గెలుపు

యాదయ్య కూలీ. కొత్తగా కడ్తున్న యింటి మెట్లు ఎక్కుతున్నాడు. నెత్తి మీద ఇటుకల బరువు కన్నా పొద్దున మనుమరాలుకు ఇచ్చిన మాట పదే పదే గుర్తుకొస్తుంది. కాళ్ళు తడబడ్డ యాదయ్యను చూసి ‘సూసుకోని పైకెక్కు, లేకుంటే జారివడ్తవ్‌, అసలే ముసలోనివి’ అన్నాడు మల్లిగాడు. యాదయ్యకు 60 ఏళ్ళుంటాయి. తన బిడ్డ, మూడేళ్ళ మనుమరాలు తప్పా నా అన్న వారు ఎవరూ లేరు. యాదయ్య శరీరమక్కడున్నా, మనసు మాత్రం మనుమరాలుకు ఇచ్చిన మాట మీదే నిలిచింది. ఎట్లా, ఎట్లా మాట నిల బెట్టు కునేది. అసలు నిలబెట్టుకో గలడా? చేతిలో నయా పైస లేదు. గుత్తేదారును అడిగాడు ఒక రెండు వందలిమ్మని. తన కూలిలో పట్టుకోమన్నాడు. ఎంత బతిమలాడినా గుత్తేదారు డబ్బులివ్వక పోగా “రాత్రికి నీ బిడ్డను పంపియి, దానికిస్త” అని వెకిలిగా నవ్వి ‘ఊ’ అంటాడేమోనని ఎదురు చూసాడు. తంబాకు చేతిలో రుద్ది ముందు పళ్ళ కింద పెట్టుకొని వెళ్ళిపోయాడు. యాదయ్య సినిమా హీరో కాదు గుత్తేదారు మూతి పగలగొట్టడానికి. ఇలాంటి మాటలు ఎన్నో విన్న యాదయ్య వాటిని పట్టించుకోలేదు. ఎందుకంటే తన బిడ్డను ఎవడో మేస్త్రీ చెరిచి కనబడకుండా వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకు తన బిడ్డ గర్భవతి ఆయ్యింది. నిర్మాణ రంగంలో మనిషి ప్రాణానికి, స్త్రీల మానానికి రక్షణ లేదు. గర్భవతి అని తెలిసిన తరువాత కూలిపని మాన్పించాడు. మనుమరాలు పుట్టిన తరువాత తిండికి ఇబ్బందై ఒకరింట్లో అంట్ల పనికి పంపాడు. వయసులో ఉన్న బిడ్డను ప్రతి ఒక్కరూ ఒకటికి రెండు సార్లు చూసేవారు ఏదో ఆశిస్తూ. యాదయ్యకు కోపం వచ్చేదికాదు హీరో కాదు కదా. తన కర్మ అనుకునే వాడు. ఇప్పుడూ అలాగే సరి పెట్టుకున్నాడు. మళ్ళీ మనుమరాలుకు ఇచ్చిన మాట గుర్తొచ్చి తను పని చేసే మేస్త్రీని అప్పు అడిగాడు. దానికి మేస్త్రీ “పోయిన్నెల బిడ్డకు జ్వరమని తీసుకున్నవు నెల రోజులైనా దిక్కులేదు, ఇప్పుడేమొచ్చింది అంత అవసరం?” అన్నాడు మేస్త్రీ, చేతిలోని తాపీని యాదయ్య మొహానికేసి చూపిస్తూ. ఏమని చెప్పాలి? ఎలా చెప్పాలి? విషయం చెబితే ఇస్తడా? లేదు. పైగా తిడతాడు. ఎట్లా, ఎట్లా? మనుమరాలు కిచ్చిన మాట ఎట్లా నిల బెట్టు కునేది? యాదయ్య రాజకీయ నాయకుడు కాదు ఇచ్చిన మాట మరచి పోవటానికి. ఇంతకీ మనుమరాలికిచ్చిన మాట ఏమిటంటే, రాత్రికి ఇంటికి బిర్యాని తెస్తనని మాట ఇచ్చాడు. పొద్దున మాటల్లో తన మనమరాలు పుట్టిందీరోజేనని తనబిడ్డ చెపుతుంటే విని తన మనుమరాలు “తాతా ఇయాల బిరాని తెత్తవా?” అని బుంగ మూతి పెట్టి అడిగింది. మొన్నెప్పుడో తన బిడ్డ పనిచేసే ఇంట్లో వాళ్ళ బాబు బర్తుడే తెల్లారి మిగిలిన బిర్యాని ఇస్తే తిన్నది. అది గుర్తుకొచ్చి అడిగింది. బిర్యాని అంటే సగం దినం కూలి అని ఆ పిల్లకేం తెలుసు? ఐనా తెస్త అని మాటిచ్చాడు. అప్పుడు దాని కళ్ళల్లో చూసిన ఆనందం గుర్తుకొచ్చింది.

