తెలుగునాట సాంస్కృతిక, సాహిత్య విస్మృతి (Cultural Amnesia) ఇంత ఎక్కువగా ఎందుకు ప్రబలింది? దీని వెనుక ఉన్న సామాజిక, రాజకీయ కారణాలు ఏమిటి? ఈ విషయం అధ్యయనం చేయదగినది. తెలుగు భాష క్షీణదశలో ఉందని విఖ్యాత భాషా పరిశోధకులు జి.ఎన్. దేవి ఇటీవల ప్రకటించారు. ఆయన పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు కూడా. దేశ భాషల్లో మూడో స్థానంలో ఉన్న తెలుగు నాలుగో స్థానానికి పడిపోయిందని దేవి హెచ్చరించారు. అర్ధ శతాబ్దంలో దేశంలో 283 భాషలు అంతరించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక భారత నాగరికత పేరిట మాతృభాషను అంతం చేస్తున్నారని అన్నారు.
బహుభాషల ఉనికి – భారతదేశ భవిష్యత్తు
బహుభాషల ఉనికి, బహుళత్వ నాగరికతతోనే భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించేలా రూపొందుతుంది. అంతేకానీ దేశ ప్రజలంతా హిందీ మాట్లాడడం వల్ల కాదు అని దేవి అన్నారు. ప్రత్యేకంగా దక్షిణాది భాషలలో తెలుగు భాష క్షీణత గురించి ఆయన వ్యక్తం చేసిన ఆవేదన గుర్తించదగినది.
తెలుగు భాష దుస్థితికి కారణాలు
తెలుగు భాష దుస్థితికి కారణం ఏమిటి? సాంస్కృతిక విస్మృతి (Cultural Amnesia). “మంచి గతమున కొంచెమే” అన్నాడు గురజాడ, ఆయన తెలుగు వైతాళికుడు. ఆంగ్లేయ పరిపాలనకు, ఆంగ్లేయ సంస్కృతికి ప్రథమ స్థానం ఇచ్చాడు. మొత్తంగా ఇది తెలుగు వాళ్ల వైఖరి.
ఇతర రాష్ట్రాలతో పోలిక
కుల నిర్మూలన, నాస్తికత్వం బోధించే తమిళనాడు, తమిళ భాష యొక్క ప్రాచీనత గురించి మాట్లాడుతుంది. అలాగే కర్నాటకులు తమ భాషను గౌరవించుకుంటారు. తమిళనాడు, కర్ణాటకలలో తమ రచయితలు, కళాకారులకు సంబంధించిన స్మృతి చిహ్నాలు నిర్మిస్తారు. కానీ తెలుగునాట అటువంటి శ్రద్ధ చాలా తక్కువ. రాజకీయ నాయకుల విగ్రహాలు మాత్రమే దర్శనం ఇస్తాయి. అలాగే కన్నడ, తమిళ భాషలలో గ్రాంథిక భాషను, ప్రాచీన భాషను పునరుద్ధరించే ప్రయత్నం కనబడుతుంది. పాఠ్యపుస్తకాలలో సరళ గ్రాంథికం కూడా ఉపయోగించబడుతుంది. ప్రాచీన సంస్కృతిని కాపాడుకోవాలనే తపన వారిలో ఎంతో కొంత కనపడుతుంది. కానీ తెలుగు వారందరు గతాన్ని తిరస్కరించడం, ఆధునికతను విమర్శ లేకుండా స్వీకరించడం ప్రగతిగా భావిస్తారు. తమని తాము చారిత్రక భారం ఏమీలేని అమెరికా దేశంగా భావిస్తారు తెలుగువారు.
గత కాలపు భావన – భిన్న దృక్పథాలు
యూరప్, అమెరికాలలో గత చరిత్ర ఎక్కువగా క్రైస్తవ చరిత్ర మాత్రమే. భారతదేశంతో పోలిస్తే అది సమీప గతానికి చెందినది. సుదీర్ఘ గత వారసత్వం పూర్తిగా చెదరకుండా కొనసాగుతున్న భారతదేశంలో భాషలు, సంస్కృతుల గమనం పూర్తిగా భిన్నమైనది. అందువల్ల గతాన్ని, సంస్కృతిని పూర్తిగా గడిచిపోయినదిగా భావించలేం.
పాణినీయ సంస్కృత వ్యాకరణంలో కాలం
సంస్కృత వ్యాకరణంలో గత కాలం రెండు రకాలు: 1. అద్యతన గతం. 2. అనద్యతన గతం. మొదటిది, పూర్తిగా గడిచిపోయిన కాలం. రెండవది (అనద్యతన గతం) వర్తమానంలోనూ, పాలలో నీళ్ళలా కలిసిపోయి కొనసాగుతున్న భూతకాలం. భారతదేశంలో ఇలా గత కాలం, గత సంస్కృతి వర్తమాన కాలంలో కలగలిసిపోయి కొనసాగడం గురించి కమ్యూనిస్టు చరిత్రకారులు, తత్వవేత్తలు కూడా మాట్లాడారు. కానీ అది ఒక తిరోగమన లక్షణంగా భావించారు. అలాంటి వారిలో డి.డి. కోశాంబి, దేవి ప్రసాద్ చటోపాధ్యాయ ప్రముఖులు. ఈ ప్రతికూల వైఖరి కమ్యూనిస్టులు, పాశ్చాత్య క్రైస్తవుల మూలంగా తెలుగునాట బలంగా పనిచేసింది.
స్వదేశ, స్వజాతి విముఖత
తెలుగువారికి స్వదేశము, స్వజాతి పనికిరానివి అయ్యాయి అని సాహిత్య విమర్శకులు రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ అంటారు. దానికి కారణాల గురించి కూడా చర్చిస్తారు. తెలుగు నేలపై మత స్థాపకుల లోటు గురించి ప్రధానంగా ప్రస్తావించారు. సుప్రసిద్ధ మత స్థాపకులు ఎవరూ ఆంధ్రులై పుట్టి ఆంధ్రదేశంలో మత బోధ చేయలేదు. నింబార్కాచార్యులు, వల్లభాచార్యులు ఆంధ్రజాతికి చెందినవారు కానీ వారి మత వ్యాప్తి ఆంధ్రదేశం బయటనే జరిగింది. అంటే తెలుగు భాషలో బసవడు, రామానుజుడు వంటి స్థానిక మత పెద్దలు, తాత్వికులు ఎవరూ లేరు. స్వతంత్ర స్వభావం, స్వాభిమానం గల తెలుగువారిని ఒకే మతంలోకి గొర్రెల మందల వలె తోలడం సాధ్యం కాదేమో అంటారు రాళ్లపల్లి.
భారతీయత – పాశ్చాత్య ప్రభావం
వివేకానందుడు, రామతీర్థ స్వామి మొదలగు మహాపురుషులు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా స్వతంత్ర బుద్ధి గల పాశ్చాత్యులు హిందూ మతాన్ని స్వీకరించకపోవడాన్ని దృష్టాంతంగా చూపుతారు రాళ్ళపల్లి వారు. కానీ ఈ పాశ్చాత్య సాదృశ్యం ఒక సత్యాన్ని మరుగున పడేస్తుంది. భారతదేశంలో స్థానిక భాషలు అన్నీ భక్తి ఉద్యమాల వల్ల ఎదిగినవే. పాశ్చాత్య దేశాలలో ఒక మోనోథీయిస్ట్ (ఏకశిలా సదృశ మతం) సంస్కృతి ఉన్నాయి. అలాగే పాశ్చాత్య దేశాలకి జాతీయ భాషలు ఉన్నాయి. ఆసియా దేశమైన చైనాకి కూడా ఒక జాతీయ భాష అభివృద్ధి చెందింది. కానీ భారతదేశం బహుళ భాషలు, బహుళ సంస్కృతుల నిలయం. ఇక్కడ ఒకే ఒక్క మాట, ఒకే మతం, ఒకే భాష ఆధిపత్యం అసంభవం.
భాషలు, సంస్కృతులు – భారతదేశంలో భాషల గురించి చర్చ
భారతదేశంలో భాషల గురించి చర్చ సంస్కృతి పరమైన చర్చగా కూడా భావించవలసి ఉంటుంది. ప్రాచీన కాలంలో సంస్కృత, ప్రాకృతాల మధ్య వైరుధ్యము, స్నేహము పరస్పర ప్రభావము కూడా కొనసాగాయి. ముస్లిం పాలన మొదలయ్యాక వచ్చిన భక్తి ఉద్యమ ప్రభావంతో దేశ భాషలు వెల్లివిరిసాయి. దేశ భాషా సాహిత్యం విజృంభించింది. సంస్కృత భాష, సంస్కృత గ్రంథాలు కూడా క్రమేపి దేశ భాషల అనువాదాల ద్వారా వడగట్టబడి ప్రజలలోకి విస్తరించాయి.
