You must be ready to give up even the most attractive ideas when experiment shows them to be wrong. – Volta
టార్చిలైట్లలో, ఆటవస్తువులలో, అనేక పరికరాలలో అతి సామాన్యంగా కనబడే బ్యాటరీని చూడని వారు ఉండరు. దానిని కనిపెట్టినవాడు భౌతిక శాస్త్రవేత్త అలెస్సాండ్రో వోల్టా (Alessandro Volta, 1745 – 1827) అని కూడా చాలా మందికి తెలుసు. బ్యాటరీలమీదా, అన్ని విద్యుత్ పరికరాల మీదా కనిపించే V గుర్తు, బ్యాటరీని కనిపెట్టి, విద్యుత్ శాస్త్రాన్ని ఓ చారిత్రాత్మకమైన మలుపు తిప్పిన వోల్టాని గుర్తించడానికే.
ఆంగ్లంలో గాల్వనైజ్ (galvanize) అనే మాట చాలా మంది వినే ఉంటారు. (ఉదా: The leader galvanized the team members.) వైద్యుడైన లూయీజి గల్వాని (Luigi Galvani, 1737 – 1798) కప్పలలో విద్యుత్తు ఉన్నదని ప్రయోగాలు చేసి చూపెట్టడాన ఆమాట ఆంగ్ల భాషలోకి వచ్చింది. విద్యుత్తుని కొలిచే పరికరం పేరు – గాల్వనో మీటర్ – కూడా ఆయన పేరు నుండే.

గల్వానీ, వోల్టా (ChatGPT తయారీ)
ఇటలీకి చెందిన వీరిద్దరి మధ్య చెలరేగిన వివాద ఫలితమే బ్యాటరీ. ఈ పోట్లాటలో గెలిచిన వోల్టా, చక్రవర్తి నుండి సన్మానాలు పొందాడు. నైతిక విలువలని విడవక, మారిన ప్రభుత్వానికి లొంగకుండా పదవిని కోల్పోయి గల్వాని పేదగా చనిపోయాడు. ఆ వివాద పూర్వాపరాలు, వారిద్దరి జీవితాల గురించిన వ్యాసం ఇది.
కప్పలకీ, విద్యుత్తుకీ ఏమిటి సంబంధం? ఇంతకు మునుపటి వ్యాసాలలో పసుపుపచ్చరాయిని రుద్దితే విద్యుత్తు పుడుతుందనీ, రాపిడి యంత్రాలతో విద్యుత్తుని పుట్టించారనీ, దానిని లేడెన్ జాడీలో నిల్వ వుంచి, విడుదల చేసి, షాక్ కలిగించవచ్చనీ తెలుసుకున్నాం. మెరుపులో ఉన్నది కూడా విద్యుత్తేనని ఫ్రాంక్లిన్ పతంగి ప్రయోగం ద్వారా చూపెట్టాడానీ చదివాం. ప్రకృతిలో విద్యుత్తు ఉన్నట్లే ప్రాణులలో కూడా విద్యుత్తు వుందా అని శాస్త్రవేత్తలకి సందేహం వచ్చింది. అందుకు కారణం కొన్ని రకాల చేపలు తీవ్రమైన షాక్ కొట్టించగలవని మానవులకు అనాదిగా తెలిసి ఉండటమే.
విద్యుత్ చేప (Electric Fish)
ప్లేటో సంభాషణ మేనో లో సోక్రటీస్‌తో మేనో, “నువు చప్పిడి ముక్కుతో టోర్పీడోని పోలి ఉంటావు; టోర్పీడోని తాకితే ఎలా షాక్ కొడుతుందో, నీతో మాట్లాడితే, నీప్రశ్నలతో వేగలేక షాక్ కొట్టినట్లు మెదడు మొద్దుబారిపోతుంది,” అంటాడు.
రోమన్ కవి క్లాడియన్ (Claudian, 370 – 404) రాసిన కవిత The Torpedo ప్రారంభం:
Who hath not heard the dire Torpedo’s fame,
The strength, the power, denoted in its name?
What though its form is tender, and its pace
Scarce leaves upon the sands a languid trace,
With subtle poison Nature arms its sides;
Throughout its frame a freezing influence glides,
Which binds all life and heat in icy chains,
And native winters dwell within its veins.
To Nature, too, deceitful arts it owes;
The wond’rous gift, by her conferr’d it knows;
మెదడు నుండి ఇతర అవయవాలకి నరాలు (nerves) సాగి ఉంటాయని గ్రీక్ రోమన్ వైద్యుడు, తత్వవేత్త అయిన గేలన్‍కి (Galen, 129 – 216) తెలుసు. జంతువులలో జీవ రసం (animal spirits) ఉందనీ, దాని ద్వారా గొట్టాల లాంటి నరాలు అవయవాలకి సంకేతాలు పంపుతాయనీ గేలన్ అభిప్రాయపడ్డాడు. కాని ఆంటోనీ ఫిలిప్స్ వాన్ లీవెన్‌హూక్ (Antonie Philips van Leeuwenhoek, 1632 – 1723) 1674 లో మైక్రోస్కోప్‍తో పరిశోధించి నరాలు బోలుగా గొట్టాల లాగా ఉండవని తేల్చాడు. సంగీత పరికరాలలో తీగెలు ఎలా కంపిస్తాయో అలా నరాలు కంపించి సంకేతాలు పంపుతాయని న్యూటన్ ప్రతిపాదించాడు. కాని సంగీత పరికరాలలో తీగెలు గట్టిగా లాగి కట్టినట్లుంటాయి; నరాలు మెత్తగా గుజ్జులా ఉంటాయి కాబట్టి అతని ప్రతిపాదనా సరికాదని తేలింది.
