“Prose: words in their best order; — poetry: the best words in the best order.” – Samuel Taylor Coleridge
Seasoned with jokes, clowning, satire,
Poetry still knows how to please.
Then its excellence is much admired.
But the grave combats where life is at stake
Are fought in prose. It was not always so.And our regret has remained unconfessed.
Novels and essays serve but will not last.
One clear stanza can take more weight
Than a whole wagon of elaborate prose.
– Czesław Milosz’s Preface to A Treatise on Poetry, translated by Robert Hass (2001).
అమెరికా తత్వవేత్త రిచర్డ్ రోర్టీ (Richard Rorty, 1931 – 2007) కాన్సర్ మూలంగా కొద్ది నెలలకి చనిపోతాడనగా, ఆయన బంధువొకరు చూడటానికి వచ్చి, “అవసానదశలో నీ ఆలోచనలు వేటి మీద? ఆధ్యాత్మిక విషయాల మీదనా, తాత్విక విషయాల మీదనా?” అని అడిగితే, రోర్టీ “ఎంతమాత్రమూ వాటి మీద కాదు,” అని జవాబిచ్చాడు. “మరి వేటి మీద?” అంటే, “కవిత్వం మీద,” అన్నాడు. రోర్టీ చివరి రచన జీవనజ్వాల (The Fire of Life) పొయట్రీ పత్రికలో ఆయన చనిపోయిన తర్వాత అచ్చయింది. ఆ పత్రికలో అదే అతని మొదటి రచనా, ఆఖరి రచనా.
రోర్టీ వ్యాసానికి నా సంగ్రహ అనువాదం:
“పదచిత్రణ, ప్రాస, లయ — ఈ మూడూ కలిస్తే వచ్చే బిగువూ, ప్రభావమూ, కవితకే సాధ్యం. వాటితో కవిత సృష్టించే మెరుపుల విన్యాసం ముందర అత్యుత్తమ వచనమూ దిగదుడుపే. నాకిప్పుడున్న దిగులు ఒక్కటే: జీవితంలో అలాంటి కవితలు ఇంకా ఎక్కువ చదువుకుంటే బావుండేదన్న చింత. అవేవో పరమ సత్యాలను వెల్లడి చేస్తాయని కాదు; అలాంటి సత్యాలు లేవు. మిగిలిన వారికి తెలియని, కవులకు మాత్రమే తెలిసిన విషయాలంటూ ఏమీ లేవు. సందర్భోచితంగా నెమరేసుకుంటూ కవితలని గలగలా చెప్పగలిగితే ఇంకా పరిపూర్ణమైన జీవితం గడిపేవాణ్ణి, దగ్గరి స్నేహితులతో కాలం గడిపినట్లు. ఎలా సాహిత్యం సమృద్ధిగా ఉన్న సమాజాలు మరింత సంపూర్ణ మానవీయ సమాజాలో, అలాగే, అనేక కవితలను, పద్యాలను నెమరేసుకోగలవారు మరింత సంపూర్ణ మానవులు.”
అదే ఆకాశం
నేను కవినీ కాదు, విమర్శకుడినీ కాదు; కేవలం ఓ సామాన్య పాఠకుడిని. ముకుంద రామారావు గారి “అదే ఆకాశం: అనేక దేశాల అనువాద కవితలు,” గ్రంథాన్ని సమీక్షించడానికి ఎందుకు సాహసించానంటే, ఈ పుస్తకంలో అనేక దేశాల కవితలు అందమైన తెలుగులో ఉన్నాయి; రోర్టీ అన్నట్లు వాటిని నెమరేసుకుంటే దగ్గరి స్నేహితులతో గడిపినట్లే.
ముకుంద రామారావు గారు 2016లో “అదే గాలి (2000 మంది కవుల పరిచయం),” 2019 లో “అదే నేల (3000 మంది కవుల పరిచయం),” 2022 లో “అదే కాంతి (210 మంది కవుల పరిచయం),” 2023 లో “అదే నీరు (వందమంది కవుల కవిత్వం),” ఇంకా ఎన్నో గ్రంథాలు ప్రచురించారు. తమ్మినేని “అనువాద ప్రస్థానం” లో సముచితంగా వారి బృహత్ కృషిని కొనియాడారు. వారికి అనేక పురస్కారాలు లభించడం హర్షించదగ్గది. “అదే ఆకాశం” తెలుగు పాఠకుల ఆదరణ పొంది రెండో ముద్రణకి నోచుకుంది.
వెల్చేరు తమ “అనువాదాలు – అపవాదాలు” వ్యాసంలో, “మూలాన్ని దగ్గర పెట్టుకుని ఏదో పుస్తకంలో కొంత భాగాన్నో, ఒక వాక్యాన్నో చూపించి, అందులో ఉండే ఏదో ఒక రకమైన సొంపు అనువాదంలో రాలేదని చెప్పడానికి, మూలంతో పోల్చి చూస్తే, అందులో వుండే అందాలు అనువాదంలో పోయాయని చెప్పి ఉదాహరణ చూపించడానికి తెలివితేటలు అక్కర్లేదు. ఈ పని దాదాపుగా ఎవరేనా చెయ్యగలరు,” అన్నారు.