భక్తి ఉద్యమాల ప్రభావం
తెలుగువారికి పోతన ఎంత ప్రధానంగా మారాడు అంటే పోతన భాగవత పద్యాల ద్వారా వ్యాసుడి హృదయాన్ని తెలుసుకోవాలనుకుంటారు తెలుగువారు. అలాగే భగవద్గీతకు వ్యాఖ్యానమైన జ్ఞానేశ్వరి గ్రంథం మరాఠీ ప్రాశస్త్యాన్ని చాటింది. అంటే సంస్కృత సాహిత్యం, సంస్కృత పురాణ ఇతిహాసాలు నేల మీదికి దిగి వచ్చాయి. దేశ భాషల ద్వారా ఉనికిని చాటుకున్నాయి. ఇది కొత్త పరిణామం. ఈ మార్పు సంస్కృత రచయితలను, సిద్ధాంతవేత్తలను కూడా ప్రభావితం చేసింది.
రాజశేఖరుడి వైఖరి
కావ్య మీమాంస అనే సంస్కృత అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించిన రాజశేఖరుడు (10 వ శ.) తనని గురించి ఇలా చెప్పుకున్నాడు: “శ్రవణ మధురములగు సంస్కృత రచనలు, స్వభావ మధురములగు ప్రాకృత కృతులు, అందమైన సరసమైన పైశాచిక భాషా రచనలు – వీటిని అన్నిటిని విభిన్న సాహిత్య ప్రక్రియలలో నడిపిన కవిరాజు సర్వోత్కర్షతో ఉన్నాడు” అని తన గొప్పతనాన్ని చాటుకోవడంలో భాషల బహుళత్వాన్ని, వాటి గొప్పతనాన్ని చాటాడు. సంస్కృత సంప్రదాయానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కారణం అప్పటికే బహుళ భాషలు లిఖిత సంప్రదాయాలుగా విస్తరిస్తూ ఉండటం. ఏక నాయకత్వాన్ని పూర్తిగా రూపుమాపి భాషల బహుళ నాయకత్వం విజృంభించింది భారతదేశంలో.
భాషా సమూహాలు, విశ్వాసాలు
ఈ భాషా సమూహాలన్నీ కొన్ని విశ్వాసాలతో ముడిపడ్డాయి. దైవపరమైన నమ్మకాలతో సంబంధం వల్ల వృద్ధి చెందాయి. అయితే అవి పాశ్చాత్యుల వలె ఒక ‘కెనాన్’గా కాకుండా సెక్ట్ గా అభివృద్ధి చెందాయి అంటారు జి.ఎన్. దేవి. తెగలు, కమ్యూనిటీలు, కులాలు వంటి అనార్కికల్ విధానాల ద్వారా భాషలు వృద్ధి చెందాయి. ఇది పాశ్చాత్య దేశాలలోని మత, జాతీయ వైఖరికి పూర్తిగా భిన్నమైనది.
తెలుగు సాహిత్యం, పాశ్చాత్య అనుకరణ
ఏ కారణం వల్లనైతేనేమి, తెలుగు భాషకి బలమైన సాంస్కృతిక విశ్వాసంతో బంధం లేకపోవడం వల్ల తెలుగు సాహిత్యం పాశ్చాత్య సంస్కృతికి అనుకరణగా మారిపోయింది. ఈ వైఖరి సంస్కర్తలు, కమ్యూనిస్టులు, సాహిత్యవేత్తలు, హేతువాదులు, దళితవాదులు అందరిలోనూ కనపడుతుంది. కమ్యూనిజం నుంచి పోస్ట్-మాడర్నిజం వరకు పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం తప్ప తెలుగువారికి స్వతంత్ర సిద్ధాంతవేత్తలు అరుదుగా మారిపోయారు. రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ చెప్పిన తెలుగువారి స్వతంత్ర బుద్ధి చివరికి ఆధునిక కాలంలో స్వాభిమానం నశించి పాశ్చాత్య అనుకరణగా మారడం వల్ల వచ్చిన ముప్పు అది.
తెలుగు భాషపై ఇతర భాషల ఆధిపత్యం
తెలుగు భాషపై వివిధ భాషలు చూపిస్తున్న ఆధిపత్యాన్ని గురించి మొదట అర్థం చేసుకోవాలి. అయితే ఈ ఆధిపత్యాలు అన్నిటికీ వలసవాద భావజాలమే కారణం. తెలుగు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మాటలు ఇవి: “సనాతనుల దృష్టిలో సంస్కృతం నేర్చిన వాళ్లే చదువుకున్నవాళ్లు. అధునాతనుల దృష్టిలో ఇంగ్లీష్ నేర్చుకున్నవాళ్లే చదువుకున్నవాళ్లు. ఆ సనాతనులు, అధునాతనులు తెలుగువాళ్లే. మళ్లీ ఈ మధ్య హిందీ మానసపుత్రులు బయలుదేరారు. వారికి తెలుగు బతికి ఉండడమే పనికిరాదు.” అంటారు శ్రీపాద. ఇప్పుడు మనం హిందీ-హిందూ ఆధిపత్యం దగ్గరికి చేరాం.
జాతీయత వాదం – ఒకే భాష, ఒకే జాతి
ఇంతవరకు తెగలు, కులాలు, ప్రాంతాలు భక్తి ఉద్యమం ద్వారా వివిధ ప్రాంతీయ భాషల అభివృద్ధికి దోహదం చేశాయి. ఇప్పుడు జాతీయతావాదం హిందూ జాతీయవాదంగా పరిణమించి ఒక కేంద్రీకృత భాషని ముందుకు తెస్తుంది. “ఒకే భాష, ఒకే జాతి, ఒకే పన్ను, ఒకే దేవుడు” అనే భావాల వైపు ప్రయాణిస్తున్నాం. దీనికి పాశ్చాత్య క్రైస్తవ అనుకరణ మూలం. ఈ పరిణామాలని ఎదుర్కొనే శక్తి తెలుగువాళ్ళకి లేదు. వారు పాశ్చాత్య మానసపుత్రులు.
దళితవాదుల వైఖరి
దళితవాదుల నుంచి జాషువ తర్వాత ఒకే ఒక్కరు ఈ పాశ్చాత్య ఆధిపత్యంపై గొంతు ఎత్తారు. ఆయన పైడి తెరేష్ బాబు. ఆయనని ఎవరూ పట్టించుకోలేదు. “అమ్మానాన్నలను మమ్మీ డాడీలుగా మార్చినదానా! అమ్ముకోవడంలో ఉందన్నమాట అసలు జన్మ సార్థకం. బానిసత్వమే, బతుకన్న నమ్మకంతో నా పాఠశాల నీబానిసల ఉత్పత్తిశాల గా మారడం నా ప్రపంచపు మూడో వింత.(నేనూ నా వింతల మారి ప్రపంచమూ)” సాధారణంగా దళితవాదులు ఇంగ్లీషు ఆధిపత్యాన్ని కోరుకుంటారు. ఇప్పుడు హిందూవాదులు దాని స్థానాన్ని హిందీతో భర్తీ చేస్తున్నారు. వలస క్రైస్తవాన్ని హిందుత్వతో భర్తీ చేస్తున్నారు. తెలుగు గురించి ఆందోళన ఎవరికీ లేదు. ఇతర భాషల పరిస్థితి వేరు, అక్కడ మేధావుల పరిస్థితి కొంత భిన్నం.
ప్రాంతీయ భాషల క్షీణత – భక్తి ఉద్యమ వ్యతిరేకత
ఆధునిక కాలంలో ఇంగ్లీషు విద్య నేర్చిన మేధావులు అందరూ భక్తిని బానిసత్వంగా, సంకుచితత్వంగా నిర్ధారించారు. ముస్లిం పాలనా కాలంలో ఇస్లాం నుంచి స్ఫూర్తిని పొంది భక్తి ఉద్యమాలు విజృంభించాయి. కానీ అవి అబ్రహామిక్ తరహా మోనోథీయిస్టిక్‌గా ఘనీభవించలేదు. అందుకే తండ్రిగా కాక, ప్రియుడుగా, స్నేహితుడిగా దేవుడు దగ్గరయ్యాడు. దేవునితో సంభాషణ మాతృభాషలలో పెరిగింది. దేవ భాష సంస్కృతం, భూసురులు ప్రాంతీయ భాషల కరుణా కటాక్షాలలో బతకవలసి వచ్చింది.
ఆధునికుల నిర్లక్ష్యం – గ్రామీణ, పట్టణ దృక్పథాలు
భక్తి విశ్వాసాల నీడలలో పెంపొందిన ప్రాంతీయ భాషలను ఆధునికులు నిర్లక్ష్యం చేశారు. ఎందుకంటే భక్తి ఉద్యమం కులాలు, కుల వృత్తుల ప్రభావంతో గ్రామీణంగా ఎదిగింది. ఆధునికులు గ్రామాన్ని సంకుచితమైనదిగా, మూఢ విశ్వాసాల నిలయంగా చూశారు. నగరాన్ని విముక్తిదాయకంగా భావించారు. హిందుత్వ ప్రవక్త సావర్కర్ నుంచి అంబేద్కర్ వరకు అందరూ ఇదే ధోరణి కలిగి ఉన్నారు. కనుక పొగడడానికి, తెగడడానికి కూడా సంస్కృత గ్రంథాలను మాత్రమే ఆధారం చేసుకుని హిందూ మతాన్ని, హిందూ జాతీయతని నిర్వచించారు. బహుళత్వంతో కూడిన స్థానిక భక్తి ఉద్యమాలని పట్టించుకోలేదు. ఆ భక్తి ఉద్యమాల ప్రభావంతోనే కుల పురాణాలు పుట్టాయి. వాటిని ఎవరూ పట్టించుకోలేదు.