విద్యుత్తు మీద ప్రయోగాలు జరుగుతున్న కాలంలో విద్యుత్తు లాగా షాక్ కొట్టే చేపల గురించి శాస్త్రజ్ఞులకు ఆసక్తి పెరిగింది, వాటిలో ఉన్నది విద్యుత్తేనా అని. మెరుపులో ఉన్నది విద్యుత్తేనని నిరూపించిన ఫ్రాంక్లిన్‍కి కూడా కుతూహలం కలిగి అతని స్నేహితుడైన ఇంగ్లాండుకు చెందిన జాన్ వాల్ష్ని వాటిపై పరిశోధించమని ప్రోత్సహించాడు. జాన్ వాల్ష్ (John Walsh, 1726 – 1795) మద్రాసులోని ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో పుట్టాడు. అది ఇండియాలో బ్రిటీష్ వారు కట్టిన మొదటి కోట. (ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ భవనం.) జాన్ తండ్రి జోసెఫ్ వాల్ష్ ఆకోటకి గవర్నరు, రాబర్ట్ క్లైవ్‍కి (Robert Clive, 1725 – 1774) బంధువు. జాన్ వాల్ష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం సంపాదించి, క్లైవ్‍కి ఆంతరంగిక కార్యదర్శి అయ్యాడు. 1757 లో ప్లాసీ యుద్ధంలో విజయం సాధించినందుకు పెద్ద మొత్తం బహుమతిగా పొందాడు. దానితో 1759 లో ఇంగ్లాండుకి వచ్చి, రాజకీయంగా పలుకుబడి సంపాదించి, 1761 నుండి 1780 వరకు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు.
ఫ్రాంక్లిన్ ప్రోత్సాహంతో 1772 జూన్‍లో వాల్ష్ పారిస్ వెళ్ళి (ఇంగ్లాండులో టోర్పీడోలు లేకపోవడాన) నెలరోజుల పాటు టోర్పీడోల మీద ప్రయోగాలు చేసి వాటినుండి వచ్చేది విద్యుత్తేనని రుజువు చేసుకున్నాడు. చేపలలో విద్యుత్ ద్రవం లేడెన్ జాడీలలో లాగే అణిగి ఉందనీ, కావలసినప్పుడు విడుదల చేస్తాయనీ ప్రతిపాదించాడు. జాడీకీ దీనికీ తేడా, చేప విద్యుత్తు ఎప్పుడు విడుదల చెయ్యాలో తనే నిశ్చయించుకుంటుంది.

విద్యుత్ చేపలో విద్యుత్ అంగాలు
వాల్ష్ తన ఫలితాలని జాన్ హంటర్ (John Hunter, 1728 – 1793) అన్న శస్త్రకారుడికి చూపెట్టి, ఈ చేపలలో ఉన్న విశేషమైన విద్యుత్ అవయవాల నిర్మాణాన్ని పరిశీలించమని కోరాడు. హంటర్ ఈ అసాధారణమైన విద్యుత్ అంగం (Electric organ), చేప శరీరంలో దాదాపు సగభాగాన్ని ఆక్రమించి ఉంటుందన్నాడు: కొన్ని వందల దొంతర్లు; ప్రతి దొంతరా అనేక బిళ్ళల సముదాయం; బిళ్ళల మధ్య సన్నని ద్రవపు పొర; దొంతర్లకి సమృద్ధిగా నరాలు.
ఈ పరిశోధనకి రాయల్ సొసైటీ వాల్ష్‌కి కోప్లీ బహుమతిని ఇచ్చినా, శాస్త్రజ్ఞులలో చాలా మందికి ఈచేపలలో ఉన్నది విద్యుత్తేనన్న నమ్మకం కలగ లేదు. యంత్రాలతో వచ్చే విద్యుత్తుతో షాక్‍తో పాటు మెరుపూ, ధ్వనీ వస్తాయి. కానీ, చేపల విద్యుత్తులో ఉన్న విద్యుత్తులో అవి ఉన్నాయా? వాల్ష్ చేపతో సర్క్యూట్ చేద్దామనుకున్నాడు కాని అది పూర్తి కాక ముందరే 1795 లో చనిపోయాడు.
ఈ ప్రత్యేకమైన చేపలలో ఉన్నది విద్యుత్తే అయినా, అది వీటికి మాత్రమే ఉన్న విశేష గుణమా లేక మిగిలిన జంతువులలోనూ మానవులలోనూ కూడా విద్యుత్తు ఉన్నదా అన్నది గల్వాని పరిశోధనలు మొదలెట్టేనాటికి ఇంకా తేలలేదు.
లూయీజి గల్వాని
లూయీజి గల్వాని సెప్టెంబరు 9, 1737 న ఇటలీ లోని పోప్ పాలన కింద ఉన్న బొలోన్యా నగరంలో కంసాలి కుటుంబంలో పుట్టాడు. పోప్ బెనెడిక్ట్ XIV (Pope Benedict XIV, 1675 – 1758) కేవలం చర్చి బోధనలకి పరిమితం కాకుండా కళలు, శాస్త్రీయ విజ్ఞాన పరిశోధనలని ప్రోత్సహించాడు. వాటితో ప్రభావితుడైన గల్వాని క్రైస్తవ సన్యాసి కావాలనుకున్నాడు. కాని తండ్రి వైద్యం చదవమని వత్తిడి చేశాడు. గల్వాని వైద్యంలోనూ తత్వశాస్త్రం లోనూ పట్టాలు పొంది, 1762లో బొలోన్యా విశ్వవిద్యాలయంలో అనాటమీ ప్రొఫెసరుగా చేరాడు. నగరంలోని ఆసుపత్రిలో వైద్యుడిగా చేరి పేదలకు సేవచేయడం మొదలెట్టాడు.
1088 లో స్థాపించిన బొలోన్యా విశ్వవిద్యాలయం యూరప్‍లో కెల్లా ప్రాచీనమైనది. సైన్సు పరిశోధనల్లో ముందుండేది. ప్రపంచంలో మొదటి సైన్సు డాక్టరేట్ పొందిన లారా బాస్సి (Laura Bassi, 1711 – 1778) అక్కడే ప్రొఫెసర్ గా పనిచేసింది, గల్వానిని ప్రయోగాలు చెయ్యడానికి ప్రోత్సహించింది. అనాటమిస్ట్ అన్నా మొరాండి (Anna Morandi, 1714 – 1774) కూడా మైనంతో శరీర భాగాల నమూనాలు చేసి అక్కడే డిమాన్‌స్ట్రేటర్‌గా పనిచేసేది. గల్వాని ఆ సున్నిత నాణ్యమైన నమూనాలని తన లెక్చర్లలో వాడుకునేవాడు. అదే విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ లూషియా గేలియాజిని (Lucia Galeazzi Galvani, 1743 – 1788) గల్వాని పెళ్ళిచేసుకున్నాడు. ఆమె తండ్రి పేరున్నఅనాటమిస్టు. ఆమె కూడా భర్త చేస్తున్న సైన్సు ప్రయోగాలలో పాల్గొనేది, వైద్యంలో సాయం చేసేది.
