[ప్రసిద్ధ మలయాళం రచయిత, కార్టూనిస్టు ఓ.వి. విజయన్ గారు హైదరాబాదులో మరణించిన సందర్భంలో చోటు చేసుకున్న సంఘటనలను ఆధారంగా చేసుకుని జయమోహన్ రాసిన కథ – సంపాదకులు]
“ఊహలకు ఉండే స్వేచ్ఛ ఆకాశమంత! మాటలకుండేది మాత్రం అరచేయంత” అంటూ మొదలుపెట్టారు ప్రభానందులవారు. “అలానే మాటకు ఉన్న స్వేచ్ఛ రాతకు లేదు. మనం అనుకునేవన్నీ బయటికి చెప్పేయకూడదు. బయటికి చెప్పేవన్నీ రాతలో పెట్టకూడదు. ఆలోచనలను అలాగే వదిలేయాలి. అవి ఎగిరే దైవదూతలు. వాటి వెంటపడి తరుముకుంటూ వెళ్ళకూడదు. కొందరు దైవ దూతలు వెనక్కితిరిగి చూసిన మరు క్షణంలోనే దయ్యాలుగా మారిపోతారు.”
నాలుగు రోజుల క్రితమే మేము హైదరాబాదుకు వచ్చాం. వచ్చినప్పట్నుండి ఆయన్ని గమనిస్తూనే ఉన్నాను. ఆయన దేన్నీ పట్టించుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. నేను అక్కడే ఉన్న కవయిత్రి కేవీ రమగారికేసి చూశాను. ఆమె తన రెండు చేతులను ఒళ్ళో పెట్టుకుని, భుజాలు ముడుచుకుని తల వంచుకుని నేలనే చూస్తూ కూర్చొని ఉన్నారు. నేనొక స్తంభానికి ఆనుకొని నించుని ఉన్నాను.
అది బోధానంద ఆశ్రమం వారి గెస్ట్ హౌస్! అయితే కాషాయవస్త్రాల్లో ఉన్న ప్రభానందులు ఆ పరిసరాలకు ఇమడనట్లుగా కనిపిస్తున్నారు. “ఆకాశం కోటానుకోట్ల దేవుళ్ళు, దేవతలు, దయ్యాలు, భూతాలతో నిండి ఉందని అంటారు. నిజంగా అవన్నీ ఉత్తి మాటలే, నేను ఆ మాటల్లో దాగున్న భావాన్ని గురించి చెప్తున్నాను. ఆ దేవుళ్ళు, దేవతలు, దయ్యాలు, భూతాలు అన్నీ ప్రతి క్షణం మనల్ని ఏదోరకంగా ప్రభావితం చేస్తున్నాయి. మనలో కలిగే ప్రతి ఆలోచనా వాటి ప్రభావంతో రూపుదిద్దుకునేదే. మనలో కలిగే ప్రతి ఆలోచనా వాటి వల్ల ప్రభావితమైనదే. ఆ ఆలోచనల్ని అలాగే వదిలేయాలి. కొండను దాటుకుని వెళ్ళే గాలిలా అవి చులాగ్గా వెళ్ళిపోవాలి” అన్నారు.
స్థల, కాల, పరిసరాలతో సంబంధంలేకుండా పిచ్చివాళ్ళు చూసే చూపు ఆయన ముఖంలో ప్రస్ఫుటించింది. “నిజమే! గాలి ఎప్పుడూ తన జాడను విడిచి పెట్టకుండా వెళ్ళదు. వీచే గాలి కొండలను రాచుకుంటూ వెళ్ళి వాటికొక రూపాన్ని కల్పిస్తుంది. కాని కొండ ఆ గాలిని ఒడిసి పట్టుకోవాలనుకోదు. ఏం చెప్పాలనుకుంటున్నానంటే దేవతలను, దయ్యాలను అలాగే వదిలివేయాలి” అంటూ ఆయన ఇంకా పొడిగించారు. “కొంతమంది దేవతలు ఒక్క క్షణం లేదా క్షణంలో వెయ్యో వంతు కాలం మనలో నిలచి ఉంటారు. కొందరు దేవతలు కొన్ని నిముషాలు. మరికొంతమంది దేవతలు గంటల కొద్ది, రోజులకొద్ది, వారాలకొద్ది, ఏండ్లకొద్ది స్థిరంగా ఉంటారు. కొందరు దేవతలు మనలో కొంతమందిని, జీవితాంతం ఆవహించుకుని ఉంటారు.”
“అదంతా మన చేతుల్లో లేదు. దాన్నే విధంటాం! ఆ విధిని నిర్దేశించేవి ఈ దేవతలు, దయ్యాలే. ఇక్కడ అవి తమ ఉనికిని నిలుపుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అందుకే మనకు ఇంతమంది దేవతలున్నారిక్కడ!” అన్నారు ప్రభానందులు. “ఈ భూమిపై ఎన్ని కోట్లమంది దేవతలో! అంగరంగ వైభవంగా నెలకొన్న అనంతపద్మనాభస్వామి మొదలు, పొలం గట్ల మీద రాయిలా ఊరి పొలిమేరల్లో ఎండకి, వానకి, గాలికి మట్టిగొట్టుకపోతూ నిల్చుని ఉన్న గ్రామ దేవతల దాకా అన్నీ ఏదో ఒక సందర్భంలో మనుషులను మానవాతీతమైన శక్తితో ఆదుకున్నవే. ఈ విషయాన్ని గ్రహించినవాళ్ళు, ఆ శక్తుల్ని గట్టిగా పట్టుకొని దేవుళ్ళుగా నిలుపుకున్నారు.”
“ఒక రాయి రూపంలోనైనా వాళ్ళను మనం ఇక్కడ ప్రతిష్ఠించి పూజించుకోవచ్చు. అయితే అలా ప్రతిష్ఠించిన దేవత బలి కోరుకుంటుంది. పూజా పునస్కారాలు కావాలంటుంది. భజన్లూ, స్త్రోత్రాలు వినిపించమంటుంది. అలక్ష్యం చెయ్యడానికి మనల్ని ఏమాత్రం అనుమతించదు. మనం మరిచిపోవడమనేదే కుదరదు…” చేతులను అడ్డంగా ఊపుతూ ప్రభానందులు కొనసాగించారు, “అందుకే నేననేది మనకు ఇప్పుడున్న దేవతలు చాలు అని. దేవతలను వాళ్ళ మానాన వాళ్ళని వదలి పెట్టండి. ఏ దేవతనూ పట్టుకొని నిలపాలని ప్రయత్నించవద్దు. ప్రతిష్ఠించ వద్దు. అవును, ప్రతిష్ఠించనే వద్దు. అదే నా ఏకైక సందేశం.”
ఆయన ఒక అసాధారణమైన, విచిత్రమైన మనిషి – ఎసెంట్రిక్ అని నాకు ఇక్కడికి వచ్చే ముందరే చెప్పి పంపారు. “ఆయన ఊరి పొలిమేరనుండే పోతురాజులాంటి వాడు. అయితే ఆయనవల్ల ఎలాంటి సమస్యా ఉండదు. మనం చెయ్యాల్సింది, ఆయన మాటలను చెవికెక్కించుకోకుండా ఉండటం, అంతే!” అని తిరువనంతపురం మఠం సన్యాసి శంకరదాసు మేము బయలుదేరేటప్పుడే చెప్పారు.
“నిన్న కౌముది పత్రికవాళ్ళు కె.వి.జయానన్ గురించి అడిగారు. ఆయన రచనలు ఏవీ చదవలేదని చెప్పాను. రచయితల పరిస్థితి ఎప్పుడూ బాధాకరమే. తమకు తెలియని దేవతలను పట్టుకొని ప్రపంచం అంతటా ప్రతిష్ఠించేసే దురదృష్టవంతులు, అన్నాను. ఆ మాటన్న తర్వాత అతను ఇంక నోరెత్తలేదు. బహుశా నేను చెప్పిందేదీ అతనికి అర్థం అయుండదు” అన్నారు ప్రభానందులు.
ఇంతలో లోపలనించి అర్జున నాయరు వచ్చారు. నోటిలో నములుతున్న కిళ్ళీ గోడకవతల ఉమ్మేసి నాలుకతో పళ్ళను రుద్దుకుంటూ మెట్లెక్కి వచ్చారు. పంచెతో పెదవి చివరలను తుడుచుకుంటూ గోడ పక్కనున్న అరుగుపై కూర్చున్నారు.
“ఏమన్నా కబురొచ్చిందా?” అని అడిగాను.
“ఇంకా అతను ఇంటికి రాలేదట. వచ్చిన వెంటనే విషయం చెప్తామని ఇంటి ఓనర్ చెప్పారు. కొంతసేపటి కింద ఫోన్ చేసినప్పుడు కూడా అదే మాట!”
నేను కె.వి. రమగారి వంక చూశాను. ఆమె ముఖం అలానే అభావంగా ఉంది.
“అతనెక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలీదా? ఆశ్చర్యంగా ఉందే.” అని ప్రభానందులు అన్నారు.
“అమెరికా అలాంటి దేశం మరి! అవసరమున్నా లేకున్నా మరొకరి గురించి దిగులు పడరు. పక్కవాళ్ళ గురించి ఎలాంటి చీకూ చింతా ఉండదు. ఎక్కడికి వెళ్తున్నారు, అని అడగడం మాట అటుంచి ఆరోగ్యం బాగాలేదా అని అడగడాన్ని కూడా హక్కుల అతిక్రమణలా భావిస్తారు!”
“ఇతను ఏదో అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో కదా ఉద్యోగం చేసేది?” అన్నారు ప్రభానందులు.
“అవును. ఫోటోగ్రాఫర్‌గా చేస్తాడట!” అన్నారు అర్జున నాయరు. “ముప్ఫై ఆరు ఏళ్ళు. పెళ్ళై విడాకులు కూడా తీసుకున్నాడు. బాగా చురుకైనవాడు. అతను చివరిసారి ఇండియాకు వచ్చి ఓ నాలుగైదేళ్ళు అయిందనుకుంటా.”
ఆ విషయంలో నేను కలగజేసుకోవాలనుకోలేదు. బయటికి చూస్తూ నిల్చున్నాను.
“వాళ్ళక్కడ అమెరికాలో ఎలా బతుకుతున్నారో అనేది అది నా ఊహకు కూడా అందటంలేదు. సాధన లేని ఒంటరితనం ఒక రోగం” అన్నారు ప్రభానందులు. “ఎక్కడికి వెళ్ళి ఉంటాడు?”
“ఎవరైనా అమ్మాయితో వెళ్ళి ఉంటాడు. అక్కడ వాళ్ళకు కాంపులు, ట్రెక్కింగ్‌లు అని ఏవేవో ఉన్నాయిగా!” అన్నారు అర్జున నాయర్.
ప్రభానందులు అసహనంతో “ఇక్కడ ఇలా కాచుకొని కూర్చోవడంవల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇప్పటికే రెండు రోజులైపోయింది. వార్త తెలుసుకొని బయలుదేరి రావాలనుకున్నా టికెట్ దొరికి విమానమెక్కి మధ్యలో ఊర్లు మారి వచ్చి ఇక్కడికి చేరుకోడానికి కనీసం ఒక వారమైనా పడుతుంది. జీవితమంటేనే చావు కోసం ఎదురుచూడటం. చచ్చిన తర్వాత ఎదురు చూస్తూ కాచుకొని ఉండటమన్నది అర్థం పర్థం లేని విషయం” అన్నారు.
“కాని ఆయన తనకు శాస్త్రప్రకారం దహన సంస్కారాలు జరగాలని కోరుకున్నారు. వాళ్ళబ్బాయే చేయాలని వీలునామా కూడా రాసిపెట్టారు” అన్నాను నేను.