బహుళత్వం వర్సెస్ ఏకశిలా సదృశ సంస్కృతి
ఇది బహుళత్వంతో కూడిన, బహు నాయకత్వంతో కూడిన బహుళ ప్రాంతీయ భాషల అస్తిత్వాన్ని, గౌరవాన్ని మూలకి నెట్టింది. సంస్కృతానికి ఎక్కువ ప్రాధాన్యం లభించింది. భారతీయ సంస్కృతిని ఏకశిలా సదృశంగా భావించే వైఖరి బలపడింది. బహుళ రామాయణాల స్థానంలో ఒకే రామాయణం, బహుళ భాషల స్థానంలో ఒకే పవిత్ర సంస్కృత భాష, బహుళ భాషల స్థానంలో ఒకే జాతీయ భాష, బహుళ తెలుగుల స్థానంలో ఒకే ప్రామాణిక తెలుగు భాషల పట్ల భక్తి శ్రద్ధలు బలపడ్డాయి. తెలుగు వ్యావహారిక భాష ఉద్యమం వెనుక ఆంగ్లేయ, అగ్రకుల కోస్తా ఆధిపత్యాన్ని నేను గత నెలలో రాసిన “తెలుగు భాష ఎవరిది?” అనే వ్యాసంలో వివరించాను.
భక్తి ఉద్యమంపై తీవ్ర వ్యతిరేకత
భక్తి ఉద్యమంపై తీవ్ర వ్యతిరేకత, ముస్లిం పాలనకు ముందు స్వర్ణయుగం ఉండేది అనే భావనను తెచ్చింది. ఆ స్వర్ణ యుగాన్ని హిందూవాదులు హిందూ స్వర్ణయుగం అని, దళితవాదులు బౌద్ధ స్వర్ణయుగం అని అన్నారు. ఇది పరోక్షంగా భక్తి ఉద్యమానికి తావు ఇచ్చిన ముస్లిం పరిపాలనా కాలాన్ని చీకటి యుగంగా, ఇంగ్లీష్ పరిపాలనని వికాసవాద యుగం (Renaissance) గా భావించే ఆధునిక భావజాలానికి అనుగుణమైనది. ఈ వైఖరి ఇంగ్లీషు భాష, హిందీ భాషల ఆధిపత్యాలకు మూలం. దానివల్ల మాతృభాషలకి ముప్పు మొదలైంది. “భారతదేశంలో పాశ్చాత్యీ కరణతో బాటు ఒక సుదూర గతాన్ని పునరుద్ధరించి, సమీపగతాన్ని అణచివేసే దృష్టితో కూడిన సంస్కృతీకరణమనే ఒక తిరోగమన ధోరణి ప్రవేశించింది” అంటారు గణేష్ ఎన్ దేవి.
ఆధునికుల భక్తి వ్యతిరేకత
ఆధునిక మేధావులు భక్తిని హేతుబద్ధతకు, సైన్స్ కు, స్వతంత్ర ఆలోచనకి విరుద్ధమైనదిగా ప్రచారం చేశారు. ప్రాచీన భారతీయ దర్శనాలు తీసుకువచ్చిన హేతుబద్ధతకు, భక్తి ఉద్యమాన్ని ముగింపుగా కొందరు భావించారు. అంతేకాదు, క్రైస్తవం వంటి ఒకే ఒక మతం ఏర్పడి ప్రజలని ఏకం చేయడానికి భక్తి ఉద్యమపు బహుళత్వాన్ని ముప్పుగా తలచారు. భక్తి అనేది హేతుబద్ధతని బలహీనపరిచి, సైన్స్ దృక్పథాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచిందని ఆధునిక మేధావుల అభిప్రాయం.
మోడరన్ సైన్స్, యూరోపియన్ మోడల్
సామాజికవేత్త డాక్టర్ రవిసిన్హా భారతదేశంలో కాక యూరప్ లో ఎందుకు మోడరన్ సైన్స్ అభివృద్ధి చెందింది అనే ప్రశ్నను లేవనెత్తుతారు. భక్తి ఉద్యమంలోని బలహీనతలు సైన్స్ పురోగతికి ఆటంకంగా నిలిచాయి అంటారు. భక్తి ఉద్యమం రాజకీయాల పట్ల నిర్లక్ష్యానికి కారణం అయ్యింది. దీనివల్ల ప్రజలు రాజ్యం, సమాజం, సంస్కృతి, విద్యలతో సంబంధం కోల్పోయారు. భారతీయుల దృక్పథం ఎక్కువగా భక్తి ఉద్యమం వల్ల నిర్మించబడింది. కుల వ్యవస్థ బలపడింది. గుడులు, మఠాలు ఏర్పడ్డాయి. బలహీనపడిన బ్రాహ్మణ ఆధిపత్యం తిరిగి పుంజుకుని భక్తిని సంలీనం చేసుకుంది.
రవిసిన్హా అభిప్రాయాలు – భాషల బహుళత్వం
రామకృష్ణ భక్తి గురించి మాట్లాడుతూ భక్తి ఉద్యమం వల్ల హిందీ భాష అభివృద్ధి చెందింది అంటారు. కానీ అసలు విషయం, అన్ని ప్రాంతీయ భాషలు సాహిత్య భాషలుగా భక్తి ఉద్యమం వల్లనే వృద్ధి చెందాయి. భాషల బహుళత్వం, సాంస్కృతిక బహుళత్వం వృద్ధి చెందడం గురించి రవిసిన్హా ప్రత్యేకంగా మాట్లాడరు. నిజానికి రవిసిన్హా లాంటి ఆధునికవాదులు భయపడేది ఈ బహుళత్వానికే. ఎందుకంటే వలసవాద సైన్స్ దృక్పథం మోనోకల్చర్ని బలపరిచింది.
భక్తి ఉద్యమంపై అక్కసు
రవిసిన్హా దృష్టిలో భక్తి ఉద్యమం గొప్ప ఆర్థిక, ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకురాలేకపోయింది. ఈ ఉద్యమం వల్ల గొప్ప తాత్వికులు, గొప్ప ప్రవక్తలు, సృజనశీలురు వృద్ధి కాలేదు. మతపరమైన చర్చలు జరగలేదు. సామాజిక, రాజకీయ స్థలాల మధ్య అంతరం తగ్గలేదు. కమ్యూనిటీ నుండి వ్యక్తి స్వతంత్రం పొందలేదు. భక్తి ఉద్యమం తెచ్చిన మానసిక స్థితి ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి గొప్ప అవరోధం అంటారు రవిసిన్హా. పాశ్చాత్య దేశాలలో ప్రొటెస్టంట్ క్రైస్తవం, క్రైస్తవ సంస్కరణ, పెట్టుబడిదారీ వ్యవస్థకి వ్యక్తివాదానికి దారితీసింది. అదే సైన్స్ కు మూలం అని వెబర్ లాంటి సామాజిక శాస్త్రవేత్తల దృక్పథం. దానికి పూర్తి వ్యతిరేక దిశలో ఇండియా కొనసాగింది అని రవిసిన్హా అంటారు.
యూరో కేంద్రక ప్రశ్నలు – భారతీయ ప్రత్యేకత
అసలు ఇండియా యూరప్ మోడల్ లో ఎందుకు లేదు అని యూరప్ కేంద్రకంగా వేసే ప్రశ్న చాలా ప్రమాదకరమైనది. భారత్ లో యూరోపియన్ క్రైస్తవం లాంటి మతం ఎందుకు లేదు? యూరప్ లోలా ఇక్కడ చరిత్ర ఎందుకు లేదు? యూరప్ లో వచ్చిన తత్వశాస్త్రం వంటిది భారత్ లో ఎందుకు రాలేదు? అనే ప్రశ్నలు యూరో కేంద్రక ప్రశ్నలు మాత్రమే. ఆ ప్రశ్నలు యూరోపియన్ సామ్రాజ్యవాదాన్ని కప్పిపుచ్చటానికే పనికి వస్తాయి. మహా మేధావులు మహా సిద్ధాంతవేత్తలను భక్తి ఉద్యమం సృష్టించలేకపోయింది అంటారు రవిసిన్హా. మహా సామ్రాజ్యం కాక చిన్నచిన్న రాజ్యాలుగా విడిపోవడం వల్ల బ్రిటీష్ పూర్వ సమీప గతం క్షీణయుగం గా మారింది అంటారు కమ్యూనిస్ట్ మేధావి కేవీ రమణారెడ్డి. ఇటువంటి వారి దృక్పథంలో కొట్టవచ్చినట్లు కనబడేది యూరోపియన్ కేంద్ర దృక్పథం మాత్రమే. మహానగరాలు, మహా నాగరికతలు, కేంద్రీకృత మహారాజ్యం గొప్ప సంస్కృతులను గొప్ప కృతులను, గొప్ప సైన్సును, గొప్ప భాషా వికాసాన్ని సృష్టిస్తాయి అని వీరు భావించారు. అసలు విషయం ఏమిటంటే జీవజాతుల, సంస్కృతుల, భాషల వైవిధ్యానికి బహుళత్వానికి ముప్పు ఏర్పడింది ఈ వైఖరి వల్లనే.