మెరుపులో ఉన్న విద్యుత్తే జీవులలోనూ ఉందనే భావనపై గల్వాని ప్రయోగాలు మొదలెట్టాడు. రాపిడి విద్యుత్ యంత్రం, లేడెన్ జాడీ, శాస్త్రకారుని పనిముట్లు, వీటితో గల్వాని ఇల్లే ప్రయోగశాలగా మారింది.
Luigi Galvani 1737–1798
By Cole Swensen
married a woman who was perfectly happy
to turn half their apartment
into a laboratory
including the cadavers necessary to her husband’s
explorations in surgery.
He also wrote articles on the ears of birds and
in Latin, an anatomist, standing motionless
in the middle of the road
thinking
that electricity must activate the blood
while the muscles, themselves
living Leyden jars, flowered among
those who found it difficult
to believe that electricity is an animal
lost in a garden of showering towers
and, as with all living things, a certain degree
of the domestic filtered down
between his hands to land
in a dusting of involuntary silver across
the surface of every nerve.
నరాలు రెండు పనులు చేస్తాయు: అనుభూతి కలిగించడం, కండరాలని కదల్చడం. మొదటిదానిని అనుభవించగలం, రెండోదానిని పరిశీలించగలం. అందువలన గల్వాని రెండో దానిపై కేంద్రీకరించాడు. అందుకు చనిపోయిన జంతువులని తీసుకొని నరాలనీ కండరాలనీ మిగిలిన భాగాలనుండి వేరుచెయ్యాలి. కప్పలు ఇందుకు బాగా పనికొస్తాయి; వాటి నరాలని సులభంగా గుర్తించవచ్చు; అవి చనిపోయిన 48 గంటల దాకా వాటి కండరాలు కంపించగలవు. వాటిని జాగ్రత్తగా పరిశీలనకి వీలుగా సిద్ధం చెయ్యాలి: పై అంగాలకి దిగువన అడ్డంగా కోసి, తోలు వొలిచి, పేగులు తీసి, కేవలం కాళ్ళనీ, వాటిని కలిపే నరాలనీ వెన్నెముకనీ మాత్రమే ఉంచాలి.
జనవరి 26, 1781 న గల్వాని పైవిధంగా తయారుచేసిన కప్పని శస్త్రవైద్యుని కత్తితో (scalpel) తాకితే కప్ప కదిలింది. ఎందుకు కదిలిందా అని చూస్తే దగ్గరలోనే ఉన్న విద్యుత్ యంత్రం కనబడింది. దాని నుండి స్పార్క్ వచ్చిన క్షణంలోనే కత్తితో కప్పని తాకితే కప్ప కాళ్ళు కొట్టుకున్నాయి. (జబ్బుపడిన భార్యకు జావకాయించడానికి కప్పలని తెచ్చి వాటి చర్మాన్ని ఒలుస్తుండగా కప్ప కాలు తన్నుకుందని కొడవటిగంటి రాసింది సరదాగా ఉండవచ్చు కాని నిజం కాదు.) కత్తి మొన మూలంగా కంపనాలు వచ్చాయా లేక స్పార్క్ మూలంగానా అని, కత్తిని గట్టిగా నొక్కినా స్పార్క్ లేకుండా కంపనాలు కలగలేదు. దానితో కంపనాలు రావాలంటే స్పార్క్ ఉండాలని రూఢి చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల పాటు గల్వాని రకరకాలుగా – కప్పని దూరంగా ఉంచి, జాడీలో ఉంచి, … – ప్రయోగాలు చేశాడు.

కప్పతో గల్వాని ఇంటి బయట ప్రయోగం
ఏప్రిల్ 26, 1786 న మబ్బులు కమ్మిన వేళ, కోసిన కప్పని బయట పెట్టి, దాని నరాలని తీగెతో మెరుపు కడ్డీకి (lightning rod) తగిలించాడు. ఉరుములు వచ్చినప్పుడు కప్ప కాళ్ళు కదిలాయి. దీనితో విద్యుత్తు ప్రకృతి సహజమైనా, యంత్రజనితమైనా కప్ప మీద ప్రభావం ఒకటేనని తేలింది.
అక్టోబరు 30, 1786 న కప్పని ఇంటి బయట ఇనుప కంచె మీద కొక్కెంతో వేళ్ళాడతీశాడు. కొక్కెం కంచెకి తగిలినప్పుడు కప్ప కాళ్ళు కదిలాయి. ఉరుముల వాతావరణం లేదు, దగ్గరలో విద్యుత్ యంత్రం లేదు. దీనితో గల్వాని కప్పలోనే విద్యుత్తు ఉందని తేల్చాడు. అనేక ప్రయోగాలు చేసి నిర్ధారణ చేసుకొని, 1791 లో, అంటే దాదాపు ఓ దశాబ్దం పాటు జరిపిన ప్రయోగాల ఫలితాలని, సవివరంగా ప్రచురించాలని నిశ్చయించాడు.
కప్ప కండరాలు లేడెన్ జాడీలా విద్యుత్తు నిల్వ చేసుకోగలవనీ, ఆ కండరాలని వాహకంతో కలిపితే విద్యుత్తు ప్రవహించడాన కప్పలో చలనం కలిగిందనీ, అది లేడెన్ జాడీతో వచ్చే షాక్ లాంటిదనీ ప్రతిపాదిస్తూ, A Commentary on the effects of electricity on the motion of muscles, అన్న పరిశోధనా పత్రం ప్రచురించాడు. అది అనేకమంది శాస్త్రజ్ఞులతో సహా, అప్పటికే విద్యుత్ శాస్త్రంలో మంచి పేరు గడించిన, బొలోన్యాకి దక్షిణంగా రెండు వందల కిలోమీటర్ల దూరంలోని పావియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా ఉన్న వోల్టాని ఆకర్షించింది. సైన్సు చరిత్రలో ఓ ఘనమైన వివాదానికి నాంది పలికింది.