వెల్చేరు గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. నేనిక్కడ చేసిన పనిని ఎవరైనా చెయ్యగలరు. నేనీ పుస్తకం విలువని గుర్తిస్తూనే, తరువాతి ప్రచురణలో నా సలహాలు, సూచనలు ఉపయోగపడవచ్చనే సదుద్దేశంతో సమీక్షిస్తున్నానే కాని రంధ్రాన్వేషణతో కాదు.
విరామచిహ్నాల ఆవశ్యకత
తెలుగు కవులకు ఆశ్చర్యార్థకాలంటే మోజనుకుంటాను. శ్రీశ్రీ “మహాప్రస్థానం” లోని కవితలలో అవి అతిగా ఉంటాయి. అనువాద కవిత “పేదలు” లో ఎన్ని ఉన్నాయో చూడండి; మూలంలో ఒక్కటీ లేదు. “అదే ఆకాశం” లో ఆశ్చర్యార్థకాల బాధ లేదు. సమస్యల్లా విరామచిహ్నాలు చాలా అరుదుగా కనబడటం. డెబ్భై పైగా ఉన్న కవితలలో నాలుగంటే నాలుగైనా బిందువులు లేవంటే అతిశయోక్తి కాదు; అవీ అనాలోచితంగా చేరాయని నా అనుమానం.
ఎందుకీ అశ్రద్ధ అని ముకుంద రామారావు గారి ఇతర కవితలని చూస్తే వీరికి విరామచిహ్నాలు వాడే అలవాటు లేదని స్పష్టమయింది. వాడకపోవడం పొరబాటని నా అభిప్రాయం.
పుస్తకానికి ఉండాల్సిన హంగులు
ఆయాదేశాల పట్టిక (Table of Contents) ఇచ్చారు కాని, కవుల, కవితల ప్రసక్తి పట్టికలో లేదు. దేశాల కన్నా కవులు ముఖ్యం కదా.
ఆంగ్ల కవితల సంకలనాలలో కవితా సూచిక (index) ఉండటం రివాజు; తెలుగు సంకలనాలలో అది అరుదు. ముద్దుకృష్ణ “వైతాళికులు” 1935లో ప్రచురించారు, కవితా సూచికతో పాటు కవుల పేర్ల క్రింద వారి కవితల సూచిక ఇస్తూ. దాదాపు వందేళ్ళ తర్వాత ప్రచురణలో ఆ మాత్రం స్థాయిని అందుకోకపోతే ఎలా?
కవుల పేర్లు తెలుగులో మాత్రమే ఇవ్వడంతో వారి గురించి తెలుసుకోవాలంటే కొంత కష్టపడాలి. కవుల పేర్లు, కవితల శీర్షికలు, ఇంగ్లీషులో ఇస్తే వెతుక్కోవడం సులభమవుతుంది.
కొందరు కవుల పేర్లు సరిగా ఇవ్వలేదు. “టొని ఇతరులు” అనడం సరికాదు. ఏ కవిత ఎక్కడనుండి తీసుకున్నారో తెలపలేదు; “ఇందులోవే కవితలు …” అని పుస్తకాల జాబితా ఇచ్చి పాఠకులని వెతుక్కోమన్నారు.
ఆ జాబితాలో ఒకటి Kenneth Rexroth రాసిన “Women Poets of China.” ఇది నాకు కుతూహలాన్ని కలిగించింది – మనకి కవయిత్రులు పూర్వకాలంలో చాలా తక్కువ కదా, చైనీయులలో ఎలా ఉండేది అని. కాని కవుల వివరాలలో చూస్తే కవయిత్రులెవరూ ఉన్నట్లు లేదు; మెయి యావోచెన్ పురుషుడు; యూన్ చీయూట్సై ఎవరో తెలియదు; మిగిలిన వారందరినీ పురుషులుగా వివరించారు. Rexroth పుస్తకంలోని ఏ స్త్రీ కవితని అనువదించారో తెలుసుకోలేకపోయాను.
“A Thousand years of Vietnamese Poetry,” by Alfred A Knopf అని ఇచ్చారు. Knopf ప్రచురణ సంస్థ పేరు, రచయిత పేరు కాదు.
Czeslaw Milosz ఫ్రాన్స్‌లో శరణు పొందినా స్థిరపడి పౌరసత్వం పొందింది అమెరికాలో.
ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా అనిపించవచ్చు. సృజనకి సంబంధం లేనివేనని ఒప్పుకుంటాను. కాని ఇన్ని దేశాల కవితలని ఎంతో శ్రమతో సేకరించి, అనువదించిన రచయిత మరి కొంత శ్రద్ధ తీసుకొని మరింత నాణ్యంగా ప్రచురించవచ్చు గదా. Czeslaw Milosz సంకలనం[1] చూస్తే ఆధునిక సంకలనం ఎలా ఉండాలో తెలుస్తుంది.
సలహాలు, సూచనలు
కవితని తెలుగులో చదివి, నాకు అర్థం కాకపోతేనో, పదప్రయోగం సరిగా లేదనిపిస్తేనో, ఆంగ్లానువాదాన్ని సంప్రదించాను. ఆ కవితలలో కొన్నిటిని క్రింద ఇస్తున్నాను. సౌలభ్యం కోసం, ప్రతి కవితకీ ముందర తెలుగు అనువాదం ఉన్నదున్నట్లుగా (అక్షరదోషాలతో సహా), తరువాత నా వ్యాఖ్య, చివరగా ఆంగ్లానువాదం ఇచ్చాను.