ఎండాకాలమే కాని ఎందుకో నల్లని మేఘాలు కమ్ముకుంటన్నవి. సూర్యున్ని కప్పేసి కదులుతూ వెలుగును తరుముతున్నాయి. యాదయ్య మదిలో ఆలోచనలు కూడా మేఘాల్లా ముసురుకొంటున్నాయి. యాదయ్య సమస్యకు పరిష్కార మార్గం కనబడడం లేదు. మద్యాహ్నాం, ఇంటి నుంచి బట్టలో చుట్టి తెచ్చుకున్న జొన్న రొట్టెలు తినేప్పుడు తనతో పని చేసే లచ్చిమి అడిగింది “కాకా అంతవసరమేమొచ్చిందే, ఇంట్ల అందరి పానాలు బాగున్నయా”? “ఆ… ఏంలే తియ్యి” అన్నాడు. అన్నాడు కాని ఏదో ఆశ, ఏ పుట్టలో ఏ పాముందో. ఇంకో పక్క లచ్చిమి తాన ఉంటయా అని సంశయం. అయినా ఆడాల్ల దగ్గర డబ్బులేడుంటై, అని పురుషాహంకారం అడ్డొచ్చింది. మళ్ళీ పనిలో పడ్డారు అందరు. గాలి రయ్యమని వీస్తుంది. ఇటుకలు మోస్తూ యాదయ్య మెట్లెక్కి దిగుతున్నాడు. మట్టి వాసనకు యాదయ్య మళ్ళా ఈ లోకంలోకి వచ్చాడు. వాన వస్తే ఇంటికి బిర్యాని ఎట్లా తీసుకొని పోవాలి. చిన్న సంచి కూడ లేదు. బిర్యాని తడిసిపోతే? రెండొందలు దొరకాలే గాని ఎట్లనైన తీస్కపోత అనుకున్నడు. యాదయ్య దగ్గర పాత తుప్పుపట్టిన సైకిలుంది. అదున్నందు వల్లనే అయిదు కిలోమీటర్ల దూరమున్నా, ఇంత దూరం పనికి వచ్చాడు. దాన్ని కుదువ బెడదామనుకున్నాడు. అది పెట్టుకొని పైసలెవరిస్తరా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఉరుములతో వాన మొదలైంది. చిన్న చినుకులు. ఆకాశం వైపు తల ఎత్తి చూసాడు. ‘పెద్ద వర్షమే పడేట్టుంది!’ మనసులో అనుకున్నాడు. కాసేపటికి వాన ఎక్కువైంది. యాదయ్యకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అందరు పని చాలించి కాళ్ళు చేతులు కడుక్కొని, వాన మరీ ఎక్కువ కాక ముందే ఇళ్ళకు బయలుదేరారు. “కాకా ఇగో నాతాన వంద రాపాలున్నయి తీస్కో” అంది లచ్చిమి. అప్పుడు యాదయ్యకు లక్ష్మీదేవి ప్రత్యక్షమై మొయ్యలేనన్ని కనక రాసులు ఇచ్చినట్లనిపించింది ఆ నిమిషంలో. అంతే వంద రూపాయలు తీసుకుంటూ “నీ కాల్మొక్కాల్నే తల్లి, టైంకిచ్చినవ్‌” అంటూ వంద రూపాయలను జేబులో పెట్టుకొని సైకిల్ తీస్కొని, “లచ్చిమి… నిన్ను ఇంటి కాడ దించుత రా” అని లచ్చిమి వద్దన్నా వినకుండా సైకిలెక్కించుకొని బయలుదేరాడు. ఫెడెల్ తొక్కినప్పుడల్ల సైకిలు కిర్రు కిర్రు మంటుంది. ఐనా అదేమి లెక్క చేయకుండా లచ్చిమిని వాళ్ళ గుడిసె దగ్గర దించి తన ఇంటి వైపు సైకిల్ని తిప్పాడు.