“అదంతా ఉత్త సెంటిమెంట్!” అన్నారు ప్రభానందులు. “వేదాంతి అయినవాడికి సంస్కారాలన్నీ కేవలం ప్రతీకలేనని తెలుసు. ఈ శరీరం పంచ భూతాత్మకమైనది. ‘మృణ్మయమనోజ్ఞం’ – శరీరం ఒక రథం అనుకుంటే, ఆత్మ అనేది ఆ రథానికి ఒక రథికుడు మాత్రమే. రధికుడి మార్గం వేరు. రథం కూలిన మరుక్షణమే రథికుడు రధం నుండి తప్పుకుంటాడు.” ఆయన చేతులు చాచి ఒళ్ళు విరుచుకుని, “సంస్కారాలు జరిపించడానికి వేరే మార్గాలు వెతకొచ్చు. శాస్త్ర ప్రకారం ఎవరైనా కొడుకుగా నిలబడి ఆయనకు సంస్కారాలు చేయొచ్చు.”
“ఆయన కోరుకుంది అది కాదు కదా?”
“కొడుకే తన అంతిమ సంస్కారాలు చేయాలని ఆయనేమన్నా అడిగారా?” అని ప్రభానందులు ప్రశ్న వేశారు.
“అదే కదా నేనంటోంది. చాలాసార్లు చెప్పారు. ఆఖరికి విల్లులో, రాసి కూడా పెట్టారు.”
“నేను కూడా అదే చెబుతున్నాను, అంతా ఒట్టి సెంటిమెంట్ అని!” అంటూ ప్రభానందులు పైకి లేచారు. “సంఘంబుళా కృష్ణపిళ్ళై కవిత ఉంది. ‘పంచభూతాత్మకమే ఈ దేహం… గొప్ప వాక్యాలవి” ఆవలిస్తూ, “నేను కొంతసేపు పడుకోవాలి” అంటూ కదిలారు. కాషాయపు తుండును తల చుట్టూ చుట్టుకుంటూ ఆయన లోపలికి వెళ్ళిపోతుంటే మేము చూస్తూ కూర్చున్నాం.
“పుట్టుక, చావు, పెళ్ళి వంటి సంస్కారాల్లో ఈ స్వామీజీలు వ్యవహరించే తీరు చాలా అసంబద్ధంగా అనిపిస్తుంది” అన్నారు అర్జున నాయర్.
“తన కొడుకు వచ్చి అంతిమ సంస్కారాలు చేయలేదంటే ఆయన నిరుత్సాహపడతాడు ”
“ఆయన వెళ్ళిపోయారు కదా”
“వెళ్ళలేదనే కదా మన నమ్మకం? మనకు తెలిసిందెంత?”
“ఇంకా ఇక్కడే తచ్చాడుతున్నారా ఏంటి?”
“శరీరం పక్కనే కూచుని ఉంటారని చెబుతారు.”
“ఏమోలే!” అన్నారు అర్జున నాయర్. “చివరి రోజుల్లో ఆయన రాసిన కథలన్నీ ఇలాంటి విశ్వాసాలకు చెందినవే. ఎస్.వినోద్ కృష్ణన్ వాటిని ‘మెటా ఫిజికల్ రియలిజం’ అని సమీక్షించారు. అయితే ఆయనకు సంబంధించినంత మటుకు ఇవన్నీ కల్పించి రాసిన రాతలు కావు. అనుభవ సత్యాలు…”
నేను చిన్నగా నవ్వాను.
“అయితే ఒకరకంగా ప్రభానందులవారు చెప్పేది నిజమే. ఇదే ఒక మామూలు సగటు వ్యక్తి అయితే ఎన్ని రోజులైనా కాచుకొని ఉండవచ్చు. అందులో పెద్ద ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ కార్యక్రమం కోసం కేరళ మొత్తం కాచుకొని ఉంది. నాలుగు రోజులుగా పేపర్లలో టీవీల్లో ప్రధాన వార్త ఇదే. చనిపోయిన వ్యక్తి కేరళలో ప్రసిద్ధికెక్కిన ఒక గొప్ప రచయిత. దేశవ్యాప్తంగా ప్రసిద్దికెక్కిన కార్టూనిస్ట్. అందరి ఎదురుచూపులు ఒక్కటైనప్పుడు మన మీద ఒత్తిడి కొండంత అవుతుంది” అన్నారు అర్జున నాయర్.
“ఏం చెయ్యగలం? మనం ఎదురుచూడాల్సిందే. ఆయన కోరిక ఏమిటన్నది ఇప్పుడు ప్రపంచానికంతా తెలుసు!”
“అవును, చూద్దాం. ఎలాగైనా ఈ రోజు వచ్చేస్తాడేమో?”
“కొడుకుతో ఆయనకు సత్సంబంధాలు, రాకపోకలు లేవా?” అన్నాను.
అర్జున నాయర్ వెనక్కు తిరిగి కె.వి. రమగారిని చూసి, గొంతు తగ్గించి, “పెద్దగా లేదనే అనుకుంటున్నాను. ఫోన్లు ఉన్నట్టు లేవు. ఉత్తరాలు కూడా రాసుకోవడం లేదు. ఒకసారి ఆయనకు ఒంట్లో బాగా లేకపోతే ఫోన్ కూడా చేసాం. దానిక్కూడా సమాధానం లేదు.”
కె.వి.జయానన్ చివరి ఆరు సంవత్సరాలు ఈ బోధానందుల ఆశ్రమంలోనే గడిపారు. ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన కాటేజీ. అందులోనే తన పిల్లితో బాటు ఒంటరిగా ఉండేవారు. ఆయనకి పార్కిన్సన్ జబ్బు ఉండేది. కాబట్టి ఒక మనిషి పనులు చేసిపెడుతూ తోడుగా ఉండేవాడు. కుంజప్పన్ అని అతని పేరు, ఓ అరవై ఏళ్ళుంటాయి. కాని కుంజప్పన్కు కూడా ఆయన గురించి పెద్దగా తెలియదు.
“రాయల్టీ ద్వారా డబ్బు బాగానే వస్తూ ఉండేది. అది కూడా కొడుక్కు చెందేట్టు విల్లు రాసి రిజిస్టర్ చేశారు.” అని అర్జున నాయర్ చెప్పారు.
మళ్ళీ కొంత సేపు నిశ్శబ్దం ఆవరించింది. ఇలా అప్పుడప్పుడు వచ్చిపోయే మౌనమే భారంగా ఉంటుంది. దాన్ని భగ్నం చేయడానికి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాం. అర్థంలేని మాటలైనా ప్రభానందులవారు మా మధ్యలో ఉన్నంతవరకు బాగానే ఉన్నట్లు అనిపించింది. ముందు గుమ్మం తలుపు దగ్గర ఏదో కదలిక కనిపించగానే నిజంగానే కొంచెం ఓదార్పు అనిపించింది. భుజానికి తగిలించుకున్న కెమెరాతో వచ్చిన వ్యక్తి జర్నలిస్టులా కనిపించాడు. జర్నలిస్టు అని తట్టగానే, ‘నయం. టి.వి. వాళ్ళు కారు’ అన్న ఊరట కూడా కలిగింది.
నల్లగా, పొట్టిగా ఉన్నాడా యువకుడు. దగ్గరికి వచ్చి సంకోచిస్తూ నిలబడ్డాడు. అర్జున నాయర్ “ఊ?” అన్నారు.
“నేను జన్మభూమి పత్రిక రిపోర్టర్ని, నా పేరు దివాకరన్. ఒక చిన్న ఇంటర్వ్యూ కోసం వచ్చాను.”
“ఎవరితో?”
“అలా కాదు. మామూలుగా…” అని అతడు సందేహిస్తూ నన్ను చూశాడు.
“ఇక్కడ జరుగుతున్నదంతా టి.వి.లో చూపిస్తూనే ఉన్నారు కదా?”
“అవును. అందుకనే కొంత వివరంగా ఒక ఫీచర్లా ఏదైనా ఒకటి చెయ్యమని చెప్పారు. నేను పొలిటికల్ రిపోర్టర్ని. సాహిత్యం గురించి అస్సలు తెలియదు. అయినా నాకు వేరే దారిలేదు” అన్నాడు.
“ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చే సమయం, పరిస్థితీ కాదు. రేపు చూద్దాం” అన్నారు అర్జున నాయర్.
“ఆమె కవయిత్రి కె.వి. రమగారు కదా! చనిపోయిన జయానన్గారి చెల్లెలు కదా? నేను ఫోటోల్లో చూసున్నాను” అన్నాడు. “హలో మేడమ్! నా పేరు దివాకరన్. జన్మభూమి రిపోర్టర్ని. నాకు ఒక్క ఐదు నిముషాల ఇంటర్వ్యూ ఇస్తారా? అయిదే అయిదు నిముషాలు చాలు.”
కె.వి.రమగారు కోపంగా ఏదో అనబోతున్నారని నేను అనుకున్న క్షణంలోనే ఆమె కదిలి అతన్ని దగ్గరకు రమ్మని చేత్తో సైగ చేశారు. అతను దగ్గరకు వచ్చాడు.
“ఏంటి?” అని అడిగారు.
“ఒక చిన్నఇంటర్వ్యూ… నాలుగే నాలుగు ప్రశ్నలు.”
“అడుగు.”
“టీచర్ గారు ఇప్పుడు అలసిపోయి ఉన్నారు…” అని నేను అడ్డం చెప్పబోతుంటే, ఆమె ఫరవాలేదు అన్నట్లు సైగ చేశారు. మాట్లాడాలని అనుకుంటున్నారని తెలిసింది. ఆమె మాటలు విని చాలా కాలమైందని అనుకున్నాను.
“మేడం, నేను సాహిత్యానికి కొత్త. నేను సేకరించిన సమాచారాన్ని బట్టి అడుగుతాను. ఒక చెల్లెలిగా మీరు కె. వి. జయానన్ గారిని బాగా దగ్గరగా చూశారు. మీకు కూడా సాహిత్య ప్రవేశం ఉంది. ఆయన గురించి మీ అభిప్రాయం ఏమిటి?”
కె.వి.రమగారు తన లావుపాటి కళ్ళద్దాలను చూపుడు వేలితో పైకెగదోసుకుంటూ, “తల్లిలేని పిల్లవాడు… ఒకరకమైన అనాథ. మానసికంగా ఎప్పుడూ తీవ్రమైన భావావేశాలకు లోనౌతూ ఉండేవారు. ఆయనకు ప్రతి క్షణం ఎవరో ఒకరి సహచర్యం, సాంత్వన కావలసి వచ్చేది. ఎక్కడైనా తలదాచుకోవాలని, దేనినైనా గట్టిగా పట్టుకోవాలని తపిస్తూనే ఉండేవారు.”
“ఓ” అన్నాడు. అతనికి ఏమీ అర్థం కాలేదని తెలిసింది. అతడు ఏదీ సక్రమంగా రాయలేడని కూడా అర్థమయింది. అదే మంచిది. దేన్ని గురించి జాగ్రత్తగా ఉండాల్సిన పనిలేదు. నాకు నవ్వు వచ్చింది.
“ఆయన్ని అసలు బోధానందుల ఆశ్రమానికి తీసుకువచ్చింది మీరే కదా? మీరు ఇంతకు ముందు కూడా ఆశ్రమానికి వచ్చారు కదా ?” అన్నాడు దివాకరన్.
“అవును. ఆయనకు కావలసింది ఒక తండ్రి. బోధానందులు అనే తండ్రిని ఆయనకు పరిచయం చేశాను. మా అన్నకు గురువు గాని, దేవుడు గాని అవసరం లేదు. ఆయన జీవితాంతం వెతికినదంతా ఒక తండ్రి కోసమే.”
రిపోర్టర్ అయోమయంగా ముఖం పెట్టి, నన్ను చూశాడు. అయితే కె.వి.రమగారు తన మాటలను కొనసాగించారు.