బద్ధకం
వాంగ్ వెయి (701 – 761)సమయంతోబాటు పద్యం రాయాలన్నా సరే
బద్ధకం మొదలయింది
ఇప్పుడు నాకు తోడు ముసలితనమే
క్రితం జీవితంలో నేనొక కవిని, ఒక పొరబాటు
నా ముందరి శరీరం చిత్రకారుడుది
ఆ జీవితపు అలవాట్లు వదులుకోలేను
ఒక్కోమారు ఇప్పటి ప్రపంచం నన్ను గుర్తుపడుతుంది
నా పేరు, నా కలం పేరు, నా గతాన్ని మాటాడతాయి
అయినా నా హృదయానికివేవీ పట్టవు
ఆంగ్లానువాదం: టొని ఇతరులు
“సమయంతోబాటు పద్యం రాయాలన్నా సరే/బద్ధకం మొదలయింది,” అన్న వాక్యం అసంబద్ధంగా ఉంది. టైం తో వచ్చే చిక్కుల గురించి రారా అనువాద సమస్యలు లో రాశాడు. “వయసు పైబడడంతో పద్యాలు రాయాలంటే బద్ధకం వేస్తుంది,” అంటే సులభంగా అర్థమవుతుంది.
“క్రితం జీవితంలో నేనొక కవిని, ఒక పొరబాటు/నా ముందరి శరీరం చిత్రకారుడుది” ఇంపుగా లేదు. “గత జీవితంలో, పొరబాటున నేనొక కవిని, చిత్రకారుడుని,” అనొచ్చు.
అప్పటికీ, ఈ కవిత నాకు పూర్తిగా అర్థం కాలేదు కాని, ఆ కష్టం ఆంగ్లంలో కూడా ఉంది. Milosz వివరణ కొంత ఉపకరిస్తుంది:
“Wang Wei was a poet and a painter but also an official, and many of his poems juxtapose contemplating life in the spirit of Taoism and Buddhism with active life and career from which it’s not easy to be liberated. But in his old age he achieved a peculiar kind of nonattachment, when even poetry and painting seemed to him too close to earthly delusion.”
– by Wang Wei
With time I become lazy about writing poems.
Now my only company is old age.
In an earlier life I was a poet, a mistake,
and my former body belonged to a painter.
I can’t abandon habits of that life
and sometimes am recognized by people of this world.
My name and pen name speak my former being
but about all this my heart is ignorant.
— Translated by Tony and Willis Barnstone and Xu Haixin
నిశ్శబ్దపు రాత్రి ఆలోచనలు
లీపో (701 -762)నా పక్కముందు
ప్రకాశవంతంగా చంద్రకాంతి
నేలంతా పిండారబోసినట్టుతలెత్తి చూస్తే
వెలిగిపోతున్న చంద్రుడు
తలకిందికి దింపుతే
ఇంటికి చేరుకున్నట్టు కల
ఆంగ్లానువాదం: వేలీ
పిండారబోసినట్లు కాసిన వెన్నెల ఆహ్లాదకరమైన దృశ్యమే. కాని అది ఇంటిని ఎందుకు కలలోకి తెచ్చింది? నేను చైనీయుల కవితలు (ఆంగ్లంలోనే) ఒకటి రెండు కంటే చదవలేదు కాని దీని గురించి ఎక్కడో చదివినట్లు గుర్తొచ్చి వెతికితే, దీనిని “కవిత్వమంటే ఏమిటి?” అన్న ప్రశ్నకి సమాధానమివ్వడానికి ఇస్మాయిల్ ఉదహరించారని తెలిసింది [3]. ఇస్మాయిల్ ఆంగ్ల పాఠాన్ని (“Over my bed … making it look like frost — covered ground”) ఇచ్చినా అది ఎవరిదో తెలపలేదు.
“వేలీ” అంటే, చైనీయుల, జపనీయుల సాహిత్యాన్ని అనువదించిన Arthur Waley అని పేరున్న రచయిత. కాని ఆంగ్లానువాదం అతనిదేనా అన్నది రూఢిగా తెలియదు. Arthur Cooper అనువాదం (“Li Po and Tu Fu” నుండి) కింద ఇచ్చాను.
తెలుగు అనువాదంలో ఉన్న ముఖ్యమైన లోపం frost ని పిండి అనడం. ఆ ఒక్క పదంలో వచ్చిన తేడా ఈ కవితని సరిగా అర్థం చేసుకోనివ్వదు. ఇస్మాయిల్ వ్యాఖ్య:
“చాలా సరళమైన పద్యం. ఇందులో ఏముందనిపిస్తుంది, కాని కవిని వేధించిన ఒంటరితనం మనల్నీ బాధ పెట్టకమానదు. ఈ అనుభూతి పాఠకులకి ఏవిధంగా రవాణా అయిందనేదే ప్రశ్న. పక్కమీద వెన్నెల పడి మంచుకప్పిన నేలలా ఉందట. తలవాలిస్తే ఇంటిగురించి ఆలోచనలు ముంచుకు వచ్చాయట. ఇక్కడ రెండు పద చిత్రాలతో (images) గాఢమైన ఫలితాన్ని సాధించాడు… ఏవి ఈ పదచిత్రాలు? వెన్నెలపడిన పక్క మంచునేలలా ఉండటం, ఒకటి. మంచుమీద అడుగు వెయ్యటమే బాధాకరంగా ఉంటుంది. పక్క మంచుగడ్డలా తోచిందన్నమాట. తలెత్తి చూస్తే అంతా కాంతిమంతంగా ఉండి; వెంటనే తల వాల్చాడు – ఇది రెండోది. ప్రియురాలు లేని కాంతి ఎందుకనుకున్నాడేమో, తలవాల్చగానే ఇంటి ఆలోచనలు పైకొన్నాయి. ఈ పదచిత్రాలు ఒకదానికొకటి పేర్చగానే, ఏదో ఒంటరితనమూ, దిగులూ, ఉత్కంఠా ఉద్భవిస్తున్నాయి.”
by Li Po
Before my bed
there is bright moonlight
So that it seems
like frost on the ground:
Lifting my head
I watch the bright moon,
Lowering my head
I dream that I’m home.