భారత్ – బహుళ భాషల నిలయం
భారత్ బహుళ భాషల నిలయం. అన్ని భాషలు తమవైన ప్రత్యేక సంస్కృతులని, విశ్వాసాలను కొనసాగించాయి. భాషలు కమ్యూనిటీలుగాను, విశ్వాసాలుగాను వృద్ధి చెందాయి. వాటికి బయట మత వ్యవస్థ లేదు. కమ్యూనిటీ లేక కులం యొక్క స్మృతి చాలా ప్రధానమైనది. అందువల్ల వ్యక్తి ప్రాధాన్యం లేదు. ఒక సామూహిక సామాజిక స్మృతి వల్ల భాషలు, సంప్రదాయాలు, ఆరాధన విధానాలు కొనసాగుతాయి. అందువల్ల స్మృతి అత్యంత ప్రధానం. స్మృతి సామూహికమైనది. అందుకే వ్యక్తుల కావ్యకర్తల ప్రవక్తల పేర్లు వివరాలు అప్రధానం. సంప్రదాయం ప్రధానం. ఈ విషయాల గురించి జి.ఎన్. దేవి చర్చిస్తారు. కానీ యూరప్ ఒక మోనోకల్చర్ని బలపరిచింది. దాని వల్లనే సామ్రాజ్యంగా వృద్ధి పొందింది యూరప్.
పాశ్చాత్య విజ్ఞానం, రిడక్షనిజం, మోనోకల్చర్
యూరప్ కు చెందిన ఆధునికతలో, వైజ్ఞానికతలో కూడా వలస క్రైస్తవ మోనోకల్చర్ కనపడుతుంది. అందుకే అమెరికాకు చెందిన జీవశాస్త్రవేత్త రిచర్డ్ లెవిన్స్ పాశ్చాత్య విజ్ఞానం ‘రిడక్షనిస్ట్ సైన్సు’ అంటాడు. లెవిన్స్ వియత్నాంలో యుద్ధానికి సహాయపడుతోందన్న కారణంగా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సులో పదవిని 1970లో తిరస్కరించాడు. ఆయన సామ్యవాది. “రిడక్షనిస్ట్ ఎత్తుగడ యూరోపియన్ ఉత్తర అమెరికాల విజ్ఞాన శాస్త్రాన్ని సృష్టించింది” అంటాడు లెవిన్స్. “యూరప్, అమెరికా కొత్త ఆధిపత్యం మూడవ ప్రపంచ దేశాల శాస్త్రజ్ఞులపై విదేశీ ఎజెండా రుద్దడానికి దారితీసింది” అంటాడు.
విజ్ఞాన శాస్త్ర ఆలోచనలో ద్వంద్వ విరుద్ధతలు
విజ్ఞాన శాస్త్ర ఆలోచన బైనరీ ఆపోజిట్స్ మధ్య చిక్కుకుపోయింది. వారసత్వం-పర్యావరణం, భౌతిక-మానసిక, సమతౌల్యం-మార్పు, విజ్ఞాన శాస్త్రం-భావజాలం, ఆలోచన-అనుభూతి, జీవ-సామాజిక లాంటి తప్పుడు విభజనలు చేసి ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోమని శాస్త్రీయ విశ్లేషణను గందరగోళం చేశారు. అలాగే పంటలలోను, ప్రకృతిలోనూ వైవిధ్యం క్షీణించి మోనోకల్చర్ వ్యాప్తి చెందడం గురించి లెవిన్స్ స్పష్టం చేస్తాడు.
అమెరికన్ పారిశ్రామికవేత్త హెన్రీ ఫోర్డ్ “చరిత్ర అంటే ఒక రకమైన బూతు” (History is more or less bunk) అని పేర్కొన్నారు. “గతం అనేది సంప్రదాయం. మాకు సంప్రదాయం అవసరం లేదు. మేము వర్తమానంలో జీవించాలనుకుంటున్నాము, ఈ రోజు మనం సృష్టించే చరిత్ర మాత్రమే విలువైనది” అంటాడు ఫోర్డ్. అంటే గతాన్ని పూర్తిగా విస్మరించాలి అనేది ఆయన అభిప్రాయం. ఆధునికత గతంతో సంబంధం తెంచుకోవడం, లేదా ఒక రకమైన మతిమరుపు (Amnesia)గా మారింది. కాలాన్ని సంకుచితంగా వర్తమానానికి కుదించివేసే వైఖరి పెరిగింది. దీని గురించి ప్రస్తావిస్తూ రిచర్డ్ లెవిన్స్ ఇలా అంటారు: “ఆధునిక కాలంలో మనం గత చరిత్రతో తెగతెంపులు చేసుకున్నాం. అందుకే మనకు అంటువ్యాధుల (Epidemics/Pandemics) గురించి పూర్తి అవగాహన లేదు. మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా ఇదే క్రమంలో విస్మరించాం.” కేవలం నిపుణులు చెప్పేది మాత్రమే సైన్స్, అదే జ్ఞానం అనే అభిప్రాయంతో, రైతులు, సామాన్య ప్రజలు సంప్రదాయబద్ధంగా పొందిన జ్ఞానాన్ని మనం జ్ఞానంగా పరిగణించడం మానేశాం. దానివల్ల మనం పరిమితమైన ఆలోచనల్లో ఇరుక్కుపోయాం” అని లెవిన్స్ అంటారు. అలాగే, ప్రకృతికి-మనిషికి, ప్రకృతికి-సమాజానికి, మనిషికి-గతానికి మధ్య గల సంబంధాన్ని మనం విస్మరించాం. మొత్తంగా ఇది రిడక్షనిస్ట్ సైన్స్‌కు (Reductionist Science) దారితీసింది అని రిచర్డ్ లెవిన్స్ వివరిస్తారు.
కానీ రవిసిన్హా లాంటి ఆధునికులకి పాశ్చాత్య సంస్కృతిలో మతంలో సైన్స్ కు బీజాలు కనపడతాయి. కానీ రిడక్షనిజం, మోనోకల్చర్, ఆధిపత్యం, విధ్వంసం కళ్ళకి కనపడవు. కనీసం భక్తి ఉద్యమాల బహుళత్వాన్ని జీర్ణించుకుంటే ప్రజాస్వామిక దృక్పథం అలబడుతుంది. సాంస్కృతిక విస్మృతి నుంచి విముక్తి లభిస్తుంది.
తెలుగువారి విరుద్ధ ద్వంద్వాలు
పాశ్చాత్య విజ్ఞానం బైనరీ ఆపోజిట్ లో ఇరుక్కుపోవడం గురించి చూసాం. తెలుగువారి భాషా వైఫల్యానికి కూడా బైనరీ ఆపోజిట్ ల లో ఇరుక్కుపోవడం ప్రధాన కారణం.
కంచ ఐలయ్యపై నాగరాజు విమర్శ
తెలుగు బహుజన మేధావి కంచ ఐలయ్యపై కన్నడ బహుజన మేధావి డి.ఆర్. నాగరాజు చేసిన విమర్శ తెలుగువాళ్లందరి స్వభావాన్ని బట్టబయలు చేస్తుంది. వైష్ణవం-శైవం, బ్రాహ్మణ-బహుజన ఇలా ప్రతిదాన్ని పూర్తి విరుద్ధాంశాలుగా చూడటం వల్ల పరస్పర ప్రభావం గురించి అవగాహన నశిస్తుంది అంటాడు. లెవిన్స్ సైన్స్ లోని రిడక్షనిజాన్ని ఇలాగే విమర్శించాడు. అలాగే మనువాదాన్ని మాత్రమే విడిగా విమర్శించేవారు మెషిన్ వాద (యంత్రవాద) దుష్ప్రభావాన్ని తక్కువ అంచనా వేస్తున్నారు అంటాడు నాగరాజు. అంటే ఆధునిక యాంత్రికత, నాగరికతలలోని సమస్యలని చూడకుండా వాటిని భక్తితో ఆరాధించడాన్ని ఖండిస్తాడు.
అనువాద బానిస రాజకీయం
ఇవి తెలుగు మేధావులు అందరిలో ఉండే సమస్యలు. కారణం అన్ని వాదాలకు చెందిన తెలుగు మేధావులు యూరోసెంట్రిజం, వలసవాద ఆధిపత్యాన్ని తెలుగు సాహిత్యం, తెలుగు భాషల ఉద్ధరణకి ఎరువులుగా భావించారు. అయితే నాగరాజు పుస్తకం యొక్క తెలుగు అనువాదం “జ్వలించే పాదాలు”లో ఈ విమర్శ ఉన్న భాగాన్ని తొలగించారు. దీన్ని అనువాద బానిస రాజకీయం అనవచ్చు. ఎందుకంటే ఈ విమర్శ తెలుగువారి స్వభావాన్ని మొత్తంగా బట్టబయలు చేస్తుంది అని అనువాదకులు భయపడి ఉంటారు.