“మా నాన్న మలబార్ స్పెషల్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నతాధికారి. గంభీరంగా ఉండేవారు. చాలా కఠినమైన వారు కూడా! కిళక్కువాదుక్కల్ అచ్చుదన్ వేలాయుధన్ అంటే, ఆ కాలపు బ్రిటీష్ ఆఫీసర్లలో అందరికీ తెలుసు ! చాలా ముఖ్యమైన కేసుల్లో నేరస్థులను పట్టుకొన్నవారు. కాబట్టి నిర్వహణ బాగా ఇబ్బందిగా ఉన్న చోట్లకు ఆయన్ని బదిలీ చేస్తూనే ఉండే వాళ్ళు. పాత రోజుల్లో బ్రిటీష్ వాళ్ళ పాలనలో మదరాస్ ప్రెసిడెన్సీ అంటే మలబార్ నుండి విశాఖపట్నం వరకు! మా నాన్న చాలా వరకు తమిళ నాడులోను, పాలక్కాడులోను పని చేశారు.”
“మేము మా చిన్నప్పుడు పదమూడేళ్ళు పాలక్కాడులోనే ఉన్నాం. పాలక్కాడుకు దగ్గరే ఒక చిన్న గ్రామం, విజయ శృంగనల్లూర్. మా ఇంటి చుట్టూతా కొండలు భారీ అంతస్థులున్న భవనాల్లా ఉండేవి. నిశ్చలంగా ఉండే ఆ కొండలు మా జీవితాలమీద చాలా లోతైన ప్రభావాన్ని చూపాయి. మా అన్నకు కలల్లోగూడా ఎప్పుడూ ఆ కొండలే కనపడేవి. చివరి రోజుల్లో ఆయన గీసిన అన్ని చిత్రాల్లోనూ అలలు అలలుగా కొండలే ఉండేవి.”
కె.వి.రమగారు కళ్ళు కిందకి దించి నేలకేసి చూస్తూ చెప్పుకొంటూ పోతున్నారు. దివాకరన్ తన టేప్ రికార్డర్‌ను ఆన్ చేసి తదేకంగా చూస్తూ ఉన్నాడు. రమగారు కూడా యాంత్రికంగా చెప్పుకుంటూ పోతున్నారు. ఆమె కంఠం స్పష్టంగా ఉంది.
“నాన్న మమ్మల్ని దగ్గరకు తీసుకొని ముద్దు చేసిన జ్ఞాపకమే లేదు. ఆయన ఇంటికి రావడమే అరుదు. ఎక్కువభాగం ప్రయాణాల్లోనే ఉండేవారు! ఆ రోజుల్లో, పాలక్కాడు కొండ ప్రాంతాలలో ఊరూరా తిరుగుతూ దొంగతనాలు చేసే బందిపోట్ల బెడద విపరీతంగా ఉండేది. కొంగునాడు నుండి కనుమల దారిలో ఇటువైపు వచ్చే సరకుల బళ్ళను దోచుకునేవాళ్ళు. ఆ రోజుల్లో అన్ని రకాల మిల్లులూ కొంగునాడులోనే ఉండేవి. బట్టలు మొత్తం అక్కడినుండే రావాలి. ఆ బందిపోటు దొంగలను పట్టుకోవడానికి అక్కడక్కడా పోలీసులు క్యాంపులు వేసే వాళ్ళు. అమ్మ, మేము, బంధువులతో, పనివాళ్ళతో అక్కడ ఉండే వాళ్ళం. అమ్మ చనిపోయిన తరువాత నాన్న రెండో పెళ్ళి చేసుకున్నారు. మా పిన్ని, నాకన్నా ఎనిమిదేళ్ళు పెద్దది. పిన్ని కూడా చాలా వరకు నాన్నతోబాటు క్యాంపులకు వెళ్ళేవారు.
“అన్న పదినెలలు నిండక ముందే అంటే ఏడవ నెలలోనే పుట్టేశాడు. పుట్టినప్పుడు ఒక అరచేతిలో ఇమిడిపోయేంత బిడ్డగా ఉండేవాడని చెప్పేవాళ్ళు. కోయంబత్తూరులో ఒక బ్రిటీష్ డాక్టర్ ఆయన ప్రాణాలను కాపాడాడు. కానీ అన్న నరాల బలహీనతతో బాధ పడేవారు. అవయవాల కదలికలో పొంతన ఉండేది కాదు. బాల్యమంతా ఆయన రోగిష్టి గానే ఉన్నారు. కీళ్ళవాపులు, నొప్పులు ఉండేవి. అప్పుడప్పుడు మూర్ఛవచ్చి పడిపోతూ ఉండే వారు. ఆయన్ని పద్నాలుగేళ్ళ వరకు బడికి పంపనే లేదు. ఇంట్లోనే ఇంగ్లీషు, మిగతా కొన్ని సబ్జెక్టులు నేర్పించారు. పదిహేనో సంవత్సరం ఇ.ఎస్.ఎస్.ఎల్.సి పరీక్ష రాసి బళ్ళో చేరారు. బళ్ళో తెలివైనవాడిగా మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. ఆ కాలంలోనే మదరాసు విశ్వవిద్యాలయం నించి ఏం.ఏ. లిటరేచరులో బంగారు పతకాన్ని పొందారు.
“కాని నరాల బలహీనత మాత్రం ఆయన్ని వదిలిపెట్టలేదు – వంట్లో ఎప్పుడూ సన్నని వణుకు ఉండేది. నేనెప్పుడైనా ఆయన చేతులను పట్టుకుంటే ఆ వణుకు స్పష్టంగా తెలిసేది. అరచేతులు ఎప్పుడూ తడిగా ఉండేవి. పెదవులు పాలిపోయి ఉండేవి. చిన్నప్పటి నుంచే లావుపాటి కళ్ళద్దాలను వేసుకునే వారు. కళ్ళు నీళ్ళల్లో ఈదుతున్నట్లు తడిగా ఉండేవి. ఏ పెద్ద శబ్దం వినిపించినా అన్న శరీరం ఉలిక్కిపడేది. ఉన్నట్టుండి ఎవరైనా అనుకోని విషయం ఏదైనా చెప్పినా, చెప్పడానికి ప్రయత్నించినా మూర్ఛ వచ్చేసేది. ఆయన గమనించనప్పుడు ఆయన్ని మనం తాకకూడదు. ఆవేశంతో ఏదైనా మాట్లాడితే నోరు వంకర తిరిగి నత్తి వచ్చేది. ఆగి ఆగి మండే దీపకళికలా కనిపించేవారు.
“కాని అన్న ఎప్పుడూ చదువుతూనే ఉండేవారు. రోజులో పది, పన్నెండు గంటలు చదివేవారు. సాహిత్యం, తత్త్వశాస్త్రం, కళలు, రాజకీయం, చరిత్ర… వంటివి. మాథ్స్, సైన్స్ అంటే ఇష్టం ఉండేది కాదు. లేదా ఆయనకవి అర్థం అయ్యేవి కాదని అనుకోవాలి. ఎక్కువ సమయం చదువుతూనే ఉండే వారు. ఆ సమయంలో ఆయన కళ్ళు, కళ్ళజోడునుండి విడివడి విడిగా కన్పిస్తూ ఉండేవి. రాత్రి వేళ టేబుల్ లాంప్ వెలుగులో అన్న చదువుతుంటే ఆయన ఆకారం కనిపించకపోయినా కళ్ళు మాత్రం జ్యోతుల్లా వెలుగుతుండేవి. ఆయన నిద్ర పోయేటప్పుడు పుస్తకాలపై ఉంచిన దళసరి కళ్ళద్దాలలో ఆయన చూపులు మణుల్లా ప్రకాశిస్తూ ఉండేవి. ఆ సమయంలో కూడా అవి చదువుతూనే ఉండేవి. లేదా దిగ్భ్రమతో మేలుకొని ఉండేవి. రాత్రి చీకట్లో నిద్రపోక ఆ కళ్ళు మేల్కొని ఉండడాన్ని నేను చాలా సార్లు చూసున్నాను.
“ఆయన అంత సామాన్యంగా మాట్లాడరు. ఆయనకు రోజువారి మాటల్లో ఆసక్తి లేదు. మాట్లాడటానికి ప్రారంభిస్తే మాట్లాడుతూనే ఉండేవారు. మాట్లాడి మాట్లాడి మధ్యలో దగ్గు వచ్చి ఊపిరాడక పడుకునేంతవరకు మాట్లాడుతూనే ఉంటారు. అవి వదరుబోతు మాటలు కావు. అన్న రాయవలసిన ఎన్నో గొప్ప పుస్తకాలు అలా మాటల్లా మారి గాల్లో కలిసిపోయాయని నాకు అనిపిస్తుంది. ఎక్కడో పుట్టి ఉన్న తన భవిష్యత్ పాఠకుల కోసం అలా మాట్లాడే వారని నాకిప్పుడు అనిపిస్తూ ఉంది.
“క్విట్ ఇండియా పోరాటం తీవ్రస్థాయికి చేరినప్పుడు అన్నకు పదమూడేళ్ళు. ఆ వయసులోనే అన్న బాగా ప్రభావితుడై రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రతిరోజూ ఆకాశవాణిలోనూ దినపత్రికల్లోనూ వచ్చే వార్తలు చదివి, విని తల్లడిల్లి పోయేవారు. ఆ వార్తలు విని కుమిలిపోయేవారు. ఆవేశంతో ఒళ్ళు తూలిపోతూ ఉంటే, నత్తిగా, ‘స్వతంత్రం, స్వతంత్రం, స్వతంత్రం’ అనే ఆయన మాటలు నాకిప్పుడు గుర్తొస్తున్నాయి. ఆయన కోరింది ఏ స్వాతంత్ర్యం అన్నది మాత్రం ఇప్పటికీ నాకు అంతు చిక్కలేదు.
“అన్న బడికి వెళ్తుండే రోజుల్లో దేశమే రగులుతూ ఉండేది. బడి జరిగే రోజుల్లో ఎక్కువభాగం పోరాటాలు, బందులు మాత్రమే! విద్యార్థులు చాలామంది రోడ్లెక్కి హింసకు పాల్పడేవారు. నినాదాలతో ఊరేగింపులు చేసేవారు. అన్న బడికి వెళ్ళేప్పుడు, తిరిగి వచ్చేప్పుడూ ఒక కానిస్టేబుల్ తోడుండేవాడు. అన్న ఇంక ఎక్కడికీ వెళ్ళలేరు. బడికి వెళ్ళిన రోజుల్లో కూడా సహ విద్యార్థులతో స్నేహంగా ఉండటం చేతకాలేదు. ఆయన మాటలు వాళ్ళకు అర్థం అయ్యేవికావు. వాళ్ళ దూకుడు స్వభావం అన్నకు భయాన్ని కలిగించేది.
“బళ్ళో అన్న ఒక పరాయి మనిషిలా ఎగతాళికి గురి అవుతూండేవారు. బళ్ళో అన్నకి గుడ్లగూబ అన్న పేరుండేది. పగటిపూట లేచి వచ్చిన గుడ్లగూబలా తరగతి గదిలో కూర్చుని ఉండేవారు. తర్వాతి కాలంలో అన్న గుడ్లగూబ అన్న కలం పేరుతో కొన్ని రచనలు చేశారు. ఆయన కథల్లో కూడా గుడ్లగూబ ప్రసక్తి తరచూ కనబడుతూనే ఉండేది. అయితే అన్న తోటి విద్యార్థులు చేసే పోరాటాల్లో మానసికంగా పాలుపంచుకుంటూనే ఉండేవారు. తన తెలివే తన బలం అన్న విషయాన్ని బహుశా ఆయన బళ్ళోనే గుర్తించి ఉండవచ్చు. తోటి విద్యార్థులకన్న ఆయన చాలా పై స్థాయిలో ఉండేవారు.
