గులకరాయి కింద సీతాకోక చిలుక

జ్ఞాపకాల కొమ్మపై
సీతాకోక చిలుక
బరువుగా ఊగుతోంది
దాని జాతక చక్రం ఎలా గీశారో?

పాడుబడిన గోడలపై
బల్లి ఎగర్లేక,
నిస్సత్తువగా డేకుతోంది
దానికిష్టమైన ఫ్లేవరేమిటో?

ఇద్దరూ దంపతులే
నదిని ముడ్డికిందేసుక్కూర్చున్నారు
మొండితనానికి వరద తీసేదెప్పుడో?

గాలిని గటగటా తాగిన వాళ్ళే
జీవితం రెపరెపలాడుతుంటే
గులకరాళ్ళు ఒత్తుపెట్టడమేంటో?

జ్ఞాపకాల గోడపై
పాడుబడిన కొమ్మలా
దంపతులిద్దరూ
చిరుగాలికే వణకడమేంటో?