మెకాలే మానసపుత్రులు – తెలుగు మేధావులు
తెలుగువారిని మెకాలే మానసపుత్రులు అనవచ్చు. తెలుగువారు కులాలు, కుల సంస్కృతులు, కుల పురాణాల మీద పరిశోధన చేయవచ్చు. కానీ వాటి గురించి ఒక సిద్ధాంతం చేయడంలో ఎప్పుడు విఫలం అవుతారు. ఎందుకంటే వారి సిద్ధాంతాలు పాశ్చాత్య ఆధునికత, వలసవాదుల అభిప్రాయాలకు ప్రతిధ్వని మాత్రమే. బ్రాహ్మణులని, సంస్కృతాన్ని కేంద్రం చేసి చూసే వలసవాద ఆలోచనలని వారు చిలక పలుకుల్లా వల్లిస్తారు. ఆ భావనలతో వారి పరిశోధనలకు సంబంధం ఉండదు. సంస్కృత అలంకార శాస్త్ర గ్రంథాలు సమకాలిక భక్తి ఉద్యమాల ప్రభావాన్ని దాని తీవ్రతను సిద్ధాంతీకరించడంలో విఫలం అయ్యాయి అంటారు జి.ఎన్. దేవి. ఆ గ్రంథాలు ఇంకా పాత అద్వైత పద్ధతిలో రస సిద్ధాంత వైఖరితో సిద్ధాంతీకరణ చేశాయి. భక్తి ఉద్యమం తెచ్చిన సామాజిక విమర్శ ను స్వీకరించలేదు.
అలాగే జానపద సాహిత్య పరిశోధకులు వలస వాద ఆధునిక దృక్పథానికి విరుద్ధమైన జానపద సాంప్రదాయాలను వలసవాద ఆధునిక సిద్ధాంతాలలో బలవంతంగా ఇమడ్చాలని చూస్తున్నారు. కుల పురాణాలను ఆధునిక కుల నిర్మూలన సిద్ధాంతంతో వ్యాఖ్యానిస్తున్నారు.
కుల వ్యవస్థ – జ్ఞానంపై ప్రభావం
“కుల వ్యవస్థ భారతదేశానికి ప్రత్యేకమైన సామాజిక విభాగ రూపం. అంబేద్కర్ చెప్పినట్లు అది శ్రమ విభజన మాత్రమే కాదు, శ్రామికుల విభజన. మనుషుల శక్తి సామర్థ్యాల ఆధారంగా కాకుండా పుట్టుక ఆధారంగా వృత్తులను నిర్ణయించింది. అధిక సంఖ్యాకులను చదువుకు, విజ్ఞానానికి దూరం చేసింది”. (దళిత గీతాలు పుస్తకానికి ముందుమాట) ఈ మాట రాసిన జయధీర్ తిరుమలరావు “రాతప్రతులు విభిన్న కోణాలు” అనే పుస్తకంలో “జానపదులు, నిరక్షర కుక్షులు” అనే భావన తప్పు అంటూ వారి లేఖనాలు, పురాణాలు, పుస్తకాల గురించి వివరంగా రాస్తారు. “వైదిక వాఙ్మయంలోని శ్రద్ధ, గాంభీర్యం, గిరిజనుల జానపదంలోని సరళత, సజీవత వేల సంవత్సరాల నుండి సమాంతరంగా సహజీవనం చేశాయి” అని కూడా రాస్తారు జయధీర్.
సిద్ధాంతాలకు అతీతంగా భక్తి ఉద్యమాలు
మరి చదువు, జ్ఞానానికి దూరమైన అధిక సంఖ్యాకులు ఎవరు? అసలు జ్ఞానం, చదువు అంటే ఏమిటి? ఇటువంటి వైరుధ్యాలకి కారణం అనుభవాలని సిద్ధాంతీకరించడంలో పాశ్చాత్య మూసను ఆశ్రయించి విఫలం కావడమే. పాశ్చాత్య తరహా వ్యక్తివాదం ఇక్కడ లేదు. జ్ఞానం కూడా కమ్యూనిటీ ద్వారా సంప్రదాయంగా కొనసాగింది. కులాలు, ఆశ్రిత కులాల పద్ధతిలో మతాలు, వ్రాత, చదువు సంప్రదాయంగా వచ్చాయి. వాటిని ఆధునిక విశ్వవిద్యాలయ వ్యవస్థలో భాగం చేసే ప్రయత్నంలో ఆధునిక పాశ్చాత్య సిద్ధాంత మూసలోకి ఇమడ్చక తప్పదు. దానిలో వైఫల్యం అనివార్యమే. అసలు సిద్ధాంతాలకు అతీతంగా భక్తి ఉద్యమాలు కొనసాగాయి అంటారు జి.ఎన్. దేవి. భక్తి సాహిత్యానికి తగిన విమర్శనాత్మక ప్రవచనం వెలువడకపోవడానికి ప్రధాన కారణం జీవితానుభవానికి, క్రమబద్ధీకరించబడిన జ్ఞానానికి నడుమ అంతరమే అంటాడు జి.ఎన్. దేవి.
భక్తి – నిరపేక్ష తాత్విక భావన
“భక్తి ద్వారా దేవుడికి, మానవుడికి నడుమ ప్రతిఫలించిన అతి వ్యక్తిగతము, సన్నిహితమునైన సంబంధం, బ్రహ్మకు ఆత్మకు నడుమ సంబంధాన్ని గురించి శంకరుడు ప్రతిపాదించిన నిరపేక్ష తాత్విక భావన స్థానాన్ని ఆక్రమించింది. అందువల్ల సార్వజనీన సూత్రీకరణ అసాధ్యమైంది. బహుళ భాషా విధానం, బహుళ సాంస్కృతికత ఒకే ఒక మూస సిద్ధాంతీకరణను అసాధ్యం చేశాయి. అయితే వలసవాద ప్రభావం సూత్రీకరణలకు దారితీసింది. హిందూ మతం పేరుతో సంస్కృత గ్రంథాలను మాత్రమే ప్రామాణికంగా అధ్యయనం చేయడం పెరిగింది. మాక్స్ ముల్లర్, వివేకానంద లాంటి వారు అదే చేశారు. హిందూ మత విమర్శ పేరుతో అంబేద్కర్ నుంచి రంగనాయకమ్మ వరకు సంస్కృత గ్రంథరాశిలో కూరుకొనిపోయారు. ఈ భ్రమను పటాపంచలు చేసే పరిశోధనలు చేసిన తెలుగు బహుజన మేధావులు సిద్ధాంతీకరణలో మాత్రం వారి దారిలోనే నడిచి వలసవాద వైఖరిలో పడిపోయారు. దీనికి కారణం తెలుగు మేధావులందరూ మెకాలే మానసపుత్రులు కావడమే కారణం.
సాంస్కృతిక విస్మృతిలో తెలుగు మేధావులు కమ్యూనిస్టు విమర్శకులు
కమ్యూనిస్ట్ కె.వి.ఆర్. మెకాలే కనుసన్నలలోని విద్యావిధానాన్ని పొగుడుతారు. ప్రజలలోని మూర్ఖత్వాన్ని రూపుమాపిందని, దేశ భాషల అభివృద్ధికి కారణమైందని, ఉపజాతులుగా చెదిరిపోయి ఉన్న వారిని కూడగట్టి ఒకే దేశంగా ఐక్యం చేసిందని అంటారు. అయితే బ్రిటిష్ పూర్వ శతాబ్దాన్ని క్షీణ యుగం అంటారు. ముద్దుపళని రంగరాజమ్మ లాంటి వారి కవిత్వం అసభ్యము అని ఈసడిస్తారు. యక్షగానాలలో వ్యవహారిక భాషా ప్రయోగాన్ని గుర్తిస్తారు. కానీ హాస్యానికి మాత్రమే పనికి వచ్చిందని చిన్నచూపు చూస్తారు. శతక సాహిత్యం,వేమన పద్యాలు, త్యాగరాజకీర్తనలు, అన్నమయ్య పద సాహిత్యం, విశ్వ గుణాదర్శ చంపూ లాంటి యాత్రాకావ్యం, కళాపూర్ణోదయం అనే నవలను పోలిన ఆధునిక కావ్యం లాంటి సృజనాత్మక సాహిత్యం వెల్లివిరిసిన కాలాన్ని క్షీణ యుగం అంటారు కె.వి.ఆర్. ఇంగ్లీషు చదువుల వల్ల వసంతం వచ్చినట్లు భావిస్తారు. ఈ క్షీణయుగ భావనలోనే సాంస్కృతిక విస్మృతి ఉంది. ఈ సాంస్కృతిక విస్మృతి అందరిలోనూ కనిపిస్తుంది. కమ్యూనిస్టులని తీవ్రంగా విమర్శించిన అనుభూతికవి ఇస్మాయిల్ అచ్చం కమ్యూనిస్టులు లాగే యూరోపియన్ల వల్లనే అభివృద్ధి పునరుజ్జీవనం కలిగింది అంటారు.
భారతీయుల విలక్షణ రోగం – జ్ఞానంపై వైఖరి
“మన భారతీయులకి వేల కొద్ది సంవత్సరాలుగా వారసత్వంగా సంక్రమిస్తున్న రోగం ఒకటి ఉంది. దేనినీ దానికి సహజమైన, ఆంతరంగికమైన ప్రయోజనాలతో కాకుండా దానికి సంబంధించని బాహ్యమైన ప్రయోజనాలతో విలువ కట్టడం. భారతీయ తత్వశాస్త్రం మొదలుకొని భారతీయ కళల వరకు అన్నీ ఈ జబ్బుతో కూడుకున్నవే. జ్ఞానానికి విలువ జ్ఞానమే, జ్ఞానం జ్ఞానం కోసమేనన్న సత్యం మనవాళ్ళకి ఎప్పుడూ స్ఫురించలేదు. జ్ఞానం మోక్షం కోసం లేదా మనకు నచ్చిన సిద్ధాంతాన్ని సమర్థించుకోవడం కోసం లేదా మరో దానికోసం. జ్ఞానం కోసమే జ్ఞానాన్ని అన్వేషించకపోవడం వల్ల కలిగిన ఫలితం ఏమిటంటే మన దేశంలో విజ్ఞాన శాస్త్రం వేళ్లూనుకోలేదు. దాని పరిణామమైన భౌతిక అభివృద్ధిని పాశ్చాత్యులు వచ్చేవరకు మనం ఎరుగం”. అంటారు తెలుగు అనుభూతి కవి ఇస్మాయిల్.
