ఎంత కష్టం

ఒక వయసు దాటాక – నువ్వో యాభైకి చేరువలో ఉన్నపుడు
నీ కంటూ ఓ సద్యోగం, ఒకింత గుర్తింపూ ఏర్పడ్డాక
నీ చిన్నపుడు నిన్ను ‘అరే’, ‘తురే’ అని
చనువుగా అన్న సమవయస్కులు కూడా
ఇపుడు ‘చక్కగా’ పేరుతోనే పిలుస్తున్నపుడు-

నిన్ను అడపాదడపా ఫోనులో పలకరిస్తూ
నీ మంచి చెడులు తెలుసుకుంటూ ఉండే మనుషులందరూ
నీ సొంత విషయాలు తరచి తరచి అడిగినప్పుడూ
‘ఓ! అలాగా,’ ‘బాగుంది,’ ‘భేష్,’
‘అంతేలెండి’ అంటూ
చాలా మంచిగా ప్రశంసాపూర్వకంగా ఉండేప్పుడు-

నీకేమీ కాని, నీతో అంత దగ్గరితనమూ లేని
ఓ పెద్దాయన విషయాలు తరచి తరచి అడుగుతూ
నువ్వు చేసిన ఒకానొక పనికి తల్లడిల్లి
ఆ పని తన కొడుకో, కూతురో చేసినట్టు
నిన్ను గట్టిగా మందలించాక
కాసేపటికి ఆ గట్టి మందలింపులో
గతించిన నీ తండ్రి గుర్తుకు వచ్చి-
నీ కళ్ళలో నీళ్ళు చిప్పిలాక-
ఇక ఆ రాత్రి
ఆ పెద్దమనిషినీ, ఆ అశ్రుధారనీ, ఆ ప్రేమనీ
తేలిగ్గా మర్చిపోయి
ఆదమరచి నిద్రించడం ఎంత కష్టం!