బిర్యాని వంద రూపాయలకు ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు. వర్షం పెద్దదయింది. యాదయ్యకు వానకు పోటీ పడింది. ఉరుముల శబ్దం ఎక్కువైంది. ఈదర గాలి కూడ ఎక్కువైంది. ఉండుండి పెటెల్‌ మని పిడుగులు పడుతున్నాయి. పూర్తిగా తడిసి పోయాడు. కళ్ళ మీద పడుతున్న వాన నీళ్ళు తుడుచుకుంటూ సైకిల్ తొక్కుతున్నాడు. కిర్రు శబ్దం రావడం లేదు. అప్పుడు తట్టింది మల్లిగాని ఇంట దగ్గర ఒక తుర్కాయన వంద రూపాయలకు బిర్యాని అమ్ముతడని. సైకిల్ మల్లిగాని ఇంట వైపు తిప్పాడు. అక్కడక్కడ రోడ్డు మీద మోకాలు లోతు నీళ్ళు పారుతున్నాయి. యాదయ్య సైకిల్ ఆ నీళ్ళ మీద పడవలాగ పోతుంది. గుంతల్లో ఎగిరెగిరి పడుతుంది. ఆకాశానికి చిల్లుపడినట్లు వాన కురుస్తూనే ఉంది. వర్షం ఎంత పడుతుంది అన్న ద్యాస లేదు యాదయ్యకు. రోడు మీద కార్లు రయ్ మని పోతున్నాయి. సైకిల్ కొంచం రోడ్డు మధ్యకు జరిగినా, ఇది మా రోడ్డు అని కార్లు హారన్లతో ఆరుస్తున్నాయి తుప్పు పట్టిన సైకిల్‌ని.

తుర్కాయన హోటల్ బైట సైకిల్ ఆపి దిగిన యాదయ్యకు వొళ్ళు జలదరించింది చల్లగాలికి. ముఖం చెయ్యితో తుడుచుకొని ఒక బిర్యాని ఇమ్మని, తడిసిపోయిన వంద నోటు ఇచ్చాడు. ఆ చోటు కాస్త వెచ్చగా ఉంది. బిర్యాని వాసనతో నిండి పోయింది. తుర్కాయన ఆ వంద రూపాయల నోటును పరిశీలనగా చూసి యాదయ్య ముఖాన్ని చూశాడు. యాదయ్యకేమి ఆర్థం కాలేదు. తుర్కాయన పాన్ నములుతూ “అరే. టేబుల్ సాఫ్ కర్ రే” అని మళ్ళీ ఆ తడిసిన నోటుని పైకెత్తి చూసి దాన్ని ఎడమ చేతితో పట్టుకున్నాడు. యాదయ్యకు అనుమానం వచ్చింది. ఒక వేళ చెల్లనిదేమో అనిపించింది. పక్కనే బిర్యాని పొట్లాలు కట్టేటాయన న్యూస్ పేపర్ తీసికొని దాని పైన విస్తరాకు పరిచి వేడి వేడి బిర్యాని వేసి మడిచి దారం చుట్టి ఇస్తున్నాడు. తుర్కాయన తన తరువాత వచ్చిన ఇద్దరు గడ్డం సాయబ్‌లకు బిర్యాని పొట్లాలు ఇచ్చాడు. తరువాత తనకే ఇస్తాడనుకున్నాడు. మళ్ళీ వేరే వాళ్ళకిచ్చాడు. తుర్కాయన వంద నోటును, యాదయ్యను మళ్ళీ చూశాడు. యాదయ్యకు ఆత్రుత పెరిగింది. “ఒక్క బిర్యాని” అని చూపుడువేలు చూపించాడు. తుర్కాయన ఏం మాట్లాడలేదు. ఆ వంద నోటును గల్లా పెట్టెలో వేయలేదు. ఇస్తాడా, ఇయ్యడా? ఇది యాదయ్యను కొరుక్కుతింటున్న అనుమానం. రేడియోలో అన్ని వాన పాటలే వినిపిస్తున్నవి. మళ్ళీ “సాబ్ ఏక్ బిర్యాని” అన్నాడు యాదయ్య పళ్ళు ఇకిలించి. ఈ సారి వచ్చిన బిర్యాని పొట్లం పల్చని ప్లాస్టిక్ కవర్‌లో వేసి యాదయ్యకిచ్చాడు. ఆ ప్లాస్టిక్ కవర్‌ను తన సద్ది మూట తెచ్చుకున్న బట్టలో పెట్టి ముడి వేసాడు. ఊపిరి పీల్చుకొని బయటకు వస్తుంటే సిగరేటు వాసన గుప్పుమని తగిలింది.