తాత్విక ఆలోచనలలో స్తబ్దత
“పోనీ తాత్విక ఆలోచనలోనైనా అభ్యుదయం సాధించామా అంటే అదీ లేదు. 12 శతాబ్దాల కాలం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. కొన్ని శతాబ్దాల తరబడి నవద్వీపంలో తర్కశాస్త్ర అధ్యయనం జరిగినా, అరిస్టాటిల్ తన జీవితకాలంలో వేసిన ఒక్క అడుగు వాళ్ళు వెయ్యి సంవత్సరాల్లో కూడా వెయ్యలేకపోయారు. సూటిగా, స్పష్టంగా దేనిని చూడలేకపోవడం, దేని స్వతస్సిద్ధమైన విలువ దానికి ఉంటుందని తెలుసుకోకపోవడం దీనికి కారణం. సాహిత్యంలోనూ అంతే. నిత్యం ధర్మ ప్రచారం కోసం, విశ్వ శ్రేయం కోసం, రాజుల్ని కీర్తించి పొట్ట గడుపుకోవటం కోసం, పాండిత్య ప్రకర్ష కోసం మరో దానికోసం కాకుండా సాహిత్యాన్ని సాహిత్యంగా గౌరవించిన వాళ్ళు, సాహిత్యపు విలువలని విస్మరించని వాళ్ళు ఏ కాళిదాసు లాంటివారు నూటికి కోటికి ఒక్కరు. మిగతా అంతా వట్టి బీడు. జీవితానందం, చైనా, అరబ్బీ కవిత్వాల్లాంటివి ఎక్కడైనా మందులోకి దొరుకుతాయేమో, మామూలుగా కనిపించవు.
పాశ్చాత్య ప్రభావం – భారతీయ దృక్పథంలో మార్పు
ఇది భారతీయులకు మాత్రం పరిమితమైన విలక్షణ రోగం. పాశ్చాత్యుల్లో కానీ మరొకరిలో కానీ కనిపించదు. ఒకప్పుడు సంక్రమించినా వాళ్ళు తొందరగానే కుదుర్చుకున్నారు. దీని లక్షణం ఏమిటంటే ప్రపంచాన్ని ఆబ్జెక్టివ్ గా చూడలేకపోవటం. మతం, మోక్షం వంటి తెరలు జ్ఞాన నేత్రాన్ని కప్పకుండా జాగ్రత్త పడకపోవడం. అందుకనే మనకి తత్వశాస్త్రంలో ఒక అరిస్టాటిల్ కానీ, చరిత్ర రచనలో హిరోడోటస్ కానీ కనిపించరు. మన శంకరాచార్యులు ఎప్పుడు పుట్టాడో, ఎక్కడ బతికాడో ఏ చారిత్రక ఆధారాలు లేవు. ప్రపంచాన్ని చూడం, కళ్ళు మూసుకుంటాం. యథార్థాలయెడల ఆసక్తి లేదు. జీవిత చరిత్ర నిండా ఉత్ప్రేక్షలు, అబద్ధాలు. ఈ ప్రపంచం పైన దృష్టి లేదు. బతుకంటే వైరాగ్యం. ఇటువంటి మనుషులు సత్యాన్వేషణకు పనికొస్తారా? జీవిత సమరంతో స్పందించే కవిత్వం రాయగలరా? జీవితాన్ని ఆవిష్కరించగలరా?” అని ప్రశ్నిస్తారు ఇస్మాయిల్.
ఇంగ్లీష్ విద్య – కొత్త దారులు
“అందుకే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మన చూపుల్ని పరలోకాల నుంచి ఇహలోకానికి మరల్చి, జీవితాన్ని, యథార్థాలను సూటిగా చూసి ఎదుర్కోగలగడం నేర్పినప్పుడు మనలో చాలా గొప్ప మార్పు, మలుపు వచ్చాయి. దృష్టి బొడ్డు మీదికి సారించి నత్తలా ముడుచుకున్న వాళ్ళం ఒక్కసారిగా విప్పారి, అనంత ఆకాశానికి, హాయినిచ్చే గాలికి, విస్తరించే నలుదిక్కులకి విప్పారుకున్నాం. జీవిత ఆనందానికి కళ్ళు తెరిచాము. మన పూర్వ కావ్యాలు, ప్రబంధాలు చదవండి. అందులో వాళ్ళు మనుషులేనా? అందులో వర్ణించింది మనుషుల జీవితమేనా? ఆ కవులు నిజంగా జీవించలేదు కనుకనే వారి పాత్రలు జీవించలేదు. వాళ్ళు మనుషుల్లా ప్రేమించుకోరే? మరబొమ్మల్లా ప్రేమించుకుంటారు. కానీ మరబొమ్మలు ప్రేమించుకుంటాయా? ఇంతకీ నేననేది ఏమిటంటే ఇంగ్లీషు వాళ్ళు వచ్చి మనకు నేర్పే వరకు మనం ప్రపంచాన్ని కళ్ళు తెరిచి చూడలేదని, జీవితాన్ని ఆనందించడం మనకు తెలియదని. ఇంగ్లీష్ చదువులు వచ్చాక, ఏ గురజాడ అప్పారావు, గుడిపాటి వెంకటచలం వచ్చి కథల్లో నాటకాల్లో ప్రపంచము, వైవిధ్యానికి, జీవితపు ఇంద్రధనుస్సు లకు, నిత్యం అనుభూతమయ్యే ఇంద్రియ సుఖాలకి మన నేత్రాలను తెరిచేటప్పటికీ కళ్ళు జిగేలుమని కలవరపడి, కంగారుపడి, అలవాటు కొద్ది ఈ కొత్త అనుభవాలకి సంజాయిషీలను, వీటితో సంబంధంలేని బాహ్య కారణాల్లో వెతకడం మొదలెట్టాం.” అని మంచి అంతా బయటినుంచి వచ్చిందే అంటారు ఇస్మాయిల్.
ఇస్మాయిల్ అభిప్రాయాలు – మార్క్సిస్టు ఆలోచనలు
నిజానికి ఇస్మాయిల్ వాదానికి మూలాలు డి.డి. కోశాంబి లాంటి మార్క్సిస్టు ఆలోచనపరుల అభిప్రాయాల్లో కనిపిస్తాయి. భారతీయులకు చరిత్ర లేదని, స్పష్టమైన పురోగమనశీలియైన రేఖీయ కాలక్రమం లేదని, వాస్తవిక దృష్టి లేదని పాశ్చాత్యంతో పోలుస్తూ విమర్శించారు. అలాగే మనకి గొప్ప తాత్వికులు అరిస్టాటిల్ లాంటి తాత్వికులు లేరని విమర్శించారు. కమ్యూనిస్ట్ లను తీవ్రంగా విమర్శించే ఇస్మాయిల్ కమ్యూనిస్టులతో పాటు ఇంగ్లీసు వలసవాద ఆలోచనలను పంచుకోవడం వైచిత్రి.
కళలు, హేతుబద్ధతపై భిన్నాభిప్రాయాలు
ఇస్మాయిల్ ఇండియాలో కళలు, కవిత్వం లేవని బాధపడితే, ఇంద్రియ అనుభవానికి దూరమయ్యారని ఆలోచిస్తే, హేతువాది రావిపూడి వెంకటాద్రి కళల పేరుతో హేతుబద్ధత లోపించిందని బాధపడతారు. ఇస్మాయిల్ యూరోపియన్లు కళా దృష్టిని ఇంద్రియ అనుభావాలని మేల్కొలిపారు అని భావిస్తే, రావిపూడి హేతు బుద్ధిని పెంచారు అని భావించారు. ఇద్దరూ భిన్న ధ్రువాలు కానీ ఇద్దరినీ కలిపినది యూరప్ కేంద్రీయత. ఇస్మాయిల్ భారతీయులని మతం, ఆధ్యాత్మికత చెడగొట్టాయి అంటే, రావిపూడి వెంకటాద్రి కళ కూడా వినాశకారిణి అని తిరస్కరిస్తారు. మొత్తంగా కళలను తిరస్కరిస్తారు. నిజానికి పాశ్చాత్యులు కొందరు భారతీయులకు ఈలోకం పట్టదు పరలోకం వైపే వారి చూపు అని విమర్శించారు. మరికొందరు పాశ్చాత్యులు ఇంద్రియ సుఖాలలో భావోద్వేగాల్లో తేలియాడడం తప్ప, భారతీయులకు హేతు బుద్ధి అసలే లేదు వారి కళలు శిల్పాలు దానినే నిరూపిస్తున్నాయి అని విమర్శించారు. ఈ భిన్న విమర్శలను మనవాళ్ళు గుడ్డిగా అనుకరించారు.