– Translated by Arthur Cooper
వర్ణచిత్రకారుడు
సు తుంగ్ పో (1036-1101)ఏకాంతవాసిలా సన్నని వెదురు
కన్యలా సహజమైన పువ్వు
కొమ్మల్ని తొలుస్తూ వడ్రంగి పిట్ట
పూలమీద జల్లులా వర్షపు పెనుగాలి
ఎగరటానికి తన రెక్కల్ని విస్తరించి
అన్ని ఆకుల్నీ కుదుపుతోంది
తేనె వలలో మధువుని సేకరిస్తూ తేనెటీగలు
ఎంత అద్భుతమైన ప్రతిభ కావాలో
కుంచెతో కాగితమ్మీద పూర్తి వసంతాన్ని సృష్టించటానికిఅతను కవిత్వమే ప్రయత్నిస్తే
నాకు తెలుసు
అతను పదాల పరిపూర్ణుడవుతాడు
ఆంగ్లానువాదం: కెన్నెత్ రెక్సోర్త్
అనువాదం చక్కగా ఉంది. “చిక్కుకున్న తేనెటీగలు” అనొచ్చు; “కావాలో” ని పరిహరించి “సృష్టించటానికి” బదులు “సృష్టించటం” అంటే బావుంటుంది. master of words కి “పదాల పరిపూర్ణుడు” సరిగా లేదు; “మాటల మాంత్రికుడు,” “వచోనిధి ,” “వాచస్పతి,”వీటిలో ఏదైనా సరిపోయేది. ఆంగ్లంలోని విరామ చిహ్నాలు పాటించకపోవడాన రెండు మూడు సార్లు చదివితే గాని ఎక్కడెక్కడ ఆపాలో తెలియదు.
కవిత ప్రాముఖ్యత చిత్రం పైన, చిత్రకారుడి మీద కాదు; శీర్షికని మూలంనుండి మార్చాల్సిన అవసరం లేదు.
ప్రాచీన చైనా కవిత్వంలో కవీ చిత్రకారుడూ కలిసి సృజించడం సహజమనీ, పాశ్చాత్య ప్రపంచంలో కూడా కవిత్వాన్ని చిత్రలేఖనంతో పోల్చారనీ (“In poetry, as in painting,” – Horace), మిలోష్ అంటాడు. పాశ్చాత్య కవులూ, చిత్రకారులూ దానిని ఇష్టపడ్డారా? మిలోషే అంటాడు :
But speech cannot be a picture
And nothing more.
For ages it has felt the lure
Of pulsating rhyme, of dream, of melody.
by Su Tung Po
The slender bamboo is like a hermit.
The simple flower is like a maiden.
The sparrow tilts on the branch.
A gust of rain sprinkles the flowers.
He spreads his wings to fly
And shakes all the leaves.
The bees gathering honey
Are trapped in the nectar.
What a wonderful talent
That can create an entire Spring
With a brush and a sheet of paper.
If he would try poetry
I know he would be a master of words.
– Translated by Kenneth Rexroth
నాకు చెప్పు, గులాబీ నగ్నమా
పాబ్లో నెరూడా (1904-1973)నాకు చెప్పు, గులాబీ నగ్నమా
లేక తనకున్నది అదొక్కటే దుస్తాచెట్లెందుకు దాచుకుంటాయి
వాటి వేర్ల వైభవాన్నిఎవరు వింటారు
దొంగిలించబడుతున్న వాహనం పశ్చాత్తాపాన్నిరైలు వర్షంలో నిలబడి ఉండటంకంటే
ప్రపంచంలో విషాదం మరేదైనా ఉందాఆంగ్లానువాదం: విలియం ఓ డాలీ
దుస్తా అంటే దుస్తువా అన్నది వెంటనే తట్టలేదు; “దుస్తువా” లేక “వస్త్రమా” అంటే బావుండేది.
పశ్చాత్తాపం అన్నది పెద్ద మాట; తప్పు చేస్తే కదా పశ్చాత్తాపం. “దిగుళ్ళని” లేక “చింతలని” వాడొచ్చు.
Pablo Neruda చనిపోవడానికి కొద్ది నెలలు ముందర రాసిన A Book of Questions లోని కవిత ఇది. దానిలోని కవితలన్నీ ప్రశ్నలే. అనువాదంలో ప్రశ్నార్థకాలు లేకపోవడం లోపమే.
Tell me, is the rose naked
or is that her only dress?
Why do trees conceal
the splendor of their roots?
Who hears the regrets
of the thieving automobile?
Is there anything in the world sadder
than a train standing in the rain?