గబగబ సైకిల్ దగ్గరకి వచ్చి ఆ మూటను జాగ్రత్తగా సైకిల్ ఎడమ చేతి హాండిల్ లోపలికి దూర్చి ఒకసారి మూట లాగి చూసి, స్టాండు తీసి వానతో తను గెలిచినట్టుగా సంతోషపడి చీకటిలో కలిసి పోయాడు.

అప్పుడు జరిగింది అనుకోని సంఘటన. రోడ్డుపైన గుంతల్ని, స్పీడు బ్రేకర్లని అడ్డంగా వచ్చే వాహనాలను దాటుకుంటూ ఇంటికి ఇంకా పావు కిలోమీటరు దూరం ఉన్నప్పుడు జరిగింది. అంత జరిగినా ఉరుము ఉరమ లేదు. పిడుగు పడలేదు. తాను ఇంకా ఓడి పోలేదన్నట్లు వర్షం ఇంకా జోరుగా కురుస్తుంది. ఆ జరిగిన సంఘటన చూసినా ఎవరూ పట్టించుకోలేదు. లోకం తీరే అంత. ఏం జరిగిందంటే, ఉన్నట్టుండి కరెంటు పోయింది. దారి కనిపించడం లేదు. స్పీడుగా వస్తున్న యాదయ్య సైకిల్ అడుగులోతు గుంతోలో పడి ఫెడెల్ ఊడిపోయింది. దాంతో యాదయ్య మోకాలు బిర్యాని పొట్లంకు తగిలింది. సైకిల్‌తో సహా కింద పడ్డాడు. బిర్యాని పొట్లం రోడ్డు మీద పడగానే మూట ఊడి పోయి ప్లాస్టిక్ కవర్ పగిలి బిర్యాని అంతా చెల్లా చెదురైంది. కార్ల లైటు వెలుగులో ఇదంతా కన్పించింది. మనుమరాలుకిచ్చిన మాట బురద నీళ్ళలో కలిసిపోయింది. వాన, గెలిచిన సంకేతంగా మెరుపు మెరిసింది. కింద పడిన వాడు లేచి కూర్చున్నాడు. వర్షం దారగా పడుతూనే ఉంది. పొట్లం వైపు చూశాడు. అంతలో ఓ కారు ఆ పగిలిన పొట్లం పైనుంచి పోయింది. బురద నీళ్ళు బిర్యాని అన్నం యాదయ్య ముఖంపైన చిట్లి పడ్డాయి. అప్రయత్నంగా బిర్యాని రుచి నోట్లో పడింది. బిర్యాని వాసన ముక్కుకు తగిలింది. వెంటనే వర్షం తను పూర్తిగా గెలిచి నట్లుగా అనుకొని యాదయ్య ముఖాన్ని కడిగేసింది. యాదయ్యకు మనుమరాలు గుర్తుకొచ్చింది. ఆకలి గుర్తుకొచ్చింది. వర్షం గుర్తుకొచ్చింది. సైకిల్ గుర్తుకొచ్చింది. మళ్ళీ మనుమరాలు గుర్తుకొచ్చింది. తన మీద తనకే అసహ్యం వేసింది. అంతా ఐపోయింది. బిర్యాని నేల పాలైంది. తప్పెవరిది? గుంతదా? సైకిల్‌దా? వర్షందా? యాదయ్యదా? తప్పెవరిది? దీనికి తీర్పు ఇచ్చే జడ్జి ఏరి? అయినా కోర్టులకు డబ్బున్నోళ్ళ కేసులే ముఖ్యం. యాదయ్యకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తన చిట్టి తల్లికిచ్చిన మాట గుర్తుకొచ్చింది. దాని పుట్టిన రోజు గుర్తుకొచ్చింది. దాని నవ్వు గుర్తుకొచ్చింది. యాదయ్యకు ఏడ్పొచ్చింది. రోడ్డ మీద పోయే మోటర్ సైకిల్ వాళ్ళకు యాదయ్య పీకల దాక తాగి పడ్డాడని కోపమొచ్చింది. వర్షం కురుస్తూనే ఉంది.