కళ అంటే అత్యాచారమా?
“వయసుతోపాటు మనసుని పెరగనిచ్చేది శాస్త్రజ్ఞానం కాగా, అలుపెరుగనీయనిది కళా వ్యాసంగం” అంటారు హేతువాది రావిపూడి వెంకటాద్రి. “ఉన్మాదాన్ని పోషించగల మతాన్ని కళలు, కళల్ని మతము ఆశ్రయించాయి. కళలు ఇప్పటిదాకా చేసిన నిర్వాకం మనసుని రేప్ చేయటమే. కళ లు మానవ సమాజాన్ని రేప్ చేయడానికి సాధనాలుగా ఉపయోగపడడమే” అని కళను అత్యాచారం గా వర్ణిస్తూ తీవ్రంగా విరుచుకుపడతారు. హేతుబద్ధమైన ఆధునిక సాంకేతికత కేవల ఇంద్రియ ఉత్తేజకరమైన అహేతుకమైన కళను మూలకి నెట్టేసింది అంటారు రావిపూడి వెంకటాద్రి. ప్రపంచం మొత్తంలోని అన్ని రకాల కవిత్వాలను అభ్యుదయ విప్లవ కవిత్వాలను కళలను కూడా అహేతుకమైనవి ఆబ్జెక్టివ్ కానివి అని తిరస్కరించారు రావిపూడి.వాటిని చేతబడి లాంటి మూఢ నమ్మకాలతో పోల్చారు.
విప్లవ రచయితల సంఘం (విరసం) కార్యదర్శి కేవీ రమణారెడ్డి సైతం ఒక కవితలో విప్లవకారుడు నరసింహారావు తల్లి కడుపులో ఉన్నప్పుడే తన పరాక్రమం చూపించాడని పేర్కొన్నారు. అతను ప్రజా భాషలో ప్రహ్లాద పురాణం రాశాడు. అదంతా గర్భస్థ పిండం గురించిన కవిత్వం. విరసం పేరిటైనా, అరసం (అభ్యుదయ రచయితల సంఘం) పేరిటైనా, వారికి వాస్తవికత కనిపించదు. కవితా చాపల్యం అలాంటిది. ఉన్నదాన్ని ఉన్నట్లు వ్రాసేది కవిత్వం కాదు. కళ కానేరదు అంటారు రావిపూడి.అభ్యుదయ వాదులు తమ సిద్ధాంతం ప్రవచించని సాహిత్యం కళ లు వ్యర్థం ప్రమాదకరం అంటే, రావిపూడి వెంకటాద్రి అసలు కళలే వ్యర్థం ప్రమాదకరం అన్నాడు.
డి ఆర్ నాగరాజు అంటాడు_ వాస్తవికతావాదానికి తల్లిలాంటి వికాసవాద యుగం కవిత్వాన్ని అనుమాన దృక్కులతో చూసింది. అది స్త్రీల అభివ్యక్తి అని, దాన్ని ఎప్పుడూ పర్యవేక్షిస్తూ నియంత్రిస్తూ ఉండాలి అని భావించారు అంటాడు. ఆధునిక హేతువాదం అంటేనే పురుష స్వామ్యం పురుషాధిపత్యం అన్నమాట. ఐతే కళను పూర్తిగా నిరాకరించే దృక్పథాన్ని ప్లేటో నుంచి స్వీకరించాను అని చెప్పుకుంటాడు రావిపూడి.నిజానికి ప్లేటో భౌతిక వాది, హేతువాది కాదు. భావ వాది. అయినా రావిపూడి కి ఆదర్శంగా కనబడడం విశేషం.
యూరోపియన్ తాత్వికుడు కావడం వల్లనా?
సాంస్కృతిక విస్మృతి పట్ల ఆరాధన భావం
ఇస్మాయిల్ సాహిత్యం జీవితానుభవం పేరుతో భారతీయ గతాన్ని, భారతీయుల గత స్మృతిని తిరస్కరించారు. రావిపూడి వెంకటాద్రి హేతు వాదం మిషతో అసలు ప్రపంచ గత చరిత్రని, ప్రపంచ కళలు అన్నిటినీ, అంటే మొత్తంగా మానవులు అందరి ఉమ్మడి స్మృతిని తిరస్కరించారు. సాంస్కృతిక విస్మృతి పట్ల ఆరాధన భావాన్ని కూడా పెంచి పోషించింది ఈ వైఖరి. కంచ ఐలయ్యలో తీవ్ర రూపం ధరించి తెలుగు భాషని నిర్మూలించాలి, ఇంగ్లీషుని వరించాలి అనే స్థాయికి వెళుతుంది. ఆధునికతలో తీవ్ర ప్రాధాన్యం వహించిన సాంస్కృతిక విస్మృతి ఆరాధనని కన్నడ బహుజన మేధావి డి.ఆర్. నాగరాజు బట్టబయలు చేశారు. కేవలం కులవృత్తులలోని అణచివేతను మాత్రమే మాట్లాడే వారు ఆధునిక సాంకేతికతలోని వివక్షను, అణచివేతని చూడలేకపోతున్నారు అంటారు. కంచ ఐలయ్య దళిత బహుజన వృత్తులలోని వైజ్ఞానికతను గురించి మాట్లాడతారు. బ్రాహ్మణులు ఆ బహుజన వైజ్ఞానికతను నిర్లక్ష్యం చేశారు అంటారు. “కానీ పాశ్చాత్యులు, అగ్రవర్ణాలు మనదేశంలో ప్రవేశపెట్టిన ఆధునిక సాంకేతికత దళిత బహుజనుల వృత్తి నైపుణ్యాన్ని గుర్తించనేలేదు. మనువాదంతో పాటు మెషిన్ వాదం (యంత్రవాదం) ప్రమాదాన్ని గుర్తించాలి” అంటారు నాగరాజు.
స్మృతి, సంస్కృతి, ఆధునికత
పాశ్చాత్య భావ ప్రేరితులైన ఆధునిక మేధావులు అందరూ దళిత బహుజన సంస్కృతులను తవ్వితీస్తున్నారు. కానీ వాటిని వర్తమాన స్ఫూర్తిలో భాగం చేయాలి అనుకోవడం లేదు. వాటిని చరిత్రకి, వస్తు ప్రదర్శనకి పరిమితం చేస్తున్నారు. ఆ స్మృతులు సాంస్కృతికమైనవి, కమ్యూనిటీ పరమైనవి, కులపరమైనవి. వాటిని ఆధునికత ‘సెక్టేరియనిజం’ పేరుతో తిరస్కరిస్తుంది. కనుక బహుజన అకడమీషియన్స్ వాటిని యూనివర్సిటీ పరిశోధనలుగా మాత్రమే పరిగణిస్తున్నారు. నిజానికి స్మృతిని, సంస్కృతిని ఒక సంప్రదాయంగా ఒక తరం నుంచి మరొక తరానికి అందుబాటులోకి తీసుకురావడంలో బ్రాహ్మణ, దళిత బహుజన సంస్కృతుల మధ్య సామ్యం ఉంది. విశ్వాసాలలో కూడా సామ్యం ఉంది. మౌఖికత, లేఖన పద్ధతులలో పోలిక ఉంది. ఈ సత్యాన్ని జయధీర్ తిరుమలరావు గుర్తిస్తారు. అంటే ఘర్షణ, సామరస్యం రెండు సంస్కృతులలో ఉంటాయి. కానీ ఆధునికత ఘర్షణను మాత్రమే ప్రధానం చేస్తుంది. సైన్స్ లో, తత్వంలో, సంస్కృతిలో బైనరీ ఆపోజిట్ లను మాత్రమే చూస్తుంది.
వలస క్రైస్తవ ప్రతీక – ద్వంద్వ విరుద్ధతలు
దీనిని నాగరాజు వలస క్రైస్తవ ప్రతీక ద్వారా వివరిస్తారు. “అస్పృశ్యుడైన ఆదాములోని అమాయకత్వాన్నంతా హిందూ మతంలోని సాతాను హరించి వేశాడు అని, ఈనాడు ఆదాములో సాతాను స్మృతులు తప్ప మరే జ్ఞాపకము మిగలలేదని ఆధునిక మేధావులు భావిస్తారు” అంటాడు. అయితే పురాణాలలో, కుల పురాణాలలో ఇటువంటి తీవ్ర వైరుధ్యం ఉండదు. వశిష్ఠుడు బ్రాహ్మణుడు, మాదిగల అల్లుడని జాంబ పురాణంలో వర్ణించబడింది. కానీ ఆధునిక దళిత మేధావులు జన్యుపరంగా, ప్రాంతపరంగా బ్రాహ్మణులు దళితులకు శత్రువులు, ఆర్యజాతి వారు అనే సిద్ధాంతానికి తీవ్ర ప్రచారం కల్పిస్తున్నారు. అందుకే పురాణాలలో ప్రతి నాయకులను హిందూ దేవతలకు శత్రువులని, పూజనీయులుగా మారుస్తున్నారు. మరోవైపు హిందూవాదులు సంస్కృత పురాణాలు, ఇతిహాసాలలోని కథలనే ప్రమాణంగా చూపుతూ బహుళ కథనాలను తిరస్కరిస్తున్నారు. అటు దళితులు, ఇటు హిందూవాదులు సంస్కృత కథనాలను ప్రమాణంగా భావిస్తూ భిన్న కథనాల్ని వాటి నుంచే అల్లుతున్నారు. ఈ విరుద్ధ ద్వంద్వాలు అన్ని విషయాలను ఆవహించాయి.
