్నా, కొంచెం శ్రమపడితే నైషధం తేలిగ్గా అర్థమవుతుందని కొందరు విద్యాధిక మిత్రుల అంచనా (మన అదృష్టవశాత్తూ యీ ఆధునిక రచయితల్లో చాలా మంది ప్రస్తుతం సినిమా సేవ చేస్తున్నారు. శుభసూచకం.)

ప్రస్తుతానికి అప్రస్తుతం అయినప్పటికీ, ఉచ్చారణ పరంగా తెలుగు భాష చాలా కష్టమయింది. మిగిలిన భారతీయ భాషలు ఉచ్చరించటం తేలిక. అందుకనే కాబోలు తెలుగువాడు ఏ ఇతర భాషనైనా తేలిగ్గా వుచ్చరించగలుడు కానీ, ఆంధ్రేతరుడు మన మాటలూ, పేర్లూ చచ్చినా వుచ్చరించలేడు. (feather in the Cap for Telugus?)

పొదుపరితనం, సులభత్వం లేని భాషలో ఆధునిక విజ్ఞానాన్నంతా అనువదించటంలో గల కష్టాన్ని కాస్సేపు మరచి పోయినప్పటికీ, యీపని వలన వుపయోగం కూడా మాబోంట్లకు బోధపడటం లేదు. Myth of Sisyphus† గుర్తుకొస్తూంది. సిసిఫస్‌కి అది ఆనందదాయకమైన, విజయ సూచకమైన పనికావచ్చు.

ఆఖరి మాట: “ఇంత తర్కం, వాదం అనవసరం స్వామీ! మా మాతృ భాష మీద మాకు మోజు ఎక్కువ, అదేం పాపం కాదుకదా? అసాధ్యం అని వదిలేయటం పురుషలక్షణం కాదా మరి. కనీసం ప్రయత్నం చేస్తాం అనవసరమైనా సరే,” అన్నారే అనుకోండి. ఓ.కే. ఒప్పుకుందాం. అమెరికాలో ఆంధ్రులు ఆ పత్రిక పెట్టుకొని అందులో వైజ్ఞానిక వ్యాసాలు ప్రచురించుకోవచ్చు — ఓ హాబీగా. మరీ పిట్టకథలూ, పద్యాలూ, జోకులూ, వంటలూ వగయిరా ప్రచురించటం, క్రొత్త సీసాలో పాతసారా తంతుగా తయారయి, యిప్పటికే చెత్తగా పెరిగి పోయిన తెలుగు వంటి పత్రికల సంఖ్యని పెంచడం అవుతుంది కానీ, భాషోద్ధరణ కాదేమో మరి?

Let dying things die peacefully – amen.


*కేవలం చర్చనిమిత్తం 1970లో తెలుగుభాషాపత్రిక సంపాదకులు పి.వి. రావు గారి కోర్కెపై ఈ వ్యాసం వ్రాయబడింది – రచయిత.

†ఒక పెద్ద బండని ఓ పర్వత శిఖరానికి దొర్లించుకు పోవలసిందని దేవుడు సిసిఫస్‌ని శపించాడు. ఆ బండ శిఖరాగ్రాన నిలవదు. అయినా సిసిఫస్ తన జీవితమంతా బండ చాకిరీ చేశాడు.