“కాలేజీకి వెళ్ళగానే అన్నలో పెద్ద మార్పు వచ్చింది. మెట్రిక్యులేషన్లో ఆయన అందుకున్న బంగారు పతకం దీనికి ముఖ్యమైన కారణం. అన్న విద్యార్థి సంఘ నాయకుడయ్యారు. కాని అప్పటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చేసింది. కొత్తగా పుట్టుకొచ్చిన పెట్టుబడి దారులతో భూకామందులతో కాంగ్రెస్ పార్టీ నిండిపోయింది. వాళ్ళే ఆ పార్టీ ముఖాలుగా మారారు. అన్ని అధికార పదవులూ వాళ్ళే చేజిక్కించుకున్నారు. ఉత్తరదేశంలో చోటుచేసుకున్న మత కలహాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు దేశ సంక్షేమానికి పనికిరానివని ఆయనకు అనిపించాయి.
“అప్పుడు కోకొల్లలుగా పుట్టుకొచ్చిన దినపత్రికలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఎంతోమంది చదవడం మొదలు పెట్టారు. చదువరులు అందరినీ ఆ పత్రికలు కమ్యూనిస్ట్ సిద్ధాంతాల వైపు నెట్టాయి. అన్న పొడవైన వదులు జుబ్బా వేసుకోవడం ప్రారంభించారు. వంకీలు తిరిగిన ఒత్తైన జుట్టుతో, సన్నని మీసకట్టుతో ఆయన స్వరూపం మారింది. చివరిదాకా ఆయన అలానే ఉన్నారు. ఆ రూపంపై రవీంద్రనాథ ఠాకూర్ ప్రభావం ఉంది. అన్న వేదికల మీద పిడికిలిని బిగించి చేయెత్తి మాట్లాడటాన్ని నేను విన్నాను. అది ఆయనేనా అన్న ఆశ్చర్యానికి లోనయ్యాను. ఆవేశంగా మాట్లాడటం ఆయనకు చేతకాదు. కాని హాస్యస్ఫోరకంగా మాట్లాడగలరు. సరైన పదాల పొందికతో ప్రజల మనసుల్ని ఉద్వేగానికి లోను చేయగలరు. ఆరోజుల్లో అన్న గొప్ప వక్త అని చెబితే, ఈరోజు ఆయనకున్న శిష్యులు నమ్మరేమో!
“అన్నకు కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడు అవడానికి బక్కపలచగా ఉండటమే కలిసొచ్చింది. పి.జి. పాసైన వెంటనే మదరాస్లోని ఒక కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం చేయటం మొదలుపెట్టారు. అప్పటి దాకా ఆయనకు కమ్యూనిజంతో ఉన్న సంబంధం గురించి నాన్నకి తెలియదు. ఉద్యోగంలో చేరిన తరువాత అన్న నాన్నను పూర్తిగా దూరం పెట్టారు. సంబంధాన్ని పూర్తిగా తెంచుకున్నారు. అన్నతో మాటామంతీ, రాకపోకలు ఉండింది నాకు ఒక్కదానికే. నేనప్పుడు కాలేజీ చదువులకు వచ్చేసాను.
“మా నాన్నకు అన్నంటే ఏమాత్రం ఇష్టం లేదు. తనకొక కొడుకున్నాడన్నట్టే మా నాన్న భావించలేదేమో. రోగిష్టులైన కొడుకులు తండ్రుల మనస్సుల్లో విరుద్ధ భావాలను రేకెత్తిస్తారు. కొడుకుల మీద అంతులేని ప్రేమతో రాత్రి పగలు తేడా లేకుండా బాధకు లోనవడం లేదా వాళ్ళపై కోపంతో దూరం పెట్టడం. అహంకారంతో గర్వంతో కూడిన స్వభావం నాన్నది. ఆయన కొడుకు అలా ఉండటం వల్ల తనను అందరూ ఎగతాళి చేస్తున్నట్లు భావించేవారు. అన్నను చూడగానే ముఖం మాడ్చుకునేవారు. తెలియకుండానే నాన్న ముఖం ముడుచుకుపోయేది. అన్నను ఎప్పుడూ దగ్గరకు తీసిందీ లేదు. ఒక మాట ప్రేమగా మాట్లాడిందీ లేదు.
“మొదట్లో అన్న నాన్న రాక కోసం ఎదురుచూసేవారు. నాన్న ఇంటికి వచ్చే రోజులను లెక్కబెట్టుకుంటూ ఉండేవారు. అయితే నాన్న యింటికి రాగానే మరునాడే ఆయన వెళ్ళిపోతే బావుండు అనిపించేది. రాగానే ఇంటిని మొత్తం నాన్న తన చేతిలోకి తీసుకుంటారు. వారి అహంతో ఇల్లంతా నిండిపోతుంది. నాన్న మాటల మనిషి కారు. ఇంట్లో ఆయన మాటలెప్పుడూ విన్పించేవి కావు. కాని ఇంట్లో నాన్న ఎక్కడున్నా మనం వినగలం.
“చిన్నగా ఉన్నప్పుడు అన్న నాన్నకు కోపం తెప్పించే పనులే చేసేవారు. నాన్న ఊరినుంచి వచ్చినప్పుడల్లా అన్నకు మూర్ఛ వచ్చేది. నోటినుండి నురగ కారుతుండేది. దుప్పటి కప్పి కారులో ఆస్పత్రికి తీసుకుని వెళ్ళేవాళ్ళం. అయితే నాన్న, అన్న దగ్గరికి రావడం గాని తాకి చూడటం గాని చేసేవారు కారు. ఇప్పుడు తల్చుకుంటే జ్ఞాపకం వస్తూంది. నాన్నను కలవడానికి ఎవరైనా ఇంటికి వచ్చినా ఆఖరికి నాన్న పిన్ని మాట్లాడుకుంటూ ఉన్నా అన్నకు మూర్ఛ వచ్చేది.
“వయస్సు పెరుగుతున్న కొద్ది అన్న నాన్నను పూర్తిగా దూరం పెట్టడం, మరిచిపోవడం అలవాటు చేసుకున్నారు. ఊరు విడిచి వెళ్ళాక నాన్నకు ఒక్క ఉత్తరం కూడ రాయలేదు. నిజంగానే కనీసం ఒక్క వాక్యం కూడా రాసింది లేదు. నాన్న ఊళ్ళోనే ఉన్న విషయం తెలీకుండానే అన్న ఎన్నో సంవత్సరాలు ఉన్నారు. నాన్నను బాధ పెట్టేందుకు అన్న ఎన్నుకున్న మార్గం అది. అది బాగానే పని చేసింది.
“అన్న నిరాదరణకు గురైన నాన్న, అన్న జ్ఞాపకాల్లోనే బతికారు. కాని అన్నను గురించి ఒక్క మాట కూడా అడిగే వారుకారు. ఈ కారణం వల్లే అన్న, నాన్నలో క్యాన్సర్ లా పెరిగిపోయాడు. ఇది నిజం. నాన్నలో పెరిగిన ‘అన్న’ అనే వ్యాధి నాన్న మరణానికి కారణమయింది. అంత్యదశలో ఒంటరిగా ఒక్క మాటను కూడా మాట్లాడకుండా బతికారు నాన్న. కిళ్ళీ వారి నోటినెప్పుడూ మాట్లాడనీకుండా మూసి ఉంచేది. ఆయన గుండెల నిండా పొగాకు పొగ నిండిపోయి ఉండేది.
“1948లో రణదివే తన థీసిస్ వెలువరించిన సమయంలో, మొదటి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ సమయంలో అన్న కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఒకసారి పార్టీ సభలో మాట్లాడుతుంటే మధ్యలోనే మూర్ఛ వచ్చి స్పృహ తప్పారు. ఆ రోజుల్లో ఆయన శరీరం చాలా బలహీనంగా ఉండేది. ఆప్పటి ఆ రాజకీయ పరిణామాల వేగాన్ని అందుకోవడం ఆయనకు కష్టంగా ఉండేది. అయితే ఆయన సంతోషంగా ఉన్నది కూడా అదే సమయంలోనే అని బాగా గుర్తు. ఆయనపై మదరాసు ప్రెసిడెన్సీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాని నాన్న తెలివిగా అన్నను మలబారుకు పిల్చుకొని వచ్చి అరెస్ట్ కాకుండా కాపాడారు.
“నాన్న వల్లనే జైలుకు వెళ్ళకుండా తప్పించుకోగలిగానని అన్నకు తెలుసు. కాని చివరిదాకా తెలియనట్లే ప్రవర్తించేవారు. జైలుకు వెళ్ళి ఉంటే ఆయన అక్కడే చనిపోయి ఉండేవారు. అప్పుడాయన దాదాపు ప్రతిరోజూ మూర్ఛరోగంతో బాధపడేవారు. కాని ఆ మూర్ఛరోగమే తన రచనాశక్తికి పునాది అని ఆయన చెబుతూ ఉండేవారు. ఆయనలోని పసిపిల్లవాణ్ణి జాగ్రత్తగా కాపాడుకుంటూవచ్చింది ఆ రోగమే! దస్త్యోవిస్కీకి కూడా మూర్ఛరోగముండేది. ఈ రోగం మెదడును కొరడాతో కొట్టినంత బాధ కలిగిస్తుంది. రోకలితో మామిడి చెట్టును మోది ఎండిన ఆకులను వాడిన పిందెలను రాల్చేయటం లాంటిది. ‘మూర్ఛ నుంచి లేచి వచ్చిన ప్రతి సారి మనం పునర్జన్మ ఎత్తుతాం’ అని అన్న అనే వాళ్ళు.
పార్టీ సాయుధ పోరాటాన్ని వదలిపెట్టినప్పుడు అన్న నిరాశ చెందారు. చెన్నైలోనే వేరొక కళాశాలలో అధ్యాపకులుగా చేరారు. అధ్యాపకునిగా ఆ కాలంలో ఆయన సంతోషంగానే ఉండేవారు. సాహిత్యపు పాఠాలు చెప్పడం ఆయనకు ఇష్టమైన విషయం. ఐరోపా సాహిత్యకారులను ఆయన లోతుగా అభ్యాసం చేస్తున్న రోజులవి. మప్పాసా, అలెగ్జాండర్ కుప్రిన్, విలియం సరోయన్ల సాహిత్యమంటే ఆయనకెంతో మక్కువ. కాని చాలా మందికి తెలియని విషయమొకటుంది. ఆయనకు అమెరికా సాహస నవలలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా యుద్ధ సాహసాల నేపథ్యమున్న నవలలు. అలీస్టర్ మక్లీన్ వంటి ప్రసిద్ధ రచయితలు మాత్రమే కాదు, కార్నిలియన్ రయాన్ వంటి వారి రచనలను కూడా వెతుక్కుని మరీ చదివేవారు.
1956లో కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు అన్న ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కమ్యూనిస్టు కేరళను చూడడానికి రైల్లో మలబారుకు రావడం, పాలక్కాడు సరిహద్దులో ఎగురుతున్న ఎర్రని జెండాను చూచి ఆనందంతో కన్నీరు కార్చడం… వీటిని గురించి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఆయన రాసిన రచనల్లో మనం చూడొచ్చు.
‘ఒక రక్తాశ్రువు జ్ఞాపకం’ అన్న ఆ వ్యాసాన్ని ఆయన కన్నీళ్ళు కారుస్తూనే రాసుంటారు. ఎందుకంటే అప్పుడే సోవియట్ రష్యా ముక్కలవ్వడం మొదలైంది. 1988లో గ్లాస్ నోస్త్, పెరెస్ట్రోయికాల వల్ల పెనుమార్పులు రావడం మొదలైంది. సోవియట్ రష్యా విడిపోతుందని అన్న ఊహించారు. ప్రముఖ రాజకీయ విమర్శకుడిగా ఆయనకు అన్ని దేశాల పత్రికాధిపతులతోనూ ఢిల్లీలోని ఉన్నతాధికారులతోనూ సత్సంబంధాలు ఉండేవి.