అలెస్సాండ్రో వోల్టా
ఉత్తర ఇటలీలోని ఆస్ట్రియా రాజుల అధీనం కింద ఉన్న లొంబార్డీ (Lombardy) ప్రాంతంలో ప్రకృతి శోభతో విలసిల్లే కోమో సరస్సు (Lake Como) తీరాన ఉన్న కోమో నగరంలో 18 ఫిబ్రవరి, 1745 న అలెస్సాండ్రొ వోల్టా పుట్టాడు. తల్లిదండ్రుల ప్రభావం అతని మీద తక్కువ. నాలుగేళ్ళ దాకా వోల్టాకి మాటలు రాలేదు కాని బడిలో చేరిన తర్వాత చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు.
Jesuit College లో చదువు మొదలెట్టిన రెండేళ్ళలో, అక్కడ ఒక ప్రొఫెసరు వోల్టాని Jesuits లో చేరమని ప్రోత్సహిస్తున్నాడని భయంతో, అతని కుటుంబం వోల్టాని అక్కడి నుండి తొలగించి వేరే చోట చేర్పించింది. అప్పటికే ఆ కుటుంబంలో చాలా మంది క్రైస్తవ సన్యాసులుగా ఉన్నారు. వాళ్ళ బంధువు ద్వారా సంక్రమించిన ఆస్తిపాస్తులు దక్కాలంటే తర్వాత తరం వాళ్ళు ఉండాలి.
వోల్టా చిన్నపుడే కవిత్వం మీదా, నాచురల్ ఫిలాసఫీ మీదా ఆసక్తి చూపెట్టాడు. యుక్త వయసులోనే వికాసయుగ ప్రభావానికి లోనయ్యాడు. అప్పుడు రాసిన ఓ కవిత అతనికి సైన్సు మీద కల అభిరుచి తెలుపుతుంది:
Fire often ignites itself in fat matters
Even without any spark being brought to them,
And the luminous globes of the flames develop spontaneously:
Not otherwise the ancients and many among recent authors deemed
When teaching that burning meteors derive from a sulphurous disposition.
Lightning too was believed to have such an origin;
Yet wrongly so, because since a more enlightened age has shone,
And new arts have been disclosed to the geniuses of our times,
How transformed the face of Sophia has turned out from them!
జీవితాంతం కవిత్వంపై మక్కువ చూపాడు. 1787 లో వాతావరణశాస్త్రజ్ఞుడు హొరాస్ దె సాస్యూర్ (Horace de Saussure, 1740 – 1799) మోన్ బ్లా (Mont Blanc) ని అధిరోహించినప్పుడు రాసిన దీర్ఘ కవితలో సైన్సు ప్రయోగం చేస్తున్న పర్వతారోహకుడిని పొగుడుతాడు:
Finally on that inaccessible summit,
Nature’s limit, was Wisdom able
To rest, alongside Saussure’s grasp
…
And when there, where silence prevails,
And death and horror, the dark night descends,
He does not disdain to rest
His weary bones on the ice; and thirst annoys him,
Along with the glacier, but he overcomes the hardship,
So that, in a copper tub, he collects ice and dissolves it.
విద్యుత్ శాస్త్రం గురించి కేవలం ఔత్సాహికుడుగా ప్రయోగాలు చేస్తూనే, పద్ధెనిమిదేళ్ళ వయసులోనే ఫ్రాన్స్ లోనూ ఇటలీలోనూ పేరున్న శాస్త్రవేత్తలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగించాడు. తను కూడా వారిలాగే పేరు తెచ్చుకోవాలనే ఆకాంక్ష అతనిలో గాఢంగా నాటుకుంది. జీవితాంతం వోల్టా యూరప్‌లో పర్యటించడం, పేరున్నవాళ్ళతో సంబంధాలు పెట్టుకొని పలుకుబడి పెంచుకోవడం, పరిశోధనలని ప్రచురించడం, వీటికి ప్రాముఖ్యత ఇచ్చాడు.
వోల్టా వైవాహిక జీవితం
జెసూట్స్ దగ్గర చదువుకునేటప్పుడు, వోల్టాని Society of Jesus వైపు ఆకర్షించడానికి అతని ఫిలాసఫి ప్రొఫెసర్ శారీరక సుఖాలపై కాలం వృధా చెయవద్దని హెచ్చరించాడు. అమ్మాయిలవైపు చూడవద్దనీ, వాళ్ళు ఎదురైతే తల దించుకోవాలనీ బోధించాడు. పెద్దయిన వోల్టా మాత్రం కచేరీలు, విందులు, వేటలతో ఇటలీలో ధనవంతుల విలాసజీవితమే గడిపాడు.
వోల్టా యుక్త వయసులో తనకంటె అయిదేళ్ళు చిన్నదైన తెరెస సిసెరీని ప్రేమించాడు. కాని శాశ్వతంగా ఒకే స్త్రీతో ఉండటనికి వోల్టా ఇష్టపడకపోవడంతో ఆమె మరొకరిని పెళ్ళి చేసుకుంది. అయినా వోల్టా అమెతో జీవితాంతం స్నేహితుడిగా ఉన్నాడు.
1788లో అతనికి ఓ సంగీత గాయని (opera singer) మేరియానా పారిస్‍తో పరిచయమయి, అది ప్రేమగా మారింది. ఆవిడ ఇటలీ అంతటా ప్రదర్శనలిస్తోంది. ఆమెని పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. అప్పట్లో నాటక గాయని స్థాయి సంఘంలో తక్కువ. ఇతనేమో ప్రొఫెసర్. కుటుంబంలో వాళ్ళు వీల్లేదన్నారు. చర్చి వాళ్ళు కూడా వలదన్నారు. ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుందన్నారు. ఆస్ట్రియా చక్రవర్తికి ఉత్తరం రాస్తే, ఆయనా ఒప్పుకోలేదు. ఇక ఆమెతో పెళ్ళి సాధ్యం కాదనుకొని, తన అన్న ఆమెకు కొంత డబ్బు ఇచ్చే ఏర్పాటు చేశాడు.
సెప్టెంబరు 1794 తన యాభయ్యో ఏట, తన కన్నా పందొమ్మిది ఏళ్ళు చిన్నదైన, తెరెసా పెరెగ్రినిని వివాహమాడాడు.