– Translated by William O’Daly
బాంబు చుట్టుకొలత
యెహుదా అమీహాయ్ (1924-2000)బాంబు చుట్టుకొలత
ముప్పయి సెంటీమీటర్లు
దాని కార్యసాధక పరిధి
ఏడు మీటర్లునలుగురు మరణించి
పదకొండు మంది గాయపడి
దాని చుట్టూ సమయంతో పెనవేసుకున్న
పెద్ద బాధల వలయందూర దూరంగా రెండు ఆసుపత్రులు
ఒక స్మశానంకానీ ఆ స్మశానంలో
ఖననం చేయబడ్డ ఆ యువతి
వంద కిలోమీటర్ల కంటే దూరంనుండి వచ్చింది
ఆ వలయాన్ని పెంచుతూసముద్రాల కావల
అతనొక్కడే ఆమె కోసం విచారిస్తూ
సమస్త ప్రపంచాన్ని ఆ వలయంలోకి లాగుతాడునేను అనాథల ఆక్రందనల విషయం చెప్పటమే లేదు
అవి దేవుడి సింహాసనానికి చేరతాయి
ఇంకా ఆవలికి
వలయాన్ని అంతం లేకుండా చేస్తూ
అసలు దేవుడే లేకుండా చేస్తూ
ఆంగ్లానువాదం: ఛనా బ్లోచ్
పాదాలను విడదీయడం, పాదాల మధ్య ఖాళీ పెట్టడం, విరామ చిహ్నాలని నిర్లక్ష్యం చేయడం – వీటి వలన మూలంలో ఉన్న స్పష్టత అనువాదంలో కొరవడింది.
బాంబు ప్రత్యక్ష కార్య పరిధి కొంచెమే అయినా, బాంబు ప్రభావం అంచెలంచెలుగా ఎలా విస్తృతమయేదీ, క్రమంగా పెరిగే వలయాల రూపంలో మూల కవిత చూపుతుంది: నలుగురు చనిపోయారు, పదకొండు మంది గాయపడ్డారు; వాళ్ళ చుట్టూ ఇంకా పెద్దదయిన వేదనతో కూడిన వలయంలో రెండు ఆసుపత్రులు, ఓ శ్మశానం చెల్లాచెదరయాయి; మరో వంద కిలోమీటర్ల దూరాన తను పుట్టిన నగరంలో ఖననమైన యువతి ఆ వలయాన్ని బాగా విస్తరించింది ; సముద్రానికి ఆవలితీరాన ఆవిడకి నివాళి ఇస్తున్న ఒంటరి మనిషి ఆ వలయాన్ని ప్రపంచమంత పెద్దది చేశాడు.
“దాని చుట్టూ సమయంతో పెనవేసుకున్న,” ఈ పద ప్రయోగం అసహజంగా ఉంది; రారా అన్నట్లు టైం తో వచ్చే చిక్కు; ఒక్కోసారి టైం ని వదిలేస్తే పెద్ద నష్టం లేదు.
యువతి చనిపోయింది శ్మశానంలో కాదు; తన నగరంలోనే; అది బాంబుకి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతేకాని యువతి వంద కిలోమీటర్ల దూరం నుండి రాలేదు.
by Yehuda Amichai
The diameter of the bomb was thirty centimeters
and the diameter of its effective range about seven meters,
with four dead and eleven wounded.
And around these, in a larger circle
of pain and time, two hospitals are scattered
and one graveyard. But the young woman
who was buried in the city she came from,
at a distance of more than a hundred kilometers,
enlarges the circle considerably,
and the solitary man mourning her death
at the distant shores of a country far across the sea
includes the entire world in the circle.
And I won’t even mention the crying of orphans
that reaches up to the throne of God and
beyond, making a circle with no end and no God.
– Translated by Chana Bloch
జెరూసలెం
యెహుదా అమీహాయ్ (1924-2000)పాతనగరం మేడ మీద
మద్యాహ్నం ఎండలో ఆరేసిన బట్టలు
నా శత్రువైన ఆమె తెల్లదుప్పటి
నా శత్రువైన అతని తుండుగుడ్డ
నొసటమీద అతని చెమట తుడుచుకుందుకుపాతనగరం ఆకాశంలో
ఒక గాలిపటం
దాని దారపు చివర
ఒక పిల్లవాడు
గోడ అడ్దుంది కాబట్టి
నేను చూడలేనుమేము బోలెడన్ని జెండాలు పాతాము
వాళ్ళూ ఎన్నో పాతారు
వారు ఆనందంగా ఉన్నామని మాకు తెలియజేసేందుకు
మేము ఆనందంగా ఉన్నామని వారికి తెలియజేసేందుకు
— ఆంగ్లానువాదం: ఛనా బ్లోచ్
చాలా పేరున్న కవిత; కొన్ని సూచనలు:
- “పాతనగరం మేడ మీద” బదులు “పాతనగరంలో ఓ మేడ మీద”
- late afternoon కి మధ్యాహ్నం మంచిదా, సాయంత్రం మంచిదా?
- “పాతనగరం ఆకాశంలో” బదులు “పాతనగరం పైని ఆకాశంలో”
- జెండాలు పాతడానికి బదులు ఎగరేయడం.
యూదులకీ పాలస్తీనులకీ మధ్య జరుగుతున్న సంఘర్షణ గురించిన కవిత అని అర్థమవుతుంది. “To make us think they are happy” కి “వారు ఆనందంగా ఉన్నామని మాకు తెలియజేసేందుకు” సరైన అనువాదం కాదు. “To make us think” కీ “To let us know” కీ చాలా తేడా ఉంది.