కళలు, వాస్తవికత, సంస్కృతి
కన్నడ రచయిత దేవనూర మహాదేవ “కుసుమ బాలె” అనే నవలలో ఆత్మలను అతీంద్రియ విషయాలను ప్రవేశపెట్టి ఒక రకమైన మ్యాజిక్ రియలిజం పద్ధతిలో రాశారు. “గతకాలపు జానపద పద్ధతులను, ఫ్యూడల్ అవశేషాలను ప్రవేశపెట్టాడు” అని కొందరు విమర్శ చేశారు. హేతుబద్ధమని విర్రవీగే పాశ్చాత్య వాస్తవికతవాదం ఊహకు, కల్పనకు మధ్య అగాధాన్ని సృష్టించింది. దేవుళ్ళు, దేవతలు, ఆత్మలు, పురాణాలు, స్వప్నాల లోకంలోకి ప్రవేశించాలంటే ఆ వాస్తవికతా వాదాన్ని భగ్నం చేయాలి అంటాడు నాగరాజు. దళితుల వంటి అవమానిత కులాల ఆత్మగౌరవాన్ని పెంపొందించాలంటే వారి సాంస్కృతిక రూపాల్ని పునరుజ్జీవింప చేయడం సరైన పరిష్కారమని దేవనూర మహాదేవ అభిప్రాయం. అంబేద్కర్ వాదులు ఇలాంటి ప్రయత్నాలను నిరసిస్తారు. జానపద కళల గురించి తీవ్ర భిన్నాభిప్రాయాలు కొనసాగుతూనే ఉన్నాయి.
విశ్వనాథ సత్యనారాయణ – ఆధునికుల తిరస్కారం
నిజానికి తెలుగు రచయిత విశ్వనాథ సత్యనారాయణ రచనలలో పౌరాణిక, జానపద కల్పనలు అద్భుతంగా చోటుచేసుకున్నాయి. పర్యావరణ విధ్వంసం, వ్యాపార పంటల వల్ల ప్రమాదం, గ్రామాల నగరీకరణ పర్యవసానాలు, ప్రాచీన కళల క్షీణత వంటి విషయాలు ఎన్నో “వేయి పడగలు”లో చిత్రించబడ్డాయి. కానీ, కులం ప్రసక్తి ఉండడం వల్ల ఆయన రచనలను ప్రమాదకరమైనవిగా ఆధునికులు తిరస్కరించారు. కులం, కమ్యూనిటీ ప్రసక్తి లేకుండా ఆధునికత తీసుకువచ్చిన సామాజిక, సాంస్కృతిక విధ్వంసాన్ని చిత్రించటం అసాధ్యం. స్మృతిని తిరస్కరించిన కమ్యూనిస్టులు, ఆధునికులు ఆధునిక యాంత్రిక నాగరికతలోని లోపాల్ని విమర్శించడం తిరోగమనంగా భావించారు. అందుకే వారి రచనల్లో అటువంటి చిత్రణ అంతగా కానరాదు.
సాంస్కృతిక విస్మృతి పర్యవసానాలు
అంతశ్చేతన లో అణచివేయబడిన విషయాలు స్వప్నాల రూపంలో, ఫ్రాయిడియన్ స్లిప్… తడబాటుతో కూడిన మాటలలో, ఇలా వివిధ రీతులలో అన్యాపదేశంగా వ్యక్తం అవుతాయి అంటాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. వలసవాద ఆధునికత అణచివేసిన, నియంత్రించిన స్మృతులు రూపు మార్చుకొని వికృత రూపంలో బయటపడుతున్నాయి. నేటి హిందూత్వ అదే.
భారతీయ సంస్కృతిలో స్మృతి ప్రాధాన్యత
భారతీయ సంస్కృతిలో స్మృతికి తాత్వికంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందూ పురాణాల ప్రకారం, జీవుల కర్మలన్నీ ప్రళయ కాలంలో అవ్యక్త స్థితికి, సూక్ష్మ స్థితికి చేరుకుంటాయి. ప్రళయానంతరం, సృష్టి కాలంలో బ్రహ్మ ఆ జీవుల కర్మలన్నింటినీ స్మరించుకొని పునఃసృష్టి చేస్తాడు. అంటే, బ్రహ్మ కర్త (చేసేవాడు) కాదు, స్మర్త (స్మరించేవాడు). స్మరణకు ఇంతటి ప్రాధాన్యం ఉంది. ప్రాచీన సాంఖ్య దర్శనం ప్రకారం కూడా, అవ్యక్త స్థితిలో ఉన్నది వ్యక్తమవుతుంది, సూక్ష్మంగా ఉన్నది స్థూల రూపం ధరిస్తుంది. ఇదే సృష్టి. అలాగే, వ్యక్తమైనది, స్థూలమైనది అవ్యక్తంగా, సూక్ష్మంగా మారడమే ప్రళయం. ఇదంతా స్మృతి విస్మృతులను పోలి ఉంటుంది. మన సంస్కృతిలో శ్రుతి, స్మృతి ప్రధానమైనవి. శ్రుతి అంటే వేదం, స్మృతి అంటే పురాణాలు, ఇతిహాసాలు చెప్పడం, వినడం అనే పద్ధతుల ద్వారా జ్ఞానం ఒకరి నుంచి మరొకరికి, ఒక తరం నుంచి మరొక తరానికి అందుబాటులోకి వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో శ్రవణం, స్మరణం చాలా ప్రధానమైనవి. ఈ ప్రక్రియ మన సంస్కృతిని అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది.
పురాణం స్థానంలో చరిత్ర – విషమ పరిణామాలు
ఈనాడు సాంస్కృతిక విస్మృతి ఆవహించింది. పురాణం స్థానాన్ని చరిత్ర ఆక్రమించింది. అనంత కాలం స్థానాన్ని లీనియర్ టైమ్ భావన భర్తీ చేసింది. రాముడు పుట్టిన స్థల కాలాలు చారిత్రక స్థితికి దిగజారాయి. ఆధ్యాత్మికతను జాతీయ భావన ఆక్రమించింది. అందుకే భక్తి తన్మయత్వం స్థానం విద్వేష ఉన్మాదం భర్తీ చేసింది. బౌద్ధులు కూడా ఈ ఆధునిక వలసవాద వైఖరినే మరో రూపంలో అవలంబిస్తున్నారు. బహుళ దేవతలు, బహుళ కథనాల స్థానాన్ని ఒకే దేవుడు, ఒకే జాతి భావన కబ్జా చేసింది. బహుళ భాషల స్థానాన్ని హిందీ ఆధిపత్యం ఆక్రమించింది. దీని పర్యవసానంగా తెలుగు భాష, సంస్కృతి క్షీణ దశకు చేరుకుంటున్నాయి.
మూలాలు
- నేనూ నావింతల మారి ప్రపంచమూ – పైడి తెరేష్ బాబు 2009
- కావ్య మీమాంస. వ్యాఖ్య పుల్లెల శ్రీరామ చంద్రుడు. జయలక్ష్మి పబ్లికేషన్స్ హైదరాబాద్ 1979.
- విస్మృతి అనంతరం, గణేష్ ఎన్ దేవి. “After Amnesia: Tradition and Change in Indian Literary Criticism”, అనువాదం కాత్యాయని, ఎమెస్కో హైదరాబాద్ 2014.
- కవిత్వంలో నిశ్శబ్దం ఇస్మాయిల్, దేశి బుక్స్ కాకినాడ 1987.
- దళిత గీతాలు సంపాదకులు జయధీర్ తిరుమల రావు, సాహితీసర్కిల్ హైదరాబాద్ 1993.
- Needham Question for the Indian Civilization – Ravi Sinha, Hyderabad 2024.
- కళ శాస్త్రం తత్వం హేతువాదం – రావిపూడి వెంకటాద్రి, కవిరాజాశ్రమం నాగండ్ల 1992.
- జ్వలించే పాదాలు – The Flaming Feet and Other Essays, డి ఆర్ నాగరాజు, అనువాదం – సి.మృణాళిని, ఎమెస్కో 2010.
- మహోదయం కె వి రమణారెడ్డి, విశాలాంధ్ర విజయవాడ 1969.
- బహుభాషలతోనే నాగరికత ఉనికి గణేష్ ఎన్ దేవి, ఈనాడు 17 డిసెంబర్ 2022.
- “When Science Fails Us” Publication: Soundings, Volume 1996, Issue 4. This essay is also available on the Marxists Internet Archive.
- The Dialectical Biologist Richard Levins and Richard Lewontin, Harvard University Press, 1985.
- వేమన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, ప్రజాశక్తి బుక్ హౌస్ 1971.
- Of Many Heroes: An Indian Essay in Literary Historiography G. N. Devy, Orient Longman (ప్రస్తుతం Orient Blackswan) 1998.
- తెలుగు రాత ప్రతులు, జయధీర్ తిరుమలరావు, చెలిమి సాహితీ సర్కిల్, హైదరాబాదు 2012.
- అనుభవాలు జ్ఞాపకాలున్నూ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, విశాలాంధ్ర 1999.