శాస్త్రవేత్తగా ఎదుగుదల
వోల్టా 1775 లో ఎలెక్ట్రోఫోరస్ (Electrophorus) అన్న పరికరం కనిపెట్టి విద్యుత్ శాస్త్ర పరంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించాడు. లేడెన్ జాడీ నుండి విద్యుత్తు ఒక్కసారే విడుదల అవుతుంది; ఒకసారి వాడిన తరువాత విద్యుత్తు కావాలంటే మరలా రాపిడి యంత్రం ద్వారా విద్యుత్తుని ఉత్పత్తి చేసి జాడీని నింపాలి. ఎలెక్ట్రోఫోరస్‍తో రాపిడితో ఒకసారి ఉత్పత్తి చేస్తే చాలు, ఎన్ని సార్లయినా దానినుండి విద్యుత్తు తీసుకోవచ్చు. దీనిని వోల్టా “నిరంతర విద్యుత్ వాహకం (perpetual carrier of electricity)” అని ప్రకటించాడు. అది పనిచేసే విధానం:
లక్క పలకని గుడ్డతో రుద్దితే పలకలో రుణ విద్యుత్తు చేరుతుంది. చెక్క పిడి ఉన్న లోహపు పళ్ళాన్ని తీసుకొని పలక దగ్గరకి తీసుకొస్తే పళ్ళెంలో కింద ధన విద్యుత్తు, పైన రుణ విద్యుత్తు చేరతాయి. ఇప్పుడు పళ్ళెం పైభాగాన్ని తాకితే రుణ విద్యుత్తు పోయి, పళ్ళెంలో ధన విద్యుత్తు మిగులుతుంది. దానిని వాడుకొని తర్వాత కావాలంటే మరలా లక్క పలక దగ్గరకి పళ్ళాన్ని తీసుకొని విద్యుత్తు రాబట్టవచ్చు. అలా ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు చెయ్యవచ్చు. వోల్టా అతిశయానికి పోయి, ఎన్ని సార్లు అయినా విద్యుత్తు తీసుకోవచ్చు అన్నాడు కాని, బహుశా పాతికసార్ల తర్వాత విద్యుత్తు తగ్గిపోతుంది. అయినా, లేడెన్ జాడీతో పోలిస్తే చాలా మెరుగే.
1776 లో ఇంధనంగా వాడుకోదగ్గ మీథేన్ (Methane) వాయువును కనుగొన్నాడు. 1779 లో వోల్టా పావియా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరాడు. 1791 లో రాయల్ సొసైటీ ఫెలో అయ్యాడు. అలా అంచెలంచెలగా ఎదుగుతూ ఫిజిసిస్టుగా ఖ్యాతి పొందాడు.
గల్వానితో ఘర్షణ – సంపర్క విద్యుత్తు
మార్చి 1792 లో వోల్టాకి గల్వాని పరిశోధనా పత్రం అందింది. దానిని చదివి వోల్టా ముందర దిగ్భ్రాంతి చెంది, ప్రాణులలో సహజంగా విద్యుత్తు ఉన్నదని చూపెట్టిన గల్వానిని మెచ్చుకున్నాడు. వోల్టా మార్చి 24 న ఆప్రయోగాలు కొన్ని మార్పులతో తను కూడా చెయ్యడం మొదలెట్టాడు. ఏప్రిల్ ఒకటిన కప్ప కదలడానికి కనీసం ఎంత విద్యుత్తు కావాలో నిర్ణయించాడు. రెండు రోజుల తర్వాత గల్వాని పత్రంలో కొన్నిటిని సరిచేశాడు.
కప్ప నరాన్ని లేడెన్ జాడీలోని తీగెకి అంటిస్తే కప్ప కాలు కదిలింది. దానితో కప్ప కండరాలలో విద్యుత్తు లేదనీ, నరంలో విద్యుత్తు ప్రవహింపచేస్తే అది కండరాలని కదిలింపచేస్తుందనీ, కప్పలో సహజమైన విద్యుత్తు బహుశా లేదని మే 5 న తన సంశయాన్ని వెల్లడించాడు. అలా కొద్దివారాలలో వోల్టా ఉత్సాహం అనుమానంగా మారింది.
గల్వానీకి విద్యుత్ శాస్త్ర అవగాహన లేకపోవడాన జీవులలో విద్యుత్తు ఉందని ప్రతిపాదించాడనీ, ఆ ప్రయోగాలలో కప్ప కేవలం వాహకంగా పనిచేసిందనీ చెప్పి, వోల్టా, గల్వానీతో విభేదించాడు. అలా ఇద్దరికీ మధ్య ఘర్షణ చెలరేగింది. ఇతర శాస్త్రజ్ఞులు కూడా రెండు వర్గాలుగా చీలారు.
వోల్టా తన ప్రయోగంలో కప్ప నరానికి రెండు చోట్ల లోహపు తీగెని కవచంలాగా చుట్టి, ఆ కవచాన్ని లేడెన్ జాడీకి అంటించాడు – కప్ప కాలు కలింది. సర్క్యూట్‍లో నరం ఉంది కాని కండరం లేదు. దాని మూలంగా విద్యుత్తు నరంలోకి మాత్రమే వెళ్ళిందనీ, నరంలో విద్యుత్తు పారడాన కాలు కదిలిందని తీర్మానించాడు.
మరో ప్రయోగంలో వోల్టా లేడెన్ జాడీ లేకుండా పై విధంగా కప్ప నరానికి రెండు లోహపు చుట్టలని చుట్టాడు. కాని, అవి రెండూ రెండు రకాలైన లోహాలు. ఆ చుట్టలని కలిపితే, విద్యుత్తు పుట్టి నరంలో ప్రవహించి, కప్ప కాలు కదిలింది.
వోల్టా కప్ప మీదనేకాక తన మీద కూడా ప్రయోగం చేసుకున్నాడు. నాలుక చివరన తగరపు ముక్కని పెట్టి, నాలుక మధ్యలో వెండి నాణాన్ని ఉంచి, నాలుకతో తగరాన్ని వెండి తో కలిపితే, నాలుక నరంలో విద్యుత్తు ప్రవహించి, నాలుకకి లోహపు రుచి కాకుండా ఓ ఆమ్ల రుచి తెలుస్తుందన్నాడు.