అనువాదాల మీద అంతగా ఆసక్తి లేకపోయినా, అమీకాయ్ అభిమానిగా మారిన జయప్రభ ఈ కవితకు చేసిన అనువాదంలో చివరి పంక్తి:
“అయినా మేమెన్నో జండాల నెగరేస్తాం
వాళ్ళెన్నో జండాల నెగరేస్తారు
వాళ్ళు సంతోషంగా ఉన్నారని
మేం అనుకోడానికీ!
మేం సంతోషంగా ఉన్నామని
వాళ్ళనుకోడానికీ!”
by Yehuda Amichai
On a roof in the Old City
Laundry hanging in the late afternoon sunlight:
The white sheet of a woman who is my enemy,
The towel of a man who is my enemy,
To wipe off the sweat of his brow.
In the sky of the Old City
A kite.
At the other end of the string,
A child
I can’t see
Because of the wall.
We have put up many flags,
They have put up many flags.
To make us think that they’re happy.
To make them think that we’re happy.
– Translated by Stephen Mitchell
ఎవరినన్నా మరచిపోవటం
యెహుదా అమీహాయ్ (1924-2000)ఇంటివెనక దీపాన్ని ఆర్పటం మరచిపోవటం లాంటిదే
ఎవరినన్నా మరచిపోవటం
మర్నాడంతా అది వెలుగుతూనే ఉంటుందిఅయితేనేం
ఆ దీపమే నీకు గుర్తు చేస్తుంది
— ఆంగ్లానువాదం: ఛనా బ్లోచ్
పాదాన్ని రెండుగా విడదీసి, వాటిని తారుమారు చేయడానేమో మూలంలోని భావం సరిగా రాలేదు.
“ఇంటివెనక దీపం” అంటే “ఇంటి వెనక వీధి దీపం” అనుకొని, దానినెందుకు ఆర్పేస్తామా అని నాకు చాలాసేపు అర్థం కాలేదు. backyard అంటే “ఇంటివెనక” కన్నా వేరే మాట వాడొచ్చు:
“ఒకరిని మరిచిపోవడం అన్నది
పెరటి దీపాన్ని ఆర్పడం మరిచిపోవడం లాంటిది!” — జయప్రభ
by Yehuda Amichai
Forgetting someone is like forgetting to turn off the light
in the backyard so it stays lit all the next day
But then it is the light that makes you remember.
– Translated by Chana Bloch
మూడు ఎబ్బెట్టు పదాలు
విస్లావా సింబోర్స్కా (1923-2012)నేను భవిష్యత్తు పదాన్ని ఉచ్చరిస్తే
అది మొదటి అక్షరానికే భూతకాలానికి చెందిపోతుందినేను నిశ్శబ్దం పదాన్ని ఉచ్చరించి
దాన్ని నేను ధ్వంశం చేస్తానునేను శూన్యం పదాన్ని ఉచ్చరించి
ఉనికిలో పట్టుకోలేనిదేదొ నేను తయారుచేస్తాను
ఆంగ్లానువాదం: చెస్వ మిలోజ్
ఎబ్బెట్టు అంటే జుగుప్స, రోత. ఇక్కడ కవయిత్రి మూడు మాటలతో వినోదమాడుకుంటోంది. అవి చాలా విచిత్రమైనవి; ఎబ్బెట్టుకరమైనవి కాదు.
మూలంలో మూడు సార్లు “When I pronounce” అనే ఉంది. మొదటిసారి “ఉచ్చరిస్తే” అని, తర్వాత “ఉచ్చరించి” అనడం ఎందుకు?
మూలంలో మూడు పదాలనీ capitalize చేసి వాటికి ప్రాధాన్యత ఇచ్చారు. అందుకు సమానంగా తెలుగులో ఏం చెయ్యాలి?
చివరి పాదం మూలంలో కన్నా తెలుగులోనే బావుంది.
by Wisława Szymborska
When I pronounce the word Future,
the first syllable already belongs to the past.
When I pronounce the word Silence,
I destroy it.
When I pronounce the word Nothing,
I make something no non-being can hold.
– Translated by S. Baranczak & C. Cavanagh
మనిషి సముద్రం
అన్నా స్విర్ (1909-1984)వినయంతోనో ఉత్సాహంతోనో
సముద్రాన్ని నువ్వు లోబర్చుకోలేవుకానీ దాని మొహం మీద
నువ్వు నవ్వొచ్చునవ్వును
కనుగొన్నవారెవరో
హఠాత్తుగా నవ్వినంత
కాస్సేపుశాశ్వతమైన సముద్రం
నవ్వటం ఎప్పుడూ నేర్చుకోదు
ఆంగ్లానువాదం: చెస్వ మిలోజ్
ఎన్నిసార్లు చదివినా ఇది అర్థం కాలేదు: “నవ్వును / కనుగొన్నవారెవరో / హఠాత్తుగా నవ్వినంత / కాస్సేపు”
ఆంగ్లమూలం చదివాక అర్థమయ్యింది. దీన్ని ఇలా సులభంగా అనొచ్చు:
నవ్వును కనుగొన్న మనిషి క్షణికమే.
ఫక్కున నవ్విన నవ్వులా.