తొంబైల ప్రారంభానికే అన్న, కమ్యూనిజం కల నుండి బయటికి వచ్చేసారు. అప్పటికి ముప్పై యేళ్ళు పూర్తయ్యాయి. అప్పుడు అన్నను కమ్యూనిజానికి శత్రువు అనే అనుకునేవాళ్ళు. అయితే సోవియట్ రష్యా విభజన ఆయనను మళ్ళీ రోగగ్రస్థుడిగా చేసింది. మూర్ఛరోగంతో నాలుగు రోజులు ఆస్పత్రిపాలయ్యారు. దీర్ఘకాల చికిత్సకు లోనయ్యింది కూడా అప్పుడే. ఆయన ఆరోగ్యం ఇంకా బలహీన పడింది. ఊతకర్ర లేకుండా నడవలేక పోయారు. రాయలేక పోయారు. అప్పుడు చూపుడు వేలితో టైపు చేసేవారు. అయితే కుంచెతో కార్టూన్లను వేయగలిగేవారు. అదెలా సాధ్యమో తెలియదు.
కమ్యూనిజంలోనుంచి బయటకు వచ్చిన తరువాత అన్న ఎప్పుడైనా సంతోషంగా ఉన్నారా? కేరళలో ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ తొలి కమ్యూనిస్ట్ పాలనా వైఖరి, అది విమోచన సమరం అనే పేరుతో ఉద్యమ లక్ష్యం పట్టించుకోని వాళ్ళ చేతుల్లో పతనం కావడం, కమ్యూనిస్ట్ పార్టీ అంతర్గత రాజకీయాలు – ఇవన్నీ అన్నను మానసిక క్షోభకు గురిచేశాయి. 1964లో పార్టీ ముక్కలైనప్పటికే అన్న కమ్యూనిజంనుండి దూరంగా ఉన్నారు. ఎందుకంటే సోవియట్ రష్యాలోని అణచివేత విధానం, రష్యాకు చైనాకు మధ్య గల సరిహద్దు యుద్ధం… వీటన్నిటి గురించి ఆయనకు తెలుసు. సమస్యల్లా ఆయనకు అవసరమైనదానికన్నా కొంత ఎక్కువ అవగాహన ఉండటమే. కాబట్టి దేన్నీ మనస్పూర్తిగా నమ్మి స్వీకరించలేకపోయారు.
1965లో చెన్నైలోని కళాశాల అధ్యాపక వృత్తిని వదలి అన్న ఢిల్లీ వెళ్ళారు. అక్కడ పత్రికా సంపాదకునిగా చేరారు. అన్న ఆంగ్లంలో రాసే శైలీ భాషా పరిజ్ఞానం అందరి మన్ననలను పొందింది. మళ్ళీ ఆయన పుస్తక పఠనం పట్ల తీవ్రంగా మొగ్గు చూపారు. కమ్యూనిజంమీద నమ్మకాన్ని పోగొట్టుకుని దాని చీకటి కోణాలను చర్చించిన ఆర్థర్ కొశ్వర్ వంటి వారి రచనలను చదవడం ప్రారంభించారు. ఒక దశలో పూర్తిగా అస్తిత్వవాదానికి సంబంధించిన సాహిత్యం చదవడంలో లీనమయ్యారు. స్వయంగా తానే మార్టిన్ హైడెగ్గర్ రచనల్ని అనువాదం చేశారు. తరువాత వారి జీవితం మొత్తం అస్తిత్వ పోరాటమే, చివరి ఐదు సంవత్సరాలు తప్ప.
అన్నను యిద్దరు తండ్రులు ఒదిలిపెట్టేశారు. జన్మనిచ్చిన తండ్రి, కమ్యూనిజం అనే తండ్రి. “ఇద్దరు స్టాలిన్ల నుండి తప్పించుకున్న వాణ్ణి నేను” అని ఆయన రాసుకొన్నారు. నాన్న చనిపోయినప్పుడు అన్న నాకు రాసిన ఉత్తరంలో ఆల్బర్ట్ కాము రాసిన ‘అపరిచితుడు’ నవలలోని మొదటి వాక్యాన్ని పేరడీ చేసి ‘నాన్న మరణించింది నిన్ననా, లేక గత జన్మలోనా?’ అని రాశారు. అస్తిత్వవాదం తీవ్రస్థాయిలో ఉన్న రోజుల్లో ఆయన స్వభావానికి భిన్నమైన హాస్యం ఆయనలో చోటుచేసుకుందనే చెప్పాలి. అన్న కార్టూనిస్టుగా మారారు. ఆయన రాతల్లో మాటల్లో గీసే బొమ్మల్లో ఒక వగరుతో కూడిన అపహాస్యం నిండి ఉండేది.
అన్న సన్నని శరీరం, స్వరూపం ఆయా కాలాలకు తగినట్లు తమను మార్చుకుంటూ రావడం నాకు ఆశ్చర్యం కలిగించేది. యౌవనంలో సన్నని శరీరంతో రోగిష్టి అయిన యువకుడిగా కన్పడ్డారు. తరువాత ఎగిరిపడే విప్లవకారునిగా నాజూకుగా మారారు. ఆ తరువాత విదూషకునిలా కొంత విచిత్రమైన సన్నని శరీరంతో కుచించుకుపోయారు. ఢిల్లీ జీవితంలో పేరడీ కోసం ఎన్నో విచిత్రమైన రూపాలను ధరించారు. భయగ్రస్థుడిలా శరీరాన్ని కుదించుకున్నారు. ఒక వైపుగా శరీరాన్ని వంచి నడుస్తూ అచ్చం ఒక జోకర్లా మారిపోయారు.
లోపలనించీ పెల్లుబికిన హాస్యమే ఆయన్న ప్రసిద్ధికెక్కిన కార్టూనిస్టుగా మార్చింది. అదే హాస్యంతో ఆయన మలయాళంలో కథలు రాశారు. ఆయన అన్ని కథల్లోనూ పాత్రలు కారికేచర్లే. సహజ స్వభావమున్న మనుష్యులను పాత్రలుగా సృష్టించడం ఆయన చేత కాలేదు. ఆయన భాష, తకళి శివశంకర పిళ్ళైలా, బాహ్యప్రపంచం మీద ఎలాంటి ఆపేక్షా లేకుండా చిత్రించిన యధార్థవాదం కాదు. ఎం. టి. వాసుదేవనాయర్లా భావావేశపూరిత కాల్పనిక వాదమూ కాదు. ఆయన వైకమ్ మొహమ్మదు బషీర్‌కు వారసుడు.
బషీరు కథల్లో సృష్టించిన పాత్రలన్నీ కారికేచర్లే. అన్నను ఆంగ్లంలో ఆలోచించి మలయాళంలో రాసిన, తరువాతి తరానికి చెందిన బషీర్ అనవచ్చు. అయితే బషీరులోని గ్రామీణ ప్రాంత స్వభావం, బాహాటంగా మాట్లాడే తత్త్వం రెండూ లేని వాడు అన్న. ఒకరకంగా చెప్పాలంటే ఆధునిక కేరళ సాహిత్యంలో అన్న పూర్వుల అడుగుజాడలను అనుసరించినప్పటికీ ఆయన రచనల్లో కొత్తదనం ఉండేది. అదే రీతిలో ఆయన కొత్తగా వచ్చే మార్పులను ఆహ్వానించే వారు. అందుకనేనేమో ఆయన రచనలు కొత్తతరం పాఠకులను కూడా ప్రభావితం చేస్తూ వస్తోంది. ఈనాటి రచయితల్లో అన్న ప్రభావానికి లోను కాని వాళ్ళే లేరు.
బషీరులోని ఎగతాళి, వ్యంగ్యం మాత్రమే కాదు. ఆయనలోని ఆధ్యాత్మిక చింతన, కవిత్వం కూడా అన్నలో కనిపిస్తుంది. మొదట్లో ఆయన రచనల్లో ఆ కవిత్వం కపటంలేని అమాయకత్వం మాత్రమే కనిపించేది. రాను రానూ మనుష్యుల మీది ఆయన ప్రేమలా, కాలానుగుణంగా వచ్చే మార్పుల పట్ల ఆయన పసి హృదయపు విస్మయంలా, ఆధ్యాత్మికత కూడా రూపుదిద్దుకుంది. ఆయన మొదటి నవల “ఐజాక్ పురాణం’ లోనే ఆ ఛాయలు మనకు పూర్తిగా కనిపించాయి.
యూదుల కథల ప్రకారం అబ్రహాంకు సారాకు జన్మించిన వాడు ఐజాక్. హీబ్రూ భాషలోని ఆ పేరుకు అర్థం “నవ్వేవాడు” అని. యూదుల ప్రాచీనులైన కేననైట్ కథల్లో ఒక నవ్వే దేవుడు ఉండేవాడు. ‘ఎల్’ అని పేరు. ఆ దేవుడే ఐజాక్గా యూదుల మతంలో స్థానంపొంది తరువాత క్రైస్తవులలోనూ, ఇస్లాంలోనూ ఒక తండ్రి పాత్రలా మారింది. ఈ ఐజాక్ ఐతిహ్యాన్ని పలురకాలుగా మార్పులు చేసి, విస్తరించి అన్న ఆ నవల్లో ఉపయోగించుకొన్నారు.
ఆ నవల్లో, అన్న ఒక అద్భుతమైన ప్రతిభాశీలి అయిన కథకునిలా కనిపిస్తారు. ఆయన బ్రహ్మగా మారి తను సృష్టించిన అన్ని పాత్రలనూ అభిమానిస్తారు. పాత్రలలోని చెడునూ అల్పబుద్ధినీ పిరికితనాన్నీ అన్నిటినీ ఆయన క్షమిస్తారు. మామూలుగా అయితే రచయిత గొంతు వినపడే రచనకు విలువ ఉండదు. ఐనా తను ఆ పాత్రలతో కలిసి ఆడుకుంటారు. ఆ నవలలో ఆయనే ఐజాక్, నవ్వే ప్రజాపతి! ఆ నవలే ఆయన అత్యుత్తమ రచన. ఆ తరువాత ఆయన అంతటి ఎత్తులను అందుకోలేక పోయారు.
ఆయన అందుకోసం తన ప్రయత్నాన్ని కొనసాగించారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా భావపూరితమైనవి. వాటిలో ఆయన స్వంత గొంతుక వినిపిస్తూ ఉండింది. ఒక రచనలో రచయిత స్వంత గొంతుక వినిపిస్తే దానికి విలువ లేదు. అతడు తననుంచి విడివడి మరొకరిలా మారి మాట్లాడితే తప్ప అది కథే కాదు. తన స్వంత గొంతును తానే వినడానికి భయపడి ఆయన వాటన్నిటినీ మెటాఫిజికల్ పాత్రలుగా మార్చివేశారు. వారి అందమైన కథల్లో మెటఫర్లు లేవు. ఇమేజీలు మాత్రమే ఉండేవి. ఇమేజీలు తావిగల పూల వంటివి. మెటఫర్ లు కాగితం పూలవంటివి.
సారా కొడుకు ఐజాక్ చివరి రోజుల్లో గుడ్డివాడయ్యాడు. ఈ విషయాన్ని ఒకసారి చెప్పారు అన్న. అద్దాలను తీసివేస్తే ఆయన కూడా గుడ్డివారే. చేతులతో కళ్ళద్దాలకోసం తడుముకునేటప్పుడు, “ఐజాక్ కళ్ళు, నవ్వి నవ్వి, అతడిని అవహేళనచేస్తూ ఉన్నాయి” అని ఆంగ్లంలో చెప్పారు. ఆశ్రమానికి వచ్చిన తరువాత ఆయన ధ్యానం చేసేటప్పుడు కళ్ళద్దాలను తీసి పక్కన పెట్టేవారు. ఫోటోల ద్వారా ప్రపంచానికి బాగా తెలిసిన ఆయన ముఖం అప్పుడు వేరేలా కనబడుతుంటుంది. ఆయన వేరొకరిలా మారి పోతారు – కళ్ళు లేని గుడ్డి ఐజాక్లా .