గల్వాని ప్రయోగాలలో కప్పని తాకేటప్పుడు రెండు రకాలైన లోహాలని వాడి ఉంటాడనీ వాటితో పుట్టిన విద్యుత్తు నరం లోకి వెళ్ళడాన కప్ప కంపించిందనీ, కప్పలో అంతర్గతంగా విద్యుత్తు అంటూ ఏమీ లేదనీ వోల్టా వాదించాడు.
ఈ ప్రయోగాలతో వోల్టా, ఓ కొత్త రకం విద్యుత్తుని కనిపెట్టి, మిశ్రమ లోహాల కలయిక వలన పుట్టినది కనుక, దానికి సంపర్క విద్యుత్తు అని పేరు పెట్టాడు.
గల్వానీ వోల్టాతో విభేదిస్తూ వేరే ప్రయోగం చేశాడు. దాంట్లో, కప్ప నరాన్ని కండరంతో కలిపాడు లోహాలు లేకుండా; కప్ప కదిలింది. వోల్టా అందుకు సమాధానంగా నరమూ కండరమూ తమలో ఉన్న భేదం మూలంగా విద్యుత్తుని ప్రవహింపచేశాయని తన సిద్ధాంతాన్ని సమర్థించుకున్నాడు. సంపర్కం కావడానికి రెండూ లోహాలే కానవసరం లేదు, రెండు విభిన్న పదార్థాలు (నరము, కండరము) కలిసినా విద్యుత్తు వస్తుందని వోల్టా వాదించాడు.
అందుకు ప్రతికూలంగా గల్వానీ మరో ప్రయోగం చేశాడు: కప్ప ఒక కాలి నరాన్ని రెండో కాలి నరానికి అంటించాడు; కప్ప కాళ్ళు కదిలాయి. నరాలు రెండూ ఒకే జంతువులోనివే కాబట్టి వోల్టా సిద్ధాంతం తప్పని తేలింది. గల్వానీ వర్గం విజయం సాధించామనుకుంది. దానిని కూడా వోల్టా తిప్పి కొట్టాడు: కప్ప కండరంలోని పొరలు వేర్వేరు శక్తులతో కూడి ఉండటాన విద్యుత్తు పుట్టిందన్నాడు. మరలా ఇది భౌతిక కారణాలమీదనేనని వాదించాడు. గల్వానీ ప్రయోగాలు సరిగా లేవనీ, ఫలితాలు కచ్చితంగా ఇతరులు చూపలేరనీ కూడా వోల్టా విమర్శించాడు.
కొన్నేళ్ళుగా సాగిన వివాదం అనూహ్యమైన పరిస్థితులలో అంతమయింది – తాత్కాలికంగా.
నెపోలియన్ దండయాత్ర
మే 14, 1796 న నెపోలియన్ (Napoleon Bonaparte, 1769 – 1821) నాయకత్వాన ఫ్రెంచ్ సైన్యాలు ఇటలీపై దండయాత్ర చేసి, ఆస్ట్రియా సైన్యాలను ఓడించి మిలాన్ నగరాన్ని ఆక్రమించాయి. వోల్టా నెపోలియన్‍కి మద్దతు ఇచ్చాడు. జూన్ 19 న నెపోలియన్ పోప్ ఆధిపత్యాన ఉన్న బొలోన్యా చేరాడు. పోప్ సంధి చేసుకోడంతో బొలోన్యా ఫ్రెంచ్ పాలనలోకొచ్చింది. ఫ్రెంచ్ అధికారులు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల నందరినీ కొత్త ప్రభుత్వానికి మద్దతునిస్తూ ప్రమాణం చెయ్యమని ఆదేశించారు.
గల్వాని అది తన నైతికవిలువలకి విరుద్ధమని ఒప్పుకోలేదు. ఏప్రిల్ 20, 1798 న అతనిని పదవి నుండి తొలగించి, జీతం ఇవ్వడం ఆపేశారు. దానితో గల్వానికి సైన్సుతో సంబంధం తెగిపోయింది. అప్పటికే భార్య చనిపోయింది, సంతానం లేదు. సోదరుడి ఇంట్లో ఆశ్రయం పొందాడు. డిశంబరు 4, 1798 న తన అరవై ఒకటో ఏట అనారోగ్యంతో నిర్భాగ్యుడిగా గల్వాని చనిపోయాడు.
టోర్పీడో – వోల్టా బ్యాటరీ
వోల్టా డిశంబరు 1797 నుండి మార్చి 1799 వరకు తన సంపర్క విద్యుత్తు సిద్ధాంతాన్ని బలపరచడానికి రక రకాల పదార్థాలతో ప్రయోగాలు చేశాడు. వాటి కలయికతో ఎంత విద్యుత్తు పుట్టించవచ్చో నమోదు చేశాడు. ఏ రెండు లోహాలతోనయినా విద్యుత్తు కొంచెమే వచ్చేది.
వాల్ష్, హంటర్‍ల టోర్పీడో పరిశోధనలతో 1782 లో పరిచయమున్నా వోల్టా వాటిని తర్వాత పట్టించుకోలేదు. సెప్టెంబరు 1799 లో లండన్‍కి చెందిన విలియం నికొల్సన్ (William Nicholson, 1753 – 1815) టోర్పీడో ఎలా షాక్ ఇస్తుందో వివరిస్తూ, అలా షాక్ ఇచ్చే విద్యుత్ యంత్రాన్ని ఎలా తయారు చెయ్యవచ్చో సూచిస్తూ ఓ వ్యాసం రాశాడు.
దాని నుండి వోల్టా తనకి పనికొచ్చే విషయాలని కొన్ని తీసుకున్నాడు. ముఖ్యంగా, విరుద్ధమైన విద్యుత్ స్థితులలో ఉన్న లోహాల జతలని కలపి దొంతరగా చేసి – AZ|AZ|AZ|AZ|… – ఆ దొంతర్లని కలిపితే శక్తివంతమైన యంత్రం తయారవుతుందని. A అంటే రాగి, Z అంటే తగరం, | అంటే వాటి మధ్య ఉప్పు నీటిలో ముంచిన అట్ట. ఇదే వోల్ట్ కనుగొన్న బ్యాటరీ.