“హాయ్ బిరాని బాగుంది. బిరాని బాగుంది” అంటూ చప్పట్లుకొడుతూ ఇల్లంతా పరిగెత్తుతూ, తాతకు దొరక్కుండా, ఎగురుతూ తల్లి దగ్గిరికెళ్ళి ముద్ద నోట్లో పెట్టించుకొని పరిగెత్తుతుంటే యాదయ్య మనుమరాలుని పట్టుకొని బుగ్గ మీద ముద్దు పెట్టాడు. మనుమరాలికిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తృప్తిగా అనిపించింది. “ముగ్గురికి సరిపోయేటంత తెచ్చినవ్, పైసలేడివే”? బిడ్డ అడిగింది. “హాయ్ బిరాని” అంటూంటే పొలమారింది మనమరాలికి. నెత్తి మీద తడుతూ నీళ్ళు తాగించాడు యాదయ్య. జరిగిన విషయం అంతా గుర్తుకొచ్చింది.

యాదయ్య పడిన చోటనుండి లేచి సైకిల్ పైకి లేపుతుంటే పక్కనుంచి ఓ మోటరు సైకిల్ దూసుకొని పోయింది. దాంతో బాటు అరుపులతో కూడిన తిట్లు అలాగే దూసుకుపోయినై. మరో మోటర్ సైకిల్ దూసుకొచ్చి యాదయ్య పడిన గుంతలోనే పడి పైకి లేచి ముందుకెళ్ళి ఆగింది. ఈ సారి తిట్లు వినపడలేదు. గుంతలో పడి లేచిన కుదుపుకు మోటర్ సైకిల్ పెట్రోల్ టాంకు పైననుంచి ఒక సిల్వర్ ఫాయిలున్న మూట బురద నీళ్ళలో పడింది.

మోటర్ సైకిల్ అతను ఒక్క సారి వెనక్కు తిరిగి చూసి నిట్టూర్చి ముందు కెళ్ళిపోయాడు. ఆ సిల్వర్ ఫాయిలున్న మూటే ఇది అంటూ బిర్యాని పాకెట్ చూపించాడు.

వర్షం ఆగలేదు. గాలీ తగ్గలేదు. వర్షానికి, ఈ రోజుకు ఏ సారూప్యత లేదు. అయితే, మనుమరాలికి, యాదయ్యకు సారూప్యత ఉంది. అది తొర్రి పన్ను. మనుమరాలికి మళ్ళీ వచ్చేది, యాదయ్యకు మళ్ళీ రానిది. వర్షం మళ్ళీ వచ్చేది ఈ రోజు మళ్ళీ రానిది. బోజనాలు ముగించిన తరువాత యాదయ్య తలుపు దగ్గరికి వెళ్ళి వర్షాన్ని చూశాడు. వర్షం ఆగిపోయింది. అంటే వర్షం ఓడిపోయిందా? వర్షం ఆగినా ఉరుములు ఉరుముతునే ఉన్నాయి. పిడుగు పడిన మెరుపులో యాదయ్య ముఖంలో విజయ గర్వం కనిపించింది.