ఆ దళసరి కళ్ళద్దాలలోని చూపు, ఎప్పుడూ రెప్ప వేయదు. ఆ చూపు ఎప్పుడూ బల్ల మీదే ఉంటుంది. అన్ని కథలనూ రాసింది అదే. కార్టూన్ల రూపంలో అపహాస్యాన్ని గుప్పించింది అదే. ఆ చూపక్కడ ఏకాంతంలో కూర్చొని ఉంటుంది. ఇప్పుడు అన్న వెళ్ళిపోయారు. లేరు. కాని ఆ కళ్ళద్దాలను ఒక మ్యూజియంలో పెట్టి ఆ చూపులను పరిరక్షించుకోగలం.
కే.వి.రమగారు మాట్లాడ్డం ఆపినప్పుడు, దివాకరన్ తన టేప్ రికార్డర్ ను పరిశీలించాడు. రికార్డింగ్ అవుతోందని ఖరారు చేసుకున్నాడు.
“మేడం! ఆయన వివాహ జీవితం కూడా సాఫీగా సాగలేదని విన్నానే” అన్నాడు.
అతను ఆవిడ చెప్పిందేదీ తలకెక్కించుకోలేదని అర్థం అయ్యింది. ఆమె ఉలిక్కి పడి ఆశ్చర్యంగా అతనివైపు చూసారు. ఓ చిన్న నవ్వు నవ్వి, “ప్రస్తుతం నడుస్తున్న వివాహాలన్నీ సక్రమంగా నడుస్తున్నాయంటారా?” అన్నారు.
దివాకరన్ అనుమానాస్పదంగా, అయోమయంగా నన్ను చూసి “వాళ్ళు విడాకులు తీసుకున్నారు కదా?” అన్నాడు.
“ఔను. కాని వాళ్ళిద్దరూ పెండ్లికి ముందరే ఈ విషయం గురించి ఒక నిర్ణయం తీసుకున్నారు.”
దివాకర్ నన్ను, అర్జున నాయర్ ను మార్చి మార్చి చూసి ఓ రకంగా నవ్వుతూ, “అలాగా?” అన్నాడు.
కె.వి.రమగారు నన్ను చూస్తూ చెప్పారు. “మరియా, అమెరికన్ తల్లికి భారతదేశంలో పుట్టిన మహిళ. అన్నగారిని కలిసింది, వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొన్నది. అంతా 1970 జనవరి మాసాన కేవలం పదిహేడు రోజుల్లో జరిగిపోయింది. మరియా రీసెర్చ్ కోసమని అపుడు ఢిల్లీకి వచ్చి ఉంది. వాళ్ళిద్దరూ కలిసి కాశీ దాకా వెళ్ళొచ్చారు. అన్న ఎప్పుడూ ఏ మత్తు పదార్థాన్ని తీసుకోలేదు. మొదటిసారి కాశీలో, గంజాయిని పీల్చారు. ఆయనకేమీ కాలేదు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుండి మాత్రలు చాలా ఎక్కువ వేసుకునే వారు. మరియా నవ్వుతూ చూస్తూ ఉండిపోయిందట. అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు వివాహం చేసుకోవాలన్న నిర్ణయానికొచ్చారు.”రమ కొనసాగించారు, “అన్న ఢిల్లీకి తిరిగి వచ్చిన తరువాత నన్ను ‘సురి’ అనే ఇరానీ హోటల్లో ఒక టీ పార్టీకి రమ్మని ఆహ్వానించారు. నేను వెళ్ళినప్పుడు అక్కడ మరియా కూడా ఉన్నారు. అప్పుడే ఆమెను మొదటిసారిగా నేను చూశాను. ఎవరో విదేశాల నుంచి వచ్చిన పత్రికా సంపాదకురాలని అనుకున్నాను. అన్న చాలా మామూలుగా “రమా! నేనూ మరియా పెళ్ళి చేసుకున్నాం” అన్నారు.
“ఎప్పుడు?” అనడిగాను. నాకేం అర్థం కాలేదు.
“నిన్న” అని చెప్పారు అన్న.
నేను తేరుకొని, “కంగ్రాట్యులేషన్స్” అని మరియాతో చెప్పాను. మా అన్న వైపు చూసి, “ముందే చెప్పుంటే ఏదైనా గిఫ్ట్ తీసుకొచ్చేదాన్ని ” అన్నాను.
“అలాంటివేవీ వద్దనిపించే ఇలా చేశాను” అన్నారు అన్న. “ఇది ఒక ఒప్పందం. ఇద్దరు మనుష్యులు కలిసి జీవిద్దామని అనుకుంటారు. కనుక చట్టపరంగా ఒక ఒప్పందాన్ని చేసుకొంటారు. అదే వివాహం. ఎటువంటి నిర్బంధాలు లేవు, ఎటువంటి భావావేశాలు లేవు. ఇది చూడు…” అంటూ అన్న ఒక పత్రాన్ని చూపారు. దాంట్లో అంతా తమాషాగా రాసుంది. ఎవరు వంట చేయాలి, ఎవరు బట్టలు ఉదకాలి, ఎవరు ఇంటిని శుభ్రం చేయాలి, ఖర్చులను ఎలా పంచుకోవాలి… అన్నీ దాంట్లో రాసున్నారు, వారానికి అధమపక్షం కనీసం ఎన్నిసార్లు సెక్స్ చేయాలి, అన్న వివరంతో సహా.
“ఇదో చూడు. రూల్ నంబరు పదమూడు. దీని ప్రకారం ఇద్దరిలో ఎవరికి ఎప్పుడు విడిపోవాలనిపిస్తే అప్పుడు వెంటనే విడిపోవచ్చు. పక్క వాళ్ళు కాదని చెప్పకూడదు. ఎటువంటి సెంటిమెంట్లు ఉండకూడదు” అన్నారు అన్న.
“ఇదెందుకిప్పుడు?” అని అడిగాను.
“నువ్వు పార్టనర్షిప్ డీడ్లు ఎప్పుడూ చదవలేదా? వాటన్నిటిలో చివర్లో ఖచ్చితంగా రాస్తారు, విడిపోవాలంటే ఎలా విడిపోవాలీ అని. కంపెనీ డాక్యుమెంటేషన్ లో లిక్విడేషన్ క్లాస్ చాలా ముఖ్యం.
“ఇవేం మాటలు?” అన్నాను.
“దేన్ని గురించి?” అనడిగారు అన్న.
“ఒకటేదన్నా అనుకుంటే అది తప్పక జరుగుతుంది. విడిపోకూడదు అని ప్రతిజ్ఞలు చేసుకున్నా కూడా బంధుత్వాలు విడిపోవడం జరుగుతూ ఉంది. అదే పనిగా విడిపోవడం గురించి ఆలోచిస్తూ బంధం కొనసాగిస్తే ఆఖరికి విడిపోవటమే జరిగేది” అన్నాను. “నేను చెప్పేది విను. అది చించేయ్. అవసరం లేదు” అని చెప్పాను.
“ఇదో చూడు. వివాహ సంబంధాలు అణచివేతకూ వేదనకూ గురి అవుతున్నాయంటే దానికి కారణం బయటపడడానికి దారిలేక పోవడమే. ఎలాగున్నా ఇదే జీవితం అనీ చెంతనున్న వాళ్ళే గతీ అని ఆలోచిస్తూంటే – మనం, మన తోడును మనకు తగినట్లు మార్చుకోవాలని ప్రయత్నిస్తాం. ఒక ఎదిగిన వ్యక్తిని అలా మార్చడం వీలుకాదు, అని అర్థమైనపుడు మోసపోయామని అనుకుంటాం. దాంతో అసహనానికి లోనవుతాం. చిరాకు పడతాం. అదే హింసగా మారుతుంది. ఈ పది రూల్స్ లో – ‘సి’ కింద ఏం రాసుందో చూశావా? ఒకరు మరొకరిని తన కోరికకు అనుగుణంగా మార్చుకోవాలని ఏ ప్రయత్నమూ చేయరాదు.”
“అది సరే!” అన్నాను. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు.
“నిర్బంధాలులేని బంధాలు మాత్రమే ఎక్కువకాలం కొనసాగుతాయి. రైలు పట్టాలమధ్య అర్థ అంగుళం దూరం పెట్టి అమర్చి ఉంటారు. దగ్గర దగ్గరగా అమరిస్తే అవి ఎండాకాలంలో వేడికి ఇనుము వ్యాపించినప్పుడు చోటు చాలక ఒకటి ఇంకో దాని పైకెక్కి, రెండూ విరిగి పోతాయి.”
“అన్నా! ఇదో చూడు నేనున్నాను. నేను నీ చెల్లిని. మనిద్దరి మధ్యలో బంధుత్వాన్ని రద్దుచేయడం నీకు సాధ్యపడదు. నువ్వేం చేసినా నేను నీ చెల్లెలిగానే మిగిలిపోతాను, కదా?” అని నేను అడిగాను.
అన్న ఆశ్చర్యపోయారు.
“వివాహ బంధం కూడా అలాంటిదే అని మన పెద్దల అభిప్రాయం” అన్నాను.
“మనల్ని కలిపి ఉంచేది రక్తసంబంధం.”
“ఔను. మరియా నీకో బిడ్డను కంటే అది కూడా రక్తసంబంధమే.” అన్నాను నేను.
“నువ్వు సెంటిమెంటల్‌గా మాట్లాడుతున్నావు.”
“సెంటిమెంట్ అంటే ఏదో అనకూడని మాటలా అందరూ ఆక్షేపిస్తున్నారు. అది బాగా తెలివిగల వాళ్ళం అనుకునే వాళ్ళ బుద్ధి మాంద్యం మాత్రమే. ఈ సెంటిమెంట్లన్నీ వేల సంవత్సరాల పురాతనమైనవి. నువ్వు మాట్లాడే అస్తిత్వవాదానికి కనీసం యాభై సంవత్సరాల చరిత్రకూడా లేదు” అన్నాను నేను పరుషంగా. నాకు పొర పోయింది. “ప్రపంచమంతా సెంటిమెంట్ల మీద నడుస్తోంది. మీరు నిర్దేశించుకున్న ఇలాంటి పనికిమాలిన ఏర్పాట్ల వల్ల కాదు. మీరు చెప్పేదంతా ఉబుసుపోక చదివి చుట్ట చుట్టి, పాత కాయితాలు కొంటామంటూ ఇంటి చుట్టూ తిరిగే వాళ్ళకు వేసే చెత్త మాత్రమే!”
“నువ్వు రాసే కవితల్లాగున్నాయి నీ మాటలు” అన్నారాయన.
“ఔను. నేను నా సెంటిమెంట్లనే రాస్తున్నాను. మీరందరూ తెల్లవాడు ఈస్థెటిక్స్ అంటూ నిర్వచించిన దాన్ని ఏదో దేవుడి ఆజ్ఞ అన్నట్టు నెత్తిన పెట్టుకుంటున్న పనికిమాలినవాళ్ళు. వాడికి భావావేశాన్ని బహిరంగ ప్రదేశాల్లో చూపించకూడదన్న ఒక ‘మేనర్స్’ ఉంది. వాడు సాహిత్యాన్ని కూడా ఒకరకమైన బహిరంగ ప్రదేశంగానే చూస్తాడు. అందుకే మేనర్స్ ఉండాలనుకుంటాడు. మీలాంటి వాళ్ళంతా దొరవారికి నచ్చినట్లు మీ మేనర్స్ను మార్చుకొనే బానిసలు” అని నేను అరిచి మరీ చెప్పాను. “మీకు సెంటిమెంట్లను అర్థం చేసుకునే చారిత్రక జ్ఞానం, సాంప్రదాయ జ్ఞానం రెండూ లేనంత మాత్రాన సెంటిమెంట్లు అర్థం లేనివి అయిపోవు!”