వోల్టా దొంతర బ్యాటరీ, గిన్నెల గొలుసు బ్యాటరీ
దొంతర్లగా పేర్చనవసరం లేకుండా, కప్పులో ఉప్పునీటిని పోసి ఒక పక్క రాగి రేకుని, మరో పక్క తగరపు రేకునీ పెట్టి, అనేక కప్పులని వరుసలో పెట్టి, పక్క పక్క కప్పులలోని రేకులని తీగెతో కలిపి కూడా బ్యాటరీని చెయ్యవచ్చని చూపాడు. ఒకటి దొంతర్లతో (columns) మరొకటి కప్పులతో (crown of cups).
దీనితో వోల్ట్ తానొక ముఖ్యమైన పరికరాన్ని కనుగొన్నానని తెలుసుకున్నాడు. మార్చి 20, 1800 సైన్సు చరిత్రలో, బహుశా మానవ చరిత్రలోనే, మహత్తర దినంగా చెప్పుకోవచ్చు. ఆ రోజున వోల్టా, రాయల్ సొసైటీ అధ్యక్షుడైన జోసెఫ్ బ్యాంక్స్‌కి (Joseph Banks, 1743 – 1820), On the Electricity Excited by the Mere Contact of Conducting Substances of Different Kinds, పేరిట ఫ్రెంచ్‍లో ఉత్తరం రాశాడు. వెనువెంటనే ఇంగ్లాండులోని శాస్త్రవేత్తలు ఉత్తరంలోని వివరాలతో సులభంగా బ్యాటరీని చెయ్యగలిగారు. ఈ వార్త యూరప్ లోని అన్ని శాస్త్రీయ కేంద్రాలకీ కొద్ది వారాలలో చేరింది.
నీరు = హైడ్రొజెన్ + ఆక్సిజెన్ నిరూపణ
అనాదిగా వస్తుజాలానికంతా మూలం పంచభూతాలని వివిధ సంస్కృతులలో నమ్మకం. ఆ అయిదిట్లో నీరు ఒకటి. 1661 లో రాబర్ట్ బాయిల్ (Robert Boyle) దానిని ఖండిస్తూ, పదార్థాన్ని, మిశ్ర పదార్థాన్ని నిర్వచించాడు. 1783 లో అంటిన్ లవాయిసియర్ (Antoine Lavoisier) అన్న ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు నీరు మూల పదార్థం కాదు, మిశ్రమ పదార్థం, అని సిద్ధాంతీకరించాడు. కాని దీనిని అందరూ అంగీకరించలేదు.
వోల్టా ఉత్తరం గురించి జోసెఫ్ బ్యాంక్స్ కొందరు దగ్గరి స్నేహితులకి చెప్పాడు. వారిలో ఒకరు ఆంథొనీ కార్లైల్ (Anthony Carlisle, 1768 – 1840) అన్న శస్త్రకారుడు. ఆయన తన మిత్రుడైన కెమిస్టు నికొల్సన్కి చెప్పాడు. వీరిద్దరూ కలిసి మే రెండవ తేదీన ఓ బ్యాటరీని తయారు చేసి తీగెలతో కలిపి తీగెలని నీటిలో ఉంచారు. ఒక తీగె చివర ఎక్కువ వాయువు, మరొక తీగె చివర తక్కువ వాయువు నెలకొన్నాయి. కొలిస్తే ఆక్సిజెన్ కి రెండింతలు హైడ్రొజెన్ ఉందని రుజువయింది.
వోల్టా ఉత్తరం కన్నా ముందే, మే 30 1800 న లండన్ వార్తా పత్రికలో బ్యాటరీ వివరాలతో సహా ఈప్రయోగం ప్రచురితమయి, శాస్త్ర ప్రపంచంలో సంచలనం కలిగించింది.
వోల్టా చివరి దశ
1800 సంవత్సరంలో రాజకీయంగా పెను మార్పులు వచ్చాయి. వోల్టా రాయల్ సొసైటీకి ఉత్తరం రాయడంలో తనకు ఇంగ్లాండుపై గల అభిమానాన్ని చాటుకున్నాడు. లొంబార్డి ప్రాంతాన్ని ఫ్రెంచ్ వాళ్ళ నుండి తాత్కాలికంగా ఆస్ట్రియా తిరిగి చేజిక్కించుకుంది. ఆస్ట్రియన్ అధికారులు పావియా విశ్వవిద్యాలయాన్ని మూసివెయ్యడంతో వోల్టా ఉద్యోగం, జీతం కోల్పోయాడు. అంతేకాక ఫ్రెంచ్ అధికారులు యుద్ధపు ఖర్చుల కోసం కోమో నివాసులపై జరిమానా విధించారు. దీనితో వోల్టా తన బ్యాటరీ సాయంతో గుర్తింపు పొంది, అభద్రత నుండి బయటపడాలనుకున్నాడు. ఫ్రెంచ్ అధికారులతో మంతనాలు జరిపి 1801 లో పారిస్ చేరి The Institut de France లో నెపోలియన్ ముందర బ్యాటరీ ని ప్రదర్శించాడు.
నెపోలియన్ సిఫారసుతో ఇన్స్టిట్యూట్ వోల్టాకి బంగారు పతకం, ధనమూ ఇచ్చి సత్కరించింది. తరువాత నెపోలియన్ వోల్టాకి వార్షికం ఇవ్వడమే కాక, 1809 లో వోల్టాని ఇటలీలో సెనెటర్ గా నియమించాడు; 1814 లో కౌంట్ బిరుదు కూడా ఇచ్చాడు.

నెపోలియన్ దగ్గర బ్యాటరీని ప్రదర్శిస్తున్న వోల్టా
వోల్టాకి గుర్తింపు ఇవ్వడంలో నెపోలియన్ తన రాజకీయ విజ్ఞత చూపాడు. వోల్టా పాతికేళ్ళపాటు ఆస్ట్రియా ప్రభుత్వంలో పనిచేశాడు; తన పరికరాన్ని లండన్‍లో ప్రకటించాడు; అప్పుడు ఫ్రెంచ్ ఆధిపత్యంలో నివసిస్తూ పారిస్ సందర్శిస్తున్నాడు. అలాంటి వానిని సన్మానించడంలో నెపోలియన్ పారిస్ తరతమ భేదం లేకుండా అన్ని దేశాల శాస్త్రజ్ఞులనీ గుర్తిస్తుందనీ మేధావులకి కేంద్రమనీ ప్రకటించాడు.