క్షణికమైన మనిషి (మాత్రమే) నవ్వగలడు; శాశ్వతమైన సముద్రం నవ్వలేదు అన్న తారతమ్యం ఆంగ్లానువాదంలో స్పష్టంగా వినిపిస్తుంది.
by Anna Swir
You will not tame this sea
either by humility or rapture.
But you can laugh
in its face.
Laughter
was invented by those
who live briefly
as a burst of laughter.
The eternal sea
will never learn to laugh.
– Translated from the Polish by Czeslaw Milosz and Leonard Nathan
రైతు
అజ్ఞాతకవి (16వ శతాబ్దం)కొందరు వడ్లని కూలికోసం నాటుతారు
నేను మాత్రం కాదునేనలా నిల్చొని చూస్తూనే ఉంటాను
ఆకాశాన్నీ భూమినీ మేఘాల్నీ
వర్షాల్నీ రాత్రుల్నీ పగల్నీ
నా కాళ్ళు రాళ్ళయేదాకానారాళ్ళు కరిగి
ఆకాశం నిర్మలమై
సముద్రం నెమ్మదించాకే
నాకు శాంతి
ఆంగ్లానువాదం: గ్మూన్ నాక్ బిచ్
ఇక్కడ “నేనలా నిల్చొని చూస్తూనే ఉంటాను / ఆకాశాన్నీ భూమినీ మేఘాల్నీ / వర్షాల్నీ రాత్రుల్నీ పగల్నీ” కేవలం చూడటమేనా? The farmer watches, observes, keeps track and stands guard. Without all those verbs the farmer’s pride (English title) doesn’t come across.
Some folks transplant rice for wages,
but I have other reasons.
I watch the sky, the earth, the clouds,
observe the rain, the nights, the days,
keep track, stand guard till my legs
are stone, till the stone melts,
till the sky is clear and the sea calm.
Then I feel at peace.
– From A Thousand Years of Vietnamese Poetry by Nguyen N. Bich, W. S. Merwin, Burton Raffel
చావు
ఎమిలి డికిన్సన్ (1804-1882)చావు సందేహించి
భూమితో వాదిస్తుంది
అయినా ఆత్మ విడిచిపోతుంది
అలా బూడిదని పెద్ద పైచొక్కాలా
జాడగా వదిలేసి
ప్రఖ్యాత అమెరికన్ రచయిత్రి Emily Dickinson కవితని ఎంచుకోవడం నాకానందం కలిగించింది (నేను ఆవిడ స్వస్థలమైన అమ్‌హెర్స్ట్ (Amherst) లో చదువుకున్నాను).
చావు కి వచ్చిన సందేహం ఏమిటి? భూమితో ఎందుకు వాదన? మూలంలో మొదటి భాగాన్ని వదిలెయ్యడంతో భావానికి పెద్ద చిక్కే వచ్చింది.
The Spirit and the Dust.
“Dissolve” says Death,
The Spirit “Sir
I have another Trust” –
Death doubts it –
Argues from the Ground –
The Spirit turns away
Just laying off for evidence
An Overcoat of Clay.
ఆత్మకీ దేహానికీ మధ్య సాగే సంభాషణ చావు. వెంటనే చావే పాత్ర అయి ఆత్మని ఆజ్ఞాపిస్తుంది, చాలించమని. ఆత్మ, “కాదు, నాకు వేరే (దేహానికి మించిన) అస్తిత్వం ఉన్నది,” అంటుంది.
చావు నమ్మదు. భౌతిక ఆధారాల ననుసరించి చావు ఆత్మతో వాదిస్తుంది. (Argues from the Ground అంటే భూమితో వాదించడం కాదు.) ఆత్మ నిరాకరించి శరీరాన్ని బూడిద జాడగా వదిలి వెళ్ళిపోతుంది.
కూడిక
సి.పి.కవాఫీ (1863-1933)నన్ను నేను ప్రశ్నించను
ఆనందంగా ఉన్నానా లేదా అని
అయినా ఒక విషయం
ఆనందంగా గుర్తు చేసుకుంటానుఆ గొప్ప కూడికలో (వాళ్ళ కూడిక నాకు అసహ్యం)
చాలా సంఖ్యలుంటాయి
అక్కడున్న వాటిల్లో నేనొక్కడినే కాదు
అంతిమ కూడికలో నన్ను లెక్కించనే లేదుఆ ఆనందం నాకు చాలు
— ఆంగ్లానువాదం: రే డాల్వెన్
“అక్కడున్న వాటిల్లో నేనొక్కడినే కాదు” సరికాదు. “అక్కడున్న వేటిల్లోనూ నేనొకడిని కాదు” అనో, “అక్కడున్న వేటిల్లోనూ నేను లేను” అనో అనాలి.
happy, gladly, job – మనకీ ఉన్నాయి కదా అలాంటి మాటలు చాలా; అన్నిటికీ ఆనందమే వాడాలా?
by C. P. Cavafy (1863 – 1933)
I do not question whether I am happy or unhappy.
Yet there is one thing that I keep gladly in mind —
that in the great addition (their addition that I abhor)
that has so many numbers, I am not one
of the many units there. In the final sum
I have not been calculated. And this joy suffices me.