“దీనిని గురించి ఇప్పుడు వివాదం ఒద్దు” అన్నారు అన్న. ఆయన సహనం కోల్పోతున్నట్టు అనిపించింది.
“మీరు దేని గురించి మాట్లాడుతున్నారు?” అని మరియా అడిగింది.
మేము మలయాళంలో మాట్లాడుతున్నామని అప్పుడే మాకు తెలిసివచ్చింది. “ఏమీలేదు. నాన్నకు ఈ విషయం చెప్పలేదా? అని అడిగాను” అన్నాను.
“ఔను. నేనూ అదే అడిగాను. ఆ విషయాన్ని చెల్లెలు చెప్పుకుంటుంది. నాన్నతో నాకు సంబంధం లేదని చెప్పారు” అని అన్నారు మరియా.
“నువ్వే ఒక ఉత్తరం రాయడం పద్ధతిగా ఉంటుంది, అన్నా” అన్నాను.
“విషయం చెప్పడమే కదా. ఎవరు చెబితే ఏమిటి?” అన్నారు అన్న. “నీకు వెజిటేరియన్ క్లియర్ సూప్ కదా”
నేను చివరిగా, “అన్నా, శుభ కార్యాలు చేసేటప్పుడు మంగళకరమైన వాటినే ఆలోచించాలి, మాట్లాడాలి అంటారు” అన్నాను.
“ఏం?”
“మనం ఏదన్నా మాట్లాడినా ఆలోచించినా దానిని గమనిస్తూ ఉండే ప్రతిగ్రహ అనే పేరున్న దేవత ఒకామె మన చుట్టుపక్కలే ఎప్పుడూ ఉంటుంది, తథాస్తు అని అలానే జరిగేట్టు దీవిస్తుంది అంటూ అత్తయ్య అనేది” అన్నాను.
“జీవితానికి అర్థం లేదు” అని చెప్పిన అన్న, భయపడేలా నటిస్తూ, “అవును, అదే గొంతు, వినిపిస్తోంది, వినిపిస్తోంది” అన్నారు. కొంచెం బిగ్గరగా “జీవితానికి అర్థం ఉంది” అని చెబుతూ తన చేతిని చెవి మీద పెట్టుకొని, “హా, దీనికి కూడా అవును అంటున్నది” అన్నారు. “నా చిట్టి తల్లీ రమా, ఆ దేవత పేరు ప్రతిగ్రహ కాదు. ప్రతి ధ్వని.”
నేను అసహనంగా తల ఊపాను.
అన్న, మరియా.. యిద్దరు ఒక అపార్ట్మెంట్ లో కాపురం పెట్టారు. వారు చాలా ప్రయాణాలు చేశారు. రవి పుట్టాడు.వాడికి మూడేళ్ళ వయస్సులో ఇద్దరూ విడిపోయారు. వాళ్ళు విడిపోయిన విషయమే నాకు తెలియదు. నేనప్పుడు లండన్ లో ఉన్నాను. తిరిగి వచ్చిన తరువాత అన్న దగ్గరికి వెళ్ళాను. మామూలుగా మాట్లాడుతూ ఉన్నాను. షేక్ అబ్దుల్లా ను ఇంటర్వ్యూ చేయటం కోసం వెడుతున్నట్లు అన్న చెప్పారు.
మరియా ఎలా ఉందని అడిగాను. “ఆమె ఇప్పుడు నాతో లేదు” అని అతి మామూలుగా చెప్పారు.
“ఎక్కడికి వెళ్ళింది?” అన్నాను అనుమానంగా.
“విడిపోయాం. ఇద్దరం పరస్పర అంగీకారంతో పెళ్ళి ‘రద్దు’ చేసుకున్నాము. ఆమె హైదరాబాదుకు వెళ్ళిపోయింది.”
“ఎప్పుడు?” అనడిగాను.
“పోయినడిశంబర్లో. అంటే తొమ్మిది నెలలు అవుతోంది. ”
“రవి?”
“వాడిని తీసుకుని వెళ్ళిపోయింది. ఏదో బోర్డింగ్ స్కూల్లో చేరిపించానని చెప్పింది”
“మీరు మాట్లాడలేదా?, మళ్ళీ మాట్లాడనే లేదా?” నాకు ఆందోళన మొదలైంది.
“లేదు. సెంటిమెంట్లు వద్దని తీర్మానించుకుని ఉన్నాము. ఒక రోజు ఆమె నాతో ‘విడిపోదాం’ అంది. నేను వెంటనే ‘సరే’ అన్నాను. ఎందుకని నేనడగలేదు. ఆమె చెప్పనూ లేదు. మరునాడే ఇద్దరం వెళ్ళి వకీలును కలిసాము. ఒక్క వారంలో విడిపోయాం. ”
“సో స్మూత్” అని చెప్పి అన్న నవ్వారు. వాళ్ళ మనోభావాలను నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆ కళ్ళద్దాల వెనుక గాజు గోళాల్లాంటి కళ్ళు మాత్రమే కనిపించాయి.
“విడిపోయేంత వరకు ఒకే ఇంట్లో ఉన్నాం. ఏ మార్పూ లేదు. నేను ఎప్పటిలా మామూలుగానే మాట్లాడుతూ ఉన్నాను. వార్తలను చూసి నవ్వుకునే వాళ్ళం. నేను రవితో ఆడుకునే వాడిని. వాడికి కథలు చెప్పాను. విడాకులు మంజూరు అయిన మర్నాడు, ఆమె బట్టలను సర్దుకోవడంలో నేనూ సాయపడ్డాను. టాక్సీని కూడా నేనే పిలిచాను. ఆమె అంతకు ముందే ప్లేన్ టిక్కెట్లు కొనేసింది. రవికి కూడా ఏమీ తెలియదు. వాడు నాకు టాటా అంటూ నవ్వుతూ టాక్సీ ఎక్కాడు. వాడికి కారెక్కడం అంటే సరదా. మరియా నన్ను మెల్లిగా కౌగిలించుకొని, ముద్దు పెట్టి మరీ వీడ్కోలు తీసుకుంది. కారెక్కి వెళ్ళిపోయారు. నేను నాలుదైదు కార్టూన్లు గీయాల్సి ఉండింది. ఆ పనిలో పడ్డాను అంతే”
అది 1974 – చెప్పానుకదా, రవికి అప్పుడు మూడేళ్ళని. అన్నలో ఇంకో మార్పు. సమ సమాజ భావాలను కలిగిన జయప్రకాశ్ నారాయణ్‌ను, వినోబా భావేను వేళాకోళం చేస్తూ ఉండేవారు. ఆయనకు ఇందిరాగాంధి, పి.సి. జోషి., ఇ.ఎం.ఎస్., మొరార్జీ దేశాయ్, మావో సే తుంగ్… అందరూ అపహాస్యం చేయదగ్గ జోకర్ల కింద కనిపించేవారు. దానికి తగ్గట్టుగానే ఎస్.ఆర్. డాంగే, నిక్సన్ లాంటి వాళ్ళు, వాళ్ళంతట వాళ్ళే జోకర్ల కింద బయటపడ్డారు.
కాని, విడాకుల వ్యవహారం అన్నను బాగా కదిలించి వేసింది. ఈ విషయం అప్పుడు తెలియలేదు. కొన్ని నెలల్లోనే ఆయనలో పెద్ద మార్పు వచ్చింది. ఆయనలోని హాస్యం, వ్యంగ్యం పోయి హద్దులు లేని ఆవేశం ఆయన్నాక్రమించింది. ఆయన మెల్లగా జయప్రకాశ్ నారాయణ్ ని ఇష్టపడటం ప్రారంభించారు. ఇందిరా గాంధిని తీవ్రంగా ద్వేషిస్తూ వ్యాసాల ద్వారా కార్టూన్ల ద్వారా విమర్శించేవారు. అవి కార్టూన్లు మాత్రమే కావు, విషపూరితమైన ఆలోచనలు. ఇందిరాగాంధి హత్యకు గురౌతారని కూడా ఆయన రాసి ఉన్నారు. ఒకరకంగా శాపమే అది. 1975 లో ఇందిరాగాంధి ఎమర్జెన్సీని ప్రకటించారు. ఆత్మహత్యా సదృశమైన పిచ్చితనంతో అన్న దానిని ఎదిరించారు. అందువల్ల దినపత్రికనుండి తప్పుకోవాల్సి వచ్చింది. కాని రాస్తూనే ఉండేవారు.
1950లో అన్నలోని భావాలు మళ్ళీ వెనక్కి వచ్చేశాయి. అస్తిత్వవాదంమీదున్న నమ్మకాలు తొలిగిపోయి వాటి స్థానే జయప్రకాశ్ నారాయణ్ ముందుకు తెచ్చిన జనతా విధానంపై నమ్మకాన్ని పెట్టుకున్నారు. దానికోసం భావావేశంతో గొంతుకనిచ్చారు. నినాదాలు చేశారు. ఆయనలోని ఒక అరాచకవాది తొలగిపోయాడు. మనిషిలో ఆతురత, తొందరపాటు వచ్చి చేరాయి. “రోగిష్ఠి అయిన కొడుకుని ఆస్పత్రిలో చేర్పించి, బయట నిల్చున్న తండ్రిలా ఉన్నాను” అని ఆ కాలంలో ఆయన రాసుకునేవాడు.
ఎమెర్జెన్సీ అన్నకు దొరికిన ఒక సాధనం. ఆ సమస్య, విపరీతమైన శ్రమ లేకున్నట్లయితే అన్న ఒంటరితనం వలన ఎప్పుడో ఉన్మాదిగా మారి ఉండేవారు. అత్యవసర పరిస్థితులు ముగిసిన తరువాత కూడా ఆయన అదే మానసిక స్థితిలో ఉండేవారు. మూడు సంవత్సరాల పాటు రాస్తూనే ఉన్నారు. ఒక నవల రాశారు. ‘వరాహ పురాణం’. ఎమర్జెన్సీ కాలంలోని ఇబ్బందులపై ఎత్తిపొడుపు అది. అధికార మాలిన్యాన్ని ఉన్నత వర్గానికి చెందిన పందుల సమూహం ఆరగించే కథ అది. కాని ప్రజలు ఎమర్జెన్సీ కాలాన్ని మరిచిపోవాలని కోరుకున్నారు. అందువల్ల వరాహ పురాణాన్ని కూడా వాళ్ళు మరిచిపోయారు. దాని తరువాత అన్న ‘ఏకతా జ్ఞానం’ అన్న నవలను రాశారు. దాన్లో ఒక ఒంటరి పత్రికా విలేకరి పెళ్ళి చేసుకుంటాడు. ఆమె జన్మ నిచ్చిన బిడ్డ తన కొడుకు కాదని తెలిసికూడా ఆ బిడ్డను తన కొడుకు గానే స్వీకరిస్తాడు. ఆ నవలలో అన్న తపన కనిపిస్తుంది.
దాని తరువాత కొంచెం కొంచెంగా మళ్ళీ ఆయనలో శూన్యం ఆవరించింది. అదే సమయంలో నాన్న మరణించారు. ఆ సంఘటన అన్నను మళ్ళీ కట్టలు తెగిన స్థితికి చేర్చింది. లెఫ్టిష్టులను తీవ్రంగా ఎదిరించడం ప్రారంభించారు. కేరళలో ఆయన పట్ల ఒక వ్యతిరేకత ఏర్పడింది. వాళ్ళు అన్నను నిందించడం ప్రారంభించారు. ఆయనకు అది ఒకరకమైన ఓదార్పునిచ్చింది. అదొక బలం. ఆ ఎదిరింపులే ఈ ప్రపంచంలో ఆయనకొక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాయి. దానిని పట్టుకొని మరి కొన్నేళ్ళు గడిపారు. ఈలోగా 1989 లో చీనా లో తియనాన్మెన్ స్క్వేర్ ఘటన. సోవియట్ రష్యాలో గోర్బచేవ్ పదవీ స్వీకారం. పెరిస్ట్రోయికా గ్లాస్‌నోస్త్ ప్రారంభం. వీటన్నిటి పట్ల అన్న ఆదరణ చూపారు. ఆయన వరసగా రాసిన వ్యాసాలు బాగా ప్రసిద్ధికెక్కాయి.