నెపోలియన్ ఆస్ట్రియా చేతిలో ఓడిపోయిన తర్వాత, వోల్టాని ఆస్ట్రియా ప్రభుత్వం ఉన్నత పదవి ఇచ్చి గౌరవించింది. ఇలా ప్రభుత్వాలు ఎన్నిసార్లు మారినా వోల్టాకి పెద్దగా నష్టమేమీ రాలేదు.
వోల్టా తన ముగ్గురు కొడుకుల చదువు మీద శ్రద్ధ వహించాడు. వాళ్ళు కాలేజీ చదువులకి వెళ్ళిన పిదప, 1819 లో పదవులకు రాజీనామా ఇచ్చి, కోమో నగరంలో విశ్రాంత జీవనం గడిపాడు. బ్యాటరీ పరిశోధనలో పెద్దగా పాల్గొనలేదు. తన 82వ ఏట మార్చి 1827 లో చనిపోయాడు.
గల్వాని – నాడీ శాస్త్రం
Consider: the hero endures; even his downfall merely foretells his eventual rebirth. – Rilke.
గల్వాని-వోల్టా వివాదం మూలంగా బ్యాటరీ పుట్టినా, ఆ వివాదం నుండి జీవులలో విద్యుత్తు ఉన్నదా లేదా అన్నప్రశ్నకు సమాధానం దొరకలేదు. వోల్టా కనిపెట్టినది మహత్తరమైనది కావడాన, ఆ వివాదం మరుగున పడింది. దానిని తిరిగి ప్రచారంలోకి తెచ్చిన వాడు గల్వాని మేనల్లుడు జియోవన్ని ఆల్దిని (Giovanni Aldini, 1762 – 1834). అతను గల్వాని దగ్గర పనిచెయ్యడమేకాక గల్వానితో కలిసి కొన్ని పరిశోధనా పత్రాలు రాశాడు. గల్వాని చనిపోయిన తర్వాత ఆల్దిని బొలోన్యా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరయ్యాడు.
గల్వాని మృదు స్వభావి అయితే ఆల్దిని ఆడంబరుడు; వోల్టా ప్రచారంలో గల్వాని పరిశోధన మరుగు పడుతున్నదని నిరాశపడి, గాల్వనిక్ సొసైటీ అనే ఒక సంస్థని స్థాపించి, పక్షులు, మేకలు, ఎద్దుల మీద ప్రయోగాలు చేసి ప్రదర్శనలు ఇవ్వసాగాడు.
గాల్వనిజం వైద్య చికిత్సకి కూడా వాడవచ్చునని, చిత్రంగా వోల్టా బ్యాటరీనే ఉపయోగించి శవాలకి షాక్ ఇచ్చి వాటిలో కంపనాలు చూపెట్టాడు. మరణించిన వాళ్ళని బతికించడం కోసం కాకపోయినా, నీళ్ళలో మునిగిపోయిన వాళ్ళకి శ్వాస తెప్పించడం అతని ఉద్దేశం. అతని ప్రయోగాలు శాస్త్రజ్ఞులనే కాక సామాన్య ప్రజలని కూడా ఆకట్టుకున్నాయి. లండన్‍లో జనవరి 17, 1803 న ఓ నేరస్తుడి శవానికి షాక్ ఇచ్చి చలనం కలిగించడంతో వార్తల కెక్కాడు. ఇతని ప్రదర్శనల ప్రభావంతో మేరీ షెల్లీ (Mary Shelley, 1797 – 1851) ప్రఖ్యాతిగాంచిన ఫ్రాంకెన్‌స్టయిన్ (Frankenstein) నవల రాసింది.
1804 లో ఆల్దిని గాల్వనిజం మీద రాసిన గ్రంథాన్ని గల్వానికి శ్రద్ధాంజలి ఘటిస్తూనే, తన మేనమామ పతనానికి కారణమైన, నెపోలియన్‍కి అంకిత మిచ్చాడు.
గాల్వనిజం పేరిట బూటకపు వైద్యం పెరిగి నవ్వులపాయింది:
What varied wonders tempt us as they pass!
The Cow-pox, Tractors, Galvanism, and Gas,
In turns appear, to make the vulgar stare,
Till the swoln bubble bursts—and all is air!
– Lord Byron
తరవాత కొన్ని దశాబ్దాలపాటు గాల్వనిజం మరుగునపడినా, 1850 ప్రాంతంలో న్యూరో ఫిజియాలజీ అన్న ఓ ముఖ్యమైన వైద్య శాస్త్ర విభాగం ఏర్పడటంలో గాల్వనిజం కీలకపాత్ర వహించింది. అలా వోల్టా, గల్వాని – ఇద్దరూ చిరస్మరణీయులుగా మిగిలారు.
వోల్ట్ బ్యాటరీ యూరప్ లోని శాస్త్రజ్ఞులందరినీ మేలుకొల్పింది. ఎలెక్ట్రిక్ సైన్స్‌కి సంబంధించిన సూత్రాలని వెలుగులోకి తీసుకురావడానికే కాక ఇతర శాస్త్రాలలో కొత్త విషయాలని కనుగొనడానికీ, వేర్వేరు విషయాల మధ్య కొత్త సంబంధాలని తెలుసుకోడానికీ, రసాయన భౌతిక శాస్త్రాల సమన్వయానికీ తోడ్పడిందని హంఫ్రీ డేవీ (Humphry Davy, 1778 – 1829) ప్రశంసించాడు. ఈ విషయాల గురించి వచ్చే వ్యాసంలో తెలుసుకుందాం.
మూలాలు:
- Marcello Pera and Jonathan Mandelbaum. The Ambiguous Frog: The Galvani-Volta Controversy on Animal Electricity. Princeton University Press. 1992.
- Giuliano Pancaldi. Volta: Science and Culture in the Age of Enlightenment. Princeton University Press. 2003.
- Stanley Finger. Minds behind the Brain: A History of the Pioneers and Their Discoveries. Oxford University Press. 2000.
- Sally Adee. We are Electric: Inside the 200-Year Hunt for Our Body’s Bioelectric Code, and What the Future Holds. Hachette Books. 2023.
- కొడవటిగంటి కుటుంబరావు రచనా ప్రపంచం – 10: సైన్స్ వ్యాసాలు. విరసం ప్రచురణ. 2011.
- Wikimedia Commons.