– Translated by Daniel Mendelsohn
నా సమాధి దగ్గర నిల్చుని ఏడ్వొద్దు
మేరీ ఎలిజిబెత్ ఫ్రే (1904 – 2004)నా సమాధి దగ్గర నిల్చుని ఏడ్వొద్దు
నేనక్కడ లేను, నిద్రపోవటం లేదునేను వీస్తున్న వేయి గాలుల్ని
నేను మంచం మీద మెరుస్తున్న వజ్రాన్ని
నేను విచ్చుకున్న విత్తనం మీద పడుతున్న సూర్యరశ్మిని
నేను ఆకురాలు కాలంలోని వర్షాన్నిఉదయం సద్దులేకుండా నువ్వు లేచినపుడు
నేను పైకెగురుతున్న వేగాన్ని
గిరికీలు కొడుతున్న పక్షుల్లో
రాత్రి నేను మృదువైన కాంతి నక్షత్రాన్నినా సమాధి దగ్గర నిల్చుని ఏడ్వొద్దు
నేనక్కడ లేను, నిద్రపోవటం లేదు
నా సమాధి దగ్గర నిల్చుని ఏడ్వొద్దు
నేనక్కడ లేను, నేను చావలేదు
Mary Elizabeth Frye కెనడా కవయిత్రి అన్నారు కాని ఆవిడ అమెరికా నివాసి. అసలు “Do not stand by my grave and weep” ని ఆవిడ రాసిందా అన్నది వివాదాస్పద విషయం; దానిని పక్కన పెడదాం.
కొన్ని పాదాలు (వీస్తున్న వేయి గాలుల్ని, విచ్చుకున్న విత్తనం మీద పడుతున్న సూర్యరశ్మిని, ఆకురాలు కాలంలోని వర్షాన్ని) చక్కగా ఉన్నాయి. “మంచం మీద మెరుస్తున్న వజ్రాన్ని” అన్నది మాత్రం ఇమడలేదు. మూలంలో మంచం లేదు, వజ్రమూ లేదు; వజ్రపుకాంతితో మెరుస్తున్న మంచు ఉన్నది. ప్రకృతి వర్ణన మధ్యలో మంచం వచ్చి శోభకి భంగం కలిగించింది.
“ఉదయం సద్దులేకుండా నువ్వు లేచినపుడు,” కు బదులు “సద్దుమణిగిన ప్రొద్దున్నే నువ్వు లేచినపుడు” అంటే మూలానికి (“morning’s hush”) దగ్గరగే ఉండేది. “వేగాన్ని … పక్షుల్లో” కన్నా “గిరికీలు కొడుతూ పైకెగురుతున్న పక్షుల ప్రవాహాన్ని” అనొచ్చు. ఆంగ్లంలోని విరామ చిహ్నాలు పాటించకపోవడాన రెండు మూడు సార్లు చదివితే గాని ఎక్కడ ఆపాలో తెలియదు.
— Mary Elizabeth Frye (?)
Do not stand at my grave and weep,
I am not there, I do not sleep.
I am a thousand winds that blow;
I am the diamond glints on the snow.
I am the sunlight on ripened grain;
I am the gentle autumn’s rain.
When you awaken in the morning’s hush,
I am the swift uplifting rush
Of quiet birds in circled flight.
I am the soft star that shines at night.
Do not stand at my grave and cry.
I am not there; I did not die.
అనువాద ప్రక్రియకు కాలం చెల్లబోతోందా?
నేనీ వ్యాసం Milosz/Haas ఆంగ్ల కవితతో మొదలెట్టాను. దానికి మైక్రోసాఫ్ట్ కోపైలట్ అనువాదం:
వినోదం, జోకులు, వ్యంగ్యంతో రుచిచేసిన కవిత్వం
ఇప్పటికీ మనసును రంజింపజేయగలదు.
అప్పుడు దాని గొప్పతనాన్ని ఎంతో మెచ్చుకుంటారు.
కానీ ప్రాణాలే పణంగా ఉండే తీవ్రమైన పోరాటాలు
గంభీరమైన గద్యలోనే సాగుతాయి. ఎప్పుడూ అలా కాదు.మనం ఆవేదనను బయటపెట్టలేదు.
నవలలు, వ్యాసాలు ఉపయోగపడతాయి కానీ నిలవవు.
ఒక స్పష్టమైన పద్యపు చరణం
అలంకారికమైన గద్యంతో నిండిన బండికంటే
ఎక్కువ బరువును మోయగలదు.
గొప్ప అనువాదం కాదు. అలాగని చవకబారుదీ కాదు. యాంత్రిక అనువాదం మెరుగయే కొలదీ అనువాద ప్రక్రియ సాహితీ సృజనగా మనగలదా?
పుస్తకం: అదే ఆకాశం: అనేక దేశాల అనువాద కవితలు.
రచన: ముకుంద రామారావు
ప్రచురణ: నిషితా పబ్లికేషన్స్. రెండో ముద్రణ. 2023.
వెల: ₹140.00 పే. 116.
ప్రతులకు: ప్రముఖ పుస్తక దుకాణాలు.
సంప్రదించిన పుస్తకాలు
:
- Czeslaw Milosz. A Book of Luminous Things: An International Anthology of Poetry. Harcourt Brace & Company. 1996.
- రాచమల్లు రామచంద్రారెడ్ది. అనువాద సమస్యలు. విశాలాంధ్ర. మూడో ముద్రణ. 2011.
- ఇస్మాయిల్. కవిత్వంలో నిశ్శబ్దం. దేశి బుక్స్. రెండో ముద్రణ. 2006.
- జయప్రభ. ప్రతికూల పవనాలు & శిశిరంలో మాస్కో. చైతన్య – తేజ పబ్లికేషన్స్. 2005
.