అయితే 1992 సోవియట్ రష్యా విడిపోయిన తరువాత అన్న జీవితంలో బాహ్యప్రపంచంతో సంబంధం ఒక రకంగా ముగింపుకు వచ్చింది. ఇప్పుడు ఆయనకేమీ మిగిలిలేదు. నేను అన్నను 1995 లో కలిసినప్పుడు పూర్తి శూన్యత్వంలో మునిగిపోయి ఏం చెయ్యకుండా కూర్చుని ఉన్నారు. మానసికమైన అలసటకు గుర్తుగా మౌనం, ఒంటరి తనం ఆయనను ఆక్రమించాయి. ఒక నవలను రాయనున్నట్లు చెప్పారు. అయితే అది తనను తాను మోసం చేసుకొనే వ్యవహారం. ఆయనకు రాయడం చేతకాలేదు. నమ్మి నెత్తికెత్తుకోడానికో, మూర్ఖంగా ఎదిరించడానికో ఏవీ మిగిలిలేవు.
ఇ.ఎం.ఎస్ నంబూద్రిపాద్ మరణం, ఎత్తైన శిఖరం కాలి క్రింద మంచులా కరిగిపోయిన అనుభూతిని అన్నకు కలిగించింది. వారి తండ్రి రూపం కూడా కనుమరుగై పోయింది. ఇ.ఎం.ఎస్. పైన మాత్రం, రెండువందల డెబ్భైయారు వ్యాసాలను రాసున్నారని చెబుతారు. అందులో రెండు వందలకు పైగా వ్యాసాలు వారిని కఠినంగా విమర్శించేవే. అరవై డెబ్బై నిందాత్మకాలే. ఇ.ఎం.ఎస్ మరణానంతరమైనా కేరళలో నిజమైన కమ్యూనిజం వస్తుందా? చూద్దాం! అని కూడా రాశారు. మూడువందల ఎనభై ఎనిమిది కార్టూన్లు ఇ.ఎం.ఎస్ గురించే. అన్నీ నిశితమైన వ్యంగ్యాస్త్రాలే.
అయితే ద్రోణుని రొమ్ముకు సూటిగా బాణం వదిలే అర్జునుడుకి మల్లే అని ఇ.ఎం.ఎస్. గురించి మరొక వ్యాసంలో ఆయన రాసినట్లు చెబుతారు. ఇ.ఎం.ఎస్. చనిపోయినప్పుడు మళ్ళీ ఏడు రోజులు ఆస్పత్రిలో ఉన్నారు. ఇ.ఎం.ఎస్ కు వారు నివాళి వ్యాసాన్ని రాయనే లేదు. ఇ.ఎం.ఎస్.ను గురించి, వారి మరణం తరువాత ఒక్క వాక్యం కూడా రాయలేదు. ఆ పేరును కూడా ఉచ్చరించలేదు. పూర్తిగా మర్చిపోయారా అనిపించింది. అలా మర్చిపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.
అన్నకు కావలసింది ఒక తండ్రి అని నాకు అర్థమయింది. అదికూడా అనుకోకుండా ఆయన ఒక గాంధీ గారి బొమ్మ గీసి ఉన్నారు. అయితే ఆ చిత్రంలోని గాంధీ వాటికన్ లోని పోప్ లాగా విశాలమైన భుజాలతో బలమైన కండరాలతో ఉన్నారు. అప్పుడు అర్థం అయ్యింది నాకు అన్న దేనికోసం తపిస్తున్నారోనని!
అన్నకు 1993లో నిత్యచైతన్య యతితో పరిచయం ఏర్పడింది. నిత్యచైతన్య యతికి ఎన్నో ఉత్తరాలు రాశారు. కాని నిత్యచైతన్య యతి చూపే స్నేహపూర్వక ప్రేమ ఆయనకు సరిపోలేదు. ఆయనకు కావలసివచ్చింది తనను భయపెట్టి ఖండించే ఒక తండ్రి. “నాకు కావాల్సింది ఒక ఆధ్యాత్మిక స్టాలిన్!” అని అన్న ఒకసారి నాతో అన్నారు. బోధానందులవారితో పరిచయం ఏర్పడిన తరువాత అన్న ఆయన్ను వదలకుండా గట్టిగా పట్టుకొన్నారు. బోధానందుల వారి వద్ద ఆయన శాంతిని పొందారు.
రోజంతా అన్న ధ్యానం చేసేవారు. కాని ఆ ధ్యానం వల్ల ఏదైనా జరిగిందా? నిజంగా మనలో ఏముందో దాన్నే ధ్యానం వృద్ధి చేస్తుంది. భయం ఉంటే భయం పెరుగుతుంది. దూరంగా పెడుతూంటే దూరం ఇంకా పెరుగుతుంది. అన్న దగ్గర ఉండింది – ఒక తీవ్రమైన తపన. చివరి రోజుల్లో అన్నకు మాట పడిపోయింది. ప్రశ్నలకు జవాబును రాసి చూపించేవారు. కొన్నిసార్లు బొమ్మ గీసి చూపించేవారు.
నేనొక రోజు అన్నను అడిగాను. “అన్నా, మీరు సంతోషంగా ఉన్నారా?”
“లేదు” అని అన్న చెప్పారు. దాన్ని ఒక ఇంటూ గుర్తును గీసి చూపించారు.
“మీకేం కావాలి?”
ఆయన ఒక కాగితంపై ఒక బిడ్డ ముఖాన్ని గీశారు.
“మీ కొడుకును వెదుకుతున్నారా? వాడు కావాలా?”
‘అవును’ అన్నందుకు సంకేతంగా ఆంగ్లం లోని ఎస్ అనే అక్షరాన్ని రాశారు.
దానికి బదులేమి ఇవ్వాలో తెలియక కొంత సేపు నేను అలానే ఆయన దగ్గర కూర్చున్నాను. తరువాత “ఏదైనా రాయాలని అనుకుంటున్నారా?” అన్నాను.
అవునని అన్నారు అన్న.
“దేనిని గురించి?”
మళ్ళీ అన్న ఆ బిడ్డ ముఖాన్ని గీశారు. సంక్షిప్తంగా కార్టూన్ రేఖలు. అయితే ఆ బిడ్డ అందమైన చిరునవ్వు కంటికి కనిపించింది. దాని తరువాత నేనేమీ అడగలేదు.
మళ్ళీ కె.వి.రమగారు మౌనంగా ఉండిపోయారు.
“మీరెప్పుడూ ఇంతసేపు మాట్లాడిందే లేదు” అన్నాను.
“అవును, అంతా మాట్లాడేయాలని అనిపించింది…” అన్న తర్వాత, పత్రికా విలేకరితో, “ఇదంతా రికార్డ్ అయిందా?” అని అడిగారు ఆవిడ.
“అవును. కాని మాకు ఇన్ని వివరాలు అక్కరలేదు. నలభై ఫోటోలు ఉన్నాయి. ఒక వేయి మాటలుంటే చాలు”
“దానిని మీరే రాసుకోండి” అన్నాను.
“ఈ రికార్డింగ్ కాపీ నాకు ఒకటి కావాలి. మళ్ళీ యిలా గుర్తుకు తెచ్చుకోవడం నాకు సాధ్యమని నేను అనుకోవడం లేదు” అన్నారు కె.వి.రమగారు.
“ఖచ్చితంగా. నేను వెళ్ళిన వెంటనే కాపీ చేయించి మీకు తెచ్చి ఇస్తాను… నేను కొన్ని ఫోటోలు తీసుకోవచ్చా?”
“ఊఁ.” అన్నారు కె.వి.రమగారు.
అతను మా అందరినీ ఫోటోలు తీశాడు.
“వేరే ఏ ఫోటోలు తీశారు?” అనడిగాను.
“ఆస్పత్రికి వెళ్ళి ఫ్రీజర్‌లో ఉన్న జయానన్ గారి ఫోటో తీసుకున్నాను.” అన్నాడు దివాకరన్.
ఫ్రీజర్‌లోని ఆయన రూపాన్ని నేను ఒకసారి గుర్తుకు తెచ్చుకొన్నాను. ఓర్పును కోల్పోయి దేనికోసమో ఎదురు చూస్తున్న మనిషిలా ఉంది ఆయన మొహం. కోపంతో లేచి కూర్చోబోయే వ్యక్తిలా ఉన్నారాయన. అసహనంతో పడుకున్న విగ్రహంలా వేల సంవత్సరాలైనా అలాగే పడివుండే శిలలా…
“అయితే ఆ కళ్ళద్దాలు లేకుండా ఆయన వేరెవరిలానో ఉన్నారు.” అని అన్నాడు అతను.
“అవును. కళ్ళద్దాలు లేకుంటే ఆయన వేరే ఎవరో!” అని చెప్పాను.
“నేను వెళ్ళొస్తాను, మేడం. మీకు చాలా థాంక్స్.”
అతడు వెళ్ళి పోయిన తరువాత మేమలానే కూర్చొని ఉన్నాము. కాలం పరుగెత్తుతూనే ఉంది. కాని ఈ సమయం వృధా కాలేదని అనిపించింది. ఒక యంత్రంలో చుడుతున్నట్లు కాలం బిగుసుకుంటూ ఉంది. వెనకనుండి సుగుణన్ వచ్చి సైగ చేసి అర్జున నాయర్ ని రమ్మని పిలిచాడు.
ఆయన వెళ్ళి అతనితో మాట్లాడారు. దాని తరువాత వేగంగా అతనితో పాటు లోపలికి వెళ్ళారు.
ఆయన వెనక్కి రావడం కోసం మేము కాచుకొని ఉన్నాము. కె.వి.రమగారు మళ్ళీ తన మౌనపు లోతుల్లోకి వెళ్ళి పోయారు.
అర్జున నాయర్ తిరిగి వచ్చారు. ఆ నడకలోనే నాకు అర్థమయింది. వేరే ముగింపుకు అవకాశమే లేదు. ఈ కథలో వేరే మార్పు ఉండటానికి వీలు లేదు.
అర్జున నాయర్ దగ్గరికి వచ్చి, “ఆ తథాస్తు దేవత… ఆ దేవత పేరు ఏమిటి?”అన్నారు.
“ప్రతిగ్రహ” అన్నాను.
“అవును. ఆమె ఎప్పుడో మూడు సార్లు ‘తథాస్తు’ అనుంటుంది.”
నేనేమీ మాట్లాడలేదు. కె.వి.రమగారు పైకి చూశారు. “వాడు ఫోను చేశాడు. వాడి దగ్గరినుండి ఒక టెలెక్స్ కూడా వచ్చి ఉంది. వాడికి ఈ సంప్రదాయాలలో నమ్మకం లేదు. రాలేడట! కార్యక్రమం అంతా ఇక్కడే జరిపించాల్సిందని చెప్పాడు”
నేనొకపెద్ద నిట్టూర్పును విడిచాను. కె.వి.రమగారు కొంచెం సేపు నేలను చూస్తూ కూర్చుని తరువాత లేచి, “అదే జరిపించేద్దాం” అంటూ లోపలికి వెళ్ళారు.
****
(మూలం: ఆమెన్బదు, 11 మార్చ్ 2021)

రచయిత జయమోహన్ గురించి:
జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్ అనే నవల అకిలన్ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దం పట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.
... పూర్తిగా »